పాణిగ్రహణం - 7

'Panigrahanam - 7' New Telugu Web Series
Written By Bhagavathula Bharathi
రచన: భాగవతుల భారతి
(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
జరిగిన కథ....
హంసమంజీర ఒక రచయిత్రి, కవయిత్రి. ఆమె చెల్లెలు సుగాత్రి.
హంసమంజీర పెదనాన్న పిల్లలు విరూపాక్ష, సాగర మేఖల.
సాగరమేఖల భర్తతో విడాకులు తీసుకున్న విషయం గుర్తుకొచ్చి బాధ పడతాడు విరూపాక్ష.
గతం గుర్తుకొస్తుందతనికి.
సాగరమేఖలకు వివాహం జరుగుతుంది.
కుటుంబ పోషణ లో భర్తకు చేదోడుగా ఉండటానికి తను కూడా ఉద్యోగంలో చేరుతుంది సాగరమేఖల. అభినందించక పోగా అనుమానిస్తాడు భర్త.
అవమాన భారంతో ఆత్మహత్యకు ప్రయత్నిస్తుంది సాగరమేఖల.
హాస్పిటల్ లో కోలుకుంటుంది. భర్తను, పిల్లల్ని వదిలి హైదరాబాద్ లో ఉద్యోగం చూసుకొని ఒంటరిగా ఉంటుంది ఆమె.
ఫోన్ రావడంతో గత కాలపు ఆలోచనలనుండి తేరుకుంటాడు విరూపాక్ష.
ఫోన్ లో లక్ష్మణ అనే వ్యక్తికి అతని భార్య విడాకుల నోటిస్ పంపినట్లు విని బాధ పడతాడు. బట్టలు, నగలు, కొన్ని ఆస్తి పాత్రలు తీసుకోని వెళ్లి పోయిందని లక్ష్మణ చెబుతాడు.
'పాణిగ్రహణం కన్సల్టెన్సీ' పేరుతో ఒక సంస్థను ప్రారంభిస్తాడు విరూపాక్ష.
మిత్రులను, పత్రికా విలేఖరులను ఆహ్వానించి సహకారం కోరుతాడు. భార్యాభర్తల మధ్య ఏర్పడ్డ అభిప్రాయం బేధాలను సామరస్యంగా పరిష్కరించడమే ఈ కన్సల్టెన్సీ ఉద్దేశమని చెబుతాడు.
పాణిగ్రహణం ఎపిసోడ్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి
పాణిగ్రహణం ఎపిసోడ్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి
పాణిగ్రహణం ఎపిసోడ్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి
పాణిగ్రహణం ఎపిసోడ్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి
పాణిగ్రహణం ఎపిసోడ్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి
పాణిగ్రహణం ఎపిసోడ్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇక పాణిగ్రహణం ధారావాహిక ఏడవ భాగం చదవండి.
అప్పుడే ఓ చిన్న గులాబీ మెుక్క తెచ్చి, దానికున్న మెుగ్గ, ఒక్కొక్కరేకూ విచ్చుకుంటుండగా.... అక్కడే కూర్చుని మురిసిపోయే, చిన్నారి మనసులా...
తన 'పాణిగ్రహణం కన్స్ ల్టెన్సీ' బ్యానర్ మాటిమాటికి చూసుకుని.... తన బాధ్యత ను తలుచుకుని
ఆలోచనల్లోకి వెళ్ళిపోతున్నాడు.
మెుదటి కేసు అక్కదే...
ఎలా? ఎక్కడినుంచి, మెుదలుపెట్టాలీ?
"విరూ! భోజనం కూడా చేయకుండా ఏం ఆలోచిస్తున్నావు ?"
తల్లి పిలుపుతో ఈ లోకంలోకి వచ్చి, తల విదిలించాడు.
"అమ్మా! ఆశీర్వదించమ్మా!"
"విరూ! నా ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుందిరా! అక్కకీ, నీకూ!"
"నా ప్రయత్నం అంతా అక్క జీవితం బాగుచేయాలనే! కానీ.... ఏదో ఉద్వేగం... "
"ప్రయత్నించండి... ముందుగా అక్కకు ఫోన్ చేసి, ఆమె అభిప్రాయం తెలుసుకోండీ ఆమెకు అతనితో కలవడం ఇష్టమేనా?... "
భార్యసలహాతో... ఫోన్ తీసాడు.
విరూపాక్ష భార్యకూడా అతనికి అనుకూలవతే, చేదోడు వాదోడుగా ఉండే ఇల్లాలు. ఆడపడుచు సంసారం ఇలా అవటం ఆమెనూ బాధిస్తోంది.
"వదినా! మీరు ఒక్కరే అంతదూరం లో ఎందుకు? ఇక్కడే ఏదైనా ఉద్యోగం చూసుకుని మాతోనే ఉంటే మీ తమ్ముడు, నేనూ కనిపెట్టుకుని ఉంటాం... అత్తయ్య గారికీ, మనశ్శాంతి గా ఉంటుంది. "
ఎన్నోసార్లు చెప్పిచూసింది.
కానీ సాగరమేఖల "నువ్వు చాలా మంచిదానివి. నీ మంచితనాన్ని ఆసరాగా తీసుకొని, మీ మధ్యలోకి రాలేను.
భార్యాభర్తల మధ్య మూడో మనుషులు చేసే విధ్వంసం నేను అనుభవించాను. కాబట్టి... దూరంగా ఉంటేనే బంధాలు నిలబడతాయి. తరచుగా కలుస్తూనే ఉందాం. " సున్నితంగా తిరస్కరించింది సాగరమేఖల.
విరూపాక్ష ఫోన్ అక్కకి చేసాడు.
"అక్కా! బాగున్నావా!"
"సూ..... పర్... కొత్త ప్రపంచం... కొత్త ఉద్యోగం.... "
"హంసమంజీర.... ఆమె భర్త సహాయం. ప్రస్తుతం అంతా ఓకే... " అంటూ నవ్వింది.
"అక్కా! బావ ఎక్కడున్నాడో ఫోన్ చేయకపోయావా?" సాగర మేఖల నవ్వు మాయమయింది.
"విరూ! ఇదేమిటీ కొత్తగా! తెగతెంపులు చేసుకుని వచ్చేసాక.... " అంది.
"మీఇంటిపేరు ఏమిటే "
"చామర్తి"
"చూసావా! మనింటి పేరు చెప్పలేదు నువ్వు. అత్తింటి పేరే మోస్తున్నావుగా!"
"ఐతే !"
"పిల్లలని వదలి దూరంగా ఎన్నాళ్ళుంటావ్?"
"ఏంచేస్తాంరా మరీ! ? ఇన్ని సంవత్సరాలయింది. అతను మళ్ళీ పెళ్ళి చేసుకుని ఉండడంటావా? "
"పిల్లల కోసమైనా బావ నీదగ్గరకి వస్తాడనే ఆశతోనే... నువ్వు పిల్లలను అక్కడ వదిలివచ్చేసినా, మెదలకుండా ఉన్నాను.... ఇన్నాళ్ళూ.... మరి ఇంకెన్నాళ్ళూ?.... "
అవతల సాగరమేఖల మౌనం
"ఈ మౌనం చాలు అక్కా! చాలా విషయాలు చెబుతోంది. "
//////////
రాజ్ పుత్ ఎన్ క్లేవ్....
"హలో"
"నేను విరూపాక్షని"
"ఏ పాక్షా "
"విరూపాక్ష ని మీ.... ఇవాళ రేపు ఓ ఫోన్ నెంబర్ పట్టుకోటం కష్టమేం కాదు.... కానీ చాలా కష్టపడాల్సే వచ్చింది. "
అవతల ఫోన్ కట్ చేసారు..... ఊహించినదేగా!
మళ్ళీ మళ్లీ, ఫోన్ చేసి, మెసేజ్ లు పెట్టాడు.
దాదాపు నెల తర్వాత.... ఫోన్ లిఫ్ట్ చేసి.... మాట్లాడారు.
"ఎందుకు నా వెంటపడుతున్నారు. చచ్చామో బ్రతికామో.... కనుక్కుందామనా?
"అంటే! ... బావమరిది బ్రతుకు కోరతాడటకదా మీకు విషెస్ చెబుదామని!"
"దేనికీ?"
"మీ రెండో పెళ్ళికి మేం రాలేకపోయాం. మేం ఎక్కడున్నామో తెలీక శుభలేఖ వేయలేదేమో! కదా!" గాలిలో బాణం వేసాడు.
"పెళ్ళా?! పెటాకులా? ముగ్గురు పిల్లలను నామీదే వదిలేసి మీ అక్క ఎంజాయ్ చేస్తోందిగా! ... ముగ్గురు పిల్లల తండ్రికి పిల్లనిచ్చే నికృష్టులు కూడా ఉన్నారా! ? "
'ఇదిచాలు.... నరుక్కువస్తాగా'.... మనసులో అనుకున్నాడు.
"పిల్లల మీద బెంగ పెట్టుకుంది అక్క"
"ఎందుకుట? నీ అక్క పుణ్యమాఅని … ముసలి తల్లిని, ముగ్గురు పిల్లల్ని, తట్టాబుట్టా నెత్తినేసుకుని, ఉద్యోగం మార్చుకుని, ఊరూ ఉనికీ మార్చుకుని, ఉత్తర ఢిల్లీ నుండి, దక్షిణ ఢిల్లీ కి కాందిశీకుడల్లే వచ్చిపడ్డాను. ఐనా...
నామీద ఇంకా మీ పగ చల్లారలేదా! ? మళ్లీ ఫోన్ చేసి ఎందుకు విసిగిస్తున్నారూ? భరణం కోసమా? నా దగ్గర చిల్లిగవ్వ లేదు. ఏగాణీ లేదు. మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి ". నానాతిట్లు తిట్టి ఫోన్ పెట్టేసాడు.
మనోవర్తి కోసం ఫోన్ చేసాననుకుంటున్నాడా? హతవిధీ!
మనుషుల్ని కలపటం ఇంతకష్టమా?
బాబోయ్! ముందుముందు ఇంకెన్ని పడాలో?! బావ పెళ్ళి చేసేసుకుని ఉంటే? ఇంకా కష్టంకాదూ! బాధగా నిట్టూర్చి...
రెండు రోజులాగి మళ్ళీ ఫోన్ చేసాడు.
"హల్లో బావా! ఏమిటీ సమాచారం? "
"ఏం సమాచారం! ? నా పిండాకూడు సమాచారం... పిల్లలతో వేగలేక చస్తున్నా!"
"మరి అక్కకి ఫోన్ చేస్తే.... వచ్చేదిగా "
ఇంకో బాణం వదిలాడు.
"జరిగింది చాల్లేదా? జన్మలో ఆడాళ్ళతో పెట్టుకోకూడదు. బుధ్ది తక్కువైకూడా!"
ఇంతసేపు సంభాషణ సాగిస్తున్నాడంటే ఫరవాలేదే.
"నీ మీద ప్రేమతోనేగా! అక్క మరణశయ్య పై ఉండి కూడా
మా ఆయనను ఏం చేయవద్దు. ఇందులో ఆయన తప్పేంలేదు. తప్పంతానాదే.... అని వాఙ్ఞ్మూలం ఇచ్చింది. లేదంటే! ?..... "
"ఆ! ... లేదంటే... తీసుకుపోయి జైల్లో పడేసేవారు పోలీసులు కొట్టేవాళ్ళు. మా అక్కే కాపాడింది నిన్నూఅనేగా... ఇంకా చెప్పూ వింటా.... "
"బావా! కోపం తెచ్చుకోనంటే మీకోటి చెబుతా! అప్పుడు జరిగింది.... కొంతమంది ఈర్ష్యాసూయలూ, పగా ప్రతీకార నిందలనీ వాటికి ఆధారాలు లేవని నీకూ తెలుసూ!
ఆరోజు అక్కడ ఈ అకృత్యాలకు పాల్పడినవారికీ తెలుసు. "
అవతల మౌనం మాట్లాడుతోంది.
"నిజాయితీగా, కష్టపడి పనిచేసే సబార్డినేట్ని ఏ బాసైనా, ఇష్టపడతాడు. జీతం ఎక్కువిచ్చైనా, తనవెంటతిప్పుకుని పనిచేయించుకోవాలని చూస్తాడు.
మగవాళ్ళయితే ఫరవాలేదు. ఆడవాళ్లు అనేసరికి ఇదిగో ఇలాగే నిందలూ... నిష్టూరాలు. అప్పుడు ఆసంఘటన
జరిగినప్పుడు ఉన్నవాళ్ళందరినీ నేను సాక్ష్యానికి తీసుకురాలేను సినిమాల్లోలాగా. తర్వాత అక్క పనిచేసిన ఆఫీసుకు వెళ్ళి ఎంక్వయిరీ చేసేఉంటావుగా !"
"చేసా... ఐతే మాత్రం... నేను మగాణ్ణి నాకు ఇగో ఉంటుంది. కాళ్ళు పట్టుకుని "ఏమండీ.. జరిగింది ఇదండీ! నాకూ నాపిల్లలకు అన్యాయం చేయకండీ! అని కన్నీళ్ళు పెట్టుకుంటే! నేను కాదన్నానా! ? "
హ్హు! తప్పు ఎవరిదనేది, తర్వాత ఆఫీసులో తెలుసుకునే వచ్చావన్నమాట! కానీ, నిజం వప్పుకోటానికి ఈగో అడ్డంవచ్చి, మేం ఫోన్ చేసే దాకా నువ్వు ఫోన్ చేయలేదన్నమాట. ఎంత నీచత్వం... ఏం చెయ్యాలి? నిన్నూ...
నువ్వు తప్పతాగిరావచ్చు.. 'మగాడిద'.... నువ్వూ పట్టుకోవాలిగా మా అందరి కాళ్ళూ! ..... దీనికి అక్క ఏమంటుందో?!
గాడిదకాళ్ళు పట్టుకున్నాడుగా... వసుదేవుడూ....
మనమెంత? కాపురం నిలబడాలంటే ఇప్పుడు నేను మౌనంగా ఉండాల్సిందే అని పళ్ళు పటపటా కొరకాలనిపించినా తన బాధ్యత గుర్తుకువచ్చి,
స్వగతం లో అనుకున్నాడు విరూపాక్ష.
అక్కకు ఫోన్ చేసి....
"అక్కా! అదీ విషయం... గురుడు దారిలోనే ఉన్నాడు. నువ్వు నిరపరాధివని తెలుసుకున్నాడు... ఇక కొడతావో! తిడతావో! కాళ్ళుపట్టుకుని గుంజి కింద పడేసి, బాదిబాది, వదులుతావో.... ఇది 'ముళ్ళమీద బట్ట' లాంటిది.
బర్రున లాగితే చిరుగుతుంది నిదానంగా లాక్కో! ఇదిగో ఫోన్ నెంబర్. "
నెలరోజులు గడిచినాయి.
"విరూ! నేను ఢిల్లీ వెడుతున్నాను. పిల్లలదగ్గరకి... "
"ఆల్ ద బెస్ట్ అక్కా!"
లిస్ట్ లో రెండో పేరు సమీర్.....
///////////////
(సశేషం.... )
===========================================
సశేషం
పాణిగ్రహణం ఎపిసోడ్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి
===========================================
భాగవతుల భారతి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
Twitter Link
https://twitter.com/ManaTeluguKatha/status/1624992660267372544?s=20
Podcast Link
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
https://linktr.ee/manatelugukathalu
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
https://www.facebook.com/ManaTeluguKathaluDotCom
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం : నావివరములు.... పేరు భాగవతుల భారతి Double M.A., B. Ed భర్త... శ్రీనివాస్ గారు (లెక్చరర్) వృత్తి... గృహిణి, నిత్యాగ్నిహోత్రము, వేదాధ్యయనము, స్వాధ్యాయం
ప్రవృత్తి... రచనలు.. పద్యాలూ, వ్యాసాలు, కథలు, కవితలు, వచనకవితలు.
ప్రచురణలు.... అనేక ప్రముఖ పత్రికలలో
బహుమతులు... ప్రైజ్ మనీ తో కూడిన అనేక బహుమతులు.
https://www.manatelugukathalu.com/profile/bharathi/profile
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.

