'Pelli Kothalu' New Telugu Story Written By Buddhavarapu Kameswara Rao
'పెళ్లి కోతలు' తెలుగు కథ
రచన: బుద్ధవరపు కామేశ్వరరావు
పెళ్లి జనంతో కిటకిటలాడుతున్న ఆ ఫంక్షన్ హాలులో, చివర్లో ఉన్న ఓ కుర్చీలో బిక్కు బిక్కుమంటూ కూర్చున్నాడు పాతికేళ్ల రమేష్.
"ఏం బాబూ ఒక్కడివే వచ్చావా పెళ్లికి" అంటూ రమేష్ ను అడిగాడు, తెల్లటి లాల్చీ, పైజామా, నెరిసిన ఉంగరాల జుట్టు, పెద్ద పెద్ద మీసాలుతో ఉన్న ఓ ఎనభై ఏళ్ల పెద్దాయన, అతని పక్కనే
కూర్చుంటూ.
"లేదు తాతగారూ, ఈ పెళ్లికూతురు తాత, మా తాత స్నేహితులు. అందుకే మా తాతకు తోడుగా
వచ్చాను. మా తాత పెళ్లి కూతురిని ఆశీర్వదించడానికి వెళ్లాడు. "
"అలాగా? ఔనూ.. నువ్వు అల్లం అప్పారావు గారి మనవడివా?" ఆసక్తి గా అడిగాడు ఆ మీసాలతాత.
"కాదండీ, బెల్లం బాబూరావు గారి మనవడిని" చెప్పాడు రమేష్.
"అదీ కధ, ఆ మొహం రంగు చూడగానే తెలిసిపోతోంది నువ్వు బెల్లం వారి వంశీకుడవని. మా
చిన్నతనంలో మీ ముత్తాతగారి గురించి కధలు కధలుగా చెప్పుకొనేవారు. అలాంటి జమిందారీ
వంశం మీది" చెప్పాడు మీసాలతాత.
"ఔనా ? మీరు చెప్పేవరకూ నాకు ఈ విషయమే తెలియదు తాతగారూ!" అన్నాడు రమేష్.
"కొందరు అంతే బాబూ ! తమ గొప్పలు తాము చెప్పుకోరు. ఔనూ.. మీ నాన్నా వాళ్ళ మేనత్త, అంటే మీ ముత్తాత కూతురు పెళ్లి వేడుకలు గురించి ఎప్పుడైనా విన్నావా?" అడిగాడు మీసాలతాత.
"వినలేదు తాతగారూ! అంత గొప్పగా చేసారా ఆ పెళ్లి?" ఆశ్చర్యంగా అడిగాడు రమేష్.
"ఔను బాబూ, ఆ పెళ్లితో పోలిస్తే ఇప్పటి పెళ్లిళ్లు అన్నీ ఊకలో ఈకతో సమానం. నా చిన్నతనంలో, ఐదు రోజులు పాటు జరిగిన ఆ పెళ్లిని నా కళ్లారా చూసా. ఆ సంగతులు చెబుతా విను" అని చెప్పడం మొదలెట్టాడు మీసాలతాత.
***** ***** ***** *****
"చూడు బాబూ, నీకు అర్ధమయ్యే విధంగా చెప్పాలంటే, ఇప్పుడు మనం ఉన్న ఈ కాకినాడే
ఉదాహరణగా తీసుకుంటే, జగన్నాధపురం వంతెన నుంచి మెయిన్ రోడ్డు మీదుగా గోల్డ్ మార్కెట్,
పట్నాల చిట్టెయ్య షాప్, సిటీ ఎంపోరియం మీదుగా మసీదు జంక్షన్ వరకూ.. ఏమిటని
అడగవేం ?" గట్టిగా అడిగాడు మీసాలతాత.
"మీరు చెప్పిన దూరం సుమారు రెండు కిలోమీటర్లు ఉంటుంది. ఇంతకీ ఏంటది తాతగారూ?"
ఆతృతగా అడిగాడు రమేష్.
"గాడిపొయ్యి బాబూ! గాడిపొయ్యి. ఆ ఊర్లో అంత పెద్ద పొయ్యి తవ్వించాడు మీ ముత్తాత. ఎందుకంటే పెళ్లి వారూ, వచ్చిన బంధువులు అలాగే ఊరిజనం కలిపి మొత్తం ఓ ఇరవైవేల మందికి ఐదు రోజుల పాటు మూడు పూట్లా కాఫీలు, అల్పాహారాలు, భోజనాలు ఏర్పాటు చేయాలంటే ఆ మాత్రం పొయ్యి ఉండాలిగా?"
"ఔను, తాతగారూ! ఉండాలి" అంటూ తప్పదన్నట్లు చెప్పాడు రమేష్.
ఈ లోగా ఒక ట్రేలో లెమన్ జ్యూస్ గ్లాసులతో వచ్చాడు కేటరింగ్ అబ్బాయి. చెరో గ్లాసు తీసుకున్నారు మీసాలతాత, రమేష్.
నిమ్మరసం తాగుతూ మళ్లీ మొదలెట్టాడు మీసాలతాత.
"ఇంకో విషయం జ్ఞాపకం వచ్చింది బాబూ! రెండో రోజు పెళ్లి ఏర్పాట్లులో ఉన్న మీ ముత్తాత దగ్గరకు వచ్చిన ఓ జీతగాడు,
"అయ్యా ! ఆ వడ్లమూరు షావుకారు దగా చేసాడయ్యా!" అని బిక్కుబిక్కుమంటూ చెప్పాడు.
"బిక్కు బిక్కు తర్వాత పడుదువు గాని, ముందు ఏమయ్యిందో చెప్పిచావు" అన్నాడు పెద్దాయన.
"అయ్యా! మనం నాలుగు పడవల నిమ్మకాయలు పంపమంటే, రెండు పడవలే పంపేడయ్యా!"
బిక్కమొహం వేసుకొని చెప్పాడు జీతగాడు.
"ఆ ! దరిద్రుడు అలా చేసాడా ? అవి ఏ మూలకు సరిపోతాయి? సరే ఏం చేస్తాం. అవి మన కొట్టంలో దింపి తగలడండి. రేపు ఉదయం ఉప్మాలోకి పిండుకోవడానికి ఉపయోగపడతాయి" అని చెప్పి పంపించాడు మీ ముత్తాత" అని ముగించాడు మీసాలతాత, మీసాలకు అంటుకున్న నిమ్మరసం తుడుచుకుంటూ.
"తాతగారూ! రెండు పడవలు అంటే ఈ రోజుల్లో రెండు లారీల కింద లెక్క. కేవలం ఉప్మా కోసం.."
అడగబోతున్న రమేష్ తో, "మరి ఇరవైవేల మందికి.. " చెప్పబోతున్న మీసాలతాతతో..
"ఔనౌను, తాతగారూ! ఉండాలి, ఉండాలి" అంటూ తప్పదన్నట్లు చెప్పాడు రమేష్, ఏమిటి నాకీ
కోతల కూతలు అని మనసులో అనుకుంటూ.
ఈలోగా ఎవరో, "పక్కనే ఉన్న గుడికి వెళ్తే ప్రసాదంగా ఇచ్చారు" అంటూ కొంచెం పులిహోర
మీసాలతాత, రమేష్ చేతుల్లో వేసారు. అది తింటూ మళ్లీ మొదలెట్టాడు మీసాలతాత.
"ఆ, ఇంకోటి జ్ఞాపకం వచ్చింది బాబూ ! ఆ పెళ్లి మూడో రోజున పనులు పురమాయిస్తున్న మీ ముత్తాత దగ్గరకు వచ్చిన పాలేరు, 'అయ్యగారూ, మన సామానులు గదిలోంచి ఓ డజను పారలు ఇప్పించండి' అంటూ ఆయాసపడుతూ చెప్పాడు.
'పారలు దేనికిరా?' అని అడగ్గానే, 'పులిహోర కలపడానికి బాబయ్యా ! మన మెరకపొలంలో ఒక ఎకరం చదునుచేసి, జంబుఖానాలు పరచి, పులిహోర కలపడానికి ఓ పాతిక మంది కూలీలను పెట్టాం బాబయ్యా' చెప్పాడు పాలేరు.
'సరే సరే జాగ్రత్తగా కలపండి ఇసుక రానీయకుండా' అని చెప్పగానే అక్కడి నుండి బయలుదేరాడు పాలేరు" అని చెప్పడం ముగించాడు మీసాలతాత, చేతికి అంటుకున్న పులిహోర మెతుకులు దులుపుకుంటూ.
"తాతగారూ! పులిహోర కలపడానికి డజను పారలూ, ఓ పాతిక మంది కూలీలా?" ఆశ్చర్యంగా
అడిగాడు రమేష్, తన చెవిలో కానీ ఏమైనా పువ్వులు పెట్టేడా ఈ మీసాలతాత అని చెవులు
తడుముకుంటూ.
"మరి ఇరవైవేల మందికి.. " చెప్పబోతున్న మీసాలతాతతో, "ఔనౌండోయ్ తాతగారూ, ఉండాలి కదా మరి " అంటూ చెప్పాడు రమేష్, ఏమిటి నాకీ వాయింపు అని మనసులో అనుకుంటూ.
ఇంతలో ఫంక్షన్ హాలులో, మగపెళ్లి వారికి కోపం వచ్చిందిట అని ఏవో గుసగుసలు
మొదలయ్యాయి.
ఇది విన్న మీసాలతాత వెంటనే రమేష్ చెవిలోకి దూరిపోయి,
"బాబూ, ఇది చూస్తే ఆ పెళ్లినాటి నాలుగో రోజు జరిగిన ఓ సంఘటన జ్ఞాపకం వచ్చింది. అది
ఏమిటంటే, ఆ రోజు మధ్యాహ్నం భోజనాలు సమయంలో, 'బూరెలకి పెట్టిన గుంటలలో నెయ్యి
తక్కువ వేస్తున్నారు' అని మగపెళ్లి వారు గొడవ చేస్తున్నారు అన్న విషయం మీ ముత్తాత చెవిలో
పడింది.
వెంటనే ఆయన రంగంలోకి దిగిపోయి, 'అయ్యా, మా పిల్లలు తెలియక అలా వడ్డించారు.
ఒక్క క్షణం ఓపిక పట్టండి' అని చెప్పి వెళ్లాడు.
'ఏం చేస్తాడు చెప్మా' అని మగ పెళ్లివారు ఆలోచించుకొనే లోపులో, అందరి విస్తర్ల దగ్గరకు మాంచి నిగనిగలాడుతున్న ఇత్తడి చెంబులు వచ్చాయి. అప్పుడు మీ ముత్తాత వచ్చి, 'అయ్యా! మా వాళ్లకు తెలియక బూరెలలో నెయ్యి వేసారు.
మా వంశాచారం ప్రకారం అయితే, నెయ్యి లోనే బూర్లు వెయ్యాలి. ఇప్పుడు తినండి చెంబులో
ఉన్న నెయ్యిలో తేలుతున్న ఆ బూరెలు''అని చెప్పడంతో అవాక్కవడం మగ పెళ్లి వారి
వంతయ్యింది" అని చెప్పిన మీసాలతాత, మౌనంగా ఉన్న రమేష్ వైపు తిరిగి,
"ఏం బాబూ ! అలా ఉన్నావు ? బోర్ కొడుతున్నానా ?" అన్నాడు రమేష్ జేబులు వైపు చూస్తూ.
"లేదు తాతగారూ ! మా వంశం గురించే కదా చెబుతున్నారు. ఇంకెందుకు ఆ ఐదో రోజు పెళ్లినాడు
కూడా ఏం జరిగిందో చెప్పి తగలడండి, సారీ సారీ చెప్పి తరించండి" అన్నాడు రమేష్
వాడిపోయిన వంకాయలా మొహం పెట్టి, తనని ఇక్కడ బలిపశువులా వదిలి వెళ్లిపోయిన తన
తాతను మనసులో తిట్టుకుంటూ.
"చెబుతాను బాబూ ! కానీ నువ్వనుకున్నట్టు అది అంత సంతోషకరమైన సంఘటన ఏమీ కాదు
బాబూ. పాపం, అది మీ ముత్తాత గారు తీవ్రంగా బాధ పడిన ఘటన. ఆ ఐదో రోజు మధ్యాహ్నం
భోజనాల సమయంలో మగ పెళ్లివారి తాలూకు ఓ పిల్లాడి కాలు మీద పెరుగు పడి దెబ్బ తగిలిందని మీ ముత్తాతకి తెలిసింది. వెంటనే వెళ్లి వాళ్లకి క్షమాపణ చెప్పి, వైద్యం చేయించారనుకో " చెప్పాడు మీసాలతాత.
"ఏంటి తాతగారూ! విడ్డూరం కాకపోతే, పెరుగు కాలుమీద పడితే దెబ్బ తగలడం ఏమిటి ?" అడిగాడు రమేష్.
"ఎందుకంటే, అది మామూలు పెరుగు కాదు బాబూ, గడ్డ పెరుగు. బెడ్డ కన్నా గట్టిగా ఉండే గడ్డ
పెరుగు. మరి అంత గట్టి పెరుగుగడ్డ పిల్లాడి కాలుమీద పడితే దెబ్బ తగలదూ ? చూసావా మరి,
అలాంటి గొప్ప వారి వంశంలో నువ్వు పుట్టావు. అలాగే, మీ ముత్తాతలా నువ్వు కూడా దానగుణం
అలవర్చుకోవాలి మరి" అంటూ చెయ్యి చాపాడు మీసాలతాత.
అది గ్రహించిన రమేష్ ఓ వంద నోటు ఆయన చేతిలో పెట్టి, ఇంక నన్ను వదిలెయ్యి మహానుభావా అన్నట్లుగా రెండు చేతులు ఎత్తి నమస్కారం పెట్టాడు.
ఈలోగా, పని ముగించుకుని అక్కడికి వచ్చిన రమేష్ వాళ్ళ తాత,
"ఓ, రాయుడు గారూ! మీరా, బాగున్నారా?" అంటూ పలకరించాడు మీసాలతాతను.
"ఆ బాగానే ఉన్నాను. ఔనూ మీరు సున్నం సుబ్బారావు గారి అబ్బాయి కాదూ! తెల్లటి ఆ జుట్టు
చూస్తూంటూనే తెలుస్తోంది. సున్నం వారంటే మా చిన్నతనంలో.. " మళ్ళీ మొదలెట్టాడు
మీసాలతాత.
"కాదండీ బాబూ, నేను బెల్లం బాబూరావుని. మరి మేము బయలుదేరుతాం. చీకటి పడుతోంది"
అంటూ ఓ వంద నోటు ఆయన చేతిలో పెట్టి మనవడుతో పాటు గబగబా బయటకు వచ్చాడు రమేష్ వాళ్ళ తాత.
"నేనూ బయలుదేరతా ! భానుగుడి వద్ద ఇంకో పెళ్లికి వెళ్లాలి" చెప్పాడు మీసాలతాత.
***** ***** ***** *****
"ఏంటీ తాతా ! ఈయన పేరు రాయుడా ? నిజంగా కోతల రాయుడు అనే పేరు ఈయన వల్లనే
వచ్చిందేమో ?" అంటూ మీసాలతాత తన చెవిలో కూసిన పెళ్లి కోతలు అన్నీ తాత చెవిలో పోసాడు రమేష్.
అంతా విన్న తాత "లేదురా రమేషూ ! ఒకటి రెండు సంఘటన లలో అతిశయోక్తులు ఉన్నా, ఆ మీసాలతాత చెప్పింది అంతా నిజమే. కానీ ఆయన చెప్పింది మటుకు ఒకే ఒక అబద్ధం" చెప్పాడు.
"ఔనా ? అబ్బో, అయితే ఆ అబద్ధం ఏమిటో ? " వెటకారంగా అడిగాడు రమేష్.
"అది ఏమిటంటే, ఆయన చెప్పినట్లు ఆ పెళ్లి మీ నాన్న మేనత్తది కాదు. ఆ మీసాలతాత వాళ్ళ
మేనత్తది. ఆయన తాతలు, తండ్రులు అలాగే ఆర్భాటాలకు పోయి విందులు, వేడుకలకు ఉన్న
ఆస్తులు తగలేస్తే, పాపం ఈయన తరం వద్దకు వచ్చేటప్పటికి కేవలం అప్పులు మిగిలాయి. తన
గొప్పతనం గురించి చెప్పి డబ్బులు అడిగితే ఎవరూ ఇవ్వరని, ఇలా పెళ్లిళ్లకు వచ్చి, ఎవరు
కనపడితే వాళ్లకు వారి వంశానికి సంబందించిన కధగా చెప్పి, ఆ వచ్చిన డబ్బులతో జీవనం
సాగిస్తున్నాడు. ఈ మధ్య కొంచెం మతిమరుపు కూడా వచ్చిందిట. అంతేకాదు.. " అంటూ ఇంకా
ఏదో చెప్పబోతున్నాడు తాత.
"ఊరుకో తాతోయ్ ! నీకో నమస్కారం. ఇప్పటికే ఆయన కోతలతో నా చెవుల మీద వాతలు తేలాయి, ఇప్పుడు నీ కోతలు మొదలెట్టావా? నా చెవులకు ఇంక ఓపిక లేదు కానీ, నువ్వు ఇక్కడే ఉండు బైకు తీసుకుని వస్తా!" అంటూ నిజం చెబుతున్నా నమ్మకుండా, నవ్వుకుంటూ వెళ్తున్న మనవడిని ఆశ్చర్యంగా చూస్తూ నిలబడి పోయాడు తాత.
పార్కింగ్ లో బైకు తీస్తున్న రమేష్ వద్దకు
"నువ్వు పొట్లకాయల పాపారావు గారి మనవడివి కదూ.. ?" అంటూ మళ్లీ వచ్చాడు మీసాలతాత.
"కాదండీ, నేను దొండకాయల దుర్గారావు గారి మనవడిని" వెటకారంగా చెప్పాడు రమేష్.
"ఔనా ? మరి చెప్పవేం, ఆ కళ్లు చూస్తేనే తెలుస్తోంది. దొండకాయల వారంటే మా చిన్నతనంలో.." మళ్ళీ మొదలెట్టాడు మీసాలతాత.
"తాతగారూ ! మీకో నమస్కారం. నన్ను వదిలేయండి మహాప్రభో" అంటూ ఆయన చేతిలో ఇంకో
వంద నోటు పెట్టి రివాల్వర్ నుంచి వచ్చిన బుల్లెట్ లా బుల్లెట్ మీద దూసుకుపోయాడు రమేష్.
***** **శుభం** *****
బుద్ధవరపు కామేశ్వరరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
పేరు :: బుద్ధవరపు కామేశ్వరరావు
జననం : తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామం దగ్గర లో ఉన్న జగన్నాధగిరి అనే గ్రామంలో డాక్టర్ సూర్యనారాయణ రావు, సూర్యకాంతమ్మ దంపతులకు జన్మించిన 11 మంది సంతానంలో 7 వ వానిగా 1958లో.
వృత్తి : ఒక మల్టీ నేషనల్ కంపెనీలో అకౌంట్స్ మేనేజర్ గా 2016 లో పదవీ విరమణ చేసి ప్రస్తుతం హైదరాబాద్ లోని స్వగృహంలో విశ్రాంత జీవనం.
కుటుంబ నేపథ్యం: భార్య శేషుకుమారి, ఓ అమ్మాయి (సూర్యకళ, అల్లుడు వాసూరావు, వాళ్లకి ఇద్దరు పిల్లలు. పేర్లు సంకీర్త్, ష్రఘ్వి) ఓ అబ్బాయి(పేరు శశికాంత్, కోడలు శిరీష, వీరికి ఓ అబ్బాయి. పేరు శక్య)
వ్రాయడం మొదలుపెట్టింది : 2017 నుంచి
ఇంతవరకూ రాసిన కథలు : 212
ప్రచురణకు నోచుకున్నవి:
సుమారు... 98
మిగిలినవాటిలో కొన్ని వివిధ మాధ్యమాలలో పరిశీలనలోనూ,
మరికొన్ని మెరుగులు దిద్ది పంపే ప్రక్రియలో నావద్దనూ పెండింగ్ లో ఉన్నవి.
పోటీలలో బహుమతులు పొందినవి (15)
ప్రోత్సాహం ఇస్తున్న వారు:
పత్రికాధిపతులు, సంపాదకులు, సమీక్షకులు, అలాగే పాఠకులు అందరూ !
కథలో హాస్యం బాగా పండింది. అభినందనలు కామేశ్వరరావు గారూ!
కోతలు కోటలు దాటాయి అంటారు చూసారు,దానికి నిరూపణ ఈ మీసాల తాత కోతలు.కథలో చక్కని హాస్యం, దానికి తగ్గట్టుగా పాత్రలపేర్లు, భలే కుదిరాయి. కథని నడిపించడంలో రచయిత మంచి నేర్పును కనబరిచారు. కథనం చాలాబావుంది. మంచి కథను రాసిన రచయితకు అభినందనలు
Chala bavundhi .aadyantham chakkati sailitho chadhivimpachesindhi.
సూపర్ కామెడీ. కోతల తాతగారు మతిమరుపుతో పదే పదే అతడినే తగులుకోవటం, సూపర్బ్👌👍💐
పెళ్లి కోతలు కథ బాగుంది. కామేశ్వర రావు గారికి అభినందనలు💐👍💐