top of page

ఒక వనిత బ్రతుకు


'Oka Vanitha Bratuku' written by Pitta Gopi

రచన : పిట్ట గోపి

రైలు వేగం అందుకుంది. సావిత్రి ప్రయాణంపై ఏ భయం లేకుండా కూర్చుంది. ఎందుకంటే పెద్ద ఉద్యోగస్తులు అయినా సింపుల్ గా సాధారణంగా ఉండే తన ఇద్దరు కొడుకులు పక్కన ఉన్నారు. తమ ముందు సీట్లో మరో ఇద్దరు కూర్చున్నారు. చూసేందుకు ధనవంతులుగా, భార్యభర్తలు గా ఉన్నారు. రైలు పక్క స్టేషన్ లో ఆగగానే ఓ ఇద్దరు తల్లీకూతుళ్ళు తమ పెట్టెలోకెక్కారు.

ఖాళీగా ఉన్న భార్యభర్తల సీటు వద్ద కూర్చున్న తల్లితో “ధనవంతులంటే నాకిష్టం ఉండదని తెలుసు కదా! వేరే సీటుకి వెళ్దాం” అన్నది కూతురు. ఆ దంపతులు కూడా ఆమెతో గొడవ పెట్టుకోసాగారు. గమనిస్తున్న సావిత్రి తన కొడుకులను దంపతుల వద్ద కూర్చోబెట్టి తల్లీకూతుళ్లను తన పక్కనే కూర్చోబెట్టి ఇలా చెప్పింది. "ధనవంతులందరూ అహంకారులు కారు. నేను కూడా పెద్ద ఐశ్వర్యవంతుల కుటుంబంలో పుట్టాను. అధిక డబ్బు వల్ల ఇంట్లో ఒక్కోసారి మనశ్శాంతితో ఉండేవారు కాదు. కానీ వారందరూ నా మీద ఎనలేని ప్రేమ చూపేవారు. ఏం చేసినా నా ఇష్టమే. ఏం కావాలన్నా అందరూ తెచ్చి ఇచ్చేవాళ్ళే! ఆ ఇంటికి నేనే అందాల గారాలపట్టి! మనసు ఉన్న నేను, ఓ నిరుపేద యువకుడిని ప్రేమించాను. నిజంగా పేదవాడు, కష్టపడేవాడు, అర్థం చేసుకోగలవాడని నేను నమ్మటమే అందుకు కారణం. అతను కూడా మంచివాడు, ఆలోచనపరుడు కావటంతో నా కుటుంబం, నా ఇష్టాన్ని అంగీకరించారు. పెళ్ళిఖర్చులు కూడా నా ప్రియుడికి ఇచ్చి, నా తండ్రి ఖర్చుతోనే ఘనంగా పెళ్ళి చేశారు. పెళ్లి రోజు ఎలా గడిచిందో తెలియదు. కొండమీద కోతినైనా తెచ్చే అన్నలు, ఇంట్లో అలకలు, బుజ్జగింపులు నా కుటుంబంలో అందరికంటే నేనే నవ్వుతూ కనిపించేదాన్ని. అలాంటి కుటుంబాన్ని,వారి ప్రేమను, అన్నింటిని దూరం అవుతున్నాననే ఆలోచనలు. ఎందుకంటే ప్రతి ఆడది పెళ్ళి తర్వాత తన తల్లిదండ్రులు తన వారు కాలేరు, ఎవరి కుటుంబాన్నో తన కుటుంబంలా భావించాలి కాబట్టి. ఆ ఆలోచనల నుండి తేరుకునేలోపే మెడలో తాళి పడి నా కళ్ళు ముందు ఓ చిన్న పూరి గుడిసె, అత్త, మామ, భర్త మాత్రమే కనిపించారు.

నా జ్ఞాపకాలను మరిచి కొత్త జీవితం ప్రారంభించడానికి భర్త సహకారాన్నిచ్చాడు. కొంతకాలం బాగా గడిచిన తర్వాత తల్లిదండ్రుల మాట విని సులభంగా డబ్బు సంపాదించాలని నన్ను వేధించడం మొదలెట్టాడు. నన్ను ఆసరాగా చేసుకుని నా కన్నవారి నుండి డబ్బు గుంజుతూనే ఉన్నాడు. మళ్ళీ మళ్ళీ నేను వారిని అడగకపోయినా, నా సోదరులు అప్పుడప్పుడు డబ్బు పంపిస్తూనే ఉన్నారు. అలా కాలం ముందుకెళ్ళిందో లేదో..ఇద్దరు మగ బిడ్డలకు తల్లినయ్యాను. అప్పటి నుండి నా కష్టాలు మరింత పెరిగాయి. నా భర్త వేరే మహిళతో సంబంధం పెట్టుకుని మద్యానికి బానిసై నన్ను, పిల్లలను పట్టించుకున్న పాపాన పోలేదు. ఆ మహిళతోనే కాపురం అన్నాడు. అత్త‌‌, మామ వత్తాసు పలికారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నా ఇష్టం ప్రకారమే పెళ్ళి జరిపిన నా కుటుంబానికి చెప్పుకోవాలని అనిపించలేదు.

చదువుకున్నాను కాబట్టి కంపెనీ ఉద్యోగానికి వెళ్తే వేధింపులు మొదలయ్యాయి. దీంతో తొలిసారి కూలి పనికి వెళ్లి పిల్లల ఆకలి తీర్చాను. ఒక్కోసారి పస్తులుండాల్సిన పరిస్థితి. నా చెవి, ముక్కు పోగులమ్మి తోపుడు బండితో కొత్త జీవితం మొదలెట్టాను. అలా నా ఆలోచనలతో నా సంపాదన పెంచుకుంటూ పిల్లలను చదివించాను. పిల్లలు పెద్ద చదువుల కోసం ఎక్కడ చదివితే అక్కడ మా నివాసం. అలా నా సంపద పెద్ద రెస్టారెంట్ పెట్టేంత అయ్యింది. ఇద్దరు పిల్లలకు మంచి బుద్ధులు నేర్పించాను. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే కొడుకులు వారు. ఉద్యోగంలో స్థిరపడ్డారు. అలా ఆడదానిగా నా కష్టం వృధా కానందుకు ఆనందంగా ఉంటున్న క్షణంలో ఓ వార్త నన్ను మళ్ళీ గత జ్ఞాపకాల్లోకి వెళ్ళేలా చేసింది. నా భర్తను ఆ మహిళ మోసం చేసి వెళ్ళిపోగా ఒంటరిగా ఏ సంపాదనా లేకుండా చావు బ్రతుకుల మద్య ఉన్నాడని, గతాన్ని నా కొడుకులకు చెప్పాల్సి వచ్చింది.

వారు అందుకు సానుకూలంగా స్పందించి వాళ్ళ నాన్నని చూసుకుందాం అని చెప్పటంతో నా ఆనందానికి అంతులేకుండా పోయింది. ఫ్లైట్ లో వెళ్దాం అని కొడుకులు చెప్పినా, నా గత పరిస్థితి తలుచుకుని ఇలా అతని వద్దకు రైలు ప్రయాణానికి వీళ్ళని ఒప్పించాను. ఒకప్పుడు పిల్లలకు తీసుకుని ఇలా ప్రయాణం చేసిన నేను ఇప్పుడు నా కొడుకులే నా భర్త వద్దకు తీసుకుపోయే స్థాయికి ఎదిగారు. నేను ఇప్పుడు మళ్ళీ ఐశ్వర్యవంతురాలిని. కొంతమంది ధనవంతులు అవ్వడం వెనుక తమ కష్టం దాగి ఉంటుంది. అలాంటి వారు పదిమందికి మేలు చేస్తారు. నా పిల్లలను కష్టపెట్టకుండా చదివించాను. కానీ నా కష్టం తెలియకుండా కాదు. అడుగడుగునా నా కష్టం తెలియజేయటంతో వారిలో ఏ అహంకారం దరి చేరలేదు” అని సావిత్రి చెప్పేసరికి అక్కడ ఉన్నవారంతా దుఃఖంతో కన్నీరు కార్చారు. పిల్లలను ఈ స్థాయికి తెచ్చినందుకు మరికొందరు ఆనందపడసాగారు.


రచయిత పరిచయం : సమాజం వేసే తప్పుడడుగులను సరిచేయాలంటే పదిమందికి మంచి విషయాలు తెలపాలి. అలా జరగాలంటే మనం మంచి రచయితగా మారి పాఠకులకు అందేలా చేయాలనేది నా అభిలాష. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తాను. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు సమాజం కోసం ఆలోచిస్తే ఈ సమాజం అబివృద్ది పధంలో నడువటం ఖాయం.195 views1 comment

1 comentario


Awesome story keep it up👍👍

Me gusta
bottom of page