top of page
Ethakota Subbarao

పూలవాగు


Pulavagu Written By Ethakota Subbarao

రచన : ఈతకోట సుబ్బారావు


ఇసుక కొండలు.

ఆధునికత సోకనంత దూరంగా విసిరేసినట్టున్న గ్రామం. ఆ గ్రామానికి కూడా మూడు కిలోమీటర్ల దూరంలో ఈ ఇసుక తిన్నెలు.

గంటసేపు నుంచి.,..

ఆ ఐదు మంది నోట మాట పెగలటం లేదు. ఎవరికి వారు సుదీర్ఘ ఆలోచనలతో ఉన్నారు. ఏదీ ఓ కొలిక్కి రావటం లేదనే ఆవేశం, ఉక్రోషం, అంతకుమించిన ఆవేదన. ఎలా ముందుకు వెళ్లాలనే తపన.

‘‘ఫైనల్‌గా ఏం చేద్దాం’’ ఈ ప్రశ్న శ్రీకాంత్ నోటి నుండి వచ్చి పది నిమిషాలు పైగానే అయింది. అందరూ వేగంగా ప్రసరిస్తున్న రక్తకణాలతో, నలుగుతున్న ఆలోచనల మధ్యనుంచి జవాబు పెగలటం లేదు.

ఇసుక గుట్టల మీద నుంచి చూస్తుంటే చాలాకాలం తర్వాత పచ్చగా ప్రవహించే పెన్నానది. కెరటాల గజ్జెలు కట్టి నర్తించే వొంటరి ప్రేయసిలా తూరుపు తీరానికి ప్రవహిస్తున్న పెన్నా పరవళ్లు. పడమర దిక్కున ఆమడ దూరంలోనే ప్రియ సరిగమ వుత్కంఠతో మైమరచిన పచ్చని అటవీ సంపదతో జ్ఞాన మౌనిలా నిల్చొని ఉన్న నల్లమల పర్వతశ్రేణులు.

‘‘రేయ్.. లేవండ్రా. వెహికల్స్ తీసుకోండి నెల్లూరు వెళుతున్నాం’’ ఇసుక తిన్నెల నుంచి దిగేందుకు ఒక్క ఉదుటున లేచాడు శ్రీకాంత్.

‘ఎందుకు’, ‘ఇప్పుడా’ ‘అక్కడకెళ్లి ఏం చేద్దామని’ ఏ ఒక్కరూ ప్రశ్నించలేదు. శ్రీకాంత్‌ను మిగిలిన నలుగురు ఫాలో అయ్యారు. శ్రీకాంత్ మీదనే కాదు, ఒకరికి మీద ఒకరికి నమ్మకం. తీసుకున్న నిర్ణయం కూడా సరిగ్గా ఉంటుందనే అంచలంచల విశ్వాసం. బాల్యం నుంచి ఆ గంగిరేని చెట్టు క్రిందనే ఎదిగిన వయస్సులు. అందులో శ్రీకాంత్ మీద అపారమైన గురి. మాట, ఆలోచన, ఆచరణ శక్తి పట్ల వున్న నమ్మకం. ఆ ఐదుమంది మూడు టూ వీలర్స్‌లో సర్దుకున్నారు. అప్పటికే తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకునే బయలుదేరేందుకు సిద్ధమయ్యారు.

‘‘ఇప్పుడున్న పరిస్థితులలో మన మూడు వెహికల్స్ కలసి వెళ్లేందుకు వీలు లేదు. ఎవరైనా ఎక్కడైనా ఆపొచ్చు. నెల్లూరులో ఎక్కడో చెబితే, ముందు వెనకా అయినా అక్కడే కలుద్దామ"ని సలహా ఇచ్చాడు షరీఫ్.

‘‘అదీ నిజమే. ఇంతకీ మన రికార్డు అంతా ఎవరి వద్ద ఉంది’ శ్రీకాంత్ ప్రశ్న.

‘‘ఎస్. నా వెహికల్‌లో ఉన్నాయి’’ కిరణ్.

‘‘ఒకే. అయితే మనమందరం రూరల్ డియస్పీ ఆఫీసు వద్ద కలుద్దాం’’ శ్రీకాంత్ ప్రశ్న పూర్తి కాకుండానే ‘‘ఇంతకీ డియస్పీ ఆఫీసెక్కడ’’ కళ్యాణరెడ్డి అనుమానం.

ఒక్క క్షణం అందరూ ఆలోచనలో పడ్డారు.

ఒకే. మనూరోడు, మన సీనియర్ మార్కెండేయులు కానిస్టేబులే కదా. ఇప్పుడు ఏ స్టేషనో తెలియదు కానీ వాడి నెంబరుంది. ఉండండి అంటూనే పీటర్, మొబైల్‌తీసి చేయటం, జవాబు కూడా రాబట్టగలిగాడు.

‘‘దర్గామిట్ట లోని రాజరాజేశ్వరి గుడి వద్ద కలుద్దాం’’ అంటూనే బొటనవేళ్ల ‘డన్’ చెప్పుకుంటూ బయలుదేరారు.

పెరుమాళ్లుపాడు నుండి నెల్లూరుకు సరిగ్గా 72 కి.మీ. పదవ తరగతి నుండే చదువులు పేరుతో వివిధ రాష్ట్రాలలో ప్రాంతాలలో చదవటం, ఇప్పుడు ఉద్యోగాలలో స్థిర పడడం, స్వంత ఊరు, మండలం తప్పించి తెలియని పరిస్థితి. నెల్లూరులో కోచింగు స్టేషన్లు, కంప్యూటరు, నెట్ సెంటర్లు తప్పించి మరేమీ తెలియని పంచపాండవులు వీరు.లిప్తపాటులో కనురెప్పకు ఆననంత దూరంగా పరుగులు తీసాయి టూ వీలర్సు. ఏదో తెలియని ఆశయం. ఆ ఐదు మందిలో, వారి మదిలో ఒకే రకమైన ఉద్వేగం.

…………………………………..........,,.........


పొలాల్లో పచ్చని వెన్నెల పండిస్తున్న ఊరు. నిండు దారిద్య్రంలోనూ అనుబంధాల కలిమి ఆస్వాదించిన ఊరు. చినుకు కురిస్తే ఆత్మంతా చిగురిస్తూ వసంతం రాకున్నా పుష్పించిన ఊరు. అదే పెరుమాళ్లుపాడు. ఉండేదే వంద గడప. అటు నల్లమల, ఇటు పెన్నానది ఒడ్డున నలుగుతున్న మజరా పల్లె. వ్యవసాయం, కూలీ పనులు, చేతి వృత్తులే ఆ పల్లె ప్రజలకు జీవనాధారం. సోమశిల ప్రాజక్టు వచ్చిన తర్వాతనే వరి రైతులు తెల్లచొక్కా వేసుకొనే స్థాయికు ఎదిగారు. అప్పటి నుంచే గ్రామ రైతులు కొత్త ఆలోచనలు కొత్త భవిష్యత్తుకు పునాదులు తీసారు. గ్రామం నుంచి చెప్పుకోదగ్గ ఉన్నత స్థాయికు ముప్పుయి ఏళ్లకు అటు ఇటుగా ఉన్నవారే. ఏ ఎనిమిది తొమ్మిది మంది అయ్యోర్లు, పోలీసులు, వలంటీర్లు లాంటి ఉద్యోగాలకు కూడా చేరువయ్యారు. అందులో బయటకు వచ్చిన యువత శ్రీకాంత్, ఒక కిరణ్, ఒక కళ్యాణ రెడ్డి, ఒక షరీఫ్, ఒక పీటర్‌లు ఉన్నారు.

కాలం విలువ తెలిసిన యువత. చేజర్ల పొదలకూరులలో పదవతరగతి వరకు చదివినా, ఇతర పెద్ద చదువు ముగించుకొని, ఉద్యోగాలలో స్థిరపడినా, గ్రామానికి ఏదైనా సేవ చేయాలనే ఆలోచనే, వీరిని ఈ రెండు నెలలు కంటికి, కునుకును దూరం చేసింది. దానికి కారణం తాతలు చెప్పిన కథలే. కథల రూపంలో చెప్పిన వాస్తవ గాధలు. వారి గుండె వ్యధలు. చిన్నప్పటి నుండి మదిలో గూడు కట్టుకున్న ఆలోచన ఇది.

‘'అవునయ్యా! నేను కాపురానికి వచ్చిన కొత్తల్లో కూడా మీ తాత చెబుతుండేవారు. బాధ పడేవార'ని అమ్మ సమర్ధించిన మాటలు కూడా శ్రీకాంత్ ఆలోచనలకు పునాదులు అయ్యాయి. ఇవే విషయాలు పలుమార్లు మిత్రులు మాట్లాడుకోవటం, ఫోన్‌లోనే కలుస్తూ, గ్రామానికి వచ్చినప్పుడు చర్చించుకోవటం, వారి వయస్సు, చదువులతోపాటు ఈ బీజం వృక్షంలా ఎదుగుతూ వచ్చింది. ఆ దృక్పథం విషయ సేకరణ, అధారాలు పరిశీలన జరుగుతున్న నేపధ్యంలో...

ఇదే కలిసొచ్చిన సమయమనుకున్నారు మిత్రులు.

కార్యసాధనను, కర్తవ్యంగా భావించారు నడుం బిగించినా అడుగులు భారమయ్యాయి. వ్యంగ్యం, హేళన, చులకన, అవమానం లాంటివి ఈ పది రోజుల్లోనే ఎన్నో చవిచూసారు. అదే ఆలోచన. ఆదే బాధ. కానీ కర్తవ్యం మాత్రం మరుగున పడేలేదు. మనసులో ముద్రించుకున్న ఆశయం మాత్రం మౌనం వహించలేదు.

అదే ఆలోచన. అదే ఆవేదన. ఒకటే ఆశయం. ఎలా సిద్దింపచేసుకోవాలి. ఎలా ముందుకెళ్లాలి. కర్తవ్యం ఎలా నెరవేర్చుకోవాలి. ఆ కసే ఆ ఐదు మందిని ఆ మూడు వాహనాల్లో, ఇలాంటి విపత్కర పరిస్థితులలో 78 కి.మీ. ప్రయాణానికి నడుం బిగించారు.

………………………...................


‘నమస్తే సార్’’ వినయంగా డియస్సీకు నమస్కరించి లోనికి అడుగు పెట్టాడు శ్రీకాంత్. శ్రీకాంత్‌కే కాదు ఆ ఐదు మందికి కూడా పోలీసులు, ఈ స్టేషన్లు కొత్తవే.

‘‘చెప్పమ్మా.. బాబు’’ తల ఎత్తకుండానే వాట్సప్‌లో మెసేజ్ చేస్తూ ప్రశ్నించారు. డియస్పీ అప్పటికే ఈ ఐదు మందిని సీసీ కెమెరాల్లో చూస్తూ స్కాన్ చేసిన విషయం శ్రీకాంత్‌కు తెలియకుండా పోలేదు.

‘‘మాది చేజర్ల మండలం, పెరుమాళ్లుపాడు సార్’’ శ్రీకాంత్ పరిచయం పూర్తి కాకుండానే.. ‘‘విజటర్ స్లిప్ చూసాను. విషయం చెప్పు’’ మొబైల్ నుండి తల ఎత్తుకుండానే చాలా కూల్‌గానే ప్రశ్నించాడు డియస్పీ.

అంతకన్నా సూటిగా, క్లుప్తంగా చెప్పాలని, అప్పటికే నిర్ణయించుకొన్న శ్రీకాంత్ అందుకు సిద్ధమయి, ‘అటు నల్లమల, ఇటు పెన్నానది ఒడ్డునున్న మా గ్రామ సమస్య సార్..’’ అంటూ మొదలెట్టగానే శ్రీకాంతుకు మరోసారి డియస్పీ అడ్డు తగిలారు.

‘‘గ్రామ సమస్య అంటున్నావు. మీ ఎస్.ఐ, సి.ఐ.లను కలవలేదా’’ సాదా సీదా గానే ఎదురు ప్రశ్నించినా, ఇలాంటి వారిని నిత్యం డీల్‌చేసే పనిలో కాస్త చిరాకు, పరాకు కలబోసి ఉంది.

‘‘కలిసాం సార్. ఎస్.ఐ. గారు మాత్రం అనుమతి నా పరిధిలో లేదన్నారు సార్, సి.ఐ. గారు మాత్రం హేళనగా మాట్లాడారు సార్.. అందుకని..’’ శ్రీకాంత్ మాట, అందులోని నిజాయితీ డియస్పీ ను తల ఎత్తి చూసేలా చేసింది.

‘‘చెప్పు’’ అంటూ వారి ముఖంలోకి చూసాడు. కాదు పరిశీలనగా వారి ముఖ కవళికలు, హావభావాలు గమనించారు.

పెన్నానది ఒడ్డునున్న గుట్టలు, ఇసుక కొండలు గూర్చి చెప్పారు. వాటి తవ్వకాలు గురించి వివరించాడు. అవసరాన్ని, అంతకన్నా సూక్ష్మంగా అంతా ఇరవై నిమిషాల్లో ఒక్క ఉదుటున చెప్పాడు శ్రీకాంత్. చెప్పినంతసేపు శ్రీకాంత్ ముఖంలోకి డియస్పీ చూపులు తీవ్రత గానే గుచ్చుకొంటూనే ఉండాయి. వారి ఆశయం, పట్టుదల శ్రీకాంత్‌ను అక్కడ గడుసుపిండంగానే ఆవిష్కరించాయి.

‘‘బావుంది. ఇప్పుడే అనువైన సమయం. మంచి ఆదాయం చూడొచ్చు. శ్రమలేని లాభసాటి వ్యాపారం కూడా. చేతినిండా వనరుల కోసం మంచి మాస్టర్‌ప్లాన్. స్కెచ్‌ని గొప్పగా వేయటమే కాదు, పోలీసు యంత్రాంగంతోనే గేమ్ ఆడేందుకు సిద్దమయ్యావా శ్రీకాంత్’’ నిన్ను అంతా కాచి వడపోసానని చులకన, కొరడా దెబ్బలు లాంటి వ్యంగ్య అస్త్రాలను డియస్పీ ప్రయోగించాడు. చూపుల్లో మాటల్లో పద విరుపుల్లో మేలు జాతి మనుషులం.. అన్నీ పసికట్టగలం అనే ధీమాను డియస్పీ వ్యక్తపరచటం శ్రీకాంత్ కు మింగుడు పడడం లేదు.

శ్రీకాంత్‌లో చలనం లేదు. కళ్లు కాంతివంతమయ్యాయి. చురకత్తులాంటి పదునుతో మెరుస్తున్నాయి. అది ఆవేశం కాదు. ఆవేదన.

‘‘నేను రైతు బిడ్డను. నేనే కాదు. బయట ఉన్న మిత్రులంతా రైతు బిడ్డలే. అంతేకాదు సార్, మా ఊరు ఊరంతా రైతు కుటుంబాలే. ఈ తరమే, ఇప్పుడే, మాతోనే ఉద్యోగాలు, చదువులు పేరుతో బయట ప్రపంచంలోకి వచ్చాం సార్’’ శ్రీకాంత్ మాటల్లో వాడి వేడి ఉంది. నిజాయితీ, నిబద్ధత ఉంది. ఏదో తపన, కళ్లనిండా ఆరాటం శ్రీకాంత్‌ను గమనించి ‘‘ఏం ఉద్యోగం చేస్తున్నావు. అసలేం చదివావు నీవు’’ డియస్పీ ప్రశ్నించాడు కటవుగానే.

‘‘పెరుమాళ్లుపాడులో ప్రాధమిక విద్యతో ప్రారంభమై, ఐఐటి న్యూఢిల్లీ గోల్డ్ మెడలిస్ట్‌ను సార్. వడోదర రిలయన్స్‌లో టెక్నికల్ మేనేజరును సార్. నా ప్యాకేజీ 23 లక్షలు. దాదాపు ఇన్‌సెన్‌టివ్స్‌తో కలిపి రెండు లక్షలు నెలకు " శ్రీకాంత్ ఆవేశాన్ని, బాధ రూపంలో తమ ఆశయ సాధనకు సహకరింప చేసుకోవాలనే తపనతోనే చెప్పాడు.

‘‘సార్.. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే ఇసుక స్మగ్లర్లం కాదు. ఒక ఆశయం కోసం మీ వద్దకు వచ్చాము. ఒకరు కాకుంటే ఒకరైనా అర్ధం చేసుకుంటారు మాకో దారి చూపిస్తారని సార్. నేనే కాదు సార్. నన్ను ఒకర్నే లోపలికి రమ్మన్నారు కానీ, బయట ఉన్న ఆ నలుగురు మిత్రులు కూడా గౌరవనీయమైన చదువులు చదివిన వారే. ఉద్యోగాలు చేస్తున్నవారే సార్’’ శ్రీకాంత్ ఏకధాటిగా చెప్పుకు పోతున్నాడు.

మంత్రదండం అనేదేమైనా ఉంటుందా! ఆ రీతిలో కనురెప్ప ఆర్పకుండా శ్రీకాంత్ వైపు సంభ్రమాశ్చర్యాలతో చూస్తున్నాడు. అలా చూస్తూనే.. కుడి చేత్తో గోడకు ఎలక్ట్రికల్ కాలింగ్ స్విచ్ నొక్కారు డియస్పీ. సెంట్రీ కానిస్టేబుల్ రాగానే ‘‘బయట ఉన్న ఆ నలుగురిని పిలువు’’ డియస్పీలో వచ్చిన మార్పుకు శుభ పరిమాణంగా తోచింది శ్రీకాంత్‌కు.

‘కూర్చోండి’ అంటూ ఐదు మందికికుర్చీలు ఆఫర్ చేసారు.

కూర్చునే ముందు శ్రీకాంత్ ఆ నలుగురిని కూడా పరిచయం చేస్తూ కళ్యాణిరెడ్డి బెంగుళూరు ఇన్ఫోసిస్, వీడు పీటర్ గ్రూప్ ఒన్ రెండుసార్లు కొట్టాడు సార్. కానీ సివిల్స్ సాధించాలని, ఎట్టకేలకు ఐ.పి.ఎస్. క్యాడర్‌కు ఎన్నిక కాగా, రాజస్థాన్ కేటాయించారు సార్. ట్రయినింగ్‌కు వెళ్లాలి. వీడు షరీఫ్, హైద్రాబాదు జె.ఎన్.టి.యు.సి.లో ఫైన్ ఆర్ట్స్ చేసి, బెనారస్ యూనివర్శిటీలో పి.జి. చేసి, బెంగుళూరు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పని చేస్తూనే, హస్తలేఖనంపై పి.హెచ్.డి. చేస్తున్నాడు సార్. చివరగా కిరణ్‌ను చూపిస్తూ పూనే అరబిందోలో సాప్ట్‌వేర్ సార్, పరిచయాలు కాగానే ఐదు మంది బుద్ధిమంతులుగా కూర్చొన్నారు. ఎంతైనా పోలీసు కార్యాలయం. అదీ కొత్త వాతావరణం. డియస్పీ వారిని తదేకంగా చూస్తున్నారు. దీర్ఘంగా ఆలోచిస్తున్నారు.

‘‘ఎలా మీకు అనుమతి ఇవ్వాలి’’ ఓ మూడు నిమిషాలు నిశ్శబ్దం తర్వాత, అంటూనే ‘‘అయినా పోలీసుశాఖ ఒక్కటే ఇచ్చేది కాదే’’ తనలో తాను మాటాడుకోవటం కూడా పైకి అంటూనే మౌనంగా ఆలోచనలో పడ్డాడు డియస్పీ.

ఆ ఐదు మందిలో అదే ఉత్కంఠ. వేగంగా గుండె గంటలు.

‘‘అసలు అక్కడ ఉందని మీకెలా తెలుసు. పట్టు మని మూడు పదులు వయస్సులేని పిల్లలు మీరు. చిన్నవారైనా మీరంటే అభిమానం, గౌరవం ఏర్పడింది. మిమ్మల్ని నేనెలా నమ్మాలి’’ డియస్పీ సూటిగా ప్రశ్నించాడు.

‘‘ఈ నెల రోజులు దానిమీదనే గ్రౌండ్ వర్క్ చేసాం సార్. కానీ చదువుకొనే రోజుల నుండే బీజాలు వేసుకుంటూ, ఎస్.ఐ.ల దృష్టికి తీసుకెళ్లి ఒప్పించగలిగాము. కానీ అనుమతి మా పరిధి కాదన్నారు సార్. దేవాదాయ శాఖ, అసిస్టెంటు కమీషనరును కూడా కలిసాము. అందరూ అంగీకరించినా, మా నిజాయితీ గుర్తించినా, శ్రమను గౌరవించినా, సానుభూతి మాత్రమే చివరకు మాకు మిగిలింది సార్. చివరగా మీ దృష్టికు తీసుకొని రావాలనే మా ఈ ప్రయత్నం సార్. శ్రీకాంత్ అత్యంత వినయ విధేయతలతో కూడిన శ్రమను, ఆవేదనను, డియస్పీ దృష్టికి తీసుకువచ్చారు.

డియస్పీ అధికారిగా కాకుండా, ఒక వ్యక్తిగా, మంచి పనికి తన వంతు ఎలా, ఎంత వరకు సహకరించగలననే ఆలోచిస్తున్నాడు. నిశ్శబ్ద మౌనంలో ఉండిపోయారు.

దానిని పసికట్టిన శ్రీకాంత్ అవకాశాన్ని తనకు అనుకూలంగా మలచుకోవటంలో బలమైన అడుగులు వేసారు. ఎందుకంటే పంచపాండవులు లాంటి ఐదు మంది చురుకైన వారు. ఆశయసాధనలో పదునెక్కిన అస్త్రాలు.

డియస్పీ ఆలోచనలకు, సందిగ్ధ పరిస్థితిని అధిగమించేందుకు, అనువైన సమయంగా భావించి, ‘‘ఒక్క పది నిమిషాలు టైం ఇవ్వండి సార్.. మూడు విషయాలు మీ దృష్టికి తీసుకువస్తాను. ఆ తర్వాత మీ నిర్ణయం సార్’’ శ్రీకాంత్ ధీమా చెప్పాడు. సార్. ఈ ఫైల్ చూడండి. తర్వాత అయినా చూడండి. మా ఐదు మంది బయోడేటాలు, ఫెర్‌ఫామెన్స్ ఐ.డి.లు సార్’’

‘‘రెండోది సార్. జిల్లా గిజిట్స్, గజటీర్సు ప్రతులు సార్. 1880 సం॥ నుండి వరుసగా పెన్నానదికి వరదలు, గ్రామాలు మునక, ఏకంగా కొట్టుకు పోయిన పల్లెలకు చెందిన ఆంగ్లేయులకాలం నాటి గజటీర్స్ ఇది.’’ ఆ ఫైల్ చేతికి అందించారు శ్రీకాంత్. 1927లో పెన్నా వరదలకు మా పెరుమాళ్లుపాడు మునిగి, కొట్టుకుపోయింది కూడా. ఊరును, సంపదను కాపాడుకోవటం కాదు. ప్రాణాలను దక్కించుకోవటమే సాహసం అయింది. అప్పటి బ్రిటీషు వారి మద్రాసు ప్రెసిడెన్సీకు చెందిన అప్పటి నెల్లూరు జిల్లా కలక్టరు ఉడ్ హౌస్ మా ఊరు ప్రతిసారి మునిగిపోతుందని, ఊరును తరలించాలని జారీ చేసిన గజట్స్ సార్. అప్పుడే సర్వమూ మునిగిపోగా, మూడు, నాలుగు కి.మీ. ముందుకు వచ్చి స్థలాలు, పొలాలు ఇచ్చి ఇళ్లు, ఊరు నిర్మించుకొనేందుకు నిధులు చెందిన ప్రభుత్వ జీవో, స్థలాలకు చెందిన గజట్స్ సార్ ఇవి అని శ్రీకాంత్ దానికి రికార్డ్సులు డియస్పీ చేతిలో పెట్టారు.

‘‘సార్. ఇది చూడండి 1909 నాటి విలేజ్ మ్యాప్ సార్. ఇందులో చూడండి సార్ పెన్నానది ఒడ్డున మా గ్రామం. ఎక్కడ ఏమి ఉన్నాయో, అన్నీ ఇందులో స్పష్టంగా మార్క్ చేసిఉన్నారు.’’

‘‘ఇది చూడండి సార్. డైగ్లాట్ పర్మినెంట్ రిజిస్టర్. ఇందులో మరింత స్పష్టంగా పొందుపరచి ఉన్నారు. అలాగే ఇది టెన్‌ఒన్ రికార్డు ఆ కాలంనాటిదే. ఇది మా ఊరును స్పష్టత పరచే రికార్డు సార్’’ గ్రామ పుట్టుక నాటి రికార్డులన్నీ డియస్పీ ఆసక్తిగా తిలకించడం మరింత ఉత్సాహాన్ని నింపింది మిత్రులలో. రికార్డు అంతా మూడు పైళ్ల రూపంలో డియస్పీ చేతిలో పెట్టారు. వందేళ్ల పైబడ్డ రికార్డులు సేకరించడం, అందులోనూ ఈతరం పిల్లలు. డియస్పీకు నమ్మశక్యం కాని విషయం అయినా, పిల్లల బలమైన కోరిక ఆశయానికి ముగ్దులయ్యారు.

‘‘అసలు ఇంత రికార్డు ఎలా సాధించారు.’’ ఆసక్తిగా అడిగారు డియస్పీ.

అంతే ఉత్సుకతతో ‘‘అసలు మాలో బీజాలు తొడిగింది మా తాతలే. చిన్నతనంలో చందమామ కథలు, బేతాళ కథలు ముందు, మన ఊరి కథలు అని వారు అప్పటి సంఘటనలు, ప్రజలు, ఇబ్బందులు, వరదలు ఇవన్నీ కథలుగా చెప్పేవారు. ఆ కథల్లో వారి ఆవేదన, కోల్పోయిన జీవితం, నష్టపోయిన ఉనికి, ఏమీ చేయలేని నిస్సహాయతలు కథలుగా చెప్పిన విషయాలు, సంఘటనలు మా గుండెల్లో నివాసం ఏర్పరచుకున్నాయి సార్. ఊహ తెలిసేటప్పటికి ఈ వేట ప్రారంభించాం.’’ అని శ్రీకాంత్ అంతరంగాన్ని విప్పి చెప్పాడు.

‘‘అప్పట్లో మా తాతయ్యే గ్రామ మునసబు, కరణంగా పని చేసారు. అవి రద్దు అయినా, రికార్డు సేకరించటం మాకు సులువు అయింది సార్’’ కళ్యాణ రెడ్డి ఘంటా పథంగా చెప్పాడు.

‘‘చివరిగా ఒక్క మాట సార్. ఇసుక తరలించాలంటే ట్రాక్టర్లు, టిప్పర్లు వాడాలి సార్. మేము త్రవ్వకాలకు జె.సి.బి.లు తప్పించి మరే యంత్రాలు, వాహనాలు వాడం సార్. మీ సిబ్బంది ఆకస్మిక దాడులు నిర్వహించవచ్చు సార్’’ పీటర్ వాదన డియస్పీ ఆలోచనలను మరింత సులువు చేసాయి.

‘‘మా వద్ద రికార్డులు, డైగ్లాట్, విలేజి మ్యాప్, టెన్‌ఒన్ కానీయండి, మా పెద్దలు ఆనవాళ్లు ఆధారంగా మేము ఎక్కడ తవ్వకాలను చేపడితే, మేము విజయం సాధించగలమో పక్కా ఆలోచనలు, ప్రణాళికలు మావి మాకున్నాయి సార్.’’ కళ్యాణ రెడ్డి నిక్కచ్చిగా హామీ ఇచ్చాడు.

ఆ ఐదు మంది మీద, వారి ఆలోచనలు, ఆశయం మీద పూర్తి నమ్మకం కలిగింది. అభిమానం ఏర్పడింది. ఈ తరం పిల్లలు కాదేమో అన్నంత గా ఎంత ఆత్మవిశ్వాసం, పట్టుదల అసాధ్యమైన విషయాన్ని సుసాధ్యం చేయాలనే తపన. డియస్పీ ఒకరిని మార్చి ఒకరిని చూస్తున్నారు. ముఖ కవళికల్లో ఏదో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ఆలోచనల తీరులో కూడా తేడా కనిపిస్తుంది.

శ్రీకాంత్ డియస్పీను చూపులతోనే ఒడ పోస్తున్నాడు.

‘‘అలాగని మాకు టైం ఎంతో అవసరం లేదు. మా కంటూ ఖచ్చితమైన ఆధారాలున్నాయి. అదీ పగలే. రాత్రులు ఇసుక స్మగ్లింగ్ అంటున్నారు కాబట్టి ఆ వైపు వెళ్ళం సార్.’’ శ్రీకాంత్ చివరి అస్త్రంను బలంగా ప్రయోగించారు.

‘‘చివరిగా వీటిని కూడా చూడండి సార్. మెకంజీ కైఫియత్తులు, పెన్నా నదీ పరివాహక ప్రాంతాలలో మా గ్రామం గూర్చి కూడా ప్రస్తావించారు. అలాగే, మహా పండితులు దీఫాల పిచ్చయ్య శాస్త్రి గారి ‘నెల్లూరు పెద్దగాలివాన’ ఒరిజినలె ప్రతులు చూడండి. 1927 పెద్ద గాలివానకే మా ఊరు స్వరూపం తెలుస్తుంది. ఇందులో స్పష్టంగా పద్యరూపంలో వర్ణించారు. అప్పట్లో సోమశిల కానీ, ఆ పైన ఎలాంటి ప్రాజక్టులు లేవు కాబట్టి వరదలు ఎక్కువ వచ్చేయి. రికార్డు ఇది సార్’’ చివరి అస్త్రంగా రికార్డులన్నీ డియస్పీ ముందు పెట్టాడు కళ్యాణ రెడ్డి.

ఆ రికార్డులలో తదేకంగా మునిగిపోయాడు. ఎన్నో భావాలు, ఆలోచనలు, ఆనందాలు. ‘‘పరిశోధకులు, చరిత్రకారులు చేయవలసిన పని, పట్టు మూడు పదుల వయస్సు లేని వారు ఎంత కృషి చేసారు. ఉనికి కోసం ఎంత ఆరాటపడుతున్నారు. పెద్దల కలలకోసం ఎంత తపన పడుతున్నారు. డియస్పీ తన అనుభవంలో కొత్త అనుభూతిని ఆస్వాదిస్తున్నాడు. కొత్త అధ్యాయాన్ని చూస్తున్నాడు. పది నిమిషాలు అడిగి లోనికి వచ్చిన ఐదుమంది, అప్పటికే గంటకు పైగా గడిచిన విషయం ఎవ్వరి మదిలో లేదు. డియస్పీ రికార్డులలో ఉన్నారు.

అంతా నిశ్శబ్దం. ఇరు వర్గాల మధ్య మౌనం.

అరగంట పైగానే గడిచింది. డియస్పీ లోతుగానే రికార్డులను పరిశీలిస్తున్నారు. కొంత స్వంత ఆసక్తి. యువకుల ఆసక్తి కూడా ఆకట్టుకొంది. మద్యన వస్తున్నా ఫోన్ కాల్స్ ను కొన్నింటిని సైలెంట్ మోడ్ లోకి డైవర్ట్ చేస్తూ, అర్జెంటు కాల్స్ కు ఆన్సర్ చేస్తూనే ఫైల్స్ లో తలపెట్టటం లో మునిగి ఉన్నారు.

మరో పది నిమిషాలు కూడా ఆ మౌనంలోనే కరగిపోయాయి. రికార్డులన్నీ తన ట్రేలో భద్రపరచుకున్నాడు డియస్పీ. తిరిగి బయటపడేటప్పటికి మరో రెండు నిమిషాలు. శ్రీకాంత్‌వైపు, అలా అందరివైపు ఒక్కసారిగా చూసాడు. ‘‘వాట్. ఏం చేద్దామంటారు? డియస్పీ ప్రశ్న వెనుక కూడా మౌనమే.

‘‘సరే. ఒక్క విషయం ఏమిటంటే మీ పట్టుదల పరిశోధన, తపన, కృషి అన్నింటినీ నేను గమనించాను, అర్ధం చేసుకున్నాను. మీ సాహసానికి వ్యక్తిగతంగా నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. నా వంతు సహకారం కూడా తప్పక ఉంటుంది. ఒక్క రోజు టైం ఇవ్వండి. మీ మండల తహసీల్దారు, ఎస్.ఐ, సి.ఐ.లతో మాట్లాడి మీకు సహాయపడేందుకు కృషి చేస్తాను. కానీ ఒకటి రెండు రోజులు ఆగండి’’ అందరి ముఖాలవైపు చూసాడు డియస్పీ.అందరి ముఖాలలో ఓ చిరుదివ్వె.అనుమతి వస్తుందనే నమ్మకం, ఆశ కన్నా, ఓ అధికారి తమ తపనను అర్ధం చేసుకున్నారనే పరవశం వారిలో ఎక్కువగా కనబడింది. అదే సంతోషంతో సగం విజయగర్వంతో ఆ మూడు టూ వీలర్సు సొంతూరి వైపు పరుగులు తీసాయి.

.........................,..............

అప్పటికి సరిగ్గా నాలుగు రోజులైంది.

శుభముహూర్తం అని కొబ్బరి కాయ కొట్టి, అయినా వారి ముఖాన చిరునవ్వు చెదర లేదు. ఆత్మవిశ్వాసం సన్నగిల్లలేదు. ఆశయసాధనలో అంతిమ విజయం మాదేనన్న విజయగర్వంతోనే ఉన్నారు. ఇళ్లల్లో మాత్రం వారి అమ్మానాన్నల ప్రార్ధనలు వారికి తెలియదు.

మొదటి రోజు ఎవరికీ తెలియదు. ఊర్లోకి యంత్రాలు వచ్చాయనే సందడి తప్పించి. రెండో రోజు ఊరి రైతుల హడావుడి ఏదో జరిగిపోతుంది అని. ఈ విషయం చుట్టు పక్కల గ్రామాల చెవిన చేరటంతో సమూహాలుగా రావటం సరికొత్త అలజడి. ఏదో సినిమా షూటింగ్‌లా ఆ నదీ ప్రాంతమంతా ఇసుక వేస్తే రాలని సందడి.

పెరుమాళ్లు పాడు గ్రామంలో అలజడి. చుట్టూ గ్రామాల్లో ఇదే చర్చ. వ్యంగ్యాస్త్రాలు, విసుర్లు, చలోక్తులు, కలగాపులగమై పయనిస్తున్నాయి. అలాగని పిల్లలు చేసే బృహత్తర కార్యక్రమానికి మనసున్న మారాజుల ఆశీర్వాదాలున్నాయి లోలోపల. తలారీలు, విఆర్వోలు అక్కడే పహారా. పోలీసు జీబు గ్రామంలోకి రోజూ వచ్చి వెళుతుండటం సరికొత్త ఆందోళన అసమ్మతివాదులలో. నిశ్శబ్ద గ్రామంలో ఏమిటీ రచ్చ, గోల ఏందనే వారూ లేకపోలేదు.

ఐదు రోజులు పూర్తయ్యాయి. డియస్పీ మాత్రం పెద్దన్నలా ప్రతిరోజూ రాత్రి ఫోన్ చేసి విషయాలు అడిగి తెలుసుకోవటం విజయం సాధిస్తారని ఆత్మవిశ్వాసం నింపేవారు.

ఆరవ రోజు తాసిల్దారు, ఎస్.ఐ తమ సిబ్బందితో వచ్చి వెళ్లారు. ఫోన్‌లో పై అధికారులకు ఏదో సమాధానమిచ్చి వెళుతూ ‘‘సరే ఫ్రెండ్స్. రేపు సాయంత్రానికి వెకేట్ చేయండి.’’ అంటూ వెళ్ళిపోయారు.

………………………..

అది ఏడవరోజు కూలీలతోపాటు నలుగురు స్నేహితులు కూడా రంగంలోకి దిగారు. చివరి రోజు. కూలీలు నిర్విరామంగా పని చేస్తున్నారు. సూర్యుడు పడమరకు ప్రయాణం మొదలు పెట్టేసరికి నలుగురిలో ఆందోళన. ‘స్థల ఎంపికలో తప్పటడుగు వేసామా! డైగ్లాట్ విలేజ్ మ్యాప్‌ను చూసి పెన్నానది ఒడ్డున స్థల నిర్దారణ గుర్తించలేక పోయామా!’ ఎవరికి వారే ఆలోచనలో ఉన్నారు. అప్పటికే అర కిలోమీటరు దూరంగా వంద అడుగుల పైగానే జెసిబిలు దిగి పని చేస్తున్నాయి. ముగ్గురు మిత్రులు మాత్రం లోపలికి దిగి పనులు పర్యవేక్షిస్తుంటే శ్రీకాంత్ , కళ్యాణ రెడ్డి ఒడ్డున ఇసుక కొండల మీద చుట్టూ తిరుగుతూ పనులను పరిశీలిస్తున్నారు. అవసరం అయిన సలహాలు, సూచనలిస్తున్నారు.


‘‘ఠంగ్’ పెద్దశబ్దం. పైకి స్పష్టంగా వినిపిస్తుంది. ఇసుక గుట్టలలో లోహపు శబ్దం.‘‘సారూ ఇటు రండి’’ ఒక కూలీ పెద్దగా కేకలేసాడు. ఒక్క నిమిషంలో ఐదు మంది మిత్రులు అక్కడకు చేరారు. మొక్క పుడమి గర్భాన్ని చీల్చుకొని వచ్చినట్టు ఆలయగోపురం పైభాగాన నిలిపి ఉన్న పంచలోహ కలశ స్థాపనలు అందరి కళ్లను ఆనంద బాష్పాలు కమ్మేయటం నమ్మలేక తడిమి చూసారు. మట్టి తొలగించే కొద్ది శిఖరాగ్రంపై నిర్మితమైన ఐదు కలశాలు. తవ్వే కొద్దీ శిథిలాలు మధ్య స్పష్టమైన నిర్మాణాలు. మరింత లోపలికి వెళితే విరిగి, రెండుగా బయల్పడిన ఏకశిలా ద్వజ స్థంభం. అల్లంత దూరంలో గ్రామ కోనేరు. తూర్పు పక్కనే చావడి. డైగ్లాట్ చూపించిన పెంకుతో నిర్మితమై ఉన్నా, అలాగే ఇసుక పొరల్లో దాగిఉన్న చావడి. అక్కడక్కడ బొంతరాళ్ల కట్టుబడులు. యంత్రాలు, కూలీలు మరింత వేగంగా, ఉత్సాహంగా చేస్తున్న పనులు ఉరకలు పెడుతున్నాయి. తవ్వే కొద్దీ బయట పడుతున్న శిల్పకళా సంపద. కూలీలులో సైతం ఆనందం ఉప్పొంగగా, మిత్రులు ఎగిరి నాట్యమాడారు.

………………………..

కలను తీర్చిన కరోనా

వందేళ్ల గ్రామం వెలికితీత. దాదాపు వందేళ్ల కిందట పెన్నానది ఉదృతికి ఇసుక మేటలో కూరుకు పోయిన పూలవాగు, ఇప్పుడు కోరోనా తో స్వంత గ్రామానికి తిరిగివచ్చిన ఆ ఊరు ఐదు మంది యువకులు ఆ గ్రామాన్ని వెలికి తీసిన వైనం. ఇప్పటికే ప్రసిద్ధి చెందిన సోమేశ్వర ఆలయం, చరిత్ర రికార్డులలో నమోదు అయి ఉన్న 120 అడుగుల ఏకశిలా ధ్వజస్థంభం, గ్రామ కోనేరు, చావడి, బొంతరాళ్లతో నిర్మితమైన ఇళ్ల సముదాయాలు బయల్పడుతున్నాయి. పూలవాగు గ్రామ కథనం ఇది.

అన్ని ఎలక్ట్రానిక్ మీడియాలలో అప్పటికే దండిగా బ్రేకింగ్ న్యూస్‌లు వెలువడుతున్నాయి.

………………………..

పూలవాగుకు ఎన్నో శాఖల వాహనాల పరుగులు. అటుగా వస్తున్న డియస్పీ పోలీసు వాహనం వైపు విజయగర్వంతో ఐదుమంది యువకులు ఎదురెళ్లారు..


. .. ......అయిపోయింది.........

గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి



రచయిత పరిచయం : ఈతకోట సుబ్బారావు


గత నాలుగు దశాబ్దాలుగా సాహిత్యం తో కలిసి ప్రయాణం చేస్తున్నాను. ఇంత వరకు కథలు కవితలు ఎక్కువగానే ప్రచురణ జరిగాయి. ఆంధ్రజ్యోతి నెల్లూరు లో పనిచేస్తున్నాను. దీని తో పాటు విశాలాక్షి సాహిత్య మాస పత్రికకు సంపాదకుడిగా కూడా 11 సం..నుంచి పని చేస్తున్నాను. కథ కవిత నెల్లూరు చరిత్రకు చెందిన 15 పుస్తకాలు నావి ప్రచురణ పొందాయి. ఫ్రీవేర్ స్ ఫ్రంట్, కొ.కు కథా పురస్కారం, cp అకాడమీ నిర్వహించిన కథల పోటీ లో నా కాశీబుగ్గ కథల పోటీలో ప్రధమ బహుమతి పొందాను. పురస్కారాలు బహుమానాలు పొందాను.

86 views2 comments

2 comentários


rachaputir
02 de jan. de 2021

Poolavaagu story throws up many questions. The inquestiveness, patriotism and the love for tradition, culture and heritage among our youth. Srikanth and his friends deserve kudos for their tremendous efforts in escavating the ancient and lost heritage of their region which needs to be emulated by one andall. The author did a commendable job in presenting a story which is a mixture of our tradition, history, archaeology and culture. Thank you.

Curtir

Rohini Vanjari
Rohini Vanjari
30 de dez. de 2020

"పూలవాగు" లాంటి గ్రామాలు, నిధులు, నిక్షేపాలు ఇంకా ఎన్నెన్ని దాగి ఉన్నాయో మన నెల్లూరు పెన్నమ్మ ఒడిలో. కథ చాలా బాగుంది సర్. అభినందనలు.

Curtir
bottom of page