top of page

ఆఫీసులో ఒక రోజు


'Ofisulo Oka Roju' written by Bodapati Ramesh

రచన : బోడపాటి రమేష్

‘అమ్మయ్య!’ అనుకుంటూ సీట్లో కూలబడిన వ్యక్తి సెక్షన్ హెడ్ శేషావతారం. ఈ అమ్మయ్య అనుకోవటం ఆయన ఆ రోజు ఆఫీసులో స్థిమితపడ్డాడని చెప్పటానికి సంకేతం. భార్య హడావుడిగా షడ్రుచిరహితంగా (ఆయనకు బి.పి.) చేసిన నాలుగు మెతుకులు నోట్లో వేసుకుని అదే రకంగా చేయించుకున్న టిఫిన్ ఉరఫ్ లంచ్, బాక్స్ లో పెట్టుకుని నురుగులు కక్కుతూ రెండు బస్సులు మారి, ఆఫీసు ఆవరణలో పడి సీటులో స్థిమిత పడి ‘అమ్మయ్యా! ‘అనుకున్నాడు.హోదాకు సెక్షన్ హెడ్ కావటంతో తన తలను సెక్షన్ అంతా లైట్ హౌస్ సెర్చ్ లైట్ లా తిప్పి, ఖాళీ సీట్లు వెక్కిరించటంతో ఊరుకోలేక ‘రోజురోజుకి డిసిప్లిన్, టైం సెన్స్, పంక్చుయాలిటీ లాంటివి తగ్గిపోయాయ’ని ఇంగ్లీష్లో గొణుక్కుంటూ ఎవరు రాలేదు కదాని ఇంటి దగ్గర నుండి తెచ్చుకున్న పేపర్ పఠనం ప్రారంభించాడు.

పేపర్లో చావులు, మానభంగాలు,విమానప్రమాదాలు వగైరా వార్తలు కనబడటంతో దేశం ఏమైపోతోంది, ఎటుపోతోంది అని ఆ రోజుకు వాపోతూ ఇక చదవాలనిపించక పేపర్ మడిచి ఆఫీస్ పనికి శ్రీకారం చుట్టబోయాడు.

ఇంతలో ప్రవేశించాడు,ఆ సెక్షన్ సబ్ హెడ్ అహోబలరావు. వస్తూనే “గుడ్ మార్నింగ్ గురువు గారూ” అని ఆఫీస్ స్టయిల్ లో ఒక చేత్తో ఎత్తీ ఎత్తనట్లుగా విష్ చేసి “పేపర్ ఇవాల్టిదేనా” అంటూ శేషావతారం బల్ల మీద ఉన్న పేపర్ తీసుకుని తన సీటులో చతికిలబడి ఇప్పట్నుంచి ‘అమ్మయ్యా’ అనుకోవటం దేనికని పేపర్ చదవటం ప్రారంభించి, ఆయనకూ అవే వార్తలు కనబడటంతో “ఏమిటండీ గురువుగారూ! దేశంలో రోజురోజుకు దారుణాలు మితిమీరిపోతున్నాయి. ఇలా అయితే మనం బతకడం ఎలా?” అని తన వంతుగా వాపోయాడు..

“చచ్చిపోవటం ఖాయం” అన్నాడు సె:హె. కారణం అహోబలరావు ఆఫీసుకు ఆలస్యంగా వచ్చింది కాక, సరయిన సంజాయిషి ప్రస్తావనైనా లేకుండా పేపర్ చదవటం ప్రస్తుతం అహోబలరావు చేస్తున్న అప్రస్తుతపు పని.

‘అదేమిటి?’ అన్నట్లు చూశాడు అహోబలరావు.

“మన ఆయుర్దాయం తీరితే అంతే కదా. ఏ దేశంలోనయినా చావులు,పన్నులు తప్పవు అన్నాడు వెనకటికొక పెద్ద మనిషి. అది సరే! మీ గడియారం ఐ‌ఎస్‌టి చూపిస్తుందా, జి‌ఎం‌టి నా లేక ఈ రెండిటి మధ్యగా నడుస్తుందా ?” మాటల్లో ఉబ్బసపు గురగుర, చూపులో హోదాను గుర్తుచేసే కొరకొరా కనిపిస్తున్నాయి.

“పొరపాటయిపోయింది గురువుగారు. ఈ వాచీ ఉదయమే ఆగిపోతే కీ ఇచ్చాను. కానీ టైమ్ సరి చేయలేదు. అవునూ.. టైమెంత?”

“మన ఆఫీసు టైముకు గంటాపది నిమిషాలు ఎక్కువ. మీరు వచ్చి పది నిముషాలు అయింది”

“ కాబట్టి ఒక గంట ఆలస్యమయిదంటారు” అంటూ తన వాచ్ సరి చేసుకుని ‘అమ్మయ్యా’ అనుకున్నాడు అ:రావు.

“ మార్నింగ్ సార్ “అంటూ వచ్చింది టైపిస్ట్ కమల. ”వెరీ వెరీ సారీ! బస్ ట్రబుల్ ఇచ్చింది. అందువల్ల ఆఫీసుకు రావడం ఆలస్యమయింది” అంటూ అడగకుండానే సంజాయిషి ఇచ్చింది.

“కొంచెమా తల్లీ! ఇంచుమించు గంటన్నర తినేశావు” అని సణుక్కుంటూనే “సర్లెండి! బస్ ట్రబులిస్తే మీరు మాత్రం ఏం చేస్తారు?” అని సె:హె సర్ది చెప్పటంతో ఆవిడ తన సీటులో కూర్చుంది. ఆ కూర్చోవడం లో కొన్ని అందాలు మెరవటంతో ‘కన్నార్పుదామా.. వద్దా’ అన్న మీమాంసలో పడ్డారు అవతారం, ఆ:రావు..

ఇంతలో ‘హలో’ అంటూ సిగ్నల్ రాని డీజిల్ ఇంజన్లా పొలికేక పెడుతూ ప్రవేశించాడు కాంతారావు. ఇతనొక క్లార్కు. కళాభిమాని, కళా పోషకుడు. ఆఫీసులో, స్టేజ్ మీద కూడా మంచి నటుడిగా పేరు తెచ్చుకుంటున్నాడు. అందరూ తమ తమ పనులు(?) మానేసి అతని రాక పట్ల ఉత్సాహం చూపించారు. అతను రెండు మూడు రోజులు సెలవు పెట్టి తన సొంత పని మీద హెడ్డాఫీసుకు వెళ్లి వచ్చాడు. సహజంగా ఎవరయినా .కు వెళ్ళి వస్తే వారి చుట్టూ అందరూ చేరటం, విశేషాలు, విడ్డురాలు వినటం ప్రమోషన్లు ట్రాన్స్ఫర్ల గురించి ఆరా తీయటం ఆనవాయితీ. అది అమలు చేస్తూ అడిగారు ‘ఏమిటండీ వార్తలు’ అంటూ అతని చుట్టూ మూగి.

“ అన్నట్టు కమల గారేరి?” అంటూ కాంతారావు ఆవిడ సీట్ దగ్గరకు వెళ్ళి, “కంగ్రాట్స్! మీరుమాకు పార్టీ ఇవ్వాలి. .ఎందుకని అడగకండి. ఇస్తారా లేదా?” అన్నాడు అపర గయుడిలా.

“కారణం చెప్తే తప్పకుండా ఇస్తాను” అన్నదావిడ నవ్వుతూ.

ఆవిడ నవ్వు ఇప్పుడిప్పుడే అలవాటు పడుతుండటంతో తమాయించుకుని “కారణం లేకుండా అడగటం లేదండోయ్. మీరు టైపు బాగా చేస్తున్నారని మన హెడ్డాఫీసు వాళ్ళు మెచ్చుకుని మీరు టైపు మాత్రమే చేయాలని తీర్మానించి మిమ్మల్ని టైపిస్ట్ గా కన్ఫర్మ్ చేశారు. నిన్ననే సంతకాలయినాయి. బహుశా ఇవాళ పోస్టులో.. అబ్బే అంత తొందరగా రాదు. అయితే న్యూస్ మాత్రం కరెక్ట్” అన్నాడు గుక్క తిప్పుకోకుండా.

(కాంతారావు ఇట్లా ఏకబిగిన గుక్క తిప్పుకోకుండా మాట్లాడటం ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుంటున్నాడు. ఎందుకంటే తను సినిమాల్లో చేరతాడు. అదృష్టం బాగుంటే రాజకీయాలలో కూడా అడుగు పెట్టవచ్చు. అప్పుడు ‘ఎక్కువ డైలాగులున్న షాట్ ఒకే టేకులో ఓకే చేయించుకోవటం’- అది అతని తాపత్రయం, జీవితాశయం)

అందరూ కమలకు శుభాకాంక్షలు అందచేశారు.ఆవిడ కూడా పదహారో పుట్టినరోజు జరుపుకునే పాతికేళ్ళ హీరోయిన్ లా ముసిముసి నవ్వులు చిందిస్తూ అందరికీ పార్టీ ఇస్తానని హామీ ఇస్తూ అడ్వాన్స్ గా అందరికీ టీ ఇప్పిచ్చింది.

“ఎట్లాగాయినా మన కమలగారు చాలా అదృష్టవంతురాలండి.ఉద్యోగంలో చేరిన రెండేళ్లకే కన్ఫర్మ్ అయిపోయింది. అదే నాకయితే అయిదేళ్లు పట్టింది” అన్నాడు శేషావతారం, తన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ. అసలే టీ తాగి వక్కపొడి చప్పరిస్తున్నాడేమో ఆయనేదో నెమరు వేస్తున్నట్లే ఉంది చూసేవాళ్ళకు.

“ఆ రోజులే వేరండి. ఇప్పుడంతా స్పీడు. అన్నీ టకటకా నిమిషాలమీద జరిగిపోతున్నాయి, ఒక్క పిల్లల్ని కనటం తప్పించి. దానికి మాత్రం ఇంకా తొమ్మిది నెలలే పడుతోంది” అన్నాడు కాంతారావు

అందరూ గలగలా నవ్వారు. అందరూ నవ్వటం ఒక ఎత్తు. కమల గలగలా నవ్వటం ఇంకో ఎత్తు. కారణం ఆవిడకు ఇంకా పెళ్లి కాలేదు. పైగా ‘మీరు భలే తమాషాగా మాట్లాడతారండీ’ అంటూ మెచ్చుకోలుగా నవ్వటంతో ఆరోజు కాంతారావుకి పని చేయాలనిపించలేదు. (ఏ రోజూ పెద్దగా పని చేయడు. కానీ ఈ రోజు అస్సలు పని చేయదల్చుకోలేదు)

“ఇంకా ఏమిటండీ మన హెడ్ ఆఫీస్ విశేషాలు?” అన్నాడు అహోబిలరావు.

“ఏమున్నాయి? ఇప్పట్లో ట్రాన్స్ఫర్లు లేవట. 2,3 వారాల కిందట చేద్దామని లిస్ట్ తీశారట.ఈ లోపల మన యూనియన్ వాళ్ళు గట్టిగా ఎదురు తిరిగేసరికి వాయిదా పడింది. అసలు విషయం మరిచేపోయాను. మీ ప్రావిడెంట్ ఫండ్ లోన్ శాంక్షన్ అయింది. ఆ సీటు చూసే అతను సణుగుతుంటే కొంచం.. ఒకటి రెండు రోజుల్లో ఆర్డర్లు వస్తాయి. ఇంతే సంగతులంటూ” కాంతారావు తన వార్తా ప్రసారం ముగించాడు.

“పోనీ లెండి! అమ్మాయి పెళ్లికని పెట్టాను.పెట్టి ఆరు నెలలయింది. అవతల పెళ్లివారు ముహూర్తాల కోసం హడావుడి పెడుతున్నారు. మీరు పూనుకోబట్టి తొందరగా అయింది” అన్నాడు మెచ్చుకోలుగా.

“పెళ్ళికి కాకపోతే బారసాలకు వచ్చేది” అన్నాడు ఒక క్లార్కు.

అందరూ గొల్లుమని నవ్వుదామనుకొని “పెళ్లి కాకుండా బారసాలేమిటి? “అని శేషావతారం గదమాయించటంతో ముసిగా నవ్వుకున్నారు.

ఇంతలో ఆఫీసరు గారు వచ్చారనే కబురు రావడం, సే. హే. ఆయన గదిలో ప్రవేశించటం వెంటవెంటనే జరిగిపోయాయి

“అమ్మయ్య! ఇప్పటికి మన దొరగారికి తెల్లారిందండీ. ఇక పనులు ఎలా అవుతాయి? వచ్చే ఆయన ఇంకా కొంచెం ముందు వస్తే ఆయన సొమ్మేం పోతుంది? ఖచ్చితంగా లంచ్ టైముకు వచ్చాడు. శోషొస్తోంది” అంటూ అరగంట కింద తాగిన టీ ని తలచుకుని రాని శోషను తెచ్చుకుంటున్నాడు ఒక క్లార్కు

”సీ.. చూడండి. మన ఆఫీసులో పెండింగ్ చాలా ఉంటోంది. పై ఆఫీసు నుండి రిమైండర్ లు వస్తున్నాయి . అందరూ సిన్సియర్గా, పంక్చుయల్గా పని చేయాలి. మన వాళ్లందరికి చెప్పండి. మీరు చెప్పినా వినకపోతే మెమోలు ఇచ్చేస్తాను, పేరుపేరునా . బై ది బై.. నేను ఒక పని మీద బయటకు వెళుతున్నాను. అర్జంట్ రిపోర్టులు తయారు చేయించి నా టేబుల్ మీద పెట్టించండి. అంటూ సె.హే. కు ఆజ్ఞలు జారీ చేసి బయటకు జారుకున్నాడు ఆఫీసర్.

ఇవన్నీ అలవాటయి పోయిన సెహే బయటకు వచ్చి ఆఫీసర్ గారు చెప్పిన ఆదేశాలు అందరికీ చెప్పాడు.

మొత్తానికి ఆ రోజు అందరికీ ఆటవిడుపుగా ఉన్నది. ఆఫీసర్ గారు తామందరికంటే ఆలస్యంగా రావడం , వచ్చీ రాగానే హడావిడిగా వెళ్లిపోవడంతో వారు ఆనందంలో ఓలలాడిపోయారు. అందరూ ఆ రోజు ఆనందంగా గడిపేసి ’‘ఇక చాలు ఇళ్లకు వెళ్లి పోదామా’ అని కోరస్ గా పాడేసి ఆఫీసు టైముకు అరగంట ముందుగానే ఆఫీసు మూసేయమని అప్పలకొండకు చెప్పి ఇళ్లకు వెళ్ళిపోయారు.

(ఇంతకీ ఆరోజు ఆఫీసు లో జరిగిన పని శూన్యం. ఏ రోజయినా బాధ్యతలు గుర్తించని ఉద్యోగులుంటే ఎక్కడయినా ఇంతే.)

***శుభం***



36 views0 comments
bottom of page