top of page

పిరికోడు

Pirikodu Written By Matturthi Chitti Purna Chandra Rao


రచన : పూర్ణ... మత్తుర్తి


కాలింగ్ బెల్ మోత కు చూస్తున్న టి వి సౌండ్ తగ్గించి ఇపుడెవరొచ్చారో అనుకుంటూ డోర్ తీసా.

“అంకుల్... అంకుల్ ,మీరు టివీ లో వస్తున్నారు.. చూసారా ’ అంటూ పక్కఫ్లాట్ లో పదేళ్ల బంటి వచ్చాడు.

మా చంటిగాడు లోపల్నించి రయ్యి మని హాల్లోకొచ్చి బంటి అన్నది వినినట్టున్నాడు.

'ఏచానల్లో రా వస్తున్నాడు మా డాడీ ?' అన్నాడు వెంటనే మొహం నవ్వుతో వెలిగిపోతుంటే. ఈ హడావిడికి మా ఆవిడ కూడా వచ్చింది ఏమయ్యిందంటూ......

"ఏమో' అని ‘ఏ చానల్లో ‘అన్నా.. నేనేమీ సెలబ్రటీ ని కాదు. చాలా మామూలు సగటు మనిషినే కాదు,చిన్న ప్రయివేటు ఉద్యోగిని. ఈ రోజు సెలవు అవ్వడంతోఇంట్లోనే ఉండిపోయా.

‘ఎవడో నా పోలికలతో ఉన్నట్టుగా ఉన్న వారినెవరో చూసి నేననుకుని హడావుడి చేస్తున్నాడు ఈ బంటి.’ అనుకున్నా మనసులో.

ఈలోగా ఛానల్ మార్చారు...రాత్రి ఎనిమిది గంటలయ్యింది.వార్తలొస్తున్నాయ్.

"నాన్నోయ్ నాన్నోయ్! కనబడుతున్నావ్ అదిగో", అని ఒక్కసారిగా అరిచాడు మా వాడు. నేనూ ఆశ్చర్యంగా చూసా.

"నే చెప్పానా. మీ డాడియేరా..", అంటున్నాడు బంటి, గొప్ప న్యూస్ చెప్పినట్టు ఫీలవుతూ మావాడి భుజమ్మీద చేయేస్తూ..

మా ఆవిడ సీరియస్ గా చూస్తుంది.......

అది పిచ్చ ట్రాఫిక్ తో ఉన్న కూకట్పల్లి సెంటర్.. ఒక మూల ఫుట్పాత్ దగ్గర ఒక పెద్థాయన ను పట్టుకుని కూర్చోపెడుతున్న నన్ను చూశా..

అపుడు గుర్తుకొచ్చింది జరిగిన సంఘటన... ఆఫీసుకెళుతున్న నా స్కూటర్కు అడ్డుగా రావడంతో ఆ పెద్థాయన ను తప్పించి పక్కకి బండాపి కోపంగా అరవబోయిన నన్ను చూసి రెండు చేతులూ జోడించాడు .

దీనమైన మొహంతో ఉన్న ఆ డెబ్బై ఏళ్ల అతనిని చూసి కోపాన్ని మింగేసి అతని దగ్గర కు వెళ్లా.

అప్పటికే ట్రాఫిక్ ఆ ఏరియాలో కాస్త డిస్ట్రబ్ అయ్యి మళ్లీ సర్దుకుంది....


కంగారు పడొద్దని అతనిని ఓ పక్క ఖాళీ జాగా లో కూర్చోపెట్టి నా దగ్గర ఉన్న బాటిల్ లో నీళ్ళు ఇచ్చా. తాగాడాయన.తన గురించి చెప్పాడు. "సరే రండి నేను ఆ ఏరియా వైపే వెళుతున్న అక్కడ దింపి ఆఫీసుకెళతా " అని జాగ్రత్త గా డ్రైవ్ చేస్తూ ఒక అపార్ట్మెంట్ దగ్గర ఆపాను. ఎంతో సంతోషంతో కృతజ్ఞతలు చెబుతూ లిఫ్ట్ లో వెళ్లాడాయన.. ఇది నిన్ననే జరగడం వలన బాగా గుర్తుంది..

అది చూపెడుతూ యాంకర్ చెబుతుంది. ఎవరూ ఎవరినీ పట్టించుకోని ఈ రోజుల్లో ఈయన ఆ పెద్థాయనకు సాయం అందిస్తున్న ఘటన అటుగా వెళుతున్న మా టీం గమనించింది. వారిని ఫాలో అవుతూ ఇదిగో ఇలా ఆయన్ని ఆపి మా టీం ఏంమాట్లాడుతున్నారో విందాం..."" అంది ..

అందరం టీవి లో చూస్తున్నాం చంటి బంటి లు నన్ను చూస్తూ మళ్లీ టివి వైపు చూస్తున్నారు. మా ఆవిడ మాత్రం చంటి గాడంత ఆనందపడడం లేదు. ముడేసుకున్న నొసలు తో చూస్తుంది..

" ఎవరండి ఆ పెద్దాయన " టీవి వారు అడిగారు.

“ఎవరోనండి.. నా బండి కడ్డుపడ్డారు. గండం తప్పింది. ఏం జరగలేదు. రెండో అబ్బాయింటికి వెళ్లాలి, బస్సు కోసం అటువేపు వెళ్లాలంటే నేనే ఆ ఇంటివరకూ వెళ్లి దింపి వస్తున్నా! “అని చెప్పాను.

" చాలా మంచి పని చేసారండి. మీలా పెద్ద వారిని కళ్లలో పెట్టుకుని చూసుకునే వారుంటే వృద్దాశ్రమాలు పెరగిపోవండి.. మీకు జేజేలు.. నమస్తే."

" మీరే ఛానలండి ?"అడిగా, చెప్పారు.....

"రేపు ఈ న్యూస్ వస్తుంది సాయంత్రం", ... అన్నారు..

ఈ విషయం గుర్తే లేదు. ఇపుడిది చూసేవరకు.ఆ రోజు ఆఫీసుకు లేట్ అయ్యేసరికి మా బాస్తో చివాట్లు తప్పలేదు.....

" ఐపోయింది పిల్లలూ ఇక పడుకోండి" , ’చాలా గొప్ప పని చేసావ్’ అన్నట్టు గా వెటకారంగా చూసి లోపలికెళ్లిపోయింది. “భోజనానికి రండి ", అంటూ...

ఆఫీసు బ్యాగ్ లో ఒక పొట్లాంను తీసి ఒంటి పైనున్న తుండు కింద దాచి హాలులో ఒక పక్క మంచంపై కూర్చుని చూస్తున్న 70 ఏళ్ల మా నాన్న దగ్గరకెళ్లి ప్రక్కన కూర్చొని ఆ పొట్లం చేతిలో పెట్టా....

నోరు చప్పగా ఉంటుందిరా అబ్బాయ్ కాస్త కారం కారం గా ఉండే బూందీ తెచ్చిపెట్టు అని అడిగి నాల్రోజులైంది


నాన్న పల్చటి చేతులతో నా మొహం ఆప్యాయంగా తడిమాడు... నా ప్రమేయం లేకుండానే నా కళ్ళు చెమ్మగిల్లాయ్.."" మంచి పని చేసావ్రా అతన్ని జాగ్రత్తగా ఇంటికాడ వదిలొచ్చావ్."", .. అన్నాడు.


“ఆ టీవి ఆపేసి ఇక రండి అన్నంపెట్టా’ .. మా ఆవిడ అరుపు విని ‘ఆ ..ఆ ..వచ్చే", అంటూ పడుకున్న నాన్న పై దుప్పటి కప్పి, వంటిల్లువైపు నడిచా.....


- - - - - - - సమాప్తం - - - - -


గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.


రచయిత పరిచయం :

నా పేరు. చిట్టి పూర్ణ చంద్రరావు. మత్తుర్తి.

నివాసం. మియాపూర్. హైదరాబాద్.

చదువు.. BSc cbz. Yr 1972 final year. KBN college.. Vijayawada.

Job.. APSRTC. Accounts Officer. Retd

On 8/2009.. From Hyd Head Office.


Fb లో ఓ ఐదేళ్లయింది డ్రాయింగ్స్ కార్టూన్లు పోస్టు చేస్తూ అపుడపుడు చిన్న చిన్న కథలు వ్రాస్తూ కాలక్షేపం చేస్తున్నానండి...



36 views0 comments
bottom of page