'Pasikandu Hrudayam' written by Lakshminageswara rao Velpuri
రచన : లక్ష్మీనాగేశ్వర రావు వేల్పూరి
కరోనా వ్యాధి ప్రబలడం తో కేంద్రప్రభుత్వం 'లాక్డౌన్' విధించుటవల్ల మొత్తం దేశం నిర్మానుష్యం అయిపోయింది.
కుటుంబవ్యవస్థ ఒకటిగా చేరి ఇళ్లలోనే ఉంటూ, సామాజిక బాధ్యత పాటిస్తున్నారు. అందులోనే ఒక చక్కనైన కుటుంబమే చంద్రశేఖర్, పార్వతిలది. ఇద్దరు చిన్న పిల్లలు, అమ్మాయి శరణ్య కి 5ఏళ్ళు, బాబు వంశీకృష్ణ కి 3 ఏళ్ళు. ఎంతో సరదాగా ఎప్పుడూ అల్లరి చేస్తూ అమ్మన్నాన్నల కు తలనొప్పిగా తయారయ్యారు.
ఆ రోజు కూడా శేఖర్ తన 'ఆన్లైన్ వర్క్ ఫ్రాం హోమ్ 'లో ఎంతో బిజీ గా ఉన్నాడు. పార్వతి కూడా పిల్లల్ని తయారు చేసి వారికి కావాల్సిన ఆట వస్తువులు ఇఛ్చి తన వంట పనులలో నిమగ్నమైపోయింది.
తన రూము లోంచి బయటకు వచ్చిన శేఖర్ హాలంతా అట్టముక్కలతో, రంగు కాయితాలతో చిందరవందర చేస్తున్న శరణ్య ని "ఏంటిది, శరణ్యా! శుభ్రంగా ఉన్న ఇల్లంతా పాడుచేస్తున్నావు?” అంటూ పలుమార్లు కోపంగా అరిచేసారికి, గాభరాగా భయంతో కళ్ళనిండా నీళ్ళతో, “ఏమీలేదు, నాన్నగారు! నేను ఒక బాక్సు తయారు చేస్తున్నాను. తమ్ముడు కూడా సాయం చేస్తున్నాడు. రేపు చెప్తాను, అయిన తర్వాత నేను శుభ్రం చేస్తాను. ప్లీస్, ఏమి అనకండి” అంటూ చెప్తున్న కూతురిని చూస్తూ చిరాగ్గా వెళ్ళిపోయాడు శేఖర్.
ఆ రోజంతా అమ్మ, నాన్న ఎంత తిడ్తున్న తన పట్టుదలతో ఒక ' గిఫ్ట్ బాక్స్ ' తయారు చేసి ఎవరికి కనపడకుండా దాచేసింది శరణ్య.
ఆ మర్నాడు శేఖర్ జన్మదినాన్ని చాలా హడావిడిగా చెయ్యలేక పోయారు. లాక్డౌన్ కారణంగా ఎవరు రాలేదు. కానీ ఫ్రెండ్స్, బంధువుల కోరిక మేరకు మొబైల్ లైవ్ లో అంతా రికార్డ్ చేస్తోంది అతని భార్య పార్వతి.
"హ్యాపీ బర్త్ డే శేఖర్" అని రాసి ఉన్న చాకలెట్ కేక్ ని అందంగా అలంకరించి, ముస్తాబైన పిల్లలతో సహా చప్పట్లు కొడుతూ ఆనంద పడుతున్న సమయాన శేఖర్ కేకు కట్ చేసి భార్యకు, పిల్లలకు తినిపించాడు. ఈ దృశ్యాలు లైవ్ లో చూసిన బంధుమిత్రులు చప్పట్లు కొడుతూ 'హ్యాపీ బర్తడే' చెప్పారు.
అదే సమయంలో కూతురు శరణ్య పరుగెత్తుకెళ్లి తను రోజంతా కష్టపడి తయారు చేసిన' గిఫ్ట్ బాక్స్' నాన్నగారి కి ఇఛ్చి "హాపీ బర్త్ డే నాన్నగారు!” అంది.
కూతురు ఇచ్చిన బహుమతి అందుకొని అతృతతో లైవ్ లో అందరూ చూస్తుండగా ఓపెన్ చేసాడు శేఖర్.
బాక్స్ లోకి చూడగానే ఆశ్చర్యంగా “ఏంటిది శరణ్యా! గిఫ్ట్ బాక్స్ ఖాళీ గా ఉంది. లోపల గిఫ్ట్ లేదే?” అని ఆడిగేసరికి శరణ్య నవ్వుతూ “సరిగ్గా చూడండి. నేను, తమ్ముడు మీకోసం ఎన్నో సార్లు ముద్దులు పెట్టాము. ముద్దులు కనపడుతున్నాయా?” అని ఒక్కసారి ఎగిరి శేఖర్ ని ముద్దులతో ముంచేస్తున్న 'పసి హృదయాన్ని'గట్టిగా హత్తుకొంటూ ఆనందభాష్పాలు కార్చారు తల్లితండ్రులు. ఆ సన్నివేశాన్ని లైవ్ లో చూసిన బంధుమిత్రులు కూడా అమితానందం తో శరణ్య తెలివితేటలకు ఆశ్చర్యంతో కరతాళధ్వనులు చేశారు.
****************
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
Comments