top of page

ఓ మానవతా మేలుకో!


'O Manavatha Meluko' written by Lakshminageswara rao Velpuri

రచన : లక్ష్మీనాగేశ్వర రావు వేల్పూరి

'ఆరోజు కార్తీక్ ఒక మంచి కొత్త కారు కొన్నాడు. ఆ ఊరిలో అదే మొట్టమొదటి "రేంజ్ రోవర్ ఎస్ యు వి’. ఎంతో హుషారుగా ఊరిలోని రోడ్లు తిరుగుతున్నాడు. కార్తీక్ తన చిన్ననాటి కలను సొంతం చేసుకున్నందుకు అమిత సంతోషంతో ఎంతో హుషారుగా కొత్త కారులో సాగిపోతున్నాడు.

కార్తీక తండ్రి ఆ ఊరిలోకి ఒక పెద్ద 'హోల్సేల్ వ్యాపారస్తుడు'. తండ్రితో పాటు వ్యాపారాన్ని దినదినాభివృద్ధి చేస్తూ, కార్తీక్ కూడా రోజంతా కష్టపడి శని, ఆదివారాలలో తన కొత్త కారుని తన స్నేహితులకు చూపించి వారి పొగడ్తలకు తనలో తనే గర్వపడుతూ, ఎక్కువ సౌండ్ తో కార్ లోని పాటలు పెట్టుకుని, కూల్ డ్రింక్ తాగుతూ రోడ్లన్నీ కలియ తిరుగుతున్నాడు. ఎక్కడైనా ట్రాఫిక్ సిగ్నల్స్ పడితే తన పక్కన ఉండే వాహనదారులు కూడా తళతళ మెరుస్తున్న 'నీలిరంగు రేంజ్ రోవర్ కార్' ను తదేకంగా చూస్తున్న దృశ్యాలు చూసి 'ఆహా ! నేనెంత అదృష్టవంతుడిని’ అనుకుంటూ తనలో తాను నవ్వుకుంటూ సాగిపోతున్నాడు.

అలా సంతోషంగా ఉన్న వేళ తన ఇంటికి తిరిగి వస్తూ ఉండగా ఆ రోడ్డులో ఎక్కడి నుంచో ఒక రాయి వచ్చి కారుకి తగిలింది. మరో రాయి వచ్చి కారుకు ఉన్న' విండ్ స్క్రీన్’ కి తగిలేసరికి, అన్ని వైపులా అద్ధం పగిలిన గీతలు పడేసరికి, తుళ్ళి పడ్డాడు కార్తీక్. సడన్ గా రోడ్డు మధ్యలోనే కారు ఆపి బయటకు వచ్చి “ఎవడ్రా వాడు.. నా కారు అద్దాల మీదకి రాళ్ళు విసిరింది? అయ్యో వెధవల్లారా! కొత్త కారు రా.. మీకేం పోయే కాలం వచ్చింది రా!” అంటూ పిచ్చివాడిలా అరుస్తూ కారు చుట్టూ తిరుగుతూ అటూ ఇటూ గాభరాగా చూస్తున్నాడు కార్తీక్.

. అంతలో రోడ్డు మీద ఉన్న జనాల మధ్యలో నుంచి ఒక 10 ఏళ్ల కుర్రాడు పరుగు పరుగున వచ్చి ' సార్ ! నేనే రాయి విసిరింది, నన్ను క్షమించండి!” అని కార్తీక్ దగ్గరికి రాగానే , ఆ కుర్రాడి చెంపలు చాలా గట్టిగా వాయించేసాడు కార్తీక్,

“ఒరేయ్! ఇది కొత్త కారు రా, వెధవ! నీ బాబు కడతాడా డబ్బులు! దాని ఖరీదు ఎంతో తెలుసా? పదివేల రూపాయలు రా! అంటూ కార్తీక్ ఆ కుర్రవాణ్ణి షర్టు పట్టుకుని లాగుతూ . గట్టిగా కొడుతున్న సమయంలో అక్కడ జనం పోగయ్యారు.

“ఉండండి సార్! ఎందుకు ఆ ఎదవ, రాయి విసిరాడో కనుక్కుందాం!!” అంటూ అందరూ అడిగే సరికి , బిక్క చచ్చి పోయిన వదనంతో చిరిగిపోయిన షర్టు తో కళ్ళు తుడుచుకొంటూ, " సార్! నా పేరు సారథి. నాకు ఎవరూ లేరు, ఒక అన్నయ్య తప్ప. మా అన్నయ్యకు రెండు కాళ్లు లేకపోవడం వలన, ఒక కుంటి బండిలో కూర్చోబెట్టి, బండి తోసుకుంటూ అన్ని బజార్లో అడుక్కుంటున్న వాళ్ళము కానీ ఈ రోజు అన్నయ్యని బండిలో కూర్చోబెట్టి బొచ్చె పట్టుకొని నేను అందరి దగ్గరికి వెళ్లి అడుక్కుంటున్న సమయంలో, ఎవరో ఒక పోకిరి కుర్రాడు మా అన్నయ్య కూర్చున్న బండిని గుద్దేసి ఎంతో వేగంగా పారిపోయాడు. మా అన్నయ్య అసలే కాళ్లు లేకపోవడం వలన కింద పడిపోయి లేవలేక పోయాడు. రోడ్డు తగిలి తలకి పెద్ద గాయమై రక్తం కారుతున్న అన్నయ్యను లేప లేక నేను అవస్థ పడ్డాను. గంటసేపైనా ఏ ఒక్క మనిషి సాయం రాక, ఒక ఆటో గాని, కారు గాని చూసి కూడా ఆపకుండా 'ఆ ముష్టి వెధవలకి అలా జరగాల్సిందే, మీ చావు మీరు చావండి !’ అంటూ తిడుతూ వెళ్ళిపోతున్నారు. ఒక్కళ్ళు కూడా వచ్చి సాయం చేసి అన్నయ్యను కుర్చీలో కూర్చోబెట్టి ఆసుపత్రికి తీసుకు వెళ్ళలేదు. ఎంత ఏడ్చినా, మొత్తుకున్నా, ఒక్కరు కూడా సాయం చేయకపోయే సరికి విసిగిపోయి రోడ్డుమీద రక్తం కారుతూ చచ్చిపోతున్న నా అన్నయ్య ని చూస్తూ..

నేను అన్న ని ఎత్తలేక, ఎవరు సహాయం రాక, కోపంతో ఎవరైనా ఆపుతారు కదా నని చేతకాని తనం తో రాళ్లు విసిరాను. అదే రాయి మీ కారు కి తగిలింది, నన్ను క్షమించండి, అయ్యా!!” అంటు కాళ్ళు పట్టుకుంటున్న సారధిని చూసి ఆశ్చర్యంతో నోట మాట రాక అచేతనుడు అయిపోయాడు కార్తీక్.

కొద్ది సేపటికి తేరుకుని వెంటనే సారధి ని లేవదీసి, “పదరా ముందు! మీ అన్నయ్య ని చూపించు” అంటూ వడివడిగా జనాల్ని తప్పించుకుంటూ, రోడ్డుకి అవతల వైపుకు వెళ్ళాడు. రక్తపుమడుగులో పడివున్న ఒక 15 ఏళ్ల కుర్రాడిని అందులోనూ రెండు కాళ్లు లేక సృహ తప్పి పడి ఉన్న అబ్బాయిని చూసి కార్తీక్ మనసు ద్రవించి పోయింది. వెంటనే తన హోదాని మరచి , సారధి అన్నయ్యను రెండు చేతులతో ఎత్తుకొని తన గుండెకు ఆంచుకొని రక్తంతో తడిసిపోతున్నతన బట్టలను గురించి కూడా పట్టించుకోకుండా, తన కారు వద్దకు సారధి వెంటరాగా, సారధి అన్నయ్యను 'బ్యాక్ సీట్ 'లో పడుకోబెట్టి అంతే వేగంగా ఒక ' కార్పొరేట్ హాస్పటల్' కు చాలా స్పీడ్ గా వెళ్లి, జాయిన్ చేశాడు. ఇదంతా చూస్తున్న జనం కూడా ఈ పని 'మనం చేయలేకపోయాము' అనుకొని సిగ్గుతో తలవంచుకొని, ఎవరి దారిన వారు వెళ్లిపోయారు.

రెండు రోజులపాటు సారధి వాళ్ళ అన్నయ్య తో పాటు ఉండి, పది కుట్లు పడ్డాక, డాక్టర్ గారు ఇక ఫరవాలేదు తీసుకు వెళ్ళండి! అని చెప్పగానే సారథి ఆనందంతో కార్తీక్ ను పట్టుకుని " సార్ మాకు ఏదైనా పని చెప్పండి, మీకు జీవితాంతం పని చేస్తాము. ఎక్కడో లేడు దేవుడు. మీలోనే ఉన్నాడు” అంటూ ఆ ఇద్దరూ ఎంతో కృతజ్ఞత తో కన్నీళ్లతో చెప్తున్న అభ్యర్థనను విని , నవ్వుతూ ' ఒరే సారథి, నువ్వు నాకు తమ్ముడు లాంటి వాడివి. మీ అన్నయ్య బాగోగులు, నీ చదువు.. అన్నీ నేనే దగ్గరుండి చూస్తాను! అని వారిద్దరికి తన ఇంట్లోనే పెరట్లో ఉన్న ఒక గది ఇచ్చి, అన్ని వేళలా భోజనం అందేలా చూస్తూ, తన మానవత్వాన్ని నిరూపించుకున్నాడు కార్తీక్.

***శుభం***


41 views0 comments

Comments


bottom of page