Nenu Chaduvukuntaanu Written By Radha Oduri
రచన : ఓడూరి రాధ
"సార్!శవాన్ని తగలబెట్టేటప్పుడు దండలు తీసేసెయ్యండి" అన్నారు కాటికాపరి.
ప్రమోద్ కన్నీళ్ళు తుడుచుకుంటూ, నాన్న పార్ధీవం పై ఉన్న దండలు తీసి అవతలకి విసిరేసాడు.
దహన కార్యక్రమాలన్నీ పూర్తియ్యాయి. ఎవరి దారిన వారు బయలుదేరారు.
ప్రమోద్ కూడా వెళ్ళబోతూ ఒక్కసారిగా ఆగిపోయాడు. అక్కడ దృశ్యం చూసి.
కోపంతో రగిలిపోయాడు. తాను ఉన్న పరిస్థితి కూడా మరచిపోయాడు.
ఒక్క క్షణం లో తాను విసిరేసిన పూలు ఏరుతున్న పిల్లవాడి దగ్గరకు వెళ్లి చూసాడు.
ఆ పిల్లవాడు తన స్టూడెంట్ "రాకేష్".
రాకేష్ ని చూసి కళ్ళు చిట్లించాడు.
రాకేష్ బెదరకుండా నవ్వుతూ " గుడ్ మార్నింగ్ సార్" అన్నాడు.
ప్రమోద్ కోపంగా "అంటే! నువ్వు ఈ పూలు అమ్ముతావా గుడి దగ్గర. తప్పు కదా! "
"సార్ నా కడుపు, మా నానమ్మ కడుపు ఎవరు నింపుతారు? నాకు చదువుకోవాలని ఉంది. అందుకే నానమ్మ ఇళ్ళల్లో పని చేసి నన్ను చదివిస్తోంది. ఆ డబ్బు నా సైన్స్ ప్రాజెక్టులకి వస్తోంది కదా! సార్! అందుకే ఈ పని".
" మీ అమ్మానాన్నలు…!?"
"చిన్నప్పుడే పోయారు సార్.అప్పటి నుండి మా నానమ్మ నన్ను పెంచి, చదివిస్తోంది. సరైన తిండిలేక బక్కచిక్కి పోయింది.అయినా నాకోసం ఇళ్ళల్లో పాచిపని చేస్తోంది"
"మరి సహాయం కోసం ఎవరినీ అడగలేదా!?
"సార్!మీరు భలేవారు. ఈరోజుల్లో డబ్బులు ఇస్తూ ఫొటోలకి ఫోజులు ఇచ్చేవారే ఉన్నారు".
" అంటే!"
"సార్! రెండేళ్ళ క్రింద మాకు పదివేలు సహాయం చేస్తున్నట్లు చెక్ ఇచ్చారు. అంతే అప్పటి నుంచి బ్యాంకు లో డబ్బులే పడలేదు"
ప్రమోద్ హృదయం ద్రవించింది. పద మీ ఇంటికి అంటూ రాకేష్ తో ఇంటికి వెళ్ళి చూసేసరికి ఇంటి దగ్గర గుమిగూడిన జనాలు ఉన్నారు.
రాకేష్ పరుగున ఇంట్లో కి వెళ్ళి చూస్తే అక్కడ నానమ్మ చనిపోయి ఉంది.
రాకేష్ నానమ్మ పై పడి ఏడుస్తూ "నువ్వు పోతే నాకెవరున్నారు? నన్ను ఎవరు చదివిస్తారు? నాకు చదువుకోవాలని ఉంది "అంటూ బిగ్గరగా ఏడ్వ సాగాడు.
రాకేష్ అలా ఏడుస్తుంటే అక్కడ ఉన్న జనాల హృదయాలు కలచివేసాయి. వాడి ఏడుపు ఆపడం ఎవ్వరి తరం కాలేదు.
ప్రమోద్ ఒక్క క్షణం ఆలోచించి భార్య లతకి ఫోన్ చేసాడు.
" హలో!"
"లతా! ఇది సమయం కాదు.అయినా చెప్పక తప్పదు".
" చెప్పండి!" అంది సౌమ్యంగా.
"లతా!మనిద్దరం గవర్నమెంట్ టీచర్స్ కదా! ఒక్కడే కొడుకు కూడా"
"అయితే!" అంది లతా.
రాకేష్ గురించి జరిగిందంతా చెప్పాడు ప్రమోద్.
"లతా! రాకేష్ ని మనం పెంచుకుంటే!"
లత కొన్ని క్షణాలు ఆలోచించి "ఒక పిల్లవాడికి జీవితం ఇద్దాము అంటే ఎందుకు వద్దంటాను. నేను కూడా కష్టపడి వచ్చినదాన్నే కదా!"
"థ్యాంక్స్ లతా! లవ్ యూ సోమచ్! "అంటూ ఫోన్ పెట్టేసాడు.
ప్రమోద్ కళ్ళల్లో సంతోషం.తనకు అనువైన భాగస్వామి దొరికినందుకు.
హృదయ విదారకంగా ఏడుస్తున్న రాకేష్ వద్దకు నడిచాడు.
రాకేష్ భుజంమీద చేయి వేసి "నీకు నేనున్నాను. నేను నిన్ను పెంచుకుని చదివిస్తాను" అంటూ రాకేష్ ని ఆలింగనం చేసుకున్నాడు ప్రమోద్.
రాకేష్ కళ్ళల్లో కోటి వెలుగుల కాంతులు.
గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి
nice setting and good message