top of page

నేను.. నాన్న.. ఓ నాటకం



'Nenu Nanna O Natakam' written by N. Dhanalakshmi

రచన : N. ధనలక్ష్మి

"పిల్లలలో మన మాటలతో ఎలా మార్పు తీసుకురావచ్చు అనే తెలిపే చిన్న కథ"

" టాపు లేసిపోద్ది... పోద్ది... పో... పో...

టాపు లేసిపోద్ది... పోద్ది... పో... పో.......”

“అబ్బా! నిజంగానే టాప్ లేచి పోయేలాగా ఉంది శశాంక్… ఏమిటా సౌండ్? కొద్దిగా తగ్గించు. లోపల నాన్నమ్మ నిద్ర పోతున్నారు కదా ! నువ్వు పెట్టిన సౌండ్ కి నిద్ర లేచి వచ్చేశారు. నీ కోసమే సెపరేట్ రూం ఉంది. అక్కడికే వెళ్లి చేసుకోవచ్చు కదా. అయిన ఈ మధ్య నేను ఏం చెప్పినా వినడం లేదు .ఇందాక కూడా తినమని చెప్పితే అది కూడా సరిగా తినలేదు. పైగా డైనింగ్ టేబుల్ మీద అంతా పోసావు. ఆహారం అంటే నీకు లెక్క లేకుండా పోతుంది."

"నువ్వు ఎప్పుడు ఇంతే మమ్మీ… నేను ఏమి చేసినా అందులో తప్పులు వెతుకుతావు. నేను అంటే నీకు అసలు ఇష్టం లేదు” అని ఏడుస్తూ తన రూమ్ కి వెళ్ళి లాక్ వేసుకున్నాడు..

“అయ్యో నాని… కన్న.. తలుపు తీయరా! నేను ఇంక నిద్ర పోనులే “

“అత్తయ్యా! ఏమి పర్లేదు. మీరు వచ్చి ఈ జ్యూస్ తాగండి. వాడే కొద్ది సేపు అయిన తరువాత బయటకు వస్తాడు.”

"శ్రావణి! నువ్వు తిట్టకుండా ఉండి ఉంటే బాగా ఉండేది తల్లీ. ఎన్నడూ లేనిది వాడిని గట్టిగా అరవడంతో పాటు కోప్పడ్డావు .. పాపం! నాని చాలా బాధ పడుతున్నాడు"

" మనo గారాబం చేసే కొద్దీ వాడు అల్లరిగా తయారు అవుతున్నాడు. వదిలిపెట్టండి"

"శ్రావణి! మా స్నేహితురాలు పంకజం హైదరాబాదు నుండి వచ్చింది. నేను పక్కింటి కమలతో కలిసివెళ్లి మాట్లాడేసి వస్తాను. నేను వచ్చే లోపు నాని గాడిని కాస్త సముదాయించి ఉండు..."

" అలాగే అత్తయ్యా...జాగ్రతగా వెళ్లేసి రండి "

***

“శ్రావణి! ఏంటి ఇంట్లో ఎవరు లేరా?”

" లేరండి. అత్తయ్య వాళ్ళ స్నేహితురాలిని కలసి వస్తాను అని వెళ్ళారు.. శ్లేష డ్రాయింగ్ క్లాస్ కి వెళ్ళింది"

"ఓ అలాగ! శ్రావణి.. కాస్త మంచి నీరు ఇవ్వు…”

“ఇదిగో.. తీసుకోండి "

“ఇంతకీ చిన్నోడు ఎక్కడ? "

“వాడు ఈ రోజు చాలా అల్లరి వేషాలు వేశాడు అండి” అని జరగింది మొత్తం చెప్పారు...

“సరే వాడితో నేను మాట్లాడతాను" .

“శశి కన్న.. తలుపు తీయరా!.....”

“నాన్నా!” అంటూ వచ్చి వాళ్ళ నాన్న సురేష్ ని హత్తుకున్నాడు శశాంక్ ...

“నాన్నా! అది.. అమ్మ నన్ను అరిచింది” అని కొద్ది సేపు తన బాధ తీరేదాకా తనివితీరా ఏడ్చాడు.

"చూడు! నా బంగారం కదూ.. ఇలాంటి చిన్న విషయాలకు ఎవరైనా ఏడుస్తారా చెప్పు.... అవునూ.. ఈ రోజు స్కూల్ లో ఏంజరిగింది?”

శశాంక్ స్కూల్ విషయాలు మాట్లాడుతూనే నిద్రలోకి జారుకున్నాడు,

సురేశ్ గారు రూంలో ఉన్న మ్యూజిక్ ప్లేయర్ ని కావాలనే ఆన్ చేశారు...

శశి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు...."నాన్న!” అని గట్టిగ అరిచి “నేను నిద్ర పోతూ ఉంటే ఎందుకు మ్యూజిక్ ప్లేయర్ ని ఆన్ చేశారు…”

" కన్న! మరి నువ్వు ఇంతక ముందు చేసింది ఏంటి?

ఇదే నిద్రపోతున్న నాన్నమ్మ ను ఇలాగే కదా నువ్వు సాంగ్స్ పెట్టి నిద్ర లేచేలా చేసావు… అందుకే కదా అమ్మకు కోపం వచ్చి అలా అరిచారు”

శశికి తను చేసిన తప్పు తెలిసి వచ్చింది.

"సారి నాన్న… అర్థం ఆయింది. ఇంకోసారి అలా చేయను. నేను డాన్స్ చేయాలనిపిస్తే పైన ఉన్న రూం కి వెళ్లి చేసుకుంటాను..”

“ వెరీ గుడ్ కన్న.... ఇప్పుడు అమ్మ ఉన్నారు కదా.. ఎంతకి లేస్తారు కన్న..”

" మన కన్న ముందే లేచి ఉంటుంది నాన్న... మనందరి కోసం టిఫిన్స్, మనకు కావాల్సినవన్నీ సర్ది ఉంచుతారు.."

" ఇంట్లో ఫుడ్ తయారు చేయడానికి అవసరమైన సరుకులు ఎవరు తెస్తారు శశి?"

నవ్వుతూ “ఏంటి అలా అడుగుతారు? మీరే కదా తెచ్చేది..”

“నిజమే ! నేను సూపర్ మార్కెట్ కి వెళ్లి సరకులు ఉచితంగా ఇవ్వమంటే ఇస్తారా…”

“లేదు నాన్న! ఎందుకు ఇస్తారు ఉచితంగా... మీ డబ్బులు ఇస్తేనేగా ఇచ్చేది..”

“ మరి నాకు డబ్బు ఎలా వస్తుంది …”

“నాన్న! మీరు మార్నింగ్ నుంచి నైట్ వరకు పని చేసి సంపాదిస్తున్నారు కదా.. అలా మీకు డబ్బులు వస్తాయి..”

“మనకు ఫుడ్ ఎవరు పండిస్తారు ?”

"అయ్యో ఏమైంది నాన్న! ఇన్ని ప్రశ్న లు

అడుగుతున్నా రు...! ఇంకా ఎవరు నాన్న… దేశానికి వెన్నెముక అయిన రైతు కదా!”

" ఉదయం లేచి వంట వండే దానిలో మీ అమ్మ ప్రేమ ఉంది, వాటికి అవసరమైన సరుకులు తెచ్చే దానిలో మీ నాన్న శ్రమ ఉంది, ముఖ్యంగా ఆహారం పండించడానికి రైతు ఎంతో కష్టపడతాడు. పక్షుల నుంచి, ప్రకృతి వైపరీత్యాల నుండి ఇలా పొలాన్ని కాపాడుకుంటూ బియ్యాన్ని చేతిలోకి తీసుకోవడానికి ఎన్ని రోజులు పడతుందో తెలుసా కన్న? 120 రోజులు అంటే నాలుగు నెలలు.. ఒక్కసారి విడియో చూడు రైతు కష్టం తెలుస్తుంది” అని రైతు ఎలా పంటను పండిస్తారు వాటి వెనుక దాగిన కష్టాన్ని చూపించారు శశికి. అలాంటి ఆహారాన్ని నేలపాలు చేయడం, వృధా చేయడం ఎంత పెద్ద తప్పు . ఎప్పుడు అయితే నువ్వు అలా వృధా చేస్తావో అప్పుడు నీకు మీ అమ్మ మీద, మీ నాన్న మీద ప్రేమ లేనట్లే కదా, మరీ ముఖ్యంగా రైతులను అవమానించినట్లే కదా! మేము అంటే నీకు ప్రేమ లేదా చెప్పు?”

" లేదు నాన్న.. మీరిద్దరూ అంటే నాకు చాలా ఇష్టం.

విడియో చూసిన తర్వాత రైతు మీద గౌరవం పెరిగింది. ఇంక ఎప్పుడు ఆహారాన్ని వృధా అసలు చేయను. ప్రామిస్ అండ్ థాంక్స్ నాన్న! నాకు అర్థం అయ్యేలా చెప్పినందుకు..."

“అయ్యాయా తండ్రి కొడుకుల ముచ్చట్లు! వస్తే భోజనం చేద్దాము…”

“లవ్ యూ అమ్మ.. థాంక్స్ ఫర్ ఎవిరిథింగ్.. ఇంక ఎప్పుడు అల్లరి చేయను, నువ్వు చెప్పిన ప్రతి మాట వింటాను” అని వాళ్ళ అమ్మని హత్తుకొని మరి చెప్పాడు

“నువ్వు నా బంగారం శశి” అని వాళ్ళ అమ్మ గారు కూడా హత్తుకుంటారు..

“హేయ్! ఈ పోజ్ బాగా ఉంది” అని ఫోటో తీస్తారు సురేష్ గారు ..

ఒక రోజు శశి దిగులుగా కూర్చొని ఆలోచిస్తున్నాడు.

“ఏంట్రా ప్రపంచంలో ఉన్న కష్టాలు అన్ని నీ మొహంలోనే కనపడుతున్నాయి?” అని వాళ్ల అక్క అంది…

“ఏంలేదు అక్క! స్కూల్ లో యానివర్సరీ ఫంక్షన్ కదా.. నేను ఏమి చేయాలని ఆలోచిస్తున్న అక్క..”

“అరే నాన్న వచ్చారు.. నాన్న అయితే నాకు సరైన సలహా ఇస్తారు.”

“ఏంట్రా చిన్నోడా… ఏమి సలహా కావాలి ఏంటి?”

“అది నాన్న.. స్కూల్ లో యానివర్సరీ ఫంక్షన్ కి నేను ఏమి చేస్తే బాగా ఉంటుంది అని ఆలోచిస్తున్న..”

“రేయ్ కన్న... బ్రూస్ లీ తెలుసా .?”

"హా హా ఎందుకు తెలీదు నాన్న! రామ్ చరణ్ మూవీ చూసినప్పుడు బ్రూస్ లీ ఎవరు అని అడిగితే నువ్వే వీడియోలో చూపించావుగా.. “

“మరి జాక్ చాన్ తెలుసు కదా…”

“హా నాన్న.. అతను కూడా ఫైటర్. కాకపోతే అతను చేసే ఫైటింగ్స్ లో కామెడీ మిక్స్ అయి ఉంటుంది.. అది నాకు చాలా ఇష్టం కూడా నాన్న..”

“కదా! అదే ఆయనలో ఉన్న ప్రత్యేకత.. ఆయన మూవీలో అవకాశాల కోసం డైరెక్టర్స్ ని కలిసినప్పుడు .. వాళ్ళు బ్రూస్లీ ఫైట్ చేస్తారు, నువ్వు ఫైట్ చేస్తావు. అతనికి నీకు ఏంతేడా.. నీలో ఉన్న ప్రత్యేకత ఏంటి…”

అలా అన్నప్పుడు జాకీ చాన్ తన ఫైటింగ్స్ లో కామెడీ ని ఆక్ట్ చేస్తూ, డూప్ లేకుండా ఎన్నో ప్రమాదకర సీన్స్లో నటించాడు.. ఇప్పుడు అదే ఆయనకు పేరు, హోదాను తెచ్చి పెట్టింది. నువ్వు కూడా అలాగే డిఫరెంట్ గా ఆలోచించు.. అందరిలో నీకంటూ ప్రత్యేకత ఉండాలి"

“థాంక్స్ నాన్న! నేను ఆలోచిస్తా…”

“శ్రావణి! ఒక్క సారి ఇటు రా.. “

“ఏమండీ? చెప్పండి”

“ఈ రోజు నా ఫ్రెండ్ చక్రి వాళ్ళ కొడుకు పుట్టినరోజు .. ఫ్రెండ్స్ అందరికీ నైట్ కి పార్టీ ఇస్తున్నారు. మనం అంతా వెళ్ళాలి. రెడీ అవ్వండి…”

ఈవెనింగ్ అందరు పార్టీకి వెళ్ళారు..

గేమ్స్,డాన్స్ ఇలా ఆటపాటలతో పార్టీని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. డిన్నర్ చేయడానికి అందరు కూర్చున్నారు అప్పుడు శశి మైక్ తీసుకొని

" హల్లో గుడ్ ఈవెనింగ్ అందరికీ… నేను ఒక మాట చెప్పాలి అనుకుంటున్నా.. ముందుగా చక్రి అంకుల్ కి థాంక్స్! మా అందరి కోసం టేస్టి డిషేస్ ప్రిపేర్

చేపించినందుకు.. కాకపోతే ఇక్కడ ఉన్న అందరం కొన్ని మాత్రమే తింటాం కదా! మీరు ఎంత తినగలిగితే అంతే పెట్టించుకుని తినండి .. మనం పుడ్ వేస్ట్ చేయకుండా మిగిలిన ఆహారాన్ని ఇక్కడ దగ్గరలో ఉన్న వృద్ధాశ్రమాలకి ఇచ్చి పంపుదాం. ఏమి అంటారు... “

అందరూ క్లాప్స్ కొట్టారు శశి ఐడియా కి.

" ఏవండీ వీడు మన శశి నే కదా… ఇంత మెచ్యూరిటీ ఎలా వచ్చింది వాడికి…”

“శ్రావణి! పిల్లలు కాగితం లాంటి వారు. మనం ఎలా కావాలన్నా మార్చుకోవచ్చు... చింపవచ్చు లేదా అందమైన అక్షరాలు రాసి మంచి పుస్తకంలా మార్చవచ్చు” .

“వెల్డన్ కన్నా! చాలా బాగా చెప్పావ్..”

"థాంక్స్ నాన్న! మొన్న మీరే కదా ఫుడ్ గురించి దాని విలువ గురించి చెప్పారు. చాలా మంది.. ఇన్ ఫాక్ట్ నేను కూడా ఫంక్షన్లో లో ఫుడ్ వేస్ట్ చేసాను. అందుకే ఈ రోజు అలా ఎవరు చేయకూడదు అని చెప్పాను "

వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరూ చాలా ఆనందపడ్డారు.

***

“ఏమైంది నాని! ఎందుకు ఆలా డల్ గా ఉన్నావు”

“ఎంత చదవినా ఈ క్వశ్చన్ నాకు రావడం లేదు అమ్మ! ఇంక నేను చదవలేను. నా వల్లకాదు అసలు..”

"కన్న! నీకు కాకి కథ తెలుసు కదా!”

“ఎందుకు తెలియదు అమ్మ! వాటర్ కోసం ఆగకుండా ప్రయత్నించి ఫైనల్ గా వాటర్ తాగింది..”

“కథ వినేసి వదిలేయడం కాదు. అందులో ఉన్న

నీతిని నేర్చుకోవాలి .. కాకి తనకు కావాల్సినది

దొరికే అంతవరకు తన ప్రయత్నాన్ని వదిలి పెట్టలేదు.

ఏదైనా సరే బట్టి కొట్టడం కాదు. అర్థం చేసుకొని చదువు . ఎందుకు రాదో చూద్దాము!”

శశి “సరే అమ్మ” అని అర్థం చేసుకొని చదివాడు...

ఇప్పుడు ఈజీగా నేర్చుకున్నాడు.

యానివర్సరీ రోజు తను ఏమి చేయాలని అనుకుంటున్నాడో చెప్పి వాళ్ళ మేడమ్ ని సలహా అడిగాడు శశి.. వాళ్ల టీచర్ కూడా సానుకూలంగా స్పందించి కావాల్సిన అరేంజ్మెంట్ చేస్తానన్నారు...

ఫంక్షన్ రోజు రానే వచ్చింది. శశి ఏమి చేయబోతున్నాడని సస్పెన్స్ గానే పెట్టాడు.. ఫంక్షన్ స్టార్ట్ అయింది .. వాళ్ళ టీచర్ మాట్లాడుతూ

"ప్రెసెంట్ కొందరి ఇండ్లల్లో పిల్లలు. వారి తల్లిదండ్రుల మధ్య ఉన్న రిలేషన్ ని మా స్టూడెంట్స్ నాటకీయంగా చూపించబోతున్నారు. చూసి మా చిన్నారులను ఆశీర్వదించండి మీ కరతాళధ్వనులతో” అంది… నాటకం స్టార్ట్ అయింది...

నాటకంలో పాత్రలు ఇలా మాట్లాడుకో సాగాయి.

" నాన్న నాకు కథ చెప్పవా?”

“నాని! నాకు వర్క్ ఉంది. ఇదిగో కన్న! ఫోన్లో యూట్యూబ్ లో కి వెళ్ళి చందమామ కథలు విను. సరేనా?”

“అమ్మ! మీతో ఆడుకోవాలని ఉంది…”

“లేదు కన్నా! ఈ రోజు కుదరదు. ఫోన్లో గేమ్స్ అడుకో …”

“చూడు కన్న! నువ్వు బాగా చదువుకోవాలి , బాగా చదివితే మంచి ఉద్యోగం వస్తుంది, బాగా డబ్బు సంపాదిస్తావు. అన్నిట్లో నువ్వే ఫస్ట్ రావాలి అప్పుడే మనకి సొసైటీలో మంచి పేరు ఉంటుంది.”

“అలాగే” అంటూ ఆ అబ్బాయి బాగా చదువుకున్నాడు.

అన్నిట్లో ఫస్ట్ వచ్చే ఆ అబ్బాయికి గెలుపు తప్ప ఓటమి అంటే ఏంటో తెలియదు.. ఏమి అయిందో తెలియదు, ఆ అబ్బాయి నిద్ర మాత్రలు మింగి చనిపోయాడు..

పోలీసుల ఇంటరాగేషన్ లో తెలిసిందేమిటంటే

అబ్బాయి ఒక ఎంట్రెన్స్ టెస్ట్ లో ఫెయిల్ అయ్యాడు. ఆ ఓటమిని భరించలేక చనిపోయాడు. ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే అబ్బాయి యూట్యూబ్లో ఎలా ఈజీగా చనిపోవచ్చు అని సెర్చ్ చేశాడు అంటా.. ఇప్పుడు ఆ తల్లిదండ్రులకు ఇద్దరికీ బిడ్డ దూరమయ్యాడు"

ఇది కథ కాదు ఒక నిజ జీవిత గాధ.

మనలో ఎంత మంది తల్లిదండ్రులు పిల్లలకి కథలు చెబుతున్నారు, ఆడుకుంటున్నారు.. పిల్లలతో టైం స్పెండ్ చేస్తున్నారు..

పిల్లలకి కష్టమనేది తెలియకుండా పెంచాలి అనుకుంటున్నారు కానీ ఆ కష్టం వస్తే ఎలా తట్టుకోవాలో నేర్పించడం లేదు....

గెలుపు లో ఆనందం వెతుక్కో మంటున్నారు కానీ ఓటమి అనేది వస్తే ఎలా అంగీకరించాలో నేర్పించ లేక పోతున్నారు..

అందువల్లే చాలామంది విద్యార్థులు చనిపోతున్నారు కారణం ఓటమిని అంగీకరించలేక.. ఎంతసేపు వేరే పిల్లలతో పోల్చడం ఎందుకు చేస్తుంటారు... అందరు పిల్లలు గొప్పవారే. వారి టాలెంట్ చూపించడంలో టైం తీసుకుంటారు. దయచేసి పోల్చడం ఆపండి..

ప్రతి ఒక్కరిలో ఎదో ఒక కళ , ప్రతిభ దాగి ఉంటుంది .. మనం దానిని గుర్తించి పిల్లలు ఎదగడానికి సహాయం చేయాలి కానీ వారిపై మన కోరికలు రుద్దకూడదు...

వారితో ఫ్రెండ్లీగా గా ఉండండి. అప్పుడే వారు ఏ విషయం అయిన సరే మీతో ఫ్రీ గా పంచుకోగలరు..

పిల్లలతో తల్లి తండ్రులగా కాకుండా స్నేహితులుగా ఉండండి. వారిని వారి కలలను బంధించకండి”

అనే సందేశాన్ని నాటకం రూపంలో చెప్పారు శశి అండ్ టీమ్..

పిల్లలు చేసిన నాటకం చూసి ప్రతిఒక్కరూ కరతాళధ్వనులతో వారిని ప్రశంసించారు.

శశి వాళ్ళ నాటకానికి మంచి పేరుతో పాటు అవార్డ్ కూడా ఇచ్చారు .

“నాన్న! చూడు నాకు అవార్డు వచ్చింది” అని సంతోషంగా చెప్పాడు శశి. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఫీల్ అయ్యారు.

“మనమంతా ఈ అవార్డు తో ఒక సెల్ఫీ దిగుదాం” అని శశి అడగ్గానే ఫ్యామిలీ మొత్తం ఫోటో తీసుకున్నారు...

“ఈ ఆనందంలో మనమంతా కలిసి రెస్టారెంట్ కి వెళ్దాం ఏమి అంటారు అండి..”

“ఈ రోజు మన శశి ఏమి చెపితే అది చేద్దాం… చెప్పు శశి! ఏమి చేద్దాం.."

“నాన్న! మనం రెస్టారెంట్ కి పెట్టే మనీతో ఫ్రూట్స్ తీసుకొని బిచ్చగాళ్ళ పంచుదాం.. మనకు రెట్టింపు ఆనందం వస్తుంది ఏమి అంటారు..”

ఫ్యామిలీ మొత్తం మెచ్చుకోలుగా చూస్తారు శశి వైపు.

అనుకున్నట్టుగానే బిచ్చగాళ్లకు ఫ్రూట్స్ పంచుతాడు శశి.. ఫొటోస్ తీసి సోషల్ మీడియాలో పెడదామంటే

సురేశ్ గారు “వద్దు కన్న… మనం సహాయం చేయడం ఇంపార్టెంట్. ప్రచారం కాదు... మనం చేసే పని కనపడాలి కానీ మనం కాదు ..”

అలా శశి మంచి విషయాలను నేర్చుకుంటూ మంచి వాడిగా పేరు తెచ్చుకున్నాడు...

" పిల్లలు స్వచ్చమైన మనసు కలవారు.. కల్మషం లేని వారు.. చిన్నప్పటి నుంచి వారికి మంచి విషయాలు నేర్పిస్తే గొప్పవారిగా ఎదుగుతారు. చిన్నప్పటినుంచి వారి చుట్టూ ఉన్న పరిస్థితిని చూసి వాళ్ళు ఎదుగుతారు... అందుకే అంటారు చుట్టుపక్కల వాతావరణం కరెక్ట్ గ ఉండాలి అని.. పసి మనసులు బాధపడితే అతికించడం చాలా కష్టం.. అందుకే చాలా జాగ్రత్తగా పసిపిల్లలతో వ్యవహరించాలి.."

***శుభం***


మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత్రి పరిచయం :

నమస్తే. నా పేరు ధనలక్ష్మి. వృత్తి రీత్యా ప్రైవేట్ స్కూల్లో గణితం బోధిస్తాను. మాది మదనపల్లి, చిత్తూర్ జిల్లా. కథలు , కవితలు రాయడం నాకు ఇష్టమైన వ్యాపకం. ఆనందం వేసినా, బాధ వేసినా, కోపం వచ్చినా నేను పంచుకునే నా నేస్తం అక్షరం. నాలో మెదిలే భావాలను, నేను చూసిన సంఘటనలను రాయడం నాకు అలవాటు.





117 views0 comments
bottom of page