top of page

పెద్ద మనిషి


Pedda Manishi written by Koyilada Ram Mohan Rao

రచన : కొయిలాడ రామ్మోహన్ రావు


తలుపుతట్టిన శబ్దం వినగానే, తలుపు తీసి, ఎదురుగా నిలబడి ఉన్న ఆదర్శ్ నిచూసి ఆశ్చర్యపోయాడు, హర్ష. ఆదర్శ్ అతని కొలీగ్. దూరపు బంధువు కూడా.

ఎప్పుడోగానీ అతనికి, హర్ష ఇంటికి వచ్చే అవసరముండదు. హర్ష యే అతన్ని కలుస్తూ

ఉంటాడు. అతనంటే హర్ష కి విపరీతమైన ఆరాధన. అతనికున్న నాలెడ్జ్ ఎవరికో గాని

ఉండదని, హర్ష అభిప్రాయం. ఆఫీసు విషయాల్లోగాని, జనరల్ నాలెడ్జ్ విషయంలో గానీ,

అతనికి అతనే సాటి అనే హర్ష గట్టినమ్మకం. అందుకే స్వంత విషయాల్లో కూడా అతని

సలహా లేనిదే, హర్ష ఏ పనీ చెయ్యడు. హర్ష తండ్రి గంగాధరం. అతనికి ఆదర్శ్ అంటే

నచ్చదు. హర్ష అతని సలహాలు తీసుకోవడమూ నచ్చదు.

“ఏమంటున్నాడు మీ అనాదర్శ్?” అంటూ వెక్కిరిస్తూ ఉంటాడు. అతనికి ఆదర్శ్ నచ్చక

పోవడానికి ఒక బలమైన కారణం ఉంది. ఎందువల్లనో, ఆదర్శ్ తండ్రిని తన దగ్గర

ఉంచుకొని, తల్లిని మాత్రం ముంబై లో ఉన్న తమ్ముడి దగ్గర ఉంచాడు. డబ్బు కి కక్కుర్తి

పడి అలాచేసాడనో, లేదా ఇద్దరన్నదమ్ముల ఇళ్ళలోనూ, భార్యాభర్త లు

ఉద్యోగస్తులైనoదున, పిల్లలను చూసుకోవడానికి, తల్లి తండ్రులను విడదీసి

ఉపయోగించుకుంటున్నారనో గంగాధరం అభియోగం.

“ ఛ.. ఆయన అంత స్వార్ధపరుడు కాదు. ఏదో కారణం ఉండే ఉంటుంది. అనవసరంగా నిందలు వేయకండి” అంటూ ఉంటాడు హర్ష. అయితే, కారణమేమిటి? అని,చనువు తీసుకొని

ఆదర్శ్ ని ఎప్పుడూ అడిగేవాడు కాదు. ఈ విషయంలో, ఆదర్శ్ బంధువులూ, కొలీగ్స్

..ఇలా చాలామంది, ఆదర్శ్ వెనుక కామెంట్లు చేయడం చాలా సార్లు విన్నాడు హర్ష. అలా

విన్నప్పుడల్లా, ‘తండ్రి వాదనే కరక్టా!!’ అనే అనుమానం వచ్చేది హర్షకి.

ఆదర్శ్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ “ ఏమిటి సార్ ఈ టైం లో ...ఇలా?” అని

అడుగుతూ ఉంటే, “ పద అలా బయటకు వెళ్లి మాట్లాడుకుందాం” అని అన్నాడు.

వెంటనే అతన్ని అనుసరించాడు హర్ష. కాసేపు నడిచి, ఒక హోటల్ లో సెటిల్

అయ్యారిద్దరూ.

“ నాకో సమస్య వచ్చింది. నీ సహాయం కావాలి” అన్నాడు ఆదర్శ్ మెల్లగా.

“ నా సహాయమా ...? భలేగా ఉందే?....నాకు ఇలాంటి అవకాశాలు కూడా వస్తుoటాయా?

చెప్పండి, చెప్పండి” అంటూ కుతూహలంగా అడిగాడు హర్ష.

“మా అమ్మాయి ‘శ్వేత’ పెద్దమనిషి అయ్యింది. ఆ కబురు వినగానే మా అమ్మ మహా

ఆనంద పడిపోయింది. రేపే బయల్దేరి వైజాగ్ వచ్చేస్తుంది. పెద్ద ఫంక్షన్ గ్రాండ్ గా

చెయ్యాలట. నాకిష్టం లేదని చెప్పినా ఒప్పుకోవడం లేదు. ఆ ఫంక్షన్ ఏమిటో, అదెలా

చెయ్యాలో, దానికేమేమి కావాలో నాకు తెలియదు. మా ఆవిడకు కూడా ఇలాంటివేమీ

తెలియదు. పైగా ఇదే టైమ్ లో మా సెక్షన్ లోనే ఇన్స్పెక్షన్. ఏం చెయ్యాలో

తెలియక,నాకు కాలు చెయ్యి ఆడటం లేదు” అన్నాడు.

“ ఓస్... ఇంతేగా? మీరేమీ వర్రీ అవకండి. ఇలాంటి ఫంక్షన్లు మేము చాలా ఆర్గనైజ్

చేసాము. క్రితం ఏడాది మా పాప ఫంక్షన్ చేసానుగా? బోల్డంత అనుభవం ఉంది. పైగా

మా సెక్షన్ లో ఇన్స్ పెక్షన్, క్రితం వారమే అయిపోయింది కాబట్టి, నేను ఫ్రీయే” అంటూ

అభయం ఇవ్వగానే ఎంతో రిలీఫ్ ఫీలయ్యాడు ఆదర్శ్.

“అది సరే.బోల్డంత ఖర్చు పెట్టి, ఆ ఫంక్షన్, ఒక పెళ్లి లా గ్రాండ్ గా చేసావు కదా?

ఎందుకంటావు?” అన్నాడు.

“ అందరూ చేస్తున్నారుగా? అలాగే నేనూ చేసాను” అంటూ తప్పించుకోజూసాడు.

ఆదర్శ్ వదలకుండా మరో ప్రశ్న వేసాడు. “ అసలు మన పెద్దలు ఈ ఫంక్షన్ ఎందుకు

పెట్టారంటావు?” అని.

“ ఏముంది? ‘మా అమ్మాయి పెళ్ళికి రెడీ అయ్యింది’ అని అందరికీ తెలియజేయడానికి కావచ్చు” అన్నాడు హర్ష.

“ కరెక్ట్..ఆ రోజుల్లో అమ్మాయి రజస్వల అయిన వెంటనే పెళ్లి చేసేవారు. అందుకు ఆ పబ్లిసిటీ అవసరం. కానీ ఇప్పుడు రజస్వల అయిన పది,పదిహేనేళ్ళకు గానీ పెళ్లి చేయటం లేదు. ఇంత ఎర్లీగా అంత ఖర్చుతో పబ్లిసిటీ అవసరమా?” అని అడిగితే సమాధానం చెప్పలేక, తల గోక్కున్నాడు హర్ష.

“చెప్తా విను. ఆడపిల్ల తండ్రికి పెళ్ళయిన తర్వాత చాలా కాలం తర్వాత వరకూ అంత పెద్ద ఫంక్షన్ చేసే అవకాశాలు రావు సాధారణంగా. ఆ అవకాశం ఈ ఫంక్షన్ రూపంలోనే వస్తుంది. మరి ఈ అవకాశం రావడానికి కనీసం పదమూడు,పద్నాలుగు ఏళ్ళు పడుతుంది. ఈ కాల వ్యవధిలో ఆడపిల్ల తండ్రి ఎంతో కొంత సంపాదించి, తన స్థాయిని పెంచుకుంటాడు. ఆ స్థాయి అందరికీ తెలియాలంటే, ఇదే అవకాశం మరి. కాదంటావా?” అని అడిగితే, తలవూపి, “ పాపం అలా కూడగట్టలేని వాళ్ళు ఫాల్స్ ప్రిస్టేజ్ తో గొప్పలకు పోయి, అప్పుల పాలవుతున్నారు” అని బాధగా అన్నాడు హర్ష.

*****

ఆదర్శ్ తల్లి, విశాలాక్షి రాగానే, హర్షను పిలిపించి పరిచయం చేసాడు.

వాళ్ళిద్దరూ ఎంతో ఉత్సాహంగా ఫంక్షన్ గురించి చర్చించుకుంటుంటే, పెద్ద బరువు

తీరినట్లు ఫీలయ్యాడు ఆదర్శ్. ఇచ్చిన మాటను నిలుపుకుంటూ, హర్ష పనిలో

నిమగ్నమైపోయాడు. ఆ పని కారణంగా ఇంట్లో ఆదర్శ్ ఉన్నా లేకపోయినా విశాలాక్షిని

కలుస్తుండేవాడు. ఒక రోజు ఇంటి తలుపు తట్టబోతూ, ఇంట్లోంచి పెద్ద కేకలు

వినబడేసరికి ఆగిపోయాడు. విశాలాక్షి పెద్ద గొంతుతో భర్త, రామ్మూర్తి తో గొడవపడుతూ, “

అందుకే నేనిక్కడకు రాను. రెండ్రోజులయ్యిందో లేదో నరకం చూపిస్తున్నారు. ఫంక్షన్

అయ్యేవరకూ ఈ రాక్షసుడి తో ఎలా వేగాలిరా దేవుడా !” అంటూ ఏడుపు

లంకించుకుంది. హర్ష కు ఏమి చెయ్యాలో తెలియక అక్కడే నిలబడిపోయాడు. వెనుక

ఎవరో ఉన్నట్లు గ్రహించి, వెనక్కి తిరిగి గతుక్కుమన్నాడు. నాలుగైదు అడుగుల దూరంలో ఆదర్శ్ నిలబడి ఉన్నాడక్కడ. ఆ పరిస్థితిలో అతన్ని అక్కడ కలవడం హర్ష కి చాలా ఎoబరాసింగ్ గా ఉంది.

“ ఈ గొడవ ఇప్పట్లో తేలదు. పద అలా పార్కుకి వెళ్లి మాట్లాడుకుందాము” అంటూ

ముందుకి నడిచాడు.

పార్కులోకి వెళ్లి కూర్చున్నాక మొదలు పెట్టాడు. “మా అమ్మను,

నాన్నను వేరుచేసి స్వార్ధంగా వ్యవహరిస్తున్నామని నా గురించి, మా తమ్ముడు గురించి

చాలా మంది చాలా రకాలుగా అనుకుంటున్నారు. కానీ దానికి కారణమేమిటో ఎవరికీ తెలియదు. నీకు ఈరోజు చెప్పాలనిపించింది. నాకు ఇరవై ఏళ్ల వయసు వచ్చే వరకూ, మా అమ్మా, నాన్నా ఎంతో చక్కగా కాపురం చేసారు. ఆ తర్వాతే వాళ్ళ మధ్య గొడవలు ప్రార౦భమయ్యాయి. అప్పటినుంచి ఇద్దరూ బద్ధ శత్రువులుగా మారారు. వారి మధ్య శత్రుత్వానికి బలమైన కారణాలున్నాయి.

వయస్సు తెచ్చిన విజ్ఞతతో మూర్ఖత్వాన్ని వదలి ఒకరినొకరు క్షమించి, మళ్ళీ

కలసి పోవచ్చును. ఉహూ... ఆ చాన్సే లేకుండా పోయింది” అని నిరాశగా అంటున్న

ఆదర్శ్ చూసి “అబ్బ...! అసలు విషయం చెప్పడే...? సస్పెన్స్ తో చస్తున్నాను’

అనుకున్నాడు హర్ష.

“ఒకసారి అమ్మ తన స్నేహితురాళ్ళతో ఉత్తరాదికి బస్సులో యాత్రలకు బయల్దేరింది.

ఢిల్లీ లో బస్సు దిగబోతుండగా కాలుజారి పడింది. దాంతో కాలు ఫ్రేక్చ్ర ర్ అయింది.

ఇంకా జమ్మూ, శ్రీనగర్ యాత్ర మిగిలి ఉంది. అమ్మను ఏంచేయాలో తెలియని పరిస్థితి.

ఆ రోజుల్లో టెలిఫోన్ సౌకర్యం చాలా తక్కువ కాబట్టి, నాన్నకు కబురు తెలిసేసరికే చాలా

లేటు అయ్యింది. నాన్నకు ఫ్లైట్ లో ట్రావెల్ చేసే స్తోమత లేదు కాబట్టి, ఆయన ఢిల్లీ కి

రావడానికి కనీసం మరో రెండ్రోజులు పడుతుంది. ‘అన్ని రోజులు అమ్మను

ఎక్కడుంచాలి? తోడు ఎవరుంటారు?’ ఇలాంటి ప్రశ్నలతో తోటి ప్రయాణికులు

కిందామీదా పడ్డారు. అమ్మకు సమీప బంధువు కృష్ణారావు అంకుల్ ఢిల్లీ లోనే ఉన్నారని

ఎవరికో స్ఫురించడంతో, అందరూ ఆయన దగ్గర అమ్మను వదిలేద్దామని

నిర్ణయించుకొని, అది అమలు చేసి నాన్నకు కబురు అందించారు. నాన్న నాలుగు రోజుల

తర్వాతగానీ ఢిల్లీ వెళ్ళలేకపోయారు. ఢిల్లీ వచ్చాక క్షేమంగా ఉన్న అమ్మను చూసి,

ఆనందపడి, కృష్ణారావు అంకుల్ కి ఎన్నో విధాల కృతజ్ఞతలు చెప్పారు. అలా

ప్రవర్తించారు గానీ, అప్పటికే కొన్ని కారణాలవల్ల ఆయన మనసు కలుషితమైపోయింది

కృష్ణారావు అంకుల్, అమ్మకు మేనబావ. అమ్మను చేసుకోవాలని ఆ రోజుల్లో చాలా

ప్రయత్నించాడట. అమ్మ కూడా అందుకు ఇష్టపడినా,ధనికులైన అంకుల్ పేరెంట్స్

ఒప్పుకోకపోవడంతో వాళ్ళ పెళ్లి జరగలేదట. ఈ విషయం చాన్నాళ్ళ వరకూ మా నాన్నకు

తెలియదు. అమ్మను తీసుకురావడానికి ఢిల్లీ కి బయలేదేరినపుడు మా బంధువొకడు ఈ

విషయం చెవిలో ఊదేసరికి, నాన్న మనసులో విషబీజం నాటుకుంది. ఇరవై ఏళ్లకు పైగా

తనతో కాపురం చేసిన భార్య మీద మొట్టమొదటి సారిగా ఆయనకు అనుమానం

వచ్చింది. ఆ అనుమానం బలపడడానికి, మరో కారణం తోడయింది. నాన్న, అంకుల్

ఇంటికెళ్ళేసరికి అతని భార్య ఇంట్లో లేదు. చాలాకాలంగా వాళ్లు విడివిడిగా

ఉంటున్నారని, నాన్నకు తెలిసింది. అంకుల్ ఇంట్లో కేవలం అమ్మా, అంకుల్

నాలుగైదు రోజులు ఉన్నారన్న విషయాన్ని నాన్న జీర్ణిoచుకోలేకపోయారు. ఇంటికి తిరిగి

వచ్చేవరకూ తన భావాలేవీ పైకి వ్యక్త పరచలేదు. ఇంటికొచ్చాక, బయటపడిపోయారు.

విషయం తెలుసుకున్న అమ్మ షాక్ తింది. ‘ఇన్నాళ్ళూ తనతో కాపురం చేసి, నన్ను

ఇంతేనా అర్ధం చేసుకున్నది? కాలు విరిగి నేను బాధ పడుతుంటే, ఈ కళంకం

అంటగట్టడానికి మనసెలా ఒప్పింది ’ అని గిజ గిజ లాడింది. అలాంటి అభాండాలు

వెయ్యడానికి నోరెలావచ్చిందని తిట్టి పోసింది. మిగిన ఆడవాళ్ళలా ఏడుస్తూ

కూర్చోలేదు. ఘాటుగానే సమాధానం ఇచ్చింది. దాంతో నాన్న పిచ్చికోపం తో

రగిలిపోయారు.

“ వాడు పక్కా తిరుగుబోతు అయి ఉంటాడు. అందుకే వాడి పెళ్ళాం వాడిని వదిలేసింది.

నాలుగు రోజులు వాడితో హాయిగా కులికి, ఇప్పుడు తప్పేమీ లేదని తిరగబడతావా?”

అనేసాడు ఆ కోపంలో. అది అమ్మను గట్టి దెబ్బే కొట్టింది. అంతవరకూ ధైర్యంగా

నిలబడిన అమ్మ, ఏడుస్తూ కూర్చుండి పోయింది. అప్పుడు నాన్నకు తన తొందరపాటు

తెలిసొచ్చింది. అయినా ఒక మెట్టు దిగడానికి అహం అడ్డొచ్చింది. అప్పుడు ఈ

విషయాలేవీ మాకు తెలియదు. కానీ ఢిల్లీ నుంచి వచ్చినప్పటినుంచి అమ్మ,నాన్నా

ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారని తెలుసు. కారణమేమిటో నాన్నను అడిగే

ధైర్యం లేదు. అమ్మనడిగితే ఏడుస్తుందే తప్ప సమాధానం ఇచ్చేదికాదు. దిగులుతో

అమ్మ నెల రోజులపాటూ అలాగే ఉండిపోయింది. అయితే ఆ తర్వాత ఒక్క సారిగా తన

ప్రత్యర్ధి అయిన నాన్న మీద బాణం సంధించింది. కోలుకోలేని దెబ్బకొట్టింది. ఆ నెల

రోజులూ అమ్మ చేతగానిదానిలా కూర్చోలేదు. నాన్న మీద నిఘా పెట్టింది. చాలా

ఏళ్లనుంచి ప్రతినెలా నాన్న, తన స్నేహితులను కలవడానికి అమలాపురం వెళ్లివస్తూ

ఉండేవారు. నాన్న మీద అమ్మకున్న నమ్మకం వల్ల ఆమె ఆ విషయాన్ని ఎప్పుడూ

సీరియస్ గా తీసుకోలేదు. ఇప్పుడు తీసుకుంది. ‘స్నేహితులను కలవడానికి ఎప్పుడూ

ఈయనే వెళ్తున్నారు, వాళ్లెప్పుడూ ఇక్కడికి రారేం?’ అన్న కోణంలో ఆలోచించి ఆ దిశగా

ఎన్నో వివరాలను సంపాదించింది. దాంతో నాన్న దొరికిపోయారు. నాన్నకు కూడా

పెళ్ళికి ముందొక ప్రేమ వ్యవహారం ఉందట. అరుంధతి అనే ఒక యువతిని నాన్న గాఢoగా ప్రేమించారట. మా తాతగారు ఒప్పుకోపోయేసరికి, తప్పనిసరి పరిస్థితిలో అమ్మ మెడలో తాళి కట్టారట. అరుంధతికి కూడా ఆ తర్వాత పెళ్లి అయిపోయినా,పెళ్లి అయిన పదేళ్ళకే భర్త చనిపోయాడట. దాంతో ఆమెను ఆదుకున్నారట. అందుకే ప్రతినెలా వెళ్లి చూసి వస్తూ ఉండేవారట. ఈ విషయాలన్నీ తెలుసుకున్న మీదట అమ్మ, నాన్న మీద ధ్వజమెత్తింది. నాన్న ఆ విషయాన్ని ఒప్పుకుంటూ ‘తమది స్నేహమేనని, కేవలం స్నేహితురాలన్న సానుభూతితోనే ఆమెను ఆదుకున్నానని,అటువంటి రంగు పులమవద్దని’ వాదించారట. ఆ మాటలు నమ్మేసేట౦త అమాయకురాలు కాదు అమ్మ.

ఇప్పుడిక ఆమెకు ఆయుధం దొరికింది కాబట్టి ఆమెకూడా తిరగబడుతూనే ఉంది. అమ్మా,

నాన్నా మంచి వాళ్ళే, వాళ్ళ కేరక్టర్ ని సందేహించే చాన్సే లేదు. మరి ఎందుకలా

జరిగిందో? నిజమేమిటో? తెలియకుండా ఉంది.

మేము కాస్త సెటిల్ అయ్యేవరకూ ఇద్దరూ ఏదోలాగ సర్దుకున్నారు. ఆ తర్వాత

కలిసుండడానికి ఇష్టపడలేదు. అరుంధతి కొడుక్కి ఇక్కడ ఉద్యోగం రావడంతో ఆమె

అమలాపురం వదిలి, వైజాగ్ వచ్చేయడంతో, నాన్న నాదగ్గర ఉండిపోవడానికి

ఇష్టపడ్డారు. అమ్మ తమ్ముడి దగ్గరకు వెళ్ళిపోయింది. ఇదీ విషయం అని నలుగురికి ఏం

చెప్తాం? అందుకే నింద నా మీద పడుతున్నా సహించి ఊరుకుంటున్నాను.

చాన్నాళ్ళ తర్వాతే నాకూ, మాతమ్ముడు శరత్ కి ఈ విషయాలు తెలిసాయి.

అప్పుడు వాళ్ళిద్దరినీ కలపాలనుకున్నా అప్పటికే దారులన్నే మూసుకు పోయాయి”

అంటూ ముగించాడు ఆదర్శ్.

హర్ష గట్టిగా నిట్టూర్చి, “ దారులన్నీ మూసుకు పోయాయని నేననుకోను. ప్రయత్నిస్తే

ప్రయోజనం ఉండొచ్చు. ఇది నా ఊహ మాత్రమే. ఎంతవరకూ నెరవేరుతుందో చూద్దాం”

అన్నాడు హర్ష ఆశాజనకంగా. ఆదర్శ్ ఏమీ అనలేదు. అది ఎంతవరకూ సాధ్యమోననే

ఆలోచనలో పడ్డాడు.

*****

ఇంటికెళ్ళాక హర్ష ఆదర్శ్ గురించే దీర్ఘంగా ఆలోచించాడు. అంతా విన్న మీదట

ఆదర్శ్ మీద అభిమానం అతనికి మరింత పెరిగింది. ‘అతను నాకెన్నో ఉపకారాలు

చేసాడు. అతని తల్లిదండ్రులను ఎలాగైనా కలిపి ప్రత్యుపకారం చేయాలి. ఆదర్శ్ మీద

పడ్డ నిందలన్నీ తొలగించాలి’ అనుకున్నాడు.

గతంలో ఆదర్శ్ తండ్రి రామ్మూర్తిని చూస్తే చాలా బాధపడేవాడు హర్ష. తన బట్టలు

తనే ఇస్త్రీ చేసుకోవడం, కుట్లు ఊడిపోతే, తనే స్వయంగా సూది దారంతో కుట్టుకోవడం,

కోడలు కూడా ఉద్యోగానికి వెళ్ళడం వల్ల కాఫీ, టీ లు తనే పెట్టుకోవడం చూసి

జాలిపడేవాడు. ‘అయ్యో భార్య బతికి ఉండి కూడా ఈ వయస్సులో ఈయనకు ఇన్ని

కష్టాలా?’ అనుకునేవాడు. ఇప్పుడా జాలి దూది పింజలా ఎగిరిపోయింది. ‘తనలో తప్పు

పెట్టుకొని, ఎంతో కాలం తనతో కాపురం చేసిన భార్యను అనుమానిoచాడే? ఈయనేం

పెద్దమనిషి?’ అనుకున్నాడు. విశాలాక్షి ని కూడా వదిలి పెట్టలేదు. ‘స్త్రీ కి సహనం

ముఖ్యం. అది ఈమెలో లోపించింది. భర్త తప్పుచేసాడనుకున్నా, సమస్యను సామరస్యం

తో సర్దుకోవాలి గాని, ఇలా పంతం పట్టుకొని కూర్చుంటే, నలుగురూ కొడుకులను

తప్పుపట్టరా? వాళ్ళను దోషులుగా నిలబెట్టే అధికారం ఈమెకు ఎవరిచ్చారు? ఈవిడేమి

పెద్దమనిషి?’ అనుకున్నాడు బాధగా.

తన వల్లే రామ్మూర్తి, విశాలాక్షిల మధ్య గొడవలు వచ్చాయని గ్రహించిన

అరుంధతి మనస్తాపం చెంది,, చెన్నై లో ఉన్న కూతురి ఇంటికి వెళ్ళిపోయిందని,

ఆదర్శ్ ద్వారా తెలుసుకున్నాక, హర్షకు ఆమెపై సదభిప్రాయం కలిగింది. చెన్నై వెళ్లి

ఆమెను కలిసాడు. ‘రామ్మూర్తి, ఆమెను ఒకప్పుడు గాఢoగా ప్రేమించినప్పటికీ,

విశాలాక్షితో పెళ్ళయిన తర్వాత, తననెప్పుడూ ఆ భావంతో చూడలేదని, ఒక

స్నేహితురాలిగానే ఆదరించాడని, శరత్ తో తనకూతురి పెళ్ళిచేసి తనతో సంబంధం

కలుపుకోవాలని ఆశపడేవాడని, కానీ శరత్ లవ్ మేరేజ్ చేసుకోవడం వల్ల అతని

ఆశతీరలేదని, ఈ విషయం శరత్ కి కూడా తెలుసని’ ఆమె చెప్పగా విని

ఆశ్చర్యపోయాడు. దాంతో రామ్మూర్తి తప్పేమీలేదని అర్ధమయింది. సగం సమస్య

పరిష్కరించబడిoదని ఆనందపడ్డాడు. ఇక మిగిలింది విశాలాక్షి సమస్య. కృష్ణారావు

కేరెక్టర్ ఎలాంటిదో తెలుసుకోవాలనుకున్న హర్షకి ఢిల్లీ దాకా వెళ్ళాల్సిన అవసరం

రాలేదు. విశాలాక్షి బంధువులంతా వైజాగ్ లొనే ఉన్నారు. వాళ్ళలో చాలామంది హర్షకు

కూడా తెలుసు. వాళ్ళను కలిసాక సమస్యకు సొల్యూషన్ దొరికింది. కృష్ణారావు సంసార

సుఖానికి పనికిరానివాడని, అందువల్లే అతని భార్య అతన్ని వదిలి వెళ్ళిపోయిందని

తెలిసింది. రామ్మూర్తి ఎంత తొందరపడి, భార్యకు, అతనికి అక్రమ సంబంధం

అంటగట్టి, జీవితాన్ని నరకం చేసుకున్నాడని బాధపడ్డాడు హర్ష.

సమస్యలన్నీ పరిష్కరించబడటంతో, రామ్మూర్తిని, విశాలాక్షిని కలిపి, ఆదర్శ్

ముఖంలో ఆనందం చూడాలనే ఉత్సాహంతో ముందుకు కదిలాడు. ‘అంత

వయసొచ్చినా విచక్షణా జ్ఞానం కోల్పోయిన, నా తల్లి తండ్రులు కాదు పెద్దమనుషులు.

వారి కన్నా, నా కన్నా చిన్న వాడివయినా, ఎంతో చాకచక్యంతో, సమస్యను పరిష్కరించి

మా జీవితంలో వెలుగు నింపిన నువ్వు మాత్రమే నిజమైన పెద్దమనిషివి’ అనే

ప్రశంసను ఆదర్శ్ దగ్గరినుంచి అందుకోబోతున్నాడనే విషయం అతనికింకా తెలియదు.

(సమాప్తం)


గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.



రచయిత పరిచయం : పేరు.. కొయిలాడ రామ్మోహన్ రావు, Retd. HOD Chemistry, A.M.A.L. College, Anakapalle.

వయస్సు..67

రచనలు చేయడం : 2015 నుంచి

బహుమతులు, అవార్డులు:

స్వాతి కథల పోటీలో 10000 రూ.

సుకథ కథల పోటీలో మొదటి బహుమతి 15000 రూ.

రమ్యభారతి చిన్న కథల పోటీలో ప్రధమ బహుమతి

6 తృతీయ, ప్రోత్సాహక బహుమతులు

ఇప్పటివరకూ పబ్లిష్ అయినవి, 38 కథలు, ఒక నవల. 8 పర్యాటక వ్యాసాలు.

ఈనాడు ఆదివారం అనుబంధo లో ప్రచురించిన పనికిరాని వాడు, గొప్పవాడు కథలు పెద్దల ప్రశంసలకు నోచుకున్నాయి. ఈ రోజు కథ ఏజీ ఆఫీస్ హైదరాబాద్ వారు నిర్వహించిన రంజనీ బహుమతిని పొందింది.

హాబీలు: డ్రాయింగ్, పెయింటింగ్, ఫోటోగ్రఫీ, గార్డెనింగ్, ట్రావెలింగ్ etc.


262 views2 comments
bottom of page