top of page
Writer's pictureYasoda Pulugurtha

ఒక తీయని పలకరింపు

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.







Video link

'Oka Thiyani Palakarimpu' Telugu Story Written By Yasoda Pulugurtha

రచన: యశోద పులుగుర్త

అప్పుడే సంధ్యాకాంతులు దాటిపోయిమెల్లిగా చీకట్లు అలుముకుంటున్నాయి.

మామగారు పార్కుకి వ్యాహ్యాళికి వెళ్లినవారు ఇంకా రాలేదిమిటా అని తలపోస్తూ వీధిగుండా దృష్టి సారించింది సాహితి..


ఆయన పార్కుకి బయలుదేరుతుంటే తొందరగా వెలుగున్నప్పుడే వచ్చేయమని, స్నేహితులతో కబుర్లలో పడి సమయం చూసుకోరని రోజూ హెచ్చరిస్తూనే ఉంటుంది.

‘అలాగేనమ్మా’ అంటూ పెందరాళే వచ్చే మామగారు, చీకటి పడుతున్నా ఇంకా రాకపోయేసరికి సాహితి, తన అయిదేళ్ల కొడుకు నీరజ్ ను తీసుకుని ఇంటికి తాళం వేసి మామగారికోసం పార్కుకి బయలుదేరింది.


పార్కు వాళ్లింటికి చాలా దగ్గరే. పది నిమషాల నడక అంతే..

పార్కులో జనసమూహం బాగానే ఉన్నారు.

ఆడుకుంటున్న పిల్లలు, స్నేహితులతో పిచ్చాపాటీ మాట్లాడుకునేవారు, అలాగే ఆడవాళ్లు వాకింగ్ చేస్తున్నవారితో కోలహాలంగా ఉంది..

మామగారు ఎప్పుడూ కూర్చుండే వేపచెట్టు కింద ఉన్న సిమెంట్ బెంచ్ దగ్గరకు వచ్చేసరికి మామగారు కాకుండా మరో నలుగురు స్నేహితులు కనిపించారు.. ఏమిటో సీరియస్ గా మాట్లాడుకుంటూ మరో పెద్దాయినని ఊరడిస్తున్నారు.. ఆయన తన ఉత్తరీయంతో కళ్లు తుడుచుకుంటున్నారు. కోడలు, మనవడు రావడం చూసి రామారావుగారు లేచి నిలబడ్డారు..


అందులో ఒకాయన ‘ఎంత అదృష్టవంతుడివి రామారావ్, నీవు ఇంకా రాకపోయేసరికి మీ కోడలు ఆత్రుతగా నిన్ను వెతుక్కుంటూ వచ్చేసిం’దంటూ అనడం, చూచాయగా సాహితి చెవిని పడింది..


మిత్రులతో “నేను వెడుతున్నాను. రేపు కలుద్దా”మని చెబుతూ వీడ్కోలు తీసుకుంటూ, కోడలిని , మనవడిని కలిసారాయన..


“ఏం మామయ్యా! మీ చర్చలు ఇంకా అవలేదా?” అని నవ్వుతూ ప్రశ్నించేసరికి “ఏమిటోనమ్మా! ఒక్కొక్కరివి ఒకో రకమైన జీవితాలు.. ఈ వయసులో జీవిత భాగస్వామిని కోల్పోవడం ఎవరికైనా బాధాకరమే.. నేను జనరల్ గా చెపుతున్నాను.. భార్యపోతే మగవాడి జీవితం నరకం.. కానీ భర్తపోయిన స్త్రీ ఎలాగైనా బ్రతికేయగలదు.. నేను అదృష్టవంతుడినే, మీ అత్తగారు పోయినా నన్ను అభిమానంగా చూసుకుంటున్నారు మీరిద్దరూ. పాపం నా స్నేహితుడు రంగారావు గురించి చెబుతూ ఉంటానుగా.. అతని పరిస్తితే బాగాలేదుటమ్మా”


“ఏమైంది మామయ్యా” అంటూ సాహితి అడిగింది..


“ఏమిటోనమ్మా! కోడలి తీరు బాగుండదట.. మా రంగా ఎంత సరిపుచ్చుకున్నా రోజూ ఏదో గొడవ పెడ్తుందట. రోజూ ఫ్రిజ్ లో పెట్టిన నిలవ పదార్ధాలను వేడిచేసి పెడ్తుందట. ఈరోజు లంచ్ కి ఏమీ చేయకుండా, రెండురోజుల క్రితం వండిన పదార్ధాలు ఫ్రిజ్ లో ఉంటే వేడిచేసి పెట్టిందిట.. పాపం రంగారావుకి అవన్నీ పడవు..

‘నిలవవి తినలేనమ్మా! గేస్ ప్రాబ్లమ్ వస్తోంది’ అంటే ఈ రోజు పెద్ద రాధ్దాంతమే చేసిందిట కోడలు..

‘ఆరారా చేసి పెట్టడానికి నాకు ఓపిక లేదు, అయినా ఫ్రిజ్ లోనే ఉన్నాయిగా, పాడవలేదుగా’ అంటూ, ‘మీరు ఇక్కడ ఎడజస్ట్ కాలేకపోతే మీ చిన్న కొడుకు దగ్గరకు వెళ్ల’చ్చంటూ ఖరాఖండీగా చెప్పేసిందిట..


చిన్న కోడలు మరీ దారుణంట.. ఆమె వంట చేయడమే తక్కువట.. కర్రీ పాయింట్లనుండి, హొటళ్లనుండి తెప్పిస్తుందట.. మా రంగారావుకి ఆ మసాలా కూరలూ అవీ అసలు తినలేనురా రామం అంటూ నా దగ్గర వాపోతాడు పాపం.. కొడుకు అసలు మాట్లాడుట..”


“అయ్యో అలాగా మామయ్యా! పాపం రంగారావు అంకుల్ పరిస్థితి దారుణం కదూ” అంటూ సాహితి వాపోయింది..

ఏమాటకామాటే చెప్పుకోవాలి.. సాహితి అన్య కులస్తురాలైనా తనను బాగా గౌరవిస్తుంది.. మొదట్లో రామరావుగారి కొడుకు విజయ్, ‘నేను ఒకమ్మాయిని ప్రేమించాను. మన కులం కాదు. అనేసరికి తను, తన భార్య శ్యామల కొంచెం ఆలోచనలో పడ్డారు..


అన్యకులస్తురాలైన కోడలితో ఎలా అడ్జస్ట్ అవాలా అనుకుంటూ.. విజయ్ ను వేరే కాపురం పెట్టుకోమంటే ససేమిరా అంగీకరించలేదు.. ‘మన పధ్దతులన్నీ నేర్చుకుంటుందిలే అమ్మా’ అంటూ. అందరూ కలిసే ఉండేవారు..


సాహితి తమ ఇంటి పధ్దతులు, అలవాట్లని తొందరగానే ఆకళింపుచేసుకుని తమ ఇంట్లో చక్కగా ఒదిగిపోయింది.. తనని, తన భార్యనూ ఎంతో గౌరవిస్తూ ఆప్యాయంగా మసలుకునేది.


రామారావుగారి భార్య రెండు సంవత్సరాల క్రితం కాలధర్మం చేసారు.. అప్పటినుండి తనను కంటికి రెప్పలా, ఒక చిన్న పిల్లాడిలా చూసుకుంటోంది కోడలు..


‘తాతా’ అంటూ ఆయన చేతిమీద చేయి వేస్తూ మృదువుగా నిమురుతూ పిలుస్తున్న మనవడి పిలుపుకి వాస్తవ లోకానికి వస్తూ...... ‘ఏం నాన్నా’ అని ప్రశ్నించేసరికి,


‘మరేమో........ ఇంకో తాతగారు గురించి చెపుతున్నావుకదా.. పాపం ఆ తాతకు ఇంట్లో అన్నం పెట్టరా తాతా?’ అని అమాయకంగా ప్రశ్నిస్తున్న నీరజ్ మాటలకు సాహితి, రామారావుగారిరువురూ అప్రభితులైనారు..


చిన్నపిల్లలలో ఎంత ఆలోచనా శక్తి ఉంది.. వాళ్లు వినడం లేదు కదా అని అనుకుంటాం గానీ, పెద్ద వాళ్లు మాట్లాడే మాటలను ఎంత సూక్ష్మంగా గ్రహిస్తారో అనుకుంటూ ఆశ్చర్యపోయారు..

సాహితి వాడికి ఏదో సమాధానం ఇవ్వబోతుండగా...... మళ్లీ వాడే, ‘తాతా, మరేం...... ఆ తాతను మనింటికి తెచ్చేసుకుందామా’ అని అమాయకంగా అడిగాడు.


“మామయ్యా! నీరజ్ అన్నాడని కాదు. మీ స్నేహితుడిని.. అదే రంగారావు అంకుల్ ని తరచుగా మనింటికి భోజనానికి పిలుద్దాం. వారింట్లో ఆయనకు కరువైన ప్రేమను మనం అందిద్దాం మామయ్యా.. రేపు ఆదివారం ఆయన్ని మన ఇంటికి లంచ్ కు పిలవండి, నేనుకూడా ఆయనతో మాట్లాడతాను” అనగానే రామారావుగారు కోడలి ఆప్యాయతకు మురిసిపోయారు..


ఆదివారం నాడు రంగారావుగారు వచ్చారు.. స్నేహితుని ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉందని చెప్పి వచ్చానని రామారావుగారితో చెప్తున్నారు..


లేకపోతే బోల్డన్ని ఆరాలు తీస్తుందిట కోడలు.. నా వంట నచ్చక బయట హొటల్ లో తింటున్నారేమోనన్న అనుమానం కూడానట.. ఆకలివేయక, సయించక తినలేకపోతుంటే బయట చిరుతుళ్లు తిన్నారా అంటూ ప్రశ్నిస్తుందిట.. మర్యాదా, గౌరవం ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుందని స్నేహితుల దగ్గర వాపోతాడాయన..


సాహితి ఆప్యాయంగా కొసరి కొసరి వడ్డించిన వంటలన్నీ అద్భుతంగా రుచిగా ఉన్నాయి ఆయనకు.. అందరూ కలసి డైనింగ్ టేబుల్ చుట్టూ కుర్చీలలో కూర్చుని, కబుర్లు జోకులతో భోజనం చేస్తుంటే కడుపు నిండినంత ఆనందం కలుగుతోంది ఆయనకు..


ఆయన ఒక్కడూ వడ్డించుకుని తినాలి ఇంట్లో.. శెలవు రోజుల్లో, పండుగ రోజుల్లో, కొడుకుతో ‘ఒరేయ్ అబ్బాయ్! నీవూ రారా, కోడలిని మనవళ్లను కూడా పిలువు. అందరం కలసి భోజనం చేద్దా’మంటే, ‘మీరు తినేయండి నాన్నా, నాకు ఆకలి లే’దంటూ తప్పించుకుంటాడు..

ఇద్దరు మనవలకూ తన పొడ కిట్టదు.. ‘అలా చప్పుడు చేస్తూ తింటావు, పెరుగన్నం తినేటప్పుడు నీ దగ్గర సౌండ్ వస్తుందని గేలి చేస్తారు.. కడుపు నిండడానికి పంచభక్ష్య పరవాన్నేలే ఉండనవసరంలేదు.. అభిమానంగా పచ్చడన్నం పెట్టినా కడుపు నిండిపోతుంది..


రామారావు కొడుకు, కోడలు ఎంతో అభిమానంగా మాట్లాడారు.. బోర్ గా ఉన్నప్పుడు తమ ఇంటికి రమ్మని మరీ మరీ చెప్పి సాగనంపారు..


ఆ దంపతుల తీయని మాటలకు ఆయన మనసంతా సంతృప్తిగా నిండిపోయింది.. మాటకున్న విలువే అటువంటిది..


రంగారావుగారు సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్ మెంట్ లో పనిచేస్తున్న రోజులలో ఇంట్లో ఇద్దరు ముగ్గరు బంట్రోతులు ఉండేవారు.. కొడుకులు ‘నాన్నగారూ’ అంటూ ప్రేమగా పలకరిస్తూ వాళ్లకు కావలసిన డబ్బు తీసుకుని వెళ్లేవారు.. కోడళ్లు ప్రేమగా అన్నీ దగ్గరకి తెచ్చు అందిస్తూ ఉండేవారు.. అత్తగారిని ఆదిలక్ష్మిలా చూసుకునేవారు.. ఇంట్లో అన్నీ వారికిష్టమైనట్లుగానే జరిగిపోయేవి.. రంగారావుగారు డిపార్టుమెంట్ లో మంచి పదవిలో పనిచేసారు.. ఉద్యోగానంతరం వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా డిపాజిట్ చేసుకున్నారు.. ఎప్పుడైతే ఆయన అర్ధాంగి భారతి చనిపోయిందో, అప్పటినుండే ఆయన కష్టాలు ప్రారంభమైనాయి..

వయసులో ఉన్నపుడు, శరీరంలో శక్తి ఉన్నపుడు, ఉద్యోగం చేస్తున్నపుడు జీవితం మూడు పువ్వులు ఆరుకాయలుగా నడుస్తుంది.. ఎప్పుడైతే రిటైర్ అయిపోయి, జీవిత భాగస్వామి దూరమౌతుందో అప్పుడే అదే జీవితం నరకప్రాయంగా మారిపోతుంది..


ఇద్దరు కొడుకులూ, కోడళ్లూ తాను కష్టపడి కట్టుకున్న రెండు అంతస్తుల భవనాన్ని వారిపేరున వ్రాయమని ఒత్తిడి ప్రారంభమైంది.. రంగారావుగారు వ్యక్తిత్వమున్న మనిషి.. ఆయనకు కుటుంబ సభ్యుల ప్రేమాదరణలు కావాలి.

‘ఆస్తి తను తీసుకుపోలేనుగా’.. అనుకుంటూ పిల్లలు కోరినట్లుగా విజయవాడలో అయిదువందల గజాల్లో కట్టుకున్న రెండు అంతస్తుల భవనాన్ని కొడుకుల పేరున వ్రాసి ఇచ్చేసాడు..

పెద్ద కొడుకు హైద్రాబాద్, చిన్నవాడు చెన్నయ్ లో పనిచేస్తున్నారు.. మంచి చదువులు చెప్పించాడు.. మంచి ఉద్యోగాలలో స్తిర పడ్డారు.. ఫ్లాట్స్ కొనుక్కునేటప్పుడు కూడా కొంత డబ్బుకావాలంటే సహాయం చేసాడు.. ఇంతచేసినా తన ఇంటివారు తనపై చూపిస్తున్న అనాదరణను సహించలేకపోతున్నాడు..


ఒక పది రోజుల తరువాత రాత్రి భోజనాల సమయంలో సాహితి మామగారిని “రంగారావు అంకుల్ ఎలా ఉన్నారు మామయ్యా” అంటూ అడి గింది..


“ఏమోనమ్మా! వారం పది రోజులనుండి పార్క్ కి రావడం లేదు.. ఆయన చిన్నకొడుకు దగ్గరకు ఏమైనా వెళ్లాడేమోననుకుంటున్నాం. అలా వెళ్లేముందు చెప్పి వెడతాడు మరి. మరో రెండురోజులు చూసి వాకబు చేస్తా”నని అన్నాడాయన..


మరుసటిరోజున రామారావుగారికి కొరియర్ లో ఒక లెటర్ వచ్చింది.. అది రంగారావుగారినుండి..

‘నీకు తెలుసుగా రామారావ్, నాకు మాఇంట్లో ఏమి కరువైందో ? ఒక తీయని పలకరింపుకోసం అలమటించి పోతున్నాను.. ఈ వయస్సులో నా పిల్లలు, నా వాళ్లే నన్ను అనాదరణకు గురిచేస్తున్నారు.. ఒకప్పుడు వీళ్లంతా నా వాళ్లనుకున్నాను.. నేను సంపాదించిన ఆస్తి మాత్రమే వాళ్లకు నచ్చింది.. నేను కాదు. భగవంతుడి దయవలన నాకు డబ్బుకి లోటులేదు. నాకోసం నేను జాగ్రత్తపడ్డాను.. నెలవారీ పెన్షన్ వస్తుంది.. ఆశ్రమానికి వెళ్లిపోతున్నాను.. కింద అడ్రస్ ఇస్తున్నాను.. వీలున్నప్పుడు మన మిత్రులందరితో కలసి వస్తూ ఉండు..


ఈవయస్సులో మనలాంటి వారికి తిండికన్నా ఒక తీయని పలకరింపు, ఆప్యాయతా ముఖ్యమని నా అభిప్రాయం.. అది ఆశ్రమంలో దొరుకుతుందని భావిస్తూ వెళ్లిపోతున్నాను..

చి.. సౌ.. సాహితికి, విజయ్ కు, నీరజ్ కు ఆశీస్సులురా రామం..

నీ.. రంగ.. ‘


ఉత్తరం చదివిన రామారావుగారికి కంటినుండి రెండు దుఃఖాశ్రువులు జారిపడ్డాయి.. ‘పోనీలే రంగా, నీవు కోరుకున్నవి అక్కడైనా నీకు లభ్యమవ్వాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నా’ననుకున్నారు..


రంగారావుగారు దైవభక్తులు.. నిత్యం పూజ చేసుకుంటూ, తన సహచరులతో ఆధ్యాత్మిక పరమైన విషయాలను ముచ్చటిస్తూ ఉండేవారు.. ఆశ్రమంలో అందరూ ఆయన్ని అభిమానించసాగారు.. ఆప్యాయంగా పలకరించసాగారు..


ఒకరోజు హైకోర్టునుండి రంగారావుగారి గురించి వాకబు చేస్తూ ఒక గుమాస్తా వచ్చాడు.. ఆ గుమాస్తా ముందర రంగారావు కొడుకింటికి వెళ్లి వాకబు చేస్తే వారి కోడలు ఏ కోర్టు తగాదాలో, ఏమిటో మనకెందుకు గోలనుకుంటూ రంగారావుగారుంటున్న ఆశ్రమం అడ్రస్ ఇచ్చిందిట.. ఆశ్రమం అధికారిని కలిసాడు.. రంగారావుగారి తాతముత్తాతల బాపతు నాటి ఆస్తి కోర్టుకేసులో ఏన్నో సంవత్సరాలుగా పడి ఉన్నది, అందరూ ఎప్పుడో మరచిపోయిన ఆస్తి వంద ఎకరాలపొలం రంగారావుగారికి సంక్రమించాయని హైకోర్టునుండి వచ్చిన ఆర్డర్లు తీసుకుని వచ్చాడు గుమాస్తా..


రంగారావుగారు ఉద్యోగం చేస్తున్న రోజుల్లో ఎందరో అనాధలకూ పేదవిద్యార్ధులకూ ఆర్ధికంగా ఎంతో సహాయం చేసేవారు..

తనకు అనుకోకుండా కలసివచ్చిన వంద ఎకరాలపొలంలో కొంత అనాధ పిల్లల ఆశ్రమాలకి, మరికొంత పేదపిల్లల చదువు నిమిత్తమై ఒక ట్రస్ట్ ను ఏర్పాటు చేసి కలెక్టరుగారి సమక్షంలో అందచేసాడు..


రంగారావుగారిని ప్రభుత్వం సత్కరించింది.. ఆ వార్త దావాగ్నిలా పేపర్లు, టి.. వీ.. లో రావడంతో రంగారావుగారి కొడుకులూ, కోడళ్లూ, మనవలంతా వచ్చేసారు..


వారంతా పశ్చాతాపంతో ఆయనకాళ్లమీద పడి ఏడ్చేసారు.. ఇంటికి తిరిగి వచ్చేయమని బ్రతిమాలారు.. సహృదయంతో ఆయన వాళ్లను దగ్గరకు తీసుకున్నారు.


నా మిగిలి ఉన్న జీవితాన్ని సంఘసేవకే ధారాదత్తం చేస్తానని రాలేనని చెప్పేసారు.. మిగిలిన సగం ఆస్తిని కొడుకుల పేరు మీద వ్రాసేస్తానంటే వారు ససేమిరా వద్దనేసారు.. ఆ సగం ఆస్తిని కూడా చిన్న చిన్న పిల్లలు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ, వైద్యం చేయించుకోలేని అసహాయ పరిస్తితులలో ఉన్న వారి కుటుంబాలకు ఒక ట్రస్ట్ ను ఏర్పాటు చేసి వారికి సహాయం చేద్దామని, ఆ నిర్వహణ పూర్తి బాధ్యతను తాము తీసుకుంటామని అనేసరికి రంగారావు గారి కళ్లనుండి ఆనందాశ్రువులు రాలిపడ్డాయి..


ఈ రోజున తమ తండ్రి వృధ్దాశ్రమంలో ఉండే పరిస్తితిని కలిపించింది తామే కనుక, భవిష్యత్ లో తమ పరిస్తితి ఏమిటోనన్న పశ్చాత్తాపం, భయం వారిలో కలగసాగింది..


ప్రతీవారం కుటుంబ సభ్యులంతా వచ్చి రంగారావుగారితో ఆశ్రమంలో ఒకరోజంతా గడిపి వెడ్తున్నారు.. తమ తండ్రిలాంటి వృధ్దులనేకులతో ఆత్మీయంగా పలకరిస్తున్నారు..

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనల కొరకు క్లిక్ చేయండి.


రచయిత్రి పరిచయం : నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం



460 views0 comments

Comments


bottom of page