top of page
Tulasi Balakrishna

నిధి


Nidhi Written By Tulasi Balakrishna

రచన : తులసి బాలకృష్ణ


ముసలమ్మని మన అపార్ట్మెంట్స్ చుట్టు పక్కలకి రానియ్యొద్దని ఎన్ని సార్లు చెప్పాలి నీకు అన్నవరం?” - అపార్ట్ మెంట్స్ ప్రెసిడెంట్ భార్య దుర్గమ్మ గొంతు బండ రాళ్ళు దొర్లిస్తూన్న ధ్వనితో ఖంగుమంటూ ప్రతిధ్వనిస్తోంది. గత పావు గంట నుంచీ ఆవిడ నోటి దురద తాలూకు చీవాట్లు తిని వాలి పోయిన వాచ్ మన్ అన్నవరం తల .. ప్రయత్నపూర్వకంగా పైకి లేచింది. అతని చూపు ఓరగా సాగి, తనకి కేటాయించిన రూము గుమ్మం దగ్గర ఆగింది. అక్కడ .. పూర్తిగా కాలి ఆరిపోయి బూడిద కుప్పగా మిగిలిన భోగిమంటలా ముడుచుక్కూర్చుని, గాజు కళ్ళతో బిత్తర చూపులు చూస్తూన్న ముసలమ్మ, ఆమెకు దగ్గరలో నిశ్చింతగా, ఆనందంగా కేరింతలు కొడ్తూ ఆడుకుంటూన్న తన రెండేళ్ళ కూతురు చిట్టీ వున్నారు. అటు నడవడానికి గాని, ముసలమ్మని కసిరి పంపించెయ్యడానికి గాని, కాలు, నోరు కదలడం లేదు అన్నవరానికి. “ఏం కదలవేం? నా మాటలంటే ఏమాత్రం లక్ష్యం లేదన్న మాట నీకు?” ఉరిమింది దుర్గమ్మ మళ్ళీ. ఆమె ఆజ్ఞలు పాటించక పోతే తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో, తన వాచ్ మాన్ ఉద్యోగానికి రాబోయే ముప్పేవిటో తెలుసున్న వాడు కావడంతో అన్నవరం తప్పనిసరై అయిష్టంగానే ముసలమ్మ దిక్కు కదిలాడు. అయినప్పటికీ అహం తృప్తి చెందని దుర్గమ్మ “రోజులెలా వున్నాయి? అమాయకత్వం నటిస్తూ ముసలాళ్ళూ, అవిటాళ్ళూ ఇలా ఇళ్ళ దగ్గర చేరి అంతా గమనించి, సమయం చూసి ఓ రోజున వాళ్ళ మనుషులకి ఉప్పందించడం .. అందరూ కలిసి ఇళ్ళు దోచుకు పోవడం .. పిల్లల్నెత్తుకు పోవడం చేస్తూంటారు దొంగ వెధవలు. ముఠాలుంటాయి వీళ్ళకి. ముసలాళ్ళనో, పేద వాళ్లనో జాలి చూపించామంటే కొంపలు దోచుకు పోతారు వీళ్ళు...” అంటూ పెద్ద గొంతుతో ఇంకా ఏదో అంటూన్న సమయంలో .. కిర్రుమని శబ్దం చేస్తూ కిటికీ తలుపు తెరుచుకున్న శబ్దం కావడం .. ఆమె గొంతు ఠక్కున మూతబడడం ఒక్కసారే జరిగాయి. ఆ శబ్దం చేసిన కిటికీ - రెండవ అంతస్తు లోని రెండు వందల నాలుగు ఫ్లాట్ తాలూకుది. ఆ కిటికీ ఏ ఆరు నెలలకో ఒక్కసారే తెరుచుకుంటుంది. ఎవరయినా హద్దు దాటిన స్వరాలతో అరుస్తూన్నా, పోట్లాడుకుంటూన్నా .. ఆ ఫ్లాట్ లో నివసిస్తూన్న వ్యక్తి ప్రశాంతతకి భంగం కలుగుతోంది అన్న హెచ్చరికకి సంకేతంగా ఆ తలుపు తెరుచుకుంటుంది. ఆ వ్యక్తి అంటే అందరికీ చచ్చేంత భయం. ఆ ఫ్లాట్ లో అద్దెకి ఉంటున్న గడ్డం వ్యక్తి గురించిన పూర్తి వివరాలు ఎవ్వరికీ తెలియవు. ఓనర్ స్టేట్స్ లో ఉంటూ, ఇతనికి అద్దెకిచ్చాడు. ఒంటరిగా ఉంటాడు. అపార్ట్మెంట్స్ లో జరిగే ఏ ఫంక్షన్స్ లోనూ అతను ఎన్నడూ పాల్గోడు. మీటింగులకీ రాడు. అసలు ఎవ్వరితోనూ మాట్లాడడు. కళ్ళు ఎప్పుడూ ఎర్రగా నిప్పులు కక్కుతూన్నట్టుంటాయి. బయటకు వెళ్ళుతూన్నప్పుడు, వస్తూన్నప్పుడూ జబ్బకి ఓ జోలి లాంటి గుడ్డ సంచీ, అందులో పుస్తకాలూ వుంటాయి.

పోస్ట్ ద్వారా కూడా లావు పాటి పుస్తకాల ప్యాకెట్లు వస్తూంటాయి. ఎవ్వరినీ ఏమీ నోరు విప్పి అనడు గానీ .. అతని చూపులలోని నిర్లక్ష్యానికి ఝడిసిపోతారందరూ. తాగుబోతనీ, పెద్ద రౌడీ అని గుసగుసలు పోతూంటారు. ఇల్లు తుడవడానికి వెళ్ళే అన్నవరం భార్య సీత “ఇంటినుండా ఎక్కడ సూసినా పుత్తకాలే పుత్తకాలండి. ఎప్పుడు సూసినా సదూకుంటూ ఉంటాడు"అని చెప్పింది ఆమధ్య ఎవరో కుతూహలం తో అడిగినప్పుడు. ముసలమ్మ దగ్గరకి వెళ్లి “మామ్మా లెగమ్మా నువ్వు. ఎల్లిపో...” అన్నాడు చిన్న స్వరంతో. గాజు కళ్ళతో బేలగా జాలిగా చూసింది ముసలమ్మ. తండ్రి మాటలు విన్న చిట్టి గబుక్కున ఆమె ఒళ్లో కూర్చుని, మెడ చుట్టూ చేతులు చుట్టేసింది. “ఒసేయ్. నువ్వు ఇవతలకి వస్తావా .. రెండు తగిలించనా?” అంది దుర్గమ్మ ముందడుగు వేసి, చెయ్యెత్తి, ఎర్రగా చూస్తూ. భయపడింది చిట్టి. బిక్క మొహం పెట్టింది. కళ్ళలో నీళ్ళు గిర్రున తిరిగాయి. బుగ్గలు ఎర్రబడుతూ కంపించాయి. అన్నవరంకి చాలా కష్టమనిపించింది. లేక లేక పుట్టిన బిడ్డ. దేవుడు తమ మీద దయ చూపించాడు అనుకుంటూంటే .. కొంత అసంతృప్తి .. వయసు రెండేళ్ళు నిండుతూన్నా ముద్దులొలికే ఆ పాపకి ఇంకా మాటలు రాలేదు. ఇక రావేమోనన్న భయం. తను, తన భార్య సీత అల్లారు ముద్దుగా చూసుకుంటూన్నారు పాపని. ఇదుగో .. ఈ ముసలమ్మ ఎవరో ఈమధ్య రోజూ వచ్చి ఆడిస్తూ వుంటుంది కూడా. దుర్గమ్మతో, “నేను చిట్టిని తీసుకుని, ముసలమ్మని పంపించేత్తానమ్మా. తవఁరు పక్కకి రండి” అన్నాడు బ్రతిమలాడుతూన్న స్వరంతో అన్నవరం. సీత కూడా భర్తకి సాయపడ్డానికి వచ్చింది. “కానియ్ మరీ. ఎంతసేపీ భాగోతం? ఉద్యోగం చెయ్యాలని ఉందా లేదా? అపార్ట్ మెంట్ లోని పిల్లలందరూ ఈ క్రిందే ఆడుకుంటూ వుంటారు. వాచ్ మన్ అంటే కను రెప్ప వెయ్యకుండా కాపలా కాయాలి. ఏ దొంగ వెధవలో వాళ్లకి మాయ మాటలు చెప్పి తీసుకుపోకుండా జాగర్తగా చూస్తూన్నారా లేదా మీరిద్దరూ?” ముసలమ్మ వైపు అనుమానంగా చుర చురా చూస్తూ, గొంతు తగ్గించి అంటూ ప్రక్కకి జరిగింది దుర్గమ్మ. “మా పేణం పోయినా అపార్ట్మెంట్ లోని పిల్లలకి ఎటువంటి హానీ రానీవమ్మా” అన్నాడు అన్నవరం ఖచ్చితం ధ్వనించే స్వరంతో. పరిస్థితి అర్ధం చేసుకున్నట్లుంది ముసలమ్మ. “వెళ్ళమ్మా.. నాన్న దగ్గరకి వెళ్ళు. బంగారు తల్లివి కదూ?” అంది చిట్టిని సముదాయిస్తూ. పేచీ పెట్టకుండా తల్లి చేతుల్లోకి వచ్చింది చిట్టి. “పెంకి ఘటం. ఒఖ్కటి తగిలిస్తే అన్ని తిక్కలూ తీరతాయి. గారాలు పోతోంది .. గారాలు” అంటూన్నదుర్గమ్మ చూపుల్లో ఎర్రదనం తగ్గలేదు. “మామ్మా! లెగు ఇంక ... ఎల్లిపో. ఇంక రాకు. ఇలగ రాకూడదంట. అమ్మగోరు సెబ్తున్నారుగా. రాకు. అంతే. ఎల్లిపో.” అంటూ జబ్బ అందుకుని, జాగర్తగా నిలబెట్టాడు ఆమెని అన్నవరం. దుర్గమ్మ మీద కోపం ముసలమ్మ మీద విసుగు రూపంలో బయటకొచ్చేసింది. “నేను .. రాక పోతే .. మరి .. చిట్టీ .. బెంగెట్టుకోదా నాయినా?” ఆమె గొంతు తడిగా ఒణికింది. ఆమె గాజు కళ్ళలో పల్చని నీటి పొర. అన్నవరం మనసు కలుక్కుమంది. “పర్లేదులే. మేం జాగర్తగా సూత్తాంలే .. నువ్వెల్లిపో ముందు” మాటలు భారంగానే వచ్చాయి అన్నవరం గొంతు లోంచి. పాత మాసికల చీర చుట్టిన ఆమె తాలూకు చిన్న మూటని అందిస్తూ, జబ్బ పట్టుకుని నడిపిస్తూ, వీధి చివర కను చూపు ఆననంత దూరంలో వదిలి పెట్టడానికి కదిలాడు అన్నవరం. అడుగులో అడుగు వేసుకుంటూ కదుల్తోంది ముసలమ్మ. ‘బంధాలూ, అనుబంధాలు... ఏమేమో .... తన అలవాటు ప్రకారం గొణుక్కుంటూనే వుంది. ...... ...... ...... రెండ్రోజులుగా చిట్టికి ఒళ్ళు తెలియని జ్వరం. “ఆ ముసలమ్మ కోసరం బెంగెట్టుకున్నట్టుంది బిడ్డ. సరింగా వణ్ణం తింటం లేదు. పాలు తాగట్లేదు. జొరం తెచ్చుకుంది” అంది సీత భర్త కళ్ళలోకి బెంగగా చూస్తూ. “అదే కావుసు. ఏటి సెయ్యాల? నాకూ ఏటీ అర్తం కాట్లే” బిడ్డ వైపు నిస్సహాయంగా చూస్తూ అంటూన్న అన్నవరం – “ఏంటన్నారం – ఈరోజు మా బాబు పుట్టిన రోజు పార్టీ వుందని చెప్పాగా! పార్కింగ్ ఏరియా మొత్తం శుభ్రంగా కడిగేసి నీట్ గా పెట్టమని చెప్పానా? ఇంకా ఆ పని చెయ్యిలేదా?” అన్న ఫోర్త్ ఫ్లోర్ చౌదరి గారి గర్జనకి ఉలిక్కి పడి, “సేసేస్తన్నాం సార్” అని జవాబిచ్చాడు కంగారు పడుతూ, వినయంగా. “కానీండి మరీ. క్యాటరింగ్ వాళ్ళని ఫుడ్ తయారు చేసి తెచ్చేయమని ఆర్డర్ చేసాను. వస్తారు. కాని, ఈ షామియానా గాడిద కొడుకు ఇంకా రాలేదు. ఓసారి వెళ్లి దగ్గరుండి లాక్కురా వాడ్ని” ఆర్డరేసాడు చౌదరి.

“అలాగే నండి” సైకిల్ తీసుకుని, షామియానా వాళ్ళ కోసం దూసుకు పోయాడు అన్నవరం. జ్వరంతో ఉలుకూ పలుకూ లేకుండా పడున్న చిట్టిని భుజాన వేసుకుని, జోకొడుతూ, గాభరాని దాచుకుంటూ పచార్లు చేస్తూన్న సీత – “ఇదుగో సీతా! పార్టీకి బంధువులొచ్చేసే వేళవుతోంది. మా పని మనిషి ఇంకా రాలేదు. అవసరమయినప్పుడే ఎగ్గొడుతుంది ఆ పీనుగ. నువ్వు ఉన్న పళంగా ఓసారి రా.. ఓ అర్ధ గంట పనుందీ” అంటూ చౌదరి గారి భార్య పిలిచేసరికి, భర్త కూడా లేని సమయంలో జ్వరంతో వున్న చిట్టిని ఒక్కదాన్నీ వదిలి వెళ్ళలేక, అలాగని ‘రాలేనమ్మా’ అని చెప్పలేక, ఏం చెప్పాలో తెలియక గిజగిజలాడింది సీత. సీత తటపటాయించడం గమనించి, “ఏం రాలేవా? ప్రెసిడెంట్ గారింట్లో తప్పించి ప్రాణాల మీదకి వచ్చినా మా ఇళ్ళలో పని చెయ్యవా?” అని ఆవిడ నిష్ఠూరమాడే సరికి, “అబ్బే లేదమ్మా .. వస్తున్నా” అని పాపని తమకిచ్చిన రూములో మంచం మీద పడుకోబెట్టి, గబ గబా ఆవిడ వెంట నడిచింది సీత. ఓ పావుగంట గడిచింది. షామియానా వాళ్ళతో తిరిగొచ్చిన అన్నవరం - రూము తలుపు బార్లా తెరిచి వుండడం .. అందులో సీత, చిట్టి లేకపోవడంతో “ఎక్కడికి ఎల్లి ఉంటారబ్బా?” అని గొణుక్కుంటూ పార్కింగ్, సెల్లార్ ఏరియాల్లో కలియ తిరగసాగాడు. మరో పది నిముషాలకి పని పూర్తయి, లిఫ్ట్ లో క్రిందికి దిగొచ్చిన సీత కంగారుగా కలియ తిరుగుతూన్న భర్త కంట పడగానే, “రూములో సిట్టి ఒక్కర్తే వుంది. కాసేపు నువ్వు దాని కాడ కూసోలేక పోయావా?” అంది నిష్ఠూరంగా. అన్నవరం భ్రుకుటి ముడిపడింది. “ఏటే నువ్వనేది? సిట్టి రూమ్ లో యాడుంది? నీతో బాటు తీస్కెళ్ళ లేదా?” అనడిగాడు కంగారుగా. “ఏటి? సిట్టి రూమ్ లో లేదా?” అని గాభరాగా అరుస్తూ, రూమ్ వైపు పరుగెత్తిన సీత “ఒర్నాయినో .. నా బిడ్డ లేదు” అంటూ గుండెలు బాదుకోసాగింది. హతాశుడై, కాళ్ళు చేతులూ ఆడని అన్నవరం “ఏటే? బిడ్డ నొక్కదాన్నీ వోగ్గేసి ఎక్కడికన్నా షికార్లు ఎల్లావా ఏటీ?” అన్నాడు ఒణుకుతూన్న గొంతుతో అయోమయంగానూ, భయం భయంగానూ చూస్తూ. ఏడుస్తూ కుప్పకూలి, జరిగింది చెప్పి, “నిద్దరోతోంది కదా .. ఓ పావు గంట ఒగ్గి ఎల్లితే ఏం పర్లేదూ .. ఎల్లకపోతే సౌదరి గోరి బార్య తిట్టుద్దీ అని ఎల్లానయ్యా.... నా బిడ్డ .. బాబోయ్ .. ఏటయిపొయ్యిందో నాయినోయ్” తల బాదుకో సాగింది సీత. ‘చిన్న పిల్లల్ని ఎత్తుకు పోతున్నారు అంటున్నారు. రక్షణ లేని తన బిడ్డని కూడా...’ నిలువెల్లా ఒణికి పోయాడు అన్నవరం భయంతో. ఏం చెయ్యాలో తెలియని అయోమయంలో పిచ్చెక్కినట్లయి, “ఎంత పని సేసేవే దరిద్రపు దానా” అంటూ భార్యని వంచి వీపు మీద రెండు బాదులు బాది, సైకిల్ తీసుకుని కాలనీ వీధులన్నీ గాలించడానికి వీధిన పడ్డాడు. పార్టీ ఏర్పాట్ల కోసం క్రిందికి వచ్చిన చౌదరి దంపతులు సీత ఏడుపు విని కంగారుగా రూము దగ్గరకి పరుగెత్తుకొచ్చారు. “ఏవిటి .. ఏవిటా దిక్కుమాలిన ఏడుపులేవిటి? మీ ఆయనా నువ్వూ దెబ్బలాడుకున్నారా?” అనడిగింది చౌదరి గారి భార్య. వెక్కుతూనే విషయం చెప్పింది సీత. “ఏం ఫర్వాలేదు. ఇక్కడే ఎక్కడో వుంటుంది .. పాప ఏడుస్తూంటే ఆడించడానికి ఈ ఫ్లాట్స్ లో పని చేసే పని మనుషులెవరో తీసుకెళ్ళి వుంటారు. అయినా అన్నవరం వెళ్ళాడుగా .. తీసుకొస్తాడు. నువ్వు ముందా ఏడుపు ఆపు. గెస్ట్స్ వస్తారు. వింటే దరిద్రంగా వుంటుంది. పైగా ఆ టు నాట్ ఫోర్ వాడికి నీ ఏడుపు వినిపించిందంటే పెద్ద గొడవవుతుంది” అని సన్నగా కసిరిందావిడ. తన్నుకొస్తూన్న దుఖ్కాన్ని బలవంతంగా అణుచుకుంది సీత. వెనక్కి తిరిగొచ్చాడు అన్నవరం. మనిషి బాగా చెదిరి పోయి వున్నాడు. బేల చూపులు చూస్తూన్నాడు. గుండెలు ఎగిరెగిరి పడ్తూన్నాయి భయాందోళనలతో. “సిట్టి అవుపల్లేదా?...” అనడిగింది సీత వెర్రి చూపులతో. నిస్సహాయంగా గాల్లో చేతులు తిప్పాడు అన్నవరం. కురవడానికి సిద్ధంగా వున్న కారు మబ్బులా వుంది అతని ముఖం. బావురు మంది సీత. గుండెలు కక్కటిల్లిపోతూండగా ఒఖ్కసారిగా భళ్లుమన్నాడు అన్నవరం కూడా. “దొరుకుతుంది. దొరుకుతుంది. కంగారు పడకండి” గబగబా అనేసి, ‘నువ్వు కదులు’ అన్నట్లుగా భార్యకి కళ్ళతోనే సంజ్ఞ చేసి, వెనక్కి తిరిగాడు చౌదరి.

“బాబూ అయ్ గారూ.. మాకేటి తెలీట్లేదు. శానా బెయంగా వుంది బాబూ. ఏం సెయ్యాలో పాలుపోతల్లేదయ్యా” అన్నాడు అన్నవరం చేతులు జోడించి వాళ్ళ వెనకే నడుస్తూ .. వెక్కుతూ. విసుగ్గా మొహం పెట్టి, “నువ్వు మాకు పార్టీ ఏర్పాట్లలో కొంతైనా సాయపడతావనుకున్నాను. ఈ దరిద్రం గోలోటి తగులుకుంది కదా! సర్లే మా ఇబ్బంది ఏదో మేం పడతాంలే గాని...మీరిద్దరూ ముందు ఆ ఏడుపు మానండి..” అంటూ చరచరా అక్కడనుంచి జారిపోయాడు చౌదరి. “గెస్ట్స్ ఒక్కొక్కరే వచ్చే టైం కూడానూ. ఈ ఏడుపులూ అవీ అసహ్యంగా వుంటాయి. ఛీ ఛీ ఖర్మ ..” అంటూ గొణుక్కుంటూ భర్తని అనుసరించింది వారి ధర్మ పత్ని. ఏడుపు బయటకు వినిపించ కుండా గొంతు నొక్కుకున్నారు దంపతులు. ఏం పాలుపోక కాలుకాలిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతూన్న అన్నవరం .. ఒఖ్కసారిగా ఏదో తోచి, చిరు ఆశతో పై ఫ్లోర్ల వైపు పరుగు తీసాడు .. పాపని వెతకడానికి గాని, పోలీస్ రిపోర్ట్ ఇవ్వడానికి గాని కమిటీ మెంబర్స్ ని తనకి సాయపడమని బ్రతిమలాడుదామని. తనకి ఒంట్లో బావులేదన్నాడు ప్రెసిడెంటు. పూజ చేసుకున్నాక గాని రాలేనన్నాడు సెక్రటరీ. “అమెరికా నుంచి రావాల్సిన మా అబ్బాయి ఫోన్ కోసంచూస్తూన్నాను. అదొచ్చాక మాట్లాడి వస్తాలే” అన్నాడు ట్రెజరర్. ఇలాగే ఏదో ఒక వంక చెప్పి తప్పించుకున్నారందరూ. ఒక్కరిలోనూ సానుభూతి గాని, బాధ గాని లేవు. ‘వెధవ లంపటం. మనకెందుకులే’ అన్న నిర్లక్ష్యపు ధోరణే. శరీరంలోని శక్తినంతా ఎవరో పీల్చేసినట్లయిపోయిన అన్నవరం ఏడుపునాపుకుంటూ భార్య దగ్గరకి వచ్చాడు. దింపుడు కళ్ళెం ఆశగా భార్యా భర్తలిద్దరూ మళ్ళీ కాలనీ అంతా వెతకడానికి బయల్దేరారు... వెయ్యి కళ్ళు చేసుకు చూస్తూ.. విషయం క్రమేపీ అందరికీ పాకడంతో ఒక్క టునాట్ ఫోర్ తప్ప మిగిలిన అన్ని ఫ్లాట్ల వాళ్ళూ భయపడుతూ, తమ పిల్లల్ని ఇళ్లలోనే వుంచి తాళాలు పెట్టి, క్రిందికి వచ్చారు తాపీగా. అన్నవరం దంపతులిద్దరూ తమ పాపని వెతుక్కోవడానికి వెళ్ళారని తెలిసి, “అయినా ఇద్దర్లో ఒకరు వెళ్ళాలి ఒకరు వుండాలి గాని, ఇలా ఇక్కడ వాచ్ మాన్ అనే మనిషే లేకుండా ఇద్దరూ వెళ్ళిపోతే ఎలాటా?” అంది శాస్త్రి గారి భార్య కంప్లైంట్ గా. “మరే” అన్నాయి మరో నాలుగు నిత్య పూజలు చేసే ‘అమ్మ’ ల గొంతులు. “అయినా తమ బిడ్డనే కాపాడుకోలేని వాడు అపార్ట్ మెంట్ ని ఏం కాపాడుతాడండీ? వీడు పనికిరాడండీ ” అన్నాడు రెడ్డి. “కరెక్టే” అన్నాయి మరికొన్ని గొంతులు. “చుట్టు పక్కల వాచ్ మాన్ ల తోటీ, పని మనుషుల తోటీ మీటింగులు పెడుతూంటారు ఎప్పుడు చూసినా. వాళ్లలోనే ఎవరో మాయం చేసుంటారు గుంటదాన్ని” అంది నాయుడు గారి భార్య. “అంతే కాదు. ఆ ముసల్దాన్ని ఎవర్తెనో వీళ్ళు రోజూ గంటల తరబడి ఆ రూము దగ్గర కూచోబెట్టుకుని, దానికి అన్నం అదీ పెడ్తూ, పిల్లని ఆడించడానికి ఇచ్చేవారు కదా. నా అనుమానం అసలు ఆ ముసల్దే ఎత్తుకు పోయుంటుంది దాన్ని. ముసల్దాని దొంగచూపులూ అవీ నేను అనుమానిస్తూనే వున్నాను” అంది గుప్త గారి భార్య. “అవును నిజమే. దాని పనే అయ్యుంటుంది” అన్నాయి పది గొంతులు. ఇంతలో నిరాశతో, దుఃఖ్కం తో తూలుతూ తిరిగొచ్చారు అన్నవరం, సీత. “ఇద్దర్లో ఒకరు వెళ్లి పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి” అని వాళ్లకి ఉచిత సలహా ఇచ్చారు గాని, కనీసం ఆ పనికయినా సాయపడ్డానికి ఏ ఒఖ్కరూ ముందుకు రాలేదు. పైగా కొందరు “పాపం చౌదరి గారి అబ్బాయి పార్టీ రోజునే ఈ న్యూసెన్సు వచ్చింది దరిద్రం” అని విసుక్కున్నారు కూడా.. కొద్ది సేపట్లో పీకల్దాకా తినబోయే బిర్యానీని ఊహించుకుంటూ. ఓ ఇద్దరు యువకులు “వెతికి వస్తాం” అంటూ బైక్ ల మీద బయల్దేర బోతే వాళ్ళ పెద్ద వాళ్ళు “వెధవ తద్దినం మనకెందుకూ?” అంటూ రహస్యంగా కసిరి వాళ్ళని ఆపేశారు. నిస్సత్తువతో, నిరాశతో నవ నాడులూ క్రుంగి పోతూండగా కాంపౌండ్ వాల్ కి ఆనుకుని క్రింద కూలబడి పోయారు అన్నవరం దంపతులు. వాళ్ళ ముఖాలు జేవురించుకు పోయి, కళ్ళలో నీళ్ళు ఎండిపోయి, శూన్యం లోకి వెఱ్ఱి చూపులు ప్రారంభమయ్యాయి. పది నిముషాలు గడిచాయి. “అదుగో ముసలమ్మ” అరిచాడో యువకుడు గేటు దగ్గర్నుంచి. “పట్టుకోండా ముండని. దాని పనే ఇదీ” ఆజ్ఞాపించింది దుర్గమ్మ. ఊపిరి అందినట్లయి, అన్నవరం, సీత చువ్వల్లా లేచి గేటు బయటకి పరుగెత్తారు. దూరంగా ... ముసలమ్మ శక్తినంతా కూడదీసుకుని పెద్ద పెద్ద అంగల్తో ఇటే వస్తోంది. అనుమానం, ఆందోళన, ఆశ ముప్పేటలుగా లోనుండి తన్నుకొస్తూండగా ఎదురు పరుగెత్తారు దంపతులు. వాళ్ళని చూస్తూనే ఉత్సాహంగా గాల్లోకి చెయ్యి ఊపింది ముసలమ్మ. ఆమె చంకలో పాప. దంపతుల కళ్ళు చుక్కల్లా మెరిసాయి. పెల్లుబుకుతూన్న విస్మయంతో పెద్ద పెద్ద అంగలతో పరుగెత్తి ముసలమ్మ నుంచి పాపని లాక్కుని, గుండెలకి హత్తుకుని .... మరింత ఆశ్చర్యానికి గురయి పోయారు. పాపకి జ్వరంలేదిప్పుడు. మబ్బు తొలగిన వెన్నెల్లా నవ్వుతూ ఇద్దరూ ముసలమ్మ వైపు చూసి .. ఒక్కసారిగా నిలువునా చలించి పోయారు. ఆమె నొసట గాయముంది. ఆ గాయం నుంచి అప్పటికే బాగా రక్తం కారినట్లుంది.. ఆమె ఛాతి మీది చీర రక్తంలో తడిసి పోయుంది. మనిషి నిస్సత్తువగా నిలవలేక తూలిపోతోంది. ఆయాసంతో నిలవలేక ఒగుర్చుతోంది. మరు క్షణంలో క్రింద పడిపోయే దానిలా శరీరం అటూ ఇటూ విరుచుకు పోతోంది. ఒఖ్క క్షణం ఆలస్యమయితే పడిపోయేదే .. గబుక్కున ఆమెని ఒడిసిపట్టి దగ్గరకు హత్తుకుంది సీత. చిట్టి తన గౌనుతో ముసలమ్మ నొసట తుడుస్తూ బెంగగా చూడసాగింది. నెమ్మదిగా నడిపించుకుంటూ అపార్ట్ మెంట్ లోకి తీసుకు వచ్చి, బల్ల మీద కూర్చోబెట్టి, నొసట కట్టు కట్టి, మంచి నీళ్ళు పట్టించారు. కొద్దిగా ప్రాణాలు దక్కి నట్లయి తేట చూపులు చూసింది ముసలమ్మ. ఇక తనకేం ఫర్వాలేదు అన్నట్లు గాలిలో చేతిని ఊపింది. శక్తి తెచ్చుకుని కరుణార్ద్రమయిన స్వరంతో చెప్పడం ప్రారంభించింది ముసలమ్మ.

“ఆ వెధవెవడో గెడ్డాలూ మీసాల్తో బూచాడ్లా వున్నాడు. దొంగ చూపులూ వాడూ .. మన చిట్టిని భుజాన్న వేసుకుని, మెయిన్ రోడ్ మీదికొచ్చాడు. ‘ఎప్పుడన్నా మీరు చిట్టిని తీసుకుని అటు రాకపోతారా ఓసారి కళ్ళారా చూడకపోతానా’ అన్న ఆశతో నేను ఆ బస్ స్టాప్ బెంచీల మీదే పడుకుంటాను కదా? చిట్టిని గుర్తు పట్టి, “ఎవరు నువ్వు? ఎక్కడికి తీసుకెళ్ళుతున్నావు చిట్టినీ?” అంటూ గాభరాగా వాడి వైపు పరుగెత్తాను. వాడు కంగారు పడ్డాడు. ఇంతలో ఓ బస్సొస్తే చిట్టితో బాటు అందులోకి దూరెయ్య బోయాడు. నేనూరుకుంటానా .. శక్తి కూడ గట్టుకుని వెనక నుంచి వాడి చొక్కా కొస పట్టుకు బలంగా లాగుతూ “దొంగ దొంగ” అని పెడ బొబ్బలు పెట్టాను. అదేసమయంలో బస్సు కూడా కదలడంతో తను క్రింద పడతానని భయమేసినట్లుంది .. ఆ దొంగ వెధవ ఆగిపోయి, చిట్టిని నా చేతుల్లో పడేసి, పారిపోతూ నన్ను ఒక్క తన్ను తన్నాడు. కింద పడిపోయాను. ఇదుగో నుదురుకి ఈ దెబ్బ తగిలిందీ .. కానీ చిట్టికి మాత్రం ఏం కాకుండా జాగర్తగా పొదివి పట్టుకున్నాను. మన బంగారు తల్లి .. దెబ్బలు తగిలించు కోకుండా .. మనకి దక్కింది..” అంటూ ఇంక చెప్పలేక పాపని పొదువుకుంటూ, ముఖం చుట్టూ చేతులు తిప్పి దిష్టి తీస్తూ, బావురుమంది. అన్నవరం, సీతల కళ్ళు చెరువులైపోయాయి. కృతజ్ఞతా భావంతో “అమ్మా” అంటూ ముసలమ్మ కాళ్ళని చుట్టుకు పోయారు. “ఏఁవిట్రా ఇది పిచ్చి సన్నాసుల్లారా..?” అందామె లాలనగా వాళ్ళ తలలు నిముర్తూ. “ఆ దొంగ వెధవ మన టు నాట్ ఫోర్ వాడేనేమో?” అంది గుప్త గారి భార్య. “ఉష్. అయినా కావొచ్చు గానీ గట్టిగా అనకండి కొంపలు ములుగుతాయి” అని రహస్యంగా కసిరింది పంతులు గారి భార్య. కడుపులో భారం పూర్తిగా తీరే దాకా ఏడ్చేస్తూ, ముసలమ్మ ఒళ్లో సేద దీరి, కళ్ళు తుడుచుకుంటూ లేచి నిలబడి, “సీతా! నువ్వు ఎంటనే మన బట్టలు మాత్తరం రేకు పెట్టెలో ఎట్టి తీసుకురా. ఎల్లిపోదారి” అన్నాడు అన్నవరం, ముసలమ్మ తాలూకు మూటని చేతిలోకి తీసుకుంటూ... దృఢ నిశ్చయంతో. ‘ఎక్కడికి? ఎందుకు?’ అని అడగ లేదు సీత. లేచి వేగంగా రూములోకెళ్ళి, రేకు పెట్టెతో రెండు నిముషాల్లో తిరిగొచ్చింది. ముసలమ్మ చేతులు పట్టుకుని అతి జాగర్తగా నిలబెడ్తూ, “అమ్మా! మనం ఎల్లి పోదాం .. పద” అన్నాడు అన్నవరం. అపార్ట్మెంట్ వాసుల్లో సంచలనం. “ఎక్కడి కెళ్ళుతారూ?” అంది దుర్గమ్మ అర్ధంకాక దీర్ఘం తీస్తూ. తాపీగా ఆమె వైపు తిరిగి ఒత్తి పలుకుతూ జవాబిచ్చాడు అన్నవరం - “మానవొత్వం అని ఓటుంటదండి. అదున్న మనుషులుండే సోటుకి!” “ఏవిటి నువ్వు మాట్లాడేదీ? మతుందా? రూములో మీ సామాన్లన్నీ అలాగే వదిలేసి, కట్టుబట్టలతో వెళ్ళిపోతారా? అందులోనూ ఈ నెల జీతం కూడా ఇంకా తీసుకోలేదు కదా నువ్వు?” ప్రశ్నించాడు సెక్రటరీ ఆశ్చర్యపోతూ. బోర విరుచుకుని, ధైర్యంగా జవాబు చెప్పాడు అన్నవరం, “అన్నీ మీరే ఉంచుకోండి. ఇదుగో ..” అంటూ ముసలమ్మని దగ్గరకు హత్తుకుని, “ఈ తల్లి మాకు దొరికిన కోటి కోట్ల ‘నిధి’. ఈయమ్మ కొడుకులు సన్నాసులు. ఈ తల్లికి పెట్టే పట్టెడు కూడు కూడా మిగుల్చుకుని, లచ్చలు సంపాయించాలానే యావలో ఈ బంగారు నిధిని బయటకి గెంటేసారుట మూర్కపు ఎదవలు.. ఈయమ్మ మా సిట్టికి ప్రేణం పోసి, మా ఇంట దీపం ఎలిగించిన దేవత. మానవత్వం పూరాగా వున్న ఈయమ్మ ఒక్కత్తీ మాతో వుంటే సాలు .. గొప్ప దైర్నంగా బతికేత్తాం. మేవిప్పుడు మీ అందరికన్నా గొప్పోల్లం. అవును గొప్పోల్లం. ఇది నిజం! ఎవ్వరూ కాదనలేని నిజం!” అని చిట్టిని చంకకి ఎత్తుకుని, ముసలమ్మ జబ్బ పట్టుకుని, భార్యతో బాటు .... గేటు బయటకు అడుగులు వేసాడు అన్నవరం. చిట్టిని తమ భుజాల మీద కూర్చోబెట్టుకుని, ముసలమ్మని ఆత్మీయంగా పొదివి పట్టుకుని, అలా సాగిపోతూన్నారు అన్నవరం దంపతులు. ముసలమ్మ అడుగులు సైతం తడబడకుండా బలంగా పడుతూన్నాయి. అమితాశ్చర్యంతో తెరుచుకున్న నోళ్ళు మూసుకోవడం తమ శక్యం కాని పనవుతూండగా .. తాటి ముంజుల్లా విచ్చుకున్న నిలువు గుడ్లతో .. అన్నవరం ‘సంసారం’ వెళ్ళుతూన్న వైపు .. మర బొమ్మల్లా చూస్తూ వుండిపోయారు .. అపార్ట్మెంట్ ‘పెద్దమనుషులు’ అందరూ. ****** ***** ******

గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి

40 views0 comments

留言


bottom of page