Podugu Needa Written By Ramesh Kumar M
రచన : యం. రమేష్ కుమార్
దగా పడిన వాడి గుండె మంటలా మధ్యాహ్నం ఎండ తీవ్రంగా వుంది. ఇంకాసేపట్లో లంచ్ బెల్ అవుతుంది. ఎనిమిదో తరగతి రూమ్ దగ్గర ఏదో గలాటా జరుగుతున్నట్టుగా అన్పించి అటువైపు అడుగులేశాను. ఎవరో ఒకామె..
మా సోషల్ సార్ ని ఏదో అడుగుతోంది. పిల్లలందరూ చుట్టూ గుమిగూడివున్నందువల్ల, అసలు గొడవేమిటో అర్థం కావడం లేదు. అప్పటికే అక్కడికి ఇద్దరు ముగ్గురు సార్లు చేరుకున్నారు. నేను కూడా చోటు చేసుకొని మధ్యలోకెళ్ళాను.
ఆమెకు పెద్ద వయసేమీ ఉండదు.. మహా అయితే ముప్ఫై ఏళ్ళకు కాస్త అటూ ఇటూగా వుండొచ్చు. కానీ ఒకరకమైన మొరటుదనం ఆమె మొహంలో కన్పిస్తోంది. అది బహుశా జీవితానుభవాల వల్ల వచ్చింది కావొచ్చు. ముతకచీర, ముడివేసిన జుట్టు, చెమటకి తడిసి కారిపోతున్న నుదుటి బొట్టు..!
సోషల్ సార్ ని గట్టిగానే అడుగుతోంది.. "మా పిల్లని ఎందుకు పంపించారు..? ఎవడొస్తే ఆడితో పంపించేత్తారా..? మీకు బాధ్యత నేదా..?"
"అదేంటమ్మా మళ్ళీ మళ్ళీ అదే అడుగుతావు..? పిల్ల తండ్రినని అతను చెప్పాడు. మీ పిల్ల కూడా అవునంది. అర్జెంటు పనుంది.. పంపండంటే పంపించాను. ఎన్నిసార్లు చెప్పినా మొదటికే వస్తావేం..?" సోషల్ సార్ కూడా గట్టిగానే అన్నారు.
"పిల్ల తండ్రినంటే పంపేత్తారేటండీ..?" ఉక్రోశంగా అడిగిందామె.
మిగతావాళ్ళం కలగజేసుకున్నాం. "అదేంటమ్మా.. తల్లిదండ్రులే వచ్చి అడిగితే పంపించమా..? నువ్వొచ్చి అడిగినా, ఆయనొచ్చి అడిగినా పంపిస్తాం.. అది సహజం. దానికెందుకు అంతగా ఇదయిపోతున్నావ్..?" అన్నాం.
"ఇంతకూ వచ్చింది మీ ఆయనే కదా.. ఎవరో వచ్చి తీసుకెళ్ళిపోయినట్టు అంత గొడవ చేస్తావేంటమ్మా..? అప్పుడే అక్కడికొచ్చిన మా హెడ్ మాష్టారు అడిగారు.
"కాదండీ.. ఆడు తాగుబోతోడండీ.. ఆడితో పడ్నేకే నాను మాయమ్మ దగ్గరికొచ్చి వుంతన్నాను. ఆడొత్తే పిల్లని మీరెలగ పంపేత్తారండీ..?" చేతులు తిప్పుతూ కోపంగా అడిగిందామె.
సంగతేమిటో చూచాయగా అర్థమైంది మాకు. ఇద్దరికీ పొసగడం లేదు. పిల్లని తీసుకొని పుట్టింటికొచ్చేసింది. ఇప్పుడు అతనొచ్చి పిల్లని తీసుకెళ్ళినట్టున్నాడు. అందుకే ఈవిడ అంత బాధపడిపోతోంది.
"అదేంటమ్మా.. అలాటప్పుడు నువ్వు ముందే చెప్పాలి. మాకేం తెలుస్తుంది..? పిల్ల తండ్రొచ్చి అడిగితే పంపకుండా ఎలా వుంటాం..?" అన్నాన్నేను.
"ఇంతకూ ఎవరా అమ్మాయి..?" హెడ్ మాష్టారు అడిగారు.
"ఆరో తరగతిలో శాంతి సార్.. ఇందాక.. అరగంట క్రితం వాళ్ళ నాన్న వచ్చాడు. నేనప్పుడు ఆ క్లాసులోనే వున్నాను. ఏదో అవసరమైన పనుంది.. ఒక్కసారి పంపమన్నాడు.. సరే వాళ్ళ నాన్నే గదా అని వెళ్ళమన్నాను.
ఆ పిల్ల కూడా ఏమనకుండా వాళ్ళ నాన్నతో వెళ్ళింది. ఇప్పుడు ఈవిడొచ్చి గొడవ చేస్తోంది.." అన్నారు సోషల్ సారు.
"అదొక మాలోకం పిల్ల.. ఆ దొంగ సచ్చినోడు ఏదో కొనిత్తానంటే ఆడెనక పోద్ది.. మీరు యెనకా ముందూ సూడకుండా పంపించేత్తారా..?" గట్టిగా అడుగుతున్న గొంతు మధ్యలోనే జీరబోయింది. ఆమె కళ్ళల్లో నీళ్ళు చిప్పిల్లుతున్నట్టు అనిపించింది నాకు.
"అవన్నీ మాకు తెలీదుకదా తల్లీ.. తల్లిదండ్రుల్లో ఎవరొచ్చి అడిగినా పంపిస్తాం. ఇప్పుడు నువ్వు చెప్పావు గనక, ఈసారి నుంచీ మీ ఆయనొచ్చి అడిగినా పిల్లని పంపంలే.." సర్దిచెప్పారు హెడ్ మాష్టారు.
ఆమె ఏదో గొణుక్కుంటూ చెమటలు కారుతున్న మొహాన్ని కొంగుతో తుడుచుకుంటూ ఆ చేత్తోనే మేము గమనించకూడదన్నట్టు బుర్ర కిందకు వొంచి కళ్ళనీళ్ళని అద్దుకుంది. ఇంకా ఏదో అనబోయి మళ్ళీ ఏమనుకుందో ఆ ప్రయత్నాన్ని విరమించుకుని గొణుక్కుంటూనే ఆందోళనగా వెళ్ళిపోయింది.
లంచ్ టైంలో ఈ విషయం గురించే స్టాఫ్ రూమ్ లో డిస్కషన్ జరిగింది.
"తల్లిదండ్రులు విడిపోవడం వల్ల పిల్లలకు కష్టాలొస్తున్నాయి. వాళ్ళు చెయ్యని తప్పుకు బలైపోతున్నారు.." అన్నాడు ఇంగ్లీష్ సార్ రాఘవ.
"అవును.. వీళ్ళ దెబ్బలాటలు, విడిపోవడాలు.. పాపం పిల్లల జీవితాలు చిందరవందరవుతున్నాయి.." సమర్థించాడు సైన్సు మూర్తి.
"అయినా తండ్రికి పిల్లని చూడాలని వుండదా..? ఎంత వీళ్ళు విడిపోతే మాత్రం ఆ మొగుడొచ్చి పిల్లని తీసికెళ్ళి ఏవో కొనిస్తే ఏం తప్పు..?" అన్నాడు రాఘవ.
"అదలా వుంచండి.. ఇక్కడ విషయం ఇంకా వుంది.." అన్నాడు పి.డి. సారు నారాయణ. ఆయన అత్తగారి వూరు ఈ వూరి పక్కనే వుంది. ఈ వూళ్ళో కూడా చాలామంది ఆయనకి తెలిసినవాళ్ళు.. చుట్టాలు వున్నారు. అందుకని వూళ్ళో మాకు తెలీని ఎన్నో విషయాలు ఆయనకి తెలుస్తుంటాయి.
"ఏమిటా విషయం..?" అడిగాడు తెలుగు సార్. లేడీస్ స్టాఫ్ రూమ్ వేరే వుంది గాబట్టి చర్చలో పాల్గొన్నవాళ్ళంతా మగాళ్ళమే వున్నాం.
"ఇప్పుడొచ్చినామె ఏవీ పతివ్రత కాదు.. లేచిపోయిన బాపతు. మొగుడు తాగుబోతు అయితే కావొచ్చుగానీ, వాడు ఈవిణ్ణి వొదిలెయ్యలేదు.. ఈవిడే వొచ్చేసింది. అంతేకాదు వూళ్ళో ఇంకొకడితో బాగోతం మొదలెట్టి అతన్తో లేచిపోయింది. ఈ సంగతి మొన్నే ఎవరో చెప్పారు నాకు..." అన్నాడు నారాయణ.
"అవునా..?" అప్రయత్నంగా అన్నాన్నేను. కళ్ళల్లోంచి నీళ్ళు బైట పడకుండా వేదనంతా లోపలే దాచుకున్న ఆమె మొహం గుర్తొచ్చింది నాకు. ఎందుకో ఆమె అలాంటిదంటే నమ్మబుద్ధి కాలేదు.
“ఏమిటీ.. అమాయకమైన మొహంలా వుంది.. ఈవిడ అలాంటిదంటాడేంటి అని ఆలోచిస్తున్నారా..? అమాయకంగా కనబడేవాళ్ళే కొంపలు ముంచుతారండీ బాబూ?" నా ఫీలింగ్స్ గమనించి కాబోలు నారాయణ చెప్పాడు.
"ఇప్పుడు చూడండి.. మొగుడొచ్చి పిల్లని తీసుకెళ్ళేసరికి ఎంత ఇదైపోతోందో.. పాపం అతడివైపు నుంచి కూడా ఆలోచించాలి కదా.. భార్య వస్తుందేమో అన్న ఆశతో పిల్లని తీస్కెళ్ళడానికి వచ్చాడేమో.." మూర్తి సానుభూతి చూపించాడు.
"ఏది ఏవైనా పిల్లలు తల్లి దగ్గరుంటేనే మంచిది కదా.. ఆ తాగుబోతు పిల్లని తీస్కెళితే మాత్రం వాడేం చూసుకోగలడు..?" అన్నాన్నేను.
"అయితే కావొచ్చుగానీ మొగుడు మంచోడు కాడని దొరికినోడితో పోవడమేనా..? అసలిలాంటి వాళ్ళు లోకాన్ని ఎలా ఫేస్ చేస్తారో నాకర్థంగాని సంగతి.. ఏవీ జరగనట్టే మామూలుగా ఎలా వుండగలరు..?" అసహనంగా అన్నాడు మూర్తి.
"వుండగలరులెండి.. ఎందుకంటే కొంతమందికి లోకాన్ని పట్టించుకోకుండా తిరిగే శక్తి వుంటుంది.. కాకపోతే మనస్సాక్షిని కూడా పట్టించుకోకుండా ఎలా వొదిలేస్తారో తెలీని విషయం.." నారాయణ కోపం మాటతీరులో ధ్వనించింది.
తెలుగుసార్ మాత్రం ఏదో ఆలోచిస్తున్నట్టు కనిపించాడు.
ఇంకా ఆ సంభాషణ కొనసాగేదేమో గానీ తరగతులు ప్రారంభించాల్సిన సమయమైనట్లుగా బెల్ మోగడంతో బ్రేక్ పడింది.
మధ్యాహ్నం మూడుగంటల సమయంలో వెనుక బ్లాక్ నుంచి ముందు వైపు వస్తుంటే ఎదురొచ్చిందో ముసలమ్మ.
"మాబొట్టికి మీరే సెప్తారేటి బావూ..?" నన్ను చూస్తూ అడిగింది.
"ఎవరు మీ పాప..?" అని అడుగుతుండగా "శాంతి వాళ్ళ మామ్మ సార్..." పక్కనే వున్న ఆరోతరగతి పిల్లాడొకడు చెప్పాడు.
అప్పుడు గుర్తొచ్చింది నాకు.. ఉదయం వాళ్ళ నాన్న వచ్చి తీసుకువెళ్ళాడన్న పాప శాంతి.
"శాంతి వచ్చేసిందా..? క్లాసులోనే వుందా..?" ఆ పిల్లాణ్ణే అడిగాను.
"రాలేదు సార్.." అన్నాడు వాడు.
"పిల్ల ఇంటి దగ్గరే వుంది బావూ.. మద్దేన్నం బడికి పంపనేదు.." అంది ఆ ముసలమ్మ.
"ఎవరీవిడ..?" అంతలోనే అటువైపుగా వచ్చిన తెలుగు సార్ అడిగాడు.
ఆవిడ ఎవరో చెప్పాను. ఇంకా అక్కడే నిలబడి ఏదో చెప్పాలన్నట్టు మావైపు చూస్తోంది ముసలమ్మ.
సంగతేమిటని అడిగాను.
"మీతో సిన్న సంగతి సెప్పాల బావూ.."
"ఏంటి చెప్పు..?" అన్నాను.
"నేను శాంతి అమ్మమ్మను బావూ.. పొద్దున్న మాయమ్మి.. అదే శాంతి ఆల్లమ్మ వొచ్చి మీకు సెప్పానంది. కానీ ఏటి సెప్పిందో.. సరిగా సెప్పిందో నేదో అని నాను మళ్ళీ వొచ్చినాను. మా మనవరాల్ని మట్టుకు ఆడొత్తే పంపకండి బావూ.. మా సెడ్డ కవుకిలు అయిపోతంది.." అంది.
"సరే.. పంపించం గానీ ఎందుకంత ఇదిగా అడుగుతున్నావు..?" అడిగాడు తెలుగుసార్.
"ఏటి సెప్మంటారు బావూ.. ఆ దొంగతొత్తికొడుకు ఏటి సేసాడనుకున్నారు..? బొట్టిని తీసికెళ్ళి సికాకుళంలో డబ్బులకి అమ్మేద్దావని సూసేడు.."
నేను అదిరిపడ్డాను. "ఏంటీ.. కూతుర్ని అమ్మేద్దావనుకున్నాడా..?" ఆశ్చర్యంగా అడిగాను. తెలుగుసార్ కూడా ఆశ్చర్యంగా చూస్తున్నాడు.
"అవును బావూ.. ఇప్పుడే కాదు.. ఈ కత ఇంతకు ముందే జరిగింది. రెండువారాల కితం అక్కడ ఒకళ్ళకి శాంతిని అమ్మీశాడు. అప్పుడేదో నానా పుర్రాకులు బడి దాన్ని ఇడిపించుకొచ్చినం.. ఇందాక బడికొచ్చి దాన్ని తీస్కెల్లిపోనాడంట.. మావూరోల్లు సూసి పిల్లను ఆడి దగ్గర్నుండి నాక్కొని ఇంటికి తెచ్చి అప్పజెప్పినారు. ఆణ్ణి తందావని సూసేరు గానీ ఈలోపే పారిపోండంట.. ఇలాగ పడతన్నాం బావూ.. ఏటి సెప్మంటారు..? ఆడొత్తే మాత్రం మీరు కొంచెం గెమనించుకొని పిల్లని ఆడికి దూరం పెట్టాల. అసలుకి పిల్లని బడికి పంపనాకే మాకు గుండెలు అదురుతన్నాయి బావూ.. అందుకే మళ్ళా సెప్పడానికొచ్చాను.." అంది.
“పిల్లను అమ్మేయడం ఏంటి..? ఎందుకలా చేస్తున్నాడు..?" అడిగాను. నాకింకా ఆశ్చర్యంగానే వుంది.
"ఏటి సెప్తాం బావూ.. కడుపు సించుకుంటే కాళ్ళ మీద పడతాది. మంచిగానే వుండీవోడు.. అప్పుడప్పుడు సుక్కేసుకున్నా ఇరగబడీవోడు కాదు. మరి ఎలగ తయారయ్యాడో గానీ మందుతోనే మొకం కడగడం మొదలెట్టేడు. పనికెళ్ళిన్నాడు ఎళ్తాడు లేన్నాడు లేదు. ఎళ్ళినా డబ్బులివ్వడు. ఇది రెక్కలు ముక్కలు సేసుకుని కానో పరకో తెచ్చుకుంతంది. ఏం నాభం..? దాందగ్గరున్న డబ్బులు నాక్కుని తాగేత్తాడు. ఆకరికి ఆర్నెల్లకితం మా దగ్గరికి వొచ్చీసింది. ముదనష్టపోడు అది సుకంగా వుంటే సూడ్నేపోండు.. ఆడికి తాగుడికి డబ్బులు కావాల.. ఎలగొచ్చినా పర్నేదు.. ఎవులు సచ్చినా పర్నేదు.. ఎవులు బతికినా పర్నేదు.. దొంగతనంగా కూతుర్ని తీస్కుపోయి అమ్మీసినాడు. నానా తిప్పలుబడి అక్కడికెళ్ళి ఆళ్ళని బతిమాలుకొని ఎంతోకంత ముడుపు గట్టుకొని తెచ్చుకున్నం. ఇప్పుడు మళ్ళా తయారయ్యేడు. పోలీసులకి సెప్పమంతన్రు.. మాలాటోళ్ళం అయ్యన్నీ ఏటి పడగలం సెప్పండి..? ఏటి సెయ్యాలో అరదం కాక బుర్ర కొట్టుకుంతన్నం.." అంతా చెప్పి దిగులు బరువుతో కుంగిపోయిన నడుం వొంచుకొని నెమ్మదిగా నడుస్తూ వెళ్ళిపోయింది.
రెండో సెషన్ విరామ సమయంలో మళ్ళీ ఈ కొనసాగింపు కథ మీద చిన్న చర్చ జరిగింది.
"ఆవిడ ఇంకొకరితో సంబంధం పెట్టుకుందంటే మరి ఇలాంటి దారుణాలు చేసే మొగుడుంటే ఎవరైనా ఏం చేస్తారండీ..?" ఆవిడకి సపోర్టుగా అన్నట్టు అన్నాడు తెలుగు సార్.
"అసలు ఆ ముసలమ్మ మధ్యలో జరిగిన విషయాలు చెప్పకుండా నొక్కేసింది. ఆవిడ మొగుడ్ని వొదిలేసి వచ్చి ఇక్కడ ఇంకొకరితో పోతుంటే ఏ మొగాడైనా ఎలా సహించగలడు చెప్పండి..? మొగుడు చెడ్డవాడే కావచ్చు.. కానీ ఎంతమంది ఈరోజుల్లో ఈవిధంగా లేరు..? అతన్ని ఏదో విధంగా మార్చుకోవడానికి ప్రయత్నించాలి గానీ మరొకరితో సంబంధానికి తెగిస్తే పరిణామాలు ఇలాగే వుంటాయ్. బహుశా ఈవిడ ఈ విధంగా చెయ్యడం వల్లనే ఆ బాధ భరించలేక మొగుడు అలా సైకోలా తయారైవుంటాడు" అన్నాడు నారాయణ.
"కరెక్టుగా చెప్పారు. కేరక్టరు లేని ఆడదాని మొగుడు అలా తయారవ్వక ఇంకెలా తయారౌతాడు..? ఏదైనా ఆడదానిలోనే వుందండీ.." మద్దతుగా అన్నాడు సైన్సు సార్.
తరువాత ఇంకెవరూ ఏమీ అనకపోవడంతో ఆ సంభాషణ అక్కడికి ముగిసింది. నేను మాత్రం ఆ విషయం గురించే ఆలోచిస్తున్నాను. ఆవిడ అలా చెయ్యడం వల్ల మొగుడు ఈ విధంగా తయారయ్యాడా..? లేక వీడి బాధ భరించలేక ఆమె వేరే దారి చూసుకుందా..? ఏది నిజం..? ఆమె కేరక్టరు లేని మనిషా..? ఆమెని చూస్తే అలా అనిపించలేదే.. అనుకున్నాను. ఆ ప్రశ్నలు నాలోనే వుండిపోయాయి.
కానీ ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం రెండ్రోజుల్లోనే దొరికింది. ఆరోజు పని వుండి వైజాగ్ వెళ్ళి వస్తున్నాను. అట్నుంచి వచ్చేటప్పుడు నేను పనిచేస్తున్న వూళ్ళోవాడొకడు బస్సెక్కేడు. నాకు తెలిసిన వాడే. నా పక్కనే కూర్చున్నాడు. టాపిక్ అటుతిరిగి ఇటుతిరిగి శాంతి వాళ్ళ నాన్న వ్యవహారం మీదకు మళ్ళింది.
"అయితే శాంతి వాళ్ళమ్మకి అతన్తో తెగతెంపులు అయిపోయినట్టేనా..?" ఆ తర్వాతి విషయం ఏదో తెలుసుకోవాలన్న ఉత్సుకతతోనే అడిగాను. ఎవరెంత చెప్పినా ఆమె మీద సానుభూతి మాత్రమే కలుగుతోంది. అందుకే పూర్తి విషయం తెలుసుకోవాలనిపిస్తోంది.
"ఏటి చెప్పమంటారు సార్.. తెగదెంపులుకి ఆడు ఒప్పుకోడం నేదు. నా పెళ్ళాన్ని నేను ఏలుకుంటాను.. పంపించమంటాడు. ఈవిడేమో చావనైనా చస్తాను గానీ ఆడి దగ్గరికి పోనని గోల. మావూళ్ళో సుందరవని ఒకాయన వున్నాడండి.. పాపం రెండేళ్ళ కితం భార్య సచ్చిపోయింది. మనిసి చాలా మంచోడు. పిల్లల్లేరు. ఆ తాగుబోతోణ్ణి వొగ్గేసి వస్తే నేను సేసుకుంటానని ఆవిడకి చెప్పేడు. పిల్లని కూడా తన బిడ్డలాగే సూసుకుంటానన్నాడు. అదంతా దొంగతనంగా కాదు.. ఆళ్ళింటికెళ్ళి ముసలమ్మతో కూడా ఈ సంగతే చెప్పేడు. ఈవిడికి కూడా ఆ సుందరం దగ్గరికి పోడానికి ఇష్టవే.. మా దగ్గర ఇడాకులు అయీ వుండవండి. పెద్దమనుసుల పంచాయితీలో తెగదెంపులు సేసుకుంటే సాలు. పెళ్ళి రద్దయిపోయినట్టే. 'నువ్వంటే ఇష్టం లేనిదానితో నీకేం పని.. తెగదెంపులుకి ఒప్పుకో..' అని మా పెద్దలు ఆ మొగుణ్ణి అడిగారండి. 'నా పెళ్ళాన్నీ, పిల్లనీ నాక్కాకుండా సెయ్యడానికి మీరే సూత్తన్నార్రా..' అని ఈల్లని బూతులు తిట్టాడండీ.. ఈయమ్మ నేకపోతే ఆడికి గెంజి పోసే దిక్కు నేదండీ.. అదీ ఆడి భయం. ఆడొప్పుకున్నా ఒప్పుకోకపోయినా, పంచాయితీ పెద్దమనుసుల తీర్పు ఎలాగున్నా అయ్యన్నీ పట్టించుకోకుండా ఆయమ్మి ఓరోజు సరాసరి సుందరం దగ్గరికి పోయి కాపురవెట్టేసిందండీ.. ఇంకెవులూ ఏటి చెయ్యడానికీ లేకుండా పోయింది.
అప్పుడికైనా ఆ మొగుడు ఒగ్గనేదండీ.. దెయ్యంనాగ ఈ వూళ్ళోనే తిరుగుతండండీ.. ఆయమ్మ మీద కోపంతోని ఆ పిల్లని తీస్కెళ్ళి ఆమ్మీడానికి సూసేడండి.. సూడ్డవేటి ఒకసారి అమ్మేత్తే ఈళ్ళు ఎళ్ళి తంటాలుబడి తెచ్చుకున్నారు. ఏవంటే 'నాపిల్ల.. నా ఇష్టం..' అని వాగాడట. పిల్ల జోలికి మళ్ళా రావొద్దని, ఇలాటి మాదచ్చోద్ పనులు చేసినంత మాత్రాన నీ దగ్గరికి నేను వస్తాననుకోవద్దని ఈయమ్మ కరాఖండీగా ఆడి మొకం మీదే చెప్పేసిందండీ.. అయినా ఆడికి బుద్ధి రానేదండీ.. మళ్ళా అదే పన్చెయ్యబోయాడు. ఈసారి వూళ్ళోవాళ్ళు కలగజేసుకున్నారు. ఆయమ్మ చేసింది తప్పో ఒప్పో ఆ సంగతటుంచుగానీ చిన్న పిల్ల జోలికొస్తే మాత్రం కాళ్ళు సేతులు ఇరిసేస్తామని వార్నింగిచ్చేరు. నాకు తెలిసి మళ్ళా ఆడు ఇటుపక్క రాడు. అదండి ఆళ్ళ కత..!"
కథ ముగిసింది.. బస్సు దిగి వెళ్తున్నాను. అయినా కథ కూడా నా వెంటే వస్తోంది. నాణేనికి రెండోవైపు కనబడింది. ఆ విషయమే ఆలోచించుకుంటూ నడుస్తున్నాను. చీకటి పడింది. వీధి దీపాలు వెలుగుతున్నాయి. వెనక లైటు వుండటం వల్ల ఎదురుగా నా నీడ పడుతోంది. ఆ నీడ సాగినట్టుగా పొడుగ్గా వుంది. నాకంటే పొడుగ్గా వున్న
ఆ నీడ నా కంటే ముందుగానే వెళుతోంది..!
@@@ ------------ @@@@@ ------------ @@@
గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.
రచయిత పరిచయం :
పేరు : యం. రమేష్ కుమార్
వృత్తి : హైస్కూలు లో గణిత ఉపాధ్యాయుడు.
ప్రచురణ జరిగిన కథలు : ఎనభైకి పైగా.. మొదటి కథ 'శబ్దం' హిందీలోకి ‘శబ్ద్’ గా అనువదించబడింది.
పురస్కారాలు :సోమేపల్లి సాహితీ పురస్కారం,రచన ‘కథాపీఠం’పురస్కారం
బహుమతులు : స్వాతి వీక్లీ కథల పోటీల్లో బహుమతులు,
ఆంధ్రభూమి వీక్లీ కథల పోటీలో ప్రథమ బహుమతి,
స్వప్న మంత్లీ కథల పోటీలో బహుమతి,
ఆంద్రభూమి డైలీ కథల పోటీల్లో కన్సొలేషన్ బహుమతి,
హాస్యానందం మినీ కథల పోటీల్లో రెండవ బహుమతి,
జాగృతి దీపావళి పోటీల్లో విశిష్ట బహుమతి.
కథ చాలా బావుంది. సమాజం లో జరిగిన సంఘటనలను అద్భుతంగా వర్ణించారు.
తలకాయ మీద మెడకాయ ఉన్న ప్రతి ఒక్కడికీ దిగజార్చడానికి తేలిగ్గా దొరికేది ఒక స్త్రీ కారెక్టర్. ఆమె చివరిదాకా నిలబెట్టుకోడానికే చూస్తుంది. పడగొట్టుకుంది అంటే దాని వెనుక ఉన్నా బలమైన కారణాలు ఆలోచించకుండా, ఒక ముద్ర వేసి వదిలేసే వారు, మనకు తారస పడుతూనే ఉంటారు. నాణానికి రెండో వైపు కూడా చూడాలని మీరిచ్చిన సందేశం చాలా బాగుంది రమేష్ గారు.
చాలా అద్భుతం గా వర్ణించారు రమేష్. నిజా నిజాలు తెలిసే వరకూ తన ఒపీనియన్ ని తెలుపకుండా... నిజాలు తెలిసాక పరిస్టులని అర్ధం చేసుకుని, ఒక కధా రూపంలో ఇచ్చిన ఒక జరిగిన సంఘటన అనిపిస్తోంది.
చాలా అద్భుతమైన వర్ణన.
రచయిత ఉపాధ్యాయుడు కావడంతో పాత్రల నేపథ్యాన్ని, ప్రాంత నేపథ్యాన్ని చాలా సులువుగా రాయగలిగారు.
మాండలికం ఆయన కలం నుంచి చక్కగా జాలువారింది.
ప్రారంభ వాక్యం రచయిత అనుభవాన్ని తెలియజేయడమే కాకుండా సామాన్యుల వెథలు చెప్పేలా ఉంది. గొప్ప సాహిత్యానిభూతి.
ఉత్తమ పురుష కోణంలో సాగిన ఈ కథలో ప్రధాన పాత్ర ధారి మనోగతం బహిర్గతం కాలేదు.
రచయిత శ్రీ. ఏం.రమేష్ కుమార్ గారికి హృదయపూర్వక అభినందనలు.
-
దొండపాటి కృష్ణ®
నాణేనికి రెండో వైపు కూడా తెలుసుకోవాలి అని సందేశం ఇచ్చిన మీ కథ చాలా బాగుంది సర్...మొదటి వాక్యం చివరి ముగింపు వాక్యం చక్కని పోలిక...యాస కుదిరింది..అభినందనలు