top of page

ఒక రాజు ఒక రాణి

Oka Raju Oka Rani Written By Nishkala Sathivada

రచన : నిష్కళ సతివాడ


" అబ్బా! తల పగిలిపోతుంది ఇంటికి వెళ్ళగానే ఒక కాఫీ తాగాలి. గ్రైండర్ లో పిండి రుబ్బినట్టు రోజంతా చదువుని రుబ్బుతూనే ఉంటారు " అనుకుంది ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న అక్షర సిటీ బస్సు దిగుతూ .

తన వెనకాల మరికొంతమంది దిగుతున్నారు. " ఏమే ఈరోజు ప్రొబబిలిటీ క్లాస్ లో ఏమి జరిగిందో తెలుసా ..." అంటూ మాట్లాడుకుంటున్న వాళ్ళ మాటలకు విసుగ్గా ' వీళ్లకి ఎప్పుడు చూడు చదువు గోల ' అనుకుంది. ఇంతలో తన స్నేహితురాలు వినీల కూడా దిగి "పదవే" అని భుజం తట్టడం తో ఇద్దరు అక్కడ నుండి కదిలారు. జనవరి మాసపు చలి తీవ్రత ఎక్కువగా ఉన్నా అప్పటి వరకు క్లాస్ రూమ్ లో మగ్గిపోయిన ఇద్దరికి ఆ చలి కొంచెం సేద తీర్చినట్టు అనిపించసాగింది. మరో మలుపు రాగానే వినీల తన ఇంటి వైపు పయనం అవుతూ " బై అక్కి జాగ్రత్త " అంది.

" అక్కి లేదు బొక్కి లేదు అక్షర అని పిలువు " అంది చిరు కోపంతో అక్షర. ఆ మాటకు నవ్వేస్తు " సరే బై అక్షర " అని చెప్పి వెళ్ళిపోయింది.

' ఏంటో జీవితం లెక్కల సమస్యలు , కెమిస్ట్రీ ఈక్వెషన్లు , ఫిజిక్స్ బలాలు వీటి చుట్టూనే తిరుగుతుంది చక్కగా మనసులో మరో ఆలోచన వస్తే ఎంత బాగుంటుందో ' అనుకుంటూ నడుస్తుంది అక్షర.

" ఇందాకే కార్పొరేషన్ వాళ్ళు రోడ్లు ఊడ్చారట, మళ్ళీ ఊడ్చనవసరం లేదు " అనడం వినిపించి వెనక్కి తిరిగేంతలో, రెండు అడుగుల దూరం లో నిలబడి, రోడ్డు మీద ఈడ్చుకుంటూ వెళ్తున్న చున్నీ ని చేతిలో పెట్టి " ఇది రోడ్డు, జాగ్రత్తగా నడవాలి " అని నవ్వుతూ వెళ్లిపోయిన అతని పరిమళం అక్షర చుట్టూ, మరియు అతని గొంతులోని ఒక రకమైన మత్తు ఆమె మనసుని వదిలి వెళ్ళలేదు.

అతని చేయి తాకిన ఆ చున్నీ అంచుని పిడికిలిలో గట్టిగా బిగించి ముందుకు అడుగులు వేసింది గాని ఆరోజు రాత్రి కి కూడా అతని కంఠం, అతని స్పర్శ ఆమె ఆలోచనలలో నుండి బయటకు వెళ్ళలేదు.

*************

" ఏంటి...ఈ మధ్య కావాలనే లేట్ చేస్తున్నావ్ ?నాకు కడుపులో ఎలుకలు పరుగెడుతున్నాయి. త్వరగా రా అక్షర " అంది వినీల బస్సు దిగి మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తున్న అక్షర ని చూస్తూ.

" అయితే పిల్లిని పంపిస్తా ఎలుకలను చంపుతుంది " అంది అక్షర.

" బాడ్ జోక్ " అంది వినీల అక్షర వైపు చూసి. అక్షర ముసి ముసిగా నవ్వింది. మళ్ళీ అదే మలుపు వచ్చింది. ఇద్దరు ఎవరి దారిన వాళ్ళు వెళ్లారు.

అతను వస్తున్నట్టు కాస్త దూరం లోనే పసి గట్టింది అక్షర. అతను దగ్గరకి వచ్చి, ముందుకు వెళ్లబోయేంతలో " ఏంటి ఈ మధ్య కనపడలేదు, ఏ కాలేజ్ చదువుతున్నారు ?" అంటూ మాటలు కలిపింది.

" నువ్వు ఏ కాలేజో మాత్రం నేను కనిపెట్టాను. అయినా నన్ను జేమ్స్ బాండ్ లా ఫాలో అవుతున్నావా?" అంటూ అదే నవ్వుతో అడిగాడు .

అతని గొంతులో మాటలు పలికే విధానం నచ్చింది అక్షరకు. అతని మాటలు వింటూ తనేం మాట్లాడాలో మర్చిపోయింది. ఎందుకో అది అవమానంగా అనిపించింది. అతను మొదటి సారిలాగే నవ్వుతూ వెళ్ళిపోయాడు.

" నిన్నటి వరకు అంతా లేటు. ఇప్పుడు పరిగెత్తిస్తూన్నావ్ ఏమైంది నీకు " అని అడిగింది వినీల.

" ఏమి లేదు " అంది అక్షర. కాస్త చలి ఎక్కువగా అనిపించి పెదాలు వణుకుతున్నాయి.

" నిజం చెప్పు ఆ అబ్బాయి వల్లే కదా " అంటూ నవ్వింది వినీల " నీకు ఎలా తెలుసు " అని అనేసి నాలుక కర్చుకుంది అక్షర .

" నిన్న నీ బుక్ నా దగ్గర ఉండిపోయింది. ఇద్దామని వెనక్కి వస్తే ఆ అబ్బాయి తో మాట్లాడుతున్నావ్. అప్పుడు చూసాను. ఏంటి? సంగతి " అంది వినీల అక్షర భుజం మీద చేయి వేసి .

ముందు కాస్త బెట్టు చేసినా ఆ తరువాత విషయం చెప్పింది అక్షర. వినీల అంతా విని ఏడిపించడం మొదలు పెట్టింది.

" నన్ను హెల్ప్ చేయమంటావా ?" అని అడిగింది .

" ఈ మాత్రం చదివించడమే ఎక్కువ నన్ను. చదువు గురించి బయటకి పంపిస్తున్నదని అమ్మ మీద నాన్న కి కోపం. ఇంకా ఇలాంటివి తెలిస్తే అంతే సంగతులు " అంటూ ఆ విషయాన్ని అక్కడితో తుంచేసింది.

మలుపు రాగానే ఎవరి దారిన వాళ్ళు వెళ్లారు. అక్షర మాత్రం అతన్ని ఆలోచనలోకి రానివ్వకుండా కాలేజ్ లో జరిగిన సంగతుల గురించి ఆలోచిస్తూ నడుస్తుంది.

" ఏంటి ఇంత లేట్ అయ్యావ్, ఈరోజు బాగా చీకటి పడిందే " అన్న గొంతు అక్షర కు దగ్గరగా వినపడడమే కాదు, అతను ఊపిరి తీసుకోవడం కూడా వినిపిస్తుంది. అక్షర అతను అక్కడ ఉంటాడని ఊహించలేదు కాబట్టి కాస్త తత్తరపడి ఆ తర్వాత సర్దుకుంది.

" సరే ఈ రోడ్డు లో ఈమధ్యే వైన్ షాప్ , సిగరెట్లు అమ్మే షాప్ పెట్టారు. కాబట్టి రోడ్డు మీద ఆలోచించుకుంటూ వెళ్లకూడదు. జాగ్రత్తగా వెళ్ళాలి " అంటూ అక్షర తో పాటే వచ్చి, ఇంటికి పది అడుగుల దూరంలో ఆగిపోయాడు. " జాగ్రత్త " అన్నాడు అక్షర కూడా వెనక్కి తిరగకుండానే తల ఆడించింది.

' అయితే మా ఇల్లు కూడా తెలుసు అన్నమాట' అనుకుంది .

అలా వారి స్నేహం ప్రేమకు ఒక అడుగు దగ్గరకు వచ్చి ఆగింది. ఆ రెండు నెలల్లో . అక్షరకు పరీక్షలు అయిపోయాయి. ఆఖరి పరీక్ష రాసి ఇంటికి తిరిగి వెళ్తోంది. యధావిధిగా మలుపు దగ్గర వినీల తన ఇంటి వైపు వెళ్లిపోయింది. అక్షర ‘రేపటి నుండి బయటికి వచ్చే అవకాశం లేదు’ అన్న ఆలోచనతో దిగాలుగా నడుస్తోంది. ఇంతలో " బాగా రాశావా?" అని వినపడింది. కాస్త కంగారు పడినా సంభాళించుకుని అతని మాటను నెమరువేసుకుని సమాధానం చెప్పింది.

" రేపటి నుండి మిగతా ఎగ్జామ్స్ గురించి కాలేజ్ కి వెళ్ళాలి కదా " అని అడిగాడు.

" లేదు అసలు కాలేజీ వాళ్ళు మాకు మెరిట్ సీటు కోచింగ్ కి మాత్రం ఫీజు కట్టాలి అన్నారు. అమ్మ కట్టలేను అంది. అందుకే ఇంక రేపటి నుండి ఇంట్లోనే ఆ ఎగ్జామ్స్ కి చదవాలి. ఇంకా నెల టైం ఉంది " అంది తల వంచుకుని.

"అయితే రేపటి నుండి నువ్వు బయటికి వచ్చే అవకాశం లేదా?" అని అడిగాడు. లేదన్నట్టు తల ఊపింది". నాకు ఉద్యోగం వచ్చింది ఎల్లుండి హైదరాబాద్ వెళ్లిపోతున్నాను " అన్నాడు.

ఆ మాట కు చురుగ్గా తల ఎత్తింది కానీ ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉంది. అతనే అందుకుని " రేపటి నుండి ఇంటి నుండి నువ్వు బయటకు రాలేవు. నేను ఈ ఊరు విడిచి వెళ్లిపోతున్నాను. అందుకే నీ ఫోన్ నెంబర్ ఏమైనా ఇస్తే ఎప్పుడైనా మాట్లాడచ్చు" అన్నాడు అతను కూడా తల దించుకుని.

" నాకు ఫోన్ లేదు. అమ్మ ఫోన్ నెంబర్ ఇవ్వాలి. కచ్చితంగా ఒకసారి కాకపోయినా మరోసారి అయినా అమ్మకు, నాన్నకు తెలిసిపోవచ్చు. ఇక అప్పుడు పెద్ద చదువులు ఇంటి నుండే చదవాలని అనే ఆశ వదిలేసుకోవాలి. వాళ్ళ ముందు తప్పు చేసినదానిలా నిల్చోవాలి. అది నాకు ఇష్టం లేదు " అంది.

అతను నిట్టూర్చి అక్కడ నుండి వెళ్లబోయాడు. మళ్ళీ ఏదో గుర్తొచ్చినట్టు ఆగి, "ఇంతదాక వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నువ్వంటే నాకిష్టం. ఐ లవ్ యూ " అన్నాడు. గొంతులోని వణుకు సృష్టంగా తెలుస్తుంది అక్షరకు.

వెంటనే తను ముందే రాసి పెట్టుకున్న ఒక చీటి తీసి చేతిలో పెట్టి " నేను ఉన్న వయసులో ప్రేమ అంటే, అందరూ అది ప్రేమ కాదు అని కొట్టి పారేస్తారు. అందుకే అలా కొట్టి పారేసే అవకాశం ఎవ్వరికీ ఇవ్వాలని అనుకోవట్లేదు. మరో రెండు మూడేళ్ళ తరువాత కూడా మన ప్రేమ ఇలాగే ఉంటుందా ?? ఇది ఆకర్షణా ?? ప్రేమా?? నా జీవితంలోకి వచ్చిన మొట్ట మొదటి అబ్బాయివి నువ్వు . మనుషులని పూర్తిగా నమ్మే స్థితిలో నేను లేను. అందుకే నా ఫ్రెండ్ నెంబర్ నీకు ఇచ్చాను. నీకు నా మీద ప్రేమ ఎప్పుడూ ఇలాగే ఉంటుంది అంటే, దూరంగా ఉన్నా కూడా నన్ను ఇలాగే ప్రేమిస్తావు, అని నువ్వు అనుకుంటే అప్పుడు కనీసం నా డిగ్రీ అయ్యేంతవరకైనా ఆగు. నీకు ఎప్పుడైనా నా గురించి తెలియాలంటే ఈ నెంబర్ కు ఫోన్ చేస్తే నా ఫ్రెండ్ నా గురించి చెప్తుంది. కానీ నేను మాత్రం నీతో మాట్లాడలేను. నా లక్ష్యం పక్క దారి పడితే ఇంత కష్టపడి చదివినదంతా వృధా అవుతుంది " అంది గుక్కతిప్పుకోకుండా .

అతను దూరంగా వెళ్తున్నట్టు అతని అడుగుల చప్పుడు వినిపించింది. చీటి తీసుకున్నాడా లేదా అని కూడా ఆలోచించకుండా గబా గబా అడుగులో అడుగు వేసుకుంటూ ఇంటికి వెళ్ళిపోయింది . ఇంట్లోకి వెళ్ళగానే బాత్రూం లోకి దూరి తనివి తీరా ఏడ్చింది. అప్పటివరకు మనసులో ఉన్న భారం దిగి తేలిక అయినట్టు అనిపించింది.

*******************

" తరువాత ఏం జరిగింది అత్తా?" అని అడిగింది 16 ఏళ్ళ లాస్య అక్షరను.

వంట గదిలో నుండి వారి ఇద్దరి మాటలు విని నవ్వుతూ బయటికి వచ్చింది వినీల. ఇంతలో బయట కార్తీక్ అడుగుల చప్పుడు వినపడింది.

" నేను చెప్పనా " అంటూ వచ్చాడు లోపలికి. అక్షర , లాస్య ఇద్దరు కంగారు పడ్డారు " మావయ్యా నీకు తెలుసా??" అంటూ ఆశ్చర్యపోయింది లాస్య.

" ఎందుకు తెలీదు ఓ నాలుగేళ్ళ తరువాత అమ్మమ్మని, తాతయ్యని , అత్త వాళ్ళ అమ్మా, నాన్న ని ఒప్పించి పెళ్ళి చేసుకున్నది నేనే కదా " అన్నాడు కార్తీక్.

" వావ్ !! అంటే ఆ అబ్బాయివి నువ్వే నా మావయ్యా! సూపర్ చాలా బాగుంది " అంది లాస్య.

" అది అంత సులభం కాదు లాస్యా. చాలా ఓపిక, సహనం ఉండాలి. అప్పుడే మనం అనుకున్నది జరుగుతుంది. మనకి కావాల్సిన వాళ్ళు కూడా మన లైఫ్ లోకి వస్తారు సరే నా " అంది అక్షర.

" అత్తా ! మరి నీకు కనిపించదు కదా. మావయ్య మంచివాడు అని మొదటిసారి కలిసినప్పుడే ఎలా తెలిసింది" అంది లాస్య.

" లాస్యా! " అని గట్టిగా అరుస్తున్న వినీల ను వారిస్తూ " కనపడకపోయినా ఎదుటి వారు మాట్లాడేదాన్ని బట్టి ఒక అంచనా కి వస్తాను వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని" అంటూ చెప్తున్న అక్షర కేసి చూస్తూ ఇంటర్ చదివే రోజులు గుర్తుకు తెచ్చుకుంది వినీల .

" నీ ఫ్రెండ్ కు కనిపించకపోతే నేను తోడు వెళ్లడం ఏంటి? ఎంత చదువు అయిపోయి ఖాళీ ఉంటే మాత్రం నీకు బాడీ గార్డ్ లా కనిపిస్తున్నానా ?" అంటున్న కార్తీక్ వంక చూస్తూ,

" రెండు నెలల క్రితం వరకు బస్ స్టాప్ నుండి తీసుకురావడానికి వాళ్ళ అక్క వచ్చేది. తనకి పెళ్ళి అయిపోయి వెళ్లిపోవడం తో అక్షర ఒంటరిగా వెళ్తుంది. నీకు తెలుసుగా రెండు వైన్ షాపులు ఉన్నాయి తను వెళ్లే రోడ్డులో. తను ఎంత జాగ్రత్తగా ఉన్నా తనకి తోడు కావాలి. నేను వస్తానంటే వద్దు నేను వెళ్లలేనా అంటుంది. వాళ్ళ నాన్నగారికి తనంటే ఇష్టం లేదు. వాళ్ళ అమ్మగారు పాపం ఉద్యోగానికి వెళ్ళి వచ్చేసరికి ఇంకా లేట్ అవుతుంది. దీనిని చదివించడం దండగ అని వాళ్ళ నాన్న ఆలోచన. దీనికి ఎప్పటికైనా బీఇడి చేసి టీచర్ అవ్వాలని కోరిక. నువ్వు ఎలాగూ ట్యూషన్ చెప్పడానికి అటు వైపే వెళ్తావు కదా, కొంచెం నీ టైమింగ్స్ మార్చుకో ప్లీజ్ అన్నయ్యా " అని వేడుకుంది.

"అమ్మా!" అన్న లాస్య పిలుపుతో మళ్ళీ వర్తమానంలోకి వచ్చింది వినీల. " ఇదిగో అమ్మా! ఫోన్ నాకు కావాల్సినప్పుడు ఇద్దువు గాని, రేపు టెస్ట్ ఉంది చదువుకోవాలి " అంటూ లోపలికి వెళ్ళిపోయింది .

అక్షర కూడా తన వెనకాలే వెళ్ళి " మరి కపిల్ ?" అని అడిగింది పుస్తకాలు తీసుకుంటూ ". కపిల్ కి నేను ఒకే చెప్పకముందు బాగానే ఉండేవాడు. కానీ ఇప్పుడు తన గర్ల్ ఫ్రెండ్స్ అందరి కన్నా హైలైట్ అవ్వాలి అని అంటాడు తప్ప, మా ఫ్యూచర్ గురించి గాని, తన గోల్స్ గాని , నా గోల్స్ గాని ఎప్పుడు మాట్లాడడు. స్మోకింగ్ , డ్రింకింగ్ చేసేవాళ్ళు హీరోలు అన్నట్టు మాట్లాడతాడు. నేనూ అలాగే అనుకున్నా సినిమాల్లో చూసి. కానీ మనం ఎలా ఉన్నా అలానే యాక్సెప్ట్ చేసేవాళ్లే అసలైన హీరోస్. వాళ్ళతోనే హ్యాపీ గా ఉంటామని ఇప్పుడు అర్ధమైంది అత్తా. ఇప్పుడు ముందు చదువు తర్వాతే ఇవన్నీ " అంటూ పుస్తకాలు ముందేసుకుని కూర్చుంది.

లాస్య మాటలు బయట నుండి విన్న వినీల ఊపిరి పీల్చుకుంది. అక్షర లాస్య మాటలకు తృప్తి పడి, బయటకు వచ్చి వినీల భుజం పై తట్టింది. ఇద్దరూ ఒకరినిఒకరు ఆలింగనం చేసుకుని తమ విజయానికి మురిసిపోయారు.

కార్తీక్ కుర్చీ లోంచి లేస్తూ " సరే ఇక బయలుదేరుతాం " అన్నాడు .

" భోజనం చేసి వెళ్ళండి అన్నయ్యా" అంది వినీల.

" లేదమ్మా ఇప్పటికే లేట్ అయింది. అమ్మ ఎదురుచూస్తూ ఉంటుంది. ఇంక నీ మేనల్లుడు అమ్మ బుర్ర తిని ఇప్పుడే పడుకున్నాడు. ఓ రెండు వీధుల అవతలే కదా నడుచుకుని వెళ్లిపోతాము " అన్నాడు కార్తీక్.


అక్షర కూడా మెల్లగా బయటికి వెళ్ళి చెప్పులు వేసుకుంది. కార్తీక్ కూడా చెప్పులు వేసుకుని అక్షర చేయి పట్టుకున్నాడు. వాళ్ళిద్దరిని అలా చూసిన వినీల మళ్ళీ గతంలోకి వెళ్ళింది.

**************

" అక్షరా! " పిలుపు కి పక్కకి తిరిగి వినీల చేయి పట్టుకుంది అక్షర. " వినీలా! ఏంటి ఇలా వచ్చావు? పరీక్షలు ఎలా రాస్తున్నావు " అని అడిగింది .

" ఈరోజు తో అయిపోయాయి " అంది వినీల.

" అయితే ఇకపై వినీల బీటెక్ అన్నమాట. చాలా సంతోషంగా ఉందే. మొన్న మొన్ననే జాయిన్ అయినట్టు ఉంది. అప్పుడే నాలుగు సంవత్సరాలు ఎలా గడిచిపోయాయో చూడు " అంది అక్షర సంతోషంగా .

" రిజల్ట్స్ రావాలి కదా! అప్పుడే బీటెక్. ఇంతకీ నీ బీఇడి ఎలా అవుతుంది " అని అడిగింది వినీల .

" ఎదో అలా అవుతుంది లే. ఇదిగో ఇంట్లో విసుగ్గా ఉంటే దగ్గరలో ఉన్న పార్క్ కి వెళ్తున్నా. పద అక్కడికి వెళ్ళి కూర్చుని మాట్లాడుకుందాం " అంది అక్షర.

ఇద్దరు పార్కులోకి వెళ్ళి బెంచ్ పైన కూర్చున్నారు. " అక్షరా! ప్రేమ గురించి నీ అభిప్రాయమేంటి?" అని అడిగింది వినీల.

" ఏంటి?? ప్రేమ గురించి అడుగుతున్నావ్? కొంపదీసి నువ్వు ఏమైనా?" అని అక్షర ముగించే లోపే " అబ్బా! అదేం లేదు నేను నీ అభిప్రాయం అడుగుతున్నాను " అంది వినీల.

" నాకు అభిప్రాయం ఏముంది. నా జీవితంలో నా మనసు దగ్గరకు వచ్చిన అబ్బాయి ఒకే ఒక్కడు కార్తీక్ ". అంటూ నిట్టూర్చి, " ఇప్పుడు తనకి నేను గుర్తు ఉన్నానో లేదో కూడా తెలీదు" అంది దిగాలుగా.

" అలా ఎందుకు అనుకుంటావ్ ?" అని అంది వినీల.

" మరి ఇన్నాళ్లు అయినా ఒక ఫోన్ లేదు. కనీసం అతని గురించి ఎలాంటి సమాచారం లేదు. కచ్చితంగా మర్చిపోయి ఉంటాడు " అంది దిగాలుగా .

" నువ్వే కదా, నీ లక్ష్యం పక్కదారి పడుతుంది మాట్లాడద్దు అన్నావ్ " అని ప్రశ్నించింది వినీల.

" నాతో వద్దు అన్నాను. కనీసం నీకు అయినా ఫోన్ చేసి తన గురించి చెప్పచ్చు కదా " అంది .

" అది అలా చెప్పు. అంటే అతని గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉంది. కాని అతనితో మాట్లాడే ధైర్యం లేదు అన్నమాట " అంది వినీల కొంటెగా.

" అయ్యో అది కాదు వినీలా! భయం అతనంటే కాదు. నా పరిస్థితి అంటే నాకు భయం " అంది అక్షర.

" అందుకే నీలో ధైర్యం నింపడానికి వస్తానన్నాడు. నాకు ఫోన్ చేసి చెప్పాడు" అంది లాస్య ఆనందంగా.

" చేశాడా ? ఎలా ఉన్నాడు ??వస్తానన్నాడా?ఎప్పుడు? పెళ్ళి అయిపోయిందా " అని అడిగింది అక్షర.

" ఇదిగో ఇక్కడే ఉన్నాడు. నువ్వే అడుగు" అంది వినీల.


ఊహించని ఆ పరిణామానికి బిత్తరపోయిన అక్షర, కంగారుగా లేచి ముందుకు అడుగు వేసింది. అక్కడ ఉన్న రాయిని తన్నుకుని ముందుకు పడబోతుంటే, వెంటనే కార్తీక్ వచ్చి పట్టుకున్నాడు.

" ఇలాగే నీ చేయి ఎప్పుడు వదలను. మరి నన్ను ఎప్పుడూ పట్టుకుని ఉంటావా " అన్నాడు .

అక్షర వెంటనే కార్తీక్ ని తడుముతూ, తన చెంపల కోసం వెతికి, చెంపల పై రెండు చేతులు వేసి, వదలను అంటూ ఏడ్చి కార్తీక్ ని హత్తుకుంది .

" నీ లక్ష్యాన్ని చేరుకునేంతవరకు నిన్ను కలవకూడదు అనుకున్నాను. కానీ అమ్మా, నాన్న పెళ్ళి గురించి ఒత్తిడి తీసుకొస్తుంటే ఇంక నీ గురించి చెప్పాల్సి వచ్చింది.వాళ్ళని ఒప్పించాను. అంతే కాదు మీ అమ్మగారి తో కూడా మాట్లాడాను. ఆవిడ కూడా సంతోషించారు" అన్నాడు.

" అయితే అందరికి చెప్పాక నాకు చెప్పావన్నమాట " అంది అక్షర చిరు కోపంతో.

" ఇంకొకటి కూడా చెప్పాలి వదినమ్మా " అంది వినీల.

ఆశ్చర్యంగా చూస్తున్న అక్షరకు వినీల జరిగిందంతా చెప్పింది." ఇన్ని సంవత్సరాలు కనీసం నాకు ఒక్క మాట అయినా చెప్పలేదు. అయినా మీ అన్నయ్య పేరు కిరణ్ అన్నావ్ కదా " అంది.

" అవును కార్తీక్ కిరణ్ " అని నవ్వింది వినీల.

అక్షర కూడా ఆనందంగా నవ్వేసింది.

*************

" చిన్న పిల్లకి ఈ ప్రేమ కథలు చెప్పడం ఎందుకు " అన్నాడు కార్తీక్ అక్షర వైపు చూస్తూ.

" ఆ వయసు అలాంటిది. ప్రేమిస్తున్నాం అని చెప్పగానే తిట్టడం, కొట్టడం లేదా కోపగించుకోవడం చేస్తే మరింత మొండిగా తయారు అవుతారు. అందుకే అసలు ప్రేమ అంటే ఏంటి ? ఆ ప్రేమ దక్కించుకోవాలంటే ఎంత కష్టపడాలి ? ఆకర్షణ కి ప్రేమ కి తేడా ఏంటి? అనేది వాళ్ళకి స్నేహంగా ఉంటూ చెప్తే తెలుసుకుంటారు. అంతే కాదు అనవసరంగా ఆలోచనలు పెట్టుకోకుండా బుద్దిగా చదువుకుంటారు ".అంది అక్షర కార్తీక్ భుజంపై వాలి నడుస్తూ.

" ఎంతైనా నా అక్షర కదా. నువ్వు చెప్తే తిరుగు ఉండదు లే " అని చేతిని మరింత గట్టిగా పట్టుకుని నడిచాడు కార్తీక్.

******సమాప్తం******


గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి


210 views1 comment
bottom of page