top of page

నిన్ను నువ్వే అడుగు

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.




Video link

'Ninnu Nuvve Adugu' Telugu Story Written By Pandranki Subramani

రచన : పాండ్రంకి సుబ్రమణి

ఇతరుల్ని తప్పు పట్టడం, దండించాలనుకోవడం సహజమే.

కానీ ఆత్మ విమర్శ చేసుకోవడం నేర్పితే తమ తప్పు తెలుసుకోగలుగుతారు.

ఇతరుల్ని అర్థం చేసుకోగలుగుతారు.

ఈ విషయం చక్కగా తెలిపారు ప్రముఖ రచయిత పాండ్రంకి సుబ్రమణి గారు.

ఈ కథ మనతెలుగుకథలు. కామ్ లో ప్రచురింప బడింది.

ఇక కథ ప్రారంభిద్దాం


ముత్యాలమ్మ చెరువుకి ఆవల విశాలంగా పరచి ఉన్న వరిపొలాల ప్రక్కన ఉంది పానుగంటి ఊరు. తోపులతో కళ కళ లాడే పచ్చటి ఊరు కాబట్టి ఇరువైపులా నిండుగా పారుతూన్న కాలువల ప్రవాహం నిరంతరం కాబట్టి అక్కడి వాతావర ణం కూడా పచ్చ పచ్చగా స్వఛ్ఛంగానే ఉంటుంది. ప్రతిరోజు రాత్రీ రామాలయం మండపంలో రామభజన సాగుతుంటుంది. ఒకరోజు పెసలు. మరొక రోజు కొబ్బరి ముక్కలు, మరునాడు అరటి పళ్లు-ఇలా శ్రీరామచంద్రమూర్తికి నైవేద్యంగా ఇస్తుంటారు అర్చక స్వాములు. అలా ప్రసాదం ఇచ్చేటప్పుడు దాని కోసమే ఒద్దికగా యెదురు చూసే పిల్లల సందడి అంతా ఇంతా కాదు. దేవుడి పెళ్లికి అందరూ పెద్దలేనని అంటారే- ఈ రీతినన్నమాట. ఇక శ్రీరామనవమి గాని వచ్చిందంటే ఊరు ఊరంతా సంబరంతో భజన మందిరంగా మారిపోతుంది. పోతనా మాత్యుడి భాగవతం రాత్రంతా చదివి వినిపించాల్సిందే!


ఇక వేసవి కాలం వచ్చిందంటే మాడవీధి చుట్టూ చలివేంద్రాలు, అంబలి కూడళ్ళు-- ఊరి పొలిమేరన పాత పాలేరు పరమశివం మంచాన పడ్డాడని విని, వెన్నాకుల జనార్దనం పరామర్శించి వస్తున్నాడు. యాభై యెకరాల మాగాణికి పెద్ద రైతయిన అతడికి తరతమ భేదాలు పట్టించకోకుండా పాత పరిచయాలను పాత నేస్తాలను పలకరించి రావడమంటే ఆత్మానుబంధాన్ని నెమరు వేసుకోవడం వంటిది. స్నేహపు పందిరాన్ని దిటవుగా పెంచుకోవడం వంటిది. ఆ విషయంలో యెక్కువ తక్కువల గురించి తలపోయడు. ఇరుగు పొరుగు తన గురించి యేమనుకుంటారోనన్న అంశాన్ని ససేమిరా ఖాతరు చేయడు. అంచేత చిన్నప్పటి నేస్తంగా పొలం గట్లమ్మట తనతో కలసి మెలసి తిరిగిన పరమశివాన్ని అతడి కుటుంబాన్నీ ఆప్యాయంగా పలకరించి చేతిలో రూపాయి నోట్లు ఉంచి, పనిలో పనిగా పరమశివానికి శివార్చన చేసిన పూసలు కూడా అందించి, ధైర్యం చెప్పి చెరువు గట్టమ్మట అన్యమనస్కంగా నడచి వస్తున్నా డు.


యెగురుతూ యెగురుతూ వచ్చి బుడుంగున చెరువు నీళ్లలోకి దూరి చేప పిల్లల్ని చమత్కారంగా నోట కరచుకుని గగనం లోకి యెగిరి పోయే వెల్ల పిట్టల్ని చూసి ఆనందిస్తూ--బడి పుస్తకాల సంచుల్ని గట్టు ప్రక్కనుంచి జలకాలాటలాడుతూన్నఇద్దరు పిల్లకాయల్ని-“ఈత తెలియని కుర్రకుంకలు నీళ్లలో దిగకూడదని నేనెన్ని సార్లు చెప్పాను!” అంటూ మందలించి వాళ్ళిద్దరికీ పుస్తకాల సంచుల్ని అందిచ్చి పిర్రల పైన రెండు తగిలించి ముందుకు సాగిపోయాడు. చేతులు కాలిన తరవాత ఆకులు పట్టుకునే కన్నా చెరువు గట్టమ్మట పచార్లు చేయడానికి ఈత తెలిసిన కాపలావాణ్ణి పెట్టాలి. చెరువులో యెక్కడ లోతు యెక్కు వగా ఉంది, ఎక్కడ లోతు తక్కువగా ఉన్నదన్నది పిల్లకాయలకు యెలా తెలుసు— పిచుక కేం తెలుసు ఉండేలు దెబ్బ- అన్నట్టు--


అప్పుడతనికి అల్లంత దూరం నుంచి కేకలు అరుపులు ఛెళ్ళున వినిపించాయి.

తల నిక్కించి చూసి, అవి ఊరి మర్రిచెట్టు మాను రచ్చబండనుండి వస్తున్నాయని పోల్చుకున్నాడు జనార్దనం. ఉదయకాలపు ఆహ్లాదకర మోదం యెటో వెళ్ళిపోయి నట్లనిపించింది. వేగంగా నడుస్తూ కళ్లు మరింత పెద్దవి చేసుకుని చూసాడు.

అప్పుడతనికి అక్కడ తెరలు తెరలుగా లేచే అరుపుల్ని బట్టి తిట్లను బట్టి అర్థమైంది, తోట కంచెలోకి దూరి వేపకర్రకు ఉరి బిగించి దానిమ్మ పళ్లు లాక్కుని తిన్నాడని మంగళి సూరన్న కొడుకుని నలుగురు ముందూ నిలబెట్టి నిలదీస్తున్నాడు ఆ యేటి తోటకాపుకి వేలం పాడుకున్న కోమటి గంగన్న. అతడికి వత్తాసుగా వాళ్లింటి ఆడాళ్లు కూడా గొంతు కలిపి దెప్పి పొడుస్తున్నారు. మెటికల విరుస్తున్నారు. అప్పుడప్పు డు కోపం పట్టలేక కోమటి గంగన్న కుర్రాడి వీపు చరిచేస్తున్నాడు. కొడుకు అవస్థ చూడలేక సూరన్న అతడి పెళ్ళాం పున్నమ్మ ముఖాలు చాటు చేసుకుని గుడ్ల నీరు కక్కుకుంటున్నారు. అట్టడుగు బడుగు జీవుల దైన్య స్థితికి ఉచ్ఛఘట్టమంటే అదే మరి--కొడుకు వీపుపైన చరుపు చరచినప్పుడల్లా అడ్డు రావడానికి ప్రయత్నిస్తూ మళ్ళీ వెనక్కి తగ్గిపోతున్నారు భార్యా భర్తలిద్దరూ—


ఎందుకంటే, పానుగంటి ఊళ్లోని పెద్దలకు దొంగతనమంటే ససేమిరా పడదు. కత్తులు దూస్తారు. ఆవేశం మరీ యెక్కువైతే తల గొరికి సున్నం బొట్లు పెడ్తారు. అందులో అంతటి అమాంబాపతు సొమ్ము కట్టి వేలం పాట పాడి పొందిన తోట కంచెను అవలీలగా దాటి దానిమ్మ పళ్లు యెడా పెడా కోసుకు తినడమా!తగదంటే తగదు. నేరం నేరమే!దానికి వయసుతో నిమిత్తం లేదు. అంచేత వర్గ చైతన్యానికి ప్రతీకగా చిన్నా పెద్దా కామందులందురూ గుమికూడారు. కన్నెర్ర చేస్తూ నిల్చున్నారు. ఇక కలుగచేసుకోవడం తప్పని సరి—


“ఆగండాగండి!ఊళ్ళో పెద్ద మనుషులుండగా చట్టపు మెడను యెడా పెడా విరిచేసి ఇలానా కుర్ర కుంకను వీరబాదుడు బాదుతారూ!” దానికి చురుక్కున బదులొచ్చింది ఇద్దరు ముగ్గురు భూకామందుల నుండి-“ఏం?మేం మాత్రం ఊరి పెద్ద మనుషులం కామా!”

“వయసులో పెద్దతనం ఉంటే చాలదోయ్!బుధ్ధిలో కూడా పెద్దరికం ఉండాలి. ఇది గాని వింటే మీరిలా చట్టాన్ని చేతుల్లోకి తీసు కోరు. ఒక చంటోడి కళ్ళమ్మట ఇంతటి కన్నీరు రప్పించరు” వెన్నాకుల జనార్దనాన్ని చూసి సూరన్న దంపతుల కళ్లు ఆశగా పెద్దవయాయి. మొసలి కోరల్లోనుండి యేనుగు ప్రాణాన్ని కాపాడడానికి వాలిన చక్రధరి రూపం కళ్ల ముందు మెదిలింది. వ్యవహారం ఇలానే ఉద్రిక్తంగా సాగుతూ పోతే ఇక కొడుకు ప్రాణాలకు భరోసా ఉండదేమో! ఇద్దరూ ఇలా తల్లడిల్లుతుండగా కోమటి గంగన్న గుడ్లురుముతూ ముందుకు వచ్చాడు.


“చంటోడూ చంటోడంటున్నారు గాని—వీడు చంటోడి పనా చేసాడు! దొంగతనం చేసాడు. ఈ రోజు మాతోటలో— రేపు మీ తోటలో జరగదనగలరా! అప్పుడు మీరు చూస్తూ ఊరకుంటారా!”

“వాస్తవం! నేను చూస్తూ ఊరుకోను. అలాగని చట్టాన్ని చేతుల్లోకి తీసుకోను మీలా--. అర్థమైందా?”

“నువ్వు చట్టం గురించి వివరించి చట్టంలోని ఆనుపానుల గురించి రిపోర్టిచ్చేలోపల తోటలోని కాపంతా పటాఫట్-- ఇది తెలుసుకో బావా!”

దానికి జనార్దనం వెంటనే బదులివ్వలేదు. అతడు తన కోణం నుంచి విశ్లేషించాడు. వాస్తవానికి నేరం కుర్రాడి పైనే కాదు. వాణ్ణి అదుపాజ్ఞల్లో ఉంచని వాడి అమ్మాబాబులపైనా ఉంది. కాని— ప్రతి చిన్నదానికీ తల్లి దండ్రులు పిల్లల పైన నిఘా ఉంచలేరు కదా! అలా ఉంచగలిగితే చిన్న పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ నీళ్ల తొట్టిలో దభాళున పడి ఊపిరాడక యెందుకు ప్రాణాలు విడుస్తారు? ఇక విషయానికి వస్తే—అతడికి తన ఆలోచనా ధోరణి తనకే నచ్చలేదు. ఇప్పుడు తన ముందున్న యేకైక సమస్య దానిమ్మ పళ్ళను దొంగలించిన కుర్రకుంకను యెలాగో ఒకలా పిడి గుద్దుల్లోనుంచి తప్పించాలి. కాని లిటిగేషన్ ద్వారా మాత్రం కాదు. ఇక్కడున్న వాళ్ళకు ఆ భాష అర్తం కాదు. ఆవేశంలో ఊగిసలాడుతూన్న వాళ్ళకు అందులోని భావార్థం అందదు. వాళ్ళకు తెలిసిన భాషలో, వాళ్ళకు నచ్చే భావ పరంపరతో చెప్తేనే వాళ్ళు కొంతలో కొంత నిదానం కొనితెచ్చు కుంటారు. అదే నిదానంతో కాసేపటికి దారికి వస్తారు. చతురత గల జనార్దనం చివరి పోటుగా సామదాన దండ ప్రయోగానికి పూనుకో వాలని తీర్మానించాడు.


గొంతుని సరళీకరించుకుంటూ అన్నాడు-“దొంగతనం చేయడం నేరం కాదని నేనెప్పుడన్నానని?నేరం నేరమే! ఇందులో వయసుతో నిమిత్తమేముంది?ఐతే మీరావేశంలో పడి మరచిపోయిన దానిని మీకు గుర్తు తేవాలను కుంటు న్నాను. అది నా కర్తవ్యమనుకుంటున్నాను. మన మందరమూ శివ పురాణం వింటాం. భాగవతం వింటాం. చాతుర్మాస్య వ్రత సమయంలో శంకారాచార్యులు వారు చేసే ప్రసంగం వింటాం. ధర్మశాస్త్రాలలో కొన్ని విషయాల గురించి అనుమానాలు లేవ దీసి తెలుసుకుంటాం. ఇప్పుడు అవన్నీ మరచి మనమిక్కడ ఈ కుర్ర వెధవను యెడా పెడా వాయిస్తూ మనకు తెలియకుండానే మనం ధర్మశాస్త్రాన్ని బాహాటంగా ఉల్లంఘిస్తున్నాం. ఇలానే ఒకనాడు ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించి యమధర్మరాజు గొప్ప తప్పిదనం చేసి ఘోరమైన శాపానికి గురయాడు. యమలోకం నుండి వెళ్ళగొట్ట బడ్డాడు” .


అది విని పెద్దరైతులందరూ నోరు తెరచి యేక కంఠంతోఅన్నారు-“యమధర్మరాజు యమలోకం నుండి వెళ్ళగొట్ట బడ్డాడా!“


“ఔను! ఘోరమైన పరిస్థితిలో పదవీచ్యుతుడు కాబడ్డాడు. ఎలాగంటే—ఏదో ఒక నేరానికి ఒక అబ్బాయిని తీవ్రంగా దం డించాడు. అలా దండించబడ్డ అబ్బాయి మరు జన్మలో ఘోర తపస్సు చేసి ఋషి పుంగవుడుగా మారుతాడు. తన తపశ్శక్తితో తిన్నగా యమలోకానికి వచ్చి యమధర్మరాజుని నిలదీస్తాడు. ”తెలియని చిన్న వయసులో నేను చేసిన చిన్నపాటి పొరపాటుకి అంతటి పెద్దశిక్ష విధిస్తావా?తెలిసీ తెలియని వయసులో చేసిన తప్పిదం ఒక నేరమే కాదని, దానిని ప్రక్క చూపులతో లక్ష్యపెట్ట కూడదన్న న్యాయసూత్రం నీకు తెలియదూ!ఆనాడు నాచిన్నతనంలో చేసిన తప్పుకి అంతటి పెద్ద శిక్ష వేసి దండించావు కాబట్టి, నేడు నువ్వు కూడా కఠోరమైన శిక్ష అనుభవించాలి. ఈ క్షణం నుండి నువ్వు పదవీచ్యుతుడివి కావు గాక-ఇక్కడ నీకు నిలువ నీడ లేకుండా అవుగాక—“అని శపిస్తాడు.


ఋషి పుంగవుడి శాఫ ఫలితంగా యముడు యమలోకం నుండి గెంటబడతాడు. ఇలా చిన్న కూర్రాణ్ణి యెడా పెడా దండించి యముడి దుస్థితిని మనకు మనం కొని తెచ్చుకోవాలా!“

రచ్చబండ వద్ద గుమిగూడిన వాళ్ళందరూ-గంగన్న శెట్టితో సహా ఊరకుండిపోయారు. అప్పుడు అదను చూసి యెర్రబడ్జ కడ్డీపైన సమ్మెట పోటు వేసినట్టు జనార్దనం కొనసాగించాడు. “నా ఉద్దేశ్యంలో ఈ కుర్రకుంక మంచి ఆకలితో ఉన్నప్పుడు ఆ దొంగపని చేసుంటాడు. మరైతే మన సంగతేమిటి?మన చిన్నవయసులో మనం పొరుగింటి పెరట్లోకి వెళ్లి అక్కడి కాయలు కోసుకు వచ్చి ఉప్పూ కారమూ తగిలించి తినలేదూ! అరటి పళ్లూ మావిడి పళ్ళూ తెంపుకు వచ్చి లొట్టలు వేసుకుంటూ ఆరగించలేదూ! నా మనసుని నేను అడిగి చూసాను. కుర్రవయసులో నేనలాగే చేసానని నా మనసు చెప్తూంది. మరి మీ మనసేమి చెప్తుందో నాకు తెలవదు. సరే—ఏది ఐతేనేమి—ఈ కుర్రాడు తోటలోకి చేసిన దురాక్రమణ వల్ల గంగన్నశెట్టిగారికి నష్టం భారీగానే కలిగుంటుంది. ఆ నష్టం యెంతో చెప్తే నేను భర్తీ చేస్తాను” అంటూ సూరన్న వేపూ అతడి పెళ్లాం పున్నమ్మ వేపూ తిరిగాడు.


“మీపైన కూడా పొరపాటుంది. పొలాలమ్మట సాగుతున్నప్పుడు మనమెందుకు దూడ మూతికి చిక్కుడు వేస్తాం? పరులు శ్రమకోడ్చి సాగుచేసిన వరి పంటకు నష్టం కలగకూడదని. అంతేకదా! అదే విధంగా మీ పిల్లాణ్ణి మీ కట్టుబాటులో ఉంచుకోవాలి. పిల్లాణ్ణి రికార్సుగా చెరువు గట్టమ్మట తోట కంచెలమ్మట తిరగనివ్వకుండా వాణ్ణి ప్రతిరోజూ బడికి మీరే దిగబెట్టి రావాలి. సరిగ్గా చదువుతున్నాడో లేదో అయ్యవారిని స్వయంగా అడిగి తెలుసుకోవాలి. ఇకపైన వాణ్ణి గాని పగటి పూట ఇక్కడెక్కడైనా చూసానంటే మిమ్మల్ని పిలిచి నిలదీస్తాను. వీడు యెక్కడికి వెళ్లినా యేం చేస్తున్నా మీ కనుసన్నల్లోనే ఉండాలి. అర్థమైందా?”


భార్యాభర్తలిద్దరూ తలలూపుతూ వంగి జనార్దం కాళ్లకు నమస్కరించారు. దూరంగా బిత్తర పోయి చూస్తూ నిల్చున్న కొడుకుకి మొట్టికాయ పెట్టి సంజ్ఞ చేసారిద్దరూ-- అప్పుడు వాడు కూడా పరుగున వచ్చి అతడి కాళ్లకు నమస్కరించాడు. నమస్కరిస్తూ అన్నాడు- “నేనికనుండి ప్రతిరోజూ బడికి తప్పకుండా వెళ్తానయ్యా!”.


జనార్దనం తలూపుతూ ముందుకు సాగిపోయాడు. అలా సాగిపోతూ వెనక్కి తిరిగి చూసాడతను. గంగి శెట్టి అతణ్ణి వెన్నంటి రావడం లేదు. ఇకపైన కూడా తోట నష్ట పరిహారం కోసం జనార్దనాన్ని అడగటానికి సాహసించడేమో---


***శుభం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.



65 views0 comments

コメント


bottom of page