top of page

ప్రీతి యూ.కె.జి.

Preethi U.K.G Written By Vissamsetti Sailaja

రచన :విస్సంశెట్టి శైలజ


అనుపమ, ఆనంద్, కూతురు ప్రీతి ప్రిన్సిపాల్ రూమ్ బయట ఉన్న కుర్చీల్లో అసహనంగా నిమిషానికి ఒకసారి ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ నిట్టూర్పులు విడుస్తూ తమ వంతు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ప్రతి నెలా మొదటి శనివారం స్కూల్లో పేరెంట్, టీచర్ మీటింగ్ ఉండటం పరిపాటి. ప్రతి నెలా ప్రీతి గురించి పొగడ్త లు వినటం తల్లితండ్రులుగా ఇద్దరికీ చాలా సంతోషాన్ని, గర్వాన్ని కలిగించే విషయం. అందుకే వారం అంతా తాము చేసే సాఫ్ట్వేర్ ఉద్యోగాల పని వత్తిడి లో ఎంత అలిసిపోయినా, మిగిలిన మూడు శని వారాలు లాగ కాకుండా, మొదటి శనివారం మాత్రం, చాలా ఉత్సాహంగా ప్రీతి చదివే ఇంటర్నేషనల్ స్కూల్ లో, పేరెంట్ టీచర్ మీటింగ్ కి టంచనుగా వాలిపోయేవారు. ఇక్కడ అనుపమ, ఆనందుల గురించి మనం కొంచం తెలుసుకోవాలి. ఇద్దరూ ఒకే ఊరి వాళ్ళు. ఒకే కాలేజీ లో, ఒకే బ్రాంచ్ లో ఇంజినీరింగ్ చదువుకుని, ఒకేసారి, ఒకే సాఫ్ట్వేర్ కంపెనీ లో ఉద్యోగాలు సంపాదించుకున్నారు. అక్కడ తో ఆగారా! ఒకరినొకరు ఇష్టపడడమే కాకుండా ఇంట్లోవారిని ఒప్పించి, తమకి ప్రమోషన్లు వచ్చి టీంలీడర్స్ అయ్యాక పెళ్లి చేసుకున్నారు. అంత ఓర్పుగా, నేర్పుగా జీవితాన్ని చక్కగా ఏర్చి, కూర్చి అందంగా ఏర్పరుచుకున్నారు.


మంచి ఫ్లాట్, కారు తో పాటు సర్వహంగులు సమకూర్చుకున్న వాళ్ళ ఇద్దరికీ పెద్ద సమస్య ఎదురై కూర్చుంది జీవితంలో. ఏంటి? అంటారా! వారిద్దరి ప్రేమకు, సంతృప్తికరమైన దాంపత్యానికి ప్రతిఫలం, ప్రేమఫలం సమస్య ఎలా అవుతుంది అంటారా? ఇద్దరివీ ఉరుకుల, పరుగుల ఉద్యోగాలు, జంటగా ఆఫీసుకు కార్లో వెళుతారు. అయినా పని గంటలు, ట్రాఫిక్ ఒత్తిడి వీటి మధ్య బిడ్డను ఎలా పెంచాలి అనేది వారి ముందు వున్న పెద్ద సమస్య. వీళిద్దరి చదువు, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ప్రమోషన్లు గురించి తెలిసిన ఇరివురివైపు పెద్దలు మేమున్నామని భరోసా ఇచ్చారు. ఇంకేం - అనుపమ ఆనందులు, తమ ప్రేమ లోకం లోకి రాబోయే చిన్నారి పాప, బాబా అని ఆలోచించకుండా ఎవరు పుట్టినా పరవాలేదు, అంటూ బిడ్డ కి కావలసిన రకరకాల వస్తువులు, ఆట బొమ్మల నుంచి అందమైన డ్రెస్సులు వరకు షాపింగ్ చేసేసారు. నెలలు నిండటం, ప్రీతి పుట్టడం. ఇక ఆ ఇంట ప్రతిరోజు పండగ సందడే అన్నట్టు తయారయ్యింది


బామ్మ తాతల, అమ్మమ్మ తాతల సంరక్షణతో రెండవ సంవత్సరం నిండిన ప్రీతితో, అనుపమ, ఆనందులకు అప్పుడు మొదలయింది అసలు సిసలు సమస్య. తమ ఇరువురి తల్లితండ్రులతో ప్రీతిని పల్లెటూరికి పంపడం అనుపమ, ఆనందులకు అస్సలు ఇష్టం లేదు. భాగ్యనగరంలో ఉంటూ,ఎన్నో పేరుమోసిన ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉండగా తమ బిడ్డ పోయిపోయి ఎక్కడో ఊరు పేరు లేని చిన్న స్కూల్లో చదవటం ససేమిరా ఇష్టం లేకపోయింది. అలాంటి సమయం లో, నెత్తిన పాలు పడ్డాయా, అన్న చందంగా, అనుపమకి వరుసకు మేనత్త కూతురు ఐన అనూష, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో పీజీ కొరకు, హైద్రాబాదులో ఫీజు కట్టడం, హాస్టల్ కోసం వెతుక్కోవడం- ఇది తెలిసిన అనుపమ, వెంటనే అనూషకి ఫోన్ చేసి, తమ ఇంట్లోనే వుండి చదువుకుంటూ, తమ ప్రీతికి తోడుగా ఉండగలదా అని అడగటం- అనూష తల్లితండ్రులతో మాట్లాడి, హాస్టల్ గోల తప్పిందని, ఒక్క గెంతులో అంటే సంబరంగా మరునాటి ఉదయానికి అనుపమ వాళ్ళింట్లో వాలిపోయింది. అనంత్ కి, అనుపమకు కలసివచ్చే ఇంకో అద్భుత విషయం, అనూషకు శని, ఆదివారాలు మాత్రమే క్లాసులు జరుగుతాయని, మిగిలిన ఐదు రోజులు ప్రీతిని కనిపెట్టుకుని ఉండటం, స్కూల్కి తీసుకు వెళ్ళటం, తీసుకురావటం ఏ ఆటంకం లేకుండా తమ ఉద్యోగ ధర్మాలు తప్పకుండా జరిగిపోవటం - మొత్తానికి రోజులు సవ్యంగా గడిచి పోతున్నాయి.

వారాలు నెలలు ఎవరికోసం ఆగవు కదా ! ఇప్పుడు ప్రీతి యూకేజీ కి వచ్చింది. ఏబీసీడీ నుంచి మై నేమ్ వరకు, 1,2,3,4 నుంచి 100 వరకు చక చకా నేర్చుకుంటున్న ప్రీతిని చూసి ఆనంద్, అనుపమల తో పాటు అనూష కూడా మురిసిపోయేవారు.


వర్తమానం లోకి వస్తే--- అంత మురిపెంతో ఉన్న అనుపమ, ఆనంద్ ఇప్పుడు ఎందుకు అంత అసహనంగా ఉన్నారో తెలుసుకోవాలి కదా మనం. అదిగో ప్రిన్సిపల్ రూమ్ నుంచి వీరికి పిలుపు రావటం , వీరు లోనికి వెళ్ళటం, చకచకా జరిగిపోయాయి. ఆనంద్ మాట్లాడటానికి తటపటాయిస్తుంటే అనుపమ గొంతు సవరించుకొని ఇది ఏమైనా బాగుందా మేడం - పసిపిల్లకి పెట్టిన టెస్ట్ ఏమిటి.. పైగా ఆ కాగితం ఇంటికి పంపి తండ్రి సంతకం అడుగుతారా ? అంది కొంచం దూకుడుగా .. దానికి ప్రిన్సిపల్ అనుపమ, ఆనంద్ లను ముందు కుర్చీల్లో కూర్చొని, స్థిమిత పడమన్నట్లు సైగ చేసి, గొంతు సవరించుకొని - తప్పేమి కనిపించలేదు. ప్రీతికి క్లాస్ టీచర్ పెట్టిన పరీక్ష లో అన్ని సరిగానే రాసింది. అన్ని పేపర్లు నా దృష్టికి వచ్చాకే తల్లితండ్రుల సంతకానికి పంపుతాము. ఆ మాటలకు అడ్డు వస్తూ “హుమ్ డూ యూ లవ్ మోస్ట్ ఎట్ హోమ్?” (ఇంట్లో అందరికంటే ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తావు ) అంటే, ప్రీతి నా పేరు రాయలికాని, అనూష పేరు రాయటం, దానికి టీచర్ మొత్తం మార్కులు వేయటం, ఇంటికి సంతకం కొరకు పంపటం, ఏమి బాగోలేదు. పైగా ప్రీతి నర్సరీ, ఎల్కేజీ ఇక్కడే చదివింది. యూకేజీ ఇక్కడే చదువుతోంది. మీకు నాపేరు చక్కగా తెలుసు. మరి అలా రాస్తే మొత్తం మార్కులు ఎలా వేస్తారు? అంటూ నిలదీసే సరికి, ప్రిన్సిపల్ కి ఆనంద్, అనుపమల అసహనం అర్ధం అయి, తల పంకిస్తూ, “చూడండి! అనుపమ - ప్రీతి కి టీచర్ మీ అమ్మ పేరు రాయి అనే ప్రశ్న ఇవ్వలేదు. మీ ఇంట్లో నీకిష్టమైన వారు ఎవరు అనే ప్రశ్న ఇచ్చారు. ప్రీతి అనూష అని రాసింది. అందులో తప్పేమి ఉంది. మీరు ప్రీతి క్షేమం కోసం, మీ ఉద్యోగాలు సక్రమంగా నిర్వహించుకోవడం కోసం అనూష సహాయం తీసుకొంటే, అనూష పాపతో మీకంటే ఎక్కువ గంటలు గడుపుతూ, పాప ఆలనా, పాలన చూస్తోంది. అనూషతోనే తన ఆటపాటలు అన్ని జరుగుతున్నాయి. ప్రీతి దృష్టిలో తనతో ఉండి, తన బాగోగులు చూసే నేస్తం అనూష ప్రియమైనది. అంతే” అంటూ మాటలు ఆపారు.

అప్పుడు కానీ, జీవితాన్ని చాలా చక్కగా ప్లాన్ చేసుకుని చదువు, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, ప్రమోషన్ అన్నిటిని సమర్ధవంతంగా నెగ్గుకొచ్చిన అనుపమ, ఆనంద్ లకు ప్రీతి తమకు పెద్ద పరీక్షే పెట్టింది అని అర్థం అయింది. మరి ఇక మనం వేచి చూడాలి. ముందు ముందు అనుపమ, ఆనంద్ ఏమి నిర్ణయం తీసుకొంటారో .. అనూష పీజీ పూర్తి అయ్యేదాకా ఆగుతారో లేదో కూడా.


గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.
37 views0 comments

Kommentare


bottom of page