కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link
'Papa Prakshalanamu' written by Ayyala Somayajula Subrahmanyam
రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము
జీవితంలో ఎదురు దెబ్బలు తిన్న స్త్రీ ఆమె.
ప్రేమించిన మనిషికి దూరం అయింది.
అనుకోకుండా ఒక వివాహితుడికి దగ్గర అయింది.
తాను చేస్తున్నది తప్పని ఆమెకు అనిపించిందా...అనిపిస్తే ఏం చేసింది?
ప్రముఖ రచయిత అయ్యల సోమయాజులు సుబ్రహ్మణ్యం గారి ఆసక్తికరమైన ఈ కథలో తెలుస్తుంది.
వికాస్ నన్ను రమ్మంటే వారం సెలవు పెట్టి ముంబాయి కి వచ్చాను ఫ్లైట్‌లో. వికాస్
వుంటున్న ఫ్లాట్ చాలా హై సొసైటీలో కంఫర్టబుల్‌గా, అధునాతన ఫర్నీచర్‌తో
వుంటుంది. ఇక్కడికి వస్తే ఎడారిదాటి ఒయాసిస్సు కి చేరుకున్నట్టు సుఖంగా
హాయిగా వుంటుంది. మామూలు మనుషులు, మామూలు ప్రపంచం మాయమై
పోతారు. మాయాలోకం, ఒక అందాలదీవిలో ఆనందంలో తేలుతున్న అనుభూతి
మనసుని మత్తుగా ఆవరిస్తుంది.
" ముఝె మస్త్ మవోల్‌మే జీనేదో.............. "
సాయంత్రానికి వస్తానని చెప్పి వెళ్ళాడు వికాస్. వికాస్ కూడా ఆఫీస్ కు సెలవు
పెట్టాడు. మూడురోజులు హాయిగా గడిచిపోయాయి. ఇవాళ ఆఫీస్‌కు అర్జంట్ పని
వుందని ఫోన్ వస్తే తప్పనిసరిగా వెళ్ళాడు. సెలవు పెట్టినా ఈ ఆఫీస్ పని ఏమిటో?
మారుమూల స్వర్గంలో వున్నా అంతరాయాలు తప్పటము లేదు. బాధ్యతలు బరువు
కాదుకానీ, సెలవులకు ఆటంకం కలిగించకూడదు. సెలవులు సంతోషంగా గడపా
లంటే మంచి ఆహారము, కొత్త కొత్త వస్తువులు కొనుక్కోవడం, మంచి కంపెనీ వుండాలి.
వికాస్ కంటే మంచి కంపెనీ ఎవరూ?
ట్రెండీగా డ్రెస్ చేసుకుంటాడు. విట్టీగా మాట్లాడతాడు. పంక్చుయాలిటీ పాటిస్తాడు.
కీప్స్ హిజ్ ప్రామిసెస్.... మనస్సు విప్పుతాడు.... స్మార్ట్‌గై!
అందుకే మూడురోజులూ హాపీగా గడిచిపోయాయి. క్షణాలు గంటలుగా! గంటలు
క్షణాలుగా!
తామరాకు మీద మంచుబిందువులా , పూలతోటలో సీతాకోకచిలుకలాగ
ఈ పగలంతా నాతో నేను... నా కోసం నేను గడపాలి. మై సెల్ఫ్! బాత్ టబ్‌లో స్నానం
గంట పట్టింది. ఫెర్‌ఫ్యూమ్ పరిమళం గాలిలో తేలిపోతూ మంచుబిందువుల్లో తడి
సిన గులాబీలా అనుభూతి. మనసులో సంగీతం..... గులామాలి జోలపాట !
కాజువల్ వేర్.. జీన్స్ కుర్తా వేసుకున్నాను! పంచ్ తాగుతుంటే ఆరోగ్యంగా వున్న
అనుభూతి, దేహమంతటా కొత్త శక్తి ఆవిరించిన ఉత్సాహం. ఇప్పుడు ఏం చెయ్యటం?
గుర్తుకు వచ్చింది. ఫోటోలు ఇస్తానన్నాడు.
తాళం చెవి తీసుకుని ఫ్లాట్ డోర్ లాక్‌చేసి లిఫ్ట్‌లో క్రిందికి వెళ్ళాను. వీదిచివరి దాకా
నడిచి మెయిన్‌రోడ్ మీద వున్న ఫోటోకార్నర్ కి వెళ్ళాను. ఫోటోలు తీసుకుని బిల్ పే
చేసి పక్కనే ఉన్న మెడికల్‌షాప్‌కి వెళ్ళాను. ఇవియాన్ క్యాప్యూల్స్ , లిప్‌గ్లాస్ కొన్నాను.
జనం బాగానే ఉన్నారు.
ఒక అమ్మాయి… జడ, చీరలో తెలుగుదానిలాగా ఉంది. ఒక కార్డ్ చూపించి ఎవరినో
ఎడ్రస్ అడుగుతోంది… వచ్చీరాని హిందీలో. ఒక పిల్ల కూడా ఉంది. ముద్దు వస్తోంది.
ముంబాయిలో ఉంటూ కూడా ఇంకా ఆధునికత వంటబట్టినట్లు లేదు.
నవ్వుకుని బయటకు వచ్చేశాను.
-----------------------
లోపలికి రాగానే ఆ ప్రపంచం దూర దూరంగా జరిగిపోయింది. మనసులో సంగీతం,
పూలతోటలో సీతాకోకచిలుక లాగా,...సోఫాలో కూర్చుని కవరులోంచి ఫోటోలు తీశాను. అవి వికాస్ తీశాడు. బీచ్‌లో నా ఫోటో... ఎంతబాగుంది! నేను పొడుగు ఎబౌ ఏవరేజి.
చిన్నప్పుడు స్కూల్లో గడకర్ర అనేవాళ్ళు. వెక్కిరించే వాళ్ళు. ఇప్పుడు?
ఎంత పొడుగైతే అంత అందం. శిల్పాశెట్టి, ఐశ్వర్యాబచన్ లలాగా.
పెదవుల మీద ఆ నవ్వు..... ఆనందంతో విరిసిన పువ్వు.
ఒక నవ్వు మనసులో దీపాల్ని వెలిగిస్తుంది.
ఒక చూపు మనసుల్ని ముడివేసి అనుబంధం సృష్టిస్తుంది.
మామూలు పరిచయం అనుబంధంగా మారుతుంది.
వికాస్‌తో పరిచయం మొదట ఆఫీసులోనే అయింది. అనుబంధంగా మారింది.
ఆఫీసు పనిమీద ముంబాయి నుంచి వస్తూనే ఉంటాడు.
" నువ్వొక పూలవనానివి!" అంటాడు బుజాలమీద పడే నా అల్లరిజుట్టుని సవరిస్తూ.
అతడికి నేనే ప్రపంచం. నాకు కూడా !
ప్రేమ ఏమిటి? అర్థం లేని మాట.
ఆలోచించటం దండగ. అనుభవించడం సత్యం.
మనిషికి ఏం కావాలి? ఆనందం కావాలి.
ప్రేమ, త్యాగం కోరుతుంది అంటారు. అది బలహీనులు, ఏదీ సాధించలేని వాళ్ళు చెప్పేమాట. ప్రేమ ఆనందాన్ని కోరుతుంది. అన్ని బలహీనతలని అధిగమిస్తుంది.
ప్రేమని సాంఘిక నియమాలు బంధింలేవు. అది స్త్రీ బలహీనురాలిగా బ్రతికినప్పటి
పాతమాట. ఇంకొక ఫోటో తీసాను.
అది నేనేనా? ఔను. వికాస్ చూస్తుంటే అతడి ప్రేమ , నన్ను తాకుతుంటే నా కళ్ళు
అలా వెలిగిపోతుంటాయి. మనసులో పుట్టే ఆనందం అలలుగా శరీరమంతా ఆవ
రించి కళ్ళలో తారకలై వెలుగుతుంది.
వికాస్ వెళ్ళాక ఒక అరగంట దాకా తేరుకోలేకపోయాను!
రాత్రంతా ఒకరి కౌగిలిలో ఒకరు ఇమిడిపోయి ఎంత గడిపినా తీరని కాంక్ష!
వికాస్ నా వాడు. నేను ఎప్పటికీ అతడిని వదలను. వదలబోను.
ఈ మూడురోజులూ నా జీవితంలో ఆనందోత్సవాలు.
జీవితం సముద్రం లాంటిది. ఆగకుండా అనుభవాలు కెరటాలై వస్తూనే ఉంటాయి.
కానీ ఈ కెరటం ఇక్కడే-ఈ క్షణాలు ఘనీభవించి ఇలాగే ఆగిపోతే బాగుండునని
అనిపిస్తోంది. అతడు వెళుతుంటే బాధ వేసింది. కానీ ఒక విధంగా మంచిదే!"బాధే సౌఖ్యమని భావన " లాగా. ఏకాంతంలో తమ ఇద్దరి మధ్య ఉన్న ఈ సాన్నిహిత్యాన్ని
తలచుకుంటుంటే ఎక్కడలేని సంతోషం, ఆనందం అధికమౌతున్నాయి
----------------------------
వికాస్ సాయంత్రం వరకు రాడు. ఒంటరిగా గడపడం ఎట్లా?కాస్త ఎడబాటుకి భయ
పడితే ఎలా? తను అంత బేల కాదు. మరీ అంత అభయను కాను.
లోకంలో అందరికీ ఎన్నో సమస్యలుంటాయి.
ఒకప్పుడు తనూ కూడా ఎన్నో సమస్యలనీ ఎదుర్కొంది. ఎన్నో కష్టాలు పడి బయట
పడింది. చదువుకుంది. ఉద్యోగం సంపాదించింది. కుటుంబ బంధాలనుంచి బయటపడింది. అదృష్టవశాత్తు యౌవ్వనోద్రేకములో కలిగిన ప్రేమ విఫలమై పెళ్ళి
కాలేదు. లేకపోతే తనుకూడా ఒక సామాన్య గృహిణివలె మిగిలిపోయి ఉండేది.
ఇప్పుడు తను సర్వ సమర్థురాలైన యువతి. తన జీవితం తను నడుపుకోగలిగిన పూర్ణయువతి. ఒక్క పెళ్ళి తప్పితే. ఎవరికో భయపడాలిసిన అవసరంలేనే లేని స్వతం
త్ర జీవి. తనకి పెళ్ళి అనే సాంఘిక బంధం లేదు. తనకేం కావాలో అది పొందటమే
తన ఏకైక ధ్యేయం! తన జీవితం.
వికాస్ దొరకటం .... తను చేసుకున్న అదృష్టం!
" నేను ప్రేమించగలనని , ప్రేమకు అర్థం తెలిసింది నీవలన. ఇప్పుడు నాకు నీ కంటె
ఏదీ ముఖ్యం కాదు. ప్రపంచంతో నాకు సంబంధం లేదు. నీ కోసం, నీ ఆనందం కోసం
నేను దేనినైనా వదులుకుంటాను. నిన్ను మాత్రం ఎటువంటి పరిస్థితులలోనూ
వదులుకోలేను. నాకు పెళ్ళయింది కానీ మా మధ్య అనురాగం ఏర్పడలేదు. అది ఒక
అసహాయత... అసహ్యకరమైన , జుగుప్సాకరమైన పరిస్థితి..... " అని చెబుతున్నాడు
వికాస్ ఒకసారి.
పెళ్ళి, భార్య, భర్త! ప్రేమ వైశాల్యం ముందు ఇవి అన్నీ చిన్నపదాలు!
" ఆపు, నాకు అవేమీ చెప్పకు. అదంతా మామూలు జీవితం. కుటుంబం, సంఘం
చాలా మోసపూరితము, సంకుచితము గలవి. మనిషి, ఆత్మను హింసబెట్టి కృంగ
దీస్తాయి. వాటినుంచి ఎదగటం ... పూర్వజన్మసుకృతం, అదృష్టమూనూ. మనిద్దరం
ఈ విధంగా ఉంటే చాలు" అంది తను.
స్వార్థం, తప్పు అంటారు.... మనిషిని లొంగదీయటానికి. స్వార్థం లేకపోతే మనిషి ఎద
గలేడు. ఎదగడు. స్వార్థం ఉంటేనే అనుకున్నది సాధించగలడు. నేను... నాది అన్న
అనుభూతి లోనుంచి కదా ఆనందం పుడుతుంది.
స్వార్థం లేనిదే మనషి లేడు. జీవితం లేదు.
ఈ ఆనందం వదులుకుంటే ఏం మిగులుతుంది? అంతా శూన్యం, ఏడుపులు తప్ప
ఒక రకంగా బావఎంచుకున్న మార్గం కరక్టేమో!స్వార్థపరుడు
"ఇంత ప్రపంచం ఇన్నిన్ని అందాలు ఉండగా ఒకగుడ్డి దీపంనీడలో గుడ్డోడికింద
బ్రతకనా?" అన్నాడు అక్కతో.
అవమానంతో రగిలిపోయిన అక్క తనని తాను దహనం చేసుకుంది. అందమైన శరీరం. నల్లగా , వికృతంగా .... ముగిసింది అక్క జీవితం.
ఎప్పటికీ క్షమించను. ఎప్పటికీ క్షమించలేను బావను.... ఆ మగజాతిని!
ప్రేమ దొరకలేదు అక్కకి. అది హింస కంటే దారుణమైనది!
ప్రేమ దొరికిన జీవితం అనురాగసౌందర్యంతో వెలిగిపోతుంది.
ప్రేమ లేని బ్రతుకు శవానికి సెంటు పూసినట్టే. ప్రేమ లేని మనసు నాపరాయి వంటిది.
ఇది వరకు ప్రపంచం రెండే రెండు రంగులు. తెలుపు- నలుపు! తప్పు- ఒప్పు ........
రెండే రంగులు.
ఈ నాటి ప్రపంచం .... ఏడు రంగులు కాదు. సప్త వర్ణ మిళితము కాదు. అనేకానేక
వర్ణాలు, వర్ణమిశ్రమములతో ధగదధగాయమానంగా వెలుగులు నింపుతూ, మెరిసి
పోతోంది. ఇంత కంటే వైభవము మరోటి ఉంటుందా. స్వర్గం కూడా ఉండదు.
-------------------------
నిన్న ఎంత అందంగా గడిచింది. షాపింగ్‌కి వెళ్ళాము. మూడు జీన్స్, టీషర్ట్సు కొన్నాడు వికాస్. బిల్లు పద్దెనిమిది వేలయ్యింది. అతడి కానుక!కానుకలు అందుకోవ
టంలో ఎంత సంతోషం ఉంటుంది. అవి వేసుకుంటే తన ఒంపుసొంపులకి తగ్గట్టు
అమరిపోయి, ఆ బట్టలు తన శరీరానికి ఒకనూతన కాంతులు ఇస్తున్నాయి.
ఆకాశానికి మబ్బుల తెరలాగా , పైరులమీంచి పిల్ల గాలులాగా,
మనసుని ఆనందం ఆవరిస్తుంది. ఒక స్వప్న జగత్తులోకి తీసుకెళుతుంది!
ఆకాశం తళతళ తారకలు పొదిగిన రాతిరి పమిట వేసుకున్నట్టు!
బంగారుచ్ఛాయ రంగులో " నువ్వు పసిడిబొమ్మవి" అన్నాడు వికాస్ తన టీషర్ట్ సవరిస్తూ.
రసానుభూతి లేకపోతే అందానికి అనుభవం లేదు.
అది అడవి గాచిన వెన్నెల.
తప్పు, తప్పు అంటారు. అసలు తనని ఇష్టపడని, తనకి నచ్చని వాడితో ఎందుకు
కాపురం చెయ్యాలి?
తనకోరికలు, స్వాభిమానం , జీవితేచ్ఛ నలిపేసి ... ఆర్పేసి.... ఎందుకు కాపురం చెయ్యాలి!తన జీవితాన్ని తానే మలుచుకోవాలి.
అక్క కథ. బుగ్గన చుక్క, నుదుట కళ్యాణం బొట్టుతో పెళ్ళిరోజున చూసింది. అక్క మొహంలో వెలుగు. పెదవుల మీద నవ్వు. మళ్ళీ చూడలేదు పెదవుల మీద నవ్వు.
బావ అక్కకిచ్చిన బిరుదు సతీసావిత్రి. " సిగిరెట్లు మానండి, మధ్యం జోలికెళ్ళకండి,
బయట తిరుగుళ్ళు తిరగకండి" అంటూ ఏకబిగిన కోరికలు . బావ అన్నీ కొట్టిపారేసే
వాడు. అన్నీ ట్రాష్ అనేవాడు.
" పురాణకాలపు నీతులు చెప్పకు. పుట్టింది అనుభవించడానికే. లేకపోతే బ్రతుకు
శుద్ద దండగ. ఆనందంగా వుండటానికి నీకు తిండి, బట్ట, పిల్లలని కూడా ఇచ్చాను.
వాటితో తృప్తి పడు "అనేవాడు అక్కతో.
తనకి చాలా కోపం వచ్చేది.
" మీకు అదే ఎక్కువైతే పెళ్ళి ఎందుకు చేసుకున్నారు. ? అని అడిగాను.
" మీ అక్కని ఉద్దరించటం కోసం. సమాజఉద్దరణ. " అసలు కించిత్ కూడా సంస్కారం లేనివాడిలాగా.
తెలిసున్న విషయమేమిటంటే తన పిఏ ను లైనులో పెట్టి ఇంకో ఇళ్ళు ఏర్పాటు
చేసుకున్నాడట. అక్క ఈ విషయం విన్న వెంటనే ఎలకలమందు మింగింది. వెంటనే
నేను చూసి హాస్పిటల్ కు తీసుకెళ్ళి బతికించుకోగలిగాను. కానీ అక్క ఆ షాక్‌నుంచి కోలుకోలేదు.
" నువ్వు బయటికొచ్చి వుద్యోగం చెయ్యి. విడిగా వుండు. నీ మీద ప్రేమ లేనప్పుడు నీ
వెందుకు వాడిగురించి ప్రాకులాడాలి. నీ బ్రతుకు నీవు బ్రతుకు? అవి హితబోధ చేస్తే,
" బ్రతికి ఏం సాధించాలి? అంది నిరాసక్తిగా.
మనసు మూసుకుపోతే మరో మార్గం లేదు. కానీ ప్రపంచం ఎంత విశాలమైంది!బ్రత
క టానికి ఎన్నెన్నో మార్గాలు!చదువుకోవచ్చు! కళలని అభివృద్ది చేసుకోవచ్చు!మన
ఆలోచనా విధనం విశాలం చేసుకుంటే ఏదో మార్గం దొరక్కపోదూ!అక్కకి ఇవేవీ
పట్టడం లేదు. తనకి పిల్లలున్నారన్న సంగతి కూడా మరిచిపోయింది. నిరాధరణ
ఎంత చేటు చేస్తుంది కదా!
" మీ బావకి నామీద ప్రేమలేదు. నేను జీవించి వుండడం శుద్ద దండగ. " ప్రేమ గురించి ఇంత వెంపర్లాడాలా!పిల్లల కంటే కూడా ఎక్కువా? ప్రేమలేనప్పుడు వాళ్ళు
కూడా నాకొద్దు. ఆయనకి వదిలేస్తా "'అని అంది.
బావతో దెబ్బలాడి, దెబ్బలాడి విసిగి వేసారి పెట్రోలి పోసుకుని కాల్చుకుంది.
భార్యని నిరాధరణకు గురిచేసి మరొక ఆడదాని వలలో పడిన మగాడు.
పిల్లల్ని వాళ్ళ నాన్నమ్మ వచ్చి తీసుకుపోయింది, అక్క పోయిం తరువాత.
" నీ పిల్లల పట్ల నీకు ప్రేమ, అనురాగాలు లేవా? అని నిలదీసాను. " మనిద్దరం పెళ్ళి
చేసుకుందాం. అప్పడు బాధ్యతలు చెరిసగం పంచుకుందాం" అన్నాడు.
ఇటువంటి వాడిని ఏం చేయాలి. ఎలా బతకాలనుకున్నాడో అలా బతికేస్తున్నాడు బావ. స్వతంత్రంగా బతకడమంటే ఇదేనేమో! విచ్చలవిడితనం. సంఘం కట్టు
బాట్లకు తిలోదకాలు ఇవ్వడం. ఇంక తనకి జీవితమన్నా, పెళ్ళి- సంసారమన్నా
ఏహ్యభావం పుట్టుకొచ్చింది. కానీ.... అది కూడా కొంతకాలమే.
హైద్రాబాద్‍కు బదిలీ అయ్యింది. అమ్మను వదిలి హైదరాబాద్ కి వచ్చాను. కొత్త పరి
చయాలు, కొంగ్రొత్త స్నేహాలు పెరిగాయి. కొలీగ్ పెళ్ళిలో కౌశిక్ పరిచయమయ్యాడు. మన
అభిప్రాయాలని, ఆలోచనలని పక్కనబెట్టి మనసును లొంగదీసుకునే శక్తి వుంది. అది ఆడ-మగల మధ్య ఆకర్షణ.
' అలా చేయొద్దు అనుకుంటూనే అతని మాయమాటలు, కొంటెచూపులు, తుంటరి
పనులకి లొంగిపోయాను. అమ్మ సంబంధాలు చూస్తూనే ఉంది. తనకి ఇష్టమై, నచ్చినవాడుంటే తప్ప పెళ్ళి చేసుకోకూడదనుకున్నాను. అమ్మకేమీ తెలియనివ్వలేదు.
ఇన్నాళ్ళకి తన ఆలోచనలకు నచ్చినవాడు దొరికాడు. అతడితో సినిమాలు, షికార్లు,
ఎన్నెన్నో సరదాలు. హాయిగా , జాలీగా తిరగని చోటేలేదు. స్వేచ్ఛగా నా ఇష్టం వచ్చి
నట్టు తిరిగాను.
ఒకసారి విశాఖపట్టణం వెళ్ళాను.
ఎగిరెగిరి వచ్చి పడే అలలు నా పాదాలు తడిపి వెళుతుంటే , అల్లరి పిల్లల ఆట
లాగా మనసు ఉంది. చుట్టూ ఎంతమంది ఉన్నా , తామిద్దరమే విహారానికి వచ్చి
నట్టుగా అనుభూతులు.
" నేను నీ వాడను, నీవు నా దానవు . ఏమైనా సందేహమా అనడిగాడు కౌశిక్. ఇద్ద
రం అలలతో పోటీపడి ఆడి తడిసిన దేహాలతో ఉన్నాము.
" ఆ జీవితం నాది. నా శరీరము నాఇష్టం. దీని మీద ఎవరికీ హక్కులేదు. మనమధ్య
ప్రేమానరాగాలు ముఖ్యం. మిగిలిన విషయాలు నేను లెక్కచేయను" అంది.
ఆ రోజు కాటేజీలో ఉండిపోయాము. వారి ఆనందానికి, హద్దులు లేవు. ఆ తమకంతో
ఏకశయ్యాగతులైయ్యారు. ఇద్దరూ ఒక్కటై సుఖసాగరాలలో తేలియాడారు.
ఆనందానికి, నీతికి రైలుపట్టాల మధ్యన్నుంత దూరం. ఎప్పటికీ కలవవు.
తన దృష్టిలో " పెళ్ళి అనేది సామాజికబంధం. సమాజం మనిషిని తన గుప్పిట్లో ఉంచుకునే నీతిసూత్రం. ఏవో హద్దులంటూ గోడలు కడుతారు. నా లాంటివాళ్ళు ఇటువంటి వాటిని పాటించక్కర్లేదు. ఈ నియమాలన్నీ అమాయకులకు.
ఒకరోజు కౌశిక్ దిగాలుగా మొహం వేలాడేసుకుని వచ్చాడు.
"'మధూ! నా పెళ్ళికి నిశ్చితార్థమైపోయింది. మా చెల్లికి ఇవ్వాళ్సిన కట్నంబాపతు ఇంకా ఇవ్వలేదని మా బావవాళ్ళ చెల్లిని పెళ్ళి చేసుకుంటే మాబావకు బాకీ డబ్బులు
ఇవ్వక్కర్లేదు. ఇంకా పొలం కూడా రాసిస్తామన్నారు. ఒప్పుకోకపోతే మా చెల్లిని వది
లేస్తా నన్నాడు మా బావ......... గత్యంతరం లేక ఒప్పుకోవలసి వచ్చింది" తెగ బాధ
పడిపోతూ ఏడుపుమొహంతో చెప్పాడు.
ఆ సమయానికి నాకు పెళ్ళంటే సదభిప్రాయముంది. కుటుంబమన్నా మంచి ఆలో
చనలు ఉన్నాయి. ఇప్పుడు తన ఆశలు అన్నీ అడియాసలైపోయాయి.
దుఃఖం పొంగుకొచ్చింది. బాకీ డబ్బులే వుంటే తనపెళ్ళి కౌశిక్‌తో అయ్యేది. తన బీద
రికం మీద తనకే అసహ్యం వేసింది. తిండీతిప్పలు లేక చాణ్ణాల్లు గడిపింది. కొంత
కాలం తరువాత తెలిసింది. మంచి ఆస్థిపరుల సబంధం వస్తే నాకు కహానీ విన
పించాడని. అప్పుడు అర్థమైంది. పెళ్ళి ఒక సామాజికబంధం. కుటుంబం ఒక సామా
జికబంధం. ఇవన్నీ బలహీనతలు. అసహ్యంతో తన బాధని కూడా మరిచిపోయింది.
ఇది నాకొక గుణపాటం. నేనింక ఏడవను. వీడు పోతే ప్రపంచంలో ఇంకెవరూ దొర
కరా?. పవిత్రత మీద నమ్మకం పోయింది.
ఇంక తను బాగా మారాలి. ఈ నాటి జీవితంలో స్త్రీ అణచివేత, అన్యాయాలు తనకు
మొత్తం కనబడ్డాయి. తను బాగా ఎదగాలి. తన రూపలావణ్యాలు, అందచందాలు,
వేషధారణ బాగా మార్చుకుంది. శరీరం మీద బాగాశ్రద్ర పెట్టింది. యోగాభ్యాసాలు
మొదలుపెట్టింది. మనసులోని మాలిన్యాలని దాదాపు దూరం పెటింది.
ఈ పరిస్థితులలో తనకి అనుకోని పెన్నిధిలా వికాస్ దొరికాడు.
రాక రాక వసంతంలా అనుకోని అతిథి వచ్చాడు;
రాసలీలలతో నా జీవితాన్ని వికసింపజేసాడు.
ఈ అన్వేషణలో ప్రేమానుభవాన్ని కలిగించాడు. ఇంతకంటే ఇంకేమి కావాలీ. మనసు
లో..... సంగీతం.. ఇద్దరి మనసులూ లతలా అల్లుకుపోయాయి. ఎంతగా అంటే కొన్ని
కొన్ని జంటలుగా కాస్తాయి. అలా అన్నమాట. గాఢానుబంధం. వీలు చూసుకుని కంపెనీపని చెప్పి నెలకొకసారైనా వస్తాడు. ఆ రెండురోజులు చాలు మధురాను
భూతులు తలుచుకుంటూ ఉండటానికి.
సాయంత్రం సమీరంలా వస్తానన్నడు. గడపాలి. ఈ విరహపు బాధను అప్పటిదాకా
గడపాలి.... మధ్యహ్నం కూడా అన్నం సయించలేదు. ఓ ఆపిల్ కోసుకుని తిన్నాను.
--------------------------------------
ఒక్కొక్క ఫోటో అలా అలా చూస్తూ ఉన్నాను. ఒక్కొక్కటి ప్రక్కన పెడుతున్నాను. బయట
ఎవరో కాలింగ్ బెల్ కొట్టిన చప్పుడు. " వికాస్ వచ్చేశాడేంటి? అప్పుడే రాడు కదా! ఇలా అనుకుంటూ తలుపు తీశాను.
ఒక్క నిమిషం నిశ్చలంగా ఉండిపోయాను. ఇందాక మందులదుకాణంలో చూసిన
యువతి.
" కౌన్ హే? క్యా చాహియే? అని అడిగాను.
ఆ యువతి అలానే నన్ను చూస్తూ నిలబడింది.
" మీరు తెలుగువాళ్ళా? ఏం కావాలీ? ఈ సారి అంతా తెలుగులోనే అడిగాను.
" సహాయం.. సహాయం.. లోగొంతుకతో మెల్లగా వినీవినబడనట్టుగా అడిగింది.
" ఏం సహాయం... "
" ఒక గ్లాస్ మంచినీళ్ళు. దీని పేరు పద్మ. హెల్త్ సరిగా ఉండదు. దాహం వేస్తోందిట. "
"లోపలికి రండి. ఇలా కూర్చోండి" అన్నాను.
లోపలికి వెళ్ళి ఒకగ్లాస్ నీళ్ళు, నీళ్ళబాటిల్ తెచ్చి వాళ్ళకిచ్చాను. ఆ యువతి కూర్చో
లేదు. పాపకి మంచినీళ్ళు తాగించింది. తరువాత నావంక చూస్తూ " నాకొక సహాయం
కావాలి" అంది. హాండ్‌బాగ్‌లోంచి హాస్పిటల్‌కాయితాలు తీసి అందులోంచి రిపోర్ట్స్
, ప్రిస్కిృప్షన్షు తీసింది. విషయం ఏమిటన్నట్టుగా చూశాను.
" నాకు ఇద్దరాడపిల్లలు. ఇది చిన్నపిల్ల. మొగుడు నన్ను వదిలేశాడు. దీనికి తీవ్రంగా
తలనొప్పి వస్తూంటుంది. ఆరునెలలనుంచి మూర్చ వచ్చి పడిపోతుంటుంది. డాక్టర్సు
కు చూపించా కానీ ట్రీట్‌మెంట్ చాలా రోజులు పడుతుంది. ముందు కనీసం ఆరు
నెలలు మందులు వాడితే అప్పుడు హాస్పిటల్ లో ఓ పదిరోజుల ట్రీట్‌మెంట్ ఉంటుందట. మందులు ఆరునెలలు ఖచ్చితంగా వాడాలన్నారు. లేకపోతే ప్రాణానికి
ప్రమాదమన్నారు. ప్రతీనెలా మందులకే ఇరవైవేలవుతుందన్నారు. ఇవన్నీ నేనెలా
తేగలను. నాకు తాహతు కూడా లేదు..... " అంటూంటే కళ్ళ వెంబడి జలజలా
కన్నీళ్ళు ఉబుకుతూ రాసాగాయి.
" మీ కెవరూ లేరా? అడిగాను.
ఆవిడ ఏడుపు ఆపుకుంటోంది.
ఈవిడ చెబుతున్నది నిజమేనా? నమ్మవచ్చా? నేనో రెండు వేలు ఇవ్వగలను. వికాస్
కి చెప్పి ఇంకొంచెం ఏర్పాటు చేసి , తన ఫీల్డేకనక మందులూ చాలావరకు డిస్కౌంట్
లో ఇప్పించగలను. కానీ ఇవన్నీ డబ్బు గురించి ఆడుతున్న డ్రామాలా లేక నిజమా!
నా ఆలోచనలు సుడిగుండంలా పరిగెడుతున్నాయి. ఆ పిల్ల మూలుగుతున్నట్టు అని
పించింది. తెల్లగా ఉన్న మొహం. బాగా కమిలిపోయినట్టుగా ఉంది. ఆ పిల్లతల్లి చటు
క్కున పాపని పట్టుకుని నోరుతెరిచి నోట్లో టాబ్లెట్ వేసి నీళ్ళు తాగించింది. కొంచెం
సేపటికి పాప తేరుకుంది. మెల్లగా కళ్ళు తెరుస్తోంది.
" పాపం! చాలా కష్టాల్లో వున్నారు. ఇప్పుడు నేనో మూడువేలిస్తాను. ! అన్నాను. ఆవిడ
మొహం వద్దన్నట్టుగా పెట్టింది.
" వికాస్‌మూర్తి గారు లేరా? ఎప్పుడు వస్తారు? అనడిగింది.
వికాస్‌మూర్తి! ఈవిడకి ఈ పేరు ఎలా తెలుసు? బయటగానీ బోర్డు చూసిందా! అను
కుంటూ ఆవిడ మొహంకేసి తదేకంగా చూసాను.
దగ్గరగా ఉన్న కుర్చీ జరుపుకుని కూర్చుంది. నా పేరు జీవిత. వికాసమూర్తి గారు మా
వారు. నాకు తాళి కట్టిన భర్త. బాంబే వచ్చినప్పటినుంచి ఇంటికిరావడము లేదు.
డబ్బుపంపుతూంటారు. నేను ఎక్కవ చదూకోలేదు. ఉద్యోగాలు నాకు ఇవ్వరు.
నన్ను బయటికి పంపేవారు కాదు. నేనంటే ప్రేమ అనుకున్నాను. కానీ తెలిసిందేం
టంటే ఆయన ఎవరో అమ్మాయితో ఉంటున్నారని. నేను చచ్చిపోదామనుకున్నా. కానీ
పిల్లలు అనాథలు కాకూడదు. పోనీ పిల్లలని ఏ గంజో పోసి బతికించుకుందామంటే
దీనికి జబ్బు. పెద్దదాన్ని ఊళ్ళో వాళ్ళ మావయ్య దగ్గర వదిలేసి ఈ చిన్నదాన్ని ఈయనకు అప్పగించి వెళదామని ఇక్కడకు వచ్చాను. ఆఫీసులో లేరంటే ఇక్కడకు
వచ్చాను. మీ సహాయం కావాలీ" అంది.
నా కాళ్ళ క్రింద భూమి గిర్రున తిరుగుతున్నట్లు అనిపించింది. నేను ఒక్కసారిగా క్రింద
కి పడిపోతున్నట్టుగానూ, తల ముక్కలు, ముక్కలుగా అయిపోతున్నట్టుగా ఉంది. ఒక
సునామీ ! అలా కూర్చండిపోయాను. నిస్తేజంగా........
మెల్లగా ఆమె దగ్గరనుంచి కాయితాలు తీసుకుని రిపోర్ట్స్ చదివాను. నిజమే . ఈవిడ వికాస్ భార్య. ఇప్పుడు తన పరిస్థితి ఏమిటి? అతను నిజమే చెప్పాడు. నేనే
మొండిగా అతని జీవితంలో ప్రవేశించి ప్రళయం సృష్టించాను. ప్రత్యక్షంగా ఏమీ లేక
పోయినా , పరోక్షంగా నా తప్పులు ఉన్నాయి. నేనే ఏదో ఒకటి చెయ్యాలి. నా అక్క సంసారం లాగా కాకూడదు. ఇంకొక స్త్రీ బలి కాకూడదు. నా మనస్సు లో ఏవేవో ప్రశ్నలు, సమాధానాలు దొలిచేస్తున్నాయి.
" నేను పాపని ఆయనకి అప్పగించి వెళ్ళిపోతా. మీ విషయం ఏమీ మాట్లాడను. అని
చెబుతోంది ఆ యువతి జీవిత.
" ఊ..... అప్పగించేసి?" అడిగాన్నేను. నా మీద నాకు కోపమో, ఆ యువతి మీద కోపమో నన్నావహించేస్తోంది. ఒక విధమయిన బలహీనత.
" మా వూరు పోయి బతుకుతా. బతక్కపోయినా ఇబ్బందేంలేదు. నా మూలాన
ఎవరికీ లాభం కానీ, నష్టం కానీ లేవు" అంది. "
" అంటే చచిపోదామనుకుంటున్నావు. చచ్చి ఏం సాధిద్దామని. నీవు చచ్చిపోతే సమస్య పరిష్కారమై పోతుందనుకుంటున్నావా?అతడి పెళ్ళానంటున్నావ్, పిల్లలు
ఉన్నారంటున్నావు. మట్టి ముద్దలాగా, చలనంలేన బొమ్మలాగా వుంటే మొగుడు కూడా కన్నెత్తి చూడడు. నీ వంతుగా నీవు ఏం చేశావని. కన్నీళ్ళు కారిస్తే మనసు కరిగి
పోయేంత సున్నిత హృదయులు కాదు ఈ మగాళ్ళు. నిన్ను నీ మొగుడు ఏలుకోవా
లంటే నీవు కూడా మారాలి. పెళ్ళాం అయినంత మాత్రాన అతను నీ వాడైపోడూ!
పుట్టినప్పటినుంచీ ఎవరో ఒకరి మీద ఆధారపడటం కాదు నేటి స్త్రీలు. నేటి స్త్రీలు
అన్ని రంగాలలో పురోగమిస్తున్నారు. వేష, భాషలు మార్చుకో! లోకజ్ఞానం పెంపొందిం
చుకో! ఆర్థికంగా ఎదగడానికి ప్రయత్నించు. నీ కున్న వనరులతో చక్కగా బతకటానికి
ప్రయత్నించు. ఎవరు ఎవరికీ చేయి అందివ్వరు నేటి సమాజంలో. మనలని మనమే
చక్కదిద్దుకోవాలి. నీ సంసారాన్ని నీ తెలివి తేటలతో నీవే బాగు చేసుకోవాలి.
" ముందు ఏడుపులు ఆపెయ్. చచ్చిపోదామని ఆలోచనలు ఎప్పటికీ రానివ్వ
కూడదు. ప్రపంచాన్ని, జీవితాన్ని ప్రేమించటం నేర్చుకో" అని నాకు తెలిసినంతవరకూ
హితబోధ చేశాను.
ఆ యువతి నన్నే తదేకంగా చూస్తోంది. కొంచెం సేపు కళ్ళు మూసుకుని ప్రశాంతంగా
ఆలోచించా. నేను ఇప్పుడు తప్పటడుగు వేస్తున్నానా! నేను న్యాయం చేయాాలి. ఈ
అమాయకురాలి సంసారం సరిదిద్దాలి. పాపం ఈవిడను చూస్తే మా అక్క ముగ్ధరూప
మే జ్ఞాపకానికి వస్తోంది. నా మనసు పరిపరి విధాల పోతోంది. ఒక్కొక్కసారి మగ
వాళ్ళెంత స్వార్థపూరితులు. బావ కానీ, వికాస్ కానీ తమ ఆనందాన్ని మరీ వెదికి
వెదికి పట్టుకుంటున్నారు. ఇప్పుడు మనదేశంలో మనభారతీయత కుటుంబఅను
బంధాలు, వాటి విలువలు ఎంతగొప్పవో అవగాహనకు వస్తున్నాయి. ఇంక ఒక్క క్షణం
వృధా చేయదలచుకోలేదు. - వికాస్ బాధపడితే కొన్నిరోజులు. ఆ తరవాత అతనే
మరిచిపోతాడు. మరుపు మానవసహజం కదా!
వెంటనే వికాస్ గదిలోకి వెళ్ళి ఉత్తరం రాసి పెట్టాను.
వికాస్,
నేను నీకు కనబడనంత దూరతీరాలకు వెళ్ళిపోతున్నాను. కొత్త ప్రయాణంలో ఆధ్యా
తికత తోడుగా. " ఇంక నీవు కొత్త జీవితం వైపు పయనించు. కొత్త జీవితాన్ని ఆనందం
గా స్వీకరించు. కొత్త జీవితపు మధురిమలను ఆస్వాదించు. కొత్త జీవితను, నీ కుటుం
బాన్ని మనఃస్ఫూర్తిగా స్వీకరించి ఆ అమాయకురాలికి జీవితమాధుర్యాలని చూపించు. " ఈ ఆపాత' మధు' రాలను మరిచిపో. ఎల్లప్పడూ మీ జీవితాలు వికాసం
గా ఉండాలని కోరుకుంటూ, "మీ కాలేక పోయిన మధు"------- సెలవ్.
అతనికి కనబడేట్టు డైరీమీద పేపర్‌వెయిట్ పెట్టి తన బట్టలు సూట్‌కేస్‌లో సర్దుకుని
హోటల్ రిసెప్షన్ కు ఫోన్ చేసి ఇమీడియట్ ఫ్లైట్ హైదరాబాద్ కు ఎప్పుడుందో కనుక్కుని టికెట్ బుక్ చేసుకుంది.
జీవిత ను పిలిచి కీస్ ఆమెకిచ్చి " ఉత్తరం అన్ని విషయాలతో డైరీలో పెట్టాను. నేను
నా జీవితాన్ని ఎలాగో గడిపెయ్యగలను. నీ సంసారాన్ని ఎలా సరిదిద్దుకుంటావో, నీ
ఇష్టం. ఇప్పుడైనా తెలివి తెచ్చుకుని అతనిని నీ వాడుగా చేసుకో. ఇది నేను నీ కిచ్చే
సలహా. సహాయం. " అని చెప్పి టాక్సీ పిలిపించుకుని వెళ్ళిపోయింది. కారు రోడ్డు
మీద పరుగులెడుతోంది" నాకు ఇప్పుడు క్షాళనం కాని మలినం, పాపము మనసు
లోంచి భారము అంతా దిగిపోయి మనసు ప్రశాంతంగా అనిపించింది.
-------------------------శుభంభూయాత్---------------------------------
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.
రచయిత పరిచయం
రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.
అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.
ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,
ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.
Bình luận