కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Youtube Video link
'Prema Bhramaram - 12' New Telugu Web Series Written By Vasundhara
రచన: వసుంధర
కథ చదివి వినిపిస్తున్న వారు: కే. లక్ష్మి శైలజ
వసుంధర గారి ప్రేమ ‘భ్రమ’రం ధారావాహిక చివరి భాగం
గత ఎపిసోడ్ లో...
అమోఘ్, రిక్తలతో మాట్లాడాను. వాళ్ళిద్దరితో సెల్ఫీ తీసుకున్నాను.
రూపను వాళ్లింటి దగ్గర డ్రాప్ చెయ్యమని కోరుతాడు అమోఘ్.
వెళ్ళేదారిలో రిక్త పేరుతో అక్కడ ఎవరూ లేరని, అంతా అమోఘ్ భ్రమ అని చెబుతుంది రూప. తను ఇంతవరకు రిక్తను చూడలేదని కూడా చెబుతుంది.
కానీ అమోఘ్ ఇంట్లో నాకు రిక్త కనిపించి ఉండటంతో షాక్ కి గురయ్యాను.
ఇక ప్రేమ ‘భ్రమ’రం చివరి భాగం చదవండి ...
నేనూహించిన దానికంటే విచిత్రమైన కథ.... ‘
‘‘చక్రధర్ ఎవరు?’’ అన్నాను ఆశ్చర్యంగా.
‘‘ఎందుకండీ ఇంకా నటిస్తారు? చక్రధర్‌గారే కదా, మిమ్మల్నిక్కడికి పంపారు?’’ అంది రూప.
చక్రధర్ ఎవరో నాకు తెలియదు. ఆయన నన్నిక్కడికి పంపడమేమిటి?
అడుగుదామనుకున్నవాణ్ణే - అడుగలేదు.
నాకిప్పుడు పెద్ద అనుమానం వచ్చింది.
నా వెనుక ఏదో గూడుపుఠాణీ నడుస్తోంది. ఎవరో నన్ను గజిబిజికి గురి చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారు.
అందువల్ల ఎవరికి ఎందుకు ప్రయోజనమో తెలియదు కానీ - రూప ఇప్పుడు చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని ఖచ్చితంగా చెప్పగలను.
ఎందుకంటే అమోఘ్ ఇంట్లో నేను రిక్తని స్పష్టంగా చూశాను. అందులో నాకు సందేహం లేదు.
ఐతే అదే రిక్తని - ట్రయిన్లో కూడా చూశాను.
ముఖం బాగా గుర్తుండడంవల్ల - ఇద్దరూ ఒకరేనని నమ్మకంగా ఉంది.
అదీకాక ట్రయిన్లో ఆ ముసుగు యువతికి ఫొటో కూడా తీసుకున్నాను. దాంతో నాకు మళ్లీ పనుంటుందని అప్పుడు తెలియదు.ఐనా డిలీట్ చెయ్యలేదు. లాప్‌టాప్‌లోకి మార్చాను.
ఆ ఫొటోకి ‘వెయిల్డ్ టెర్రరిస్ట్’ (ముసుగులో తీవ్రవాది) అని పేరు కూడా పెట్టాను.
ఇంటికెళ్లి ఆ ఫొటోని చెక్ చేస్తే అనుమానం తొలగిపోతుంది.
ఇంతకీ ఇందరు ప్రేమకథల్లో నేనే ఎందుకు జోక్యం చేసుకుంటున్నాను?
నేను జోక్యం చేసుకుంటున్నానా - లేక ఎవరో నన్ను ఇరికిస్తున్నారా?
ఇరికిస్తే - ఎందుకు?
ఆలోచిస్తున్నాను. బైక్ ముందుకెడుతూనే ఉంది.
‘‘ఇక్కడే మా ఇల్లు’’ అంది రూప.
బైక్ ఆపాను.
పెద్ద అపార్టుమెంట్ కాంప్లెక్స్.
ఆమె బైక్ దిగి, ‘‘వేళ కాని వేళనుకోకండి. లోపలికొచ్చి చాయ్ తీసుకోండి’’ అంది.
‘‘ఇప్పుడు మీకు శ్రమెందుకు?’’ అన్నాను.
‘‘శ్రమేం లేదు. ఇంకా చెప్పాలంటే తోడు. మా నాన్నగారికి గంటగంటకీ చాయ్ తాగే అలవాటుంది. రాత్రిళ్లు మేమెవ్వరం కంపెనీ ఇవ్వమని విసుక్కుంటుంటారు’’
‘‘రాత్రిళ్లు చాయ్‌కి నేనూ కంపెనీ ఇవ్వను. నిద్ర చెడిపోతుంది నాకు’’ అన్నాను.
‘‘పోనీ ఒక్కసారి వచ్చి కనిపించి వెళ్లిపొండి’’ అందామె.
‘‘ఎందుకు?’’ అన్నాను ఆశ్చర్యంగా.
‘‘రాత్రిపూట ఎవరో అబ్బాయి నన్నిక్కడ దింపి వెళ్లాడంటే - మావాళ్లు రకరకాలుగా అనుకోవచ్చు. ఒక్కసారి మిమ్మల్ని చూస్తే - ఇంట్లో నా స్టేక్స్ పెరిగిపోతాయి’’ అందామె.
‘‘నన్ను చూస్తే మీ స్టేక్స్ పెరగడమేంటి?’’ అన్నాను అర్థం కాక.
‘‘మిమ్మల్ని చూడగానే మావాళ్లకి తెలిసిపోతుంది - ఈ రోజుల్లోనూ పాతకాలపు అబ్బాయిలున్నారని. ఆడపిల్లల పేరెంట్సుకి తెగ నచ్చేసే లుక్సు మీవి. మరి నా స్టేక్సు పెరగవూ?’’ అందామె.
అది పొగడ్తో ఎగతాళో మరి!
నాకు మాత్రం కొంచెం సిగ్గేసింది.
‘‘ఏమీ అనుకోనంటే - నేనూ ఓ మాటంటాను. మిమ్మల్ని చూస్తే - పేరెంట్సుకి ఏ అబ్బాయి లిఫ్టిచ్చాడూ అన్న ఆలోచనే రాదు. యు ఆరే స్వీట్ లిటిల్ కిడ్ ఆఫ్ యెస్టర్ యియర్స్’ అన్నాను.
‘‘అబ్బా - వెంటనే బాకీ తీర్చేశారు. ఇంకా ఏమైనా ఉంటే తీర్చేసుకు వెళ్లండి. ఇప్పటికే ఆలస్యమైంది’’
ఆమె మాట, తీరు నాకు నచ్చాయి. ఐనా ఆ విషయం ఆలోచించకుండా - చక్రధర్ అడ్రసు అడుగుదామని అనుకున్నాను. కానీ -
రూప మంచమ్మాయిలాగే ఉన్నా - నామీద జరుగుతున్న గూడుపుఠాణీలో తనూ భాగమే కదా!
ఆ విషయం ఆమెకు తెలియకపోవచ్చు కూడా....
చక్రధర్ అడ్రస్ చెబితే - కరెక్టుగా చెబుతుందా - లేక సైకియాట్రిస్టంటూ నన్ను ఎవడో తలమాసినవాడి దగ్గరకు పంపిస్తుందా?
‘‘ఏదో అడుగుదామని సంకోచిస్తున్నారు. ఫర్వాలేదు, నేనేమనుకోను. అడగండి’’ అందామె.
ఆ గొంతులోని కుతూహలంలో - నానుంచి ఆమె ఎదో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్లు తోచింది.
అది నాభ్రమ కావచ్చు. కానీ ఆలోచనల్ని ఆ మూడ్‌లోకి పోనివ్వదల్చుకోలేదు.
‘చక్రధర్ అడ్రసు విషయంలో నన్ను తప్పుదారి పట్టిస్తే - నా పద్ధతులు నాకు లేవా?’ అనుకుంటూ ఆమెని అడ్రసు అడిగాను.
అంతే -
‘‘ప్లీజ్ - ఆయన అడ్రస్ తెలియదని నన్ను మరింత భయపెట్టకండి. రాత్రంతా నిద్ర పట్టదు’’ అందామె.
సరదాగానే అంటున్నట్లున్నా - కొంచెం భయం కూడా కనిపించిందామె ముఖంలో.
అడ్రసుకోసం నొక్కించకుండా ఆమెకి బై చెప్పాను.
- - - - -
ఇల్లు చేరగానే ముందు నైట్ డ్రస్సులోకి మారి మంచంమీద నడుం వాల్చి ఓ క్షణం కళ్లు మూశాను.
కళ్లముందు రిక్త కనిపించింది. ఆ పక్కనే రూప.
ఆమె లోపలికెడుతూ రిక్తలోంచీ వెళ్లింది.
రిక్త అలాగే నిశ్చలంగా ఉంది. కానీ నాకు గుండెలదిరాయి.
చటుక్కున లేచి కూర్చున్నాను. లాప్‌టాప్ ఆన్ చేశాను.
‘వెయిల్డ్ టెర్రరిస్టు’ ఫొటో సులభంగానే దొరికింది.
సందేహం లేదు - ఆమె రిక్త!
అంటే రిక్త తన బావని పెళ్లి చేసుకుంది.
రిక్త తనతో ఉంటోందని అమోఘ్ నమ్ముతున్నాడు.
కానీ అతడికే కాదు - నాక్కూడా కనబడిందామె.
మరి రూపకెందుకు కనబడలేదు?
ఆలోచిస్తుండగా ఫోన్ మ్రోగింది.
ముక్త!
‘‘రిక్తతో సెల్ఫీ పంపుతానన్నారు. ఉత్త మీరూ, అమోఘ్ మాత్రమే ఉన్నారు ఫొటోలో’’ అందామె.
‘‘లేదు, మేం ముగ్గురమున్న సెల్ఫీ పంపాను’’ అని నొక్కించాను.
‘‘ఐతే పొరపాటున మరేదో పంపినట్లున్నారు. నాకా సెల్ఫీ పంపండి’’ అంది ముక్త. ఆమె గొంతులో ఆత్రుత.
‘‘వన్ మినిట్’’ అన్నాను.
ఆ సెల్ఫీ కోసం మొబైల్లో వెదికితే - ముక్త చెప్పిందే నిజం.
అందులో నేను, అమోఘ్ మాత్రమే ఉన్నాం. రిక్త ఉందనుకున్నచోట కాళీగా ఉంది.
ఏం జరిగింది?
సెల్ఫీ అమోఘ్ తీశాడు. రిక్త ఫొటోలో పడకుండా జాగ్రత్త పడ్డాడా?
కానీ అప్పుడు ఫొటోలో మేం ముగ్గురమ ఉన్నామని గుర్తు.
భ్రమ పడ్డానా?
అసలా ఇంట్లో రిక్త అనే యువతి లేదంటుంది - రూప.
ఆమె మాటలు నిజమైతే - రిక్తని చూడ్డం నా భ్రమ.
మనిషి విషయంలోనే భ్రమ పడ్డవాణ్ణి - ఫొటో విషయంలో భ్రమ పడనా?
వళ్లు జలదరిస్తోంది. బుర్ర వేడెక్కుతోంది.
ఇక ఆగలేకపోయాను.
లాప్‌టాప్‌లో నెట్ ఓపెన్ చేసి చక్రధర్ కోసం గూగుల్ సెర్చి చేశాను.
ఊళ్లో చక్రధర్‌లు చాలామందే ఉన్నారు. కానీ ఆ పేరుతో ఉన్న సైకియాట్రిస్టు ఒక్కడంటే ఒక్కడు.
మనిషి బాగున్నాడు. యువకుడు. ముప్పైకి అటూ ఇటూగా ఉంటాడు.
పెద్దగా గుర్తుండిపోయే మొహమేం కాదు. కానీ కళ్లలో ఏదో చురుకుదనముంది.
ఒకందుకు సంతోషం - రూప చెప్పిన కథలో చక్రధర్ పాత్ర కల్పితం కాదు.
నంబరు నోట్ చేసుకుని - ఫోన్ చేశాను.
‘‘కొంచెం బిజీగా ఉన్నాను. రేపు ఫోన్ చేస్తారా?’’ అంది అవతలి గొంతు చాలా మర్యాదగా.
‘‘నా పేరు విచల్. మీ క్లయంట్ అమోఘ్‌తో నాకు జరిగిన విచిత్ర అనుభవాల గురించి మాట్లాడాలని ఫోన్ చేశాను. ఇప్పుడే నాకోసం కొంచెం టైం కేటాయించగలరా?’’ అన్నాను వినయంగా.
‘‘అమోఘ్ గురించి అన్నారు కదూ! మీ పేరు నాకు తెలుసు’’ అవతలి గొంతులో ధ్వని మారింది.
అంటే అమోఘ్ నా గురించి చక్రధర్‌కి చెప్పాడన్న మాట!
ఫోన్లో చక్రధర్ నా అనుభవాలు విన్నాడు.
వెంటనే, ‘‘మిమ్మల్ని నేను అర్జంటుగా కలుసుకోవాలి. మీకిప్పుడు వీలేనా?’’ అన్నాడతడు.
బంతి కోర్టు మారింది. ముందు తనకి వీలు కాదన్నవాడు, ఇప్పుడు నా వీలు గురించి అడుగుతున్నాడు.
‘చాలా మంచి డాక్డరు. పేషెంటంటే ఎంత శ్రద్ధో’ అని మెచ్చుకుంది మనసు.
‘‘నన్ను రమ్మంటే నేనే వస్తాను’’ అన్నాను.
‘‘లేదు, ఇలాంటివి మీ ఇంట్లో మాట్లాడుకుంటేనే మీకు కంఫర్టబుల్‌గా ఉంటుంది’’
సైకియాట్రిస్టుగా - అన్నీ ఆ కోణంలోంచే చూస్తాడు కాబోలు.
మరో అరగంటలో చక్రధర్ మా ఇంట్లో ఉన్నాడు.
నన్ను చూస్తూనే, ‘‘వెరీ యంగ్ అండ్ హాండ్సమ్’’ అన్నాడు.
మనసుకి ఆహ్లాదంగా అనిపించింది.
నేనతడికోసం ఫ్లాస్కులో కాఫీ, ఓ బిస్కట్ల ప్యాకెట్, లే చిప్సు సిద్ధంగా ఉంచాను.
‘‘నో ఫార్మాలిటీస్. మనం సీరియస్‌గా కేసు డిస్కస్ చేద్దాం’’ అన్నాడతడు.
ఇద్దరం చెరో కుర్చీలో కూర్చున్నాక, ‘‘అమోఘ్ కేసులో మీ ఎంట్రీ ఓ అద్భుతమైన మలుపు. అదెలా జరిగిందో తెలియాలి. మీరు కథలేం చెప్పక్లర్లేదు. నేనడిగిన ఒకో ప్రశ్నకే జవాబివ్వండి. చాలు’’ అన్నాడతడు.
అప్పుడు తెలిసింది నాకు ప్రొఫెషనలిజం అంటే!
నేనాయనకి ఫోన్లో చెప్పిన విశేషాల్లో కొంత గజిబిజి ఉంది. కొన్ని కథలు మరుగున పడ్డాయి.
చక్రధర్ ప్రశ్నలు వేస్తుంటే - ముక్తకి సంబంధించి నాకు జరిగిన అనుభవాలన్నీ ఒకటొక్కటిగా బయటకు చెప్పగలిగాను. ఎంతలా అంటే మొత్తం కథమీద ఇప్పుడు నాకే క్లారిటీ వచ్చింది.
ఇప్పుడు నేను చెప్పిన కథలో పద్మ, కిషోర్, స్వర, కవన్, భవన్, ముక్త - అందరూ స్పష్టంగా తమ పాత్రలను ప్రదర్శించారు.
చక్రధర్ నేను చెప్పింది శ్రద్ధగా విన్నాడు. తర్వాత తను చెప్పడం మొదలెట్టాడు.
నేను శ్రద్ధగా వినసాగాను.
అమోఘ్ ప్రేమకథ కొంత అతడి ద్వారానే విన్నాను. కొంత రూప ద్వారా విన్నాను.
రెంటికీ కొంచెం తేడాలున్నా - ట్రయిన్లో ముసుగు యువతి కథని కూడా కలిపి - కొంత ఎడిట్ చేస్తే -
చక్రధర్ కథ వస్తుంది.
అమోఘ్ భ్రమకీ, వాస్తవానికీ మధ్య ఒక అయోమయావస్థలో ఉన్నాడు.
రిక్త తనని కాదని వేరొకర్ని పెళ్లి చేసుకుందన్న వాస్తవం అతడికి జీర్ణం కాలేదు.
అతడు తన ప్రేమని నమ్మాడు. రిక్త ప్రేమని కూడా నమ్మాడు. తమ ప్రేమ ఫలించడం తథ్యమని నమ్మాడు.
ఆ నమ్మిక వమ్మయితే తట్టుకోలేడు.
మనిషి వంటికి తట్టుకోలేని దెబ్బ తగిలినప్పుడు - మెదడు ముందుగా వంటికి స్పృహ తప్పిస్తుంది.
ఆతర్వాత ఆ దెబ్బను తట్టుకునేందుకు వలసిన రసాయనాల్ని తయారు చేస్తుంది.
ఆ రసాయనాలు సరిపడా లేకపోతే - వైద్యులు రంగంలోకి దిగి అవసరమైన మేరకు భర్తీ చేస్తారు.
అలాగే మనిషి మనసుకి తట్టుకోలేని దెబ్బ తగిలినప్పుడు - మెదడు మనసుకి మరుపునిస్తుంది.
ఆతర్వాత ఆ దెబ్బను తట్టుకునేందుకు కొన్ని భ్రమల్ని సృష్టిస్తుంది.
ఆ భ్రమల్లోంచి బయటపడేసి - మనసుని యథాస్థితికి తీసుకు రావడానికి - వైద్యులు కృషి చేస్తారు.
మనసుకి దెబ్బ తగిలిన మనిషి ఒకోసారి పిచ్చివాడైపోవచ్చు.
ఒకోసారి అసాధారణంగా ప్రవర్తించొచ్చు.
అమోఘ్ పిచ్చివాడు కాలేదు. అసాధారణంగా ప్రవర్తిస్తున్నాడు.
అమోఘ్ మనసు యథాస్థితికి రావాలంటే - తన ప్రేమ విషయంలో అతడు లోనవుతున్న భ్రమల్ని అర్థం చేసుకుని అవగాహనతో ప్రోత్సహిస్తూ - అతడిలో అవగాహనకి దారి తీసేలా చెయ్యాలి.
‘‘రిక్త అజ్ఞాతం, ఆమెతో పురుషవేషంలో బయటకు వెళ్లడం, రూప వాళ్లింట రిక్తకు సపర్యలు చెయ్యడం - నేనతడి భ్రమల్ని సమర్థించడానికి ఎన్నుకున్న మార్గాలు’’ అన్నాడు చక్రధర్.
‘‘కానీ అమోఘ్‌కి కనబడ్డ రిక్తని నేను చూశాను. నేను చూసిన ఆ రిక్త రూపకి కనబడలేదు. ఇది నాకు మింగుడు పడ్డం లేదు’’ అన్నాను.
‘‘అందుకే అన్నాను. ఈ కేసులో మీ ఎంట్రీ ఓ అద్భుతమైన మలుపని’’ అన్నాడు చక్రధర్.
అతడు నన్ను వెంటనే కలుసుకోవడానికి కారణం కూడా అదే!
‘‘అమోఘ్ ఇంట్లో రిక్త కనిపించడం మిగతావాళ్లకి భ్రమే కావచ్చు. కానీ, ఆమోఘ్‌కి కాదు. అతడు తన మనోబలంతో ఆమెను సృష్టించుకుని రూపమిచ్చి ఆమె సమక్షాన్ని ఆస్వాదించగల్గుతున్నాడు. ఐతే ఆమెని ప్రియురాలిలా చేరదియ్యలేకపోతున్నాడు. ఎందుకంటే, అంతరాంతరాల్లో అతడికి తెలుసు - ఆమె వివాహిత అని. ఆ అయోమయంలో ఇటు వాస్తవాన్ని ఒప్పుకోలేక, అటు భ్రమల్ని వీడలేకపోతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో అతడికి మీతో పరిచయమైంది. ఎందుకో అతడికి మీపై పూర్తి నమ్మకమేర్పడింది’’ అన్నాడు చక్రధర్.
‘‘ఎందుకంటారు?’’ అన్నాను ఆశ్చర్యంగా.
కానీ నా మనసులో బోధికొలను, బోధివృక్షం - శ్రీను అనుభవాలు మెదులుతున్నాయి.
‘‘అది మీరు కలుసుకున్న వేళా విశేషమో, పరిసరాల ప్రభావమో కావచ్చు. కొన్నింటికి కారణాలు చెప్పలేం. ఏదేమైనా - రూప రిక్తని చూసినట్లు నటిస్తోందన్న అనుమానం అతడికుందని నా కనిపించింది. తనతోపాటు రిక్తని నిజంగా చూడగల వ్యక్తి కోసం అతడు అన్వేషిస్తున్నాడు....’’
‘‘ఎందుకు?’’ అన్నాను.
‘‘అందుకో కారణముంది’’ అన్నాడు చక్రధర్.
రిక్తకిప్పుడు పెళ్లయింది.
ఆమె అమోఘ్‌ని ఎంతలా ప్రేమించిందో తెలియదు కానీ, పవిత్ర భారతనారిలా భర్తకు కట్టుబడి ఉండాలనే అనుకుంటోంది.
కానీ ఆమెకి అమోఘ్ ప్రస్తుత మానసిక స్థితి తెలుసు.
వివాహితగా తనని చూస్తే అతడి గుండె బద్దలైపోతుందనీ తెలుసు.
అందుకే ప్రస్తుతానికి అజ్ఞాతంగా ఉంటోంది.
భర్త మంచివాడు. ఆమె మనోభావాల్ని అర్థం చేసుకుని సహకరిస్తున్నాడు.
కానీ ఇలా ఎన్నాళ్లు?
ఏదో రోజున అసలు విషయం బయట పడుతుంది. అమోఘ్ గుండె బద్దలౌతుంది.
అలా జరక్కూడదంటే - ఈలోగా అమోఘ్ కూడా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి.
అందుకు ఓ ఉపాయం ఆలోచించాడు చక్రధర్.
‘‘అతణ్ణి నేను తరచుగా కలుసుకుని రకరకాలుగా బ్రెయిన్‌వాష్ చేస్తున్నాను. అతడికి జీవించాలనీ, జీవితంలో సుఖపడాలనీ కోరిక ఉంది. భగ్నప్రేమ కారణంగా కలిగిన భ్రమల్నించి బయటపడ్డానికి అతడికి మరికొన్ని భ్రమలు కలిగించాను’’ అన్నాడు చక్రధర్.
ఆ ప్రకారం -
రిక్తకి అమోఘ్‌తో జీవితం గడపాలని ఉంది.
తమ ఇద్దరికీ ప్రాణప్రమాదముందన్న భయంతో అందుకు వెనకాడుతోంది.
ఆ భయాన్ని జయించాలంటే....
అమోఘ్ మెచ్చే అందమున్న మరో యువతిని ఎన్నుకోవాలి.
ప్లాస్టిక్ సర్జరీతో రిక్తని ఆమెకిలా, ఆమెని రిక్తకిలా మార్చాలి.
ఆ తర్వాత వాళ్లు కలకాలం హాయిగా కలిసి జీవించొచ్చు.
ఆమోఘ్ ఈ ఉపాయానికి వెంటనే ఒప్పుకోలేదు.
రిక్తని మరో ముఖంతో చూడలేనన్నాడు.
చక్రధర్ అతడిమీద సెంటిమెంటు అస్త్రం వేశాడు.
‘‘రేపు ఏదైనా యాక్సిడెంటు జరిగి రిక్త మొహం అసహ్యంగా మారిపోవచ్చు. నువ్వామె రూపాన్ని ప్రేమిస్తున్నావా? ఆమెని ప్రేమిస్తున్నావా?’’ అని నిలదీశాడు.
తన ప్రేమనే శంకించడం అమోఘ్ సహించలేకపోయాడు. ఆపైన అంతరాంతరాల్లో - ఈ సమస్యనుంచి బయటపడాలన్న కోరిక ఒకటి అతడికి తెలియకుండా దాగుంది.
‘‘రిక్త ఒప్పుకుంటే సరే’’ అన్నాడతడు చివరికి.
‘‘చాలా చిత్రమైన కథ’’ అన్నాను.
‘‘ఆ తర్వాత అంతకంటే చిత్రం జరిగింది. రిక్త వ్యక్తిత్వానికి తగిన అమ్మాయిని వెదికే బాధ్యత అమోఘ్ నాకు అప్పగించాడు. అయితే ఒంటరిగా నేనా పని చెయ్యలేదు. అడపాతడపా అతణ్ణి వెంటబెట్టుకుని విహారయాత్రలు చేస్తుండేవాణ్ణి. అలా ఒక రోజు ఓ సూపర్ మార్కెట్లో అనుకోకుండా ఓ అమ్మాయి నన్ను ఆకర్షించింది’’ ఆగాడు చక్రధర్.
కథ ఎక్కడికి దారి తీస్తుందో తెలుస్తోంది.
‘‘ఆమె పేరు ముక్త కదూ!’’ అన్నాను చటుక్కున.
‘‘ఔను. నీకు పరిచయమైన ముక్త ఆమే! అందుకే ఈ కథలో నీ ఎంట్రీ ఓ అద్భుతమన్నాను’’ అన్నాడతడు.
జరిగిందేమిటో తెలిసింది. ఎందుకో కూడా కొంత తెలిసింది.
‘‘అంటే అమోఘ్ మీ మాటమీద సూపర్ మార్కెట్లో ముక్తని పలకరించి, డ్రస్సు గిఫ్టుగా ఇచ్చాడన్న మాట! మీ క్లయంట్ దృష్ట్యా అది బాగానే ఉంది. కానీ అవతల ఆ అమ్మాయి అవస్థేమిటో ఆలోచించారా?’’ అన్నాను కొంచెం నిష్ఠూరంగానే.
‘‘అయ్యో, అక్కడ జరిగిందంతా నా మాటమీద కాదు. నేను అమోఘ్‌కి ఆ అమ్మాయిని చూపించి, ‘రిక్త ఈ రూపంలో ఉంటే నీకెలా అనిపిస్తుంది?’ అనడిగాను. ఆ తర్వాత అతడి ప్రవర్తన నేనూహించనిది’’
‘‘పోనీ, అలా ఎందుకు చేశావని అతణ్ణి అడిగేరా?’’
‘‘అడిగాను. ఆమె కళ్లలో అతడికి అచ్చమైన స్వచ్ఛమైన ప్రేమ కనిపించిందిట. కాసేపతడికి తనేం చేస్తున్నాడో తెలియలేదుట’’
నాకు ముక్త చెప్పింది గుర్తొస్తోంది.
అమోఘ్‌ని చూసీ చూడగానే తనలో ప్రేమ పుట్టుకొచ్చిందంది ఆమె.
ప్రేమ స్వయంభువనీ - ఒకళ్లు పుట్టిస్తే పుట్టేది కాదనీ కొందరు ప్రేమికులంటారు.
ఆ క్షణంలో అతడా ప్రేమకి పడిపోయాడా?
‘‘మరి ఆ తర్వాత ఏమయింది?’’ అన్నాను ముక్త చెప్పింది గుర్తు చేసుకుని.
‘‘అమోఘ్ భ్రమలో రిక్త అతడితోనే ఉంటోంది కదా, ఆమెకు అన్యాయం చేస్తానన్న భయంతో ముక్త రూపాన్ని మనసులోంచి చెరిపేసే ప్రయత్నం చేశాడు’’ అన్నాడు చక్రధర్.
‘‘మరి ముక్త అతణ్ణి ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తోంది. ఆమె గతి ఏం కావాలి?’’ అన్నాను బాధగా.
‘‘ఆది కాకతాళీయమో, అదృష్టమో చెప్పలేను - ఆ రోజు నేను చూపించిన ముక్త అమోఘ్‌కి తగిన జోడీ. ఆమెకు ఆ క్షణంలోనే అతడిపై ప్రేమ పుట్టడం దైవసంకల్పం అయుండాలి’’ అన్నాడు చక్రధర్.
‘‘ఏం దైవసంకల్పమో - వాళ్లిద్దర్నీ కలిపే మార్గం తెలియడం లేదు’’ అన్నాను.
‘‘ఆ మార్గం మీరే’’ అన్నాడు చక్రధర్.
ఇందాకట్నించి చూస్తున్నాను. ఈ చక్రధర్ - ఈ ప్రేమ వ్యవహారంలో నన్ను బాగా ఇరికిస్తున్నాడు.
నాకు కోపంగా లేదు, చిరాగ్గా లేదు.
ఎందుకంటే నాకు ముక్త అంటే అభిమానం పెరిగిపోతోంది.
ఎలాగో అలా ఆమెనీ, అమోఘ్‌నీ కలిపి - ఆమెకి సంతోషం కలిగించాలనుంది.
‘‘ఈ విషయంలో నేనేం చెయ్యగలను?’’ అన్నాను.
‘‘మీ ప్రత్యేకతని మీరు గుర్తించలేదు. నేను గుర్తించాను’’ అన్నాడు చక్రధర్.
‘‘నాలో ప్రత్యేకతా? అదీ ప్రేమకు సంబంధించిన విషయంలో.....’’ కొట్టి పారేసినట్లే అన్నాను.
‘‘ఔను, మీరు ప్రేమకి వ్యతిరేకిననుకుంటున్నారు. అది ఓ భ్రమ. ఆలోచించి చూడండి. తెలిసినవారేకాదు, అపరిచిత ప్రేమికులు కూడా వెతుక్కుంటూ మీ దగ్గరకొస్తున్నారు. మీ సాయం అడుగుతున్నారు. మీరు వారిని ప్రేమకు వ్యతిరేకంగా ప్రబోధిస్తూనే - చేతనైన సాయం చేస్తున్నారు. అదీ మనస్పూర్తిగా చేస్తున్నారు. మీ సాయం ప్రేమికులకు వరం. మీరు వేలెట్టిన ప్రతి ప్రేమకథా సుఖాంతమౌతుందన్నది నా జోస్యం’’ అన్నాడతడు.
అమోఘ్‌కి రిక్తతో కలిసి అజ్ఞాత జీవితం గడుపుతున్నట్లు భ్రమ.
నేను ప్రేమని వ్యతిరేకిస్తున్నట్లు భ్రమ పడుతున్నానని చక్రధర్ ఉవాచ.
కిషోర్, పద్మ, స్వర, ముక్త - వీరంతా తమ ప్రేమకథలు నాకు చెప్పుకుని సాయమడిగారు.
వారి కారణంగా నేను ప్రేమజాలంలో ఎంతలా ఇరుక్కుపోయానంటే -
‘నువ్వు ప్రేమను వ్యతిరేకిస్తావన్నది నీ భ్రమ’ అని చక్రధర్ చేత అనిపించింది.
‘‘నేను చెప్పిన కొన్ని విశేషాల ఆధారంగా ప్రేమ వ్యవహారాల్లో నాకో ప్రత్యేకత ఉందని మీరన్నారు. అవికాక మీ దగ్గర ఇంకేమైనా ఆధారాలున్నాయా?’’ అన్నాను.
‘‘లేకేం? అమోఘ్ రిక్తల విషయంలోనే అది ఋజువైంది’’ అన్నాడు చక్రధర్.
‘‘ఎలా?’’ అడిగాను.
అమోఘ్ రిక్త రూపాన్ని ఫీలవుతూ ఆమెతో సాహచర్యం చేస్తున్నాడు.
రూపలాంటివాళ్లు తమ నటనతో ఆ భ్రమకి ప్రాణం పోస్తున్నారు.
‘‘కానీ అమోఘ్‌తో పాటు మీరు కూడా రిక్తని చూశారు. అదీ మీ ప్రత్యేకత’’ అన్నాడు చక్రధర్.
అందులో నా ప్రత్యేకత ఏంటో చక్రధర్ వివరించేదాకా తెలియలేదు.
అప్పుడు నాక్కలిగిన ఆశ్చర్యమింతా అంతా కాదు.
అమోఘ్ భ్రమలో జీవిస్తూ తన ఊహకి రూపాన్నిస్తే - అదే రూపాన్ని నేను కూడా చూడగలిగాను.
‘‘మహాభారతంలో శ్రీకృష్ణుడి రాయబార ఘట్టంలో - పరమాత్మ విశ్వరూపాన్ని చూపిస్తే - ఆయనపై నమ్మకమున్నవారు మాత్రం చూడగలిగారు. అంధుడైన ధృతరాష్ట్రుడు తనూ చూస్తానని వేడుకుంటే పరమాత్మ అతడికి దివ్యచకక్షువులనిచ్చి విశ్వరూపదర్శనం చేయించాడు. తెలుసు కదా!’’ అన్నాడు చక్రధర్.
నాకు కొంచెం కొంచెంగా అర్థమౌతోంది.
నేను అమోఘ్ ప్రేమని నమ్మాను. అందుకని ఆ ప్రేమ విశ్వరూపంలో భాగమైన రిక్తని చూడగలిగానా?
లేక ప్రేమ అమోఘ్‌ని పరమాత్మని చేస్తే - ఆతడినుంచి దివ్యచకక్షువులు పొందే యోగ్యత నా ఒక్కడికే కలిగిందా?
అదేనా - చక్రధర్ నాకుందంటున్న ప్రత్యేకత?
ఆలోచిస్తుంటే నాకు వళ్లంతా పులకరింత.
ట్రయిన్లో నాకు రిక్త ఎందుకు కనబడిందో అర్థమైంది.
అప్పుడామెని చూసి ఉండకపోతే - అమోఘ్ ఇంట్లో చూసింది రిక్తనేనని గ్రహించేవాణ్ణి కాను.
ఆహా, ప్రేమ ఎంత గొప్పది?
అది నాలాంటి సామాన్యుడికి ఎన్ని అపూర్వ అనుభూతులనిచ్చింది?
నేను వినమ్రుడినై చక్రధర్ వంక చూసి, ‘‘నా ప్రత్యేకత నాకు తెలియజెప్పారు. ఆ ప్రత్యేకత ఇప్పుడు ఎవరికి ఎలా ఉపయోగపడుతుంది?’’ అన్నాను.
‘‘నీ స్నేహితురాలు ముక్త - నిజానికి ఆ రూపంలో ఉన్న రిక్త అని అమోఘ్‌ని నమ్మించే బాధ్యతనిప్పుడు మీరు స్వీకరించాలి. కంగారు పడద్దు. వెనుకనుంచి నడిపించడానికి నేనున్నానుగా’’ అన్నాడు చక్రధర్.
మనసు సంతోషంతో ఉప్పొంగిపోయింది.
ముక్త చెప్పనే చెప్పింది - ‘‘నాది ఘాటైన ప్రేమ. అది నన్ను చేరడంలో అమోఘ్‌కి సహకరిస్తుంది’’ అని. అప్పుడది అసాధ్యమనుకున్నాను. ఇప్పుడు సుసాధ్యం చేసే బాధ్యతని స్వీకరించాను.
‘‘నామీద నాకంత నమ్మకం లేదు. మీరు నడిపిస్తానన్నారు కాబట్టి సరేనంటున్నాను’’ అన్నాను.
‘‘అమోఘ్-ముక్తలు ఒకటయ్యేక - మీమీద మీకున్న నమ్మకం ఎంతలా పెరిగిపోతుందంటే - మీరు ప్రేమలో పడ్డాక, మీ ప్రేమకథలో మీకెవరి సహాయమూ అవసరముండదు’’ అన్నాడు చక్రధర్.
నేను ప్రేమలో పడడమా? నా ప్రేమని నాకు నేనుగా సాధించుకోవడమా?
ఇది నాకు దీవెనా, శాపమా? లేక నా భావి గురించిన జోస్యమా?
నా సందేహాలకు సమాధానంగా నాలుగు రోజుల తర్వాత నా చెల్లెలు సరయునించి ఫోనొచ్చింది.
‘‘ప్రేమలో పడ్డాను. అమ్మా నాన్నలకిష్టముండదని తెలుసు. నాకు తప్పొప్పులతో నిమిత్తం లేదు. నువ్వే మార్గదర్శకుడివి. నాకిచ్చిన మాట గుర్తుందిగా’’ అంది సరయు.
మాట గుర్తుండకేం?
నా పెళ్లి తర్వాతనే సరయు పెళ్లి. నేను పెద్దలు చెప్పిన పెళ్లి చేసుకుంటే తనూ పెద్దల మాటే వింటుంది. నేను ప్రేమ పెళ్లి చేసుకుంటే తనూ ప్రేమ పెళ్లి చేసుకుంటుంది.
‘‘నాకిచ్చిన మాట గుర్తుందిగా’’ అని ఫోన్ పెట్టేసింది సరయు.
ఆ ఫోన్ అర్థిస్తున్నట్లు లేదు. నన్ను శాసిస్తున్నట్లుంది.....
---0---
***సమాప్తం***
ఈ సీరియల్ ను ఆదరించిన పాఠకులకు వసుంధర గారి తరఫున, మా తరఫున అభివాదాలు తెలియజేసుకుంటున్నాము.
వసుంధర గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
వసుంధర పరిచయం: మేము- డాక్టర్ జొన్నలగడ్డ రాజగోపాలరావు (సైంటిస్టు), రామలక్ష్మి గృహిణి. రచనావ్యాసంగంలో సంయుక్తంగా ‘వసుంధర’ కలంపేరుతో తెలుగునాట సుపరిచితులం. వివిధ సాంఘిక పత్రికల్లో, చందమామ వంటి పిల్లల పత్రికల్లో, ‘అపరాధ పరిశోధన’ వంటి కైమ్ పత్రికల్లో, ఆకాశవాణి, టివి, సావనీర్లు వగైరాలలో - వేలాది కథలు, వందలాది నవలికలూ, నవలలు, అనేక వ్యాసాలు, కవితలు, నాటికలు, వినూత్నశీర్షికలు మావి వచ్చాయి. అన్ని ప్రక్రియల్లోనూ ప్రతిష్ఠాత్మకమైన బహుమతులు మాకు అదనపు ప్రోత్సాహాన్నిచ్చాయి. కొత్త రచయితలకు ఊపిరిపోస్తూ, సాహిత్యాభిమానులకు ప్రయోజనకరంగా ఉండేలా సాహితీవైద్యం అనే కొత్త తరహా శీర్షికను రచన మాసపత్రికలో నిర్వహించాం. ఆ శీర్షికకు అనుబంధంగా –వందలాది రచయితల కథలు, కథాసంపుటాల్ని పరిచయం చేశాం. మా రచనలు కొన్ని సినిమాలుగా రాణించాయి. తెలుగు కథకులందర్నీ అభిమానించే మా రచనని ఆదరించి, మమ్మల్ని పాఠకులకు పరిచయం చేసి ప్రోత్సహిస్తున్న మనతెలుగుకథలు.కామ్ కి ధన్యవాదాలు. పాఠకులకు మా శుభాకాంక్షలు.
Comments