top of page

పలుకే ఇనుమాయె


'Paluke Inumaye' New Telugu Story


Written By BVD Prasada Rao


'పలుకే ఇనుమాయె' తెలుగు కథ


రచన: బివిడి ప్రసాదరావు


(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


ఉలిక్కిపడ్డాడు జీవనరావు. ఆ వెంబడే వణికి పోతున్నాడు. "ఏంట్రా.. ఏమంటున్నావ్." తడబడుతున్నాడు. "నాన్నా.. సిగ్నల్స్ బాగోక.. మాటలు సరిగ్గా వినబడడం లేదు.. గట్టి గట్టిగా మాట్లాడ వలసి వస్తుంది.. తర్వాత.. తర్వాత.. కాల్ చేస్తాలే." కృప కాల్ కట్ చేసేసాడు. ఇటు జీవనరావు చేతిలోని సెల్ ఫోన్ జారి పడింది. అతడి స్థితి దారుణమయ్యింది. సోఫా లోంచి లేవ లేక పోతున్నాడు. అతడి గొంతు పెగలడం లేదు. తమాయించుకోవడానికి యత్నిస్తున్నాడు. అంతలోనే ఆ హాలులోకి కాంతం వచ్చింది. ఆవిడ చేతుల్లో కాఫీ గ్లాసులు రెండు ఉన్నాయి. ఒక గ్లాస్.. జీవనరావు ముందు ఉంచి.. "తీసుకోండి." అంటుంది. జీవనరావు చేయి లేప లేక పోతున్నాడు. బిత్తర బిత్తరగా కదులుతున్నాడు. భర్త వాలకం గుర్తించిన కాంతం.. కంగారుగా.. "ఏం.. ఏమైందండీ." అడగ్గలిగింది. జీనవరావు ఇంకా మాట్లాడ లేక పోతున్నాడు. వణికి పోతున్నాడు. చేతుల్లోని కాఫీ గ్లాసులను టీపాయ్ మీద పడేసినట్టు.. పెట్టేసి.. భర్తను పట్టుకుంటూ.. ఆయన పక్కన ఆ సోఫాలో గుమ్మరించినట్టు చతికిలి పడిపోయింది కాంతం. భర్తను గుంజుతున్నట్టు కుదిపేస్తూ.. ప్రశ్నల వర్షం చేపట్టేసింది. జీవనరావు భారంగా.. బింకంగా.. "ఉండే.. ఊపిరాడనీయవే.. కాస్తా.. కొద్దిగా మంచి నీళ్లు పట్టవే." అనగలిగాడు. కాంతం లేచింది. తన ఒళ్లును లాక్కుపోతున్నట్టు ముందుకు కదిలింది. కిచన్ నుండి మంచి నీళ్లు గ్లాస్ తో అలానే అక్కడకు రాగలిగింది. భర్తచే కొన్ని నీళ్లు తాగించింది. "చాల్లేవే." చెప్పాడు జీవనరావు. తాను మిగిలిన నీళ్లను తాగేసి.. ఖాళీ గ్లాస్ ను టీపాయ్ మీద పడేసి.. భర్త పక్కన తిరిగి కూలబడింది కాంతం. "వాడు.. వాడు.." అంటున్నాడు జీవనరావు. "ఎవడు.. ఎవడు.." గమ్మున కలగచేసుకుంది కాంతం. "ఆగవే.. చెప్పనీయవే." అన్నాడు జీవనరావు. కాంతం ఆగింది. "అదేనే.. మనోడు.. ఫోన్ చేసి.." చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు జీవనరావు. "మనోడా.. కృప ఫోన్ చేసాడా. మరి నన్ను పిలవలేదేం. వీడియో కాలా." జరజరా మాట్లాడేస్తుంది కాంతం. "అయ్యో. ఊపిరాడక నేనే మాట్లాడ లేక పోతున్నాను. మధ్య నీ అడ్డు లేమిటే." గొణిగాడు జీవనరావు. కాంతం తన ఫ్లోలో తాను ఉంది. "ఏం చెప్పేడేమిటి. ఎందుకు అంతగా హైరానా పడిపోతున్నారు." చకచకా అడిగేసింది. "చెప్పనిస్తావా." గింజుకుంటున్నాడు జీవనరావు. కాంతం మళ్లీ ఆగింది. జీవనరావు భారంగా ఊపిరి పీల్చుకున్నాడు. "ఊపిరి సలపనీ.. వాడా.. వాడు పిన్ తీయని బాంబ్ వేసాడు. నువ్వా.. నువ్వు దాని పిన్ ను ఒక్కమారుగా పీక్కు." గందికవుతున్నాడు జీవనరావు. ప్రెస్సింగ్ నుండి బయట పడ్డ స్ప్రింగ్ లా సర్రున.. "బాంబా. పిన్ తీయనిదా.. ఏమిటి.. మీ తలా తోక కానరాని గోల." అనేసింది కాంతం. భార్య రియాక్షన్ కు బిక్కయ్యిపోయాడు జీవనరావు. "ఏంటా ఎఱ్ఱి చూపులు. సరిగ్గా చెప్పి తగలడండి. నా గుండాగిపోయాలా ఉంది." అంది కాంతం విసురుగానే. "నాది అదే మచ్చు. దానికి నువ్వు కుల్ల పొడుస్తున్నావు. కాస్త చెప్పనియ్యవే." తంటాలవుతున్నాడు జీవనరావు. కాంతం మరో మారు ఆగింది. "కంపెనీ పంపుతుందని సంబర పడి.. మన కృపను అమెరికా పంపాం. వాడు.. ఉద్యోగంలో మరింత ఉన్నత స్థితికి చేరాడనుకున్నాం.. కానీ.. కానీ.." బెక్కుతున్నాడు జీవనరావు. అప్పుడే కాంతం జర్రున దూరేసింది.. "కానీ.. కానీ.. వాడేం చేసాడండీ. వాడికి ఏమైందండీ" తెగ అడిగేస్తుంది. "ఒసే.. ఒసే.. నీకు దణ్ణం పెడతానే. ఆగవే.. చెప్పనీయవే." చేతులు జోడించేసాడు జీవనరావు. "మరీ బాగుంది. నానుస్తుంది మీరు. సరిగ్గా చెప్పక.. నన్ను బెదర కొట్టేస్తున్నారు. గబగబా తగలెట్టండి." విసుక్కుంటుంది కాంతం. ఐనా.. మళ్లీ ఆగింది. ఆ సందులో.. "వాడు అక్కడ ఉద్యోగంలో చేరి.. పట్టున పది నెలలు గడవ లేదు.. అంతలోనే వాడక్కడ వెలగ తీస్తుంది ఏమిటో తెలుసా." అన్నాడు జీవనరావు. "చెప్పి తగలడండి." కాంతం గింజుకుంటుంది. ఆ తోవలోనే పూనకం పూనే దానిలా తన రెండు చేతి వేళ్లతో జీవనరావు బుగ్గలు పట్టి సాగ తీసేస్తుంది. "అయ్యో.. అయ్యో.. ఇదేం ఘోరమే.. ఇదేం అఘాయిత్యమే.. నా బుగ్గలు.. నా బుగ్గలు ఇలా పీకేస్తున్నావేమిటే." గింజుకుంటున్నాడు జీవనరావు. ఎట్టకేలకు తన బుగ్గల్ని స్వాధీన పర్చుకునేక.. "తల్లీ.. మహంకాళీ.. ఆగవే." అంటున్నాడు జీవనరావు బుగ్గలు తడుముకుంటూ. ఆ వెంబడే.. "నాన్చక గబగబా చెప్పేయండి." అత్రమవుతుంది కాంతం. భార్య గడ్డం పట్టుకొని.. "ప్లీజ్ వే. నేను చెప్పేంత వరకు ఆగవే. మధ్య అడ్డు రాకే" బతిమలాటను చేపట్టాడు జీవనరావు చాలా నీర్సంగా.కాంతం ఆగింది. "కృప డేటింగ్ లో ఉన్నాడవే." టక్కున చెప్పేసాడు జీవనరావు. కాంతం గతుక్కుమంది. గుండె పట్టుకొని సోఫాలో పుటుక్కున పడి పోయింది. జీవనరావు గాభరా అవుతూ.. టీపాయి మీది నీళ్ల గ్లాస్ ను చూసాడు. దానిలో నీళ్లు లేక పోయే సరికి.. మొద్దు బారిన తలతో.. అక్కడే ఉన్న కాఫీ కప్పుల్లోంచి ఒక దానిని సర్రున తీసుకున్నాడు. దాని లోని కాఫీని పుసుక్కున భార్య ముఖం మీద పారపోసేసాడు. అంతే.. చురుక్కుమనిపించిన ఆ కాఫీ జల్లుతో భళ్లున కళ్లు తెరవగలిగింది కాంతం. "నీ సంగతి తెలిసే.. అందుకే.. మెల్లి మెల్లిగా చెప్పుతుంటే.. నువ్వు గింజుకుంటూ కృప సంగతిని గుంజేసుకున్నావ్." అన్నాడు జీవనరావు. ఆ వెంబడే భార్యని ఎత్తి సరిగ్గా కూర్చుండ పెట్టాడు. "వాడికి ఫోన్ చేయండి. నేను మాట్లాడతాను." చెప్పింది కాంతం ఊగిపోతూ. ఆ వెంబడే.. "కాల్ కాదు.. వీడియో కాల్ చేయండి." అంది. జీవనరావు ఇక తప్పదన్నట్టు.. తన ఫోన్ కై వెతుకులాడుతూ.. అక్కడే కింద పడి ఉన్న దానిని అందుకొని.. కృపకు వీడియో కాల్ చేసాడు. నిముషం లోపునే.. కృప ఆ కాల్ కు కనెక్టు అయ్యాడు.తన తల్లిదండ్రుల అస్తవ్యస్త స్థితిని గుర్తించాడు. "ఏమయ్యింది." గమ్మున అడిగేసాడు. "నీ నిర్వాహకంకి అమ్మ బెంబేలయ్యిపోతుంది." చెప్పాడు జీవనరావు. "అదేమిటి. నేనేం చేసాను." బిత్తరవుతున్నాడు కృప. శక్తిని కూడ తీసుకొని.. "జాబ్ కని పోయి.. అక్కడ నువ్వు వెలగ పెడుతుంది ఏంట్రా. వచ్చే ఏడాది నీకు పెళ్లి చేయాలి అనుకుంటుండగానే.. ఇంతలోనే.. నీ ముద్ద పప్పు ముఖం.. ఒళ్లు.. పులుపెక్కినాయా. ఆయ్.." అరుస్తున్నట్టు మాట్లాడుతూన్న కాంతంకి.. అడ్డై.. "అమ్మా.. ఆగమ్మా.. ఏంటి నీ సొద.. రొద.. సూటిగా విషయంలోకి రావే." అన్నాడు కృప విస్మయంగా. కాంతం చిర్రగా.. "మరి.. డేటింగ్ లో ఉన్నావటగా. ఏంట్రా సంగతి." అరుపులు కొనసాగిస్తుంది. కృప కంగారయ్యాడు. "డేటింగ్ లో ఉన్నానా. ఎవరు చెప్పారు." అడగ్గలిగాడు. "నాతో నువ్వే.. ఇందాకే.. ఫోన్ లో చెప్పావు కదరా." జీవనరావు కలగచేసుకున్నాడు. "నేనా.. అలా చెప్పానా. లేదే. అమ్మా.. నీ మీద ఒట్టే.. నిజంగా ఒట్టే.. అలాంటిదేమీ లేదే." గోలగా చెప్పాడు కృప. ఆ తీరులోనే.. "నాన్నా.. ఇందాక ఫోన్ సరిగ్గా కనెక్ట్ కాలేదుగా.. మీరు వినడంలోనే తప్పు.. నిజానికి నేను అన్నది.. డేటింగ్ లో కాదు.. డైటింగ్ లో ఉన్నాను అన్నాను. అంతే.." క్లారిఫికేషన్ లా చెప్పుతున్నాడు కృప అటు నుండి. ఇటు.. భర్త మీద కాంతం గుర్రును చేపట్టేసింది. ***

బివిడి ప్రసాదరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.



రైటర్, బ్లాగర్, వ్లాగర్.

వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్

వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్

వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.







73 views0 comments

Comments


bottom of page