top of page

నాతిచరామి


Naticharami Written By Nanda Trinadha Rao

రచన : నంద త్రినాథ రావు


ఆ గదిలో పూల మాలలతో అలంకరించబడి ఉంది మంచం. ఆ మంచంపై తెల్లటి దుప్పటి. దానిపై మల్లెలు, గులాబీలు గుభాళిస్తున్నాయి. ఆ మంచం పక్కనే ఉన్న చిన్న బల్లపై పళ్ళు, మిఠాయిలు ఉన్నాయి. అగరొత్తులు, అత్తర్లు- సువాసనల్ని, పరిమళాల్ని ఆ గది అంతా వెదజల్లుతున్నాయి.

ఫణి పెళ్లి బట్టల్లో తళ తళా మెరుస్తున్నాడు. ఆ రోజు అతనికి శోభనం. మంచంపై కూర్చొని ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు. తలుపు దగ్గర చప్పుడయింది. అతడు ఆత్రంగా అటుకేసి చూశాడు. గది బయట గాజుల గల గలలు, ముసి ముసి నవ్వులు వినిపించాయి.

ఎవరో తోసినట్టుగా నవ వధువు లోపలికి నెట్టబడింది. తలుపులు మూసుకున్నాయి. ఆమె తలుపు దగ్గరే ఆగిపోయింది. తల దించుకుని వుంది. పెళ్లి బట్టల్లో మెరిసిపోతోంది.

ఫణి ఆమెను చూశాడు. అలా ఆమెను చూసిన అతడి గుండె ఒక్కసారి ఆగి మళ్ళీ కొట్టుకోసాగింది. అంత అందం తన సొంతం కాబోతుందని అతని మనసు సంతోషంతో నాట్యం చేసింది. ఆమె ముందుకి కదల్లేదు. అక్కడే నిల్చొని వుంది మౌనంగా.

ఫణి ఆమె దగ్గరగా వెళ్ళాడు. ఆమె భుజంపై చేయి వేసి మెల్లగా ఆమెను మంచం దగ్గరకు తీసుకువచ్చాడు. ఆమె చేతిలోని పాలగ్లాసును తీసుకొని దానిని బల్లపై పెట్టాడు. మంచం పై కూర్చున్నాడు. ఆమె కేసి చూశాడు. ఆమె తల ఇంకా భూమిలోకే వుంది. ఆమె పెదవులు, గుండెలు భయంతో చిన్నగా అదురుతున్నాయి.

అతడు "సీతా!" అని పిలిచాడు ప్రేమగా.

"ఊఁ" అందామె.

"ఎందుకలా మౌనంగా ఉన్నావు? ఏదైనా మాట్లాడు“ అన్నాడు లాలనగా. ఆమె మాట్లాడలేదు.

“భయమా?" అన్నాడు మళ్ళీ.

"ఊఁ" అందామె.

"నేనంటే నీకిష్టమేనా?" అన్నాడు నవ్వుతూ .ఆమె పెదవి విప్పలేదు.

అతడు ఆమెను తన పక్కనే మంచంపై కూర్చోబెట్టుకున్నాడు తనకు దగ్గరగా.

ఫణి కి చాలా సంతోషంగా ఉంది. ఆ రోజు గురించే అతడు చాలా రోజుల్నుంచి ఎదురుచూస్తున్నాడు. ఆ రోజు రానే వచ్చింది. కానీ అతడ్ని బాధ పెట్టే విషయం ఒక్కటే. ఆమె మౌనం!

కొన్ని క్షణాల అనంతరం అతడు తన ప్రేమ మాటలు, చిలిపి కబుర్లతో ఆమె భయాన్ని పోగొట్టాడు. ప్రేమతో ఆమెను మచ్చిక చేసుకున్నాడు. తన దారిలోకి తెచ్చుకున్నాడు. ఆమెకిష్టం లేకపోయినా ఆమె అతడ్ని ఆహ్వానించింది. ఆ గదిలో లైట్లు ఆరిపోయాయి.

* * *

సీతకి ఫణి అత్త కొడుకు. సీత పుట్టినప్పుడే ఫణికి పెళ్ళాం పుట్టిందన్నారు. ఫణికి మరదలంటే చాలా ఇష్టం, ప్రేమా. కానీ సీతకి బావ అంటే ఇష్టం లేదు. ‘నిజంగా తన పైన ప్రేమే ఉంటే అతడు తనని తప్ప, ఏ అమ్మాయిని కూడా కన్నెత్తి చూడకూడదు‘ అనుకునేది సీత.

కానీ ఫణి అందుకు పూర్తి వ్యతిరేకం. కనిపించిన అమ్మాయిల వెంట పడేవాడు. ఏడిపించేవాడు. కొంతమంది అమ్మాయిలు అతని మాయలో పడేవారు. ప్రేమిస్తున్నానని చెప్పి వాళ్ళని మోసం చేసేవాడు. వాళ్ళ జీవితాలతో ఆడుకునేవాడు. అతడు అమ్మాయిల్నే కాకుండా పెళ్లయిన ఆడవాళ్ళని కూడా తన మాయ మాటలతో వంచించే వాడు.

ఒక రకంగా చెప్పాలంటే అతడు మంచివాడు కాదు. క్యారెక్టర్ లేదు. సెక్స్ శాడిస్ట్. అందుకే సీతకి ఫణి అంటే అసలు ఇష్టం ఉండేది కాదు.

సీత పేరుకు తగినట్టు అభినవ సీతే! అందాల రాశి!. సుగుణాల భరిణె!!. ఆమెకి చిన్నప్పటినుంచీ మంచి మంచి ఆలోచనలు, ఆశయాలు ఉండేవి. పదిమందికీ మార్గదర్శిని కావాలని ఉవ్విళ్లూరేది. తను బాగా చదువుకొని మంచి ప్రయోజకురాలినవ్వాలని కలలు కనేది. ఆశలు పెంచుకునేది. కానీ ఆమె కలలు, కాంక్షలు కల్లలుగానే మిగిలిపోతాయని, దురదృష్టం తనను వెంటాడుతోందని సీత కొన్ని రోజుల్లోనే గ్రహించింది.

సీత సవతి తల్లి కూతురు. తను చిన్నప్పుడే కన్నతల్లిని పోగొట్టుకుంది. దాంతో తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకొని సీతకి సవతి తల్లిని తెచ్చాడు. ఆమె వచ్చినప్పటినుంచీ సీతకి బాధలు మొదలయ్యాయి. భరించరాని కష్టాలు పడింది. ఆమె తన పిల్లల్ని తప్ప సీతని దగ్గరికి చేరనిచ్చేది కాదు. తన పిల్లల్ని ముట్టుకోనిచ్చేదికాదు. సీత చిన్న పిల్లగా ఉన్నప్పుడు కనీసం తన చనుబాలు కూడా పట్టేది కాదు. ఆకలితో అలాగే ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయిన సీతకి చుట్టు పక్కల ఆడవాళ్లు జాలితో పోతపాలు పట్టేవారు.

అలా పెరిగి పెద్దదయింది సీత. సీతకి పదేళ్లు వయసొచ్చేటప్పటికి ఇళ్లల్లో పాచి పనిలో పెట్టేసింది సవతి తల్లి. అందరి పిల్లల్లా తను కూడా బడికి వెళ్లి చదువుకోవాలని చాలా ఆశగా, కోరికగా ఉండేది సీతకి. కానీ తన పిల్లల్ని తప్ప సీతని బడికి పంపేది కాదు ఆమె. సీతతో ఇంట్లో గొడ్డు చాకిరీ చేయించేది. తిండి కూడా సరిగ్గా పెట్టేది కాదు. తండ్రికి కూతురంటే గుండెల నిండా ప్రేమ ఉన్నా, తన భార్య గయ్యాళితనానికి, ఆమె నోటి దురుసుతనానికి అతడు భయ పడేవాడు. నోరు మెదిపే వాడు కాదు.

సీత ఇళ్లల్లో పాచి పనిచేసి డబ్బులు తెస్తేనే అన్నం పెట్టేది. లేదంటే ఆకలితో మాడి చావాల్సిందే. అంత రాక్షసి సవతి తల్లి. బాధల్ని గుండెల్లోనే దిగమింగుకొని ఓర్చుకునేది సీత.

ఓ ఉపాధ్యాయురాలు తన ఇంట్లో పనిచేస్తున్న సీతకి చదువు పై ఉన్న శ్రద్ద, ఆసక్తిని గమనించి ఆమెని పాఠశాలలో చేర్చింది. చదువుకోడానికి వీల్లేదని అడ్డొఛ్చిన సవతి తల్లికి, సీత జోలి కొస్తే ఊరుకునేది లేదని, పసిపిల్లని చదువుకోనీయకుండా వెట్టి చాకిరీ చేయిస్తున్నందుకు జైల్లో పెట్టిస్తానని బెదిరించడంతో వెనక్కి తగ్గింది ఆమె. చదువు పేరుతో స్కూల్లో గడిపే సమయాలు సీతకి సంతోషాన్ని, ఆనందాన్నికలిగించేవి. ఇంటికొస్తే మళ్ళీ బాధలే. గొడ్డు చాకిరీయే. అలా ఆమె అష్ట కష్టాలు పడి ఎలాగో డిగ్రీ పూర్తి చేసింది.

భర్త పోరు పడలేక ఈడొచ్చిన సీతకి పెళ్లి చేయాలనుకుంది సవతి తల్లి. వెంటనే ఆమెకు ఫణి మదిలో మెదిలాడు. అతడు ఎంతటి తిరుగుబోతో, జులాయో ఆమెకు బాగా తెలుసు. అయినా సరే సీతంటే ద్వేషంతో అతనికే ఇచ్చి పెళ్లి చేయాలనుకుంది ఆమె. సీతకి మంచి సంబంధం చేయటం ఇష్టం లేదామెకు. పైగా ఫణి సీతకి వరసైన వాడు, బావ. ఫణిని పిలిపించి విషయం చెప్పగానే అతడు ఆనందంతో తలమునకలయ్యాడు.

సీతలాంటి అందాల రాశి తనకు దక్కుతున్నందుకు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. పైగా కానీ కట్నం తీసుకోకుండా ఆమెను పెళ్లి చేసుకుంటానన్నాడు. సవతి తల్లి ఆనందంతో ఎగిరి గంతేసింది. రెండు విధాలుగా ఆమె సీత జీవితాన్ని నాశనం చేయాలనుకుంది. ఒకటి ఫణి మంచి వాడు కాదు. రెండోది అతనికి కట్నంగా ఒక్క పైసా కూడా ఇవ్వక్కర లేదు. సీత ఫణి ని ఇష్ట పడకపోయినా బలవంతంగా అతనితో ఆమె పెళ్ళి జరిపించింది సవతి తల్లి. అలా మొదటి రాత్రి భయంగా, భారంగా గడిచింది సీతకి.

* * *

ఫణి తో కాపురానికి వెళ్ళింది సీత. కొన్ని రోజులు సీతని బాగానే చూసుకున్నాడు ఫణి. ఆ తర్వాత మెల్ల మెల్లగా అతని నిజస్వరూపం తెలిసి నిర్ఘాంత పోయిందామె. ఫణి కి లేని వ్యసనం అంటూ లేదు. వేశ్యలతో సంబంధాలు, జూదం, తాగుడు ఇంకా ఎన్నో.

రోజూ తాగొచ్చి సీతని చితక్కొట్టేవాడు. ఆమె ఎంత అణిగి మణిగి ఉన్నా, శాంతంగా ఉన్నా ఆమెకు దెబ్బలు తప్పేవి కావు.

ఒకరోజు వ్యసనాలకు బానిస అయిన ఫణి డబ్బుకోసం సీతను శాశ్వతంగా వదిలించుకోవాలని అనుకున్నాడు. ఆమెను ఒక వ్యభిచార గృహానికి అమ్మేశాడు. తనకు ముట్టిన డబ్బులతో ఎటో పోయాడు.

సీత అక్కడ నరకం చూసింది. కన్నీరు మున్నీరయ్యింది. కానీ ఆమె గోడు ఆమె ఉంటున్న గది గోడలు తప్ప ఎవరూ పట్టించుకోలేదు. ఆమె రోదన అరణ్య రోదనే అయ్యింది. తనని ఆ మురికి కూపం నుండి తప్పించమని కనిపించని దేవుళ్లoదరికి మొక్కింది. చివరికి ఓ పోలీస్ ఆఫీసర్ ఆమె దయనీయమైన కథ విని దేవుడిలా ఆమెను రక్షించాడు. ఆమె బయట పడింది.

కష్టాలు, బాధలు ఓర్చుకోవడం తనకి కొత్త కాదు కాబట్టి ఓర్చుకునేది. ఒకొక్కసారి బాధలు భరించలేక ఆమె చావాలని అనుకునేది. కానీ తన కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి ఆలోచించి ఆ ప్రయత్నం మానుకొనేది. అలా రోజులు చాలా భారంగా గడిచేవి.

ఒకరోజు ఆమె కి సుస్తీ చేసింది. తీవ్రంగా జ్వరం వచ్చింది. ఎన్ని మందులు వాడినా, ఎన్ని రోజులైనా జ్వరం తగ్గ లేదు. ఆరోగ్యం కుదుట పడలేదు. దాంతో పెద్దాసుపత్రికి వెళ్ళి చూపించుకుంది సీత. పరీక్షలు చేసి డాక్టర్ చెప్పిన మాటలు విని ఆమె పిడుగు పడ్డట్టు అదిరి పడింది. ఆమెకి ఎయిడ్స్!

తను నిలుచున్న చోటే భూమి బ్రద్దలైనట్టు, తను అందులో కూరుకుపోతున్నట్టు విలవిల్లాడింది సీత. జీవితమంతా అంధకార బంధురమైనట్టు తోచిందామెకు. కానీ ఏమీ చేయలేని పరిస్థితి, నిస్సహాయత, తనది.

* * *

బాధల్ని దిగమింగుకుని కొన్ని రోజుల తర్వాత సీత మగపిల్లవాడిని ప్రసవించింది. అప్పుడే దురదృష్టం మరో సారి ఆమె పై తన పంజాని విసిరింది. ఆ సమయంలో జరిగిన మెడికల్ టెస్ట్ ల్లో తెలిసిన ఒక భయంకర నిజం సీతని అశనిపాతంలా తాకింది. గుండెను ఎవరో ముక్కలు ముక్కలుగా నరికినట్టు బాధ కలిగింది.

భర్త ద్వారా తనకు, తన కొడుక్కి కూడా ఎయిడ్స్ సోకింది!

వేయి పిడుగులు మీద పడ్డట్టు విల విల్లాడింది సీత.

ఆ విషయం తెలిసి అత్తింటి వారు ‘మా కొడుకే లేనప్పుడు ఇంకా నువ్వెందుకు ఇక్కడ?‘ అంటూ ఆమెని బిడ్డతో పాటూ ఇంట్లోంచి బయటికి గెంటేశారు. తుపాను తాకిడికి చిగురుటాకులా వణికిపోయింది సీత.

ఏం చేయాలో, ఎలా బ్రతకాలో తెలియని ఆమె తన నాలుగు నెలల బాబుతో పుట్టింటికి చేరింది. ఇద్దరికీ ఉన్న జబ్బు విషయం తెలిసి ఆమె సవతి తల్లి కూడా వాళ్ళని ఇంట్లోకి రానివ్వలేదు. భర్త పోరు పడలేక వాళ్ళని పశువుల కొట్టంలో ఉంచింది. వాళ్ళకి తిండి కూడా పెట్టేది కాదు.

దాంతో సీత రోడ్లు వేసే పనిలో రోజుకూలీగా చేరింది. అలా వచ్చిన కొంచెం డబ్బుతో కొడుక్కి వైద్యం చేయించేది. ఒకవైపు బిడ్డను చూసుకుంటూ, మరోవైపు పని చేసుకుంటూ అలా ఆమె జీవితం వెళ్లదీయసాగింది భారంగా, అత్యంత దయనీయంగా.

అయితే దేవుడు అక్కడ కూడా ఆమెకు అన్యాయమే చేశాడు!

పోషకాహారం సరిగ్గా అందక బిడ్డ చనిపోయాడు!!

కన్నీరు మున్నీరుగా విలపించింది సీత. దుఃఖాన్ని తట్టుకోలేక జీవితంపై ఆశలు వదిలేసుకుంది. ఆలోచించుకుంది.

తన బ్రతుకంతా అష్ట కష్టాలే. కన్నీళ్లే. ‘కష్టాలు వచ్చి పోతాయి. అవి పోయాక వచ్చేవి సుఖాలే‘ అన్న మాట తన విషయంలో అబద్ధమైందని ఆమె భావించింది. జీవితమంతా కష్టాలు, బాధలు పడి తను జీవించలేదు. ఇంక కష్టాల కడలిని ఈదే శక్తి తనకు లేదు. బాధల సుడిగుండాల నుండి తను బయట పడలేదు. ఆత్మ విశ్వాసాన్ని కోల్పోయింది సీత.

భర్త నయవంచకుడు!

కొడుకు పోయాడు!!

ఇంకా తను ఎవరికోసం బ్రతకాలి? అనుకుంది.

పురుగుల మందు తాగిoది!

విషయం తెలిసి చుట్టు పక్కల వాళ్ళు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమె అదృష్టం కొద్దీ ప్రమాదం నుండి బయట పడింది.

కానీ అక్కడే సీత జీవితం కూడా మలుపు తిరిగింది!

దేవుడు ప్రతీ పుట్టుకకు ఒక ప్రయోజనం రాసి పెట్టే ఉంచుతాడనేది ఆమె విషయంలో నిజమయ్యింది.

సీత దైన్యమైన పరిస్థితంతా తెలుసుకున్న ఒక డాక్టర్‌ ఆమెను ‘ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్థుల ఆరోగ్య పరిరక్షణ’ లో చేర్చింది. వారి సేవలు గురించి తెలిసి సీత అందులో సభ్యురాలయ్యింది.

అలా ఆమె ఆ డాక్టర్‌ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకుంది.

అప్పటినుంచీ ఆమెకో లక్ష్యం ఏర్పడింది. మోడు వారిన ఆమె జీవితం మళ్ళీ చిగురించింది. జీవితంలో వసంతం వెల్లివెరిసింది.

ప్రతీ గడపకూ వెళ్లి, ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడం మొదలుపెట్టింది.

హెచ్ఐవీ బాధితులు కూడా సాధారణ జీవితాన్ని గడుపుతూ, కుటుంబంతో సంతోషంగా ఉండొచ్చునని ప్రజల్లో అవగాహన తేవడమే ఆమె పని, బాధ్యత.

పాఠశాల, కళాశాలల విద్యార్థులకు వ్యక్తిగత ఆరోగ్యం, హెచ్ఐవీ పట్ల అవగాహన కల్పించింది. పలు సామాజిక సేవాసంస్థల తరఫున ప్రసంగించింది. అప్పటివరకూ ఆమె చాలా దేశాలలో అక్కడ ప్రతినిధుల ఎదుట ప్రసంగించే అరుదైన అవకాశం అందుకుoది.

ఓ ప్రముఖ స్వచ్ఛంద సంస్థ వారు సీతని ప్రసంగించమని కోరారు. ఆమె ప్రోగ్రామ్ ని అన్నీ టీవీ ఛానళ్ళు కవర్ చేశాయి. ప్రముఖ దినపత్రికల రిపోర్టర్లు వచ్చారు. ఆమె డయాస్ అధిరోహించిoది. సంస్థ వారు పూల మాలలు, పుష్ప గుచ్చాలతో ఆమెని సత్కరించారు. ఆమె ప్రసంగం మొదలయింది.

"ఎయిడ్స్‌ బాధితులు నిరాశ-నిస్పృహలతో, వైరాగ్యంతో చనిపోవాలనుకుంటారు. అలాంటివారిని మామూలు మనుషులుగా మార్చడమే నా పని. వెళ్లిన ప్రతీచోటా నా గురించి చెప్పమని అడుగుతారు. నా ప్రసంగం అయ్యాక అంతా లేచి చప్పట్లు కొడుతోంటే ఏడుపొస్తుంది. మనకు దొరికేది ఒకటే జీవితం. ఎంతో విలువైన దాన్ని వృథా చేయకుండా ఆనందంగా బ్రతకడం నేర్చుకోవాలి. ఇతరులకు ఆ సంతోషాన్ని పంచాలి. జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి" అంటూ రెండు నిముషాలు ఆగింది. సభికులు ఆమెని ప్రసంగం ఆపవద్దని గోల గోల చేశారు. సీత మళ్లీ కొనసాగించింది.

"ఒకప్పుడు నన్ను అసహ్యించుకున్న వాళ్లే ఇప్పుడే నన్ను ఒక సోదరిలా ఆదరిస్తున్నారు. గౌరవిస్తున్నారు. ‘ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్థుల ఆరోగ్య పరిరక్షణ‘ సంస్థ తరఫున అవగాహన కల్పిస్తూనే ‘డిమానిస్ట్రేషన్‌ ఫారం మేనేజరు’ గా పనిచేస్తున్నా. చిన్న కష్టానికే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి, ఆత్మహత్య లాంటి అఘాయిత్యాలకు పాల్పడేవారికి నా జీవితం, గతం గురించి చెబుతా. అలా వారిలో జీవించాలనే ఆశను, ఆకాంక్షను కలిగిస్తున్నా. అలా చాలామందిలో మార్పు తెస్తున్నా. ఇంకా తేవాలి"

"ఇప్పటి వరకు నాకు చాలా అవార్డులే వచ్చాయి. ప్రభుత్వం ఈ ఏడాది మహిళా దినోత్సవం సందర్భంగా నన్ను ‘మోడల్‌ ఉమన్‌‘ గా గుర్తింపునిచ్చాయి. ఇవన్నీ నాలో సమాజం పట్ల బాధ్యతను, కర్తవ్యాన్ని పెంచుతాయి." ఇలా సాగింది జీవితంలో ఎన్నో డక్కాముక్కీలు తిని, ఒడిదుడుకులను ఎదుర్కొని, కష్టాలు, కన్నీళ్లు, బాధల్ని, వ్యధల్ని ఎదిరించి ధైర్యంగా నిలిచిన సీత ప్రసంగం. ఆమె ప్రసంగం వినడానికి వందలాదిమంది వచ్చారు.

ఆమె స్పీచ్ ముగించి స్టేజ్ దిగుతుంటే ఓ వ్యక్తి ఆమె కాళ్ళపై పడ్డాడు. మాసిన బట్టలు, తైల సంస్కారం లేని జుత్తు, గుబురుగా పెరిగిన గడ్డం, శుష్కిoచిన శరీరంతో బిచ్చగాడిలా ఉన్నాడు. స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలు అతడ్ని పిచ్చోడు అని భావించి కర్రలతో అదిలిస్తూ దూరంగా నెట్టేశారు. అతడ్ని సులువుగానే గుర్తు పట్టింది సీత.

తన జీవితాన్ని కుక్కలు చింపిన విస్తరిని చేసి, తన స్వార్థం తను చూసుకున్న అతడు.. అగ్ని సాక్షిగా తన మెళ్లో మూడు ముళ్లు వేసి, తనతో ఏడడుగులు నడిచిన తన భర్త ఫణి అని తనెలా మర్చిపో గల్గుతుంది?!

ఆమె వడి వడిగా ముందుకు నడుస్తూనే ఉంది చైతన్య కరదీపికలా. దగ్గర్లో ఎక్కడో పెళ్లి జరుగుతున్న మంత్రాలు శ్రావ్యంగా వినిపిస్తున్నాయి.. నాతిచరామి.. మాంగల్యం తంతునానేనా.. అంటూ.


గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయిరచయిత పరిచయం

నా పేరు నన్ద త్రినాధరావు, నివాసం విశాఖపట్నం. ఉద్యోగరీత్యా పాట్నాలో ఉంటున్నాను. దాదాపు వంద వరకు బాల సాహిత్యం వ్రాశాను. ఈ మధ్యే సాంఘిక రచనలు చేస్తున్నాను. 40 కథలు వరకు వివిధ అంతర్జాల పత్రికలలో ప్రచురించబడ్డాయి.

సామాజిక అంశాలని కథలుగా మలచటం నాకిష్టం. చదవటం, వ్రాయటం చాలా ఇష్టం. తెలుగులో చక్కని సాహిత్యం సృష్టించే వారందరూ నాకు అభిమాన రచయితలే! నన్ను వెన్ను తట్టి ప్రోత్సహించే రచయిత మిత్రులు శ్రీ కాండ్రేగుల శ్రీనివాసరావు, శ్రీ శ్రీ చరణ్ మిత్ర, శ్రీ టీ.శ్రీనివాసశ్రీ గార్లు.
995 views6 comments
bottom of page