top of page

ఒక్కసారి ఆలోచించండి! నాన్నా!


'Okkasari Alochinchandi Nanna' written by K. V. Lakshmana Rao

రచన : కె.వి.లక్ష్మణ రావు

"నాన్నా! ఎవరోరామయ్యట .. ‘ఆఫీసర్ గారున్నారా? ఇంటికి రమ్మంటారా?’ అని అడుగు తున్నారు!" అన్నాడు పదేళ్ల అజయ్ .

చంద్రం హాల్లో సోఫాలో కూర్చుని తీరిగ్గా పేపర్ చదువుతున్నాడు. "రామయ్య మనింటికి ఆల్రెడీ వచ్చేశాడు. ఇక అవసరం లేదు. నేరుగా ఆఫీసు కొచ్చి తన కౌలు రైతు కార్డు తీసుకోమని చెప్పు!"అన్నాడు చికాగ్గా మొహం పెట్టి..

అజయ్ ఫోన్ లో తండ్రి చెప్పినట్టుగానే చెప్పి ఫోన్ ఆఫ్ చేశాడు.

"మీ ఫోన్ నాన్నా!" అంటూ ఫోన్ చంద్రం చేతికిచ్చాడు.

చంద్రం ఫోన్ తీసుకుంటూ "నా ఫోన్ ఎందుకు నువ్వు లిఫ్ట్ చేశావ్? పెద్దవారి ఫోన్ అడక్కుండా తీసుకోవచ్చా?" అన్నాడు కోపంగా.

అజయ్ నాన్నను భయం భయంగా చూస్తున్నాడు.

సమాధానం చెప్పలేక సతమతం అవుతున్న అజయ్ ని గమనించింది నీరజ.

వంటింట్లో నుండి చీర చెంగు తో చేతులు తుడుచుకుంటూ హాల్లోకి వచ్చింది.

"వాడిని మీ ఫోన్ లిఫ్ట్ చేయమని నేనే చెప్పాను. ఫోన్ చాలా సార్లు రింగ్ అయింది. మీరు పేపర్ చదవడంలో పడితే పక్కన పిడుగు పడినా పట్టించు కోరు కదా! నేను వంట పనిలో హడావిడి గా వున్నాను. అందుకే ఫోన్ వాడు తీశాడు." అంది నీరజ.

"సరే! స్కూల్ బస్ వచ్చే టైమ్ అవుతోంది. త్వరగా రెడీ గా!" అన్నాడు చంద్రం.

"నేను రెడీ నాన్నా!"అన్నాడు అజయ్ స్కూల్ బ్యాగ్ సర్దుకుంటూ..

అప్పుడే స్కూల్ బస్ వచ్చి ఇంటి గేటు ముందు ఆగినట్లుంది.. హారన్ వినిపిస్తోంది . నీరజ లంచ్ బాక్స్ రెడీ చేసి అజయ్ చేతికిచ్చింది. అజయ్ స్కూల్ బ్యాగ్ ను వీపున తగిలించుకుని చంద్రం వద్దకు వచ్చి ఆగాడు.

"నాన్నా! పెన్ను కావాలి!"నెమ్మదిగా అడిగాడు.

చంద్రం చదువు తున్న పేపర్ ను పక్కన పెడుతూ , "నిన్న కూడా ఇలాగే పెన్ను కావాలని ఆడిగావు.. కొత్త పెన్ను ఇచ్చాను. ఏమైంది?" అన్నాడు.

"ఆ పెన్ను పడిపోయింది నాన్నా!" అన్నాడు అజయ్ బెరుగ్గా చూస్తూ.

చంద్రం సోఫాలోంచి లేచాడు. అజయ్ ను దగ్గరకు తీసుకుంటూ "ఈ భయం పెన్ను పోగొట్టుకునే ముందుండాలి. వారం రోజులుగా , రోజూ స్కూల్ కెళ్లే ముందు పెన్ను అడుగుతున్నావ్. మరో సారి ఇలా అడిగితే కొడతాను. తెలిసిందా?" సున్నితంగా హెచ్చరిస్తూ అల్మారా లోంచి తీసి మరో కొత్త పెన్నును అజయ్ చేతిలో పెట్టాడు.

అజయ్ ఆ పెన్ను ను బ్యాగ్ లో పెట్టుకుంటూ "అమ్మా! నాన్నా! బాయ్!" అంటూ స్కూల్ బస్ ఎక్కాడు.

"పాపం వాడసలే భయస్తుడండి! గట్టిగా అరిచి వాడిని భయ పెట్టకండి!"చంద్రానికి టిఫిన్ పెడుతూ అంది నీరజ.

"వాడికి వస్తువు విలువ తెలిసి రావాలనే కొంచెం గట్టిగా చెప్పాను. తప్పులేదు." తనను సమర్ధించుకుంటూ అన్నాడు.

"సంతోషం! తీసుకోండి లంచ్ బాక్స్ !"అంటూ బాక్స్ ను చంద్రం కిచ్చింది. టిఫిన్ తినడం పూర్తిచేసి లంచ్ బాక్స్ ను బ్యాగ్ లో పెట్టుకున్నాడు చంద్రం.

."బై నీరూ ! అంటూ బైక్ స్టార్ట్ చేసాడు.

సాయంత్రం ఆఫీస్ నుండి ఇంటికొచ్చిన చంద్రానికి హాల్లో నీతి పద్యాలు శ్రద్ధగా చదువుతున్న అజయ్ కనబడ్డాడు.

ఎంతో చక్కగా భావయుక్తంగా, రాగయుక్తంగా చదువు తున్న వాడిని చూడగానే చంద్రానికి సంతోషం వేసింది. అజయ్ పక్కనే కూర్చుంటూ "పద్యాలు బాగా చెబుతున్నావ్! గుడ్!” అని మెచ్చుకున్నాడు.

"రేపు మా స్కూల్లో పద్యాల పోటీ ఉంది నాన్నా! తప్పులు లేకుండా ఎవరైతే బాగా చెబుతారో వారికే బహుమతి వస్తుందని మా టీచర్ చెప్పారు. అందుకే ప్రాక్టీస్ చేస్తున్నా!"అన్నాడు.

"ఇలా చెబితే, తప్పకుండా బహుమతి సాధిస్తావ్!" చంద్రం అజయ్ కేసి మెచ్చుకోలుగా చూస్తూ అన్నాడు.

అప్పుడే చంద్రం సెల్ రింగైంది. తీసి చూస్తే ఏదో నంబర్ వస్తోంది.

ఫోన్ లిఫ్ట్ చేసి "హలో! ఎవరు?" అన్నాడు.

"నా పేరు సత్తికొండ బాబయ్యా! రామాపురం రైతును" అన్నాడు అవతలి వ్యక్తి.

"సరే! ఎందుకు ఫోన్ చేసావో చెప్పు!” కొంచెం విసుక్కుంటూ అన్నాడు చంద్రం.

"కోప్పడకండి బాబయ్యా! నా కౌలు రైతు కార్డు తమ కాడకు వచ్చిందో లేదో తెల్సు కుందామని చేశానయ్యా?" సత్తికొండ బ్రతిమాలు తున్నట్లుగా అన్నాడు.

"రేపు ఉదయమే మా ఇంటికి వచ్చి కనపడు. అప్పుడు నీ కార్డు సంగతి చూద్దాం. ఇలా ఫోన్ లో పనులవ్వవు" అని.. అట్నుంచి సత్తికొండ చెప్పే మాట వినకుండానే ఫోన్ ఆఫ్ చేసేశాడు .

"మరో కౌలు రైతా?" చంద్రానికి కాఫీ ఇస్తూ అడిగింది నీరజ.

"అవును!"అన్నాడు.

"ఇంటికి రమ్మన్నారు ! కదూ!" అడిగింది.

"అవును ! అన్నీ తెలిసి అడుగు తావే?" అన్నాడు కాఫీ త్రాగుతూ.

"తప్పు కదండీ!" అంది కొంచెం బాధగా.

"తప్పు కాదు.. నాకు తప్పదు. నేను లక్ష మందికి సమాధానం చెప్పుకోవాలి. ఇదంతా నా వొళ్ళో పడేది కాదు. నాకు ఉద్యోగం రాక రాక చచ్చి వచ్చింది. దీపం ఉండగానే ఇల్లు చక్క బెట్టుకోవాలి." అన్నాడు గొప్పగా సమర్ధించుకుంటూ.

"నెల నెలా మీకు గవర్నమెంట్ జీతం ఎందుకిస్తోంది?" అంది నీరజ.

"అదేం సరిపోతుంది.. అయినా ఇదంతా మీకోసం కాదా?" అన్నాడు నవ్వుతూ.

"వచ్చినదానితోనే సరిపెట్టకుందాం!. నేనేమైన నగలడిగానా? కార్లు బంగళాలు అడిగానా?" అంది చంద్రం కేసి సూటిగా చూస్తూ.

"ఓసి పిచ్చిదానా! రెవెన్యూ అంటేనే ఆదాయం అని అర్ధం. నాదృష్టిలో జీతం అంటే కూలి.. మామూలు అంటే బహుమతి.. రైతులు మనకి ఇచ్చేది వాళ్ల ఆనందం కొద్దీ మనకిచ్చేది బహుమతి.. అది నేనొక్కడినే తీసుకునేది కాదు. అందరికీ పంచాలి. ఇవన్నీ నీకు అర్థం కావుగానే నీపని చూసుకో" అన్నాడు తేలిగ్గా తీసి పారేస్తూ.

"మీరు మారరు!" అసహనంగా అంటూ వంటింట్లోకి వెళ్ళింది నీరజ.

"పద్యం చదవడం ఆపేశావే?" అన్నాడు చంద్రం అజయ్ ప్రక్కన కూర్చుని.

"అమ్మ మీరు మాట్లాడుకుంటున్నారు కదా! అందుకే ఆపాను" .

"చిన్న పిల్లాడవు. మా మాటలు నీకు అర్ధం కావు కానీ బాగా చదువుకో " అని అజయ్ భుజం తట్టి పడక గదిలోకి

వెళ్ళిపోయాడు. ఆ రాత్రి నీరజ కు సరిగా నిద్ర పట్టలేదు.. భర్త ప్రవర్తనను ఆమె ఏవిధంగానూ అంగీకరించ లేక పోతోంది. ఆమె కలత నిద్రలో వుండగానే

తెల్లారింది.

"ఆఫీసర్ సంద్రం గారిల్లు ఇదే నా బాబూ?" అన్న మాట విని వీధి అరుగు మీద కుర్చీలో కూర్చుని హోంవర్క్ చేసుకుంటున్న అజయ్ తలెత్తి చూశాడు.

మాసినగడ్డం, చిరిగిన చేతుల బనీను, నలిగిన పంచి తో భుజం మీద తుండు గుడ్డ తో జుట్టు సగం వరకూ తెల్లబడి పేదరికానికి చిరునామాలా ఉన్న వ్యక్తి ని చూసి అజయ్ వెంటనే లేచాడు.

"నాన్నగారు లోపల గదిలో వున్నారు. పిలుస్తాను. కూర్చోండి ! మీ పేరు?" అంటూ కుర్చీ చూపించాడు అజయ్ మర్యాదకు చిన్నగా నవ్వుతూ.

"నా పేరు సత్తికొండ బాబూ,! కుర్చీ వద్దులే బాబూ! కిందే నాకు బావుంటాది. నాకదే ఇట్టం" అంటూ తుండు గుడ్డతో నేలను దులిపి అక్కడే కూర్చున్నాడు.

అజయ్ లేచి ఇంట్లోకి వచ్చాడు. చంద్రం సోఫాలో కూర్చుని తీరిగ్గా పేపర్ చదువుతున్నాడు.

"నాన్నా! మీ కోసం సత్తి కొండ ట.. వచ్చారు. బయట వున్నారు !" అన్నాడు అజయ్.

చంద్రం మాత్రం పేపర్ లోంచి తల బైటకు పెట్టకుండానే "తెలుసు! నువ్వు పోయి నీ పని చూసుకో "అన్నాడు .

అజయ్ కు తండ్రి సమాధానం నచ్చలేదు.. నెమ్మదిగా వెళ్ళి నీతి పద్యాలు చదవ సాగాడు. సత్తికొండ దిక్కులు చూస్తూ అలాగే కూర్చుని ఉన్నాడు.

"అతను వచ్చి చాలా సేపు అయింది!” చంద్రానికి గుర్తు చేసింది నీరజ.

"ఆ విషయం నాకు తెలుసు. అవసరం అతనిది. ఆ మాత్రం వెయిట్ చేయించకుండా నేను వెళ్ళిపోతే, ఈ ఆఫీసర్ విలువ తగ్గిపోదూ?” అంటూ పేపర్ టీపాయ్ మీద పడేసి బయటకు వచ్చాడు.

ఉయ్యాల బల్లమీద కూర్చొని ఊగుతూ "ఏం? సత్తికొండా ! ఉదయాన్నే ఇంటికి వచ్చావ్ . ఏమిటి విశేషం?" ఏమి తెలియని వాడిలా అడిగాడు.

సత్తికొండ తన చేతి తుండు గుడ్డను భుజంపై వేసుకుని , చంద్రం వైపు వంగుతూ రెండు చేతులూ జోడించాడు. "తమరు నిన్న పోన్ చెత్తే రమ్మన్నారు కదయ్యా!" అన్నాడు.

"ఆ!ఆ! గుర్తొచ్చింది.. నీకు కౌలు రైతు కార్డు వచ్చింది!' చెప్పాడు .

"ఆ! చాలా సంతోసం బాబు, చల్లని మాట సెప్పారు!” అన్నాడు ఆనందపడుతూ.

"నీ సంతోషం సరే! నన్ను సంతోష పెట్టవా మరి?" ఏ మాత్రం మొహమాటం లేకుండా అడిగాడు చంద్రం.

"తమరి సంతో సానికి నన్నేటి సేయమంటారు బాబు?" బుర్రగోక్కుంటూ ఏమి తెలియక అమాయకంగా అడిగాడు .

"అలా ఆడిగావ్ బావుంది.పేదవాడివి కదా! నాకు మీ లాంటి వాళ్లంటే జాలి. అందుకు ఓ రెండువేల రూపాయలు ఇవ్వు చాలు!” అన్నాడు ఉయ్యాల బల్ల మీద నుండి దిగుతూ.

సత్తికొండ దీనంగా చూశాడు.

"అంత ఇచ్చుకోలేనయ్యా!” అనలేక అన్నాడు.

ఆ అరుగు మీదే కొంచెం దూరంగా పద్యాలు చదువుతున్న అజయ్ చదవడం ఆపి నాన్న కేసి పరిశీలన గా చూడసాగాడు.

"ఏం! కౌలు రైతు కార్డు మీద బ్యాంక్ వాళ్ళు లోను ఇస్తారు. గవర్నమెంట్ పంట సరిగ్గా పండినా పండకపోయినా.. సంవత్సరానికి కనీసం పన్నెండు వేలు రూపాయలు ఇస్తారు.

లాభాన్ని ఆనందంగానే తీసుకుంటారు. ఇచ్చేటప్పుడు చేతులు రావు. కార్డు వచ్చేలా చేసిన నన్ను ఆనంద పరచడానికి మాత్రం ఆలోచిస్తారు. నేను పై వాళ్లకు ఎక్కడనుంచి ఇవ్వాలి?" అన్నాడు కొంచెం కోపంగా.

"కోపంవద్దు బాబయ్యా!"అంటూ..తన జేబులో ఉన్న మొత్తం డబ్బు కాగితాలను చంద్రం చేతిలో పెట్టాడు.

మడతలు పడి, నలిగి పోయిన ఆ నోట్ల కేసి అసహనంగా చూస్తూ "ఇవి చెమట కంపు కొడుతున్నాయి. ఏం మనుష్యులయ్యా మీరు?" అన్నాడు.

"మట్టి మడుసులం బాబూ! మట్టిని నమ్ముకు బతికేటోళ్లం ! రేయిపగలు కట్టపడే మా సంపాదన కాడ సెమట కంపె వత్తది కానీ సెంటు కంపు రాదయ్యా!"జీవంలేని ఓ నవ్వు నవ్వుతూ అన్నాడు.

"ఇవి పదిహేను వందలే.. ఇంకా ఐదు వందలు ఇవ్వాలి." నోట్లన్నీ లెక్కపెట్టి చెప్పాడు చంద్రం.

"బయట అన్నీ అప్పులు. ఇంటి కాడ రోజూ అన్నంకోసం తిప్పలు. ఈ సారికి సరి పెట్టుకో బాబూ!" దీనాతి దీనంగా అన్నాడు సత్తికొండ.

"సరేలే! ఏడవకు. వెళ్లు..మధ్యాహ్నం ఆఫీసు కు రా! నీకు కార్డు ఇస్తాను."

"దర్మ పెబువులు" మరొక్కసారి చేతులు జోడిస్తూ ముందుకు నడిచాడు.


"సెరువు కాడ జలగలు లాంటోళ్లు. రసం పీల్చ కుండా ఒదిలి పెట్టరు!"అని సత్తికొండ తిట్టుకుంటూ నడవడం అక్కడే మొక్కల దగ్గర పూలు కోస్తున్న అజయ్ దృష్టి దాటి పోలేదు.

డబ్బు జేబులో పెట్టుకుంటూ అప్పుడే హాల్లోకి వచ్చిన చంద్రంతో "ఇతని దగ్గర కూడా లంచం పుచ్చుకున్నారా?" నీరజ అసహనంగా నిలదీసింది.

"లంచం కాదే పిచ్చిమొద్దు! నైవేద్యం!"సమర్ధించుకుంటూ అన్నాడు.

సోఫాలో కూర్చుని తిరిగి పేపర్ చదవడం మొదలు పెట్టాడు.

అప్పుడే స్కూల్ బస్ వచ్చి ఆగింది. డ్రైవర్ హర్ను కొడుతున్నాడు.

"అజయ్ ! నీ స్కూల్ బస్ వచ్చింది.!"అంటూ అజయ్ ను పిలిచాడు.

అజయ్ స్కూల్ బ్యాగ్ తగిలించుకుని, అమ్మ ఇచ్చిన లంచ్ బాక్స్ చేత్తో పట్టుకుని హాల్లోకి వచ్చాడు.

"నాన్నా!" అని పిలిచాడు.

చంద్రం పేపర్ కిందకు దించి "పద్యాలు బాగా చెప్పు! బహుమతి రావాలి! ఆల్ ద బెస్ట్!" అన్నాడు.

"థాంక్స్ నాన్నా!"

ముందుకు వెళ్లకుండా తన దగ్గరే నిలబడి పోయిన అజయ్ ని చూసి "వెళ్లడం లేదే" కొంచెం గట్టిగానే అడిగాడు.

"పెన్ను కావాలి నాన్నా!" ఎప్పటిలాగే మళ్ళీ అడిగాడు.

ఆ మాట వినగానే చంద్రం కోపంగా లేచాడు. చేతిలో ఉన్న పేపర్ ను దూరంగా విసిరి కొట్టాడు. డ్రైవర్ తో వెళ్ళిపొమ్మని హాల్లో నుండే చెప్పాడు. స్కూల్ బస్ ముందుకు కదిలి పోయింది. నాన్న కోపం చూసి భయ పడిన అజయ్ ఒక్కసారిగా అమ్మ వెనక్కు నక్కాడు.

చంద్రం కళ్లెర్ర జేస్తూ "నీరజా! పక్కకు తప్పుకో!"గట్టిగా అరిచాడు.

నీరజ తప్పుకోకుండా "పసి పిల్లాడండీ!.. ఈ తప్పుకు కాయండి. కొట్టకండి." తల్లిప్రేమ తో బ్రతిమాలింది.

"ఒకతప్పు అయితే క్షమించవచ్చు. రోజూ తప్పుచేస్తే ఎలా? రోజు కో పెన్ను పోయిందంటే ఎక్కడ నుంచి తేవాలి ?" అంటూ అజయ్ రెక్క పట్టుకుని చేతిలోకి బెల్టు అందుకున్నాడు.

"కొట్టండి నాన్నా! నేను తప్పు చేశానని కొట్టడానికి సిద్ధ పడ్డారు. కానీ మ్మిమ్మల్ని ఎవరూ కొట్టరనేగా లంచం తీసుకుంటూ తప్పు చేస్తున్నారు" అన్నాడు.

అజయ్ నోట "లంచం" అనే మాట వినగానే చంద్రం ఒక్కసారిగా నిర్ఘాంత పోయాడు.

చేతిలో నున్న బెల్టు జారిపోయింది.

నీరజ కూడా అజయ్ ను ఆశ్చర్య పోతూ చూసింది.

"నేను లంచం తీసుకుంటానని నీకెవరు చెప్పారు"? అజయ్ రెండు చేతులను గట్టిగా పట్టు కొని అడిగాడు చంద్రం.

"నాన్నా! నేను రోజూ చూస్తున్నాను. రెండు వారాల క్రితం సోమయ్య , నిన్న ఉదయం ఫోన్ చేసిన రామయ్య, ఈరోజు సత్తి కొండ మనింటికి వచ్చారు. వాళ్ల దగ్గర మీరు డబ్బులు తీసుకున్నారు. నేను చూశాను. వాళ్ళు వెడుతూ వెడుతూ నిన్ను తిట్టు కోవడం విన్నాను. అంతే కాదు నాన్నా! రామయ్య మనవడు రాజేష్ నా క్లాస్ మేట్. వాడు వారం క్రితం నాతో ఏమన్నాడో తెలుసా?" అంటూ ఏడవడం మొదలు పెట్టాడు.

"ఏమన్నాడు? చెప్పమ్మా!"నీరజ అంది అజయ్ ని దగ్గరకు తీసుకుంటూ.

"ఆ రోజు ఇంటర్వెల్ లో నా ఫ్రెండ్స్ అందరి ముందూ 'మీ డాడీ లంచం తీసుకుంటే గాని పని చేయరట కదా! మా తాతయ్య ఒకరితో అంటుంటే విన్నాను' అన్నాడు. నాకెంత ఏడుపొచ్చిందో ! నాన్నా! అది అబద్ధం అని చెప్పలేను. ఎందుకంటే నేను నువ్వు లంచం తీసుకోవడం చూశాను కనుక.

ఇప్పుడు కూడా సత్తికొండ దగ్గర లంచం తీసుకోవడం చూశాను.

అతను నిన్ను చెరువులో జలగతో పోల్చుతూ తిట్టడం నీకు తెలియదు నాన్నా.. నేను విన్నాను."!

చంద్రం కొడుకు కేసి చూస్తూ వాడు చెప్పేవి నిశ్చేష్టుడై వింటున్నాడు.

"నాన్నా! తల్లి దండ్రులు దైవంతో సమానం అని మా టీచర్ చెప్పారు. దైవం లాంటి నిన్ను తిడితే నాకు బాధ కలగదా?"

అంటూ తండ్రి కేసి సూటిగా చూశాడు.

చంద్రం మౌనంగా చూస్తున్నాడు. అతనిలో అంతర్మథనం ప్రారంభమయ్యింది. తనేదో అధఃపాతాలంలో కూరుకుపోయిన ట్లూ.. కొడుకు ఆకాశమంత ఎదిగి పోయినట్లు అనిపించింది.

"నీకు వాళ్ళ బాధ తెలియాలనే పెన్ను పడిపోయిందని, రోజూ కొత్త పెన్ను కావాలని అడిగాను. నువ్వు కొన్న పెన్నులు ఇవిగో నాన్నా!" అంటూ బ్యాగ్ లోంచి తీసి ఆ పెన్నులన్నీ చంద్రం చేతిలో పెట్టాడు.

నీరజ కొడుకులో గీతోపదేశం చేసిన శ్రీకృష్ణుడుని చూసింది. నిన్న కాక మొన్న పుట్టినవాడు ఎంత ఎదిగి పోయాడు అని ఆశ్చర్యపోయింది.

అజయ్ ను దగ్గరకు తీసుకుని గట్టిగా హృదయానికి హత్తుకుo ది… "మనకు వీడు ఎప్పుడూ పసి పిల్లాడిగానే కనిపించ వచ్చు. కానీ వయసు తో పాటు వీడి జ్ఞానం కూడా పెరుగు తోందని మనం గమ నించాలండి!"అంది నీరజ.

"నాన్నా! ఐదు రూపాయల పెన్ను రోజూ కొని ఇమ్మంటేనే నా మీద కోప్పడుతూ తప్పు చేశానన్నావు కదా! మరి రోజూ వేల రూపాయలు లంచం తీసుకుంటే.. వాళ్ళు ఎంత కోప్పడతారో, బాధ పడతారో, ఒక్కసారి ఆలోచించండి నాన్నా! అబద్ధం ఆడి మిమ్మల్ని బాధ పెడితే నన్ను కొట్టండి నాన్నా!" అన్నాడు అజయ్ కళ్ళు తుడుచుకుంటూ చేయిచాపి.

అజయ్ మాటలు విన్న చంద్రం కళ్ళు తడి బారాయి.

అజయ్ ను దగ్గరకు తీసుకున్నాడు.

"లంచం తీసుకుంటూ తప్పు చేస్తున్నానని తెలుసు. అందరూ చేసేపనే నేనూ చేస్తున్నాను అనుకున్నాను. కానీ, లంచం ఇచ్చిన వాళ్ళను , నా వాళ్ళను ఇంతలా బాధ పెడుతున్నానని గ్రహించ లేకపోయాను. చిన్నవాడివయినా నా కళ్ళు తెరిపించావు. పుత్రుడు పున్నామ నరకం నుంచి తప్పిస్తాడు అంటారు. నువ్వు ఇహలోక నరకం నుంచే తప్పించావు. ఈరోజు నుంచి ఎటువంటి అవినీతి పనులు చెయ్యనని నీ మీద ప్రమాణం చేస్తున్నాను రా!" అంటూ అజయ్ ని సుళ్ళు తిరిగిన కళ్ళతో కౌగిలించుకున్నాడు చంద్రం.

"నీకు పద్యాల పోటీ ఉంది కదా! నేను తీసుకెడతాను. . స్కూల్ కు పద!"అంటూ వాడి బ్యాగ్ చేతిలోకి తీసుకున్నాడు చంద్రం.

తనకేసి అనుమానంగా చూస్తున్న అజయ్ తో "సందేహించకు అజయ్..! రామయ్యకు, సత్తికొండకే కాదు, నేను డబ్బులు తీసుకున్న ప్రతీ ఒక్కరికీ వారి వారి డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను ! సరేనా!" అన్నాడు.

అజయ్ ఎంతో ఆనందిస్తూ "మా మంచి నాన్న " అంటూ నాన్నకు ముద్దిచ్చాడు. నాన్నతో కలిసి బడికి బయలు దేరాడు. నీరజ తృప్తిగా కళ్ళు తుడుచుకుంది.


ఆ రోజు తరువాత రామయ్య, సత్తికొండ లాంటి వాళ్ళెవ్వరూ చంద్రం ఇంటికి రాలేదు. అజయ్ పెన్ను పోయిందని ఎన్నడూ చంద్రంతో అబద్ధం ఆడలేదు.


సమాప్తం...!!


నేను ఇప్పటి వరకూ 150 బాలల కథలు, 50 వరకూ ప్రౌఢ కథలు(సామాజిక కథలు)రాయడం జరిగింది. ఆ కథలన్నీ ఈనాడు హాయ్ బుజ్జి, బాల భారతం, విశాఖ సంస్కృతి, సాక్షి ఫండే, బొమ్మరిల్లు, వార్త, ఆంధ్రభూమి వంటి ప్రముఖ పత్రికల్లో బాలల కథలు ప్రచురితం అయ్యాయి. తెలుగు వెలుగు, ఆంధ్రభూమి, సహరి (అంతర్జాల సమగ్ర వార పత్రిక) ,స్నేహ (ప్రజా శక్తి), జాగృతి వార పత్రిక, ధర్మ శాస్త్రం,, హాస్యా నందం, విపుల, చతుర , రమ్య భారతి వంటి ప్రముఖ, వార, మాస పత్రికల్లో సామాజిక కథలు ప్రచురితం అయ్యాయి. 2013 జనవరి విపుల మాస పత్రిక లో ప్రచురితమైన కార్డు కథ "ఏ పేరుతో పిలిచినా" ను ప్రముఖ నటులు, రచయిత అయిన శ్రీ lb. శ్రీరామ్ గారు 2017 లో నవంబర్ నెలలో షార్ట్ ఫిల్మ్ గా తీయడం నాకు మధుర జ్ఞాపకంగా మిగి లింది. చదవడం చాలా ఇష్టం. రాయడం మరింత ఇష్టం.

కె.వి.లక్ష్మణ రావు


69 views1 comment

1 Comment


చక్కని ఇతివృత్తంతో రాశారు. బాగుంది ఆర్యా. అభినందనలు.

Like
bottom of page