top of page

ఓ సాంబయ్య కథ


'O Sambaiah Katha' New Telugu Story


Written By Kotthapalli Udayababu


రచన : కొత్తపల్లి ఉదయబాబు


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

కార్తీక మాసం ప్రారంభం అయిన తరువాత మొదటి సోమవారం. తన కన్నా ముందే లేచి తలకు స్నానం చేసిన సాంబయ్య “ఆయమ్మా! నేను అలా శివాలయానికి వెళ్ళి వస్తాను. ఈవేళ మొదటి కార్తీక సోమవారమంటగా. ’’ అని అడిగాడు, వీధి అరుగుమీద కూర్చుని దూది వత్తులు చేసుకుంటున్న సరస్వతిని.


‘’అవును. వెళ్ళి రా బాబు. జాగ్రత్త. తొందరగా వచ్చేయ్” అన్న సరస్వతి, అరుగుమీద కూర్చునిపోయి ఎదురుగా ఉన్న డాబాకేసి చూసింది. అది మూడేళ్లక్రితం నరసయ్య ఇల్లు. ఈవేళ కొనుక్కుని ఉంటున్నవాళ్లది. హు.. ఆ దేవుడు ఎవరికి ఎపుడు ఎక్కడ ఎలా రాసిపెడతాడో? అనుకుంటూ గతంలోకి జారుకుంది.


* * *


"ఏరా ఇంతలేటయ్యింది... అయిందా అన్ని దేవుళ్ళకు మొక్కడం... అన్ని చెట్ల చుట్టూ ప్రదక్షిణాలు చెయ్యడం? ఈ కార్తీకమాసం పీడ ఎప్పుడు వదులుతుందో గాని... చస్తున్నాను నీతో. " సాంబయ్య ను చూస్తూనే కయ్ మని లేచాడు కిరాణాకొట్టు నరసయ్య.


"నీతో చెప్పే ఎల్లాగా.. అట్ఠా తిడతావేంది? ఈయేలా ఏమైందో తెలుసా... ఎవరో ఒకాయన.. మంచి రచయితంట.. మనూల్లో కమ్యూనిటీ హాల్లో సన్మానం సేత్తన్నారంట. హోటల్లో దిగినాడంటా... స్నానం సేసి ఊళ్ళో గుళ్ళు సూడ్డానికి బయల్దేరాడంట. దారిలో నన్ను ఆపి 'దగ్గర్లో గుళ్లు ఏమన్నా ఉన్నాయా' అని అడిగాడు. అతనికి అన్నీ చూపించాక నా గురించి అడిగాడు. నీదగ్గర పనిచేస్తున్నానని చెప్పాను. టీ తాపించాడు. అతన్ని పంపేసి వచ్చేసరికి రోజూకన్నా పది నిముసాలు లేటయ్యింది. అంతేగా. ఈ మాత్రం దానికే తిడతావే? ఇదుగో పెసాదం. "అని నరసయ్య చేతిలో పెట్టాడు సాంబయ్య.


"ఈ ప్రసాదం తినందే గల్లా పెట్టి తెరవనని తెలుసు గదా. సరే వెళ్లి టిఫిన్ తిను. "అని పురమాయించాడు నరసయ్య.


సాంబయ్య '' అత్తా, సాంబయ్య వచ్చాడు, టిఫిన్ పెట్టావా?'' అంటూ లోపలికి వెళ్ళాడు.


ఇదంతా ఎదురింటి కిటికీలోంచి చూస్తున్న సరస్వతి సాంబయ్యకేసి జాలిగా చూసింది. ఆ జాలి బాధగా మారి గుండెల్లోకి దిగింది.


సరస్వతి ముప్పై అయిదేళ్లు గా ఆ వూళ్ళో ఉంటోంది. ప్రభుత్వ ఆసుపత్రిలో పురుళ్ళు పోసే నర్సుగా పనిచేసి రిటైర్ అయింది. ఈవేళ ప్రభుత్వం చేపట్టిన పధకాలు, విధివిధానాలు అన్నీ మారిపోయాయి. గ్రామసేవికలు ఇంటింటికీ వచ్చి తమకు కేటాయించిన గ్రామంలో గర్భం ధరించిన స్త్రీల వివరాలు నమోదు చేసుకుని బిడ్డ ప్రసవించేవరకూ అనేక రకాలుగా వారిని సాకి, చక్కని బిడ్డను ప్రసవింపచేసి, ఆబిడ్డకు మూడు నెలలు వచ్చే వరకు అన్నివిధాలా సాకుతున్నారు.


పూర్వం ఎటువంటి కనీస సౌకర్యాలు లేని రోజుల్లో, ఫలానా వారి పిల్ల గర్భం దాల్చిందంటే చాలు, తననే పిలిచేవారు. తనకు తెలిసిన పరిజ్నానమ్ మేరకు ఆమెకు సుఖప్రసవం అయ్యేవరకు యే మందులు ఎలా వాడాలో చెప్పి, దగ్గరుండి ఆచరించేలా చేసేది. ప్రసవం అయ్యాక తల్లీ బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఎదుగుతూ ఉంటే ఆ కుటుంబ పెద్దలు ''సరస్వతమ్మ హస్తవాసి మంచిది'' అని సంతోషపడుతుంటే తనకు ఎంతో ఆనందం అనిపించేది. అలా వూళ్ళో కులం, మతం, జాతి, వర్గం తేడా లేకుండా ఎందరికో పురుళ్ళు పోసింది. వాళ్ళల్లో సాంబయ్య తల్లి కూడా ఉంది.


సాంబయ్య తండ్రి వాసుదేవమూర్తి ఆ వూరి కరణంగారికి ఒకే ఒక్క కొడుకు. పట్నంలో మంచి చదువు చదివి పలుకుబడి ఉపయోగించుకుని తమ వూళ్లోనే ప్రాధమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా వేయించుకున్నాడు కరణం గారు. అటు ఉద్యోగం చేసుకుంటూ ఇటు తండ్రి వెనకాలే ఉంటూ చేదోడు వాదోడుగా ఉండే వాసుదేవమూర్తి గుడి పూజారిగారి అమ్మాయి శ్రీలతని ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. కరణంగారికి యేమాత్రం ఇష్టం లేకపోయినా ఆసరాగా ఉన్న కొడుకు ఇంట్లోంచి వెళ్లిపోతాడనే ఉద్దేశంతో ఒప్పుకోక తప్పలేదు.


వూళ్ళో ఏకైక శివాలయానికి ధర్మ కర్తగా ఉంటూ తన మోచేతి నీళ్ళు తాగి బతికే పూజారి కుటుంబం అంటే కరణంగారికి చాలా చులకన. అటువంటి ఇంటి అమ్మాయి తన కోడలు అయినందుకు ఆయనకు పుండుమీద కారం రాసుకున్నట్టే ఉండేది.


వాసుదేవమూర్తికి ఆ వూరిలో ఒకే ఒక్క నేస్తం కిరాణా కొట్టు నరసయ్య. చదువుకునే రోజుల్లో ఆ వూరునుంచి పట్నం వెళ్ళి చదువుకొచ్చిన మగవాళ్ళు వాళ్ళిద్దరే. వూరు వూరంతా వారి చదువు గురించి, ఒకరంటే ఒకరికి ప్రాణంగా బతికే స్నేహం గురించి కధలుగా చెప్పుకునేవాళ్లూ.


వారి స్నేహాన్ని మరింత బలపరుస్తూ వాసుదేవమూర్తికి పెళ్ళైన నాలుగో నెలలోనే నరసయ్యకు పెళ్లి కావడం, వాసుదేవమూర్తికి సాంబయ్య పుట్టిన నాలుగు నెలలకే నరసయ్యకు కొడుకు పుట్టడం, అలాగే ఇతనికి కూతురు పుట్టిన నాలుగు నెలలకే అతనికి కూతురు పుట్టడం యాదృచ్ఛికంగా జరిగిపోయాయి.


సాంబయ్యకు మూడో సంవత్సరం నడుస్తుండగా, ఒకరోజు యేనాడూ తన ముందు మాట మాట్లాడని కోడలు శ్రీలత, మావగారు తన పుట్టింటివారిని తీవ్రంగా కించపరచి మాట్లాడటంతో భరించలేక చంకలో ఉన్న కూతుర్ని సముదాయిస్తూనే, ఏడుస్తూ సమాధానం చెప్పేసింది. దాంతో ఉగ్రుడైపోయిన కరణంగారు కోపంతో కోడలిమీద చెయ్యెత్తాడు. ''మా అమ్మని ఎందుకు కొడుతున్నావ్ తాతా?'' అని మూడేళ్ళ సాంబయ్య ముద్దు మాటలతో తల్లికి చుట్టుకుపోయాడు.


ఆ కోపంలో కోడలిని ఏమీ చేయలేక సాంబయ్యను యెత్తి పెరట్లోకి విసిరేసి, ''ఈ గొడవ నా కొడుక్కి తెలిసిందో మీ నాన్నని ఈ వూళ్లోనే లేకుండా చేస్తాను జాగ్రత్త '' అని తీవ్రంగా హెచ్చరించి వీధిలోకి వెళ్లిపోయాడు కరణంగారు.


ఆ విసురుకు సాంబయ్య పెరట్లోని సిమెంట్ నూతి గట్టుకు తల తగిలి, నూతి పళ్ళెంలో సొమ్మసిల్లి పడిపోయాడు.


'' అమ్మబాబోయ్. నా బిడ్డ చచ్చిపోయాడు. '' అని చంక లోని బిడ్డను కింద కుదేసి సాంబయ్య ముఖం మీద నీళ్ళు చల్లి, పిల్లవాడిని తెప్పరిల్లజేసి, ఉన్న ఫలానా రమ్మని తనకు పనివాడితో కబురు పెట్టింది శ్రీలత.


ఎవరికో పురుడుపోసి అపుడే ఇంటికి వచ్చిన తను వెళ్ళి సాంబయ్యని పరిశీలించింది. తలలో గట్టి బొప్పి కట్టింది. అంటే గానీ పెద్ద దెబ్బలేమీ తగల్లేదు. తనని విసురుగా ఎత్తేసరికే పిల్లవాడి శరీరం అసంకల్పిత ప్రతీకార చర్యకు సిద్దమై వాడి మెదడు స్తబ్ధతకు గురైన కారణంగా వాడికి యే దెబ్బలు తగలలేదని గ్రహించింది. ''గట్టి పిండమే.. దేవుడు చల్లగా చూశాడు. '' అనుకుంది తను.


ఇదంతా జరిగినపుడు వాసుదేవ మూర్తి మూడు రోజుల ట్రైనింగుకు కాకినాడ వెళ్ళాడు.


భర్త వూరినుంచి వచ్చాక జరిగింది చెప్పింది శ్రీలత. అటు తండ్రిని ఏమీ అనలేక, ప్రేమించిన భార్యను ఏమీ అనలేక మధనపడ్డాడు వాసుదేవమూర్తి. ఆ సంఘటన జరిగిన పదిరోజుల తరువాత పొలంలో పాము కరిచి అక్కడకక్కడే నురుగులు కక్కుతూ చనిపోయాడు కరణంగారు.


ఎంతో చలాకీగా బాలకృష్ణుడిలా అల్లరి చేసే సాంబయ్య అప్పటినుంచి సరిగా మాట్లాడలేకపోయేవాడు. ఇదివరకు స్పష్టంగా మాట్లాడే మాట, ఇపుడు ముద్దగా రావడం గమనించారు వాసుదేవమూర్తి దంపతులు. ఎందరో డాక్టర్లకు చూపించారు. అందరూ చెప్పినదొకటే. మెదడులో వోకల్ కార్డ్స్ కేంద్రం లో దెబ్బ తగలడం వలన మందమతి లా ఉంటాడని, మాట కొంచెం ముద్దగా వస్తుందని చెప్పారు. తమ వూరి శివాలయంలోని శివుడి పేరును ఎంతో ఇష్టపడి పెట్టుకున్న సాంబయ్య గురించి డాక్టర్లు అలా చెప్పేసరికి మానసికంగా ఎంతో కుంగిపోయాడు వాసుదేవమూర్తి.


అతను ఈ బాధలో ఉండగానే మరో ఘోరం జరిగిపోయింది. పాపకు కలరా జ్వరం రావడం తో పట్నంలో వైద్యం కోసం తీసుకువెళ్లిన శ్రీలతకు కూడా కలరా వ్యాపించి తల్లీ కూతురు రెండురోజుల తేడాలో మరణించారు. దాంతో మతి పోయినంత పని అయింది వాసుదేవ మూర్తికి. అటు ప్రేమించి పెళ్లిచేసుకున్న భార్యమరణించడం, ఇటు ఎంతగానో ప్రేమించే కన్నకొడుకు మతిమాలిన వాడిలా అయిపోవడం అతన్ని చాలా క్రుంగదీశాయి.


మానసిక వేదనతో కుంగిపోతున్న అతని దగ్గరకు వెళ్ళి సాంబయ్యను తాను సాకుతానని, పనులు చూసుకోవడం లో పడితే ఆలోచనలు తగ్గుతాయని సూచించడంతో అతను సాంబయ్యను తన వద్ద వదిలి పట్నం వెళ్లిపోయాడు.


మూడు నెలలు గడిచాయి. సాంబయ్య తనకి బాగానే మాలిమి అయ్యాడు అనుకునేటంతలో వూపిరితిత్తులు బాగా చెడిపోయీ ఇక లాభం లేదు అని డాక్టర్లు చెప్పిన సలహాతో ఇంటికి చేరిపోయాడు వాసుదేవమూర్తి. స్నేహితుడి పరిస్థితి చూసి అంతవరకు పెద్దగా పట్టించుకొని నరసయ్య తన వ్యాపారాన్ని చూసుకోవడానికి భార్యను నియమించి వాసుదేవమూర్తికి తోడుగా ఎక్కువగా గడపసాగాడు.


స్నేహితునిమీద నమ్మకంతో సాంబయ్యను అతని చేతుల్లో పెడుతూ తనకున్న పాతిక ఏకరాలపొలాన్ని సాంబయ్య పెళ్లి అయ్యాకా మాత్రమే అతనికి చెందేలా చూడమని, ఇల్లు వాళ్ళకు పుట్టిన బిడ్డకు(అంటే తన మనవడికి) చెందేలా వీలునామా రాసి నరసయ్యకు అప్పగించి నెలతిరగకుండానే కన్ను మూశాడు వాసుదేవమూర్తి.


సాంబయ్య బాధ్యత ఎపుడైతే నరసయ్య తీసుకున్నాడో అప్పుడే దిగులు పట్టుకుంది సరస్వతికి.


తాను లేని లోకంలో తల్లి లాంటి సరస్వతి స్త్రీ దక్షత కన్నా, నరసయ్యలాంటి మగదక్షత సాంబయ్యకు అవసరమని భావించి ఆ ఏర్పాటు చేశాడు వాసుదేవమూర్తి.


వాసుదేవమూర్తికి తెలియనిది, ఊరందరికి తెలిసినది నరసయ్య డబ్బు మనిషి అని. ఒకరిద్దరు చనువుగా చెప్పబోయినా "వ్యాపారం చేసుకునేవాడికి ఆమాత్రం డబ్బు కాపీనం ఉండటం సహజమే. "అని తోసిపుచ్చాడు.


ఈ ప్రపంచంలో డబ్బు మహా పాపిష్ఠిది. ఇద్దరు నమ్మకస్తుల మధ్య బీట గా మొదలై, పగుళ్లుగా తేలి, ముక్కలుగా విడిపోయి, ఎవరికి వారుగా చేసే అద్భుత చెడ్డగుణం డబ్బుది.


సరిగ్గా ఆరోజుల్లోనే కూతురికి పెళ్లి కుదరడం, కొడుకు విదేశాలకు పై చదువులకు వెళ్లవలసి రావడంతో ఎం చెయ్యాలో తెలియక తలపట్టుకుని కూర్చున్న అతనికి భార్య తిరుగులేని సలహా ఇచ్చింది.


అంతే... వారం రోజుల్లో సాంబయ్య పెళ్లి, పట్నం అమ్మాయితో జరిగిపోయింది.


అది జరిగిన వారం రోజుల్లోనే తన భర్త సంసారానికి పనికిరాడని, తాను అతనితో కాపురం చేయలేనని, అతని వల్ల నాశనమైన తనజీవితానికి భరణం కోరుతూ కోర్టులో కేసువేసింది. పెళ్లి అయిన వెంటనే అతనికి మొత్తం ఆస్తి సంక్రమించడంతో నరసయ్య పెద్దరికం వహించి సగం పొలం ఆమెకు భరణంగా ఇవ్వక తప్పిందికాదు. మిగతా సగం పొలం, ఇల్లు తన ఆధీనంలో ఉంచుకుని సాంబయ్యని తనకొట్లో పనివాడిగా మార్చేశాడు నరసయ్య.


అయితే ముందే ఆ పెళ్ళికూతురుతో జరువుకున్న చీకటి ఒప్పందం ప్రకారం ఆమెకు భరణంగా వచ్చిన వాటా ఎకరాల్లో సగం తన వాటాగా అమ్మించేసి ఆ డబ్బుతో కూతురి పెళ్ళి ఘనంగా చేసి, కొడుకుని పైచదువులకు విదేశాలకు పంపించేసాడన్నది సరస్వతితో పాటు ఎవరికి తెలియని రహస్యం.


ఊరు ఊరంతా సాంబయ్యపట్ల జాలి ప్రదర్శిస్తే... కడుపు చెరువు చేసుకుని బాధపడింది సరస్వతి ఒక్కతే.


భగవంతుడా... సాంబయ్య జీవితం ఓ దారిన పడేలా చూడు తండ్రి అని మనసారా ప్రార్ధించింది.


ఆమె మొర దేవుడు ఆలకించాడో ఏమో... ఒకరోజు సాంబయ్య వచ్చి "ఆయమ్మా... నిన్ను మావయ్య రమ్మంటున్నాడు. "అని పిలిచాడు.


"ఏంటి నరసయ్యా.. రమ్మన్నావంట" సరస్వతి కిరాణా కొట్టు గట్టు మీద కూచుని అడిగింది.


"ఇక్కడ కాదు. లోనికి పద. " ఇంట్లోకి దారితీసాడు నరసయ్య.


"నాకా శక్తి అయిపోయింది. మా అల్లుడు యాపారం మానేసి నా దగ్గరకొచ్చేయండి మావయ్య అంటున్నాడు. అబ్బాయి కూడా బాగా సంపాదించుకున్నాడు. ఆ మిగిలిన పొలము అవి అమ్మేసి బావ దగ్గరకి నగరం వచ్చేయండి అని పొరుపెడుతున్నాడు. ఏంచేయాలో తోచక నిన్ను సలహా అడుగుదామని పిలిచాను. " అన్నాడు


"మరి సాంబయ్యని ఏంచేద్దామని?"


"వాడిని వాడి పొలాన్ని నీ కప్పగించేసి వెళదా మనుకుంటున్నాను. నేనే తొందరపడి పెళ్లి చేసి వాడి జీవితం పాడు చేసాను. ఆ అమాయకుడికి అన్యాయం చేశానన్న ఆలోచన నన్ను నిద్రఓనివ్వడం లేదు. వాసు ఎదురుగా నిలబడి ఇదేమిట్రా.. ఇలా చేశావ్ నా కొడుకు జీవితం? అని అడుగుతున్నట్టే ఉంది. పోనీ నగరం తీసుకుపోదామంటే అక్కడ వాడిని బతకనీయరు. నీ ఉద్దేశం ఏమిటి,?"


" నాకు ఓపిక ఉన్నంతకాలం చూస్తాను. నాకూ ఓపికలేనినాడు వాడిని తీసుకుని ఏ వృద్ధాశ్రమంలోనో చేరిపోతాను. ఇంతకాలం తండ్రిలేని లోటు తీర్చావ్ వాడికి. ఇకనైనా విశ్రాంతి అవసరం నీకు. నాకేమీ అభ్యంతరం లేదు. "అంది సరస్వతి


వారం రోజుల్లోనే సాంబయ్యని అతని కాగితాలను సరస్వతికి అప్పగించి కుటుంబంతో కూతురు దగ్గరకి శాశ్వతంగా వెళ్ళిపోయాడు నరసయ్య.


అలా సాంబయ్య ఎవరూ లేని తనికి తన పెంపుడు కొడుకయ్యాడు.


" ఆయమ్మా... మన ఇంటికి ఎవరొచ్చారో చూడు", అన్న సాంబయ్య మాటలు విని ఈ లోకం లోకి వచ్చింది సరస్వతి. సాంబయ్య వెనుక ఉన్న వ్యక్తిని చూపించి.


"ఎవరి బాబూ మీరు?"అడిగింది సరస్వతి ఆయన్ని కూర్చోబెట్టి మంచినీళ్లు ఇస్తూ.


"మూడేళ్ళ క్రితం మనూరు సన్మానానికి వచ్చారని చెప్పానే... ఆయనే... "సంతోషంతో చెప్పాడు సాంబయ్య.


"బాబు... మీరా.. వీడిని ఎలా పట్టుకున్నారు?"అడిగింది సరస్వతి.


"అతను ఎంత అమాయకుడో నేను ఆనాడే గ్రహించానమ్మా. అందుకే వెతుక్కుంటూ అతను చూపించిన గుళ్లకే వచ్చాను. దొరికాడు. అతను ఆనాడే తనకధను నాకు చెప్పాడు. ఇందులో నా స్వార్ధం కూడా ఉంది. నాకు ఒక్కతే అమ్మాయి. ఆమె కి ఐదేళ్ల కిందట పెళ్లి చేసాను. ఆమెకు ఒక అబ్బాయి. అల్లుడు కారు ప్రమాదంలో మరణించాడు. ఆమె ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం చేస్తోంది. ఆమెకు రెండో పెళ్లి చేయాలని నా ఉద్దేశం. ఈవయసులో ఆమె డబ్బుకోసం తప్ప తోడుకోసం ఎవరూ వివాహం చేరుకోవడానికి రారు. తమకి అభ్యంతరం లేకపోతే సాంబయ్యగారికి మా అమ్మాయిని ఇద్దామని. నాపేరు కరుణాకరం. " అన్నాడయన.


"ఎంతటి శుభవార్త చెప్పారు బాబు. అందుకే ఆ దేవుడు మిమ్మల్నిద్దరిని తన గుడిలో కలిపాడేమో. వాడికంటూ ఎవరూ లేరు. నేను ఎ ప్పుడు రాలిపోతానో నాకే తెలీదు.


ఈ శుభకార్యం జరిగితే మీరే మాకు ఉపకారం చేసినవారవుతారు. ఏరా నాన్న... వారి అమ్మాయిని చేసుకుంటావా?"అడిగింది సరస్వతి నవ్వుతూ.


"నన్ను కన్నబిడ్డలా సాకినదానివి.. నా మంచి చెడు నీకే తెలుసు ఆయమ్మా. నీకిష్టమైతే తప్పక చేసుకుంటా.

నాకు ఇష్టమే మావయ్యగారు. " అన్నాడు సాంబయ్య.


సరస్వతి, కరుణాకరం లు కళ్ళు మూసుకుని సంతృప్తితో భగవంతునికి నమస్కరించుకుంటూ ఉంటే అది చూసి తన దేవుడు శివయ్యకు సాంబయ్య కూడా నమస్కరిస్తూ మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకున్నాడు. అవే శుభ ఘడియలు అన్నట్టుగా దగ్గరలో ఉన్న కోవెలగంటలు గణగణా మోగసాగాయి!


సమాప్తం

కొత్తపల్లి ఉదయబాబు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం



మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



Podcast Link

Twitter Link


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

పేరు : కొత్తపల్లి ఉదయబాబు పుట్టిన తేదీ : 01/07/1957 విద్యార్హతలు : M.Sc., M.Ed., M.phil (maths) నిర్వహించిన వృత్తి : ప్రధానోపాధ్యాయులు


తల్లి తండ్రులు : శ్రీ కొత్తపల్లి గంగాధర్ శర్మ, విశ్రాంత హెడ్ పోస్ట్-మాస్టర్ స్వర్గీయ శ్రీమతి సుబ్బలక్ష్మి. భార్య : శ్రీమతి సూర్యకుమారి కుమార్తె : చి. సౌ. గుడాల సుబ్బ లక్ష్మి సంతోషిత , M.B.A. w/o లక్ష్మికాంత్ – లాయర్ మనుమరాలు : చి. లక్ష్మి పూర్ణ సాధ్వి కుమారుడు : చి. హనుమ గంగాధర్ శర్మ , సాఫ్ట్-వేర్, h/o చి.సౌ.తేజశ్రీ మనుమలు : చిరంజీవులు గహన్ ముకుంద, ఋషిక్ వశిష్ట.

*వృత్తి పరంగా :

*జిల్లాస్థాయి, రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనల పోటీలలో వివిధ అంశాలలో బహుమతులు, క్విజ్,సాంకేశృతిక కార్యక్రమాల నిర్వహణ, న్యాయ నిర్ణేతగా వ్యవహిరించిన అనుభవం.

*పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 2002 లో తొలిసారిగా ఐదుగురు విద్యార్థులకు నూటికి నూరు మార్కులు రావడం ఆ సందర్భంగా అరకాసు ఉంగరం బహుమతిగా అందుకోవడం ఒక చక్కని ప్రోత్సాహం, ఉత్సాహం. అలా మొత్తం సర్వీసులో నూటికి నూరు మార్కులు దాదాపు తొంభై మందికి పైగా విద్యార్థులు పొందగలగడం వృత్తిపరంగా సంతృప్తిని కలిగించిన విషయం.

*జిల్లా స్థాయిలో అధికారికంగా నిర్వహించిన భౌతిక శాస్త్ర,గణిత శాస్త్ర సదస్సులకు రిసోర్స్ పర్సన్ గా వ్యవహరించడం.

*జిల్లా ఉమ్మడి పరీక్షల సంస్థకు అయిదు సంవత్సరాలపాటు ఎక్కువమంది విద్యార్హులు గణితంలో ఉత్తీరర్ణతాశాతం పొందదానికి అవసరమైన విజయ సూచిక, విజయ సోపానాలు... పుస్తకాలను ప్రభుత్వం తరపున రూపొందించుటలో ''గణిత ప్రవీణుడు''గా వ్యవహరించడం.

*ఆకాశవాణిలో కథానికలు, నాటికల ప్రసారం,అవగాహనా సదస్సులలో పాల్గొనడం, రేడియో నాటక కళాకారునిగా మూడు సంవత్సరాలు విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో పాల్గొనడం..మొదలైనవి


ప్రవృత్తి పరంగా :

*కథా రచయితగా రచనలు :

1. *అందమైన తీగకు...! - 25 కధల మాలిక (2003) 2. *చిగురు పిట్టలు* - నానీల సంపుటి (2007) 3. ఉదయబాబు *మాస్టారి' కధానికలు* - ఉదయకిరణాలు (2015) 4. *అమ్మతనం సాక్షిగా*... కవితా సంపుటి (2015) 5. *నాన్నకో బహుమతి* - 16 కథల సమాహారం (2019-.) జీ.వి.ఆర్. కల్చరల్ అసోసియేషన్ వారు నిర్వహించిన కథాసంపుటుల పోటీలలో ద్వితీయ బహుమతి పొందిన కథల సంపుటి) 6. ఆయన మా నాన్నగారు ( దీర్ఘ కవిత - త్వరలో )

నవలలు : 1 . లేడీ సింగర్ (2 భాగాలు )

2 . మనసు చేసిన న్యాయం(ప్రతిలిపి వారు మార్చి 2202 లో నిర్వహించిన ధారావాహికల పోటీలో ప్రోత్సాహక బహుమతి పొందినది)

ప్రేరణ : నాన్నగారు...ఆయన నాటక రచయిత,దర్శకుడు,ఉత్తమ నటుడు(18 నాటక పరిషత్తులలో)

*సామాజిక సేవ : రక్తదాన కార్యక్రమం లో, లయన్స్ క్లబ్ వారి కార్యక్రమాలలో విరివిగ పాల్గొనడం .

తెలుగు సాహిత్యానికి సేవ : తెలుగు సాహితీ సమాఖ్య లో కార్యకర్తగా, సంయుక్త కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షునిగా తెలుగు సాహిత్యానికి విశేష కృషి , జిల్లా స్థాయిలో ర్యాలీల నిర్వహణ ...అష్టావధానం, త్రీభాషా శతావధానం లలో పృచ్చకునిగా 46 సంవత్సరాలపాటు ప్రతీ నెల సాహితీ స్రష్టల ప్రసంగాలు...విద్యార్హులకు వివిధములైన పోటీల నిర్వహణ,

పత్రికా రంగం లో : వ్యంగ్య చిత్రకళ లో పలు కార్టూన్లు వేయడం. :*1999 - జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడు - పశ్చిమ గోదావరి జిల్లా*

*2000 - యువసాహితీ సహస్రాబ్ది అవార్డు - ఆంద్ర ప్రదేశ్ సాంస్కృతిక సమాఖ్య* *2011 - సోమేపల్లి సాహితీ పురస్కారం* *2016 - గోదావరి మాత అవార్డు - ఉంగుటూరు ఎం.ఎల్.ఎ, శ్రీ గన్ని వీరంజనేయులుగారి చే- గణపవరం - పశ్చిమ గోదావరి జిల్లా *ఉండి ఎం.ఎల్.ఎ. శ్రీ వి.వెంకట శివరామరాజు గారి చే ''ఉగాది పురస్కారం*

*పాలకొల్లు - కళాలయ సంస్థవారిచే " కధాభారతి" బిరుదు ప్రదానం*.

*జన విజ్ఞానవేదిక - భీమవరం వారిచే " ఉగాది పురస్కారం" ....సుమారు నూటికి పైగా సన్మానాలు సత్కారాలు...ఇంకా ఎన్నో..

Youtube :1. తెలుగు కథను ప్రపంచ వ్యాప్తం చేయాలనే ఉద్దేశ్యంతో ప్రస్తుతం "Mastaru Kadhalu 'in' Telugu " ఛానెల్ ద్వారా నా కథలతో పాటు దాదాపు 25 మంది రచయితల కథలు (ఈనాటికి 420 కధల ఆడియో వీడియోలు)చదివి వీడియోలుగా మలుస్తూ ఉచిత సేవగా అందించడం జరుగుతోంది.

2.KUBDevotionalWorld అనే ఛానల్ ద్వారా శ్రీ భగవద్గీత 700 శ్లోకాలను ప్రతీరోజు 5 శ్లోకాలను భావాలతో సహా వీడియోలుగా చదివి అందించడం జరుగుతోంది.

3. UDAYABABUMathsBasics యు ట్యూబ్ ఛానెల్ ద్వారా విద్యార్థులకు గణితంలో మౌలిక భావనల బోధన

ప్రస్తుత నివాసం : 2010 లో సికింద్రాబాద్ సైనిక్ పురి లో స్థిరనివాసం ఏర్పరచుకుని ఇప్పటికీ కధా రచయితగా, బాలల కథారచయితగా కొనసాగడం.

*చివరగా నా అభిప్రాయం :*

ఇప్పటికీ నా కవితా ప్రస్తానం, కధా సాహితీ సేద్యం కొనసాగుతోంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం లో చెట్టు నాకు ఆదర్శం.

కవిగా రచయితగా తమ సాహితీ ప్రస్తానం కొనసాగిన్చాదలుచుకున్న యువత అంతా పాత సాహిత్యాన్ని బాగా చదవాలి. 'వెయ్యి పేజీలు చదివి ఒక్క పేజీ రాయి' అన్న ఒక మహాకవి వాక్యాలు స్పూర్తిగా తీసుకుని నిన్నటి రచన కన్నా, నేటిది, నేటి రచన కన్నా రేపటిది మరింత మెరుగుపరచుకుని ఈ రంగం లో తమకంటూ ఒక ప్రత్యెక స్థానాన్ని ఏర్పరచుకోవాలని, ఆ దిశగా వారి సాహితీ ప్రస్తానం కొనసాగాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ.. ...సాహిత్యాభినందనలు.

కొత్తపల్లి ఉదయబాబు

సికింద్రాబాద్


52 views0 comments
bottom of page