కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
కథను యు ట్యూబ్ లో చూడటానికి క్రింది లింక్ క్లిక్ చేయండి
'Pichukamma Picchuka Bangaru Pichhuka' New Telugu Story
Written By Nallabati Raghavendra Rao
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
వాతావరణ కాలుష్యం వల్ల, ముఖ్యంగా సెల్ల్ టవర్ల వల్ల పక్షి జాతి అంతరించి పోతోంది.
ముఖ్యంగా పిచ్చుకలు మచ్చుకి కూడా కనిపించడం లేదు.
మామూలు హాస్య కథలోనే పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను తెలియజేసారు నల్లబాటి రాఘవేంద్ర రావు గారు.
ఇక కథలోకి వెడదాం.
ఆ చెట్టు మీద సరస సల్లాపాలాడుకుంటూ అందమైన పిచ్చుక జంట..
''ఒసేయ్ నా రాచవన్నెల బంగారు పిచ్చుక..
నన్ను ముక్కుతో పొడవకే. నువ్వు నన్ను లైన్ లో పెడితే నా వల్ల నీకు పిల్లలు పుడతారు.. అనుకోకు. ఎందుకంటే ఈ మానవజాతి వల్ల కలిగిన వాతావరణ కాలుష్యంతో మన జాతిలో ప్రత్యుత్పత్తి సామర్థ్యం ఎప్పుడో తగ్గిపోయిందే. పోనీ మన ఇద్దరికీ ఎలాగోలా పిల్లలు పుట్టారే అనుకో.. ఈ భూ ప్రపంచపు కాలుష్యంలో మన పిల్లకాయలు బ్రతికి బట్ట కట్టలేరు'' అంది మగ పిచ్చుక.
''అవును మావా.. అసలు నువ్వు నేను బ్రతికి బట్ట కడతామంటావా? మన జాతి పూర్తిగా నశించి పోతున్నప్పటికి ఈ మానవులు పట్టించు కోవడం లేదు ఎందుకనో?'' నిట్టూరుస్తూ అంది ఆడ పిచ్చుక.
''ఓస్.. జంతువులు పక్షులు నశిస్తే మనకేం.. అనుకుంటున్నారేమో వీళ్లు. ఈ మనిషి గొప్ప వాడు కావడం కోసం అటవీ ప్రాంతాన్ని హరిoచేస్తున్నాడు. దాంతో వర్షాలు పడటం లేదు. మొక్కలు కూడా మొలవడం లేదు. ఇక ఇలాగే కొనసాగితే కేవలం మన జాతి మాత్రమే కాకుండా అప్పుడు శాఖాహార మాంసాహార జంతువులు కూడా నశిస్తాయి.
అప్పుడేమవుతుందో తెలుసా.. జీవావరణ చక్రం దెబ్బతిని మానవాళి మనుగడే ప్రశ్నార్ధకమవుతుంది.. అది తెలుసు కోలేక పోతున్నారు ఈ మానవ మొనగాళ్లు.'' అంది మగ పిచ్చుక.
''మీ పురాణం కట్టి పెట్టవో మామ. నీ పిచ్చుక పురాణం ఎవడు వింటాడు. సరే నేను అడిగిన దానికి చెప్పు. మనకు ఇంతటి నష్టం కలుగ చేసిన ఈ మనుషుల మీద కసి పగ ద్వేషం తీర్చుకోవాలని ఉంది నాకు. పని జరుగుతుం దంటావా?''
ప్రేమగా కోరిక కోరింది ఆడ పిచ్చుక.
''ఓస్.. ఇదే కదా నీ కోరిక. నాతో రామాపురం రా. అక్కడ ఆనంద పరమానందయ్య గారి ఇంటికి వెళదాం. అక్కడ మనుషులను ఓ ఆట ఆడించి వాళ్ళను ఏడిపించి తద్వారా నీ కోరిక తీరుస్తాను రా'' అన్నది మగ పిచ్చుక ఆడ పిచ్చుక ముక్కునుగీరుతూ.
''ఎట్టా?'' ఆశ్చర్యంగా చూసింది ఆడ పిచ్చుక.
''ఎట్టా లేదు, తట్టా లేదు, బుట్టా లేదు.. నే చెప్తాగా.. నాతో రా.''
అంటూ మగ పిచ్చుక గాలిలోకి ఎగిరింది.
''కిచ్ కిచ్ కిచ్.. తుర్రుతుర్రు తుర్ తుర్..''
అనుకుంటూ..దానిని అనుసరించింది ఆడపిచ్చుక.
***
అది రామాపురం.
సెల్ఫోన్ ఆన్ చేశాడు ఆనంద పరమానందయ్య.
''ఒరేయ్ సకలగుణానందం. నేను మీ నాన్నని ఆనంద పరమానందయ్యని మాట్లాడుతుండ. చెప్పింది విని ఆశ్చర్యపడి కింద పడిపోతావు. అందుకని ప్రశాంతంగా ముందు కూర్చి మీద కూర్చొని విను.. మన ఇంటి ప్రహారీ గేటు దాటి లోపలికి వచ్చినాక మన వీధి అరుగు మీద లావుపాటి కర్రస్తంభాలు ఉండాయి చూడు..
వాటికి ధాన్యం కంకుల గుత్తులు వేలాడదీశా.
ఆ వరిపురి గుత్తు మీద చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడిప్పుడే ఎక్కడనుండో ఒక..' కచ్చుపి' జంట వచ్చి వాలింది. చూడముచ్చటగా ఆడుకుంటున్నాయి. దగ్గరకు వెళితే ఎగిరి పోతాయని వాట్లను దూరం నుండి చూడటం కోసం బైనాక్యులర్ అంటారే అది తెప్పించాను. దానిలోంచి మన ఈశాన్యంమూల నూతిగట్టు వార నుండి..ఊరందరూ పిల్లకాయలతో సహా వచ్చి..అలా దూరం నుంచి చూసి సంబరపడి పోయి ఎగిరి గంతు వేసి వెళ్తుండారు. ఆనంద పరమానందభరతమైపోతుండారు. ఫోన్లో మాటలు బాగా వినబడుతున్నాయా?
సరే.. ఇప్పుడు నీకు ఎందుకు ఫోను చేశానంటే... మీరందరూ లగేత్తుకుని రెండుమూడు గంట ల్లో వచ్చేయండి. మళ్లీ జీవితంలో చూడలేము. ఈ ' కచ్చుపి' జంట ను. అక్కడున్న మా అమ్మ చూడాలని ఇష్టపడు తుంటే మీరు వచ్చేటప్పుడు దానిని కూడా తీసుకొచ్చేయండి. ఈ 'కచ్చుపి' లoటే మీ నానమ్మకి చాలా ఇష్టంరా''.. అంటూ మాట్లాడి సెల్ కట్టేశాడు. రామాపురం లో ఉన్న ఆనందపరమానందయ్య.
***
ఫోన్లో తన తండ్రి మాటలు విన్న సకల గుణా నందం తన భార్య సతీ సుమతి సక్కుబాయితో, ఇద్దరు పిల్లలతో వెంటనే బయలుదేరి పోయాడు.. రామాపురం.
''నువ్వు ఇంట్లో ఉండవే నానమ్మ.. మేం వెళ్లి 'కచ్చుపి'.... జంటను చూసి వస్తాము'' అన్నాడు.. నానమ్మతో.
''కచ్చుపి.. అని తిరగేసి పలకకూడదు రా పిచ్చి సన్నాసి. దాన్ని ముద్దుగా పిచ్చుక అనాలి. కొన్నాళ్ళుగా అవి కనపడ పోయేసరికి.. పేరు కూడా మరిచిపోయారు. తింగరంగర వెధవ.. నేను కూడా వస్తాను పదండి'' అంది నానమ్మ మాలచ్చిమమ్మ.
''90 ఏళ్లు నీకు... దారిలో బాల్చి తన్నేస్తావే..'' అన్నాడు మనవడు సకల గుణానందం.
''నోరు ముయ్యిరా దారిలో చస్తావు అనొచ్చుగా. అక్కడ ఆ పిచ్చుకలను చూచి.. తనివి తీరా ''హుష్''... అని చప్పట్లు కొట్టి బెదిరిస్తే ఆ చిరు శబ్దానికి అవి ఆనందంగా ‘తుర్రుర్రుర్రుర్రు’ అంటూ ఎగురుతాయి చూడు.. ఆ దృశ్యం చూచి అక్కడే చచ్చిపోయినా నష్టం లేదు. నడండ్రా..''
అంది మాలచ్చిమమ్మ తన బట్టల సంచి భుజాన వేలాడ తీసుకుంటూ.
అలా అందరూ కలిసి ప్రయాణమై ఓ గంటన్నరలో రామాపురం చేరిపోవాలని ట్రైన్ ఎక్కారు. అదే ట్రైన్లో అమెరికా నుంచి వచ్చి, ప్రస్తుతం అక్కడికి దగ్గరలోనే హోటల్ లో ఉంటున్న తెలుగు బాగా మాట్లాడగలిగిన ఓ అమెరికన్ రామాపురంలో పిచ్చుకలు ఉన్న విషయం టీవీ స్క్రోలింగ్ ద్వారా తెలుసుకొని ఆ వింతను తను కూడా చూడటానికి అదే ట్రైన్ లో బయలు దేరాడు.. అదే బోగీలో ఎక్కాడు.
అయితే పిచ్చుకలను అదే పేరుతో పిలవడం.. తన కొడుకు, కోడలు, పిల్లలకు తెలియటం లేదని, ఎంత చెప్పినా ప్రయత్నించినా పిచ్చుకను తిరగేసి పలుకుతున్నారని, తనకు తల తెగేసినట్టు ఉందని తెగ వాపోతూ అమెరికన్ తో చెప్పింది, మాలచ్చిమమ్మ. ఆ విధంగా అసలు విషయం తెలుసుకున్నాడు.. ఆ అమెరికన్.
వీళ్ళందరికీ పిచ్చుకలను తిరగేసి ‘కచ్చుపి’ అనకుండ కరెక్టుగా ఎలా పిలవాలో.. దారి పొడవునా ట్రైనింగ్ ఇవ్వడం మొదలు పెట్టాడు అతను.
''మీ దేశంలో పిచ్చుకలు అంతరించిపోవడానికి కారణాలు ఇక్కడి పేపర్లలోనే చదివాను. మీ శాస్త్రజ్ఞులు చెప్పిన కారణాలు ఏమిటంటే..
ఒకటి.. యంత్రాల వినియోగం వల్ల వచ్చే రేడియేషన్.. రెండు..సెల్ టవర్ల విద్యుదయస్కాంత తరంగాలు.. మూడు..పొలాల్లో క్రిమిసంహా రకాలు... నాలుగు..విపరీత శబ్ద కాలుష్యం... ఐదు.. పిచ్చుకలు గూళ్ళు కట్టుకోవడానికి అసలు స్థలమే లేక పోవడం...
ఇలా రకరకాల కారణాలన్నమాట. సరే విన్నారుకదా. ప్రపం చంలో ఎక్కడ ఉన్న శాస్త్రజ్ఞుడు చెప్పినా ఇదే మాట. ఏది మరి. మీరంతా ఒక్కసారి ముక్త కంఠంతో... నా పెదాల వైపు చూసి.. పిచ్చుక… అనండి..” అంటూ నేర్పించబోయాడు.. ఆ విదేశీ మనిషి.
అయితే అతను ఎంత చెప్పినా.. నేర్పించినా ప్రయత్నించినా చివరికి వాళ్లందరూ ఏక కంఠంతో.. ‘కచ్చుపి’.. అనేశారు గట్టిగా.. పిచ్చుక అనడం ఏ మాత్రం వాళ్లకి అలవాటు కావడం లేదు.
ఆమెరికన్ అతనికి మతిపోయింది. బోగి నుంచి దూకి ప్లాట్ఫారం మీద నేలకేసి బుర్ర బద్దలు కొట్టుకోవాలనుకున్నాడు...
''మామ్మగారు.. ఇదిగో… మీ పేరు మాలచ్చిమమ్మ అన్నారు కదా.. పేరు అయితే బ్రహ్మాం డంగా ఉంది కానీ… వీళ్ళని మార్చడం నా తరం కాదు.'' అంటూ ముడిచిపెట్టుకు కూర్చుండిపోయాడు.
''కంగారుపడకు అమెరికన్ మనిషి. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందయ్యా.. ఇదిగో నేను ఒక తిరకాసు ఉపాయం చెప్తాను. అది పాటించు వీళ్ళకి.. అదే సరైన మందు..'' అంటూ అతని చెవిలో ఏదో గుసగుసగించింది మాలచ్చిమమ్మ.
అర్ధమైన అమెరికన్ మళ్లీ వాళ్ళ దగ్గరకు వచ్చి
''ఇదిగో.. మీ పక్షి పిచ్చుకను మీరే ఆ పేరుతో పిలవ లేకపోవడం.. ప్రపంచ దేశాలలో హాస్యాస్పదమైన విషయంగా మారిపోతుందయ్యా బాబు.
అందుచేత మీకు వచ్చి తీరాలి.. కనుక నేను నేర్పి తీరతాను. ఏది.. పెదాలు ఇలా దగ్గరగా పెట్టి అనడం మొదలు పెట్టండీ... ఇంకొంచెం దగ్గరగా పెట్టండి పెదాలు... రెండు పెదాలు ముందుకు చుచ్చుబుడ్డులా పెట్టండి.
అయ్యో ఎంత చెప్పినా నేర్పిన మీకు రావడం లేదు కదూ... సరే మాలచ్చిమమ్మ గారు చెప్పినట్టు... తిరకాసు ప్రయత్నం చేస్తాను మరి.
ఇదిగో అలా వద్దు గాని పెదాలు మామూలుగా పెట్టేయండి బాబు. ఇప్పుడు ముందుగా పెదాలు విడదీసి
క... అనండయ్య బాబు.... అన్నారు కదా..
అది.....ఆ తర్వాత...చ్చు... అనండి.
అదిగది..ఇప్పుడు చివరగా...పి...అనండి.. అన్నారు కదా..
బలే బలే..ఇప్పుడు ఆ మూడు కలిపి.. కచ్చుపి కచ్చుపి కచ్చుపి కచ్చుపి.... అనండి..పలకండి....'' అంటూ నేర్పించాడు.
అయితే తిరగేసి పలకడమే ధ్యేయంగా కలిగిన వాళ్లంతా అమెరికన్ చెప్పిన.. కచ్చుపి...ని పిచ్చుక..... పిచ్చుక... అంటూ పలికేశారు!!
ఆఖరికి తిరకాసు ప్రయత్నం విజయం మహా విజయం సాధించేసింది.
ఆ దెబ్బతో అమెరికన్అతనికే కాదు... మాలచ్చిమమ్మకు కూడా మహదానందం కలిగి కేరింతలు కొట్టేశారు... పైకి లేచి భరతనాట్యం..కథాకళి చిందునాట్యం.. ఇంకా రకరకాల నాట్యాలు చేసి పడేశారు.
ఆ హడావుడికి ట్రైన్ ఆగిపోయింది. చూస్తే అది రామాపురం స్టేషనే. గబగబా అందరూ దిగి... అక్కడికి కొంచెం దూరంలోనే ఉన్న ఆనంద పరమానందయ్య ఇంటికి పరుగు పరుగున వెళ్లిపోయారు.
ఆనంద పరమానందయ్య వచ్చిన వాళ్ళందర్నీ తన ఇంటి ముందు ఈశాన్యం మూలన ఉన్న నూతి గట్టు వారకు శబ్దం చేయకుండా తీసుకెళ్లి, బైనాకులర్స్తో ఆ పిచ్చుక జంటను చూపించే ప్రయత్నం చేశాడు.
''ముసలి దాన్ని.. నేను ముందు చూస్తా.. ప్రాణం పోయేలా ఉంది..'' అడిగింది మాలచ్చిమమ్మ.
''నీదంతా దొంగ నాటకమే నానమ్మ. ప్రాణం పోద్దని.. చచ్చిపోతానని... బకెట్ తన్నేస్తానని ఎప్పటి నుంచో మమ్మల్ని ఆడిస్తున్నావు...చాన్సుల మీద ఛాన్సులు కొట్టేస్తున్నావ్ '' చిరాగ్గా అన్నాడు మనవడు సకల గుణా నందం.
''ఏమిట్రా కూస్తున్నావ్ కుర్ర వెధవ'' అరిచింది
మాలచ్చిమమ్మ.
''ఏం లేదే నానమ్మ.. నీ చెవికి అన్ని పెడర్థాలు గానే వినబడతాయి. పెద్ద కాలం కదా.. నేను ఇంటికి మగవాడిని. నాన్నని ఉద్ధరించవలసిన వాడిని.. ఆ పిచ్చుక జంటను నేనే ముందు చూస్తాను'' అంటూ బైనాక్యూలర్ లాక్కున్నాడు సకల గుణానందం.. ఆమె దగ్గర నుండి.
''ఆడవాళ్లకు బస్సుల్లో మాత్రం ముందు సీట్లు. మిగిలిన చోట్ల మాత్రం మేము వెనకబడే ఉండాలా? కుదరదంటే కుదరదు... ఏది ఇలా ఇవ్వండి.."..అంటూ.. భర్త దగ్గర నుండి బైనా క్యులర్ లాక్కుంది సతీ సుమతి సక్కుబాయి.
“చిన్నపిల్లలు దేవుడుతో సమానమంటారే కానీ అలా చూడరు. ముందు మేము చూస్తాం.'' పిల్ల లిద్దరూ బైనాక్యులర్ తల్లి దగ్గర నుండి లాగేసుకున్నారు.
వెంటనే అమెరికన్ ముందుకొచ్చి
''ఇతర దేశం నుండి ఈ దేశంలో వింతలన్నీ చూడటానికి వచ్చినవాడిని నన్ను ఇంత అవమానిస్తారా! ప్రపంచ వింతలు అన్నీ చూస్తూ వస్తున్న మనిషిని.. ముందు నేనే ఆ పిచ్చుక జంటను చూడాలి'' అంటూ ఆ అమెరికన్, బైనాక్యులర్ లాగేసుకున్నాడు పిల్లల దగ్గర నుండి.
ఎంతకీ సమస్య తేలకపోయేసరికి పిచ్చుక జంటని ఎవరు ముందుగా చూడాలి అనే విషయంలో లాటరీ వేసి సమస్య ప్రశాంతంగా సెటిల్ చేశాడు ఆనంద పరమానందయ్య.
అందరూ వరుసను బట్టి పిచ్చుక జంటను చూడడం పూర్తయ్యాక....
అమెరికన్ వ్యక్తి ఆ పిచ్చుక జంట ను దగ్గరగా చూస్తూ, ‘హుష్ పిచ్చుక’ అంటే అవి హడలి తుర్రు తుర్రు తుర్రు అంటూ కిచికిచికిచి అంటూ ఎగిరే ఆ సన్నివేశం స్పాట్ ఫోటో తీయాలని తన ప్రయత్నంగా చెప్పాడు.. ఆ ఇంటి పెద్ద తో.
మళ్లీ గడబిడ మొదలైపోయింది.
మాలచ్చిమమ్మ తనకొడుకు ఆనంద పరమా నందయ్య దగ్గరకు వచ్చి...
''ఒరేయ్ పిచ్చి సన్నాసి.. ఆనందపరమానందం! ఇది మన ఇల్లు రా.. మనం హుష్ పిచ్చుక అంటే అవి సరదాగా ఎగరాలి. ఆ రకంగా ఆనందం ముందు మనం పొందాలి రా. అంతే గాని ఈ అమెరికన్ వాడికి ఆ ఛాన్స్ ఇస్తావా? కుదరదు గాక కుదరదు. నాకు కూడా ఎప్పటి నుంచో ఆ సరదా తీర్చుకోవాలని ఉంది'' అరిచినట్టు అంది మాలచ్చిమమ్మ.
దాంతో అమెరికన్ కు కోపం వచ్చి
''ఏమ్మో..చూడ్డానికి మంచి దానివనుకున్నాను. ఇదా నీ నిజరూపం! చాలు చాలు. అవసర మైతే 50 వేలు ఈ ఇంటి ఓనర్ కు ఇస్తాను కానీ నీకు పిచ్చుకలను హుష్ అనే అవకాశం మాత్రం ఇవ్వను.. ఇవ్వను గాక ఇవ్వను. నేను రెండు చేతులతో ఇలా హుష్ అన్నప్పుడు అవి తమాషాగా రెక్కలు ఆడిస్తూ స్పీడుగా ఎగిరే దృశ్యం ఆ బంగారు పిచ్చుకలతో కలిసి నేను ఉన్న ఫోటో.. అన్ని దేశాల పత్రికలలో వేయించుకుంటాను. ప్రపంచమంతా ఇంటర్నెట్లో నా పేరు మారుమోగిపోతుంది. దాంతో నాకు బోలెడంత పాపులారిటీ... అందుచేత ఇదిగో ఆనంద మహాదానందయ్య గారు.. 50,000తీసుకోండి..'' అంటూ క్యాష్ అందివ్వబోయాడు అమెరికన్.. ఆనంద పరమానందయ్య కు..
వెంటనే కంగారుపడి మాలచ్చిమమ్మ ముందుకొచ్చి...
“అయ్యో అయ్యో..అలా ఆపు అమెరికన్ అబ్బాయి. ఒరేయ్ పరమానంద అబ్బీ.. ఇదిగో నా బంగారపు గుళ్ల పేరు.. ఈ మధ్యన రేటు కట్టిస్తే 70 వేలు వస్తుందన్నాడు బ్రహ్మంగారు. ఇది నువ్వు తీసేసుకోరా. పిచ్చుకులను హుష్ అనే అవకాశం మాత్రం నాకే ఇవ్వాలి. ఎందుకంటే రేపు ఎల్లుండో బకెట్టు తన్నబోయే ముసలిదాన్ని కదరా'' అంటూ మాలచ్చిమమ్మ ఏడుపు లంకించుకుంది.
ఇప్పుడు సకల గుణానందం ముందుకు వచ్చాడు
''శభాష్ బాగుంది.. మీరంతా నాన్నను డబ్బు తో కొడితే నేను సెంటిమెంట్తో కొడతాను'' అంటూ తండ్రి వైపు తిరిగి
''నాన్న.. నీకు తలకోరివి పెట్టవలసిన వాడిని నేను. పైగా నేను నీకు పైసా ఇవ్వను. బాగా ఆలో చించుకో'' అంటూ బెదిరించాడు.. తండ్రి ని.
అంతే..ఆనంద పరమానందయ్య కొడుకు బెదిరింపులకు తలవంచక తప్పలేదు.
ఇక ఇప్పుడు… సకలగుణానందం నడుచుకుంటూ ఈశాన్యం మూల నూతిగట్టు వార నుండి నెమ్మదిగా మెట్లు ఎక్కి విశాలమైన అరుగు మీద ఉన్న కర్ర స్తంభానికి వేలాడ కట్టిన ధాన్యంకంకుల గుత్తి మీద నిలబడ్డ ఆ పిచ్చుక జంటను దగ్గరగా చూస్తూ హుష్ అని చేతులతో చప్పట్లు కొట్టాలని, అవి ఎగిరే టప్పు డు ఫోటో తీయించుకోవాలని తన ప్రయత్నం మొదలుపెట్టాడు. మిగిలిన అందరూ కొంచెం దూరంగా అతడిని అనుసరించి నిలబడ్డారు.
***
ఇదంతా చిలిపి కళ్ళతో అలా అలా చూసి చూడనట్లు చూస్తున్న ఆ బంగారు పిచ్చుకల జంట... మనసులో తెగ నవ్వేసుకుంది.
మగ పిచ్చుక ఆడపిచ్చుకతో అప్పుడు ఇలా అంది
''ఒసేయ్ నా రాచవన్నెల బంగారు పిచ్చుక.... వింటున్నావు కదా.. చూస్తున్నావు కదా.. అదన్నమాట ఈ మానవుల విధానం.
సరే ఇప్పుడే మనం ఈ మానవుల మీద మన కక్ష కసి,పగ, ద్వేషం... తీర్చుకునే సమయం ఆసన్న మైందన్నమాట. వాళ్లు మనల్ని హుష్ అని బెదిరిస్తే మనం భయపడి ఎగిరిపోవాలట! మనం ఎంత చులకన అయిపోయామో చూస్తున్నావు కదా. మన జాతి అంతరించిపోవడానికి కారణమయ్యింది కాకుండా.. ఇదిగో ఫోటోలు కూడా తీసుకుంటారట!
అదిగో దగ్గరకు వచ్చేస్తున్నారు.. ఇప్పుడు మనం ఆ సరదా, ఆనందం వాళ్లకి ఇవ్వకూడదు. వాళ్లు హుష్ అనకుండానే మనం ఎగిరిపోతే వాళ్లకు ఆ కోరిక తీరదు. ఆ విధంగా మనం వాళ్ళ ఫోటో లో పడకూడదు. దాంతో వాళ్లు ఆ కోరిక తీరక కుళ్ళు కుంటారు..ఏడుస్తారు..!! అప్పుడు మన పగ, కసి తీరినట్టే కదా.. రా వాళ్ళు వచ్చేస్తున్నారు. ఎగిరి పోదాం''...
అంటూ కంగారు పెట్టింది ఆ మగ పిచ్చుక.
''ఓస్ ఇంతేనా... ఇంకా ఏదో మహా గొప్పగా పొడిచేస్తావ్ అనుకున్నాను మామ..'' అంది ఆడ పిచ్చుక నీరసంగా.
''అలా అనకే.. మనం అంతకన్నా ఏమీ చేయలేము. మనం అర్భక జీవులం. అర్బక పిచ్చుకలం... మన గురించి ఎవడికి కావాలి. మన పిచ్చుక పురాణం ఎవడు వింటాడు.'' అంది మగపిచ్చుక.
''నిజమే మామ..మనది... పిచ్చుక పురాణం కాదు....పిచ్చి పురాణo....!! సరే రా.... ఎగిరి పోదాం..వాళ్ళు రెడీ అయిపోతున్నారు.''
అంతే... రెండు కన్నీటి బొట్లు కార్చిన ఆ బుజ్జి పిచ్చుకల జంట....
కిచ్ కిచ్ కిచ్ కిచ్ కిచ్..తుర్రుర్రుర్రుర్రుర్రు....
అంటూ వెళ్లిపోయాయి ఆకాశంలోకి.
తాము ఇంకా హుష్ అనకుండానే ఎగిరిపోయి తమను నిరాశపరిచిన ఆ పిచ్చుక జంట కనపడకపోయే సరికి తలను గోడకేసి బాదుకున్నారు..
ఆ పిచ్చుక జంటను చూడడానికి... వాట్లతో సరదాగా ఆడుకోవడానికి వచ్చిన వాళ్లంతా.
***
నల్లబాటి రాఘవేంద్ర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
ముందుగా " మన తెలుగు కథలు" నిర్వాహకులకు నమస్సులు..
"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.
రచయిత తన గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.
పునాది....
-----------
ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.
ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా.. రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.
తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో
టెన్త్ క్లాస్ యానివర్సరీ కి 15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.
అప్పుడే నేను రచయితను కావాలన్న
ఆశయం మొగ్గ తొడిగింది.
నా గురించి..
---------------
50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.
450 ప్రచురిత కథల రచన అనుభవం.
200 గేయాలు నా కలం నుండి జాలువారాయి
200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి
20 రేడియో నాటికలు ప్రసారం.
10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.
200 కామెడీ షార్ట్ స్కిట్స్
3 నవలలు దినపత్రికలలో
" దీపావళి జ్యోతి "అవార్డు,
"రైజింగ్స్టార్" అవార్డు
" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.
ప్రస్తుత ట్రెండ్ అయిన ఫేస్బుక్ లో ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు నాకథలు, కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..
రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!
ఇదంతా ఒక్కసారిగా మననం చేసుకుంటే... 'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.
ఇక నా విజయ ప్రయాణగాధ....
------+------------------------------
పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!
తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ... నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి వారైన సినీ గేయరచయిత
" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.
1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి కథ.
2. రేడియో నాటికలు గొల్లపూడి మారుతీ రావు గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.
3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర" ద్వితీయబహుమతి కథ.. "డిసెంబర్ 31 రాత్రి"
4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ
5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ
6. దీపావళి కథలు పోటీలో "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.
7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ
8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"
9. "స్వాతి " తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."
10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్ "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"
11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం కురిసింది"
12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ
13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..
14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం" న్యాయనిర్ణేత జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.
15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .
16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ
" ఇంద్రలోకం".
17. కొమ్మూరి సాంబశివరావు స్మారక సస్పెన్సు కథల పోటీలో "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.
18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ " గాంధీ తాత" రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.
19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.
20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".
21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".
22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి కథ "ఆలస్యం అమృతం విషం"
23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.
24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.
25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.
26. రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ పోటీ లో ఎన్నికైన కథ.
27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".
28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.
29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.
30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం" వారం వారం 30 కథలు.
31. "కళా దర్బార్" రాజమండ్రి.. రాష్ట్రస్థాయి కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.
32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి" కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.
33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో ప్రథమ బహుమతి పాటకు వారి నుండి పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక రంగస్థల ప్రదర్శనలు పొందడం.
34. విశేష కథలుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు
నలుగురితోనారాయణ
కొరడా దెబ్బలు
అమృతం కురిసింది.
వైష్ణవమాయ
ఐదేళ్ల క్రితం
ఇంద్రలోకం
బిందెడు నీళ్లు
చంద్రమండలంలో స్థలములు అమ్మబడును
డిసెంబర్ 31 రాత్రి
మహాపాపాత్ముడు
35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.
ప్రస్తుతం...
1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం
2. పరిషత్ నాటికలు జడ్జిగా..
3. కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..
సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.
4. .. 4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.
5. ఒక ప్రింటెడ్ పత్రిక ప్రారంభించే ఉద్దేశ్యం.
భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.
కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.
కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.
కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.
మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.
నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.
నల్లబాటి రాఘవేంద్ర రావు
Comments