top of page

పానకాలు పెళ్లికొడుకాయెనే !

Panakalu Pellikodukayene! Written By Syamala Jonnalagadda

రచన : జొన్నలగడ్డ శ్యామల


పానకాలరావుకు పెద్దగా చదువబ్బక పోవడంతో తండ్రి, అతడి చేత జెరాక్స్ సెంటర్ పెట్టించాడు. పానకాలరావుకు ఆ పేరు మంగళగిరి దేవుడి మీద భక్తితోనో లేదంటే వారి తాతగారి పేరు కావడం వల్లనో పెట్టింది కాదు. మరెలా అంటే పానకాలరావు తండ్రి పాపారావుకి పానకం అంటే చాలా ఇష్టం. మంచి నీళ్లు లేకపోయినా ఫర్వాలేదు కానీ పానకం లేకుంటే అతడి ప్రాణం గిలగిలలాడుతుంది. ఎన్ని కూల్ డ్రింకులు, జ్యూస్ లు ఉన్నా అతడికి పానకమే పసందు. అందుకే ఇంటా బయటా అంతా పానకాలు అనే పిలుస్తారు. జెరాక్స్ సెంటర్ ఓ ప్రైవేట్ కాలేజ్ పక్కనే పెట్టడంతో బిజినెస్ మూడు పూవులు ఆరు కాయలుగా ఉంది. దాంతో పానకాలుకి పేళ్ళి చేసేయాలనుకున్నాడు తండ్రి. అనుకోవడం తడవు ''ఒరే పానకాలూ! మంచి ఫోటో ఒకటివ్వరా, ఆ గుర్నాథంగారికి ఇస్తే సంబంధాలు చెపుతాడు'' అన్నాడు.

''ఉన్నవన్నీ పాతవి డాడీ, ఈరోజు తీయించుకుంటాలే'' అన్నాడు.

''అదేదో తొందరగా కానీ'' అంటూ తండ్రి వెళ్ళిపోయాడు.

''ఫొటోకు ఏ షర్ట్ బాగుంటుంది? పూల షర్ట్ .. ఊహూ. కమెడియన్ లాగా ఉంటాడు. అడ్డచారల టీ షర్ట్.. నాన్న దొంగల షర్ట్ అంటాడు.. ఈ రెడ్ షర్ట్ బాగానే ఉంది. కానీ దీనిమీద ''చాల్లెన్జ్ . రెడీ టు ఫైట్ '' అని ఉంది. రౌడీ అనుకుంటారేమో .. ఆ.. ఈ క్రీమ్ కలర్ షర్ట్ ఓ.కే. '' అనుకున్నాడు. పొద్దునే షేవ్ చేసుకున్నాడు. అమ్మాయిలు గెడ్డం ఉంటె మెచ్చుతారో, లేకపోతె మెచ్చుతారో తెలీదు. ఆ నరేష్ గాడి భార్య వాణ్ని ''మీకు గెడ్డం ఉంటేనే బాగుంటుంది'' అందట. మనోజ్ భార్యేమో ''ఛీ గెడ్డం ఏమిటి విషాద ప్రేమికుడిలాగా'' అందట. అంటే కొందరికి అట్లా ఇష్టం కొందరికి ఇట్లా ఇష్టం .. పోన్లే ఈరోజు గెడ్డం లేకుండా దిగి తర్వాత గెడ్డంతో ఇంకో ఫోటో దిగితే సరి'' అనుకుని తయారయి, ఒకటికి నాలుగుసార్లు అద్దంలో చూసుకుని, క్రాఫ్ సర్దుకుని బయటకు నడిచాడు.

''ఏ స్టూడియోకి వెళ్ళాలి'' అని చూస్తుండగా రోడ్డుకి అవతల వైపు ''లుక్స్ అదుర్స్'' పెళ్లిచూపుల ఫోటోలు మా ప్రత్యేకత'' అనే బోర్డు కొట్టొచ్చ్చినట్లు కనిపించింది. వెదకబోయిన తీగ కాలికి తగిలినట్లవడంతో ''యాహూ'' అనుకుని స్పీదుగా రోడ్డు దాటబోయేసరికి ఓ ఆటో ఢీ కొట్టబోయి సడన్ బ్రేక్ తో ఆగింది.

''ఏం పొద్దుగాల్నే మందుకొట్టినవా బే, ఇంట్ల చెప్పొఛ్చినవా .. అంత సావాల్నని ఉంటే హుస్సేన్ సాగర్ల దూకరాదూ, నా బండి కింద ఎందుకు పడుడు'' అంటూ ఇంకా నోటికొచ్చ్చిన నాలుగు బూతులు జోడించాడు. పానకాలు నిశ్చేష్టుడయ్యాడు. యాక్సిడెంట్ తప్పినందుకు సంతోషించే లోపే ఆటోవాలా నోట చావు మాట విని శుభమా అని పెళ్లి చూపుల ఫొటోకు వెళుతుంటే ఇదేమిటనిపించడంతో ఉలుకు, పలుకు లేకుండా రాయిలా నిలబడిపోయాడు. ''ఈనికేదో దిమాక్ ఖరాబ్ అయినట్లుంది'' అనుకుని ఆటోవాలా వెళ్ళిపోయాడు.

''బతుకు జీవుడా'' అనుకుని ముందుకు నడిచి స్టూడియో లోపలికి వెళ్ళాడు.

స్టూడియో అతణ్ని చూడగానే ''పెళ్లి చూపుల ఫోటో '' అని చెప్పాలంటే పానకాలుకు సిగ్గేసి మెలికలు తిరిగిపోయాడు. అతడి వైఖరి చూసి స్టూడియో అతను ''సమజయింది, పెళ్లి చూపుల ఫోటోనే కదా. ఏం ఫికర్ చేయకుండ్రి . మా తాన ఫోటో దిగినోల్లకి నాలుగు నెలలల్ల లగ్గమయిపోతది'' గర్వంగా చెపుతూ, లోపలి గదిలోకి నడవమని చేయి చూపించాడు.

పానకాలుకు లైట్ల ముందు నిల్చోగానే ముచ్చెమటలు పట్టాయి. కర్చీఫ్ తో తుడుచుకుని, అద్దంలో చూసుకుని పౌడర్ అద్దాడు. కానీ పౌడర్ ముఖం మీద అక్కడక్కడా దట్టంగా చిత్రమైన డిజైన్లలో అతుక్కుపోయినట్లు అనిపించింది. దాంతో మళ్ళీ ముఖాన్ని కర్చీఫ్ తో గట్టిగా తుడిచేసుకున్నాడు.

''సార్ రెడీనా'' అంటూ వచ్చాడు ఫోటోగ్రాఫర్.

''ఆ ఆ '' అంటూ క్రాఫ్ ను సరిచేసుకుని వెళ్లి నిలబడ్డాడు.

''అటు తిరగండి ఇటు కొద్దిగా .., తల ఎత్తండి ఇటు చూడండి. స్మైల్ '' అంటూ హింసించి ఎట్టకేలకు ఫోటో తీసాడు ఫోటోగ్రాఫర్.

''హమ్మయ్య'' అనుకుని గది బయటకు నడిచి కౌంటర్లో డబ్బు చెల్లించి ''ఫోటోలు ఎప్పుడిస్తారు?'' అడిగాడు.

''షామ్ మే '' ఎటో చూస్తూ నిర్లక్ష్యంగా చెప్పాడు స్టూడియో అతను.

నీరసంగా ఇల్లుచేరి పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురుచూసే వాడిలా ''ఫోటో ఎలా వస్తుందో ఏమో'' అనుకుంటూ గడిపాడు. సాయంత్రం అయింది. గబగబా స్టూడియోకి వెళ్ళాడు.

స్టూడియో అతను రెడీగా ఉంచిన ఫోటోల కవర్ ఇచ్చ్చాడు.

ఆత్రంగా కవర్ తెరిచి ఫోటో చూస్తే నవ్వు తున్న తన మూతి వంకరగా ఉందనిపించింది.

పానకాలు ముఖం చదివిన స్టూడియో అతను ''మస్తుగున్నరు సార్. నెల లోపటె పెళ్లి కారట్ పట్టుకొస్తరు. నా మాట నిజం గాకుంటే సూడుండ్రి'' పొగిడేసాడు.

''థాంక్యూ'' అంటూ బయటకు నడిచాడు పానకాలు.

***

ఫోటో గుర్నాథంగారికివ్వటం జరిగిపోయింది. గెడ్డం ఫోటో అవసరం లేదన్నారు. అది మొదలు ఇంట్లో రోజూ పెళ్లి సంబంధాల చర్చలే. అమ్మాయిల ఫోటోలు కొన్ని తల్లిదండ్రులకే నచ్చలేదు. కొన్ని పానకాలుకు నచ్చలేదు. ఫోటోలు ఓకే అయి పెళ్లి చూపుల వరకు వెళ్ళినవి నాలుగే. పెళ్లి చూపుల ఘట్టంలోనే పానకాలు నాలుగుసార్లూ ఫెయిలయ్యాడు. కారణం పెళ్ళిచూపుల్లో ''ఇతనే పెళ్ళికొడుకు'' అనగానే సిగ్గుతో మెలికలు తిరిగేవాడు. ''అమ్మాయితో మాట్లాడతారా'' అంటే మరింత సిగ్గుపడేవాడు. పెళ్లికూతుళ్ళకు చిర్రెత్తుకొచ్ఛేది. ''ఎమన్నా తేడానా'' అని ''అయినా అంత నోట్లో నాలిక లేనివాడితో అయినట్టే ఇక'' అనుకుని ''నో'' అనేశారు.

''చదువులోనేకాదు వీడు ఇక్కడా ఫెయిలవుతున్నాడే'' అని తండ్రి బాధపడ్డాడు. పానకాలు ఒక్కడే కొడుకు. అక్కో, చెల్లో ఉంటె ఆడపిల్లలంటే కొంత బెరుకు తగ్గేదేమో. అయినా తమదే తప్పు. తను, తన తండ్రి కూడా వాడు స్కూలుకెళ్లే రోజుల్లోనే ''అమ్మాయిలకేసి చూడకు అల్లరి పనులు చేసి రౌడీగా తయారుకాకు మన ఇంటి పేరే మర్యాద, దానికి నువ్వు ఎలాంటి మచ్చ తేకూడదు. తెలిసిందా'' అంటూ రోజూ నూరిపోసేవాళ్ళం. అందుకే ఇలా తయారయ్యాడేమో. అయినా షాపుకు వచ్ఛే అమ్మాయిలతో మామూలుగానే ఉంటాడు. పెళ్లి చూపులంటేనే వీడికి వింత సమస్య. ఇదేం కొత్తరకం ఫోబియానో'' అని మనసులోనే విచారించాడు పాపారావు.

కొన్నాళ్ళకు మరో సంబంధం వచ్చింది.

అమ్మాయి పేరు ''పర్వతాలు'' అని తెలియగానే ''ఛీ.. అదేం పేరు'' అన్నాడు పానకాలు.

''పెళ్లి చూపుల్లో నోరు పెగలదుగానీ ఇప్పుడు పెగిలిందేం. వాళ్ళ ఇంట్లో పుట్టిన తొలి బిడ్డ ఆడ అయినా, మగ అయినా, "పర్వతాలు'' అని పెట్టడం ఆచారంట. నీకు మేం పానకాలు అని పెట్టలేదూ. పానకాలు , పర్వతాలు రైమింగ్ కూడా కలిసిందికదరా. అయినా పేరు ఏదయితేనేం . నోర్మూసుకు రా పెళ్లి చూపులకు'' అన్నాడు తండ్రి.

''నోరు తెరవట్లేదంటూ నోర్మూసుకోమంటారేంటో చిత్రం'' తల్లి పుణ్యవతి సాగదీస్తూ అంది.

''తెలివికి సంతోషించాంలే . ఆ తెలివితేటలేవో కొడుక్కి నేర్పించు'' భార్యను కసిరాడు పాపారావు.

''వాడికేం మగమహారాజు. పెళ్లి ఇవాళ కాకపోతే రేపవుతుంది. వాడికి పెళ్ళాం ఎక్కడో పుట్టే ఉంటుంది. మీరీ వాణ్ని అంత చులకనగా చూస్తే, ఆడపిల్లవాళ్ళకు మరింత అలుసుకాదూ.'' అంది పుణ్యవతి.

''ఏమని సమర్ధించమంటావ్. మా వాడికి అమ్మాయిల్ని చూస్తే మాట పడిపోతుంది అని చెప్పనా'' మండిపడి .. ''ఏమైనా సరే పానకాలూ, ఈరోజు జరిగే పెళ్లిచూపులే నీకు ఆఖరి పెళ్లిచూపులు. నువ్వు ఇవాళ కూడా మెలికలు తిరిగి, సంబంధం చెడగొట్టుకుంటే iఇంక మరోసారి ఛస్తే నేను తండ్రిగా పెళ్లిచూపులకు నీతో రాను. నీకు లేకపోతె నాకైనా సిగ్గుండాలిగా'' అన్నాడు కోపంగా పాపారావు.

''ఆ సిగ్గుతోనేకదండీ వాడు మాట్లాడలేకపోతోంది'' మళ్ళీ సాగదీసింది పుణ్యవతి.

''ఛస్ నోర్మూయ్ . నీ తెలివి తెల్లార . ఈ సిగ్గు, ఆ సిగ్గు ఒకటె ట్లా అవుతుందే'' కసిరాడు పాపారావు.

''ఏం సిగ్గో ఏమో, అయ్యో మాడు వాసన వస్తోంది. పప్పు మాడి పోయిందో ఏమిటో'' అంటూ వంటింటి వైపు గబగబా నడిచింది.

దాంతో ఇంక తండ్రి డైరెక్టుగా మళ్ళీ తనపైనే అటాక్ చేస్తాడన్న భయంతో పానకాలు అ క్క్కడ్నుంచి క్షణంలో జారుకున్నాడు. చేసేదిలేక పాపారావు తానూ తన గదిలోకి వెళ్ళిపోయాడు.

***

పెళ్లిచూపులకు వెళ్ళబోయేముందు పాపారావు మళ్ళీ ఒకసారి పానకాలుని హెచ్చ్డరించాడు. . పొద్దున భర్త కోపావేశాలు గుర్తుకు వఛ్చిన భార్య ఈసారి మాట్లాడలేదు. పెళ్లివారింట స్వాగత మర్యాదలు మామూలుగానే గడిచాయి. ఎంతసేపూ పెద్దవాళ్ళు మాట్లాడుకోవటం, పాపారావు పుణ్యవతి అమ్మాయిని ప్రశ్నించడమేగానీ పెళ్ళికొడుకు పానకాలు పలికింది లేదు. దొంగ చూపులు మాత్రం చూస్తున్నాడు.

''అబ్బాయి ఏమైనా మాట్లాడాలంటే మాట్లాడవచ్చు'' అన్నాడు పర్వతాలు తండ్రి.

అది విని పానకాలు మెలికలు తిరిగాడు.

''అందరి మధ్య ఇబ్బంది అనుకుంటే గదిలోకి వెళ్లి మాట్లాడుకుంటామన్నా ఓకే '' అన్నాడు ఆయన

మళ్ళీ.

గది అనే మాట వినగానే పానకాలు మరింతగా మెలికలు తిరిగాడు.

అదిచూసి పర్వతాలు విసురుగా లేచి లోపలికెళ్ళిపోయింది.

పిల్ల తండ్రి కూడా మగ పెళ్లి వారి వైపు ఈసడింపుగా చూసాడు.

దాంతో పుణ్యవతి కల్పించుకుని ''మా వాడిని చాలా పద్ధతిగా పెంచాం. ఆడపిల్లలంటే చాలా గౌరవం. అందుకే సిగ్గెక్కువ, వేరుగా అనుకోకండి'' సర్దిచెప్పే ప్రయత్నం చేసింది.

''ఆడపిల్లలు, మగపిల్లలు చెట్టాపట్టాలేసుకు తిరిగే ఈరోజుల్లో మాట్లాడటానికి సిగ్గేమిటండీ మరీ చోద్యం '' అంది పర్వతాలు తల్లి.

పాపారావు అప్పటికే అవమానంతో కుతకుతలాడిపోతున్నాడు. కొడుకుకేసి చూపులతోనే నిప్పురవ్వలు కురిపించాడు. ఆ తర్వాత భార్యకేసి కోపంగా ఓ చూపు చూసి బయటకు నడిచాడు. ఆయన వెంటే పానకాలు, పుణ్యవతి. ఇంటికెళ్ళగానే పాపారావు కోపం చల్లార్చే ప్రయత్నంలో భాగంగా పుణ్యవతి పానకం తెచ్సి అందించింది. పానకం ఒక్క గుక్కలో తాగేసి, కొడుకు మీద కారాలు మిరియాలు నూరుతూ ఒకే ఒక్క మాట ''నీకీ జన్మలో నేను పెళ్లి చేయలేను'' అన్నాడు.

పానకాలు తలవంచుకుని ''పూర్వకాలంలోలాగా పెళ్లి చూపుల్లేని పెళ్లి జరిగితే ఎంత బాగుండు'' అని మనసులోనే అనుకున్నాడు.

***

ఆరోజు పర్వతాలు తన ఫ్రెండ్ పంకజాన్ని కలవాలని ఆమె చదివే కాలేజీ దగ్గర బస్టాప్ లో నిలుచుంది.

పంకజం రానే వచ్చింది.

''హాయ్ పర్వా! ఉండు . ఈ కాగితాలు జెరాక్స్ తీసుకువెళ్దాం'' అంటూ పక్క షాపులోకి నడిచింది. పర్వతాలు అనుసరించింది. '' హాయ్ పానకాలూ! ఇవి కొంచెం జెరాక్స్ కావాలి'' పంకజం షాపతనికి చెప్పింది చనువుగా. ఆ పేరు వినగానే పర్వతాలు ఉలిక్కిపడి అతడివైపు చూసి ఆశ్చర్యపోతూ ''అతనే'' అనుకుంటుంటే .. అదే సమయంలో ''ఓకే మేడం, క్లాసులయినయ్యా'' అని పంకజాన్ని

అడుగుతూ యథాలాపంగా ఆమె పక్కనున్న పర్వతాలుని చూసి నివ్వెరపోయాడు.

వాళ్ళిద్దరి వరస చూసి ''ఏంటి పానకలూ అలా చూస్తున్నావ్ ఈమె నా ఫ్రెండ్ పర్వతాలు. ఇంగ్లీష్ అంటే భయమని కాలేజీలో చేరలేదు. లెక్కల్లో మాత్రం పర్ఫెక్ట్. తన కాళ్ళ మీద తాను నిలబడాలని ఫ్యాన్సీ షాపు నడుపుతూ బ్రహ్మాండంగా రన్ చేస్తోంది తెలుసా? '' అంటూ ''నువ్వేంటే అలా తలొంచుకున్నావ్. మీకు ముందే పరిచయమా?'' అడిగింది.

అందుకు పర్వతాలు తల ఊపి ''ఆ మధ్య పెళ్లిచూపుల సంగతి చెప్పానే, ఇతనే. మొద్దబ్బాయి అనుకుని నో అన్నాను. ఇప్పుడు చూస్తే బాగానే మాట్లాడుతున్నాడు'' అంది రహస్యంగా.

''ఓ .. అయితే ఇప్పుడు ఓకేనా'' చిలిపిగా కన్ను గీటుతూ అడిగింది పంకజం.

పర్వతాలు సిగ్గుపడుతూ పంకజం చేయి గిల్లింది. అటు చూస్తే పానకాలు చాటంత ముఖంతో కనిపించాడు.

''అయితే ఇంకేం. పానకాలు పెళ్లికొడుకాయెనే, మా పర్వతాలు పెళ్లికూతురాయెనే'' అల్లరిగా పాడింది పంకజం. ఆ వెంటనే పంకజం మొబైల్ మోగడంతో, ''ఒక్క నిమిషం'' అంటూ షాపు బయటకు నడిచింది. వెంటనే ''ఏమండీ ప్లీజ్ ఒక్క మాట'' పానకాలు తనకే తెలియకుండా అనేశాడు.

పర్వతాలు ఆశ్చర్యపోయింది. ''నన్నేనా'' అతణ్ని సూటిగా చూసి అడిగింది.

''మిమ్మల్నే , మీరు నాకు బాగా నచ్చారు. పేర్లు కూడా చూడండి పానకాలు, పర్వతాలు; జెరాక్స్ షాప్, ఫ్యాన్సీ షాప్ ఎంత చక్కగా సూటయ్యాయో కదా. నేనిప్పుడు మాట్లాడేసాను కదా. నీకు నచ్చానా '' ఎక్కడినుంచి వచ్చిందో ధైర్యం సూటిగా చూస్తూ అడిగాడు.

ఆ చూపులకు పర్వతాలు సిగ్గుతో కళ్ళు వాల్చుకుని తల ఊపింది. ఆ క్షణంలో పర్వతాలు మరింత అందంగా కనిపించింది పానకాలుకు.

''అయితే మీ డేడీకి విషయం చెప్పి మాట్లాడటానికి మా ఇంటికి పంపిస్తారుగా'' అడిగాడు పానకాలు.

''అయినయ్యా కబుర్లు పద పోదాం'' అంటూ వచ్చింది పంకజం.

''ఇంతకూ మీరు జవాబివ్వలేదు'' పర్వతాలతో అన్నాడు పానకాలు.

''డేడీకి చెపుతాను'' మెల్లిగా అని కళ్ళతోనే వీడ్కోలు పలికి పంకజంతో బయటకు నడిచింది పర్వతాలు.

ఆమె వెళ్లిన వైపే చూస్తున్న పానకాలు ''ఇదంతా కలా, నిజమా, ఇంక డేడీ దగ్గర కాలరెత్తుకు తిరగొచ్చు'' అనుకుంటుంటే భుజంపై తడుతున్నట్టనిపించి ఉలిక్కిపడి చూస్తే ''డేడీ ! అరే, ఈయన ఇప్పుడెలా వచ్చాడు'' అని ఆశ్చర్యంగా చూసాడు.

''పనుండి ఇటొచ్చి వచ్చాలే . సరేకానీ ఆ అమ్మాయిలెవరూ, ఒక అమ్మాయి మొన్నటి పెళ్లికూతురల్లే ఉంది'' అనుమానంగా అడిగాడు పాపారావు.

''అవును'' అంటూ అంతా వివరించాడు పానకాలు.

''ఇప్పుడు పాపారావు కొడుకనిపించావురా'' భుజం తడుతూ గర్వపడ్డాడు తండ్రి.

అందుకు పానకాలు పరవశంగా పళ్ళికిలించాడు!!

*****


గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి




162 views5 comments

5 Comments


mramalakshmi9
Jan 02, 2021

Malladi ramalakshmi

అద్భుతమైన కథాకథనంతో

ఆసాంతం ఆసక్తికరంగా వుంది.

హాస్యన్నిజోడించిచక్కని

కథాసుమాన్ని అందించిన నా

స్నేహితురాలు అయిన శ్యామల

మేడంకి ధన్యవాదములు

Like

Nagamani Chivukula
Nagamani Chivukula
Jan 01, 2021

A funny story interlaced with delicate humour. Importance of effective communication in making positive impression especially with girls is narrated in a lighter vein. Comngratulations to the writer.

Dr.Chivukula Nagamani

Like

Deepa Jonnalagadda
Deepa Jonnalagadda
Jan 01, 2021

Hilarious!! And written in a easy-going language which has made it more enjoyable to read!

Like

హాస్యభరిత కధ. ఆసాంతం ఒక్క బిగిన చదివించే శైలి. శ్రీమతి శ్యామల గారు చక్కని కధను అందించారు. వారికి కృతజ్ఞతలు.

Like

పూర్వ కాలంలో లాగా పెళ్లి చూపులు లేకుండా పెళ్లి జరగడమంటే పానకాలు లాంటివాళ్ళు కు ఓకే, కానీ మిగతా వాళ్ళ పరిస్థితి గోవింద...

మొత్తం మీద కథ హాస్య భరితంగా సాగింది.

పానకాల పెళ్లి చూపుల సంఘటనలు నవ్వించాయి.

ప్రముఖ రచయిత్రి శ్రీమతి.జొన్నలగడ్డ శ్యామల గారికి హృదయపూర్వక అభినందనలు.

-

దొండపాటి కృష్ణ®

Like
bottom of page