పడమటి సంధ్యారాగం
- Kotamarthi Radhahimabindu
- Jan 13, 2021
- 7 min read
Updated: Jan 14, 2021

Padamati Sandhyaragam written by Kotamarthi Radhahimabindu
రచన: కోటమర్తి రాధాహిమబిందు
“నాన్నగారూ .. మీరు ఏమి ఆలోచించారు”?
మౌనంగా చూశాను ప్రతిమను.
“చెప్పండి” చిరునవ్వుతో చూసింది
'నేను నిర్ణయానికి ఇంకా రాలేదు' అని చెప్పాలని చెప్పలేక పోయాను .
“నీ ఇష్టం చెప్పు” అన్నది సత్యా దేవి..
“ఏదయినా నాన్నగారి ఇష్టమేనమ్మా ...నా ఇష్టం అంటూ ప్రత్యేకంగా ఏమీలేదు” అంది
ప్రతిమ. నేను దేవి ముఖముఖాలు చూసుకున్నాము
* *
నేను ఇరవైఏడు సంవత్సరాలక్రితం అమెరికా వచ్చాను. అమ్మానాన్న గారికి సంతానం
నలుగురం. అందరికన్నా అన్నయ్య పెద్ద . తర్వాత ఇద్దరు అక్కయ్యలు, ఆ తర్వాత
నేను. నన్ను అమెరికా పంపాలని అమ్మ నాన్న గారికి కోరిక. మా మేనమామలు మా
బావగార్లు అక్కలు అన్నయ్య వద్దంటే వద్దన్నారు. మనలో ఒకడు అమెరికా వెళ్లాలని
మా కోరికరా అంటూ అమ్మానాన్న నన్ను అమెరికా పంపారు. అక్కడ నేను ఒక్కో మెట్టు
ఎక్కుతూ నా కెరీర్ని డెవలప్ చేసుకున్నాను. మూడు సంవత్సరాల తర్వాత ఇండియా
వచ్చి అమ్మానాన్న ఎన్నిక చేసిన అమ్మాయిని పెళ్లిచేసుకున్నాను.
నా పెళ్లి చాలా ఘనంగా జరిగింది. నా భార్య పేరు సత్యాదేవి. చాలా
మంచిమనసున్న వ్యక్తి తాను జాబ్ చేయకున్నా నన్ను చాలా ప్రోత్సహించింది.
ఇద్దరు పిల్లలు.. పాప బాబు.. పాపకు నాలుగు సంవత్సరాల వయస్సున్నప్పుడు
నాన్న చనిపోయారు. బాబుకు నాలుగు సంవత్సరాల వయస్సున్నపుడు
అమ్మచనిపోయింది. రెండింటికీ కుటుంబంతో వచ్చాను.
నిజం చెప్పాలంటే అమ్మానాన్నకే మా మీద ప్రేమ.. మిగతావాళ్ళు
రక్తసంబంధికులే అయినా ఏంటో ముక్తసరిగా ఉండేవాళ్ళు. చాలా బాధ అనిపించేది.
అప్పటికీ ఆలోచించాను. నేను బాగా సంపాదిస్తున్నానని ఫీలింగా ?లేక అమెరికాలో
ఉన్నామన్న కోపమా?ఏమీ అర్ధం కాకపోయేది. అమ్మ చనిపోయిన తెల్లవారి ఇదే మాట
అందరినీ అడిగాను.
“మాకో తమ్ముడు ఉన్నాడని మేము మర్చిపోయామురా.. ఏంటో వద్దంటే అంతదూరం
వెళ్ళావు .. ఎట్లయినా మీరు గొప్పగదరా.. మాకు అంత సంపాదనలు లేవు. మేం
నీలావున్నవాళ్ళము కాదు” అంది పెద్దక్క. “నీకు మేం గుర్తుంటామారా? మా ఆరాటం
మాది గాని .. నీ బిజీనీదేనాయే.. ఫోన్లు చేస్తావులే.. కానీ ఇక్కడైతే అప్పుడప్పుడు
కలిసేవాళ్ళం. సంతోషంగా వుండేది. తల్చుకోగలం గాని చూడలేం గదా” అంది చిన్నక్క.
"అమ్మనాన్నకు ఎలాగైనా నీమీద ప్రేమరా.. నిన్ను అమెరికా పంపారు నన్ను పంపారా?
పెద్దకొడుకుగా పుట్టగూడదురా, బాధ్యతలు వుంటాయి. అప్పట్లో మీ వదిన ఎంత
బాధపడిందో.. నా బ్రతుకు వ్యవసాయం దగ్గరే ఆగిపోయింది”అన్నాడు అన్నయ్య.
ఇలా ఎన్నెన్నో మాటలు మాట్లాడారు. నేను మౌనంగా వుండిపోయాను.నాన్న
అప్పటిలాగే అమ్మ కార్యక్రమ ఖర్చులు అన్నీ నేనే పెట్టాను.
“మళ్ళీ నువ్వు ఎప్పుడు వస్తావో? వున్నది కాస్తా పంచుకుంటే అయిపోతుంది
గదా”అన్నారు మేనమామలు. అందులో ఒకతను పిల్లనిచ్చిన మామ. అతని ప్రభావం
ఆవిషయం మీద ఎక్కువగా వున్నట్లు నాకు అర్ధమైంది. మేనమామలే పెద్దమనుషులు
అయ్యారు. అక్కలిద్దరు “మాకు ఏమైనా ఇవ్వండి”అంటూ గొడవపెట్టారు. పది ఎకరాల
పొలంలో అక్కలకు చెరో ఎకరం మిగతా ఎనిమిది ఎకరాలు చెరి సగం అని పంచారు.
ఇల్లు అన్నయ్యకు ఉంచమన్నారు పంపకం వద్దన్నారు.
“సరే అన్నాను” నేను.
ఆ రాత్రి దేవి అంది నాతో “మనం ఇక్కడ వుండం .. ఆడపడుచుల బాధ్యత
పెట్టుపోతలు పెళ్లిళూ వేడుకలు ఇలా ఏవో ఒకటి ఉంటుంటాయి కదా.. మనం
అమెరికాలో బాగానే వృద్ధిలోకి వస్తున్నాం. మనకు పొలం ఏం అవసరం?అక్కయ్య
బావగారు సంతోషపడతారు మీ పాలుకు వచ్చిన పొలాన్నివాళ్ళకే ఇవ్వండి” అని.
తెల్లవారి అదే విషయం వాళ్ళతో చెప్పాను నేను. అన్నయ్య వదిన సంతోషించారు కానీ
అక్కలకు కోపం వచ్చింది “వాడికి వొద్దకపోతే మాకు చెరో ఎకరం ఇచ్చి మిగతాది
అన్నయ్యకు ఇవ్వచ్చు కదా” అని గొడవ చేశారు. ఎవరేం మాట్లాడలేదు. నాన్నగారే
లేరనుకుంటే అమ్మకూడ లేదు అన్న దుఃఖం ముంచుకొచ్చింది. నాన్నగారు
చనిపోయినప్పుడు వచ్చి తిరిగి అమెరికా వెళుతున్నప్పుడు అమ్మ అన్న మాటలు మరీ
మరీ గుర్తుకొచ్చాయి.
“పిల్లలకు ఇంగ్లీషు వస్తే వచ్చింది తెలుగు మాత్రం
నేర్పించరా.. నువ్వు ఎంత అమెరికా వెళ్ళినా భారతీయుడవే.. మళ్ళీ ఇండియా రారా..
పిల్లలకు ఇక్కడి సంబంధాలే చేయి. మన సాంప్రదాయాలు మన పద్దతులు
నేర్పించరా.. అన్నయ్య అక్కయ్యలు అదోరకం. ఏవీ పట్టించుకోకు. నువ్వు అందర్నీ
అర్దం చేసుకోగలవు. మళ్ళీ ఎన్ని సంవత్సరాలకు వస్తావో.. నువ్వు నా
ప్రాణంరా”.అంటూ నన్ను కౌగలించుకొని వెక్కివెక్కి దుఃఖ పడింది అమ్మ.
“అమ్మా నాతో వస్తావా”? ఆశగా అడిగాను నేను.
“వద్దులేరా.. ఇక్కడే వుంటాను. ప్రక్కవూరా ఏంటి? అప్పుడప్పుడు రావటానికి..
పోవటానికి? వద్దులే మీరు ఆనందంగా వుండండి. క్షేమంగా వుండండి. అదే నాకు
ఎనలేని సంతోషం”
అవే అమ్మ నాతో చివరగా మాట్లాడిన మాటలు. ఇప్పుడు
వెళ్లబోతున్నాము. మళ్ళీ ఎప్పుడు వస్తారో అని అడగటానికి అమ్మలేదు. అడిగేవాళ్ళు
ఇంకెవరు కూడా లేరు కానీ అమ్మ అడిగిన చివరి మాటలు నా గుండెలో స్థిరంగా
నిలిచిపోయాయి. అమ్మ జ్ఞాపకంగా వాటిని నిలబెట్టాలనికూడ నిర్ణయించుకున్నాను.
అమెరికా ప్రయాణమయ్యాము.
* *
అమ్మ ఆశీస్సులు నాకు నిండుగా వుండిఉంటాయి. నా అభివృద్ది కొన్ని రెట్లు ఎక్కువ
అయినది. అలా అలా అమెరికాలోనే సంవత్సరాలు గడిచాయి. పిల్లలు పెరిగి
పెద్దవాళ్ళయ్యారు. చదువులు బాగా చదువుకున్నారు ఇప్పుడు అమ్మాయికి ఇరవై
నాలుగు సంవత్సరాలు, అబ్బాయికి ఇరవై సంవత్సరాలు. పదహారు సంవత్సరాల
తర్వాత ఇండియా ప్రయాణం పెట్టుకున్నాము. కారణం.. ఇండియాలో మంచి
సంబంధం చూసి ప్రతిమ పెళ్లి చేయాలని.. అక్కడ రెండు సంబంధాలు రెడీగా
వున్నాయి. వాటి గురించి పిల్లలిద్దరికి తెల్సు. దేవికి కూడా చాలా నచ్చాయి. నేను
అక్కడే స్థిరపడాలనుకున్నాను కాబట్టి నా ప్రయత్నాలు నేను ఆల్రెడీ మొదలుపెట్టాను.
పిల్లలిద్దరు ఇప్పటికీ మామాట వింటారు. మేము ఎంతచెబితే అంత. ఏమాత్రం
సమయం దొరికినా నేను ఇండియా గురించి, మావూరు గురించి, మా అమ్మనాన్న
గురించి, మా రక్తసంబంధీకుల గురించి చెబుతూనే వుండేవాణ్ణి.. వాళ్ళకు అలాంటివి
వినటం ఎంతో ఎంతో ఇష్టం. పిల్లలకు మమ్మీ డాడీ నేర్పించలేదు. అమ్మనాన్న
నేర్పించాము. అమ్మ జ్ఞాపకార్ధంగా బయట ఇంగ్లీష్, ఇంట్లో తెలుగు..దేవి
తల్లితండ్రులకు మేము వస్తున్నట్లు చెప్పాం. వాళ్లెంతగానో సంతోషించారు. మా
వాళ్ళందరికీ పేరుపేరున ఇండియా వస్తున్నట్లు సమాచారం ఇచ్చాము. అంతగా
ఆనందించినట్లు నాకు అన్పించలేదు. నేను ఇన్ని సంవత్సరాలుగా నావాళ్ళతో
మాట్లాడుతూనే వున్నాను. పిల్లలతో మాట్లాడిస్తూనేవున్నాను. దేవి సరేసరి. నేను ఎవర్ని
ఇబ్బంది పెట్టకూడదని ఓ విల్లా అద్దెకు మాట్లాడాను..ఓ కారు మాట్లాడుకున్నాను.
రెండురోజులు విశ్రాంతి తీసుకున్నాము. మావాళ్ళనుంచి ఎటువంటి ఫోన్లు రాలేదు.
నేను దేవి చాలా ఫీలయ్యాం. మామగారి ఆహ్వానంతో మా కుటుంబం వెళ్ళి కొన్నిరోజులు
గడిపి వచ్చాం. 'వెళ్లేముందు మరోసారి కలుద్దాం' అని చెప్పాం.
“మా వాళ్ళందర్ని ఇక్కడికే ఆహ్వానిద్దాం” అన్నాను నేను.
ఏం మాట్లాడలేదు దేవి.. దేవికి నచ్చకపోతేనే అలా మౌనంగా వుంటుంది. ఎందుకైనా మంచిదని నేనే కాల్ చేసి మాట్లాడాను. ఏదో బిజీ వల్ల మాట్లాడలేదంటూ మంచిగానే మాట్లాడారు. మరో రోజు గడిచింది. అన్నయ్య ఎప్పుడోవచ్చి హైదరాబాద్ లో సెటిల్ అయ్యాడు. కొడుకు సలహాతో పొలం ఇల్లు అమ్మాడు కూడా. బాగా ఆలోచించి నాలుగు కుటుంబాలని భోజనాలకు రమ్మని నేను దేవి పిలిచాము. బిలబిలమంటూ కార్లలో వచ్చారంతా. మాతో కంటే ఎక్కువగా వాళ్ళు వాళ్ళే మాట్లాడుకున్నారు. ప్రతిమను, ప్రదీప్ ను చూసి ఆశ్చర్యపోయారంతా. అమెరికా పిల్లలు ఇలా వున్నారేంటి? మరీ ఇంత సింపులా? తెలుగులోనే మాట్లాడుతున్నారు? అంటూ తెగ ప్రశ్నలు అడిగారు. సమాధానాలు పిల్లలే చెప్పారు.
“ఎప్పుడో మీ చిన్నతనంలో చూశాం మళ్ళీ ఇప్పుడు. మీ అమ్మనాన్నకు యిప్పటికి మేం గుర్తొచ్చాము” అంటూ ఏవేవో మాట్లాడారు. పిల్లలిద్దరు విస్తుపోయి అర్దంకానట్లు ముఖాలు పెట్టారు. తల్లీతండ్రి వాళ్ళందరి గురించి గొప్పగా చెప్పిన విధానం పిల్లలకు కనిపించకపోవటంతో చాలా డల్ గా అయ్యారు. ఫైవ్ స్టార్ హోటల్లో భోజనాలు ముందే బుక్ చేయటంతో అంతా ఆనందంగా వెళ్ళాం తిన్నాం వచ్చాం. అందరికోసం తెచ్చిన విలువైన బహుమతులు వస్తువులు పేరుపేరునా ఇచ్చాం. సంతోషం కంటే ఎక్కువగా వాళ్ళకు ఇంకా ఏవేవో తెస్తాం అనుకొని ఊహించుకున్నట్లు అనిపించింది.
“నా కోసం మంచి ల్యాప్ టాప్ తెస్తావనుకున్నా” అని అన్నయ్య అనటంతో కంగారు పడ్డాను నేను.
“నా పిల్లలు నాకు అన్నీ నేర్పారు. అప్పటిలా వ్యవసాయదారుడిగా నేను లేను”.
“అయ్యో అన్నయ్యా అలా అంటావేంటి.. ”
“మాకు ఏం కావాలో నువ్వు అడిగితే మేంచేప్పేవాళ్ళం కదా” నిష్టూరంగా అంది పెద్దక్కయ్య.
“సమయం వచ్చింది కాబట్టి నేనూ అడుగుతున్నాను, అస్సలు మీ అందరికీ నాపై ఎందుకు ఇంత కోపం. నేను అమెరికా వెళ్లాననేనా?మీ పిల్లల్ని అక్కడకి రప్పించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాను. కానీ మీరు పంపమంటే పంపనన్నారు. మేమందరం మీకోసం వచ్చాం. మీరు మామీద ప్రేమపడటంలేదెందుకు? చాలా బాధగా అనిపిస్తుంది”.
“ఇందులో నువ్వు బాధపడటానికి ఏమిలేదురా. మాపిల్లలు మాదగ్గర ఉండాలని మా కోరిక. అందుకే మేం పంపలేదు అది మాయిష్టం. నీపట్ల మాకు ప్రేమలేదని నువ్వనుకుంటే మేం ఏం చేయలేం” చిరాగ్గా అంది చిన్నక్క.
ఇక నేను ఏమీ వాదించదలుచుకోలేదు. సాయంత్రం అయ్యింది. అంతా వెళ్తామమంటే నేను దేవి వుండమన్నాము. ఈ చికాకు మధ్య పిల్లలంతా కలిసిమెలిసి మాట్లాడుకోవటం కాస్త సంతోషంగానే అనిపించింది మాకు. రాత్రికి మళ్ళీ హోటల్ కు వెళ్ళి ఎవరికి కావాల్సింది వాళ్ళకు ఆర్డర్ చేశాను. అంతా మళ్ళీ విల్లాకు వచ్చాం.
“ఎప్పుడొస్తారురా మా ఇళ్ళకి” అడిగింది పెద్దక్క.
అలాగే చిన్నక్క బావలు అన్నయ్య వదిన అడిగారు. “మీరెప్పుడంటే అప్పుడు.. మేం నెలరోజులు ఇక్కడే వుంటున్నాం” అన్నాను నేను. ఎవరూ ఏం మాట్లాడలేదు. రాత్రి పదిగంటలకు అంతా వెళ్లిపోయారు. రెండు రోజులు గడిచినా ఎవరినుండి ఫోన్లు లేవు.. అనుకున్న ప్రకారం ప్రతిమ సంబంధాల గురించి వాళ్ళని కలిసివచ్చాము. రెండు సంబంధాలు ఎంతగానో నచ్చాయి.కొంత టైమ్ తీసుకొని మళ్ళీ ఏ విషయం మీతో చెప్తాం అని చెప్పాం. మేం నలుగురం ఈ విషయంలో చాలాసేపు మాట్లాడుకున్నాం..
నేను దేవి పిల్లలు మా ఊరుకు వెళ్ళిఅక్కడ చాలా మందిని కలిసి వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకున్నాం. వాళ్ళ ఆప్యాయతలు ప్రేమలో అమ్మానాన్న గుర్తుకువస్తుంటే పలుమార్లు కళ్ళుతుడుచుకున్నాను నేను. అవసరమయిన సహాయం తప్పక అందిస్తానని వాళ్ళకి మాట ఇచ్చాను. తెల్లవారి మంచి మంచి ప్రదేశాలు చూద్దామని కొన్నిరోజులకు నేనూ దేవి ప్లాన్ చేశాం. ఆ ప్లాన్ ప్రకారం వెళ్ళటం.. మళ్ళీ విల్లాకు రావటం..మావాళ్ళంతా వాళ్ళవాళ్ళ ఇళ్లకు భోజనానికి రమ్మని మమ్మల్ని పిలిచారు వెళ్ళాం.. వచ్చాం అన్నట్లుగానే ముగిసింది. అలా కొద్ది రోజులు గడిచాయి. నా సెలవు అయిపోయేముందు మామగారి వాళ్ళని మరోసారి కలిసి అమెరికా వచ్చేశాం..
* * *
భోజనాలు ముగిసిన తరువాత ఇండియా ట్రిప్ గురించి నలుగురం మాట్లాడుకున్నాం.
“మీకేలావుంది ట్రిప్”? అడిగాను నేను. “మాకంతగా నచ్చలేదు నాన్నగారు” అన్నాడు ప్రదీప్. “అవును” చిరాగ్గా అంది ప్రతిమ.
“పిల్లలంతా బాగానే మాట్లాడుకున్నారుగా”
“వాళ్ళు పబ్బులు.. బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ గురించి అడిగారు మమ్మల్ని.. మనమెంత సంపాదించింది, మనమెలా గడుపుతామన్నది అటుతిప్పి ఇటుతిప్పి ఇలాంటివే అడిగారు. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళుహించినట్లు మేము లేము మేమూహించినట్లు వాళ్ళులేరు. వాళ్ళల్లో అమెరికా సంస్కృతి మాకు కనపడింది వాళ్ళవేషభాషలూ అలాగే వున్నాయి”.
“ప్రతిమా” చాలా ఆశ్చర్యపోయాను నేను
“మనమేదో ఇండియా చూడాలని కాదు, ప్రదేశాలు చూడాలని వెళ్లలేదు. మనవాళ్ళు మనవాళ్ళ అనుబంధాలు ప్రత్యక్షంగా చూడాలని వెళ్ళాము. మీరు ఎప్పుడు మాతో చెప్తున్నట్లు అక్కడ అలాంటివి మాకు ఏం కనపడలేదు. మాకెలాంటి మంచి భావనలూ కలగలేదు. అమ్మమ్మా తాతయ్య తప్ప ప్రేమలు ఆత్మీయతలు అన్నవి మాకు ఎక్కడా దొరకలేదు. ఏదైనా మన అనేది ఉండాలి కదా. అది లేదు అని మాకు అర్ధమయింది. మీది చాలా నిజమైన ప్రేమ నాన్నగారూ. అందుకే మేం ఇలా ఉన్నాం. వాళ్ళు ఎలా ఉన్నారో నేను చెప్పటం బాగుండదు కానీ వాళ్ళ పిల్లలు అలాగే ఉన్నారు. ఎవరికోసం మనం అక్కడ కొత్త జీవితం ప్రారంభించాలి? రెండునెలల తరువాత అమ్మమ్మా తాతగారు ఇక్కడికి వస్తామన్నారు.. మాకదే సంతోషంగా ఉంది” అంది ప్రతిమ.
“నాన్నగారూ.. మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తుంది మీ బిజీ లైఫ్ లో మీరు వాళ్ళకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. ఇన్ని సంవత్సరాల తరువాత వెళ్ళిన మన మీద కొద్ది ప్రేమ కూడా వాళ్ళు చూపించలేదు. అయినా ఇప్పటికీ మీరు అలాగే ఉంటారని మాకు, అమ్మకు తెలుసు. మేము ఇలా మాట్లాడినందుకు మీరు బాధపడొద్దు ప్లీజ్”.అన్నాడు దీపక్
“లేదు దీపూ.. మీరిద్దరూ ఉన్న వాస్తవం చెప్పారు. మా అమ్మానాన్న అంటే నాకు చాలా ఇష్టంరా ..నాన్నమ్మ ఇష్టప్రకారం అక్కడివెళ్లాలని మీ జీవితాలు అక్కడ సెటిల్ అవ్వాలని ప్లాన్ చేశాను. దానికోసమే మనం వెళ్ళి వచ్చింది”.. అన్నాను నేను.. ఆ తరువాత ప్రతిమను అడిగాను మా ఇష్టానికి వదిలేసింది.. అదీ విషయం..
* *
“దేవీ.. నేను ఒక ఆలోచన చేశాను” దేవితో అన్నాను ఆరాత్రి
“ఏంటి”
“ప్రతిమకు మంచిమ్యాచ్ అమెరికాలోనే చూస్తాను.. ఇది నా నిర్ణయం అంతే”
“ అదేంటి” నవ్వింది దేవి.
“పిల్లలు పైకి చెప్పలేదుకానీ అక్కడవాళ్ళు ఏమాత్రం హ్యాపీగా ఫీల్ కాలేదు. మనమాటను వెంటనే ఒప్పుకునే పిల్లలకు నేను అన్యాయం చెయ్యను. వాళ్ళు పుట్టిపెరిగింది ఇక్కడ.. స్నేహితులు.. దగ్గరితనాలు.. ఇక్కడే.. అమ్మానాన్న ఎలాగూలేరు .. రక్తసంబంధీకులలో వాళ్ళను చూసుకోవాలనుకున్నాను కానీ వాళ్ళకు నా పట్ల ఇష్టం లేదు అని అనుకున్నాను కానీ ఈర్ష్య అని ఇంకోసారి అర్ధమయింది. నాపట్ల వాళ్ళ అభిప్రాయం వాళ్ళది. నేను వదిలేస్తున్నాను”.
“మరి.. సంబంధాలు”?
“ఫోన్ చేసి వద్దనుకున్నట్లు చెప్తాను ఏముంది? సరే అంటారు. ఇండియాలో మనం సెటిల్ కావాలని అమ్మకోరిక. పిల్లలకు ఇండియా సంబంధాలు చేయాలని ఇంకో కోరిక ఏంచేస్తాం చెప్పు. ఎవరికోసం ఇండియా వెళ్ళాలి దేవీ? నా అనే వాళ్ళు అక్కడ ఎవరున్నారు మనకు?ఇక్కడ ఎంతోమంది మనవాళ్లంటూ ఉన్నారు. వాళ్ళు అభిమానిస్తున్నారు. ప్రేమగా వుంటారు.వాళ్ళ మనసుల్లో స్థానం సంపాదించుకున్నాను.. అలాంటప్పుడు ఇక్కడే స్థిరపడిపోతే బెటర్ కదా.. అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకోవటంకంటే పిల్లల భవిష్యత్తు గురించి చక్కటిమార్గం ఎన్నుకోవటం కరెక్ట్ కదా ఏమంటావ్?” మన నలుగురం ఒకరికిఒకరం అంతే.. మనం ఇక్కడే వుంటాం.. ఇక్కడే మన జీవితాలు వెళ్లిపోతాయి.. నాకిలాగే బాగుంది దేవీ. రేపు ప్రతిమతో చెప్తాను” “సరే”అంది దేవి
ఇప్పుడు నాకు ఎంతో నిశ్చింతగా వుంది.
* ----------సమాప్తం----------- *
గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.

రచయిత్రి పరిచయం :
పేరు : కోటమర్తి రాధాహిమబిందు
నేను జన్మించింది నల్లగొండ జిల్లా కోదాడ.. మావారి ఉద్యోగరీత్యా ఖమ్మం జిల్లా మణుగూరులో ఉండి జిల్లాకి సాహితీ సేవలు అందించాను.. ప్రస్తుతం కె ఎల్ ఆర్ ఎవెన్యూ.. కోమరబండ కోదాడలో నివాసం ఉంటున్నాము.
నా రచనా వ్యాసంగం ప్రారంభించి రెండుదశాబ్దాలు పూర్తయ్యింది.నా సాహిత్య ప్రస్థానంలో ఇప్పటివరకు 150 పైగా కథలు నాలుగు నవలలు వ్రాశాను.అందులో రెండు ఎమెస్కో వారు ప్రచురించారు. తెలుగు భాషలో వెలువడుతున్న అన్ని దిన వార పక్ష మరియు మాసపత్రికల్లో నా కథలు, నవలలు ప్రచురింపబడ్డాయి. చిన్నపిల్లలు అమితంగా ఇష్టపడే చందమామ అయినా కార్మికుల పత్రిక కార్మిక లోకం అయినా అన్ని వర్గాలకు సంబంధించిన సమస్యలు సృజించి అక్షర రూపంలో పాఠకులకు అందజేశాను.
నా కథల్లో ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొనే సమస్యలు ప్రస్తావిస్తూ ఉంటాను. కడుపుబ్బ నవ్వించే హాస్య కథలూ కన్నీళ్లు తెప్పించే హృద్యమైన కథలూ వ్రాశాను. నేను రచయిత్రిగా ఎన్నో అవార్డులు, సత్కారాలు పొందాను.
2005, 2006, 2007 సంవత్సరాలలో జివిఆర్ కల్చరల్ ఫౌండేషన్ హైదరాబాద్ వారు నిర్వహించిన రాష్ట్రస్థాయి కథల పోటీల్లో మూడుసార్లు ఉత్తమ రచయిత్రిగా గెలుపొంది శ్రీ త్యాగరాయ గానసభలో సన్మానం పొందాను. 2006 ఆంధ్రప్రదేశ్ యువజన సర్వీసుల శాఖ ఉత్తమ రచయిత్రి గా గుర్తించి సత్కరించింది.
2007 లో ప్రభుత్వం నిర్వహించిన స్తంభాద్రి సంబరాలలో ఉత్తమ రచయిత్రి గా అప్పటి కేంద్ర మంత్రి శ్రీమతి రేణుకాచౌదరి గారి ద్వారా అప్పటి రాష్ట్ర మంత్రి శ్రీ వనమా వెంకటేశ్వరరావు గారు అప్పటి కలెక్టర్ శశిభూషణ్ కుమార్ గారు మరియు శాసన సభ్యుల సమక్షంలో అవార్డు, సన్మానం పొందాను.
2008లో సుప్రసిద్ధ రచయిత శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు నది మాస పత్రికలో రాసిన 'వీళ్లనేం చేద్దాం' అనే నవలకు ముగింపు రాసి
ప్రథమ బహుమతి పొందాను. 2010 వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికావారు నిర్వహించిన అంతర్జాతీయ కథల పోటీలో ఉత్తమ రచన అవార్డు పొంది జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా అవార్డు, సన్మానం అందుకున్నాను. 2011లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సింగరేణి కాలరీస్ 'సేవా'
ద్వారా సన్మానం పొందాను.
ఇవి కాకుండా ఈనాడు ఆదివారం
లో అనేక కథలు ప్రచురితమై బహుళ ప్రజాదరణ పొందాయి. స్వాతి, నది ఇంకా ఇతర పత్రికలు నిర్వహించిన కథల పోటీలలో పలుమార్లు బహుమతులు గెలుచుకున్నాను.
నేను రేడియో మాధ్యమం ద్వారా అనేక కథలు, కథానికలు, నాటకాలు నాటికలు రచించాను. ఇవన్నీ ఆకాశవాణి హైదరాబాద్ విజయవాడ కొత్తగూడెం కేంద్రాల నుండి ప్రసారం అయ్యాయి. మహిళల కోసం "ఆడవాళ్ళు మీకు జోహార్లు" అనే 16 వారాల ధారావాహిక నాటికను రచించాను. ఆకాశవాణి రేడియో నాటికల సప్తాహం సందర్భంగా 'ప్రేమా నీ పేరు మార్చుకో' అనే నాటకం 2007 లో ప్రసారం అయింది. ఈ నాటకాన్ని ప్రశంసిస్తూ ఎన్నెన్నో ఉత్తరాలు రావడం విశేషం. నేను రచయిత్రినే కాక గాయనినీ కూడా. నేను పాడిన పాటలు కొత్తగూడెం విజయవాడ కేంద్రాల నుంచి ప్రసారం అయ్యాయి. ప్రస్తుతం 'బి' గ్రేడ్ కళాకారిణిగా ఆకాశవాణి, దూరదర్శన్ లో నూ
కొనసాగుతున్నాను.
సింగరేణి కాలరీస్ కంపెనీ వారు నిర్మించిన రెండు లఘు చిత్రాలకు కథ, మాటలు సమకూర్చును. కార్మికుల శ్రేయస్సు కోరుతూ నిర్మించిన "గులాబీ ముళ్ళు" మరియు అనుకోని ప్రమాదం వల్ల భర్త లేవలేని స్థితిలో ఉన్నప్పుడు తన సమస్యలను ఎలా అధిక మించిందో తెలిపే ఓ మహిళ కథ "గమ్యం".. ఈ రెండు కూడా కార్మిక కుటుంబాలలో బహుళ ప్రజాదరణ పొందాయి.
2012 డిసెంబర్లో ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఖమ్మంలో జరిగిన జిల్లాస్థాయి సన్నాహక కార్యక్రమంలో జిల్లా ఉత్తమ రచయిత్రి గా గజల్ శ్రీనివాస్ గారి ద్వారా సన్మానం అందుకున్నాను.
2015, 2019 ఫిబ్రవరి, డిసెంబర్ లలో విజయవాడలో జరిగిన మూడవ నాలుగవ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు హాజరయ్యాను. 2018 డిసెంబర్ లో
ఈనాడు ఆదివారం అనుబంధం లో ప్రచురించిన కథలను "ఆరిళ్లలోగిలి" పేరుతో కథా సంకలనం వెలువరించాను.
Comments