top of page

పంతులమ్మల హోటేళ్ళు

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.





Youtube Video link

'Panthulammala Hotellu' New Telugu Story


Written By M R V Sathyanarayana Murthy


రచన : M R V సత్యనారాయణ మూర్తి


మా పెనుగొండలో కాఫీ హోటళ్లకు లోటులేదు. అడుగు అడుగుకి ఓ హోటల్ ఉంది.

అయితే కొంచెం పేరున్న హోటళ్ళు కొన్నే. గోంగూర తూము సెంటర్లో ఉన్న నారాయణరావు హోటల్, మినర్వా టాకీసు దగ్గర ఉన్న ఆనందరావు హోటల్, గాంధీ బొమ్మల సెంటర్లో ఉన్న ఉడిపి అయ్యార్ హోటల్, జవ్వాదివారి మిల్లుకి వెళ్ళే దారిలో ఉన్న పాబోలు వారి హోటల్, లింగాలవీది చివర ఉన్న రామచంద్రం హోటల్, వంతెన దగ్గర ఉన్న జల్లూరి వారి హోటల్.

వీటి అన్నింటినీ ’డీకొనే‘ హోటళ్ళు రెండు ఉన్నాయి. అవే ‘పంతులమ్మల హోటళ్లు’.

ఒకటి మినర్వా టాకీసు రోడ్డు లో ఉన్న పంతులమ్మ హోటల్. టిఫిన్లు చాలా రుచిగా ఉంటాయి. పొద్దున్నే ఇడ్లీ, పెసరట్టు, ఉప్మా ఉంటాయి. ఇడ్లీ లోకి కొబ్బరి పచ్చడి, అల్లం పచ్చడి ఉంటాయి.స్పెషల్ ఇడ్లీ అంటే, వీటితోపాటు నెయ్యీ, కారప్పొడి ఉంటాయి. రేటు కొంచెం ఎక్కువ.

బజారులోని వర్తకులు పంతులమ్మ గారి హోటల్ కి వచ్చి స్పెషల్ ఇడ్లీ ఖచ్చితంగా తిని వెళ్తారు. పంతులమ్మగారు సన్నగా, పొడవుగా ఉంటారు. అందరూ ’మామ్మగారూ’ అని పిలుస్తారు.

ప్రతివారినీ ఆప్యాయంగా పలకరిస్తారు.

“ఏరా, వెంకట్రాముడూ, అమ్మాయి పెళ్లి చేసావుట, ఏ ఊరు ఇచ్చావు?అబ్బాయి ఏం చేస్తాడు?”

ఇడ్లీ లోకి మరోసారి అల్లం పచ్చడి వేస్తూ నవ్వుతూ అడిగిన మామ్మగారిని చూడగానే, సిగ్గుపడ్డాడు వెంకట్రాముడు, మామ్మగారిని పెళ్ళికి పిలవలేదన్న విషయం గుర్తుకు వచ్చి.

తర్వాత తేరుకుని “ఇరగవరం ఇచ్చానండి, గంగాధరం నాయుడు గారి అబ్బాయికి. ఒక్కడే కొడుకండి. పదెకరాల పొలం, ఎకరం కొబ్బరి తోటా ఉన్నాయండి. అంతా హడావిడి అయిపోయిందండి” అన్నాడు తనూ చిన్నగా నవ్వుతూ.

అందుకే మిమ్మల్ని పిలవలేక పోయానన్న భావం వ్యక్తం చేసాడు వెంకట్రాముడు.

“చాలా బాగుందిరా అబ్బాయి. చాలా దగ్గరే ఇచ్చావన్న మాట. పిల్లని ఎప్పుడు చూడాలంటే అప్పడు పావుగంటలో సైకిల్ మీద వెళ్లి చూసి రావచ్చు. ఈసారి అమ్మాయి దగ్గరకు వెళ్ళేటప్పుడు నాకు చెప్పు.

రెండు కొబ్బరికాయలు ఇస్తాను. ఇరగవరం పాలేశ్వర స్వామి గుడిలో కొట్టి వద్దువుగాని” అన్నారు మామ్మగారు.

“అలాగేనండి. వెళ్ళేటప్పుడు మీకు కనిపించి వెళ్తాను” అన్నాడు వెంకట్రాముడు.

“ఏరా సూరిపండూ, మీ రెండో అమ్మాయికి పురుడు వచ్చిందటగా, మనవడా? మనవరాలా?”

పెసరట్టు, ఉప్మా టేబుల్ మీద పెట్టి అడిగారు మామ్మగారు.

“మనవరాలు పుట్టిందండి” కొంచెం నీరసంగా చెప్పాడు సూరిపండు.

“ఓర్నీ చాదస్తం కూలా. ఆడపిల్ల పుడితే అలా నీరసంగా ఉండాలని రూల్ ఏమైనా ఉందేమిటిరా?

ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి రా. ఏం, మీ అల్లుడు ఏమైనా గునుస్తున్నాడా,ఆడపిల్ల పుట్టిందని? వాడిని నా దగ్గరకు ఒకసారి తీసుకురా. నేను చెబుతాను.బెంగపెట్టుకోకు. టిఫిన్ తిని వెళ్ళేటప్పుడు కనిపించు.

పాత ఆవకాయ, కారప్పొడి ఇస్తాను.పట్టుకెళ్ళు “అన్నారు ఆప్యాయంగా మామ్మగారు. ఆవిడ ఆదరణకి కళ్ళనీళ్ళు తిరిగాయి సూరిపండుకి.

“అలాగే మామ్మగారూ”అన్నాడు కళ్ళు తుడుచుకుంటూ.

ఉదయం పది గంటలకు గారెలు, అరటికాయ బజ్జీలు ఉంటాయి పంతులమ్మగారి హోటల్లో. వేడి వేడి అరటికాయ బజ్జీ, చెట్నీ లో నంచుకుని తింటూ ఉంటే మైమరచిపోనీ వారు ఉండరు.

సాంబారులో ముంచిన గారె తింటూ ఉంటే, మద్రాస్ వుడ్లాండ్స్ హోటల్ గుర్తుకువస్తుంది. మామ్మగారి పూర్వీకులు మద్రాస్ నుంచి ఈ ప్రాంతంవచ్చి స్థిరపడ్డారని పెద్దవాళ్ళు చెబుతారు. అందుకే మామ్మగారి హోటల్లోని టిఫిన్ లకు ఆ రుచి వచ్చి ఉంటుంది.

మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి భోజనం ఉంటుంది మామ్మగారి హోటల్ లో.

మా పెనుగొండ పెద్ద వ్యాపారకేంద్రం. రేకు పెట్టెలు, బియ్యం డ్రమ్ములు, మిల్లు ఎలివేటర్ బకెట్లు, హోల్ సేల్ గా కొని పట్టుకువెళ్ళేవారు చాలామంది వస్తారు. అలాగే నిల్లా వారి ఫౌండ్రీ లో పనిముట్లు కోసం దూర ప్రాంతాల నుండి వస్తారు. అదిగాక పెనుగొండలో పది ధాన్యం మిల్లులు ఉన్నాయి. ఈ మిల్లులకు ధాన్యం పంపేవారు, బియ్యం కొనుక్కుని లారీల్లో వేసుకుని పట్టుకువెళ్ళేవారు, మెయిన్ బజార్ వర్తకుల నుండి అపరాలు కొని పట్టుకు వెళ్ళేవారు… ఇలా చాలా మంది అనేక పనుల మీద పెనుగొండ వచ్చి,వెళ్తూ ఉంటారు.

వాళ్ళు అందరికీ కల్పవృక్షం మామ్మగారి భోజన హోటలే.

పప్పు,రెండుకూరలు,సాంబారు,ఆవకాయ,గోంగూర పచ్చడి, పెరుగుతో మామ్మగారు చక్కగా భోజనం పెడతారు. భోజనం చేసేవాళ్ళకు పదార్ధాలను, ఒకటికి రెండు సార్లు అడిగి మరీ వడ్డిస్తారు మామ్మగారు, ఆమె కుటుంబ సభ్యులు. భోజనం చేసే వారికి, తమకు తెలిసున్న వారి ఇంట్లో భోజనం చేస్తున్నామన్న భావనే కానీ హోటల్లో తింటున్నామన్న భావన కలగదు.

పదార్ధాలు రుచిగా ఉండడమే కాకుండా, ఆత్మీయతా భావం కూడా పనసపొట్టు కూరలో పోపులా కమ్మగా గుబాళిస్తూ ఉంటుంది మామ్మగారి హోటల్లో. పనసపొట్టు కూర తినడానికి ఊళ్ళో భోజనప్రియులు కూడా మామ్మగారి హోటల్ కి రావడం విశేషం. ఆవ పోపుపెట్టి, శనగపప్పు పచ్చిమిర్చి లతో మెరిసిపోతూ విస్తళ్ళలో పనసపొట్టు కూర కనిపించగానే నూరూరడం ఖాయం. లింగాలవీధి కోమట్ల కృష్ణ , పనసపొట్టు కూర వడ్డించగానే, ఉట్టి కూర తినేసేవాడు.

“అంత ఆత్రం ఎందుకురా అబ్బాయ్, నిదానంగా అన్నంలో కలుపుకుతిను” అని మామ్మగారు అంటే,

“పులిహారలా, పనసపొట్టు కూర కమ్మగా ఉంది మామ్మగారూ. ఈ కూర తినడం కోసమే నేను మీ హోటల్ కి భోజనానికి వస్తున్నాను” అనే వాడు కృష్ణ, మొహం చాటంతచేసుకుని.

అతని మాటలకి మామ్మగారు ముసి ముసిగా నవ్వుతూ మరో రెండు గరిటెల కూర వేసి ముందుకు వెళ్ళేవారు.

బుధవారం పశువుల సంత కూడా వుంటుంది. పొరుగూరి నుంచి ఆవుల్ని, గేదెల్ని కొనుక్కోవడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి చాలా మంది వస్తారు. పశువుల్ని కొనుక్కున్నాకా, మామ్మగారి హోటల్ దగ్గరకు వచ్చి పాలుతీసి ఆవిడికి ఇస్తారు. మామ్మగారు వాళ్లకి కడుపునిండా భోజనం పెట్టేవారు. ఎవరు వచ్చినా శుభ్రమైన అరిటాకులోనే భోజనం పెట్టేవారు. ఏనాడూ కంచాలు వాడేవారు కాదు.

ఎవరూ వంకలు పెట్టడానికి వీలులేని విధంగా కమ్మగా, రుచిగా భోజనం పెట్టడం మామ్మగారి ప్రత్యేకత. ఎవైరైనా వృద్ధులు, యాచకులు వస్తే వారికి సాంబారు అన్నం, పెరుగు అన్నం పెట్టేవారు మామ్మగారు. అలాగే ఊళ్ళో జరిగీ ధర్మకార్యాలకు తన వంతు సాయం చేసే గోప్పమనసున్న మనిషి మామ్మగారు.

*****

ఇంక రెండో పంతులమ్మగారి హోటల్. విజ్జేశ్వరం – నర్సాపురం కాలవగట్టున సుబ్బారాయుడి గుడి సమీపంలోనే ఉంది. పెద్ద డాబా. విశాలమైన రెండు అరుగులు. మెట్లు ఎక్కి వెళ్ళగానే విశాలమైన హాలు ఉంటుంది. హాలుకి వెనకాల అటూ,ఇటూ నాలుగు గదులు. వాటి వెనుక ఉన్న వసారాలో పెద్ద ఊకపోయ్యి.

ఎక్కడా గలీజుగా లేకుండా చాలా పరిశుభ్రంగా ఉంటాయి గదులు. హాలులో నాలుగు టేబుల్స్, వాటి వెనుక కుర్చీలు. జనం ఎక్కువగా వస్తే అరుగులమీద కూడా కూర్చుని టిఫిన్లు తిని వెళ్తారు.

ఈ పంతులమ్మ గారి హోటల్ లో ఉదయం ఇడ్లీ,ఉప్మా,పెసరట్టు ఉంటాయి.స్పెషల్ ఇడ్లీ ఉండదు. అందరికీ ఒకే రకమైన టిఫిన్లు. ఒక కారం చెట్నీ,సెనగపిండి చెట్నీ ఉంటాయి. ప్లేటులో కుట్టుడాకు వేసి టిఫిన్లు పెడతారు. సాంబారు ఇడ్లీకి మాత్రం అల్యూమినియం ప్లేటులో సాంబారు పోసి, చెంచా ఇస్తారు.

పది గంటలు దాటాకా గారి, అరటికాయ బజ్జీ ఉంటాయి. టిఫిన్లు సప్లై అంతా గంగమ్మ చూసుకుంటుంది.

కాష్ బాక్స్ దగ్గర మాత్రం పంతులమ్మ గారు కూర్చుని డబ్బులు తీసుకుంటారు. ఎంగిలి ప్లేట్లు తీయడానికి ఒక పదేళ్ళ పిల్ల ఉంటుంది. ఎవరికైనా రెండో సారి చెట్నీ కావాల్సివస్తే పంతులమ్మ గారు ‘గంగమ్మా’ అని పిలుస్తుంది. గంగమ్మ వచ్చి వాళ్లకు కావాల్సినవి వడ్డించి వెళ్తుంది.

ఆవిడికి ఒకోసారి బుద్ధిపుడితే తనే వెళ్లి వాళ్లకు రెండోసారి చెట్నీ, లేదా సాంబారు వడ్డించి వస్తుంది.

మినర్వా టాకీసు రోడ్డులోని పంతులమ్మ గారి హోటల్ లో ఎప్పుడూ సందడిగా, కబుర్లతో ఉంటే, ఈ హోటల్ లో మాత్రం మిలటరీ డిసిప్లిన్ లా నిశ్సబ్దంగా టిఫిన్లు తింటారు. టిఫిన్లు రుచిగా ఉంటాయి. రేట్లు కూడా అందుబాటులో ఉంటాయి. హోటల్ ఎదురుగా ఉన్న కాలవరేవులో స్నానాలు చేసిన షావుకార్లు ఇంటికి వెళ్ళేటప్పుడు టిఫిన్లు పార్సెల్ చేయించి పట్టుకుని వెళ్తారు.

నిల్లా వారి రెండు ఫౌండ్రీల లోని కార్మికులు, సుబ్బారాయుడు గుడివెనక ఉన్న కాలనీ జనం ఈ పంతులమ్మ గారి హోటల్ కే వస్తారు.

పంతులమ్మ గారి హోటల్లో కాఫీ మాత్రం అద్భుతం గా ఉంటుంది. చిన్న ఇత్తడి గ్లాసులో కాఫీ పోసి, గ్లాసుతో పాటు ఒక ఇత్తడి కప్పు కూడా ఇస్తుంది గంగమ్మ. పొగలు కక్కుతూ, కమ్మని వాసనతో ఉన్న ఆ కాఫీ చూడగానే, కాఫీ అలవాటు లేని వారికి కూడా కాఫీ తాగాలనిపిస్తుంది. ఆ గ్లాసులోని కాఫీ ఇత్తడి కప్పులో పోసుకుని చల్లారబెట్టుకుంటూ తాగుతుంటే ఓహ్ ..చాలా మజాగా ఉంటుంది.

సాయంత్రం నాలుగు గంటలు దాటగానే హోటల్ కట్టేస్తారు. అప్పటికీ మిగిలిఉన్న టిఫిన్లు ఉంటె కొన్ని గంగమ్మకి, మరికొన్ని సుబ్బారాయుడు గుడి మండపంలో ఉండే సాధువులకి ఇస్తారు పంతులమ్మ గారు.

పంతులమ్మగారిది నిండైన విగ్రహం. ఐదు అడుగుల నాలుగు అంగుళాల ఎత్తుతో, మంచి పుష్టిగా జబర్దస్తుగా బంగారు రంగు వంటిఛాయతో మెరిసిపోతూ ఉంటుంది. ఆవిడ చేతులకు వేసుకున్న బంగారు గాజులు ఆమె వంటిరంగులో కలిసిపోయి ఉంటాయి. కాషాయం రంగు మెత్తటి నూలుచీర, అదే రంగు జాకెట్టు వేసుకుంటారు. మెడలో రెండుపేటల బంగారు గొలుసు, కళ్ళకు బంగారు రంగు ఫ్రేము ఉన్న కళ్ళజోడు ఆమెకి మరింత అందాన్నిస్తూ ఆమె పట్ల ఒక గౌరవభావం కలిగిస్తాయి.

ఆమె కళ్ళు తిప్పి చూస్తూ ఉంటే, చిన్న సరస్సులో ఈదులాడే చేప పిల్లలు గుర్తుకువస్తాయి. టిఫిన్లు పార్సెల్ కోసం వచ్చే చిన్న పిల్లలు ఆమె కేసి రెప్పవేయకుండా చూస్తూఉండిపోతారు.

లింగాలవీది సత్తిపండు స్నేహితుడు ఉద్దగిరి బాబ్జీ ఆలమూరు నుంచి వచ్చాడు ఓ ఆదివారంనాడు. బాబ్జీని కన్యకాపరమేశ్వరి గుడికి తీసుకు వెళ్లి, ఆ తర్వాత పంతులమ్మ హోటల్ కి

తీసుకువచ్చాడు సత్తిపండు. ఇద్దరూ అరటికాయ బజ్జీలు తిని, కాఫీ తాగి బయటకువచ్చారు. బాబ్జీ హోటల్ లో ఉన్నంత సేపూ పంతులమ్మ గారినే పరిశీలనగా చూడటం గమనించాడు సత్తిపండు.

“ఆవిడ ఎవర్రా బాబూ, టిబెట్ దలైలామా చెల్లెలిలా మెరిసిపోతోంది? అక్కడనుంచి వచ్చారా ఏమిటి?” కుతూహలంగా అడిగాడు బాబ్జీ.

“అబ్బే, వాళ్ళది విజయవాడ పక్కన ఎదో ఊరు.ఇక్కడి వాళ్ళే” పెద్దగా నవ్వుతూ అన్నాడు సత్తిపండు.

“ఒరేయ్ సత్తిపండూ, వీళ్ళ హోటల్ లో కాఫీ మాత్రం సూపర్ రా బాబూ” అని మెచ్చుకుని సైకిల్ ఎక్కి వెళ్ళిపోయాడు బాబ్జీ. అయితే వీళ్ళు ఇద్దరూ మాట్లాడుకున్నప్పుడు రెండు కళ్ళూ, రెండు చెవులూ వీరినే గమనించాయి. అది సత్తిపండు చూడలేదు.

బాబ్జీ పంతులమ్మగారిని అలా అన్నప్పటి నుంచీ సత్తిపండుకి కూడా అనుమానం ప్రారంభం అయ్యింది. నిజంగా వీళ్ళది విజయవాడేనా?లేక టిబెట్టా?అని మల్లగుల్లాలు పడసాగాడు. చివరకు ఒక రోజున వాళ్ళ అమ్మని అడిగాడు సత్తిపండు”అమ్మా, పంతులమ్మ గారిది విజయవాడేనా? లేక వేరే ఊరా?”అని.

కత్తిపీట దగ్గర వంకాయలు తరుగుతున్న ఆవిడ ఒక్కసారి నిర్ఘాంతపోయారు. వెంటనే “పెద్దవాళ్ళ విషయాలు నీకెందుకురా? జాగ్రత్తగా చదువుకుని ఆ ఎస్.ఎస్ .ఎల్.సి. గట్టేక్కించు”అని గదమాయించారు. సత్తిపండు

తలవంచుకుని బయటకు వచ్చేసాడు. కానీ వాడి సందేహం తీరలేదు. ఈ సంగతి జరిగిన వారం రోజులకు సోమవారం సాయంత్రం లింగాలవీధి రెడ్డినాయుడు జనార్ధన స్వామి గుడి కళ్యాణమండపం దగ్గర కొలువు తీరాడు. కాపవరపు సుధాకర్, చెట్లపల్లి కడియం పంతులు {ఇతని పేరు పంతులే. కానీ ఎప్పుడూ కుడిచేతికి వెండి కడియం వేసుకుంటాడు కాబట్టి అందరూ ‘కడియం పంతులు’అని పిలుస్తారు}తమనంపూడి కృష్ణారెడ్డి, రాయపూడి సత్యనారాయణ, కోమట్ల సుబ్రహ్మణ్యం అందరూ చెవులు నిక్కబెట్టి మరీ వింటున్నారు.

నాయుడు చేతిలో సిగరెట్ ఎర్రగా కాలుతోంది.మరోసారి గట్టిగా దమ్ము లాగి చెప్పడం ప్రారంభించాడు నాయుడు. సరిగ్గా అప్పుడే వచ్చి గుంపులో చేరాడు సత్తిపండు.

“మన కాలవగట్టు పంతులమ్మ గారి స్వంత ఊరు ఎక్కడో తెలుసా?”గంభీరంగా అడిగాడు నాయుడు.

“విజయవాడ దగ్గర ఎదో పల్లెటూరు కొండపల్లో, బంటుమిల్లో..అని అంటారు” చాలా తాపీగా చెప్పాడు

కృష్ణారెడ్డి. ‘కాదు’ అని అడ్డంగా బుర్ర ఊపి మరోసారి గట్టిగా సిగరెట్ దమ్ము లాగి పొగ

వదిలాడు నాయుడు. పొగ మొహానికి తగుల్తున్నా ఎవరూ పట్టించుకోలేదు. పంతులమ్మగారి ఊరు తెలుసుకోవాలన్న ఆసక్తిలో ఉన్నారు అందరూ.

“మరి ఏ ఊరు?”ఒకేసారి అడిగారు సుబ్రహ్మణ్యం, సత్తిపండు ఆత్రుతగా. సిగరెట్ చివర వేళ్ళకు చురుక్కుమని తగలడంతో సిగరెట్ పీక గోడ అవతలకు పారేసాడు నాయుడు.

జేబులోంచి తెల్ల రుమాలు తీసి ఒకసారి మొహం తుడుచుకున్నాడు. మొహానికి చెమటపట్టలేదు. వాతావరణం చల్లగా ఉంది. అంత క్రితమే ఆచారిగారు గుడి తలుపులు తీసి లైట్ లు వేసి బజార్ రామాలయంలో దీపాలు పెట్టడానికి వెళ్ళారు. నాయుడు జేబురుమాలు తీయగానే దానికి రాసిన పిఠాపురం సెంట్ ఒక్కసారి గుప్పుమంది. ఆ విషయం అందరకీ తెలియాలనే నాయుడు అలాచేసాడు.

పంచాయత్ ఎన్నికల్లో ఆఖరి బాక్స్ తెరిచి ఓట్లు లెక్కపెట్టేటప్పుడు అభ్యర్ధులు ఎంత టెన్షన్ గా ఉంటారో, నాయుడు చుట్టూ కూర్చున్న కుర్రకారు కూడా అంత టెన్షన్ గాను ఉన్నారు. నాయుడు అందరి మొహాలకేసి మరోసారి చూసి చేతివేళ్లు విరుచుకున్నాడు.

కడియం పంతులుకి నాయుడు వ్యవహారం చాలా చిరాగ్గా ఉంది. నాయుడు పీక

పిసికేయాలన్న కోపం కూడా వచ్చింది. అయినా తమాయించుకున్నాడు.

నాయుడు అందరికేసి మరోసారి చూసి చిన్నగా నవ్వి “పంతులమ్మ గారి ఊరు టిబెట్” అన్నాడు.

ఆ మాట వినగానే అందరూ ‘ఆ..’అని నోళ్ళు వెళ్ళబెట్టి నాయుడుకేసి ఆశ్చర్యంగా చూసారు.

“చైనా పక్కన ఉన్న టిబెట్టా?”అడిగాడు రాయపూడి సత్యనారాయణ. ‘అవును’ అని సమాధానం చెప్పి జేబురుమాలు జేబులో పెట్టుకున్నాడు నాయుడు.

“నీకెలా తెలుసు?” అడిగాడు సత్తిపండు. అతనికి ఆలమూరు బాబ్జి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి.

“ప్రతీ ఆదివారం పంతులమ్మగారి హోటల్ లో రాత్రివేళ భజనలు జరుగుతాయిగా” సత్తిపండుకేసి తిరిగి అన్నాడు నాయుడు.

“అవును. హోటల్ లో పనిచేసే గంగమ్మ, రైస్ మిల్లులో పనిచేసే అప్పాయమ్మ, గున్నయ్య మాస్టారి బడి దగ్గర ఉండే ముత్యాలమ్మ, సుబ్బారాయుడు గుడి వెనక ఉండే ఆడవాళ్ళు వెళ్తూ ఉంటారు. పంతులమ్మగారు కృష్ణుడు మీద పాటలు బాగా పాడతారని మా అమ్మా చెప్పింది”అన్నాడు సత్తిపండు.

“కానీ నిన్న రాత్రి ఓ విచిత్రం జరిగింది. మినర్వా టాకీసులో నాగేశ్వరరావు ‘ఇద్దరు మిత్రులు’ సినిమా మూడవసారి చూడటానికి భోజనం చేసి తొమ్మిదింటికి బయల్దేరాను. హోటల్ ముందునుంచి వెళ్తుంటే గజ్జెల చప్పుడు వినిపించింది. భజన తాళాలు కదా వినిపించాలి, గజ్జెల చప్పుడు వస్తోందేమిటా? అని పిల్లిలా అడుగులు వేసుకుంటూ హోటల్ ముందున్న అరుగు ఎక్కి కిటికీ లోంచి చూసాను.

నలుగురు ఆడపిల్లలు డాన్స్ చేస్తున్నారు . బంగారు బొమ్మల్లా ఉన్నారు.పంతులమ్మగారి మనవలా? అంటే నమ్మేలా ఉన్నారు. పరికిణీ,జాకెట్టు వేసుకున్నారు.చేతిలో రంగు రంగుల విసనకర్ర చిత్రంగా తిప్పుతూ డాన్స్ చేస్తున్నారు. నాకు మతిపోయింది. కాళ్ళు లాగుతున్నా గంటసేపు అలాగే నిలబడి వాళ్ళ డాన్స్ చూసాను.

తర్వాత గంగమ్మ అందరికీ వేడి వేడి టీలు ఇచ్చింది.నేను అరుగు దిగి రావిచెట్టు దగ్గర నక్కి కూర్చున్నాను. టీలు తాగి మిగతా ఆడవాళ్ళు వెళ్లిపోయారు కానీ ఆ చిన్నపిల్లలు బయటకు రాలేదు. చాలాసేపు ఉండి ఇంటికి వచ్చేసాను.

పొద్దున్నే తణుకు వెళ్లాలని బస్సు స్టాండ్ కి వెళ్లాను. అక్కడ గంగమ్మ ఆ పిల్లలతో ఉంది. నాగార్జునసాగర్ బస్సు రాగానే వాళ్ళని బస్సు ఎక్కించింది గంగమ్మ. నేను గబా గబా బస్సు ఎక్కేసాను. దారిలో వాళ్ళతో ఇంగ్లీష్ లో మాట్లాడి వాళ్ళ వివరాలు తెలుసుకున్నాను.

వాళ్ళది టిబెట్ అని గన్నవరంలో దిగి విమానం ఎక్కి వాళ్ళ ఊరు వెళ్తామని చెప్పారు. పంతులమ్మ గారు టిబెట్ దలై లామా చెల్లెలు అని కూడా వాళ్ళు నాకు చెప్పారు”అని ఒక్క క్షణం ఆగాడు నాయుడు.

అతని మాటలకి అందరం అవాక్కు అయ్యాం. అతనికేసి ఆశ్చర్యంగా,అయోమయంగా చూస్తూ ఉండిపోయాం. రెండు క్షణాలు గడిచాకా నాయుడు చేయిచాపి ‘ఈ విషయం ఎక్కడా చెప్పమని’ మా దగ్గర ప్రమాణం చేయించుకున్నాడు. తర్వాత నాయుడు వెళ్ళిపోయాడు. మేము బిక్కు బిక్కు మంటూ ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్లాం.

ఆరు రోజులు గడిచాయి. ఆదివారం వచ్చింది. మనం కూడా టిబెట్ పిల్లల్ని చూడాలని నిశ్చయించుకున్నారు సత్తిపండు, కృష్ణారెడ్డి,కడియం పంతులు. రాత్రి ఎనిమిది గంటలకే రావిచెట్టు మొదట్లో నక్కి కూర్చున్నారు. నెమ్మదిగా భజన వినిపిస్తోంది హోటల్ లోంచి. కాసేపటికి గజ్జెల చప్పుడు వినిపించింది.

అంతే...ముగ్గురూ చప్పుడుచేయకుండా హోటల్ అరుగు మీదకు చేరారు. కిటికీకి కింద నాలుగు, పైన నాలుగు చెక్క తలుపులు ఉన్నాయి. కింద వరస తలుపులు మూసి, పై వరస తలుపులు తెరిచి ఉన్నాయి. కడియం పంతులు బాగా పొడుగు.కాలి మునివేళ్ళమీద నిలబడితే అతనికి లోపల జనం కనిపిస్తున్నారు.

కృష్ణారెడ్డి ని ఒంగోమని,అతని వీపు ఎక్కి సత్తిపండు లోపలకు చూసాడు. పంతులమ్మగారు కృష్ణుడు మీద

పాట పాడుతూ కంజిర వాయిస్తున్నారు. గంగమ్మ కుడిచేతికి గజ్జెలు కట్టుకుని రెండు చేతులతో డోలక్ వాయిస్తోంది.మిగతా ఆడవాళ్ళు భజన తాళాలు వాయిస్తూ పాడుతున్నారు. రెండు పాటలు అయ్యాయి. అమ్మాయిలు కనిపించ లేదు. కృష్ణారెడ్డి కి వీపు మండిపోతోంది.

’సత్తిపండూ,దిగరా..నేను చూస్తాను’అంటున్నాడు. ఈసారి పాటకు లోపల్నించి పిల్లలు వచ్చి డాన్స్ చేస్తారని’ఉండు..ఉండు ‘అంటున్నాడు నెమ్మదిగా. వీళ్ళ గుసగుసలు, తలకాయలు కనిపించాయి గంగమ్మకి.

“అరే..ఎవర్రా అక్కడ?”అంటూ డోలక్ పక్కనపెట్టి లేచింది గంగమ్మ. ఆమె అరుపుకి కృష్ణారెడ్డి లేచాడు, వెంటనే సత్తిపండు కింద పడ్డాడు. కడియం పంతులు రెండు అంగలలో అరుగు దిగి లింగాలవీది కేసి పరుగు లంఘించాడు. అతని వెనుకే కృష్ణారెడ్డి, సత్తిపండు పరిగెత్తారు.గంగమ్మ తలుపు తీసి వచ్చేసరికి అరుగు మీద ఎవరూ లేరు.

సోమవారం సాయంత్రం మిత్రబృందం జనార్ధనస్వామి గుడి మండపంలో కలుసుకున్నారు. సత్తిపండు, కృష్ణారెడ్డి కుంటు కుంటూ వచ్చారు. ఇద్దరికీ రాత్రి మోకాలు చిప్పలు కొట్టుకుపోయి గాయాలు అయ్యాయి.

రెడ్డి నాయుడు తమ అందర్నీ ‘ఫూల్స్’ చేసాడని, అతనికి ఏదోరకంగా శాస్తిచేసి పగ తీర్చుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసి, తమ కోరిక నేరవేర్చమని గుడిలోకి వెళ్లి జనార్ధన స్వామి ని వేడుకున్నారు.


***శుభం***


M R V సత్యనారాయణ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



రచయిత పరిచయం : సత్యనారాయణ మూర్తి M R V


ఎమ్. ఆర్. వి. సత్యనారాయణ మూర్తి. పెనుగొండ. పశ్చిమ గోదావరి జిల్లా. కవి, రచయిత, వ్యాఖ్యాత, రేడియో ఆర్టిస్టు. కొన్ని కథల పుస్తకాలు, కవితల పుస్తకాలు ప్రచురితం అయ్యాయి. కొన్ని కథలకు బహుమతులు కూడా వచ్చాయి. రేడియోలో 25 కథలు ప్రసార‌మయ్యాయి. 20 రేడియో నాటికలకు గాత్ర ధారణ చేసారు. కవితలు, కథలు కన్నడ భాషలోకి అనువాదం అయ్యాయి.


52 views0 comments
bottom of page