top of page

పరాయింటిది


'Parayintidi' New Telugu Story

Written By BVD Prasada Rao

'పరాయింటిది' తెలుగు కథ

రచన: బివిడి ప్రసాదరావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)



"ఊరుకో.. నువ్వు పరాయింటి దానివి." కసురుకుంటుంది సంచిక అత్త సావిత్రి.

చిర్రెత్తిపోయింది సంచిక.

అప్పటికి ఏమీ అనలేక.. భర్తను గుర్రుగా చూస్తూ ఉండిపోయింది.

"తను ఏదో చెప్పుతుందిగా. చెప్పనీ." అన్నాడు సంచిక భర్త శేఖర్.


"తను ఏం చెప్పుతుంది. తనను లెక్కలోకి ఎందుకు తీసుకోవాలి." గదమాయించినట్టు మాట్లాడేస్తుంది సావిత్రి.

శేఖర్ తగ్గక తప్పలేదు.

భార్యను చూడలేక చూపు పక్కకు తిప్పేసాడు.

వీళ్ల మాటలు వింటున్న సంచిక మామయ్య రామారావు ఎప్పటిలాగే మౌనం వహించి.. కుర్చీలో ఏమీ పట్టనట్టు కూర్చుని ఉన్నాడు.


సావిత్రిని చూస్తూ..

"ఐతే చివరికి ఏం అంటావ్." అడిగాడు శేఖర్.


"నీ పెళ్లం చెప్పేది ఏమీ కాదు. తను ముమ్మాటికీ పరాయింటిదే." వక్కాణిస్తున్నట్టే వ్యవహరిస్తుంది సావిత్రి.

ఆవిడ చూపులు పిసరంత కూడా సంచిక వైపుకు తిప్పడం లేదు.

సంచిక మాత్రం గింజుకుంటుంది. మరి అక్కడ ఉండలేక.. గమ్మున తమ గదిలోకి వెళ్లిపోయింది.


గుర్తించిన శేఖర్..

"సర్లే. పదే పదే తనని పరాయిదానివి అనబోకు." వెంటనే చెప్పాడు.

ఆ వెంబడే..

"తను నొచ్చుకుంటుందిగా." అన్నాడు.


"నేనేం కాని మాట అనడం లేదే. ఉన్న మాటేగా. తను.. నీ భార్యగా ఈ ఇంటికి రాగలిగిదే తప్పా.. తను ఈ ఇంటి పెత్తనంలో చొరబడడం ఏమిటి. చీటికి మాటికి దూరేయడమేనా." పెడసరంగా మాట్లాడేస్తుంది సావిత్రి.


శేఖర్ కూడా బాగానే తంటాలు పడుతున్నాడు.

అప్పుడే కలగచేసుకున్నాడు రామారావు.

కొడుకును చూస్తూ..

"అమ్మ మాట కానీయురా." చెప్పేసాడు.


శేఖర్ కు అర్ధమైపోతుంది.. తన మాట సాగదని. అందుకే తగ్గిపోయాడు.

"సరే. నీ మాట సాగని." అనేసాడు.

ఆ వెంటనే.. తమ గదిలోకి వెళ్లిపోయాడు.

సంచిక మంచం అంచున కూర్చుని ఉంది. చిన్నగా ఏడ్చేస్తుంది.

భార్య పక్కన కూర్చుని..

"అయ్యో బంగారం.. ఎందుకు ఏడుస్తున్నావు." అనునయంగా అన్నాడు శేఖర్.


సంచిక ఏమీ అనలేదు.

"నీకు ఇంకా కొత్త. అమ్మ అంతే." చెప్పాడు శేఖర్.

"ఇంతకీ నేను ఏం అన్నాను. కొనేక మార్చలేం.. అందుకే ఆ కొనేదేదో పెద్దది కొనుక్కుంటే బాగుంటుంది అన్నాను. అంతేగా." మాట్లాడింది సంచిక.


"నిజమే. నీ ఆలోచన బాగుంది. అమ్మ కాదనేస్తుందిగా." నసుగుతున్నాడు శేఖర్.

"ఆవిడ ఆలోచించే విధం బాగోలేదు. పెద్ద సైజ్ బీరువాకి.. తీసుకోవాలంటున్న చిన్న బీరువాకి రేటులో పెద్ద తేడా కూడా లేదుగా. చెప్పితే వినరు ఏమిటో." నొచ్చుకుంటుంది సంచిక.

శేఖర్ ఏమీ అనలేక పోతున్నాడు.


"మీరైనా నాకు సపోర్ట్ గా మాట్లాడుతున్నారా.. అబ్బే.. లేదు. పైగా ఆవిడ మాట కానీ అంటున్నారు." గింజుకుంటుంది సంచిక.

"అది కాదు సంచిక.." సర్ది చెప్పే ప్రయత్నం చేపట్టాడు శేఖర్.

ఆ వెంబడే..

"అమ్మ వాటం నీకు ఇంకా తెలియాలి. ఆవిడ ముందు ఎవరం మాట్లాడలేం." చెప్పుతున్నాడు.

అడ్డై..

"లేదు లేదు. నాకు తెలిసిపోతుందిగా. ఆవిడ ముందు ఎవరూ మాట్లాడకూడదు. అంతే." గట్టిగా అనేసింది సంచిక.


శేఖర్ బెంబేలు పడ్డాడు.

"ప్లీజ్. మెల్లిగా మాట్లాడవా." చెప్పేసాడు.


"నా ఖర్మ. ఎప్పుడూ నా నోరే నొక్కేయబడుతుంది." చింతిస్తుంది సంచిక.

శేఖర్ డంగయ్యిపోతున్నాడు.


"ఆడ.. అదే.. మా ఇంటిన.. అమ్మ కూడా.. నన్ను.. వీలు చిక్కడమే తరువాయి.. 'నువ్వు పరాయింటికి పోయేదానివి'.. నీ మాటలు మాకు అక్కర లేదు అనేది.. ఈడ.. అదే.. మీ ఇంటిన.. అత్త కూడా.. నన్ను.. 'నువ్వు పరాయింటి దానివి'.. నీ మాటలు మేము వినక్కర లేదు అనేస్తుంది. ఛ. ఏమిటీ చందం." విసుక్కుంటుంది సంచిక.


శేఖర్ కు ఏమీ తోచడం లేదు. అయోమయంగా భార్యను చూస్తూ ఉండిపోయాడు.

"నాది వాగుడుగా తీసుకుంటున్నారు తప్పా.. నా వాదనను ఆలకించడం కరువై పోతుంది. భర్తగా మీ సహకారం అందుతుందేమో అనుకున్నా. అబ్బే. నా వంతు మీరు వచ్చేది ఏమీ కానరావడం లేదు." అంటూ విసురుగా లేచి నిల్చుండిపోయింది సంచిక.


అంతే జోరుగా శేఖర్ కూడా లేచి నిల్చున్నాడు.

"ప్లీజ్. సంచిక.. కూల్.. కూల్.. నన్ను తెమలినివ్వు. కుదుట పడు. ప్లీజ్." వేడుకుంటున్నాడు శేఖర్.

ఆ వెంబడే..

"నువ్వు కంగారు అవ్వకు.. నన్ను కంగారు పెట్టకు." చెప్పాడు.

సంచిక నెమ్మదిగా తగ్గుతుంది.


తన భుజాలు మీద చేతులు వేసి.. తిరిగి తనను మంచం మీద కూర్చొపెట్టే శేఖర్ ప్రయత్నంకి సహకరించింది.

మంచం మీద కూర్చుంది.

భార్య ముందుకు కాస్తా ఒంగి..

"మనం తర్వాత మాట్లాడుకుందాం. సరేనా." అన్నాడు శేఖర్.


సంచిక ఏమీ మాట్లాడలేదు.

"నేను బయటికి వెళ్లి వస్తాను." చెప్పాడు శేఖర్.

అలానే.. అక్కడి నుండి వీథిలోకి వచ్చేసాడు.


బైక్ మీద బజారు వైపుకు ఎకాఎకీలా బయలు దేరేసాడు.

సంచిక ఎట్టి చలనం లేకుండా కూర్చున్న.. ఆమె లోలోపల సతమత మవుతూనే ఉంది.

గతంలోని ఘటనలను నెమరవేసుకుంటూనే ఉంది.

తను డిగ్రీకై చదువుతున్న సమయంన..

తన వెంట తిరుగుతున్న గిరిధర్ ను ఒకమారు నిలపెట్టి..

"నన్ను ప్రేమిస్తున్నానని చెప్పడం కాదు.. పెళ్లి చేసుకుంటావా." అడిగేసింది సంచిక.


"ప్రేమలు అన్నీ పెళ్లిళ్లు వరకు వెళ్తాయా ఏమిటి." తేలిగ్గా అనేసాడు గిరిధర్.

"నా వరకు ఐతే.. వెళ్లి తీరాలి. అలాగైతేనే మనం ప్రేమించుకోవడం ముందుకు వెళ్తుంది. లేదా.. నేటితో కట్." సీరియస్ గానే చెప్పేసింది సంచిక.


"అంతే అంటావా." నీరుకారిపోయాడు గిరిధర్.

"ముమ్మాటికి." నికరంగా అనేసింది సంచిక.

"ఇంట్లో కుదరదేమో." నాన్చాడు గిరిధర్.

"పోరా." అనేసి.. అక్కడ నుండి వెళ్లిపోయింది సంచిక.


ఆ తర్వాత.. గిరిధర్ నీడను కూడా తన దరికి రానీయలేదు.

మరి కొన్నాళ్లకు.. రత్నకుమార్ తన వెంట పడ్డాడు.

అతణ్ణి నిలిపి.. గిరిధర్ సంగతి కోరి చెప్పేసింది సంచిక.


"అబ్బే. నేను వాడిలా కాదు. నువ్వు నాకు నచ్చావు. నువ్వే నాకు కావాలి. పెళ్లి చేసుకుందాం." ఒప్పేసుకున్నాడు రత్నకుమార్.


"ఐతే.. పద.. తొలుత మీ పెద్దలతో మాట్లాడదాం. తర్వాత మా పెద్దలతో మాట్లాడదాం. వాళ్లు మన ఇద్దరి పెళ్లికి ఒప్పుకుంటేనే.. నీ ప్రేమను నేను ఒకే చేస్తాను." ఖారాఖండీగా మాట్లాడేసింది సంచిక.


సంచిక అంటే ఇష్టం కావడంతో.. సంచిక చెప్పిందానికి సరే అనేసాడు రత్నకుమార్.

ఆ ఇద్దరూ.. రత్నకుమార్ పేరంట్స్ ను కలిసారు. తమ ప్రతిపాదన గురించి చెప్పారు.

చిన్నపాటి తర్జనభర్జనల పిమ్మట.. రత్నకుమార్ తమ ఏకైక సంతానం కావడం మూలంగా.. సంచిక సంగతికి.. రత్నకుమార్ పేరంట్స్ సమ్మతి తెలిపేసారు.


"మా వాళ్లతో మాట్లాడతాం. వాళ్లు కూడా పచ్చ జెండా ఊపితేనే మేము ప్రొసీడ్ అవుతాం." చెప్పింది సంచిక.

ఆ వెంబడే..

"నేను మాత్రం.. పెళ్లితో మీ ఇంటికి రాను." చెప్పింది.


"అదేమిటి." ఒక్క మారుగా రత్నకుమార్ పేరంట్స్ విస్మయం ప్రదర్శించారు.

"ఈ పెళ్లిళ్లతో ఆడపిల్ల.. ఆడ.. ఈడ ల తేడాలకు గురై పోతుంది.. నాకు అది గిట్టదు." చెప్పేసింది సంచిక.

"మరి. పెళ్లి తర్వాత.. ఏడ ఉంటావు." అడిగారు రత్నకుమార్ పేరంట్స్ కోరస్ లా.

"మా ఇంటిన." చెప్పేసింది సంచిక.



"ఇదేం చోధ్యం. మా అబ్బాయిని మీ ఇంటన ఎలా పంపేస్తాం. కుదరని వ్యవహారం." అనేసారు రత్నకుమార్ పేరంట్స్.

సందిగ్ధంలో పడ్డది సంచిక. తను ఇంత వరకు అలా యోచించనే లేదు.

"లేదూ.. పెళ్లి తర్వాత.. వేరే ఇంటిన మీ ఇద్దరూ ఉంటారంటవా.. అది మాకు గిట్టదు. ఎందుకంటే.. వీడు మా ఏకైక బిడ్డ. వీణ్ణి మేము వదులుకోలేం." చెప్పేసారు రత్నకుమార్ పెరంట్స్ నిక్కచ్ఛిగా.


సంచిక తల దిమ్మెక్కింది.

లేచి.. అక్కడ నుండి కదిలి వెళ్లిపోయింది.

వెళ్తూ.. "మనకు సెట్ కాదు. బై." అనేసింది రత్నకుమార్ తో.


ఆ తర్వాత్తర్వాత.. తనకు నచ్చినట్టు ఏదీ అనుకూలం కాకపోవడంతో.. తన తల్లిదండ్రులు చూస్తున పెళ్లి సంబంధాలకు మొగ్గేసింది సంచిక.

ఆ తోవనే.. సంచికను చూసుకోవడానికి శేఖర్ కుటుంబం వచ్చింది.


అప్పటికే తన తల్లిదండ్రుల గట్టి వార్నింగ్ తో నోరు మెదపలేని సంచిక.. తన యోచనను తనలోనే నొక్కిపెట్టేసుకొని.. శేఖర్ తో తాళి కట్టించేసుకుంది.

కొత్తగా కాపురంకు వచ్చి నెల రోజులు కావస్తుంది.

అత్తింట.. అత్త పెత్తనం ముందు మెదలలేక అవస్థలు పడిపోతుంది సంచిక.

తన అనీజీ అంతటికీ కారణం.. తను 'పరాయింటి' వ్యత్యాసంను భరించలేక పోవడమే ప్రధానమైనది.



శేఖర్ మంచివాడు. కానీ అటు అమ్మ.. ఇటు ఆలి.. మధ్య నలుగుతున్నాడు.

బజారులోకి వెళ్లి ఉన్న శేఖర్ కు ఆ తోవలో గోపాలం అగుపించాడు.

గోపాలం.. పట్నంలో శేఖర్ తో కాలేజీలో పిజి చదువు చదివాడు. ఇద్దరిదీ అప్పటి.. అక్కడి పరిచయం.

పలకరింపుల తర్వాత..

"మా ఊరులో ఉన్నావేమిటి." అడిగాడు శేఖర్.


"ఉద్యోగరీత్యా ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకొని వచ్చాను ఈ మధ్యనే." చెప్పాడు గోపాలం.

"అదేమిటి. పట్నంలో మీకు మంచి బిజినెస్ ఉందిగా. నువ్వు బిజినెస్ అంటేనే ఇష్టపడేవాడివిగా." అడిగాడు శేఖర్.


"అవును. కానీ. పెళ్లి తర్వాత.. తప్పక ఉద్యోగంలో చేరాను. సో ట్రాన్స్ఫర్స్ సదుపాయాలతో సొంత ఇంటి నుండి బయట పడగలిగాను." నవ్వేడు గోపాలం.

"అర్ధం కాలేదు." తల గోక్కున్నాడు శేఖర్.


"భార్య, అత్త ఒక ఇంటన ఉంటే.. భర్త వేగిపోవాలి. అది అర్ధమై.. ఉద్యోగం పేరున ఆ ఇద్దరినీ ఎడం ఎడం పెడితేనే.. నాకు హాఫీ దొరుకుతుంది.. తప్పదు మరి." చెప్పాడు గోపాలం చాలా ఈజీగా.

ఆ వెంబడే..

"అన్నట్టు నీకు పెళ్లి ఐందా. మీ అమ్మతోనే మీరు ఉంటున్నారా. ఐతే.. నాలానే నీకు అనుభవం రావాలే." అన్నాడు గోపాలం చకచకా నవ్వేస్తూ.


వెర్రి వెంగలప్పలా నవ్వేసాడు శేఖర్. కానీ ఏమీ అనలేదు. ఐనా.. అతడిలో ఆలోచనలు మరో దిశన పడ్డాయి.

ఆ రాత్రి..

సంచిక పక్కన పక్క మీదకు చేరి..

"కొద్ది రోజులు ఓపిక పట్టు. మరో ఊరికి ట్రాన్స్ఫర్ మీద ఈడ నుండి కదిలిపోతాను. నీకు 'పరాయింటిది' అన్న యాతన నుండి బయట పడేస్తాను." గుసగుసగా చెప్పాడు.


ఆ వెంబడే..

సంచిక తల మీద తన కుడి అర చేతిని పెట్టి..

"ఒట్టు." అనేసాడు కూడా.

***

బివిడి ప్రసాదరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.



రైటర్, బ్లాగర్, వ్లాగర్.

వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్

వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్

వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.





69 views0 comments

Comments


bottom of page