top of page

పల్లెబంధం


'Palle Bandham' written by M R V Sathyanarayana Murthy

రచన : M R V సత్యనారాయణ మూర్తి

రాజమండ్రి ఎయిర్ పోర్ట్ నుండి బయటకు రాగానే సర్కిల్ ఇనస్పెక్టర్ సెల్యూట్ చేసి ‘నమస్తే మేడం’ అన్నాడు. నేను తలూపి “టాక్సీ వచ్చిందా?”అని అడిగాను.

“టాక్సీ రెడీగా ఉంది మేడం” అన్నాడు సర్కిల్ ఇన్స్పెక్టర్. ఈ లోగా ఒక కానిస్టేబుల్ సెల్యూట్ చేసి నా పక్కనే ఉన్న ట్రాలీ సూట్కేస్ నెమ్మదిగా తీసుకుని టాక్సీ దగ్గరకు నడిచాడు. నేనూ నాలుగు అడుగులు వేసి టాక్సీ దగ్గరకు వచ్చి , ఇన్స్పెక్టర్ కి థాంక్స్ చెప్పి టాక్సీ ఎక్కి పోనిమ్మన్నాను. అప్పటికే కానిస్టేబుల్ నా సూట్ కేస్ టాక్సీ లోపలపెట్టాడు.

నేను రిలాక్స్ గా వెనక్కి వాలాను. నా మనసులో ఉత్సాహం ఉరకలు వేస్తోంది. ఎప్పుడెప్పుడు మా అమ్మమ్మ గారి ఊరు చేరుకుంటానా, నా స్నేహితులతో ముచ్చట్లు చెప్పుకుంటానా, అని చాలా ఆతృతగా ఉంది. అవును! అమ్మమ్మ గారి ఊరు ‘మూడు కమలాల పల్లె’ వచ్చి మూడు దశాబ్దాలు అయ్యింది. నా ఆలోచనలు గతం లోకి పయనించాయి.

****

మాది శివపురం. నాన్న స్కూల్ టీచర్. చదువు చెప్పడమే కాకుండా హోమియో వైద్యం చేస్తూ గ్రామంలో అందరికీ ఆప్తుడు నాన్న. అమ్మ గృహిణి. నేను ఒక్కతినే సంతానం అవడంవలన వాళ్ళు నన్ను చాలా గారంగా పెంచారు. అమ్మమ్మ గారి ఊరు వెళ్ళాలంటే, పెరవలి వరకూ బస్సు మీద వచ్చి, అక్కడ నుంచి గుర్రబ్బండి ఎక్కి వెళ్ళాలి. గుర్రబ్బండి ప్రయాణం నాకు చాలా ఇష్టం. రోడ్డు మీద గుర్రం పరిగెడుతుంటే వచ్చే చప్పుడు, బండి తోలే వాడు పాడే జానపద పాటలు నాకు మరీ ఇష్టం. అంతే కాదు. గుర్రబ్బండి వెళ్తున్నప్పుడు బండివాడు, చెర్నాకోల బండి చక్రంలో పెట్టి ‘టకటక’మని చప్పుడు చేసేవాడు. ఆ ధ్వని చాలా గమ్మత్తుగా ఉండేది.

స్కూల్ కి సెలవలు ఇవ్వగానే మావయ్య వచ్చి నన్ను అమ్మమ్మ గారి ఊరు తీసుకువచ్చేవాడు.

అమ్మా, నాన్న పండగ రోజు ఉదయమే వచ్చేవారు. అమ్మమ్మ గారి ఇంటి పక్కనే శివాలయం ఉంది. నేను ఉదయమే లేచి గుడిలో ఉన్న దేవకాంచనం పూలు, నందివర్ధనం పూలు కోసి పూజారి గారికి ఇచ్చేదానిని.

ఆయన నా చెయ్యి చూసి ’నువ్వు బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేస్తావురా అమ్మడూ’ అని అనేవారు.

అమ్మమ్మ గారి ఇంటి పక్కనే పెద్ద నుయ్యి ఉంది. ఆ వీధిలో అందరూ ఆ నూతి నీళ్ళే వాడుకునే వారు.

అమ్మమ్మ మడి కట్టుకుని నూతి దగ్గరకు రాగానే, నీళ్ళు తోడుకునే వారు ఒక్కసారిగా ఆగిపోయే వారు. అమ్మమ్మ బిందె నిండా నీళ్ళు పట్టుకుని వెళ్ళాకా మళ్ళీ వాళ్ళు నీళ్ళు తోడుకునే వారు. సోమయాజులు గారి భార్య అని అమ్మమ్మ అంటే వాళ్లందరికీ చాలా గౌరవం.

నేను ఉదయమే పాలు తాగాకా పోస్ట్ మాస్టర్ అమ్మాయి కాత్యాయిని వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని ఆడుకోవడానికి. వైదేహి, రమణి, మాధవి అక్కడికే వచ్చేవారు. అందరం కలిసి చింతపిక్కల ఆట, పచ్చీసు, వైకుంటపాళీ ఆడుకునే వాళ్ళం. అప్పడప్పుడు వైదేహి వాళ్ళ ఇంటికి కూడా వెళ్లి ఆడుకునేవాళ్ళం. వాళ్ళు వాళ్ళ స్కూల్ లో విశేషాలు చెబితే, నేను మా స్కూల్ లో సంగతులు చెప్పేదాన్ని. నేను ఎప్పుడు వెళ్ళినా అమ్మమ్మ నన్నుతెల్లవారు ఝామునే గోదావరి స్నానానికి తీసుకు వెళ్ళేది. గోదావరిలో స్నానాలు అయ్యాకా పొద్దున్నే కనిపించే పెద్ద సూర్య బింబం నాకు చాలా సంతోషం కలిగించేది.

శివపురం వచ్చాకా ఆ సూర్యోదయం గురించి నా స్నేహితులకు చాలా గొప్పగా చెప్పేదాన్ని. కాత్యాయిని వాళ్ళ నాన్నగారు టపా పంపేటప్పుడు ఉత్తరాలమీద ముద్రలు కొట్టే వారు. అప్పుడప్పుడు కాత్యాయిని ఆ పని చేసేది. దేవుడి గుడిలో ఉండే స్తంభంలా ఉన్న చెక్క పుల్లకి చివర ఉండే అక్షరాలు కవర్ల మీద, కార్డుల మీద నల్ల రంగులో ముద్రలు పడేవి. నేనూ రెండు మూడు సార్లు అలా కవర్ల మీద, కార్డుల మీద ముద్రలు కొట్టేదాన్ని. ఆ పని చాలా గమ్మత్తుగా ఉండేది.

ప్రతి పండుగకు అమ్మమ్మ నాకు పట్టు పరికిణి కుట్టించేది. కాత్యాయిని వాళ్ళ ఎదురింటి అరుగు మీద భద్రాద్రి అనే దర్జీ ఉండేవాడు. అతనే ఆ నాలుగు వీధులవారికి బట్టలు కుట్టేవాడు. నేనూ, కాత్యాయిని రోజూ వెళ్లి ’ కొత్తబట్టలు ఎప్పుడు ఇస్తావ్?’ అని అతణ్ణి అడిగేవాళ్ళం. భద్రాద్రి విసుక్కోకుండా ’రేపు ఇస్తాను’ అని నవ్వుతూ చెప్పేవాడు. రోజూ మాకు ఇదొక ఆటగా ఉండేది.

సెలవలు ఇవ్వడం వలన స్కూల్ మైదానం ఖాళీగా ఉండేది. పిల్లలు అందరం అక్కడ చేరి దాగుడుమూతలు ఆడుకునే వాళ్ళం. మేరీ పెద్ద ఇనుపమేకు తెచ్చేది. దానితో నేను స్కూల్ గంట కొట్టేదాన్ని. పక్కనే పాకలో ఉండే ప్యూన్ రంగయ్య వచ్చి మమ్మల్ని కేకలేసి పట్టుకోవడానికి ప్రయత్నిచే వాడు. అతనికి దొరక్కుండా పారిపోయేవాళ్ళం. అవన్నీ గుర్తుకువచ్చి నా పెదవులపై నవ్వు విరిసింది.

“మేడం, ఊళ్ళోకి వచ్చాం. మీరు ఎటు వెళ్ళాలో చెబితే. . . ”నెమ్మదిగా అన్నాడు డ్రైవర్.

“కొంచెం ముందుకు వెళ్లి కుడిపక్కకు వెళ్ళగానే శివాలయం వస్తుంది. దాని పక్కనే ఆపు”అన్నాను.

రెండు నిముషాలలో అమ్మమ్మ ఇంటిముందు ఆగింది టాక్సీ. మావయ్య బయటకు వచ్చి”రా లక్ష్మి”అంటూ ఆహ్వానించాడు. టాక్సీ దిగి లోపలకు రాగానే అత్తయ్య నవ్వుతూ ఎదురొచ్చి”బాగున్నావా లక్ష్మి?”అని ఆప్యాయంగా పలకరించింది. డ్రైవర్ సూట్ కేస్ లోపల పెట్టగానే అతనికి డబ్బులిచ్చి పంపించేసాను. అత్తయ్య కాఫీ తేవడానికి లోపలకు వెళ్ళింది. ”మావయ్యా, మా స్నేహితుల విశేషాలు ఏమిటి?”ఆతృతగా అడిగాను.

“వైదేహి పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోయింది. నాలుగేళ్ళకో సారి వస్తుంది. రమణి కి వాళ్ళ మావయ్యతోనే పెళ్లి జరిగింది. ఈ ఊళ్లోనే ఉంటోంది. కాత్యాయిని కి పెళ్లి అయ్యింది. ఇద్దరు ఆడపిల్లలు. పెద్ద అమ్మాయి, ఎమ్మే చదివి తణుకు ఉమెన్స్ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తోంది. రెండో అమ్మాయి పెనుగొండ కాలేజీ లో ఏం. బి. ఏ. చదువుతోంది. కాత్యాయిని భర్త తణుకులో ప్రైవేటు కంపెనీ లో పనిచేస్తున్నాడు. జీతం తక్కువ. పని ఎక్కువ. కాత్యాయిని పెరవలి లోని కాన్వెంట్ లో టీచర్ గా చేస్తోంది. కుటుంబంకోసం కాత్యాయిని చాలా కష్టపడుతోంది” అన్నాడు మావయ్య.

నా మనసు ఒకసారి బాధగా మూలిగింది. అత్తయ్య ఇచ్చిన కాఫీ తాగి స్నానం చేసి కాత్యాయిని ఇంటికి వెళ్లాను. పాత పెంకుటిల్లు స్థానంలో చిన్న డాబా ఉంది. ”కాత్యాయిని” అని గట్టిగా పిలిచాను. లోపలనుంచి ఒక అమ్మాయి వచ్చి గేటు తీసి లోపలకు రమ్మంది. హాలులో కుర్చీలో కూర్చున్నాను. లోపలనుంచి కాత్యాయిని వచ్చింది. పచ్చని మేని చాయతో మెరిసిపోతూ పుష్టిగా ఉండే కాత్యాయిని కొద్దిగా సన్నబడింది. నన్ను గుర్తుపట్టలేదు.

‘మీరు . . ’అంటూ ప్రశ్నార్ధకంగా చూసింది. ”ఏమే జాంపండు. ఎలా వున్నావ్?”అన్నాను నేను. వెంటనే ఆమె మొహం ఆనందంతో వెలిగిపోయింది. “ఏయ్ లక్ష్మి, ఎప్పుడూ వచ్చావ్?”అంటూ నా చేతులు పట్టుకుని అడిగింది.

”ఒక గంట అయ్యింది”అన్నాను నవ్వుతూ. పిల్లలు ఇద్దరినీ పిలిచి , ”ఇది మా పెద్ద అమ్మాయి శివాణి. తణుకులో లెక్చరర్ గా చేస్తోంది. ఇది రెండో అమ్మాయి పావని. ఏం. బి. ఏ. చదువుతోంది. తను లక్ష్మి. నా బాల్య స్నేహితురాలు. ”అంది కాత్యాయిని. ఇద్దరూ నమస్తే చెప్పారు. గేటు తీసిన అమ్మాయే పెద్ద అమ్మాయిగా గుర్తించాను. ఇద్దరూ చక్కగా ఉన్నారు. కాసేపుండి లోపలకు వెళ్ళారు పిల్లలు.

“ఆ లక్ష్మి నీ గురించి చెప్పు. మీ మావయ్యని ఎప్పుడూ అడిగినా చెన్నై లో ఉంటోందని చెప్పారు గానీ పూర్తి వివరాలు చెప్పలేదు. ”అంది కాత్యాయిని.

“నా పదవతరగతి పూర్తి కాగానే నాన్న గారికి చెన్నై కి ట్రాన్స్ఫర్ అయ్యింది. తర్వాత నా చదువు, ఉద్యోగం, పెళ్లి అన్నీ అక్కడే. మా వారు నేనూ గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నాం. నాకు ఇద్దరూ అబ్బాయిలే. పెద్దవాడికి పెళ్లి అయి అమెరికాలో ఉంటున్నాడు. చిన్నాడు బెంగుళూరు లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ఇదీ నా సంగతి. మరి నీ విషయం. . . ”అంటూ కాత్యాయిని బుగ్గ పట్టుకు సాగ దీశాను.

”అబ్బ, చిన్నప్పటి నుంచి ఉన్న నీ అలవాటు ఇంకా పోలేదా?” అంటూ సుతారంగా విసుక్కుంది కాత్యాయిని. నేను గట్టిగా నవ్వేసాను.

“మా వారు తణుకులో ఓ ప్రైవేటు కంపెనీ లో పనిచేస్తున్నారు. నేను పెరవలి లోని కాన్వెంట్ లో టీచర్ గా చేస్తున్నాను. వైదేహి కూడా అమెరికాలో ఉంటోంది. రమణి ఇక్కడే ఉంటోంది. అవతలి వీదే వాళ్ళ అత్తిల్లు. ”అంది నవ్వుతూ.

”ఆ బాగుంది. ప్రయాణ ఖర్చులు లేవన్నమాట” అన్నాను నేనూ నవ్వుతూ. శివాణి కాఫీ తీసుకొచ్చింది. నేను మొదటి గుక్క తాగి ‘చాలా బాగుంది శివాణి’ అన్నాను మెచ్చుకోలుగా.

బదులుగా చిన్నగా నవ్వి లోపలకు వెళ్ళిపోయింది. చాలాసేపు చిన్ననాటి కబుర్లు చెప్పుకుని నవ్వుకున్నాం ఇద్దరం. ’సాయంత్రం రమణి ఇంటికి వెళ్దాం ‘ అని చెప్పి ఇంటికి వచ్చేసాను.

అత్తయ్య కొసరి కొసరి వడ్డించగా సుష్టిగా భోంచేసాను. గెస్ట్ రూమ్ లోకి వెళ్లి పక్కమీద వాలగానే నిద్ర పట్టేసింది. మెలకువ వచ్చేసరికి కాత్యాయిని, అత్తయ్య మాట్లాడుకోవడం వినిపించింది. హాలు లోకి వచ్చి కాత్యాయినితో ‘ఎంత సేపయ్యింది వచ్చి?’అన్నాను. “ఇప్పుడే పది నిముషాలయ్యింది”అంది కాత్యాయిని.

లోపలకు వెళ్లి అత్తయ్య మా ఇద్దరికీ పకోడీలు తెచ్చింది. అవి తినేసి రమణి ఇంటికి వెళ్లాం. రమణి నన్ను గుర్తు పట్టలేదు. కాత్యాయిని చెప్పింది మన ఫ్రెండ్ లక్ష్మి అని. ముగ్గురం చిన్న నాటి ముచ్చట్లు చెప్పుకున్నాం. రమణికి కూడా ఇద్దరూ ఆడపిల్లలే. పెళ్ళిళ్ళు అయిపోయాయి అని చెప్పింది రమణి.

“మేరీ గుర్తుందా?”అడిగింది రమణి. గుర్తుంది అన్నట్టు తలూపాను.

”తను పెరవలి హాస్పిటల్ లో నర్స్ గా పనిచేస్తోంది. వాళ్ళ అమ్మాయి తణుకు ఉమెన్స్ కాలేజీ లో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. బాక్సింగ్ లో స్టేట్ ఫస్ట్ వచ్చింది”ఆనందంగా చెప్పింది రమణి. నాకు చాలా సంతోషం కలిగింది. కాసేపు ఉండి ముగ్గురం నడుచుకుంటూ మేరీ ఇంటికి వెళ్లాం. రామ మందిరం దగ్గర ఉన్న జనం మాకేసి ఆసక్తిగా చూడటం నేను గమనించాను. అంబేద్కర్ బొమ్మ వెనక ఉన్న డాబా ముందు ఆగాము. రమణి ‘మేరీ’అని పిలిచింది. మేరీ బయటకు వచ్చి మమ్మల్ని లోపలకు తీసుకువెళ్ళింది. ఇల్లు చాలా నీటుగా ఉంది.

మేరీ కూడా నన్ను గుర్తు పట్టలేదు. రమణి చెప్పింది ‘సోమయాజులు తాతయ్య గారి మనవరాలు లక్ష్మి’ అని.

మేరీ వెంటనే నా చెయ్యి పట్టుకుని ‘బాగున్నావా లక్ష్మి. నేను పెద్ద ఇనప మేకు తెస్తే దాంతో మనం ఇద్దరం స్కూల్ గంట కొట్టే వాళ్ళం. రంగయ్య వస్తే పారిపోయే వాళ్ళం’ అంది నవ్వుతూ. అది తలుచుకుని నేనూ గట్టిగా నవ్వాను. ఇద్దరికీ కళ్ళమ్మట నీళ్ళు వచ్చాయి.

“మీ అమ్మాయి బాక్సింగ్ లో ఫస్ట్ వచ్చిందట గా. ఓ సారి పిలు” అన్నాను. కూతుర్ని పిలిచి పరిచయం చేసింది. ”ఈ ఆంటీలు ఇద్దరూ నీకు తెల్సుగా. ఈమె లక్ష్మి. నా చిన్ననాటి స్నేహితురాలు. చెన్నై లో ఉంటోంది.”

రోజీ నాకు నమస్కారం చేసింది. తనని దగ్గరగా రమ్మనమని సైగ చేసి, షేక్ హ్యాండ్ ఇచ్చి ‘త్వరలోనే నేషనల్ లెవెల్ లో కూడా ఫస్ట్ రావాలి ‘ అని అభినందించాను. థాంక్స్ చెప్పి లోపలకు వెళ్లి మా ముగ్గురికి బిస్కట్లు తెచ్చింది రోజీ. గతంలో ఊళ్ళో కి బస్సు వచ్చేదని, రెండేళ్ళ నుంచి బస్సు రావడం లేదని గ్రామం లో అందరూ ఆటోల మీదే ప్రయాణం చేస్తున్నారని, ఆడపిల్లలు కాలేజీ నుంచి వచ్చేటప్పుడు ఆటోలో వస్తూ ఇబ్బంది పడుతున్నారని చెప్పింది మేరీ. మూడు కమలాల పల్లెకి, పెరవలి నాలుగు కిలో మీటర్లు, తణుకు పదికిలోమీటర్లు. రాత్రిళ్ళు తణుకు నుంచి వచ్చేటప్పుడు మహిళలు, విద్యార్ధినులు ఆటో వాళ్ళ వలన చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తోందని రమణి కూడా చెప్పింది.

నా మనసులో ఒక ఆలోచన వచ్చింది.

“రమణీ, నువ్వు డ్వాక్రా లీడర్ వని కాత్యాయిని చెప్పింది. రేపు రామమందిరం దగ్గర చిన్న మీటింగ్ పెడదాం. మహిళలతో కాసేపు మాట్లాడాలని ఉంది. ఆ ఏర్పాట్లు చెయ్యగలవా?”అడిగాను నేను. అలాగే అంది రమణి. కాసేపు ఉండి ముగ్గురం బయల్దేరి వచ్చేశాం. రమణి, కాత్యాయిని వాళ్ళ ఇళ్ళకు వెళ్ళిపోయారు. నేను మావయ్య ఇంటికి వచ్చాను. ఆటో వాళ్ళ గురించి మావయ్యని అడిగాను.

“ఊళ్ళో ఆటో వాళ్ళ వలన పెద్ద ఇబ్బంది లేదు. పొరుగూరి నుంచి వచ్చే ఆటో వాళ్ళ వలెనే సమస్యలు వస్తున్నాయి. వాళ్ళ వెకిలి మాటలు చేష్టలు ఎక్కువగా ఉంటున్నాయి. ఒకటి , రెండు సార్లు ఊళ్ళో వాళ్ళు ఆటో వాళ్లకి దేహశుద్ధి చేసారు. అయితే వాళ్లకు కుల సంఘాలు, యూనియన్ లు ఉన్నాయి. వాళ్ళు తిరిగి ఊళ్ళో వారిమీదే కేసులు పెట్టారు. గొడవ పెద్దదై చివరకు పోలీసులు రాజీ చేసారు. ”

మావయ్య మాటలు విని నిట్టూర్చాను. ప్రతి దానికి కులాన్ని ఆయుధంగా తీసుకుని రెచ్చిపోవడం బాధ కలిగించింది. అవినీతిపరుడైన అధికారి మీద చర్య తీసుకుంటే, వాళ్ళ కులానికి చెందిన వారు ధర్నాలు చేస్తారు. ఒక ప్రజా ప్రతినిధి ఏదైనా స్కాం లో ఇరుక్కుంటే అతని మీద ఎంక్వయిరీ వేసినా ఆ కులానికి చెందిన వారు కూడా ధర్నాలు చేస్తారు అతనికి అనుకూలంగా. తమ వర్గానికి చెందిన వ్యక్తి తప్పు చేసాడన్న ఆలోచన వారికి ఉండదు. తమ వాడిని కాపాడుకోవాలి అన్నదే వారి ధ్యేయం. ప్రజల ఆలోచనా విధానంలో మార్పు వస్తే తప్ప దీనికి పరిష్కారం ఉండదు.

రాత్రి భోజనం చేసి మా వారితో మాట్లాడి ఆలస్యంగా నిద్ర పోయాను. ప్రొద్దున్నే కాత్యాయినితో కలిసి గోదావరి స్నానానికి వెళ్లాను. చిన్నప్పుడు అమ్మమ్మ చెప్పేది ’బంగారూ, ఇది బ్రహ్మగుండ క్షేత్రం అమ్మా. ఇక్కడ ఒకసారి స్నానం చేస్తే అన్ని పాపాలు పోతాయి’ అని.

గోదావరిలో నీళ్ళు చాలా తక్కువగా ఉన్నాయి. ఇద్దరం స్నానాలు చేసి సోమేశ్వర స్వామి దర్శనం చేసుకుని ఇంటికి వచ్చాం. టి. వి. లో వచ్చిన న్యూస్ చూసి మావయ్య, అత్తయ్య నన్ను అభినందించారు. శ్రీవారు కూడా ఫోన్ చేసి అభినందనలు చెప్పారు. జిల్లా పోలీస్ సూపర్నెంట్ కి ఫోన్ చేసి సాయంత్రం మా ఊళ్ళో మీటింగ్ వుంది రావాలని చెప్పాను. అలాగే అన్నారు. నేను ఇక్కడకు వస్తున్నట్టు తూర్పు గోదావరి ఎస్. పి. కి , పశ్చిమ గోదావరి ఎస్. పి. కి రెండు రోజులు ముందుగానే మెసేజ్ పంపాను.

సాయంత్రం మావయ్యని తీసుకుని రామమందిరం దగ్గరకు వెళ్లాను. చాలా మంది మహిళలు వచ్చారు. కాత్యాయిని మైక్ తీసుకుని “మా చిన్ననాటి స్నేహితురాలు, సోమయాజులు తాతయ్య గారి మనవరాలు, మన రామచంద్రం మాస్టారి మేనకోడలు లక్ష్మి చెన్నై నుంచి వచ్చారు. మీకు నాలుగు విషయాలు చెప్పాలని అనుకుంటున్నారు. మీరు శ్రద్హగా వినండి” అని చెప్పింది. నేను మైక్ తీసుకుని మాట్లాదదామనుకునేసరికి సైరన్ వేసుకుంటూ పోలీస్ జీప్, దాని వెనకే తెల్లని వాన్ వచ్చి ఆగాయి.

వాన్ లోంచి ఎస్. పి. దిగి నాకు విష్ చేసారు. నేను ఆయన్నివేదిక పైకి రమ్మని ఆహ్వానించాను. ఎస్. పి. వచ్చి నా పక్కన ఉన్న కుర్చీలో కూర్చున్నారు. సభలో ఉన్నవారు ఆశ్చర్యంగా నాకేసి చూస్తున్నారు.

“అందరికీ నమస్కారం. మన పశ్చిమ గోదావరి జిల్లా స్వాతంత్ర సమరయోధుల ఖిల్లా అని పేరు పొందినది. అన్నీ రంగాలలో మన జిల్లావారు ముందున్నారు. మహాత్మా గాంధీకి తన బంగారాన్ని అంతా ఇచ్చిన సమరయోధురాలు మాగంటి అన్నపూర్ణ దేవి, గవర్నర్ గా, చీఫ్ ఎలక్షన్ కమిషనరు గా చేసిన వి. ఎస్. రమాదేవి, ఆధ్యాత్మ రామాయణానికి సంగీత, నృత్య సొగసులద్దిన సరిదే మాణిక్యమ్మ, అభ్యుదయ రచయిత్రి ముప్పాళ్ళ రంగనాయకమ్మ వంటి మహిళా రత్నాలు మన జిల్లా వారే. మన పక్కనే ఉన్న మార్టేరు కి చెందిన సత్తి గీత పరుగుల రాణిగా పేర్గాంచి అంతర్జాతీయ క్రీడా పోటిలలో ఎన్నో పతకాలు సాధించి మన దేశ గౌరవాన్ని ఇనుమడింపచేసింది. అంతెందుకు మన గ్రామానికి చెందిన మేరీ కుమార్తె రోజీ బాక్సింగ్ లో రాష్ట్రం లోనే ఫస్ట్ వచ్చింది. ఇవన్ని ఎందుకు చెబుతున్నానంటే ప్రతి మనిషిలో ఏదో ఒక శక్తి ఉంటుంది. దాన్ని సమాజానికి, దేశానికి ఉపయోగ పడేటట్లు మనం మలచుకోవాలి. మారుతున్న కాలంతో మనమూ మారాలి. మన చదువుతో పాటు కంప్యూటర్ నాలెడ్జి తప్పనిసరి. మన గ్రామం ఆడపిల్లలు తణుకు వెళ్లి నేర్చుకుంటూ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిసింది. అందుకే ఇక్కడ ఒక ఉచిత కంప్యూటర్ ట్రైనింగ్ సెంటరు , మహిళలకోసం ఏర్పాటు చేస్తున్నాను. వారం రోజులలో అది ప్రారంభం అవుతుంది. కాత్యాయిని, రమణి దాని బాధ్యతలు చూస్తారు. ఇప్పుడు ఎస్. పి. గారు మాట్లాడతారు” అని కూర్చున్నాను.

“మీ అందరికీ నమస్కారం. ఎంతో మంది మహానుభావులు జన్మించిన ఈ జిల్లా లో పోలీసు అధికారిగా పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మహిళా చైతన్యమే దేశ చైతన్యం గా నేను బలంగా నమ్ముతాను. ముందుగా మీ మీద మీరు విశ్వాసాన్ని పెంచుకోండి. అప్పుడు ఎటువంటి సమస్యనైనా ఎదుర్కోగలరు. మన ధైర్యమే మనకు రక్ష. మేడం ఆటో వాళ్ళ గురించి చెప్పారు. రెండు రోజుల్లో పెరవలి లోనే , ఈ చుట్టుపక్కల గ్రామాలలో ఉన్న ఆటో వాళ్ళతో మీటింగ్ పెట్టి వారికి గట్టిగా వార్నింగ్ ఇస్తాను. అప్పుడూ మారకపొతే చట్టప్రకారం చర్యలు తీసుకుంటాను. మేడం ఝాన్సీ లక్ష్మి గారు చెన్నైలో ఇన్స్పెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ గా పనిచేస్తున్నారు. నా కంటే చాలా పెద్ద అధికారి. కరోనా కష్టకాలంలోనూ,

చెన్నై లో వచ్చిన వరదల విపత్కర పరిస్తితులలో ప్రజలకు ఎంతో సేవ చేసారు. తమిళనాడు ప్రభుత్వం వారు మేడం గారిని ‘ఉత్తమ మహిళా సేవా రత్న’ అవార్డు కి ఈ రోజే ఎంపిక చేసారు. వారికి నా అభినందనలు” అని సబ్ ఇన్స్పెక్టర్ అందించిన ఫ్లవర్ బోకే నాకు ఇచ్చి సెల్యూట్ చేస్సారు ఎస్. పి. తర్వాత మేరీ కూతురు రోజీ ని వేదిక మీదకు పిలిచింది కాత్యాయిని. ఎస్. పి. రోజీ ని శాలువా కప్పి సన్మానించారు.

నేను పాతికవేలు రోజికి ఇచ్చాను. మావయ్య పదివేలు, రమణి భర్త రామకృష్ణ పదివేలు, ఎస్. పి. ఐదువేలు ఇచ్చారు. ఎనభై ఏళ్ళ వయసులో కూడా స్కూటర్ మీద తిరుగుతూ ఊళ్ళో అందరికీ వైద్యం చేస్తూ, అందరూ “రుక్కయ్య గారు” అని ఆప్యాయంగా పిలిచే డాక్టర్ రుక్మిణినాద శాస్త్రి తన మెడలోని రెండు కాసుల బంగారు గొలుసు తీసి రోజీ మెడలో వేసారు. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టారు. కాసేపుండి ఎస్. పి. వెళ్ళిపోయారు. కాత్యాయిని, రమణి, మేరీ నా వేపు బెరుకు బెరుకుగా చూస్తున్నారు. నేనే వాళ్ళ భుజాల చుట్టూ చేతులువేసి దగ్గరకు తీసుకున్నాను.

’నా ఉద్యోగం గురించి చెబితే మీరు ఇలా దూరంగా ఉంటారనే చెప్పలేదు’అన్నాను నవ్వుతూ. వాళ్ళు కూడా నాతో శృతి కలిపారు. నేను చెన్నై వెళ్ళగానే కంపూటర్లు, లేడీ టీచర్ ని పంపుతాను. మీరు జాగ్రత్తగా సెంటర్ నడపండి. ఖర్చు అంతా నేనే భరిస్తాను అని వాళ్లకు చెప్పాను. అందరం ఇళ్ళకు వెళ్లాం. నేను మా శ్రీవారితో మాట్లాడి ఒక నిర్ణయానికి వచ్చాను.

నేను వెంటనే కాత్యాయిని వాళ్ళ ఇంటికి వెళ్లాను. కాత్యాయినికి మా రెండో అబ్బాయి ఫోటో చూపించాను. ”వీడికి సంబంధాలు చూస్తున్నాను. మీ పెద్ద అమ్మాయి శివాణి నాకు బాగా నచ్చింది. మన స్నేహం బంధుత్వంగా మారితే బాగుంటుందని భావిస్తున్నాను. ఈ పల్లెతో నా బంధం మరింత బలపడాలని నా కోరిక. నువ్వు మీ వాళ్ళతో ఆలోచించి చెప్పు. రేపు ఉదయమే నా ప్రయాణం. ”అని ఫోటో ఆమె చేతిలో పెట్టి వచ్చేసాను. ఆ రాత్రి నాకు కలత నిద్రే అయ్యింది.

మర్నాడు ఉదయం నేను బయల్దేరే సమయానికి కాత్యాయిని, వాళ్ళ ఆయన వచ్చారు. ఈ సంబంధం కలుపుకోవడం తమకిష్టమేనని చెప్పారు. నేను, మావయ్య, అత్తయ్య అందరం సంతోషించాం.

“ఈ పల్లెతో బంధాన్ని వదులుకోకు బంగారం”అన్న అమ్మమ్మ మాటలు గుర్తుకొచ్చాయి. నా పెదవులపై దరహాస కుసుమం విరిసింది.

***శుభం***

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలు :

రచయిత పరిచయం : సత్యనారాయణ మూర్తి M R V

ఎమ్. ఆర్. వి. సత్యనారాయణ మూర్తి. పెనుగొండ. పశ్చిమ గోదావరి జిల్లా. కవి, రచయిత, వ్యాఖ్యాత, రేడియో ఆర్టిస్టు. కొన్ని కథల పుస్తకాలు, కవితల పుస్తకాలు ప్రచురితం అయ్యాయి. కొన్ని కథలకు బహుమతులు కూడా వచ్చాయి. రేడియోలో 25కథలు ప్రసార‌మయ్యాయి. 20 రేడియో నాటికలకు గాత్ర ధారణ చేసారు. కవితలు, కథలు కన్నడ భాషలోకి అనువాదం అయ్యాయి.



81 views1 comment

1 Comment


Aravinda Varanasi
Aravinda Varanasi
Jul 26, 2021

Nostalgic narrative of childhood times!!! Kudos to the author!

Like
bottom of page