top of page

నో కమిట్మెంట్స్ ప్లీజ్


No Commitments Please Written By Jidigunta Narasimha Murthy

రచన : జీడిగుంట నరసింహ మూర్తి


“ఏమిటోలే అక్కయ్యా ఈ ఎండలు ఇంకో ఇరవై రోజులవరకు ఇలాగే వుంటాయిట. అందరం వడియాల్లా వేగిపోతున్నాం అనుకో .” అంది ఫోనులో కుమారి అవతల వైపు నుండి .


కుమారి మాధవికి చెల్లెలు అవుతుంది. ఎప్పుడు ఫోన్లు చేసుకున్నా కనీసం ఒక రెండు గంటల సేపైనా వారిద్దరి మధ్య సంభాషణ అలవోకగా సాగిపోతుంది. ఎంతగా అంటే ఆ గొంతులకు అసలు అలసట అనేది తెలియదు అన్నంత అన్నమాట . వాళ్ళకు మాట్లాడుకోవడానికి ప్రత్యేకంగా ఒక టాపిక్ అంటూ అవసరం లేదు. ఊట బావిలో నీరులా కబుర్లు వాటంతట అవే వూరుతూ వుంటాయి. ఈ మధ్య వాట్స్ యాప్ గ్రూపులు ఎక్కువయ్యి పోయి అందులో సాహిత్యం, సినిమా పాటలు ఇతర పరిచయ కార్యక్రమాలు , కథల పోటీలు , సమీక్షలు మధ్య మధ్యలో ఒకరినొకరు అపార్ధాలు చేసుకోవడం, ఇళ్ళు, బంగారం , స్థలాలు చుట్టాల్లో ఎవరు కొనుక్కున్నా కూడా వాళ్లమీద సహజమైన అసూయలు ఇవన్నీ కూడా వాళ్ళ సంభాషణలో ఒక భాగమే అని చెప్పాలి. “మీరందరూ టెలిఫోన్ కంపినీలకు ఋణపడి వున్నారోయ్” అంటూ వాళ్ళ భర్తలు దెప్పుతూ వుండటం కూడా సర్వసాధారణమైన విషయమే. .


“అవునే కుమారీ ఎప్పటికప్పుడు నీతో ఏదో చెప్పాలనుకుంటాను. ఈ మతిమరుపు ఒకటి వచ్చి పడింది అనుకో. మీకు ఎండలు బాగా కాస్తున్నాయి అని మొన్నెప్పుడో కూడా చెప్పావు . కాస్త వీలుచూసుకుని ఒక రెండు కిలోలు గుమ్మడికాయ వడియాలు, ఒక కిలో చల్లమిరప కాయలు పెట్టి పంపుతావా ? మీ మేడ మీద అయితే రెండు రోజుల్లో ఫెళఫెళా ఎండిపోతాయి . మాకు ఇక్కడ అంతా దరిద్రమే .మీ బావగారు ఎప్పుడూ కింద పోర్షన్లే చూస్తూ వుంటారు. పైన మేడ మీదకు వెళ్ళి ఏదైనా ఎండబెట్టి వద్దామంటే అడ్డంగా తీగలు, వాటిమీద వరసగా ఆరేసిన బట్టలు మాటికి మాటికి వెళ్ళి చూసుకోక పోతే పావురాలు గుంపులు గుంపులుగా వాలి ఎండబెట్టిన వాటిని పాడుచేసేస్తాయి. ఇది కాకుండా చుట్టుపక్కల పిల్ల వెధవల నోళ్ళు కూడా వూరుకోవు. ఏది కనపడితే అవి తినేస్తారు. ఒక సమస్య కాదనుకో. మీ బావగారికి పప్పులో వడియాలు, చల్లమిరపకాయలు లేకపోతే అస్సలు ముద్ద దిగదు. మాకు ఇంత పెద్ద నగరంలో సరైన వడియాలు దొరకవంటే నమ్ము. ఒక వేళ దొరికినా వాటిలో ఒక్క బూడిద గుమ్మడికాయ ముక్క కనపడదు. వంకాయ ముక్కలు, టమోటాలు ఇంకా నానా చెత్తంతా వేసేసి సొమ్ము చేసుకుంటున్నారు. అవి కూడా రాళ్ళల్లా వుంటున్నాయి. ఇక చల్ల మిరపకాయల విషయం చెప్పక్కరలేదు. వుప్పు నీళ్ళల్లో నానబెట్టి బీపీలు పెంచేస్తున్నారు. ఈ మధ్య ఏదో ఫంక్షన్ కి వెళ్తే వాళ్ళు ఎక్కడనుండి తెచ్చారో కానీ గుమ్మడికాయ వడియాలు పెద్దపెద్ద కొమ్ములొచ్చి ఎంత బాగున్నాయి అనుకున్నావు ? చల్ల మిరపకాయలు కూడా చక్కగా మజ్జిగలో వూరేసినవే . అవి చూసే సరికి ప్రాణం లేచొచ్చింది. కేటరింగ్ వాళ్ళను అడిగితే 'ఇక్కడ దొరకవు మేము పెద్ద మొత్తాలలో గోదావరి జిల్లాలలో నుండి తెప్పించుకుంటాం. అక్కడ ఎండలు బాగా కాస్తాయి కదండీ ! సరుకు పాడవుతుందన్న భయం లేదు' అన్నాడు .అదిగో అప్పటినుండి నీతో చెప్పాలని ఒకటే ఆరాటం . ఏమిటీ బోరుకొడుతోందా అటువైపు నుండి రెస్పాన్స్ రావడం లేదు ?” అంది మాధవి అనుమానంగా .


నిజానికి ఆరోజు కేటరర్ వాడితో మాట్లాడినప్పటినుండి మొగుడి మనసంతా అప్పడాలు, వడియాల మీదే వుంది.


“వెధవ వడియాలు లేకపోతే జీవితమే లేదని ఎందుకు అన్నం సరిగ్గా తినడం మానేస్తారు ? అంతగా కావాలనుకుంటే బంగాళా దుంపల చిప్స్ కొని తెచ్చుకోండి. రోజూ అన్నం దగ్గర అది లేదు ఇది లేదు అంటూ నా మీద విరుచుకు పడితే లాభం లేదు “ అంటూ చిరాకు ప్రదర్శించింది మాధవి


“ ఇక నీ సలహాలు ఆపు. రోజూ నువ్వేసే ఆవకాయ ముద్దలు తినలేక చస్తున్నాను. ఎన్ని మాత్రలు మింగుతున్నా బీపీలు ఇంకా పెరిగిపోతూనే వున్నాయి. ఇంతమంది మీ చుట్టాలు గోదావరి ప్రాంతంలో వున్నారు కదా ? ఫోనులో ఒట్టి సొల్లు కబుర్లు తప్ప ఏనాడైనా వడియాలు, అప్పడాల విషయం గురించి మాట్లాడావా ?వాళ్ళను వూరికే పంపించమని అడగడం లేదు . మొత్తం అన్నిటికీ లెక్క కలిపి చెప్పమను .డబ్బు పంపించేద్దాం . ఇకనుండి మీ సబ్జెక్టు నేను చెప్పిన వాటిమీదే వుండాలి తప్ప వేరే ఏ టాపిక్ మాట్లాడినా నేను వూరుకొను ...” అంటూ కామేశం పెళ్ళానికి అల్టిమేటమ్ ఇచ్చేశాడు.


మొగుడి బాధ పడలేక “ సరేలెండి చచ్చిపోతున్నాం మీ వడియాల గోలతో . ఈ సారి సిగ్గును చంపుకునైనా ఫోనొస్తే చెప్పేస్తాను” అంటూ అతని ఆవేశం పైన కొద్దిగా నీళ్ళు చల్లి ప్రశాంతపరిచింది. ఇదిగో ఇన్నాళ్లకు అవకాశం వచ్చి చెల్లెలు వాళ్ళ వూళ్ళో ఎండలు మండిపోతున్నాయి అని మాటికి మాటికి చెప్పడంతో చల్ల కొచ్చీ ముంత దాచినట్టు ఎందుకు అని అసలు విషయాన్ని బయటపెట్టింది.


నిజానికి మాధవికి తన అక్కచెల్లెళ్లను ఏ విషయంలోనూ ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. వాళ్ళు కూడా పూర్వం లాగా ఆరోగ్యంగా లేరు. అయితే మొగుడి సూటీ పోటీ మాటలు పడలేక బలవంతమ్మీద ఒప్పుకోవాల్సి వచ్చింది.


“ ఇదిగో బజారులో బూడిద గుమ్మడి కాయ కనిపిస్తే కొన్నాను. మీ వాళ్ళు వడియాలు పెట్టి పంపించేసరికి ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. ఈ లోపల నీకు వీలైతే ఈ ఒక్కకాయ కోసి వడియాలు పెట్టేయ్యి. నువ్వు అపార్ట్మెంట్లో వున్న వాళ్ళు ఏమి అనుకుంటారో మేడమీదకు వెళ్తే అని అనుకున్నంత కాలం మనం ప్రతీదీ త్యాగం చెయ్యల్సిందే . ఒక సారి అలవాటు చేసుకుంటే వాళ్ళు నిన్ను కొత్తగా చూడరు “ అంటూ కాయను మాధవికి ప్రతి క్షణం గుర్తు రావడానికి మంచమ్మీద అడ్డంగా పడేశాడు కామేశం. . 'ఎలాగైనా సరే సరిగ్గా కుదిరో కుదరకో భర్త కోరిక తీర్చేస్తే , నీకేమీ చాతకాదు అంటూ రోజూ వేసే అక్షింతలు తప్పుతాయి' అనుకుని అన్ని పనులు పక్కన పెట్టేసి మర్నాడే కాయ , కత్తిపీట వేసుకు కూర్చుంది. ఇంతలో ఆకాశం ఒక పెద్ద ఉరుము వురిమింది. ఆ వెంట నల్లగా మబ్బులు కమ్ముకున్నాయి. ఏదో శాస్త్రం చెప్పినట్టు “వర్షం పడాలంటే వడియాలు పెట్టాలి “ అన్న సామెత నిజమయ్యింది. వెంటనే కాయ, కత్తిపీట తీసేసి పక్కన పడేసింది మాధవి. ఆ పట్టున వరసగా మూడు రోజుల వర్షం . ఇంకేం వడియాలు పెడుతుంది ? ఇంట్లో వడియాల ప్రహసనం అచ్చిరాదని మరోసారి ఋజువయ్యింది. ఇక చేసేది లేక బూడిద గుమ్మడికాయను గుమ్మానికి కట్టేసింది కుళ్లడానికి సిద్దంగా వున్న కాయను తీసేసి .


** ** ** **


ఫోను రింగయ్యింది. మాధవికి అంతా హడావిడే. అన్నం తింటున్న చేతిని కడుక్కుని రిసీవర్ ఎత్తింది. “ఇదిగో అక్కయ్యా డిష్ట్రబ్ చేశానా ? ఏమీ లేదు మొన్న అంతసేపు మాట్లాడుకున్నా నీకు చెప్పడం మర్చిపోయాను సుమా. మా రెండవ వాడికి హైద్రాబాద్లో ఏవో పోటీ పరీక్షలు వున్నాయిట. వాడికి బయట భోజనాలు పడవు . ఒక నాలుగైదు రోజులు మీ ఇంట్లో వుంటానని అంటున్నాడు . అదీ కాకుండా మీ పిల్లలంటే వాడికి బాగా ఇష్టం. పెద్దమ్మ వాళ్ళింటికి వెళ్ళి చాలా రోజులయ్యింది అని ముచ్చట పడుతున్నాడు. మీకు ఏమీ అభ్యంతరం లేకపోతేనే చెప్పు వాడిని పంపిస్తాను .మీకు ఏదైనా వేరే ప్రోగ్రాములు వుంటే ఇంకో మార్గం ఆలోచిస్తాను “ అంది కుమారి .


మాధవికి ఇది ఊహించని పరిణామం. చెల్లెలు అనుకోని బాధ్యతను పెట్టినందుకు రెండు నిమిషాలసేపు ఉక్కిరిబిక్కిరయ్యింది ఏమి చెప్పాలో అర్ధం కాక .


“పరీక్షలా ఎప్పుడూ ?” హీనస్వరంతో అడిగింది మాధవి .


“ ఆదేలే . రేపు సోమవారం మొదటి పరీక్ష వుంది. ఒకరోజు ముందే అక్కడ వుండాలి కదా ? రేపు సాయంత్రం బయలుదేరాలని అనుకుంటున్నాడు “


“ రేపు సోమవారమే ? ఎంత పొరపాటు జరిగిందే నీకు చెప్పలేదు కదూ ఆ మూడు రోజులు మా బావగారి సంవత్సరీకాలు వున్నాయే. హైదరాబాద్లోనే వుండి మేమెళ్లకపోతే ఎంత అసహ్యంగా వుంటుందో చెప్పు . నలుగురూ ఆడిపోసుకోరూ ? పాపం మీ చంటాడు రాకరాక చాలా కాలానికి మా ఇంటికి వస్తున్నాడు .పోనీ తాళం చెవి ఇచ్చి వెళ్దామంటే బయట భోజనం అసలు పడదంటున్నావు . ఎలాగంటావు ఇప్పుడు ? “ అంటూ కుమారిని పూర్తి అయోమయంలో పడేసింది మాధవి . నిజానికి మాధవి ఈ బాధ్యత నుండి ఎలాగైనా తప్పించుకోవాలని మాత్రం కాదు . అలాగే కుమారికి కూడా మాధవి మీద బాధ్యత పెట్టె అవసరం అనుకోకుండా కలిగిందే తప్ప ఎవరిదీ ప్రీప్లాన్ కాదు . పరిస్తితులు అలా వచ్చాయి. ఇప్పుడు కుటుంబ వ్యవస్థలు కూడా అలాగే వున్నాయి. ఒకరిమీద ఒకరు ఏదో ఒకరోజు ఆధారపడక తప్పెటట్టుగా లేదు .


“సరేలేవే . ప్రతివారికీ ఏదో ఒక సమస్య పొంచి చూస్తూ వుంటుంది.. వాడు మనం మాట్లాడుకుంటున్నది వింటున్నాడు. లేదు లేదు నేను ఏదైనా హోటల్లో వుంటాను వాళ్ళను ఇబ్బంది పెట్టొద్దు అంటూ సైగ చేస్తున్నాడు. . ఏమి చేస్తాం పోనీలే . నువ్వు ఇవన్నీ ఎక్కువగా ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు “ అంది కుమారి కొంచం నిష్టూరం ధ్వనించిన స్వరంతోనే . ఒక పక్కనుండి వడియాలు , అప్పడాల విషయం గుర్తు చెయ్యి అంటూ కామేశం ఆమె మోచెయ్యిమీద పొడుస్తున్నాడు


వారం రోజులు అక్కా చెల్లెళ్లమధ్య ఎటువంటి ఫోనులు లేకుండానే గడిచిపోయాయి.తను అడిగిన వస్తువులు గురించి అడగాలంటే మాధవికి చాలా మొహమాటంగా అనిపించి ఫోన్ చేయకుండానే వాయిదా వేసుకుంటూ వచ్చింది మాధవి.


ఇన్నాళ్ళు పూనకం వచ్చినట్టు ఫోనుల్లో వూగిపోయిన అక్కాచెల్లెళ్ళు ఎవరో ఒకరు మాట్లాడకపోతే బాగుండదని ముందు పెద్ద దానిగా తనే కల్పించుకుని “ పిల్లాడు పరీక్షలు ఎలా రాశాడే? మధ్యలో డిస్ట్రబ్ చెయ్యడం బాగుండదని నేనే ఫోన్ చేయలేదు “ అంటూ మొహమాటపడుతూనే మాట్లాడింది మాధవి.


“ ఏదో రాసాడులే. వాడి రాతెలా వుందో ? మనం అనుకున్నవి అనుకున్నట్టు జరగాలని ఎక్కడుంది ? అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మొన్నటి వరకు విపరీతమైన ఎండలు అని చెప్పానా ? ఇప్పుడు ఒక పది రోజులనుండి ఒకటే వదలకుండా వర్షాలు పడుతున్నాయి. ఎప్పటికీ తెరిపిస్తుందో తెలియడం లేదు. నిన్ను నిరాశపరిచానని అనుకోకు. నువ్వు అంటున్నావు కానీ ఇప్పుడు ఈ మధ్య ఈ జిల్లాల వాళ్ళు ప్రత్యేకమైన శ్రద్ద తీసుకుని అన్ని రకాల వస్తువులు నాణ్యతగా చేసి అమ్ముతున్నారుట . ఒకసారి బావగారిని వాకబు చెయ్యమని చెప్పు . ఈ సారెప్పుడైనా పరిస్తితులు అనుకూలించాక నేను కూడా ఇక్కడ ప్రయత్నించి పంపుతాను “ అంటూ చావు కబురు చల్లగా చెప్పేసింది కుమారి.


విషయం అర్ధం చేసుకున్న మాధవి మొగుడు “ సరేలే. నువ్వు ఇంకా ఎవరినీ బలవంతం చేయకు. ఎవరి పరిస్తితులు వారివి. మన అవసరాలు ఎవరిమీద రుద్దకూడదు. నాకు విజయవాడలో తెలిసిన స్వగృహ ఫుడ్స్ షాపు వాడున్నాడు. వాళ్ళ దగ్గర ఆర్డర్ చేస్తున్నానులే . ఇక ప్రశాంతంగా వుండు “ అన్నాక ఇప్పుడు ఆమె గుండెలు తేలికయ్యి హాయిగా వూపిరి పీల్చుకుంది.


“భిన్న మనస్తత్వాల మధ్య జీవనాన్ని కొనసాగించాల్సిన ఈరోజుల్లో సాధ్యమైనంతవరకు అవతలి వ్యక్తుల మీద ఎంతో అవసరమైతే తప్ప ఆధారపడకూడదు. ఒకరికి సహాయపడటం మంచి లక్షణం అయినా ఉపకారానికి ప్రత్యుపకారం చెయ్యగలిగే సామర్ధ్యం వున్నప్పుడే ముందుకు వెళ్ళాలి. అలా లేని పరిస్తితిలలో ఎంత కష్టమైనా కూడా ఎవరి దారులు వారు అన్వేషించుకోవడం ఉత్తమమైన మార్గం .” ఆ రాత్రి తీసుకున్న ఆ నిర్ణయంతో మాధవిలో అప్పటివరకూ పేరుకుపోయిన సందిగ్ధత ,స్తబ్ధత ఒక్కసారిగా పంటాపంచలయ్యాయి .****


సమాప్తం


గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి


51 views0 comments

Comments


bottom of page