top of page

పెన్షన్..టెన్షన్


'Pension Tension' written by Mangu Krishna Kumari

రచన : మంగు కృష్ణకుమారి

ఎలెక్ట్రికల్ మెకానిక్ రాములు హఠాత్తుగా చనిపోయేడు. 'మాసివ్ హార్ట్ ఎటాక్ ట' అన్నారు మా సెక్షన్ వాళ్ళు. గవర్నమెంట్ ఉద్యోగి సర్వీసులో ఉండగానే చనిపోతే, ఫేమిలీ పెన్షన్ ఇస్తారు. ఆ పనంతా మా సెక్షన్ లోనే జరుగుతుంది. నేనా పని మొదలెట్టేను.

అతని భార్యని ఆఫీసుకి తీసుకొస్తానని యూనియన్ నాయకుడు అయూబ్ చెప్పేడు. సాధారణంగా ఇలా ఉద్యోగం చేస్తూ ఉండగా ఎవరన్నాచనిపోతే, యూనియన్ నాయకులే మాకూ, ఆ కుటుంబానికీ మధ్య వారధిలా ఉంటారు. భార్యకి చదువు రాకపోతే, వీళ్ళే ఆమెకి వివరాలు చెప్పి సహాయం చేస్తారు.

పొద్దుట పది గంటలు. చాలా బిజీగా ఉన్నాను. యూనియన్ నాయకుడు అయూబ్ ఒకావిడని వెంటపెట్టుకుని, సెక్షన్ లోకి వచ్చేడు. ఆవిడ రాములు భార్య లక్ష్మి అని పరిచయం చేశాడు. ఆమెని కూచోమని చెప్పి, రాములు సర్వీస్ రికార్డ్ చెక్ చెయ్యడం మొదలుపెట్టేను. ఒక అరగంటలో ఇంకో యూనియన్ నాయకుడు మరో మహిళతో వచ్చేడు.

ఆమె తన పేరు నూకాలు అనీ, తను రాములు భార్యని అనీ, తనకి ఫేమిలీ పెన్షన్ ఇప్పించమనీ అడిగింది.

నేను విస్తుపోయి చూస్తున్నాను. మా వర్కర్స్ లో కొందరికి ఇద్దరేసి భార్యలు ఉండడం అందరికీ తెలుసు. పెన్షన్ దగ్గర సవతులు ఏదో రకంగా రాజీ పడేవారు. మరో అరగంటలో, మరో కన్నమ్మ ఎవరితోనో వచ్చి తను రాములు భార్యని అనీ, ఇద్దరు పిల్లలు ఉన్నారనీ, తనకే పెన్షన్ ఇప్పించాలనీ గోల పెట్టింది.


మా రికార్డులు చూస్తే రాములు భార్య పేరు లక్ష్మి అని రికార్డయి ఉంది. మొదట వచ్చిన లక్ష్మి, ఈ ఇద్దరు ఆడవాళ్లని చూసి కోపంగా నానా తిట్లూ తిట్టింది. వాళ్లిద్దరూ కూడా తాము కూడా తీసిపోమన్నట్టు పెద్ద పెద్ద కేకలు వేశారు. ముగ్గురు ఆడవాళ్లలో భర్త చనిపోయిన బాధ కన్నాఅతని పెన్షన్ డబ్బులు తమకి వస్తాయో రావో అన్న బాధ ఎక్కువగా కనిపిస్తున్నాది. వీధి కొళాయి సన్నివేశాన్ని తలపిస్తూ ముగ్గురు మహిళలు కొంగులు బిగించి వాదనలకి దిగేరు.


"నేను తాళి‌కట్టించుకున్న పెళ్లాన్నే.. పెద్దోల్లందరూ మాకు పెళ్లి చేసేరు. పెళ్లి ఫొటోలు ఇంటి కాడున్నాయి. మధ్య మీరెవరే" లక్ష్మి కేకలు.


"ఓలమ్మోలమ్మో..తనకి మనువు కాలేదన్నాడు. నూకాలమ్మ సాచ్చిగా మా పెల్లయింది. మాకో ఆడపిల్ల. ఇదిగో పొటోలు" నూకాలు ఏడుపు.


"ఎల్లెల్లవే.. నాను, ఆడూ ఎప్పుడో మనువాడినం. ఇద్దరు కొడుకులు. ఆల్లమ్మకి కట్నం ఆశని, తనే డబ్బు దాచి ఇంటికి ఒట్టుకెళతానని సెప్పేడు. నా పిల్లల మీదొట్టు.. నానే అసలు ఆలిని" కన్నమ్మ రంకెలు.


సెక్షన్ లో అందరూ నవ్వు ఆపుకోలేక పోతున్నారు. ప్యూన్ సన్యాసమ్మ వచ్చి ముగ్గురి మీదా గట్టిగా అరిచింది. "ఏటిది.. ఆపీసనుకున్నరా? సేపల బజారనుకున్నరా? మేడమ్ సెప్తారు ఎవరుండాలో.. ఒల్లకుండండి"

నేను సెక్షన్ ఆఫీసర్ గారి దగ్గరకి పరిగెట్టేను. ఆయన కూడా తల‌పట్టుకున్నారు.‌

మా అనుభవంతో మాకు తెలుసు. రికార్డుల్లో ఎవరి పేరైతే ఉందో ఆమే అసలు భార్య. అయితే చిక్కు ఎప్పుడొస్తుందంటే, భార్యలుగా చెప్పుకుంటున్నఆ మిగిలిన ఇద్దరు మహిళలు కూడా, తాము రాములుతో కాపురం చేసినట్టు, తమకి పిల్లలుకూడా ఉన్నట్టు రుజువు చేసుకుంటే మాత్రం కేసు జటిలం అవుతుంది.


సవతుల పోరు జనరల్ మేనేజర్ గారి దాకా వెళ్లింది. ఆయన మొదట ముగ్గురిని పంపించెయ్యండి, మర్నాడు చూద్దాం అన్నారు.


మర్నాడు లక్ష్మిని సెక్షన్ ఆఫీసర్ గారు పిలిపించి, కోపంతో అడిగేరు. "ఏమ్మా! నీ భర్తకి ఇంకో పెళ్లాం ఉందని నువ్వు కంప్లయింట్ చేసి ఉంటే వాడి ఉద్యోగం ఎప్పుడో పీకించి ఉండేవాళ్లం కదా" అని.


"నాకు తెలీదు సారు" అంటూ ఆమె ఏడుపు. మిగిలిన ఇద్దరు ఆడవాళ్ళు వాళ్ళ ఋజువులు, సాక్షాలతో సహా కంప్లయింట్లు చేసేరు. కేసులు అదాలత్ కి వెళ్ళేయి. “దొంగ రాస్కెల్! చక్కగా మూడు ఫేమిలీలు మెంటేయిన్ చేసేడు. చటుక్కున అయిపోయేడు. సమస్య మాకూ, ఆ ఫేమిలీలకి” అని సెక్షన్ లో అందరూ తిట్టుకుంటున్నారు.

కేసు నడుస్తూ ఉండగా, అతను ఆఫీస్ లో తీసుకున్న లోన్ లూ, బయట నించీ అతను అప్పులు చేసినట్టు వచ్చిన వేలిడిటీ ఉన్న బాండ్ లూ, లెక్కలు చూస్తే అతని జిపిఎఫ్ లో ఉన్న డబ్బు అసలు సరిపోనే లేదు. ష్యూరిటీ సంతకాలు పెట్టిన వాళ్ళు తిట్టి పోస్తున్నారు రాములుని, అతని పెళ్ళాలని. గ్రాట్యుటీ అతను భార్యకే రాసేడు. కేసు అయిన దాకా చేసేదేమీ లేదు.

నాకు వేరే సెక్షన్ కి ట్రాన్సఫర్ అయిపోయింది.


ఏడాది తరవాత పెన్షన్ సెక్షన్ ఆఫీసరు గారు కనిపించి చెప్పేరు. "మేడమ్! రాములు కేసు లో అతని ముగ్గురు భార్యలకీ పెన్షన్ సమానంగా పంచీయాలని తీర్పు వచ్చిందండీ! ముగ్గురూ వచ్చి నానా తిట్లూ తిట్లు వెళ్ళేరు "

నేను ఊహించినట్టే అయింది. మొత్తానికి పెన్షన్ పేచీ తోపాటు మా టెన్షన్ కూడా తీరింది.

**********


గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.


రచయిత్రి పరిచయం :

నా పేరు మంగు కృష్ణకుమారి. విశాఖపట్నం నేవల్ బేస్ లో ఆఫీస్ సూపరింటెండెంట్ గా చేసి రిటైరయ్యాను. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నాము. విద్యార్ధి దశలో ప్రారంభించి వదిలేసిన రచనావ్యాసంగాన్ని ఈ మధ్యనే మళ్లీ ప్రారంభించాను. నా రచనలు ప్రచురించి ప్రోత్సహిస్తున్న మన తెలుగు.కామ్ వారికి ధన్యవాదాలు.

29 views1 comment

1 Comment


కోర్టు తీర్పు ఆశ్చర్యంగా ఉంది. ఎవరి తో పెళ్ళి ముందయతే చట్ట ప్రకారము వారే కదా భార్య.

Like
bottom of page