top of page

పెండ్లి పిలుపు


'Pendli Pilupu' written By Sita Mandalika

రచన : సీత మండలీక

"అమ్మా! సుగుణ ఇప్పుడే ఫోన్ చేసింది. అనిల పెళ్ళి ముహూర్తం పది రోజుల్లో నిశ్చయించేరుట. సాయంత్రం తను, బావగారు పెళ్లి పిలుపులకి వస్తున్నారు" అని చెప్పేడు రవి.

"విన్నారా సుగుణ, అల్లుడు, వస్తున్నారు. ఎన్నాళ్ళో అయ్యింది వాళ్ళని చూసి. మొహాలు మర్చిపోయినట్టయింది" అన్న పార్వతమ్మ గారి సంతోషానికి అవధులు లేవు. అందులోను మనవరాలి పెళ్లి.

" ఆ, విన్నాను.ఆ మధ్య అల్లుడు శాస్త్రి ఫోన్ చేసి శుభవార్త చెప్పేడు.అయితే తారీఖు నిశ్చయం అయిందన్నమాట" అన్నారు మూర్తి గారు

"మనం రెండు రోజులు పోయాక సుగుణ ఇంటికి వెళ్దాం. హాయిగా 15 రోజులు ఉండి దగ్గిరుండి పెళ్ళి చేయించి వద్దాం. ఇంట్లో కూర్చుని కూర్చుని నాకు విసుగొస్తోంది . పై మనిషి మొహం కనబడదు. ఓ పలకరింపు, మాట, ఏదీ ఉండదు ఈ అపార్ట్మెంట్ లో. ఈ వేళే అన్నీ సద్దేస్తాను" అని పార్వతి గారు ఆతురతతో చెప్పేరు.

"ఆగు పార్వతీ! ఎక్కడికి వెళ్లడం? మనని ఎవరు పిలిచేరు? అసలు ఈ రోజుల్లో ఎవళ్ళూ ఎవళ్ళనీ రమ్మని పిలవరు. పెళ్ళి అని మాత్రం తెలియపరచి వెళ్ళిపోతారు”.

"మరీ అంత అన్యాయం గా మాట్లాడకండి. మన సుగుణ అలా చెయ్యదు. మీరు కొన్న పెద్ద పట్టు చీర పెళ్ళి టైం కి కట్టుకుంటాను".

ఇంట్లోనే కూర్చున్న పార్వతికి బయట తిరగాలని, ఇంకా జీవితం ఆనందంగా గడపాలనే కోరిక ఎక్కువైంది. తన వయసు 70. నాకు75. ఏ వయసు కి తగ్గట్టు ఆ వయసులో ఉండాలన్న జ్ఞానం ఈవిడకి రాలేదు. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఇంట్లోనే ఉండి నాకు బాగా వేదాంతం ఒంట బట్టింది అనుకున్నారు మూర్తి గారు.

అదే పార్వతికి చెప్తే “నేనింకా మనవడి వెళ్ళిచెయ్యాలి. మనవరాలి వెళ్ళి చూడాలి. ఈ వేదాంతాలు చెప్పకండి” అంటూ విసుక్కుంటుంది.. పాపం సుగుణ వచ్చి పెళ్ళికి తగినట్టుగా ఆహ్వానించక పోతే ఎంత బాధ పడుతుందో. అయినా తన తప్పు లేదు అని వాపోయేడు

మూర్తి.

సుగుణ వాళ్ళు వచ్చే ముందే అన్నాడు రవి "అమ్మా, నీ కోసమే ఓ మాట చెప్తాను వింటావా . ఏమీ అనుకోకు . సుగుణ వాళ్ళు రాగానే తనని దగ్గిరగా తీసుకోవద్దు. మాస్కు వేసుకుని నువ్వూ ,నాన్నా డ్రాయింగ్ రూమ్ లో కూర్చుని మాట్లాడండి. చేతులకి శానిటైజర్ రాసుకుంటే సరిపోతుంది. వాళ్ళు రెండు మూడిళ్ళకి పిలుపులకి వెళ్లి వస్తారు. ఇంట్లో రజని చంటి పాప ఉంది కదా. మనం జాగ్రత్త గా ఉండాలి.. మీరు కూడా చాలా కేర్ఫుల్ గా ఉండాలి."

"అదేమిటి రా, రజని పాపని అత్త కి చూపెట్టరా ?"

"లేదమ్మా రజని గది లోనే ఉంటుంది. తరవాత మనం చేతులు సబ్బు తో కడుక్కుంటే తప్ప, పాపని ఎత్తుకో కూడదు"

" ఏం రోజులు వచ్ఛేయిరా రవీ! మనిషికీ మనిషికీ సంబంధం లేకుండా.."

ఆ సాయంత్రం 5 30 కల్లా సుగుణ , భర్త వచ్చేరు. వస్తూనే చేతికి శానిటైజర్ రాసుకుని అమ్మకీ నాన్నకీ దూరం నించే ఒంగుని నమస్కారాలు చేసి పెళ్ళి సంగతి చెప్పేరు. కూతురిని చూస్తూనే పార్వతి కళ్ళల్లో నీళ్లు తిరిగేయి . ఒకే ఊళ్ళో ఉంటూ కూడా కలిసి ఏడాది దాటుతోంది. సుగుణకి కూడా అమ్మని నాన్నని చూసి కళ్ల వెంట నీళ్ళొచ్చేయి . తన కొడుకు బాబు పెళ్ళికి అమ్మ వెంట ఉండి ఎంత సాయం చేసింది. పోనీ ఇప్పుడు తీసికెళ్ళి కొన్నాళ్ళు ఉంచుకుందామంటే అన్నయ్య “వాళ్ళని ఎక్కడికీ కదప వద్దు ఈ కరోనా రోజుల్లో. పెళ్ళికి కూడా తీసుకుని వెళ్ల లేము. ఇంట్లోనే ఉండనీ! వాళ్ళకి నేను బోధ పరుస్తాను” అని ఫోన్ లో చెప్పేడు.

'పెళ్ళికి ఇంకా పది రోజులుంది. మీరు పెళ్ళికి వచ్చినా ఇబ్బంది పడిపోతారు. మాస్కులు వేసుకుని దూరంగా కూర్చోవాలి. అందుకే అమ్మా పెళ్లయ్యేక కొత్త దంపతులిద్దరూ ఇక్కడికి వస్తారు. అక్షింతలు వేసి దీవించండి మా అత్తగారు మామగారు కూడా పెళ్ళికి రావడం లేదు . నేను అందరికీ విడియో లింక్ పంపుతాను. హాయి గా ఇంట్లో కూర్చుని పెళ్ళంతా టీ.వీ లో చూడచ్చు.. అమ్మా, మీ అందరి బట్టలు మా గిఫ్ట్ గా బ్యాగు లో పెట్టేను." అంటూ హడావిడిగా అన్నీ దూరంగా పెట్టి ఓ కాఫీయేనా తాగకుండా వెళ్ళిపోయేరు సుగుణ, భర్త .

సుగుణ వెళ్ళగానే పార్వతమ్మగారి కంటి వెంట నీళ్లు ఆగ లేదు. మనవడు బాబు పెళ్ళిలో పెత్తనం అంతా తనదే. సుగుణ నెల్లాళ్ళ ముందుగానే ఇద్దరినీ దగ్గిరుండి తీసికెళ్ళి ఎంత మర్యాద చేసింది? మరి ఇప్పుడో ?..... ఏమిటి దీనిలో ఇంత మార్పు. అని రవి తో చెప్పింది .

" అమ్మా,అలా అనకు. మన అందరి కోసమే సుగుణ అలా పిలిచింది. పెళ్ళిలో ఈ కరోనా రోజుల్లో జనం చేరితే అందరికీ ప్రమాదం. అందులోను మీరు వయస్సున్న వాళ్ళు. రోజూ జరుగుతున్నది టీ.వీ. లో వింటూ ఎందుకు సుగుణని అంటావమ్మా" అని రవి అనే సరికి పార్వతమ్మ గారు కొంచెం సద్దుకున్నారు .

పెళ్ళి రోజు సుగుణ పంపిన లింక్ ద్వారా టీ.వీ. లో పెళ్ళి సందడి అంతా చూసి మూర్తి గారి కుటుంబం అంతా చాలా సంతోషించేరు.

***శుభం***


రచయిత్రి పరిచయం : సీత మండలీక

నేను హౌస్ మేకర్ ని. కొడుకులిద్దరూ అమెరికాలో పెళ్ళిళ్ళై స్థిరపడిపోయాక, భర్త ఎయిర్ ఇండియా లో రిటైర్ అయ్యేక ఇప్పుడు నాకు కొంచెం సమయం దొరికింది

కధలు చదవడం అలవాటున్నా రాయాలన్న కోరిక ఈ మధ్యనే తీరుతోంది


235 views0 comments
bottom of page