top of page

పెళ్లిచూపులు


'Pellichupulu' New Telugu Story


Written By Yasoda Pulugurtha


రచన: యశోద పులుగుర్త

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

రాజేష్ ఆష్ట్రేలియాలో ఒక పెద్ద బేంక్ లో ఉన్నత పదవిలో అయిదు సంవత్సరాలనుండి ఉద్యోగం చేస్తున్నాడు. ఐఐటి ఖరగ్ పూర్ లో చదివాడు. చాలా తెలివైనవాడు. అంతేకంటే ముఖ్యంగా జీవితపు విలువలు బాగా తెలుసున్నవాడు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన రాజేష్ కు తను ఎంత కష్టపడి చదివి పైకి వచ్చాడో, దాని వెనుక అతని తల్లితండ్రుల కష్టం, త్యాగం అన్నీ గుర్తు ఉన్నాయి.


రాజేష్ తల్లి కల్యాణి కూడా ఉద్యోగం చేసేది. తండ్రి ప్రకాశ్ రావు ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవాడు. ఎప్పుడూ ఆఫీస్ టూర్లంటూ తిరిగేవాడు. తల్లి పొద్దుటే లేచి అన్ని పనులూ పూర్తిచేసుకుని తనను, తమ్ముడిని తయారు చేసి స్కూల్ కు పంపి తను హడావుడిగా ఆఫీసుకి పరుగెత్తేది. నాన్న ఊళ్లో లేని కారణంగా అన్నీ తనే చూసుకోవలసి వచ్చేది.


ఒకవైపు ఉద్యోగ బాధ్యతలతో సతమతమౌతూనే పిల్లల పెంపకం విషయంలో ఎంతో శ్రధ్ద తీసుకునేది. తమ చదువుల విషయంలో ఎంతో స్ట్రిక్ట్ గా ఉంటూ శ్రధ్దగా దగ్గర కూర్చుని చదివించేది. తనకు ఐఐటి ఖరగ్ పూర్ లో సీట్ వచ్చినపుడు ఆనందంలో అమ్మ కళ్లనుండి జాలువారిన ఆ కన్నీటి బొట్లను తనెప్పటకీ మరచిపోలేడు. ఐఐటి పూర్తి అయిన తరువాత ఎమ్. ఎస్ కి యూ. ఎస్ వెడతావా అని అమ్మ అడిగితే వెళ్లనని చెప్పేసాడు.


ఆస్ట్రేలియాలో ఒక పెద్ద బేంక్ లో మంచి పేకేజ్ తో జాబ్ వచ్చింది. కొన్నాళ్లు అక్కడ పనిచేసి తరువాత ఇండియా వచ్చేసి ఇక్కడే జాబ్ చేస్తూ తన తల్లితండ్రులతో కలసి ఉండాలనేదే అతని ధ్యేయం.


రాజేష్ తల్లితండ్రులు కొడుక్కి పెళ్లిచేసేయాలన్న తలంపులో ఉన్నారు.

ఇంకో రెండు మూడేళ్లు ఆగేక చేసుకుంటానన్న రాజేష్ తో 'అలా కాదు రాజేష్! మేమూ పెద్దవాళ్లం అయిపోయాం. స్తిరపడ్డావు కదా, తమ్ముడి చదువు పూర్తయింది. వాడుకూడా ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నాడు. నీ పెళ్లి బాధ్యత తీరిపోతే మేమూ కాస్త రిలాక్స్ అవుతా’మని నచ్చచెప్పేసరికి, మీ ఇష్టం అంటూ సమాధానమిచ్చాడు.


రాజేష్ మూడు వారాలు శెలవు మీద హైద్రాబాద్ కి తల్లీతండ్రీ తో గడపాలని వచ్చాడు.


అప్పటకి రెడీ గా పెట్టుకున్న రెండు సంబంధాలను చూసివచ్చారు రాజేష్ తో కలసి.


రాజేష్ కు అవేమీ నచ్చలేదు.


ఒక రోజు బెంగుళూర్ నుండి ఒక సంబంధం వచ్చింది.


అమ్మాయి తల్లితండ్రులు రాజేష్ తల్లితండ్రులతో ఫోన్ లో మాట్లాడి పెళ్లిచూపులకు రావలసిందిగా ఆహ్వానించారు..


అమ్మాయి ప్రొఫైల్ బాగుంది. ఆ అమ్మాయి ఫొటో కూడా రాజేష్ కు నచ్చింది.


రాజేష్ పిన్ని బెంగుళూర్ లో ఉంటున్న కారణంగా రాజేష్ వాళ్లూ పిన్ని ఇంట్లో దిగారు.


ఆ మరుసటి రోజు రాజేష్ కు అపర్ణకూ బెంగుళూర్ లో పెళ్లి చూపులైనాయి..


అపర్ణ తల్లితండ్రులు ఆన్ లైన్ లో సంబంధం చూసి ఇంట్లో అందరికీ నచ్చాకనే రాజేష్ తల్లితండ్రులతో ఫోన్ లో మాట్లాడి పెళ్లిచూపులకు రావలసిందిగా ఆహ్వానించారు..

రాజేష్ కు అపర్ణ చాలా నచ్చింది.. తెల్లగా అందంగా చాలా చలాకీగా ఉంది.. రాజేష్ లాంటి బ్రిలియంట్, ఐఐటి లో టాపర్, ఆస్ట్రేలియా లో మంచి ఉద్యోగం చేస్తున్న వ్యక్తి నచ్చకపోవడానికి అపర్ణకు కారణాలేమీ కనపడలేదు.. పైగా స్పురద్రూపి, అందగాడూ, హోదా కలవాడు కూడా..


రాజేష్, అతని తల్లీ తండ్రీ పెళ్లిచూపులయి పోయినా ఒక రెండు రోజులు అక్కడే ఉండిపోయారు.. ఇంకా ఇరువైపులా ఓకే చెప్పుకోలేదు..


ఆరోజు సాయంత్రం రాజేష్ అపర్ణా ఒకరితో నొకరు మనసు విప్పి మాట్లాడుకోవాలని అలా సరదాగా ఒక రెస్టారెంట్ కు వెళ్లి కూర్చున్నారు..


అపర్ణ చాలా చలాకీగా, కలుపుగోరుగా మాట్లాడడం మొదలు పెట్టింది.


“చెప్పు రాజేష్, ఆస్ట్రేలియా లైఫ్ ఎలా ఉంటుంది ?”


“మామూలుగానే.. అక్కడ ఎవరి జీవితం వారిది.. మనలా పెళ్ళికి, కుటుంబ వ్యవస్థ కి, సమాజానికి ప్రాధాన్యత ఇవ్వరు”


“నాకు విదేశీయుల్లో చాలా నచ్చిన అంశం అదే రాజేష్. ఎవరికి వారు స్వతంత్రంగా పెద్దవాళ్ళ పెత్తనం లేకుండా హాయిగా ఉంటారు. నేనూ అటువంటి ప్రైవసీ నే ఇష్టపడతాను.. ప్రతీ చిన్న విషయానికి తల్లితండ్రుల సంప్రదింపులూ అవీ, ఓ హెల్.. ఐ డోంట్ లైక్ సచ్ స్టుపిడ్ ధింగ్స్..


ఈ రోజుల్లో ప్రతివాళ్ళకి ప్రైవసీ చాలా అవసరం రాజేష్, ఇండిపెండెంట్ గా పెద్దవాళ్ల జోక్యం లేకుండా హాయిగా జాలీగా బ్రతకాలి. మనం అమ్మమ్మల తాతమ్మల కాలంలో లేముకదా. అయినా అటువంటి నేష్టీ కల్చర్ అంటే నాకు పరమ అసహ్యం” నుదుటిమీద పడ్తున్న జుట్టుని సుతారంగా సర్దుకుంటూ మాట్లాడుతున్న అపర్ణ వైపోసారి చూసాడు. అందానికి, నేటి ఆధునిక వేషధారణకు ప్రతీకగా ఉంది.


అపర్ణ మనోభావాలు అర్ఘమైనాయి రాజేష్ కి..


“అన్నట్లు ఆస్ట్రేలియాలో నీవు ఉంటున్నది నీ స్వంత ఫ్లాట్ లోనేనా? అయినా అక్కడ ఫ్లాట్ కంటే ఇండిపెండెంట్ హౌసెస్ చాలా పెద్దగా బాగుంటాయిటకదా? నా ఫ్రెండ్ నీతా అక్కడే ఉంటుంది. తను చెపుతూ ఉంటుందిలే ! నీది ఇండిపెండెంట్ హౌసే కదా?”


“లేదు అపర్ణా, నేను ఏదీ కొనలేదు. కారు కూడా కొనలేదు తెలుసా?”


“నీకు పేకేజ్ బాగానే వస్తుందని నీ ప్రొఫైల్ లో పెట్టావు కదా?”


“నిజమే, కానీ నేనూ నా ఫ్రెండూ కలసి ఒక ఫ్లాట్ ని షేర్ చేసుకుంటున్నాం. మా ఆఫీస్ నేనుంటున్న ఫ్లాట్ కి చాలా దగ్గర. వాక్ బుల్ డిస్టెన్స్. అవసరం వచ్చినపుడు వాడి కారే నేనూ వాడుకుంటాను..

సేలరీ బాగానే వస్తుంది.. కానీ డబ్బు సేవ్ చేయాలని నా ఆలోచన.. అమ్మా నాన్నా ఎంతో కష్టపడి ఉద్యోగం చేస్తూ నన్ను చదివించారు.. తమ్ముడింకా ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు.. ఉద్యోగం రాకపోతే యూ. ఎస్ కి ఎమ్ ఎస్ చదువుకోడానికి వెళ్లాలని కూడా ఆలోచిస్తున్నాడు. ఒకవేళ వాడు వెళ్తానంటే నేను ఆర్ధికంగా వాడికి సహాయం చేయవలసి వస్తుంది.

నిజమే.. నాకు మంచి సేలరీ వస్తోందని జల్సాగా ఖర్చు చేసేస్తే ఎలా?”


“మీ పేరెంట్స్ కు హైద్రాబాద్ లో ఓన్ హౌస్ ఉందని విన్నాను. పోనీ మీ పేరెంట్స్ కైనా కార్ ఉందా?”


“ఉంది. త్రీ బెడ్ రూమ్స్ అపార్ట్ మెంట్. కానీ కార్ లేదు.. ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే కేబ్ లో వెడతారు.. తమ్ముడు కార్ డ్రైవింగ్ చేయగలడు కానీ, చదువుకుంటున్న వయసులో వాడి చేతికి కారు ఇవ్వకూడదని.. ”


“ఓ.. ” పెదవి విరిచింది.

“మీ పేరెంట్స్ ది ఇండిపెండెంట్ హౌస్ కాదా ? ఫ్లాట్ కి రీసేల్ వేల్యూ నే ఉండదు.. నీవూ మీ తమ్ముడూ పంచుకున్నా ఏమి వస్తుంది?”


రాజేష్ కి అపర్ణ వ్యక్తిత్వం నెమ్మదిగా అర్ధమౌతోంది..


“నేను ఆస్ట్రేలియా వెళ్లింది ముఖ్యంగా డబ్బు సంపాదించాలని అపర్ణా. నాకు అక్కడ స్థిరపడే ఆలోచన లేదు.. త్వరలో ఇండియా వచ్చేసి ఒక నాలుగువందల గజాల స్థలం కొని సొంత ఇల్లు కట్టుకుని మా అమ్మా నాన్న, తమ్ముడిని కూడా మనతో ఉంచేసుకోవాలని.. అప్పుడు ఒక పెద్ద కారు కొంటాను.. అందుకనే ఆస్ట్రేలియాలో పి.. ఆర్ కి కూడా అప్లై చేయలేదు”


“ఏమిటీ, ఇండియా వచ్చేస్తావా? పి. ఆర్ లేదా?” అపర్ణ ముఖం నల్లగా మాడిపోయిందో క్షణం..

“అవును అపర్ణా.. పేరెంట్స్ తో కలసి ఉన్న ఆనందమే వేరుకదా ?”

“ఇంక వెడదామా మరి” అంటూ అపర్ణ లేచి నిలబడింది..

అపర్ణను ఆమె ఇంటి దగ్గర డ్రాప్ చేసి రాజేష్ తల్లితండ్రుల దగ్గరకు బయలదేరాడు..


“భలే, చచ్చు సంబంధం చూసావమ్మా.. ” అంటూ తల్లిమీద ఖస్సుమంటూ ఎగిరింది. “ఫారిన్ సంబంధం అన్నావు.. అతను అక్కడ ఉండడుట.. ఇండియా వచ్చేసి అమ్మా నాన్నలతో ఉంటాడుట.. మనదేశం, సంస్కృతి, తల్లితండ్రులూ అంటూ చెప్పేవన్నీ పాతచింతకాయ కబుర్లే.. పైగా ఆస్తిపరలంటూ భలే గొప్పగా చెప్పావు.. అమ్మా నాన్నతో కలసి ఉంటాడుట.. అంటే నేను వాళ్లకు ఊడిగం చేస్తూ పడుండమనా అతని ఉద్దేశం” అంటూ శివంగిలా లేచింది..


“ఇంతోటిదానికి ఈ పెళ్లిచూపుల ఆర్భాటం దేనికో? నా టైమంతా వేస్ట్ అయింది. నేనీ సంబంధం చేసుకోనుగాక చేసుకో”నంటూ వేసుకున్న హైహీల్స్ ను గట్టిగా చప్పుడు చేస్తూ లోపలకు వెళ్లిపోయింది’.


“అదేమిటమ్మా! ఆ అమ్మాయి అప్పుడే అలా మాట్లాడేస్తోంది. నామీద ఏదో పూర్తి అధికారం ఏర్పడినట్లుగా నా స్తితిగతులవీ అడగడం మొదలుపెట్టింది.. సొంతిల్లు ఉందా, కార్ ఉందా అంటూ! ఇటువంటి పెళ్లిచూపులను నేను ఇష్టపడనమ్మా, అమ్మాయిలకు స్వతంత్ర భావాలు ఉండడం మంచిదే, కానీ అమ్మా, అవి కుటుంబ వ్యవస్తలను చెరిపేవిగా ఉండకూడదు”.


“అందం, ఆస్తిపాస్తుల కంటే మానవ సంబంధాలకి, కుటుంబ వ్యవస్థకి గౌరవమిచ్చే సంస్కారవంతమైన అమ్మాయిని చూడమ్మా, ఈ సంబంధం వద్దం”టూ తల్లితండ్రులతో ఖచ్చితంగా చెప్పేసాడు రాజేష్.

***

యశోద పులుగుర్త గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).Podcast Link


Twitter Link


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.


నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.


54 views0 comments

Comments


bottom of page