top of page

ప్రభాత కిరణాలు


కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.








కథను యు ట్యూబ్ లో చూడటానికి క్రింది లింక్ క్లిక్ చేయండి

'Prabhatha Kiranalu' New Telugu Story




(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


బ్యాంకు నుండి ఇంటికి వస్తున్న కిరణ్ కాలనీ మొగలో ఉన్న అమ్మవారి గుడి ముందు జనాన్ని చూసి బైక్ స్లో చేసి పక్కగా ఆగాడు. గుడి ముందు బుర్రకథ చెబుతున్నారు కళాకారులు.


సత్య హరిశ్చంద్ర కథ చెబుతోంది మధ్యన ఉన్న అమ్మాయి. ముగ్గురూ రంగు రంగుల బట్టలు వేసుకున్నారు.

కథ చెప్పే అమ్మాయి కంఠం బాగుండడంతో కాసేపు నిలబడి కథ విన్నాడు. ఒక పావుగంట ఉండి ఇంటికి వచ్చాడు. అప్పుడు సమయం ఎనిమిది గంటలు అయ్యింది. రాఘవయ్య మాస్టారు భోజనం ముగించి భాగవతం చదువుకుంటున్నారు. కిరణ్ స్నానం చేసి వచ్చేసరికి టేబుల్ మీద భోజనం సిద్ధంచేసి ఉంచింది జానకమ్మ.

“అబ్బాయ్! నువ్వు తింటూ ఉండు. నేను ఇప్పుడే వస్తాను” అని వంటింట్లోకి వెళ్ళింది జానకమ్మ.


రోజూ తన పక్కనే కూర్చుని కబుర్లు చెప్పే తల్లి ఇంకా, లోపల ఏం చేస్తోందా?అని ఆలోచిస్తూ భోజనం చేయసాగాడు కిరణ్.


“అమ్మా, ఇంకా వంట చేస్తున్నావేమిటి?” ఆత్రం ఆపుకోలేక అడిగాడు తల్లిని.


“ముగ్గురు భోజనానికి వస్తామన్నారు నాయినా, అందుకే మళ్ళీ వంట చేస్తున్నాను” వంటింట్లోంచే జవాబు చెప్పింది జానకమ్మ.


రోజూ ఎనిమిది గంటలకు ఖచ్చితంగా భోజనం చేస్తాడు రాఘవయ్య. కొడుకు వచ్చాక అతనికి పెట్టి, ఆ తర్వాత తను తింటుంది జానకమ్మ.


‘అమ్మా, నువ్వూ నాన్నతో పాటే భోజనం చేసెయ్’ అని చాలా సార్లు చెప్పాడు తల్లికి. కానీ ఆవిడ ఒప్పుకోదు. భర్తా, కొడుకూ భోజనం చేసాకా మాత్రమే తను తింటుంది. వచ్చేది ఎవరా? అని ఆలోచిస్తూ భోజనం కానిచ్చాడు కిరణ్. అతను తిన్న ప్లేటు తీసి సింకు లో పడేసి టేబుల్ శుభ్రం చేసింది జానకమ్మ.


తన గదిలోకి వెళ్లి టి. వి. తక్కువ సౌండ్ లో పెట్టుకుని న్యూస్ చానల్ చూస్తున్నాడు కిరణ్. కాసేపటికి తల్లీ తండ్రీ కబుర్లు చెప్పుకోవడం వినిపించింది కిరణ్ కి. ఒక గంట గడిచాక కాలింగ్ బెల్ మోగడం, తల్లి వెళ్ళి తలుపు తీయడం చూసి హాలు లోకి వచ్చాడు కిరణ్.


తండ్రి లేచి నిలబడి ‘రండి.. రండి’ అంటూ ఆహ్వానించాడు. ముగ్గురు మనుషులు వచ్చారు. ఒక పెద్దాయన, ఒక యువకుడు, ఒక యువతి. ముగ్గురూ తల్లికీ, తండ్రికీ నమస్కరించారు.


“మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాం” అన్నాడు పెద్దాయన.

“భలేవారే, ఇబ్బందేం లేదు. ఇప్పటికే పొద్దుపోయింది. కాళ్ళు కడుక్కుని రండి, భోజనం చేద్దురుగాని” అని బాత్ రూమ్ చూపించాడు రాఘవయ్య.


ముగ్గురూ ఫ్రెష్ అయిరాగానే డైనింగ్ టేబుల్ మీద భోజనాలు వడ్డించింది జానకమ్మ.

“ఆంటీ, నేను ఏమైనా సాయం చెయ్యనా” అడిగింది ఆ అమ్మాయి జానకమ్మని.


ఏమీ అవసరం లేదు అన్నట్టు తలాడించింది జానకమ్మ. వాళ్లకు కొసరి కొసరి వడ్డిస్తోంది జానకమ్మ. హాలులో ఉన్న కిరణ్ కి వచ్చిన వాళ్ళు ఎవరో అర్ధం కావడం లేదు. కానీ ఈ

అమ్మాయిని ఎక్కడో చూసిన జ్ఞాపకం వస్తోంది. ఎక్కడా.. ఎక్కడా? అని ఆలోచించగా స్ఫురించింది ఇందాకా బుర్రకథ చెప్పిన అమ్మాయిలా ఉందని.


వాళ్ళు ముగ్గురూ భోజనాలుచేసి హాలులో కూర్చున్నారు. అప్పుడు జానకమ్మ భోజనానికి కూర్చుంది.


“రాత్రి ఎక్కడ ఉంటారు?”అడిగాడు రాఘవయ్య, పెద్దాయన్ని.


“ఈ కాలనీ రామాలయంలో పడుకుని, పొద్దునే లేచి ఆచంట వెళ్తామండి. రేపు సాయంత్రం రామేశ్వర స్వామి గుడిముందు ప్రోగ్రాము చేయాలనుకుంటున్నాము. పూర్వం రోజుల్లో అయితే గణపతి నవరాత్రులకి, దేవీ నవరాత్రులకి, సంక్రాంతి పండుగ రోజులలలో, శ్రీ రామ నవమి ఉత్సవాలకు బుర్రకథలు, హరికథలు పెట్టేవారు. కాలంలో చాలా మార్పులు వచ్చాయి. కళా ప్రదర్శనలకు ఆదరణ తగ్గిపోయింది” దీర్ఘంగా నిట్టూర్చి అన్నారు పెద్దాయన.

“మరి ఇన్ని అబ్బందులు పడుతూ మీరు ఇలా ఊరూరా తిరగడం ఎందుకు? సాయంకాలం మీ అబ్బాయి మా ఇంటికి వచ్చినపుడు చెప్పాడు. గత ఏడాదే మీకు బై పాస్ సర్జరీ జరిగిందని. వేరే ఏదైనా ఉపాధి చూసుకోవచ్చుగా? అన్యదా భావించకండి ఇలా అన్నందుకు” అన్నాడు రాఘవయ్య.


పెద్దాయన రాఘవయ్య కేసి తిరిగి గంభీరంగా చెప్పసాగాడు. “మాది తెనాలి పక్కన మాధవపాడు. నా పేరు రామశర్మ. ఈ బుర్రకథ చెప్పడం మా తాతగారి కాలం నుండీ ఉంది. మా నాన్న మా చిన్నాన్నలతో కలిసి మన రాష్ట్రం అంతా తిరిగి ఎన్నో ప్రదర్సనలు ఇచ్చారు. నా హయాం వచ్చేసరికి ఈ కళకి ఆదరణ తగ్గసాగింది.


ఈ కళ నాతోనే ఆగిపోకూడదని మా పిల్లలు ఇద్దరికీ నేర్పాను. అబ్బాయి, అమ్మాయి ఇద్దరూ డిగ్రీ పాస్ అయ్యారు. మొన్నటి వరకూ నేనే ప్రధాన కథకుడిగా ఉండేవాడిని. ఆపరేషన్ అయ్యాక అమ్మాయి చంద్ర కథ చెబుతోంది, నేనూ అబ్బాయి రవి, వంతలుగా ప్రదర్సన ఇస్తున్నాం.


ఒకోరోజు మైకు, లైటింగ్ ల డబ్బులు రావడం కూడా కష్టంగా ఉంటోంది. మీ శివపురం ఫరవాలేదు. వాళ్ళ ఖర్చులు పోగా ఒక వెయ్యి రూపాయలు మిగిలాయి” అన్నారు రామశర్మ.


అప్పుడు రాఘవయ్య కిరణ్ ని వారికి పరిచయం చేసాడు ‘మా అబ్బాయి కిరణ్. బ్యాంకు లో పనిచేస్తున్నాడు’ అని. కిరణ్, రామశర్మ కి నమస్కరించాడు.


‘చిన్నవాడివి. నీకు నమస్కరించకూడదు. సుఖంగా ఉండు నాయనా’అన్నారు రామశర్మ.


కాసేపు మాట్లాడాకా ‘వెళ్తామండి’అని లేచారు ముగ్గురూ.


అప్పటికి జానకమ్మ భోజనం అయ్యి, హాలు లోకి వచ్చింది. రాఘవయ్య జేబులోంచి వెయ్యి రూపాయలు తీసి రామ శర్మ కిచ్చాడు. “నేను మీ బుర్రకథకి రాలేదు. ఏమీ అనుకోకండి. నాకు మంచు పడదు. ఆ విషయం మీ అబ్బాయికి కూడా చెప్పాను. మీలాంటి గొప్ప కళాకారుడు మా ఇంటిలో భోజనం చేయడం మా అదృష్టం. మీరు ఈ ప్రాంతం ఎప్పుడు వచ్చినా మా ఇంటికి రావచ్చు” అన్నాడు రాఘవయ్య. రవి, చంద్ర వెళ్లేముందు రాఘవయ్య పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు.


వాళ్ళు వెళ్ళగానే తలుపువేసి లోపలకు వచ్చింది జానకమ్మ.

“ఏమిటో వయసులో ఉన్న పిల్లని తీసుకుని దేశమంతా తిరుగుతున్నాడు. ఆ పిల్లకి పెళ్లి చేసి తండ్రీ, కొడుకూ తిరిగితే బాగుంటుంది. ఏమంటారు?”అంది జానకమ్మ భర్తతో.


“వాళ్ళ కుటుంబం. వాళ్ళ ఇష్టం. మనం ఎవరం, వాళ్లకి సలహా ఇవ్వడానికి” అని బెడ్ రూమ్ లోకి వెళ్ళాడు రాఘవయ్య. కిరణ్ కూడా తన గదిలోకి వెళ్ళాడు నిద్ర పోవడానికి. కానీ అతనికి నిద్ర రావడం లేదు.


చంద్ర రూపమే కళ్ళ ముందు కదలాడుతోంది. 'ఎంత చక్కని రూపం, ఎంత మాధుర్యం ఉంది ఆ గొంతులో' అని తలపోసాడు. తను వాళ్లకు ఏదైనా సాయం చేయగలడా? అని ఆలోచించాడు కిరణ్.

అతను పనిచేసేది ఆచంటలోనే.

*******

మర్నాడు కొద్ది ముందుగా బ్యాంకు కి వెళ్ళాడు. రామేశ్వర స్వామి గుడికి దగ్గరగానే ఉంది కిరణ్ పనిచేసే బ్యాంకు. అప్పటికే మైకులో రాత్రి గుడిదగ్గర ‘ఝాన్సీ లక్ష్మి బాయ్’

బుర్రకథ ఉందని ప్రచారం జరుగుతోంది. లంచ్ టైం లో, కొడమంచిలి లోని కృష్ణ మూర్తి తో, భీమలాపురం మహిళా మండలి కార్యదర్శి శైలజా శ్రీహరి తో మాట్లాడాడు కిరణ్.

సాయంత్రం తండ్రికి ఫోన్ చేసి ఇంటికి ఆలస్యంగా వస్తానని చెప్పాడు. సాయంత్రం ఆరుగంటలకే గుడి దగ్గర బుర్రకథ ప్రారంభం అయ్యింది. చాలా మంది జనం వచ్చారు.

ఆచంటలో శివరాత్రి ఉత్సవాలు చాలా వైభవంగా జరుగుతాయి. మద్రాస్ నుండి కూడా సంగీత కళాకారుల్ని తీసుకువచ్చి ప్రోగ్రాములు నిర్వహించిన ఘనత దేవస్తానం వారికి ఉంది. చంద్ర కథ చెప్పేటప్పుడు ఆమె హావ భావాలకి జనం చప్పట్లు కొడుతూ అభినందనలు తెలుపుతూనే ఉన్నారు ప్రోగ్రాము అయ్యేంతవరకూ.


బ్యాంకు స్టాఫ్ తరుపున రెండువేలు రామశర్మ కి తన మిత్రుడు సుభాష్ తో ఇప్పించాడు కిరణ్. ప్రోగ్రాము అయ్యాక రామేశ్వర స్వామి సత్రం లో రామశర్మ ని కలిసాడు కిరణ్.

రామశర్మ, రవి, చంద్ర ముగ్గురూ సాదరంగా ఆహ్వానించారు కిరణ్ ని.


“మీరు ఝాన్సీ లక్ష్మి భాయ్ ని కళ్ళముందు దింపేశారు,

మీ వాచికం, అభినయనం చాలా బాగున్నాయి. అభినందనలు” అన్నాడు కిరణ్, చంద్రతో కళ్ళనిండా సంతోషంతో.


వినయంగా నమస్కరించి ‘థాంక్స్ సర్’ అంది చంద్ర.


రామశర్మ కేసి తిరిగి “రేపు కొడమంచిలి గ్రామంలో మీ ప్రోగ్రాము ఉంటుంది. రేపు ఉదయం కృష్ణమూర్తి గారు వచ్చి మిమ్మల్ని కలుస్తారు. అలాగే ఎల్లుండి భీమలాపురం గ్రామం లో మీ ప్రోగ్రాము ఉంటుంది. ఆ ఊరు నుండి శ్రీహరి గారు, వారి శ్రీమతి శైలజ వచ్చి మిమ్మల్ని కలుస్తారు. ఈ మూడు రోజులూ మీరు సత్రంలో ఉండవచ్చు. నేను ఈవో గారితో మాట్లాడాను. ఉంటాను సర్. ఇంటి దగ్గర మా అమ్మ ఎదురుచూస్తూ ఉంటుంది” అన్నాడు కిరణ్.


రామశర్మ ‘ధన్యవాదాలు నాయనా. మీ నాన్నగారికి, అమ్మగారికి నా నమస్కారాలని చెప్పు’ అని అన్నాడు.


చంద్ర, తన కళ్ళతోనే అతనికి థాంక్స్ చెప్పింది.

మర్నాడు సత్రంలో కొడమంచిలి నుంచి కృష్ణమూర్తి, భీమలాపురం నుండి శైలజ, ఆమె భర్త శ్రీహరి వచ్చి రామశర్మని కలిసి తమ గ్రామాలకు వచ్చి ప్రదర్సనలు

ఇవ్వవలిసినదిగా కోరారు. రెండు రోజులూ ఆ ప్రోగ్రాములు అయ్యాక మూడవరోజున ఉదయమే ఆచంట వచ్చి రామశర్మని కలిసాడు కిరణ్.


“రా బాబూ, నీ సహకారంతో ప్రోగ్రాములు బాగా జరిగాయి. మధ్యాహ్నం భోజనం చేసి తెనాలి వెళ్లాలని అనుకుంటున్నాము” అన్నారు రామశర్మ.


“నాదేముంది. మీరు గొప్ప కళాకారులు. మీ ప్రదర్శనలు చూసే భాగ్యం ఈ చుట్టు పక్కలవారికి కలిగింది. ఇంకో గంటలో పత్రికా విలేఖరులు వస్తారు, మీ ఇంటర్వ్యూ

తీసుకోవడానికి. ఈరోజుల్లో ప్రచారం తప్పనిసరి. మీకు చెప్పకుండా అరేంజి చేసానని తప్పుగా అనుకోకండి. మీ గురించి సమాజానికి తెలియాలనే నా ఉద్దేశ్యం” అని ఒక కవర్ తీసి రామశర్మకి ఇచ్చాడు కిరణ్.


కవర్ తీసి చూసి అందులో ఉన్న ఫోటోలు చూసి ముగ్గురూ ఆశ్చర్యపోయారు. ఆచంట, కొడమంచిలి, భీమలాపురం గ్రామాలలో జరిగిన వారి కళా ప్రదర్సనల ఫోటోలు అవి. వారు కబుర్లలో ఉండగానే పత్రికా విలేఖర్లు వచ్చారు. ఒక అరగంట సేపు వారిని ఇంటర్వ్యూ చేసి రామశర్మ, రవి, చంద్ర ముగ్గురినీ కలిపి గ్రూప్ ఫోటో, రామశర్మ ని విడిగా మరో ఫోటో తీసుకున్నారు. బుర్రకథ చెబుతున్న ఫోటోలు కావాలంటే, తన దగ్గర ఉన్న వేరే కవర్ లోని ఫోటోలు వారికి ఇచ్చాడు కిరణ్. పత్రికావిలేఖర్లు ‘రెండు మూడు రోజుల్లో ప్రత్యెక ఆర్టికల్ వస్తుందని’ చెప్పి వెళ్ళిపోయారు.


వాళ్ళు వెళ్లిపోగానే కిరణ్ చేయి, తన చేతిలోకి తీసుకుని ‘మా కోసం ఎంతో చేస్తున్నావు. ఇది ఏనాటి బంధమో. నీ ఋణం ఎలా తీర్చుకోవాలి?’ అన్నారు రామశర్మ.


“మీరు పెద్దవారు. అలా మాట్లాడితే నాకు ఇబ్బందిగా ఉంటుంది. నాకు కళలు అంటే ఇష్టం. అంతకంటే ఏం లేదు. మీ ఫోన్ నెంబర్, బ్యాంకు ఎకౌంటు నెంబర్ ఇవ్వండి. ఎవరైనా ప్రోగ్రాము అడిగితే మీకు తెలియజేస్తాను. అడ్వాన్సు ఇవ్వడానికి కూడా వీలు ఉంటుంది” అన్నాడు కిరణ్.


రవి ఆ వివరాలు ఒక పేపర్ మీద రాసి కిరణ్ కి ఇచ్చాడు.

‘వస్తానండి’ అని చెప్పి బయటకు వచ్చాడు కిరణ్.

అతని వెనకాలే వచ్చింది చంద్ర. రెండు చేతులూ జోడించి కిరణ్ కి నమస్కరించింది. “మా నాన్నగారిలో కొత్త ఉత్సాహాన్ని నింపారు. చాలా ఏళ్ళు గడిచాయి ఆయన మొహంలో అంత సంతోషాన్ని చూసి. అందుకు మీకు ప్రత్యేక కృతజ్ఞతలు చెబుదామనే వచ్చాను. మా కోసం చాలా చేసారు. మీకు ఒక చిన్న గిఫ్ట్” అని తన హ్యాండ్ బాగ్ లోంచి ఒక కీ చెయిన్ తీసి కిరణ్ కి ఇచ్చింది.


కీ చెయిన్ కి మంచిగంధం తో చేసిన చిన్ని కృష్ణుడు బొమ్మ ఉంది. అది చూడగానే కిరణ్ పెదవులపై మందహాసం చోటుచేసుకుంది. ”థాంక్స్ అండి” అన్నాడు మనస్ఫూర్తిగా.


అతని సంతోషం చూసి చంద్ర మొహం వెలిగిపోయింది. సత్రం ముందున్న చెట్టు కొమ్మల మధ్యనుండి పడుతున్న సూర్యకిరణాలు ఆమె మొహం మీద పడి ఆమె అందాన్ని ద్విగుణీకృతం చేసాయి. కొద్ది క్షణాలు అలానే చంద్రని చూస్తూండిపోయాడు కిరణ్. ఆమె సిగ్గుపడి తలదించుకుంది. కిరణ్ మోటార్ బైకు ఎక్కి బ్యాంకు కి వెళ్ళిపోయాడు.

*****

కిరణ్ రామశర్మ బుర్రకథ బ్రతికించాలని పడుతున్న తపనని, బుర్రకథ చెబుతున్న కొన్ని ఫోటోలను వాట్స్ అప్ గ్రూపులలో పెట్టి ఈ కళ కనుమరుగు కాకుండా కాపాడవలసిన

బాధ్యత మనపైన ఉందని చెప్పాడు. అలాగే ఆచంటలో చంద్ర చెప్పిన ‘ఝాన్సీ లక్ష్మీ భాయ్’ బుర్రకథని సంక్షిప్తం చేసి, కొన్ని కామెంట్స్ కలిపి ‘యూ ట్యూబ్’ లో పెట్టాడు.


ఆర్ధిక సహాయం చేసేవారి కోసం రామశర్మ ఎకౌంటు నెంబర్ ఇచ్చాడు. వారం తిరిగేసరికి ఏభైవేలు రామశర్మ ఎకౌంటుకి చేరాయి. రామశర్మ ఫోన్ చేసి ఇదేమిటని అడిగితే మీ ఆశయం గురించి నలుగురికీ చెప్పాను, మునుముందు ఇంకా మంచివార్తలు వింటారని చెప్పాడు కిరణ్.


మూడునెలలు గడిచేసరికి పదిలక్షలు చేరాయి రామశర్మ ఎకౌంటుకి. ఒకరోజు రామశర్మ ఫోన్ చేయగానే, కిరణ్ “మీరు ఇంటి దగ్గరే విశ్రాంతి తీసుకోండి. ఆసక్తి ఉన్న వారికి బుర్రకథ నేర్పండి. ప్రదర్శనలకు మీ అబ్బాయిని అమ్మాయిని పంపండి” అని చెప్పాడు.


యూ ట్యూబ్ ప్రచారం వలన రామశర్మకి సంఘంలో గౌరవం పెరిగింది. గుంటూరునుండి నలుగురు కుర్రాళ్ళువచ్చారు బుర్రకథ నేర్చుకోవడానికి. ఆరోజు రామశర్మ ఆనందం వర్ణనాతీతం. నెలరోజులు గడిచాక మరో ఇద్దరు వచ్చారు. ఆరుగురికి తన ఇంట్లోనే భోజనం, వసతి కల్పించాడు రామశర్మ.


ప్రోగ్రాములకి రవి, చంద్ర, కొత్తకుర్రాళ్ళు వెళ్తున్నారు. ప్రోగ్రాములకి ఐదువేలు తక్కువ కాకుండా ఇస్తున్నారు. ఏడాది గడిచేసరికి బుర్రకథ నేర్చుకునేవారు పదిమందికి చేరారు. రామశర్మ ఎకౌంటుకి అప్పుడప్పుడు డబ్బులు జమ అవుతూనే ఉన్నాయి. రవి తెనాలిలో ఒక ప్రైవేటు కంపెనీలో అకౌంటెంట్గా చేరాడు.


చంద్ర ప్రైవేటు గా ఎం. ఎ. చదువుతోంది. మరో ఆరునెలలు గడిచాయి. కిరణ్ నుండి ఫోనులు తగ్గాయి. చంద్ర మనసు ఆందోళనగా ఉంది. ఆచంటలో పరిచయమైన జర్నలిస్ట్ తాతారావుకి ఫోన్చేసి కిరణ్ గురించి అడిగింది. ఆయన బదిలీమీద విశాఖపట్నం వెళ్లిపోయారని చెప్పాడు. మరోనెల గడిచింది. కిరణ్ కి ఫోనేచేస్తే స్విచ్ ఆఫ్ వస్తోంది.


ఇంక ఉండబట్టలేక విశాఖపట్నం వెళ్లి బ్యాంకువారిని కలిసింది. ఏడాదిక్రితం కిరణ్ అమ్మగారు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారని, ఆమె మీద బెంగతో వాళ్ళ నాన్నగారు

ఆర్నెల్లు తిరగకుండానే చనిపోయారని, కిరణ్ బ్యాంకుకి ‘లాంగ్ లీవ్’పెట్టి వెళ్లిపోయాడని, ఎవరితోనూ కాంటాక్ట్ లో లేడని మేనేజర్ చెప్పారు.


ఆమాటలు వినగానే చంద్ర బుర్ర తిరిగిపోయింది. భారమైన మనసుతో ఇంటికివచ్చి తండ్రికి అన్నివిషయాలు చెప్పింది. ‘అయ్యో, ఇదేమిటి ఇలా జరిగింది. మంచివాళ్ళకు ఇలాంటి కష్టంవచ్చిందని’ బాధపడ్డాడు రామశర్మ. శివపురంలో కిరణ్ వాళ్ళ ఇంట్లో భోజనంచేయడం, ఆచంటలో అతనితో మాట్లాడిన సన్నివేశాలు గుర్తుకొచ్చి చంద్ర ఆరోజు నిద్రపోలేదు.


కొద్దిరోజులు గడిచాక శ్రీశైలంలో దేవినవరాత్రులకి ‘పార్వతీకల్యాణం’ బుర్రకథ చెప్పడానికి వెళ్ళింది చంద్ర. రాత్రి బుర్రకథ అయిపోయాకా, మర్నాడు పాతాళగంగలో

స్నానంచేసి, దీపాలు వదిలి పక్కకు చూసి ఆశ్చర్య పోయింది. పక్కనే ఒకతను మెట్లుఎక్కి పైకివెళ్తున్నాడు. గబ గబా అతనిముందుకు వెళ్లి ‘కిరణ్ బాబూ’ అని పిలిచింది. కిరణ్ ఆమెనిచూసి చిన్నగా నిట్టూర్చాడు. ఇద్దరూ పైకివెళ్లి మెట్లపక్కనే ఉన్న రావిచెట్టుకింద కూర్చున్నారు.


‘నేను విశాఖపట్నం వచ్చాను మీకోసం. అప్పుడు తెలిసింది మీ అమ్మగారు, నాన్నగారు చనిపోయారని. ఎన్నో నెలలనుంచి మీకు ఫోన్చేస్తున్నా, కానీ మీనుంచి జవాబులేదు. ఈ విషయం మా అందరికీ చాలా బాధ కలిగించింది’ కన్నీళ్ళతో అంది చంద్ర.


“అమ్మా, నాన్నా హఠాత్తుగా నన్ను విడిచి వెళ్లిపోవడంతో నన్ను నేను తట్టుకోలేక పోయాను. అందుకే మనశ్శాంతి కోసం ఇలా పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నాను. ఒకోసారి ఎందుకీ జీవితం అనిపిస్తోంది” బాధగా అన్నాడు కిరణ్.


“అలా అనకండి కిరణ్ బాబూ, మేం అందరం లేమా?”అంది సాంత్వనంగా చంద్ర.


ఆమెకేసి అలాగే చూస్తూ “నువ్వు నాకు తోడుగా ఉంటావా?” అడిగాడు కిరణ్.

అతని చేతిని తన చేతిలోకి తీసుకుని “మీతో జీవితాంతం కల్సి ఉంటాను. ఇది కృతజ్ఞతతో చెప్పే మాటకాదు, నా మనసులో ఎప్పటినుండో గూడుకట్టుకున్న మాట. రండి.. దేవుడి దర్సనం చేసుకుని కొత్తజీవితం ప్రారంభిద్దాం” అంది చంద్రప్రభ.


ఇద్దరూ ఒకరి చేయి మరొకరు పట్టుకుని మెట్లు ఎక్కుతున్నారు. అప్పుడే మబ్బుల చాటునుండి బయటకు వచ్చిన ఉదయభానుడు తన “ప్రభాతకిరణాలు” వారిపై ప్రసరించి ఆశీర్వదించాడు.

********

M R V సత్యనారాయణ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం



మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



రచయిత పరిచయం : సత్యనారాయణ మూర్తి M R V


ఎమ్. ఆర్. వి. సత్యనారాయణ మూర్తి. పెనుగొండ. పశ్చిమ గోదావరి జిల్లా. కవి, రచయిత, వ్యాఖ్యాత, రేడియో ఆర్టిస్టు. కొన్ని కథల పుస్తకాలు, కవితల పుస్తకాలు ప్రచురితం అయ్యాయి. కొన్ని కథలకు బహుమతులు కూడా వచ్చాయి. రేడియోలో 25 కథలు ప్రసార‌మయ్యాయి. 20 రేడియో నాటికలకు గాత్ర ధారణ చేసారు. కవితలు, కథలు కన్నడ భాషలోకి అనువాదం అయ్యాయి.



36 views3 comments
bottom of page