top of page

నారు మాత్రమే కాదు నీరు కూడా పోయాలి


'Naru Mathrame Kadu Niru Kuda Poyali'

written by Bandla Swetha reddy

రచన : బండ్ల శ్వేతా రెడ్డి

పదమూడేళ్ల బాలిక పై మైనర్ బాలుడి అత్యాచారం.." అని దినపత్రికలోని వార్త రవిని దిగ్భ్రాంతికి గురిచేసింది. రవి స్కూల్లో టీచర్. రవికి కూడా టీనేజ్ కొడుకులు ఇద్దరు ఉన్నారు. రవి భార్య యాక్సిడెంట్ లో మరణించింది. అందరూ మరో పెళ్లి చేసుకోమన్నారు. కానీ భార్య మీద ప్రేమతో అతను ఆ ఆలోచనే చేయలేదు. ఈమధ్య పేపర్ చదవాలంటేనే రవికి భయం వేస్తోంది. ఎక్కడ ఏ పాడు వార్తలు చదవాల్సి వస్తుందోనని. నేటితరం ఎటుపోతోందో అర్థం కావడం లేదు. చిన్న వయసులోనే చెడు అలవాట్లు, చెడు సావాసాలకు అలవాటు పడుతున్నారు. రవి తన పిల్లలను జాగ్రత్తగా పెంచుతున్నానా లేదా అని అనేకసార్లు తనను తాను ప్రశ్నించుకునేవాడు. అసలే తల్లి లేని పిల్లలు కదా.. తాను తల్లి పాత్ర కూడా సరిగ్గా పోషిస్తున్నానో లేదో అన్నది రవి సందేహం. ఇదేమాట తన ప్రాణస్నేహితుడైన శంకర్ తో చెప్పుకున్నాడు. దానికి శంకర్ "ఎందుకు అంతలా పిల్లల గురించి ఆలోచిస్తావు రవి? నీకేమైనా ఆడపిల్లలా?? ఇద్దరూ కొడుకులే కదా.. ఆడపిల్లల గురించి ఆలోచించినంత మగపిల్లల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మగాడు ఏం చేసినా మంచిదే ఈ సమాజంలో. మగాడు తప్పు చేసినా ధైర్యంగా తిరుగుతున్నాడు. ఎక్కడో తిరిగి చెడిపోతారు అనుకోడానికి నీకు ఉన్నది ఇద్దరూ మగపిల్లలే.. అయినా ఆడది తిరిగి చెడుతుంది, మగాడు తిరగక చెడతాడని పెద్దలు చెప్పారు కదా.. కాబట్టి నువ్వు అతిగా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకు. మగపిల్లలు కదా ఎలాగైనా పెరుగుతారులే.. " అన్నాడు శంకర్. శంకర్ మాటలకు రవి విస్తుపోయి నోట మాట రాక నిల్చున్నాడు. శంకర్ మాటలు రవికి ఎంతమాత్రం రుచించలేదు. అంతలోనే శంకర్ ఫోన్ మోగింది. ఫోన్ మాట్లాడుతూనే శంకర్ ఏడుస్తూ నేలమీద కూలబడ్డాడు. రవికి ఏదో జరిగిందని అర్థమైంది కానీ ఏం జరిగిందో తెలియట్లేదు. ఎంత అడిగినా శంకర్ కుళ్ళి కుళ్ళి ఏడుస్తూనే ఉన్నాడు కానీ సమాధానం చెప్పలేక పోతున్నాడు. రవి వెంటనే కాసిన్ని మంచినీళ్లు తెచ్చి శంకర్ కు ఇచ్చి, అతని భుజం మీద చేయి వేసి, ఓదారుస్తున్నట్లుగా, ధైర్యం చెబుతున్నట్లుగా అడిగాడు. అప్పటికి శంకర్ కాస్త తేరుకున్నాడు. రవికి ఫోన్లో తను విన్న విషయాన్ని చెప్పాడు. "నా పద్దెనిమిదేళ్ల కొడుకు రిషి రోజూ కాలేజీకి వెళ్తున్నానని చెప్పి పబ్బులకు, క్లబ్బులకు తిరుగుతూ చెడు సావాసాలకు అలవాటు పడ్డాడు, అప్పుడప్పుడు స్నేహితులతో మందు కొట్టి ఇంటికి వచ్చినా ఈ వయసులో ఇదంతా సహజమే కదా.. పైగా మగపిల్లాడే కదా అని నేను పెద్దగా పట్టించుకోలేదు, అదే నేను చేసిన తప్పు. దాని పర్యవసానం ఈరోజు రిషి తాగిన మత్తులో ఎవరో అమ్మాయిని రోడ్డు మీద ఏడిపిస్తూ , ఆ అమ్మాయి చున్నీ పట్టి లాగాడట, చుట్టూ చూస్తున్న జనాలు రిషికి బాగా దేహశుద్ది చేసి, పోలీసులకు అప్పగించారట, ఇప్పుడు రిషి మీద నిర్భయ చట్టం కింద కేసు నమోదైందట. అదంతా టీవీలో చూపిస్తున్నారట ఇంటి నుండి ఫోన్ వచ్చింది రవీ.. వాడు నాకు ఒక్కగానొక్క కొడుకు. వీడు ఇలా తయారై నా పరువు తీస్తాడనుకోలేదు." శంకర్ ఏడుస్తూనే రవికి చెప్పాడు. రవికి కూడా చాలా బాధ కలిగింది. రిషి కోసం శంకర్ చాలా కష్టపడుతున్నాడు. రిషి ఏదడిగినా కాదనకుండా కొని పెడతాడు. రిషికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడు శంకర్. కారణం అతను మగపిల్లాడని. ఆ స్వేచ్ఛను రిషి విచ్ఛలవిడితనంగా మార్చుకున్నాడు. అయినా రిషి బాధ పడతాడని శంకర్ రిషిని ఒక్కమాట కూడా అనేవాడు కాదు. దాని ఫలితమే ఇదంతా.. అందుకే రవి ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా నిట్టూర్చి, "శంకర్ ఇప్పుడు ఎన్ని అనుకుని ఏం లాభం? జరగాల్సిన నష్టం ఎప్పుడో జరిగిపోయింది. నువ్వు కేవలం నారు మాత్రమే పోసావు, నీరు పోయడం మరచిపోయావు. నీరు పోయకుండా ఎన్ని ఎరువులు వేసినా పంట ఎండిపోతుందే కానీ పండదు. నువ్వు రిషికి క్రమశిక్షణ, బాధ్యత అనే నీరు పోయడం మరచిపోయావు. ఆడపిల్లకైనా, మగపిల్లాడికైనా సరే క్రమశిక్షణ, బాధ్యత అనేవి చాలా ముఖ్యం. అప్పుడే పిల్లలు మంచి చెడు తెలుసుకుంటూ పెరుగుతారు. మగపిల్లాడే కదా అని గాలికి వదిలేస్తే ఇలాగే సమాజానికి చీడపురుగుల్లా తయారవుతారు. ఆడపిల్లలను ఎంత బాధ్యతగా పెంచుతామో మగపిల్లాడినీ అంతే బాధ్యతగా పెంచాలి. మంచి పంట పండాలంటే మంచి నేల ఎంత అవసరమో మంచి విత్తనం కూడా అంతే అవసరం. ఇక్కడ నేల తల్లిదండ్రులైతే.. విత్తనం సంతానం. విత్తనం మొలకెత్తి మొక్క, చెట్టు అయ్యేవరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. " అంటూ చెప్పి, తన కొడుకులను మరింత బాధ్యతగా పెంచి, సమాజానికి పనికివచ్చే విధంగా తీర్చిదిద్దాలని నిర్ణయం తీసుకున్నాడు రవి.

గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.రచయిత్రి పరిచయం :

నా పేరు శ్వేత. నేను ఒక అధ్యాపకురాలను మరియు బ్లాగర్. నేను ప్రతిలిపి, momspresso లాంటి యాప్ లలో కథలు రాస్తుంటాను. నేను ఇక్కడ నా ఫొటోను కూడా జత చేస్తున్నాను. ధన్యవాదాలు.

59 views0 comments

Bình luận


bottom of page