top of page

పరిణితి


'Parinithi' written by Yasoda Pulugurtha

రచన : యశోద పులుగుర్త

హఠాత్తుగా వచ్చిన వర్షను చూసి ఆశ్చర్యపోయింది భ్రమరాంబ!

“అదేమిటే వర్షా, ఒక్కత్తివీ వచ్చావ్! అల్లుడు రాలేదా నీతో ?” అనగానే, ఇంతెత్తున లేచింది వర్ష ! “ఏం మమ్మీ, ఒక్కదాన్నీ రాకూడదా ? పెళ్లి అయిపోతే కూతురు ఒక్కత్తీ పుట్టింటికి వస్తే బోల్డన్ని ఆరాలం”టూ కస్సుమంది తల్లి మీద!

“అవునే అమ్మలూ! కారణం లేకుండా, చెప్పా పెట్టకుండా వస్తే అడగనా మరి ? ఎలా ఉన్నారు అల్లుడుగారు, మీ అత్తమామలు ?”

“మా మామగారికి వైరల్ ఫీవర్ వచ్చి తగ్గింది. ఇప్పుడు మా అత్తగారు పడకేసారు. చస్తున్నాననుకో! పనిమనిషి రావడం లేదు. గొడ్డు చాకిరీ అయిపోయింది ఆ ఇంట్లో నాకు !

నిక్షేపంగా ఉద్యోగం చేసుకుంటున్న నన్ను ‘నీవు కష్టపడనవసరం లేదులే వర్షా!’ అంటూ నాచేత ఉద్యోగం మాన్పించిది ఇంటి చాకిరీకే అని ఇప్పుడు అర్ధమవుతోంది !”

“మరి ఇంట్లో జ్వరం వచ్చిన వాళ్లని అలా వదిలి వచ్చావేమిటి వర్షా?”

“అంటే.. అంటే.. నన్ను వెళ్లిపొమ్మనా అర్ధం?”

“అయ్యో! అలా అని కాదే తల్లీ, నీవు రావచ్చు కాదనను, కానీ ఇది సందర్భం కాదని !”

“మమ్మీ! నేను ఆ చాకిరీలు చేయలేను. ఆ ముసలాళ్లకు వండి పెట్టడం నా వల్లకాదు.. నేను కొన్నాళ్లు ఇక్కడే ఉంటాను. వాళ్లకు తగ్గాక అప్పుడు వెళ్తాను అక్కడకు !”

“ముసలాళ్లేమిటే వర్షా, వాళ్లు నీ అత్తగారూ, మామగారూనూ ! 'అత్తగారు, మామగారు' అని నోరారా పిలవలేవా? అయినా ఇది పద్ధతి కాదు వర్షా! ఇంట్లో అలా ఉన్న మనుషులను వదిలేసి పుట్టింటికి పరుగెత్తడం! పుట్టిల్లు దగ్గరే ఉందని చీటికి మాటికి ఇలా రావడం బాగుందా వర్షా? మీ అత్తగారూ, మామగారూ ఏమనుకుంటారు చెప్పు ! సరేగానీ నీకు కాస్త కాఫీ ఇవ్వనా?”

తల్లి అన్న మాటలకు కోపం వచ్చి మూతి ముడుచుకుని కూర్చుంది మాట్లాడకుండా !

“ఇదిగో.. కాఫీ తాగు ముందు” అని కాఫీ కప్పు చేతికందిస్తే తీసుకుని పక్కన పెట్టేసింది తాగకుండా !

"నడు.. ముందు! నాకు ఇటువంటివి నచ్చవు వర్షా. నేను ప్రోత్సహించను కూడా ! మీ ఇంటికి వెళ్లు వెంటనే. నేను వచ్చి దింపుతాను పద!” అనగానే వర్ష ఇంతెత్తున లేచింది. “పుట్టింటికి వస్తే తరిమి కొడ్తున్నావా మమ్మీ? నీకు అసలు జాలీ , ప్రేమా ఉంటేగా నా మీద ! నీవు నన్ను దింపాలా మా ఇంటికి.. ఆ..! నేను ఇంకా చిన్న పిల్లననుకుంటున్నావా ?”

“అలా కాదు తల్లీ, నా మాట విను ఒక్కసారి!”

“చాలా థాంక్సండీ భ్రమరాంబగారూ! నన్ను ఎవరూ దింపనవసరం లేదం"టూ, క్యాబ్ బుక్ చేసుకుని రుసరుసలాడుతూ వెళ్ళిపోతున్న వర్ష వైపు మౌనంగా చూస్తూ ఉండిపోయింది భ్రమరాంబ !

పుట్టింటి నుండి కోపంతో కుతకుతా మరుగుతూ గుమ్మంలో అడుగుపెట్టేసరికి అక్కడ సోఫాలో ఎదురుగా చిలిపిగా నవ్వుతూ తన భర్త సుధాకర్ !

“ఏమిటీ.. వర్ష సడన్ గా పుట్టింటికి వెళ్ళింది? ఏమైందో మరి! “ అంటూ అమ్మ అంటోంది. అమ్మకు ఫీవర్ కదా, పనిమనిషి కూడాలేదు. నీవు ఒక్కదానివే చేయలేవని మధ్యాహ్నం లీవ్ అప్లై చేసి ఇంటికి వస్తే నీవు కనపడలేదు.. ఏమైంది వర్షా? అత్తయ్యా మామయ్యా బాగున్నారుకదా..” అని ఆతృతగా అడుగుతున్న సుధాకర్ ప్రశ్నకు ముభావంగా తల ఊపుతూ బెడ్ రూమ్ లోకి వెళ్ళిపోయింది డ్రెస్ మార్చుకోవడానికి !

తిరిగి వంటింట్లోకి వచ్చి చూసేసరికి సింక్ లోని గిన్నెలన్నీ నీట్ గా తోమి పెట్టేసాడు సుధాకర్. వేడి వేడి కాఫీ తయారు చేసి తల్లికి తండ్రికి ఇచ్చి, మరో కప్పు వర్ష చేతికిస్తూ, తను త్రాగుతూ ఏవో జోకులు వేస్తూ మాట్లాడసాగాడు !

వర్షకు చాలా గిల్టీగా ఉంది! తను అలా పుట్టింటికి చెప్పకుండా వెళ్లిపోవడం సమంజసం కాదేమోననుకుంది !

ఇక్కడ .. వర్ష తల్లి భ్రమరాంబ తను చేసిన పని తప్పా అని ఒకటికి రెండుసార్లు బేరీజు వేసుకుంది ! కూతురు అలా అత్తవారింటి నుండి చెప్పా పెట్టకుండా వచ్చేయడం, అలా అత్తమామలు అంటే మర్యాద లేకుండా మాట్లాడడం నచ్చలేదు తనకి. తను వర్షకు అదివరలో కూడా చాలా సార్లు చెప్పింది, నోటి దురుసుతనం తగ్గించుకోమని ! తన కూతురంటే తనకి ముద్దే, చాలా గారంగానే పెంచింది వర్షను. అలా అని వర్ష తప్పుగా ప్రవర్తిస్తుంటే, అలా కాదు అని సరిచేయడం తల్లిగా తన బాధ్యత.

' పెళ్లి అయి సంవత్సరం దాటినా, ఎప్పుడు తెలుసుకుంటుంది వర్ష ? తల్లి పెంపకం.. తల్లి నూరిపోస్తోంది.. అని అనుకోరా ? ఇటువంటి చిన్న చిన్న కారణాలతోనే అనేక కుటుంబాలు విఛ్చిన్నమై పోతున్నాయ'ని భ్రమరాంబ ఎప్పుడూ తలపోస్తూ ఉంటుంది!

ఈ విషయం జరిగిన ఒక నెలరోజుల తరువాత.. ఒకరోజు సాయంత్రం అల్లుడు సుధాకర్ నుండి ఫోన్ వచ్చింది భ్రమరాంబకు!

“నమస్కారమండీ అత్తయ్యగారూ! మామయ్యగారూ, మీరు ఎలా ఉన్నారు” అని అడిగాడు.

“బాగానే ఉన్నాం బాబూ! మీ అమ్మగారూ, నాన్నగారు బాగున్నారా ? వర్ష బాగుందా” అంటూ కుశల ప్రశ్నలు వేసింది భ్రమరాంబ.

“ఏం లేదు అత్తయ్యగారూ! రేపు మీరూ, మామయ్యగారూ మా ఇంటికి లంచ్ కు రావాలి. చాలా రోజులైంది మనం కలుసుకుని. అందుకని పిలుస్తున్నాను” అని చెప్పాడు.

“తప్పకుండా వస్తాం సుధాకర్!” అంటూ జవాబిచ్చింది భ్రమరాంబ.

తనే అనుకుంటోంది, ఆరోజు వర్ష ఇక్కడకు వచ్చినపుడు తను కోపంగా వర్షను మందలించిన తరువాత ఏదో ఒకటి రెండుసార్లు మాత్రమే వర్షకు ఫోన్ చేసింది ! అప్పుడే నెలరోజులు దాటిపోయింది.. వియ్యపురాలిని, వియ్యంకుడిని చూసి రావాలనుకుంటున్నారు భ్రమరాంబ దంపతులు ! ఈ లోగా అల్లుడి నుండి ఫోన్ !

మరుసటి రోజు ఉదయాన్నే పదిగంటలకు భ్రమరాంబ ఆవిడ భర్త రాధాకృష్ణ గారు కూతురి ఇంటికి పండ్లూ పూలూ తీసుకుని బయలదేరారు. వీరిని చూస్తూ సాదరంగా ఆహ్వానం పలికారు అందరూ. వర్ష అత్తగారిని, మామగారిని ఎలా ఉన్నారంటూ కుశల ప్రశ్నలు వేసి మాట్లాడారు.

కూతురు కనబడకపోయేసరికి భ్రమరాంబ తన వియ్యపురాలు రాజ్యలక్ష్మిగారితో, ' వర్ష లేదా? అల్లుడూ తనూ బయటకు వెళ్లారా?” అని అడగ్గా, “లేదు. లోపలికి రండి వదినా” అంటూ వంట గదిలోకి తీసుకుని వెళ్లారు ఆవిడ.

పాటియాలా డ్రస్ లో తలంటుపోసుకున్న జుట్టుని క్లిప్ తో బంధించి, హడావుడిగా వంటింట్లో మూకుట్లో గారెలను చిల్లుల గరిటెతో అటూ ఇటూ తిప్పుతున్న కూతురుని, బుగ్గకు అంటుకున్న గారెల పిండితో చూడగానే ఆవిడ ఆశ్చర్యపోయారో క్షణం ! తల్లిని చూడగానే చేస్తున్న పనిని వదిలేయకుండా, ' అమ్మా ఒక్క క్షణం! మా అత్తగారితో మాట్లాడుతూ ఉండు. ఇంకా కొన్ని ఉన్నాయి, అవగానే వస్తానం’టూ.. ‘ఉండు కాఫీ ఇస్తానం’టూ, ఒక వైపు గారెలు వేయిస్తూనే మరోవైపున ఫిల్టర్ లో నుండి కాఫీ డికాషన్ తీసి, పాలు కలిపి వేడిచేసి, రెండు కప్పుల్లోపోసి తల్లిని ఒకటి తీసుకోమని, తండ్రికి కూడా ఇమ్మనమని పురమాయించిన కూతురి వైపు అలాగే చూస్తూ ఉండిపోయింది ఒక క్షణం! వంటింట్లో కూతురొక్కతే అన్నీ చేసేస్తోంది! ఇదెలా సంభవం?

ఆరోజు ‘మా అత్తగారింట్లో గొడ్డు చాకిరీ చేయలేక చస్తున్నాను’ అన్నది ఈరోజు నవ్వుతూ అన్నీ తనే స్వయంగా చేయడం చూస్తుంటే ముచ్చటగా అనిపిస్తోంది ! అందుకనే ఆరోజు కూతురి దృష్టిలో తను శత్రువునైపోయినా ఫరవాలేదు కానీ, తన బంగారు తల్లి అత్తగారింట్లో అందరితో సౌమ్యంగా ఉంటూ వాళ్ల అభిమానాన్ని, ప్రేమనూ చూరగొనాలని భావించింది ఆవిడ !

భోజనాల సమయంలో అందరూ కలసి భోజనాలు చేస్తున్నప్పుడు వర్ష అత్తగారు వర్షను ఒకటే మెచ్చుకోవడం.. వర్ష లాంటి అమ్మాయి తమ ఇంటికి కోడలిగా రావడం తమ అదృష్టమని భ్రమరాంబ దంపతులతో చెపుతున్నప్పుడు భ్రమరాంబగారి ముఖంలో ఎంతో ఆనందం !

కూతురిని అత్తింటివారు మెచ్చుకుని అభిమానిస్తుంటే ఏ తల్లికైనా అంతకంటే ఏం కావాలి ? హృదయం పులకించిపోతుంది !

ఈలోగా సుధాకర్ పెద్ద స్వీట్ బాక్స్ తెచ్చి అందులోనుండి స్వీట్స్ తీసి ఒక్కొక్కరికీ ఇస్తుంటే, వర్ష తండ్రి, “ఏమిటల్లుడూ స్వీట్లు పంచిపెడ్తున్నావు? ఉగ్యోగంలో ప్రమోషన్ గానీ వచ్చిందా ఏమిటం”టూ సరదాగా అడిగిన ప్రశ్నకు..

వర్ష పక్కనే కూర్చుని భోజనం చేస్తున్న సుధాకర్ "అవును మామయ్యగారూ! ప్రమోషనే. మిమ్మల్నందరినీ సర్ ప్రైజ్ చేయాలని నేనూ వర్షా అనుకుని ఈరోజు ఈ గేదరింగ్ ఏర్పాటు చేసాం ! అవును.. నేనూ వర్షా మరో ఏడు నెలల్లో తల్లితండ్రులం కాబోతున్నాం! నిన్ననే డాక్టర్ కన్ ఫర్మ్ చేసింద”ని చెప్పేసరికి అందరి ముఖాల్లో ఆనంద తరంగాలు వెల్లివిరిసాయి . అందరూ ఆ యువజంటకు అభినందనలు తెలియజేశారు.

తలెత్తి భ్రమరాంబగారు కూతురి ముఖంలోకి చూసారు.. తల్లి కాబోతున్న చిహ్నాలతో కొత్త అందాలు సంతరించుకున్న తమ బంగారు తల్లి మరింత అందంగా, ముద్దుగా కనబడుతోంది !

ఈలోగా వర్ష అత్తగారు, “అదేమిటి వర్షా! వంటలో నేను సాయం చేస్తానంటే నన్ను అసలు వంటగదిలోకి అడుగు పెట్టనీయకుండా అంతా నీవే చేసావు? ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కువ అలసిపోకూడదమ్మా!” అంటూ నెమ్మదిగా మందలించారు. ఆవిడ భ్రమరాంబగారితో “వర్షను మీతో తీసుకువెళ్లి కొన్నిరోజులు విశ్రాంతి తీసుకున్నాక పంపండి వదినగారూ! ఇక్కడ పనిచేయద్దన్నా వినకుండా అలా గిరగిరా తిరుగుతూ ఏదో చేస్తూనే ఉంటుంద”ని అన్నారు.

“ఇప్పుడు వెళ్లనత్తయ్యా! నిన్ననే మీరు మామయ్య గారితో చెబుతుండగా విన్నాను, మోకాళ్ల నొప్పులు ఎక్కువ ఉన్నాయని, వంగి ఏమీ చేయలేకపోతున్నానని ! డాక్టర్ కు చూపించుకున్న తరువాత చూస్తాను. ఏం అమ్మా? కొన్నిరోజుల తరువాత వస్తాను, అత్తయ్యగారికి కాస్త తగ్గాక” అనగానే భ్రమరాంబ గారు “నీ ఇష్టం తల్లీ!” అన్నారు.

వర్ష లోని ఈ మార్పు ఆవిడకు చాలా ఆనందంగా ఉంది. ఆరోజు మా అత్తగారింట్లో చాకిరీ చేయలేకపోతున్నానంటూ రుసరుసలాడిన పిల్ల ఇప్పుడు ఎంతో బాధ్యతగా తన ఇంటిని చక్కబెట్టుకుంటున్న తీరుకి ఆవిడ అబ్బురపడుతోంది ! తన కూతురు తన కళ్ల ఎదుటే ఎంతో పరిణితి చెందిన వ్యక్తిగా ఎదగడం ఆవిడకు అమితమైన సంతోషాన్ని కలగచేస్తోంది.. మనసులోనే కూతురిని ఆశీర్వదించింది !!

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనల కొరకు క్లిక్ చేయండి.

రచయిత్రి పరిచయం :

నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీ వారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.


108 views0 comments

Commentaires


bottom of page