top of page

నిర్మాల్యం


Nirmalyam Written By Kanthi Sekhar Salaka

రచన : కాంతి శేఖర్ సలక


"కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే...." సుస్వరంగా స్వామి వారి మేలుకొలుపు వినిపిస్తోంది. స్వామి కి మేలుకొలుపు ఏమిటో...అజ్ఞానం...ఒక్క క్షణం ఆయన కన్ను రెప్ప వేస్తే లోకాలు అల్లకల్లోలం కదూ.

కొన్ని జన్మల క్రితం నా జన్మ అంతా ఆయన కి మేలుకొలుపు నుండి ఏకాంత సేవ వరకు సశాస్త్రీయంగా శ్రద్ధ తో ,భక్తి తో ,నాది అనే కుటుంబం కూడా మరిచిపోయి క్షణ క్షణం హరి నామ స్మరణ మాత్రమే శ్వాసగా హరి సేవ మాత్రమే ధ్యాసగా గడిపాను.


విష్ణువు నే చిత్తంతో నిలుపుకుని సేవించిన నన్ను విష్ణు చిత్తుడు అన్నారు కొన్ని కథల్లో. గురువుగారి ఆజ్ఞ ప్రకారం స్వామి సేవ కోసం ఆలయం లో పూల తోట ను పెంచటం, సంరక్షణ చేయటం, పువ్వులను సేకరించి మాలలు గుచ్చి ఆలయానికి తీసుకెళ్ళి స్వామి వారి అలంకరణ సమయానికి అందించటం నాకు గురువుగారు అప్పగించిన విధులు.


స్వధర్మం ప్రకారం ఇల్లు, ఇల్లాలు అనే బంధాలలో ఉన్నా గురువు ఆజ్ఞ పాటించటం మాత్రమే నా మొదటి ప్రాధాన్యత. నాకు అన్ని విధాలా తగిన ఇల్లాలు నా ధర్మ పత్ని. సంతానం లేదనే లోటు మనసులో వున్నా నాకెప్పుడూ చెప్పుకోలేదు ఆమె. ఆషాఢ మాసంలో ఒకనాటి ఉదయం స్వామి నామ స్మరణ లో పూల తోట ను బాగు చేస్తున్నప్పుడు రోజు లా కాకుండా ఆ పూల వనం వానకు తడిసి మరింత స్వఛ్చంగా కనిపించింది నా దృష్టికి. తులసి వనంలో ఒక పసి పాప ఏడుపు వినిపించింది. ఏడుపు కూడా అంత మధురంగా ఉంటుందా అనిపించేంత మార్దవం ఆ గొంతులో. ఆ స్వరం వినిపించిన వైపుకు వెళ్లి చూస్తే అందం అంతా కుప్ప పోసినట్టు ఉన్న బంగారు బొమ్మ. స్వామి ఇచ్చిన వరం అనుకుని చేతుల్లోకి ఎత్తుకున్నాను. మంత్రం వేసినట్టు ఏడుపు ఆపేసింది. సూర్యబింబం చల్లదనం అద్దుకున్నట్టు లేత బంగారు రంగు లో పాప, చల్లని బోసి నవ్వు నవ్వింది. తామర పూల పొట్లాన్ని పట్టుకున్నంత మృదువుగా గుండెలకు అదుముకున్నాను. ఆకాశంలో కురుస్తున్న సన్నటి తుంపర నుండి రక్షణగా పాపను పొదివి పట్టుకుని ఇంటికి చేరుకుని ఆ బంగారు తల్లిని నా భార్య కి అప్పగించాను. తులసి అన్న అర్థం వచ్చేలా గోదా అని పేరు పెట్టుకున్నాను. ప్రతి క్షణం స్వామినే స్మరించిన నా మనసు, ఆమె బోసి నవ్వుకు మురిసిపోయేది. నా గుండెపై తన లేత అడుగుల తాకిడికి స్వామి సేవకే అంకితం అయిన నా తనువు పులకరించిపోయేది. నేను చెప్పే శ్రీ హరి గాథలకు తను ఊకొడుతుంటే ఆ కథలు నేను తనకి నేర్పుతున్నానా, తానే నాకు నేర్పుతోందా అని ఒక్కోసారి తొట్రుపాటు పడేది నా మనసు. కొంత ఎదిగాక స్వామి సేవ కోసం నేను పూలు కోస్తుంటే తాను కూడా వస్తానని మారం చేసేది. నేను కోప్పడే వాడిని, తోటలో పూలకి ఉండే ముళ్ళు చిట్టి చేతులకి గుచ్చుకుంటాయి తల్లీ అని. మరి మీకు గుచ్చుకుంటే మీకు నెప్పెట్టదా నాన్నారు...అని నా చేతులని తన బుల్లి చేతులతో నిమిరేది. మా అమ్మ చేతుల్లా అనిపించేవి ఆ మెత్తని చేతులు. ఆమె లోకానికే అమ్మ అని ఆ క్షణం నాకేం తెలుసు...

కొంచెం ఊహ తెలిసాక నాతో పాటు ఆలయానికి వచ్చి స్వామికి నేను చేసే సేవలన్నీ ఆకలి, నిద్ర మరచిపోయి చూస్తూ ఉండేది. కృష్ణుడు ఎందుకు నల్లగా ఉన్నాడు, ఆ దండలు అలా ఎందుకు వేసుకున్నాడు అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసేది. తోటి పిల్లలతో ఆడే ఆటల్లో, చెప్పే కథల్లో అన్నిటిలో ఆ కన్నయ్య ఊసులే తనకి. పరిహాసానికి కూడా పరుషవాక్యం పలకని ఆ పిల్ల, ఆటల్లో కూడా కోపం ఎరుగని ఆ పిల్ల,మారు రూపు తో వచ్చిన భూదేవి అని ఆ రోజున నేను ఎరుగను కదా.


స్వామికి వేయవలసిన పూల మాలలు ముందు తాను సింగారించుకుని ఇచ్చిందని తెలిసి మందలించాను, స్వామికి ఎంగిలి పూలు పెట్టటం పాపం అని. స్వామి గుండెల్లో కొలువైన తల్లి నా కన్న తల్లి, నా గోదమ్మ అని తెలియని అజ్ఞానిని అప్పుడు.


తెలతెల వారక ముందే నేస్తాలను కూడా నిద్ర లేపి కోనేటి లో స్నానం చేసి స్వామి కి రాగ మాలికలతో అర్చన చేసే క్షణాన నాకు తెలియదు, ఆ మేల్కొలుపు ఆటవిడుపు కోసం కాదు, స్వామి వైపు దృష్టి మరల్చమని అందరికీ హెచ్చరిక అని.


తాను ధరించిన పూమాల మాత్రమే స్వామి కోరి ధరిస్తే మురిసిపోయాను. నా సేవ ఫలించిందని సంతోషంలో మైమరచిపోయాను. ఇంతలోనే నా బంగారు తల్లిని తనలో కలిపేసుకున్నాడు ఆ నల్లనయ్య. వెన్నదొంగ, కన్నె మనసుల దొంగ కూడా కదా. శిలలాంటి మనసు అని నిందించాను కూడా, నా చిట్టి తల్లిని నాకు కాకుండా చేశాడని కినుక మరి. కాలం తో పాటు మట్టిలో కలిసి స్వామి గుండెలపై పూబాలగా విరిసే క్షణంలో పులకించిపోయాను మరొక్కసారి, నా గోదమ్మ పాదాలను పలకరించే పుణ్యం పండిన క్షణం వచ్చిందని.

నా తల్లి సిగలో మొగలి రేకుగా చేరినప్పుడు నా తనువు పరవశించింది. కన్నయ్య నల్లన ఎందుకన్నది తెలిసిపోయింది. నా తల్లి నల్లని కురుల చీకటి లో తన మనసు చిక్కుకునిపోయింది మరి.

నా స్వామి నీల మోహన రూపంలో నా ఆత్మ చేరిపోయింది.


గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.


147 views5 comments
bottom of page