top of page

ఆపరేషన్ న్యూస్పేపర్




'Operation News Paper' - New Telugu Story Written By D V D Prasad

Published In manatelugukathalu.com On 21/09/2024

'ఆపరేషన్ న్యూస్పేపర్' తెలుగు కథ

రచన: డి వి డి ప్రసాద్

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జేబులో చెయ్యపెట్టాడు రఘు. ఇరవై రూపాయల కాగితం చేతికి తగిలింది. అదే ఆఖరి నోటు. చిల్లర కూడా ఏమీ మిగలేదు. 'ఈ డబ్బులతో షేర్డ్ ఆటోలో ఇంటికెళ్దాలా, లేక టీ తాగాలా' అనే మీమాంసలో పడ్డాడో క్షణం. చివరికి టీ తాగాలన్న కోరికే జయించింది. ఎదురుగా కనిపించిన టీ కొట్టు వద్దకు వెళ్ళి టీ ఆర్డరిచ్చాడు. టీ కొట్టువాడు ఇచ్చిన వేడివేడి టీ ఊదుకుంటూ తాగుతున్న రఘు దృష్టి రోడ్డుకి అటుపక్క ఉన్న 'మహాలక్ష్మి బ్యాంక్' పై పడింది. 


బ్యాంకులోకి వస్తూ పోతున్నవాళ్ళను చూస్తూ మెల్లగా టీ తాగుతున్నాడు. ఈ మధ్యనే బ్యాంక్ టెస్టులు రాసాడు, ఇంకా ఫలితాలు వెల్లడికాలేదు. దేవుడి దయవల్ల బ్యాంకులో ఉద్యోగం వస్తే తన కష్టాలన్నీ తీరిపోతాయి. తండ్రి రిటైరై రెండేళ్ళు గడిచిపోయినా తనింకా చేతికి అందిరాలేదు. ఈ రోజుల్లో అందరూ ఇంజినీరింగ్, సాఫ్ట్ వేర్ చదువులపై మక్కువ చూపిస్తే, తను మాత్రం అయితే సివిల్ సర్వీస్, లేకపోతే బ్యాంకులో ఆఫీసర్గా ఉద్యోగం చెయ్యాలని కలలు కన్నాడు. ముఖ్యంగా ఐపిఎస్గా సెలెక్టైతే బావుణ్ణు అన్న ఆలోచన రఘుది. తన స్నేహితుడు కిషోర్ తండ్రి సుబోధ్ కులకర్ణి పోలీస్ కమీషనర్. చాలా సార్లు స్నేహితుడితో కలిసి వాళ్ళింటి వెళ్ళిన రఘుకి ఎప్పటికైనా అలాంటి ఉద్యోగం చెయ్యాలన్న కోరిక కలిగింది. 


అతని హోదా, పలకుబడి, ఆ ఠీవి చూస్తే ఎవరికైనా అలాంటి కోరిక కలగడం సహజం. అందులోనూ రఘులో దేశభక్తి మెండుగా ఉంది. దేశంలో ఉగ్రదాడులు జరిగినప్పుడల్లా తనెలాగైనా పోలీసు డిపార్ట్మెంట్లో చేరి, వాళ్ళ ఆటలు కట్టించి, దేశ సేవ చెయ్యాలన్న సంకల్పం రఘులో పెరగసాగింది. అందుకే ఎంత కష్టమైనా సివిల్స్కి, అలాగే సమాంతరంగా బ్యాంక్ టెస్ట్ కోసం కూడా ప్రిపేర్ అవుతున్నాడు. సరైన కోచింగ్ తీసుకోవడానికి అవకాశం లేకపోయినా తన స్వశక్తిపైనే ఆధారపడి తన ప్రయత్నం చేస్తున్నాడు. 


రెండుసార్లు సివిల్స్ ప్రిలిమినరీలో ఉత్తీర్ణత సాధించినా, మెయిన్స్ దగ్గరికి వచ్చేసరికి ఓటమి ఎదురవుతోంది. ఇంకా అదృష్టం కలిసిరాలేదు. అందుకే, సివిల్స్కి ప్రిపేర్ అవుతూనే, బ్యాంక్ ఆఫీసర్ టెస్ట్ పరీక్షలు రాసి, ఫలితాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నాడు. బ్యాంక్ ఉద్యోగంలో కుదురుకొని, మళ్ళీ మరోసారి సివిల్స్కి ప్రిపేర్ అవొచ్చు అన్న ఆలోచనలో ఉన్నాడు. కాలేజీలో తన సీనియర్లు కొంతమంది బ్యాంక్ ఆఫీసరుగా కొన్నాళ్ళు ఉద్యోగం చేసి ఆ తర్వాత సివిల్స్లో నెగ్గిన వాళ్ళూ ఉన్నారు. అందులో టాపర్స్ కూడా ఉన్నారు.


అందుకే వచ్చిన ఏ అవకాశం వదులుకోవడానికి సిద్ధంగా లేడు. అయితే, ఈ మధ్య ఇంట్లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల వల్ల, అంతవరకూ దొరికిన ఏ చిన్న పనైనా చెయ్యడానికి సిద్ధపడ్డాడు. అక్కడే ఉన్న సూపర్ బజార్లో సేల్స్మేన్ ఉద్యోగం ఉందంటే వెళ్ళి తిరిగి వస్తున్నాడు. తనకంటే ముందు వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడంతో నిరాశగా తిరిగివచ్చాడు. 


తండ్రి పెన్సన్ తోనే ఇప్పటివరకూ ఇల్లు గడుస్తోంది. అక్క పెళ్ళికి చేసిన అప్పు అలానే ఉంది! ప్రతీ ఇంట్లో ఉండే సాధకబాధకాలు ఉన్నాయి. కనీసం బ్యాంక్ ఉద్యోగంలో సెలెక్టైతే, తండ్రి బరువు బాధ్యతలు కొంతైనా తగ్గించినవాడవుతాడు. అలాగే తన కేరీర్ కూడా అంతే ముఖ్యం. ఇలా ఆలోచిస్తూ టీ తాగుతున్న రఘుని నవ్వుతూ పలకరించాడో వ్యక్తి. ఆలోచనల్లోంచి తేరుకొని ఆ వ్యక్తివైపు చూసాడు.


"హాయ్! నా పేరు అజిత్! నాతో వస్తే మీకో పని ఇస్తాను! మీరు ఊహించలేనంత డబ్బులు ఇస్తాను. ఆ డబ్బుతో మీ కష్టాలన్నీ తీరిపోతాయి." అంటూ అ వ్యక్తి రఘువైపు నవ్వుతూ చూసాడు.


ఆశ్చర్యంగా చూసాడు ఆ వ్యక్తివైపు తన మనసులో మాట అతనికెలా తెలిసిందోనని అబ్బురపడుతూ. అతనివైపు పరిశీలనగా చూసాడు. నలభైఏళ్ళ వయసుంటుందతనికి. సన్నగా, పొడుగ్గా ఉన్నాడు. చూపులు చాలా చురుగ్గా ఉన్నాయి. తన మనసులోని మాట అతనెలా గ్రహించాడా అని విస్తుపోతూ, "చెప్పండి ఏం చెయ్యాలి!" అన్నాడు అతనికేసే చూస్తూ. 


ఆ వ్యక్తి టీ తాగడం పూర్తి చేసి, రఘు వద్దంటున్నా వినకుండా ఇద్దరి డబ్బులు తనే ఇచ్చాడు. "పదండి! అలా నడుస్తూ మాట్లాడుకుందాం!" అని ముందుకి దారి తీస్తే, రఘు అతను వెనుకే వెళ్ళాడు. ఆ వ్యక్తి ఏం చెప్తాడోనని ఎదురు చూస్తున్నాడు.


రెండడుగులు వేసిన తర్వాత, ఎదురుగా ఉన్న బ్యాంక్ వైపు చేయి చూపిస్తూ, "ఓ అరగంట తర్వాత, ఆ కనపడే బ్యాంక్ నుండి ఓ వ్యక్తి వస్తాడు. అతని చేతిలో ఓ బ్రీఫ్ కేస్ ఉంటుంది. అతని బ్రీఫ్ కేస్ నాకు అందించాలి”. 


ఆ వ్యక్తివైపు తెల్లబోతూ చూసాడు రఘు. కొద్దిగా భయం కూడా వేసింది. "అంటే, దొంగతనమా?" అన్నాడు.


రఘు భుజం తట్టాడా వ్యక్తి. "కాదు, దొంగతనం ఎంతమాత్రం కాదు. నువ్వు అడగ్గానే అతను నీకు తన బ్యాగ్ ఇచ్చేస్తాడు, కాకపోతే ఓ కోడ్వర్డ్ మాత్రం చెప్పవలసి ఉంటుంది. అంతే!" అన్నాడు.


ఈసారి మరింత భయం వేసింది రఘుకి. ఆ బ్యాగ్లో ఒకవేళ మాదక ద్రవ్యాలుగానీ ఉంటే, తను అడ్డంగా బుక్కైపోతాడు. ఎప్పుడైనా ఏదైనా పొరపాటు జరిగినా తప్పించుకోవడానికి నేరస్థులు అమాయకులను ఇరికిస్తారని విన్నాడు. అలాంటి వ్యవహారం అంటే కొరివితో తల గోక్కున్నట్లే! కొంత సందేహంగానూ, మరికొంత భయంగానూ తనవంక చూడటం గమనించాడు ఆ ఆగంతకుడు. 


రఘు మనసులోని భావాలు చదివినట్లు, "డ్రగ్స్ రవాణాతో కూడా మాకు ఎటువంటి సంబంధం లేదు." అన్నాడు.


లేదనడానికి మరే అభ్యంతరం లేకపోయింది రఘుకి. ఆ వ్యక్తి రఘుకి చెప్పవలసిన కోడ్ వర్డ్ చెప్పి తను 'హోటల్ కోణార్క్' లో ఎదురు చూస్తూ ఉంటానని, తనకి అక్కడే ఆ బ్యాగ్ అందివ్వమని చెప్పాడు.


మరో సందేహం కలిగింది రఘుకి. "మీరే ఆ బ్యాగ్ తీసుకోవచ్చు కదా? మధ్య నేనెందుకు? మరో విషయం, ఈ పనికి నన్నే ఎందుకు వినియోగించుకోవాలని అనుకున్నారు?" అన్నాడు రఘు.


చిన్నగా నవ్వి రఘుకి మాత్రమే వినబడేట్లు చెప్పాడు, "చాలా మంచి ప్రశ్నలు అడిగావు. నీ సందేహాలు పూర్తిగా నివృత్తి చేస్తాను.ఇది చాలా రహస్యంగా సాగుతున్న ఆపరేషన్. నేను స్పెషల్ బ్రాంచ్ ఏజంట్ని. నేను చెప్పిన నా పేరు 'అజిత్' అన్నది కూడా ఈ ఆపరేషన్కి మాత్రమే పరిమితం. మా కార్యకలాపాలపైన చాలా మంది నేరస్థుల, సంఘవిద్రోహ శక్తుల కళ్ళుంటాయి. నీకు బ్యాగ్ ఇవ్వబోయే అతను కూడా ఓ రహస్య ఏజంటే! అందులో ఓ ముఖ్యమైన సమాచారం ఉంది! 


అందుకే ఎవరికంటా పడకుండా ఉండాలన్నది మా ప్రయత్నం. నిన్నే ఈ పనికి ఎన్నుకున్నాం అని కదా నీ ప్రశ్న! నీ గురించి మాకు బాగా తెలుసు, నువ్వైతేనే ఈ పని సాధించగలవని మాకు నమ్మకం కలిగింది. పైగా ఉన్నత ఆశయాలు కలవాడివి. ఇది ఒక రకంగా నీకూ ఓ పరీక్ష. నువ్వు నీ వంతు పాత్ర సరిగ్గా పోషించగలిగితే భవిష్యుత్తులో మా సహకారం నీకెప్పుడూ ఉంటుంది. మరో విషయం! నీ సామర్థ్యాన్ని బట్టి మా సంస్థలో మంచి ఉద్యోగంలో చేరేందుకు సిఫార్సు కూడా చేస్తాం." అంటూ వివరించి చెప్పాడు అజిత్.


అతని చివరి మాటలు మాత్రం చాలా బాగా నచ్చాయి రఘుకి. మరో ఊసు లేకుండా వెంటనే అతను చెప్పిన పనికి ఒప్పుకున్నాడు.


అలా మాట్లాడుతూ ఓ పావు కిలోమీటర్ దూరం వచ్చేసారిద్దరూ. "నువ్విక వెనక్కి వెళ్ళి మనం కలసిన అదే స్పాట్లో నిలబడి ఉండు, సరిగ్గా ఒంటిగంటకి మా ఏజంట్ బ్యాంక్ నుండి బయటకు వస్తాడు. జాగ్రత్తగా విను, అతని ఆనవాలు చెప్తాను." చెప్పి రఘుని వెనక్కుపంపాడు అజిత్.

 ****** 

వాచీ చూసుకుంటూ అక్కడే నిలబడ్డాడు రఘు. అతని చూపు ఎదురుగా ఉన్న బ్యాంక్ పైనే ఉంది. టైం గడవక సెల్ చూస్తూ కొంతసేపు గడిపాడు కూడా. అజిత్ చెప్పిన సమయం దగ్గర పడే కొద్దీ రఘులో టెన్షన్ మొదలైంది. పావుగంట క్రితం అజిత్ చెప్పిన ఆనవాలు కలిగిన ఉన్న వ్యక్తి బ్యాంక్లోకి వెళ్ళాడు. సరిగ్గా ఒంటిగంట అయ్యేసరికి ఆ వ్యక్తి బ్యాంక్ బయటకు వచ్చి, అటూ ఇటూ ఓ సారి చూసి ముందుకి నడవసాగాడు. అతని చేతిలో నల్ల బ్యాగ్ ఉంది.


 వడివడిగా అతన్ని అనుసరించాడు రఘు. పాతిక అడుగులు వేసిన తర్వాత, ఆ వ్యక్తిని కలుసుకొని అజిత్ చెప్పిన సీక్రెట్ కోడ్ చెప్పాడు. అప్పుడు ఆ వ్యక్తి రఘుతో కరచాలనం చేసి తన చేతిలోని బ్యాగ్ అందించి, అక్కడే పార్క్ చేసి ఉన్న కారులోకి ఎక్కి తన దారిన తాను వెళ్ళాడు. రఘు కూడా వెనక్కి తిరిగి చూడకుండా ఆ బ్యాగ్ పట్టుకొని హోటల్ కోణార్క్ వైపు నడక సాగించాడు. 


అయితే తనని మరొక వ్యక్తి అనుసరిస్తున్నట్లు మాత్రం గ్రహించలేదు. అలాగే రెండు క్షణాల తర్వాత ఆ అజ్ఞాత వ్యక్తి కారుని ఫోలో అయింది మరో కారు. పావుగంటలో తనకి అప్పచెప్పిన పని పూర్తి చేసుకొని, అజిత్ ఇచ్చిన డబ్బులు తీసుకొని ఆనందంగా ఇంటిదారిపట్టాడు రఘు.

 ****** 

అది పోలీస్ కమీషనర్ కార్యాలయం. సాయంకాలం నాలుగు గంటలవుతోంది. పోలీస్ కమీషనర్ సుబోధ్ కులకర్ణి అసహనంగా తన కుర్చీలో కదులుతున్నాడు. మాటిమాటికీ ఫోన్లు చేస్తూ ఆందోళన చెందుతున్నాడు. 


"మే ఐ కమిన్ ' అని వినబడటంతో తలెత్తి గ్లాస్ డోర్స్ అవతల నిలబడిన స్పెషల్ బ్రాంచ్ ఇన్సిపెక్టర్ సాంబశివరావుని చూసి, 'కమిన్!' అన్నాడు. లోపలకి వచ్చిన సాంబశివరావుని చూడగానే కులకర్ణి టెన్షన్ సగం తగ్గిపోయింది.


"రావయ్యా, నీకోసమే ఎదురుచూస్తున్నాను! నువ్వుంటే నాకు వెయ్యి ఏనుగుల బలం వస్తుంది." అంటూ నవ్వుతూ ఆహ్వానించాడు.


కమీషనర్కి సెల్యూట్ చేసి అతని ఎదురుగా ఉన్న సీట్లో కూర్చున్నాడు సాంబశివరావు. "ఏమిటి సార్! పిలిపించారట!" అన్న సాంబశివరావు ప్రశ్నకి జవాబుగా, కొన్ని పేపర్లు అందించాడు కులకర్ణి. 


ఆ పేపర్లను తిరగేసాడు సాంబశివారావు. అవన్నీ పాత వార్తా పత్రికలు. కమీషనర్ గారు పాత పేపర్లు ఎందుకిచ్చారో అర్ధంకాక అతనివైపు చూసాడు.


"ఈ పాత వార్తాపత్రికలను చూపించడానికే పిలిపించా నెందుకు అని అనుకుంటున్నావా? ఇవి మొదట చూడగానే నాకూ అలానే అనిపించింది. కానీ ఇందులో ఏదో రహస్యం మాత్రం దాగి ఉంది." అంటూ జరిగినదంతా సాంబశివరావుకి వివరించి చెప్పాడు కులకర్ణి.


"ఆ అబ్బాయి రఘుని పిలిపించండి, మాట్లాడుతాను." అన్నాడు సాంబశివరావు.


కులకర్ణి ఫోన్ చేసి చెప్పిన రెండునిమిషాల తర్వాత అక్కడికి వచ్చిన రఘుని తేరిపార చూసాడు సాంబశివరావు. రఘుకి పాతికేళ్ల వయసుంటుంది. రఘు లోపలకి రాగానే, కమీషనర్ గారికీ, సాంబశివరావుకి నమస్కారం చేసి నిలబడ్డాడు. 


కులకర్ణి కూర్చోమని సైగ చేసేసరికి, ఓ కుర్చీలో అంచున బెరుగ్గా కూర్చున్నాడు.


"చూడు రఘూ, ఆ వ్యక్తితో నీకెలాంటి పరిచయం ఉంది. ఆ వ్యక్తిని ఇంతకుముందెప్పుడైనా చూసావా?" అడిగాడు సాంబశివరావు.


"లేదు, ఇదే మొదటిసారి అతన్ని కలవడం. నేను టీబడ్డీవద్ద టీ తాగుతూంటే, అతనే మాటలు కలిపాడు. ఓ చిన్నపని చేస్తే, డబ్బులు ఇస్తానంటే ముందు ఆశపడ్డాను. తనో సీక్రెట్ ఏంజెంట్ అని చెప్పినా ఆ వ్యక్తి మీద నాకెందుకో అనుమానం వేసింది. ఓ క్షణం ఆలోచించిన తర్వాత, నా స్నేహితుడు కిషోర్కి ఫోన్ చేసి విషయం చెప్పాను. 


వాడు చెప్పిన సలహాతోనే ఆ బ్యాగ్ స్థానంలో అలాంటిదే మరో బ్యాగ్ వాడికిచ్చాను. కిషోర్ ద్వారా ఆ బ్యాగ్ కమీషనర్ అంకుల్కి అందేట్లు చేసాను. అంతే!" చెప్పాడు రఘు.


"ఆ బ్యాగులో ఏముందో చూసావా?" సూటిగా అడిగాడు సాంబశివరావు.


"లేదు. అందులో ఏమైనా బాంబులాంటింది పెట్టి ఉంటే అన్న ఆలోచన కలిగింది. అందుకే పెట్టి తెరవడానికి కూడా సాహసించలేదు." చెప్పాడు రఘు.


"భేష్, మంచి పని చేసావు! ఆ మనిషి ఆనవాలు చెప్పగలవా?" అని అడిగాడు.


గుర్తుకు తెచ్చుకొని, ఆ ఆగంతుకుల ఆనవాలు చెప్పాడు రఘు. శ్రద్ధగా వింటున్న సాంబశివరావు మనసులో వాళ్ళ ఊహాచిత్రాలు రూపు దిద్దుకోసాగాయి. తర్వాత రఘువైపు సూటిగా చూస్తూ చెప్పాడు, "నువ్వు ఇచ్చిన బ్యాగ్లో వాళ్ళకి కావలసిన సమాచారం లేదన్న సంగతి ఈపాటికి తెలిసిపోయి ఉంటుంది. అంతేకాదు, నువ్వు అసలు బ్యాగ్ని పోలీసుల వద్దకు చేర్చినట్లు కూడా వాళ్ళకి తెలిసి ఉంటుంది. నువ్విక జాగ్రత్తగా ఉండాలి." అన్నాడు.


ఆ మాటలు విన్న రఘుకి ముచ్చెమటలు పోసాయి. రఘు భయపడటం చూసిన సాంబశివరావు, "భయపడకు, నిన్ను నీడలా వెన్నంటి ఉండేలా మఫ్టీలో ఉన్న కానిస్టేబుల్ని నియమిస్తాను. నీకేం భయం లేదు." అని చెప్పాడు.


అతను అభయమిచ్చాక, బయటకు కదిలాడు రఘు. ఎవరికీ తెలియకుండా రఘుని వెన్నంటి ఉండమని బయట నిలబడి ఉన్న కానిస్టేబుల్ కనకరాజుకి ఫోన్ చేసి చెప్పాడు. అంతేకాకుండా, కనకరాజు కాంటాక్ట్ చెయ్యగానే అతనికి సహాయపడే విధంగా మరో ఇద్దర్నికూడా నియమించాడు. 

 ******

సాంబశివరావు ఊహించినట్లుగానే, సాయంకాలం రఘుని నిలదీసిన ఆ ఇద్దరు ఆగంతకులు సులభంగానే పట్టుబడ్డారు. అయితే, వాళ్ళిద్దర్నీ ఎన్ని విధాల ఇంటారాగేట్ చేసినా, నోరు విప్పలేదు. వాళ్ళిచ్చిన బ్యాగులో దొరికిన పాత వార్తా పత్రికలన్నీ టేబులు మీద పరిచి ఒకొక్కటీ పరీక్షగా చూస్తూ చదవసాగాడు సాంబశివరావు.


 మొత్తం పది పాత పేపర్లవి, అన్నీ వేరు వేరు పత్రికలు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, సాక్షి, ఉదయం ఇలా అన్ని రకాల వార్తా పత్రికలూ ఉన్నాయి. ఒకే రోజు పేపర్లు కావవి. ఆ పేపర్లలో ఏదో విశేషముండాలి, లేకపోతే అంత పకడ్బందీగా ఆ పేపర్లను అంత జాగ్రత్తగా బ్యాగ్లో పెట్టి తీసుకు రావాలసిన అవసరం లేదు. 


అందులో ఏదో నిగూఢమైన రహస్యం దాగి ఉంటుంది. ఆ రహాస్యాన్ని ఛేదించాలి. ఏదో మెసేజ్ ఆ వార్తా పత్రికల్లో ఉంది, అదేమిటో తెలుసుకోవాలి. పట్టుబడిన అజిత్, అతని మిత్రుడు ఇద్దరూ కూడా పెదవి విప్పడం లేదు. ఎంతసేపు ప్రయత్నించినా చిక్కుముడి విడలేదు. అప్పుడు తన లాప్టాప్లో ఆ పాతపేపర్లు డౌన్లోడ్ చేసుకొని, జూం చేసి డికోడ్ చెయ్యడానికి ప్రయత్నించసాగాడు.


ప్రతీ పేజీలో ఉన్న ముఖ్యమైన వార్తల్ని ఓ వరుస క్రమంలో రాసుకొని ఏమైనా అర్ధవంతమైన విషయం బయట పడుతుందా అని ప్రయత్నించసాగాడు. సాంబశివరావు పక్కనే కూర్చున్న రఘు ఆ పేపర్లను తదేక దృష్టితో చూస్తూ అతనితో ఏదో చెప్తున్నాడు. అప్పుడే, కమీషనర్ కులకర్ణి హడావుడిగా అక్కడికి వచ్చాడు. తన పనిలో మునిగి ఉన్న సాంబశివరావు అతన్ని గమనించలేదు. 


"ఎంతవరకూ వచ్చింది నీ దర్యాప్తు? ఏమైనా క్లూ దొరికిందా?" అని అడిగాడు సాంబశివరావు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ.


దీక్షగా తన పనిలో మునిగి ఉన్న సాంబశివరావు తలెత్తి కమీషనర్ వైపు చూసి, "ఇంకా లేదు సార్! ఇంకో అరగంట పడుతుందనుకుంటాను!" అన్నాడు.


"బి క్విక్ సాంబశివరావూ! త్వరగా డీకోడ్ చెయ్యడానికి ప్రయత్నించు! అవతల ఇంటెలిజెన్స్ సీక్రెట్ రిపోర్ట్ వచ్చింది, సిటీలో కొన్ని చోట్ల బాంబ్ బ్లాస్ట్ చెయ్యడానికి తీవ్రవాదులు ప్రయత్నాలు చేస్తున్నట్లు. ఆ దిశగా ఆలోచించు. క్లూ ఏమైనా దొరుకుతుందేమో! ఈలోపున ఏమైనా దారుణాలు జరిగితే తీరిగ్గా విచారించవలసి వస్తుంది." హెచ్చరించాడు కులకర్ణి. 


అతని మాటల మీద దృష్టి పెట్టకుండా లాప్ టాప్లో చేస్తున్న పనిలో నిమగ్నమై ఉన్న సాంబశివరావు నోటి నుండి హఠాత్తుగా, "ఎస్! ఐ గాట్ ఇట్!" అని వెలుబడింది. 


సాంబశివరావు కనుక్కున్న విషయమేమిటో తెలుసుకోవాలన్న ఉత్కంఠ కమీషనర్ కులకర్ణిలో నెలకొంది.


గబగబా టేబులు పైన ఉన్న న్యూస్ పేపర్లన్నీ ముందుకు లాక్కొని అందులో కొన్ని ముఖ్యాంశాల పైన మార్కర్ పెన్తో మార్క్ చేసి కమీషనర్ ముందుకి తోసాడు సాంబశివరావు. అతను మార్క్ చేసిన విశేషాలన్నీ క్రమబద్ధంగా చదివిన కులకర్ణి మొహంలో రంగులు మారాయి. దవడలు బిగుసుకున్నాయి. 


"వెల్ డన్ మై డియర్ బోయ్! ఆ దుర్మార్గుల ఆటలు సాగనివ్వకూడదు. నీకు కావలసినంత ఫోర్స్ ఇస్తాను. తక్షణం కార్యరంగంలోకి దూకు! నువ్వు తలచుకుంటే ఒకేఒక గంటలో ఆ నేరస్థులందర్నీ పట్టుకోగలవన్న నమ్మకం నాకుంది." సాంబశివరావు వెన్నుతట్టి చెప్పాడు కులకర్ణి.

 ******

కమీషనర్ నిర్దేశించిన సమయంకన్నా ముందే ఒకేసారి నాలుగు స్థావరాలపై దాడి చేసింది సాంబశివరావు ఆధ్వర్యంలోని పోలీసు బృందం. హఠాత్తుగా జరిగిన దాడికి నివ్వెరపోయిన దుండగులు తప్పించుకోవడానికి మార్గంలేక పోలీసులకు చిక్కారు. వాళ్ళ దగ్గరనుండి ఉగ్రవాద కార్యకలాపాలు సాగించడానికి సంబంధించిన సామగ్రి అంతా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


నగరంలో ఒకేసారి పది ముఖ్యమైన ప్రదేశాల్లో బాంబ్ బ్లాస్ట్కి ప్లాన్ చేసి అమలు పర్చాలనుకున్న తీవ్రవాదులను చాకచక్యంగా పట్టుకున్న క్రైం బ్రాంచ్ ఇన్సిపెక్టర్ సాంబశివరావుకి ఘనంగా సన్మానించిన సందర్భంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసాడు కమీషనర్ కులకర్ణి.


 పరిచయ కార్యాక్రమాల తర్వాత ఆ కేసు తనెలా ఛేదించాడో వివరించాడు సాంబశివరావు.


"ఒక నిషేధిత తీవ్రవాద సంస్థ మన సిటీలో పలు చోట్ల విధ్వంసం సృష్టించాడానికి స్కెచ్ వేసింది. ఈ ఉగ్రవాద ఆపరేషన్ కి వాళ్ళు పెట్టుకున్న పేరు, 'ఆపరేషన్ న్యూస్పేపర్!' ఆ పని చెయ్యడానికి కొంతమని సంఘ వ్యతిరేక శక్తులని ఎన్నుకొంది. అయితే, ఎప్పుడు ఎక్కడ బాంబ్ బ్లాస్ట్ చెయ్యాలన్న సమాచారం అందించడానికి ఓ కొత్త పద్ధతి ఎన్నుకుంది. వాళ్ళ ఫోన్ల మీద పోలీసుల, ఇంటెలిజెన్స్ వర్గాల నిఘా ఉండటంవల్ల సెల్ ఫోన్ గానీ, ల్యాండ్ లైన్ గానీ ఉపయోగించే వీలు లేదు. అందుకే వాళ్ళు ఓ విన్నూత్న పద్ధతి ఉపయోగించారు. 


పాత న్యూస్ పేపర్ల ద్వారా తమ సందేశం పంపాలని నిర్ణయించుకున్నారు. ప్రతీ పత్రికలోని మొదటి పేజీ వదిలేసి మిగతా పేజీలో ఉన్న హెడ్ లైన్స్ లో పేర్కొన్న ప్రదేశాల్లో విధ్వంసానికి ఏర్పాట్లు చేసారు. అలాగే, ఎవరు ఎక్కడ ఏ సమయంలో చెయ్యాలో ఆ సమాచారం కూడా ఆ పేపర్ల ద్వారానే అందించారు. ఉదాహరణకి...ఒక పేపర్ 2021 సెప్టెంబర్ నెల పదవ తేదిది. అంటే ఈ సంవత్సరం సెప్టెంబర్ పదవ తేదీన బాంబ్ బ్లాస్ట్ చెయ్యాలి. రెండవ పేజిలో ఉన్న హెడ్లైన్లో గాంధీ నగర్లో ఫలానా చోట ఏర్పాటైన సభలో ఫలానా రాజకీయనాయకుడు ప్రసంగించారు అని ఉంది. అంటే ఆ రోజు ఆ ప్రదేశంలో పేలుడు పదార్థాలు ఏర్పాటు చెయ్యాలన్న సందేశం ఉంది. 


అలాగే ఆ సభ ఏ సమయంలో అయిందో అదే సమయంలో బాంబ్ బ్లాస్ట్కి ప్లాన్ చేసారు. అలా డీకోడ్ చేసేసరికి మొత్తం సమాచారం బయటకి వచ్చింది. అన్ని పత్రికలూ అదే నెలకి, అదే తేదీకి చెందినవి చెందినవి, కాకపోతే వేరువేరు సంవత్సరాలవి. అలాగే నాకు డీకోడ్ చెయ్యడానికి ఈ యువకుడు...రఘు, అదే మొదటి వరసలో మీ పక్కన కూర్చున్నాడే అతని సహాయం మరువలేనిది. 


అతని తెలివి తేటలని అంచనా వెయ్యలేని ఆ దుండగులు తమ పనికి అతనినే వినియోగించడం నిజంగా వాళ్ళ దురదృష్టం. సరైన సమయంలో సమయస్పూర్తి ప్రదర్శించి వాళ్ళు ఇచ్చిన బ్యాగ్ మార్చి, అసలు బ్యాగ్ పోలీసులకు అందజేసి, ఆ కారులో వెళ్ళినవాడిని వెంటాడటానికి తన స్నేహితుడ్ని పురమాయించిన రఘు తెలివితేటలు అమోఘం. ఇలాంటి యువకులు అందరికీ ఆదర్శం కావాలి. అతనికి తగువిధంగా సన్మానించమని కమీషనర్ గారికి మనవి చేసుకుంటున్నాను. అతన్ని ఈ వేదికపైకి రావలసిందిగా కోరుతున్నాను." అని చెప్పాడు సాంబశివరావు.


అందరూ తలతిప్పి తమ మధ్య కూర్చున్న రఘు వైపు దృష్టి సారించారు. రఘు లేచి నిలబడి వేదినెక్కాడు. ప్రేక్షకుల కరతాళ ధ్వనుల మధ్య కులకర్ణి నుండి సన్మానం అందుకున్నాడు రఘు. పోలీసు ఉద్యోగం చెయ్యకుండానే అతని కోరిక నెరవేరింది. 


 **********

దివాకర్ల వెంకట దుర్గా ప్రసాద్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

పూర్తిపేరు దివాకర్ల వెంకట దుర్గాప్రసాద్. పుట్టింది, పెరిగింది కోరాపుట్ (ఒడిశా) లో, ప్రస్తుతం నివాసం బరంపురం, ఒడిశాలో. 'డి వి డి ప్రసాద్ ' అన్నపేరుతో వందకుపైగా కథలు ప్రచురితమైనాయి. ఆంధ్రభూమి, హాస్యానందం, గోతెలుగు, కౌముది, సహరి అంతర్జాల పత్రికల్లోనా కథలు ప్రచురితమయ్యాయి. బాలల కథలు, కామెడీ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


45 views0 comments

댓글


bottom of page