top of page

పసుపు పచ్చ మందారం


Pasupu Pacha Mandaram Written By Vissamsetti Sailaja

రచన :విస్సంశెట్టి శైలజ


365 రోజుల్లో అది ఏ ఋతువు అయినా, ఏ నెల అయినా, ఏ వారం అయినా, ఏ రోజు అయినా, వాతావరణం ఎలా ఉన్నా, మిన్ను విరిగి మీద పడినా తన దినచర్య మొదలు పెట్టటంలో మార్పేమీ ఉండదు కదా అనుకుంటూ, తెల్లవారుతూనే కాఫీ పడితే కానీ ప్రాణం నిలవని పతిదేవుని ప్రాణం నిలపటానికా అన్నట్టు వంటింట్లోకి, ఇంటి పనిలోకి జొరపడిన పద్మ రోజూ మాదిరిగానే తాను చేసే మొదటి పని తనకిష్టమైన వంటింటి కిటికీ తలుపు తెరవటం. కిటికీ తెరవగానే తాను పెంచిన రకరకాల మొక్కలు - ఆకో, రెమ్మో, పువ్వో, మొగ్గో తొడిగి ప్రతి రోజుని ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ నిశ్శబ్దంగా తలాడిస్తూ తనని పలకరిస్తున్నాయన్న భావన పద్మకి. రోజులాగే ఉదయం వంటింటి కిటికీ తెరిచిన పద్మకి ఎదురుగా డిసెంబర్ నెలలోని చల్లని మంచుతో కలిసిన చల్లని చిరు గాలులపై వెచ్చ వెచ్చని సూర్యకిరణాల మధ్య అమ్మ మోముపైని నవ్వులా, చల్లగా, హాయిగా, మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా కొత్తగా తెచ్చిపెట్టిన మందార మొక్కకి పూసిన పసుపు మందారం ఠీవిగా తలవూపుతూ చిరునవ్వు చిందిస్తూ కనిపించింది. పద్మకి ఆ మందారాన్ని చూడగానే వాళ్ళ అమ్మ నవ్వు ముఖం గుర్తు రావటానికి వెనుక పెద్ద కథే ఉంది. పద్మ వాళ్ళ అమ్మగారు పార్వతికి పూలమొక్కలంటే ప్రాణం. దానికి తగ్గట్టే ఎప్పుడో కొన్న స్థలంలో ఆరు గదుల ఇల్లు వేసుకోగా ఇంటిముందు రకరకాలా మొక్కలు వేసి వాటి సంరక్షణలో మునిగి తేలుతుండేవారు. నలుగురు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు, పద్నాలుగు మంది మనవలు, మనవరాళ్లుతో కాపురం దిన దిన ప్రవర్ధమానం అవుతుండగా పార్వతి తోటలో నాటిన చెట్లు కూడా అలాగే పెరుగుతున్నాయి. పిల్లలందరికీ కూడా ఆవిడ ఇష్టం తెలియటంతో ఎవరు ఎక్కడకు వెళ్లినా మనుమలు, మనుమరాళ్ళతో సహా రకరకాల పూలమొక్కలు ఆ తోటకి ఆవిడకు బహుమతిగా తెచ్చేవారు.

అలాంటి పార్వతమ్మగారు నిందలేనిదే బొంది పోదు అనే విధంగా నామ మాత్రమైనా రెండు రోజుల జ్వరంతో కాలం చేసి నెల రోజులైంది. విదేశంలో ఉన్న చిన్న కొడుకు తప్ప మిగతా అందరి సమక్షంలో - స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్ అన్న శ్రీ శ్రీ గారి పాటలో వాక్యంలాగ పరిపూర్ణ జీవితం చూసిన పార్వతమ్మగారి అస్థికలు కృష్ణ నదిలో కలిపి రావటం దగ్గరనుంచి సంతోషం దుఃఖం కలగలిసిన సందడితో అన్ని కార్యక్రమాలు పూర్తి చే స్తున్న క్రమంలో పదవరోజు వచ్చే బంధు జనాలందరికి ఆమె జ్ఞాపకార్ధం ఏమి కానుక ఇవ్వాలి అన్న ప్రశ్న తలెత్తటంతో అందరు తలో అభిప్రాయం వెలిబుచ్చారు. భగవద్గీత పుస్తకం అని ఒకరైతే, నిత్య పూజ విధాన పుస్తకం అని ఒకరు, కాదు కాదు అందరి లాగే స్టీల్ గ్లాస్లో, డబ్బానో ఆవిడ పేరు అచ్చు వేయించి అని ఇంకొకరు. ఇలా సంభాషణ కొనసాగుతుంటే పద్మ బుర్రలో తళుక్కున ఒక ఆలోచన మెరిసింది. పద్మ తనకు తట్టిన ఆలోచన చెప్పగానే అందరు ఒక్కసారిగా చప్పట్లు చరుస్తూ తమ హర్షం తెలపటం ఏమిటి అరచేతిలో ప్రపంచాన్ని ఇముడుచుకున్న ఈ తరం పిల్లలైన శిరీషా, భార్గవ్ ఇద్దరు గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఎక్కేసి ఎవరు ఏ రకం మొక్కలు అమ్ముతున్నారో, ఎక్కడ ధరలో నాణ్యత ఉందొ వెతకటం మొదలు పెట్టేసారు. పార్వతమ్మగారి జ్ఞాపకార్థముగా పచ్చని మొక్కలు పంచాలి, అలాగే ఆమెకు ఇష్టమైన మందార మొక్క అని అందరు అంగీకరించటం, ఆర్డర్ ఇవ్వటం అంతా క్షణాలలో జరిగింది.

ఒక రకంగా పిల్లలందరి హృదయాలలో తమ అమ్మమ్మ జ్ఞాపకార్ధం మొక్కలని పంచటమే కాదు పచ్చదనాన్ని పెంచటం కూడా అని ఆలోచన ఆనందాన్ని ఇచ్చింది. ఆ ఆనందాన్ని భగ్నం చేస్తూ అప్పుడు వచ్చింది పద్మ పిన్ని కూతురు ఫోన్ కాల్. పెద్దమ్మ జ్ఞాపకార్ధం కుండీలు, మొక్కలు మట్టి ఏమిటి ఇచ్చేది, అసలు ఇవ్వొచ్చా లేదా ఇంటి పురోహితుడిని అడగకుండా ఎలా నిర్ణయించారు అని స్పీకర్ ఫోన్ లో సంభాషణ అంతా వినిపించటంతో అప్పటికే అన్ని ఏర్పాట్లు చేసిన పిల్లలు బిక్క మొఖాలు వేశారు. అది చూసిన పద్మ ఈ విషయంలో మనం ఎవరితో సలహాలు, సంప్రదింపులు చేయనవసరం లేదు. మనం చేసేది అమ్మ కిష్టమైన పని. అలాగే అమ్మ లాంటి ప్రకృతి పరవశించే పని. కాబట్టి మరి వేరే ఆలోచన వద్దు అని ఖచ్చితంగా చెప్పేసింది. ఆ రోజు పద్మ ఇచ్చిన సలహా, తీసుకున్న నిర్ణయం, ఈ రోజు పద్మ వంటింటి కిటికీలోంచి కనిపించే బాల్కనీలో పచ్చగా, ఏపుగా ఎదిగి మొగ్గేసి పువ్వుగా వికసించి అమ్మలా చల్లగా నవ్వుతూ, పద్మకి అమ్మని, అమ్మ నవ్వుని, అమ్మ జ్ఞాపకాన్ని తట్టి లేపింది ఆ పసుపు పచ్చ మందారం.


గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.

57 views1 comment
bottom of page