top of page

ప్రస్థానం







'Prasthanam' written by Gorthi VaniSrinivas

రచన : గొర్తి వాణిశ్రీనివాస్

"శివా! నేను కూడా ఆ ఆవులా పుడితే ఎంత బాగుండేదిరా! మనిషిగా పుట్టిన ప్రతి మనిషీ మనసు పెట్టే బాధను ఓర్చుకోవాల్సిందే కదా! " అంటున్న నాన్న ముఖంలోకి చూశాను.


జీవితమనే పుస్తకాన్ని అనేకసార్లు తిప్పి చదవగా నలిగిన కాగితంలా ముడతలు పడి

కాంతి విహీనంగా ఉంది .


నాన్న మిత భాషి , హిత సంభాషి కూడా .

అనవసరంగా ఏదీ అనడు. ఏమైనా అన్నారంటే తప్పకుండా ఏదో జరిగే ఉంటుంది.


"ఏం నాన్నా! అలా అంటున్నారు? ఏవయ్యింది?" అన్నాను.


నిర్లిప్తంగా చూస్తూ పెరట్లో కట్టేసిన ముసలి ఆవు వైపు వేలు చూపిస్తూ


"ఆ ముసలి గోవుని చూడు! పాలు ఇవ్వటం ఎప్పుడో మానేసింది. కానీ చుట్టుపక్కల ఆడవాళ్లు ఆవుకి పసుపు రాసి బొట్టు పెట్టి ప్రదక్షణలు చేస్తున్నారు. రోజూ గడ్డి , అరటి పళ్ళు తెచ్చి పెడతారు. ఎంత లక్ష్యమో చూడు వాళ్ళకి!." అన్నారు


"అవును నాన్నా! ఈ మధ్య గో సంరక్షణ ఒక ఉద్యమంలా సాగుతోంది . టి.వీల్లో కూడా పెద్దపెద్దవాళ్ళందరూ గోదర్శనం మంచిదని, గోపంచితం శ్రేష్టమని చెబుతున్నారు.

అందుకే ఒట్టిపోయినాగానీ గోవులు పూజ్యనీయమవుతున్నాయి. కలియుగంలో

గో సంరక్షణ బాగా జరుగుతోంది." అన్నాను.


"అవును! వృద్ధ ముత్తైదువకు కూడా అంతే విలువుంటుంది. పూజలందుకుంటుంది కదూ!

కానీ మగవాడి పరిస్థితి అలా కాదు. ఓపిక ఉన్నన్నాళ్ళూ గానుగెద్దు. శక్తి సన్నగిల్లాక ముసలి ఎద్దు.

ఎందుకూ కొరగాడు" అంటున్న నాన్న గొంతులో అంతర్లీనంగా ఏదో బాధ వినిపించింది.

నేనోటి మాట్లాడుతుంటే నాన్న ఇంకేదో అంటున్నారేమిటి?


అమ్మ పోయాక నాన్న పరిస్థితి దారుణంగా తయారైంది.

మౌన బాధకు భాష చాలదేమో.

తనింట్లోనే తను పరాయివాడైపోయినట్లు మధపడుతున్నారు.

నాన్న స్థితిలో ఉండి, రేపటి నాన్నలా ఆలోచించసాగాను.


నాన్న దినచర్యను గమనించసాగాను. ఇంట్లో కదిలే వస్తువులా వుంటున్నారు. ఆగిన గడియారంలా తను అడ్డం అనుకుంటున్నారు.


ప్రేమను వ్యక్త పరచటంలోనే కాదు, తన కష్టార్జితాన్ని అనుభవించటంలోనూ నాన్న వెనకపడ్డాడు. బాధ్యతల బరువులు మోసిన నాన్నకు హక్కులు అనుభవించడం తెలియదు.

తను ఎవరికీ భారం కాకూడదనుకుంటున్నాడు.


అమ్మ బతికున్నప్పుడు నాన్నమీద అరుస్తుండేది. ఎందుకో అనుకునేవాడిని.


మా అందరికీ కలిపి ఒకటే బాత్ రూమ్.

పిల్లలు త్వరగా స్నానాలు చేసి తయారై స్కూల్ కి వెళ్ళాలి.

ఉదయాన్నే లేవండంటూ అమ్మ నాన్నపై అరిచేది.

అమ్మ అరుస్తున్నా నాన్న కిమ్మనరు. పైగా అమ్మవైపు తృప్తిగా చూసేవారు.


"త్వరగా బాత్ రూమ్ కి వెళ్ళిరండి. పిల్లలు లేచాక వాళ్ళూ మీరూ కలిసి పోటీ పడతారు. ఊ..కానీండి.ఏకంగా స్నానం కూడా చేసి రండి" అంటూ నాన్నని తరిమేది.


"పిల్లలతో పాటు మీరూ టిఫిన్ చేసేయండి. తర్వాత తింటాను అంటూ నీలక్కండి" అనేది.


" కోడలు భోజనం పెడతానన్నప్పుడు తినక, అబ్బాయి వచ్చాక తింటానంటూ కూర్చుంటే ఎలా?

మీకు ఆర్ఘ్యపాద్యాలిచ్చి పిలవాలా? వచ్చి కూర్చోండి" అని కసిరేది.


"రాత్రి పెందరాడే తిని మందులు మర్చిపోకుండా వేసుకోండి. తెల్లారి షుగర్ పెరిగితే మా ప్రాణాలు తీస్తారు. అయిపోకముందే చెప్పి మందులు తెప్పించుకోండి. తర్వాత మందులు లేవని అబ్బాయి కాళ్ళకింద నిప్పులు పోయకండి " అంటూ ఏడు గంటలకల్లా అన్నం పెట్టి మందులు ఇచ్చేది.


"మీ గురకతో పిల్లల్ని ఇబ్బంది పడుతున్నారు. పాపం పిల్లలు చెవులు మూసుకుని టి వి చూస్తున్నారు. ఆ పెరటి వైపు గదిలో పడుకోండి" అనేది.


పెరటి గుమ్మందగ్గర మంచం వేస్తే పదిసార్లు బాత్ రూమ్ కి లేచి వెళ్లే నాన్నకు ఇబ్బంది వుండకూడదనే ఆ ఏర్పాటని నాకిప్పుడు అర్ధమైంది.


అడుగడుగునా నాన్న అవసరాలను అందరికీ తెలిసేలా చేసేది అమ్మ.

ఆవిడ లేకపోవడమే నాన్నకు సమస్య. పట్టించుకునేవాళ్ళు లేరనేది అసలు దిగులు.


తనకు కావాల్సింది ఎలా సాధించుకోవాలో నాన్నకి అమ్మ నేర్పలేదు. తనే సమకూర్చిపెట్టింది.

అమ్మ పోయాక తిరణాలలో దారి తప్పిన పిల్లాడిలా ఉంది ఆయన పరిస్థితి.

భార్య గతించిన మగవాడి జీవితం అంతేనేమో.


భర్తా, భార్య పిల్లలకు మాత్రం సరిపోయే ఇల్లు ఇంకొక్కరి రాకతో సర్దుకుపోలేనంత ఇరుకుగా అనిపిస్తుంది. అప్పుడు మనసే ఇరుకయిపోతుందేమో!


పొద్దున్నే లేచి పెరటి గుమ్మాన్ని పట్టుకుని నిలబడ్డారు నాన్న.

బాత్ రూమ్ లో కోడలు గానీ, పిల్లలు గానీ ఉన్నారేమో అని తటపటాయిస్తూ చూస్తున్నారు.


"నాన్నా! బాత్ రూమ్ కి వెళ్లి రండి. పిల్లలు లేచాక వాళ్ళతో పోటీ పడతారు. నాతో పాటే టిఫిన్ చేసేయండి. తర్వాత తింటాను అని నసక్కండి " అంటూ తెల్లవారగానే నా తొలి సుప్రభాతాన్ని నాన్న చెవిలో వినిపించాను.


"మధ్యాహ్నం కోడలు లంచ్ పెట్టగానే వెంటనే తినండి. నాతో కలిసి తింటానని పేచీ పెట్టి, దాన్ని ఇబ్బంది పెట్టకండి" అన్నాను.


ఆ పూటే కాదు, ఆరోజే కాదు. రోజూ నేను ఇంట్లో ఉన్నంత సేపూ నాన్న అవసరాలను నా కన్ను

వెంటాడుతూనే ఉంది. అందుకు అనుగుణంగా నా గొంతు మోగుతూనే ఉంది. ఎలా అంటే , నాన్నకి నేను అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నానని నా భార్యా పిల్లలు గుర్తించలేనంతగా.

పెద్దాయన్ని అంతలా విసుక్కోవద్దని నా భార్యే నాకు హితవు చెప్పేంతలా.


నాన్నకి గమనిక ఎక్కువ. అమ్మ గడుసుతనమంతా తనపైన ప్రేమే అని తెలుసుకోగలిగిన నాన్నకి, నా ఆప్యాయత గురించి నేను చెప్పుకోనక్కర్లేదు.


నేను కసిరిన ప్రతిసారీ నాన్న నావైపు చూసి చల్లగా నవ్వుతారు. ఆ నవ్వు అచ్చం, నాలోనే అమ్మను చూసుకుంటున్నట్టుంది.

తన ప్రస్థానాన్ని తృప్తిగా ముగిస్తానని నమ్మకంగా చెపుతున్నట్టుంది.


***శుభం***

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత్రి పరిచయం : గొర్తి వాణిశ్రీనివాస్(గృహిణి)

విశాఖపట్నం.

భర్త : గొర్తి శ్రీనివాస్ గారు

ఇద్దరు పిల్లలు. కుమార్తె, కుమారుడు

గత కొంతకాలంగా సామాజిక సమస్యలను అధ్యయనం చేస్తూ

కథలు , కవితలు రాస్తున్నాను. సమాజంలోకి, వ్యక్తులలోకి, మనసులలోకి

తొంగి చూస్తాయి నా రచనలు.

హాస్య రస ప్రధాన రచనా ప్రక్రియ మీద మక్కువ ఎక్కువ.

కథలు, కవితల పోటీలలో బహుమతులతో పాటు వివిధ పత్రికలలో ప్రచురణ.

సామాజిక ప్రయోజనం కలిగిన కొత్త ఆలోచనకు బీజం వేయగలిగే రచన చేసినపుడు కలిగే తృప్తి నా రచనలకు మూలధనం.


182 views1 comment

1 Comment


Short and sweet story

Like
bottom of page