top of page

ప్రేమ‘భ్రమ’రం - 1

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.







Youtube Video link


'Prema Bhramaram' New Telugu Web Series Written By Vasundhara


రచన: వసుంధర


కొత్త తెలుగు ధారావాహిక ప్రారంభం

నేను భావుకుణ్ణి కాను. ఉగ్రవాదినీ కాదు. చాలా మామూలు మనిషిని.

మామూలుగా ఆలోచించినప్పుడు నాకు అనిపిస్తుంది - బంగారానికీ ప్రేమకూ గొప్ప సామ్యం ఉందని.


జనతకు బంగారం విలువైనది. యువతకు ప్రేమ విలువైనది.

జనత బంగారం కోసం ఏమైనా చెయ్యాలనుకుంటుంది. యువత ప్రేమకోసం ఏమైనా చెయ్యాలనుకుంటుంది.


ఒకటి ధనజాలమైతే, మరొకటి ప్రేమ జాలం.

ప్రేమజాలంలో పడకూడదని చాలా సార్లు మామూలుగా అనుకున్నాను. కానీ ఇటీవల అలా అనుకున్నప్పుడు - ముక్త గుర్తుకొస్తోంది.


ముక్త మామూలు మనిషి కాదని - మొదటిసారి చూసినప్పుడే అనిపించింది నాకు.

మొదటిసారి ఆమెని కలుసుకోవడం విచిత్ర పరిస్థితుల్లో జరిగింది.

నా గురించి చెప్పాలంటే -


ఒక మందుల తయారీ కర్మాగారంలో - సాంకేతిక పరంగా ఉన్నత పదవిలో ఉన్నాను. మేము తయారు చేసే మందుల్లో వాడే వివిధ లోహాల్లో బంగారం కూడా ఉంది.

మేము వాడే బంగారం అతి సన్నని తీగెల రూపంలో ఉండొచ్చు. గోల్డ్‌ క్లోరైడ్‌ వంటి రసాయన ద్రావక రూపంలో ఉండొచ్చు. వాడుతున్నది బంగారమని తెలుసు. కానీ వాడేటప్పుడు దాని విలువ స్ఫురించదు. అదంటే ఆకర్షణ పుట్టదు. కూరలో ఉప్పేసినట్లు, మందుల్లో వెయ్యడానికి వాడతాం, అంతే!


అదే బంగారం - నగల రూపంలో దుకాణాల్లో కనిపించినప్పుడు అదో ఆకర్షణ! ఆ నగలు ఆడవాళ్ల వంటిని అలంకరించినప్పుడు అదో అద్భుతం! ఆడవాళ్లు, అలంకరణ లేకపోతే బంగారానికి ఈ విలువ, ప్రాధాన్యం ఉండవు.


ఓ సన్నని తీగలా, పల్చని ద్రావకంలా కనిపించే మామూలు లోహం - ఆడవాళ్లు, అలంకరణ కారణంగా ఓ అద్భుతంగా మారింది.


బంగారాన్ని ఒక మామూలు లోహం అనుకున్నట్లే, ప్రేమ కూడా ఒక మామూలు అనుభూతి అనుకున్నాను నేను ముక్తను చూసేదాకా.


వాస్తవంలో ముక్త మధ్యతరగతి అమ్మాయి. అంటే చాలా మామూలు అమ్మాయి. ఆమె తండ్రి ఓ ప్రయివేట్‌ కంపెనీలో మామూలు గుమస్తా. తల్లి మామూలు గృహిణి. ఆమెకో అక్క, తమ్ముడు. అక్కకు మామూలుగా పెళ్లయింది. తమ్ముడు ఎడ్యుకేషన్‌ లోన్‌ తీసుకుని మామూలుగా ఇంజనీరింగ్‌ చదువుతున్నాడు. ముక్త మామూలుగా బీయస్సీ కంప్యూటర్సు చేసింది. ఓ మామూలు ఆన్‌లైన్‌ ఉద్యోగం చేస్తోంది - కానీ మామూలుగా మాత్రం కాదు.


కంపెనీ ఆమెకి ఉండడానికి ఇల్లిచ్చింది. తనవాళ్లంతా ఆ ఇంట్లో ఉండడానికి అనుమతించింది. సంపాదన అంతంత మాత్రమేమో తెలియదు. కానీ - ఆమె మాటపై కొందరికి ఉద్యోగాలు కూడా ఇచ్చి - చుట్టుపక్కల ఆమెకు కొంచెం గౌరవాన్నీ ప్రతిష్ఠనూ తెచ్చిపెట్టింది ఆ కంపెనీ.


నిజానికి ఆమెకూ నాకూ ఎటువంటి సంబంధమూ లేదు. ఆమెతో నా పరిచయం చిత్రంగా జరిగింది.


చిన్నప్పట్నించీ నాకు స్నేహితులు తక్కువ. ఇంట్లోవాళ్లతో గడపడం, తీరుబడిలో పుస్తకాలు చదవడం, పాటలు వినడం - ఇదీ నా దినచర్య.


‘‘ఆడది తిరిగి చెడింది, మగాడు తిరక్క చెడ్డాడు’’ అని అమ్మ నన్ను మందలించేది.

అంటే నాకు స్నేహితులు లేరని కాదు. వాళ్లని వీలైనంత దూరంలో ఉంచుతానంతే!

అమ్మ మాటలు నామీద ప్రభావం చూపలేదు. ఆమె భయపడినట్లు నేను చెడిపోనూ లేదు.

బాగానే చదివాను. ఉద్యోగస్తుణ్ణయ్యాను. ఓ సింగిల్‌ రూం అపార్టుమెంట్లో ఒక్కణ్ణీ ఉంటున్నాను. తీరిక సమయంలో పుస్తకాలు చదివినా, పాటలు విన్నా - ఇదివరకటిలా తృప్తిగా ఉండడం లేదు. తోడు కావాలనిపిస్తోంది. అదీ ఆడతోడు!


నా మనసు ప్రేమకోసం తపిస్తోందని అప్పుడు కూడా నాకు అనిపించలేదు.

ప్రతి వయసుకీ కొన్ని అవసరాలుంటాయి. అవి తీరడానికి సమాజం కొన్ని నియమాలు విధించింది. వాటిని పాటిస్తే - జీవితం సుఖంగా మామూలుగా గడిచిపోతుంది.

నా వయసు కుర్రాళ్లకి ఆడవాళ్ల పట్ల ఆకర్షణ ప్రకృతి సహజం. కొందరు దానికి ప్రేమ అని పేరెడితే - కవులు, కళాకారులు ఆ ప్రేమకి భావుకతని అద్ది రసవత్తరం చేశారు.

బయట ఎవరైనా ఆడపిల్ల కనిపించినప్పుడు నాలో ప్రేమ భావన కలిగేది కాదు.

పెళ్లి చేసుకుందుకు సానుకూలమైన అంశాలు మాత్రమే ఆలోచించేవాణ్ణి.


నాకు కులమతాల పట్టింపు లేదు. కట్నకానుకల దురాశ లేదు.

పెళ్లి చేసుకున్నాక నేను నా భార్యతో జీవితాంతం కలిసుండాలి. సుఖజీవనం చెయ్యాలి.

నాది చాలా ఉదాత్తమైన ఆలోచన అనిపించేది. నన్ను నేనే అభినందించుకునేవాణ్ణి. కానీ...


ఒక అమ్మాయి నాతో కలిసి కలకాలం సఖ్యంగా, అవగాహనతో ఉండగలదని ముందుగా తెలుసుకోవడమెలా?


మనవాళ్లు పెళ్లిచూపులంటారు.


ఒకప్పుడు చూపులంటే కేవలం చూపులే. ఇప్పుడు కాబోయే దంపతులు ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడు కుంటున్నారు. ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేసి - ఆ తర్వాతనే నిర్ణయం తీసుకుంటున్నారు.


ఈ పద్ధతి చాలా బాగుంది. కానీ పద్మ ఒప్పుకోదు.

పద్మ నా కజిన్‌. నాకంటే రెండేళ్లు చిన్నది. ఇంజనీరింగ్‌ చదివి సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ చేస్తోంది. అందంగా ఉంటుంది.


ఒకప్పుడు వయసొచ్చిన ఆడపిల్లల్లో కూడా కొందరు మాత్రమే బాగుండేవారుట. ఇప్పుడు అంతా బాగుంటున్నారు.


ఈ విషయం మా ఇంట్లో అప్పుడప్పుడు చర్చకు వచ్చేది.

నాన్న అమ్మతో అనేవారు -


ఒకప్పటి ప్రముఖ గాయనీమణులు లత, ఆశ, సుశీల - బయట ఎక్కువ కనబడేవారు కాదు. కనబడినప్పుడు పక్కింటి మనిషిలా సీదాసాదాగా, తమ గొప్పతనానికి తగినంత హుందాగా ఉండేవారు. వాళ్లు మేకప్పులకి ప్రాధాన్యమిచ్చేవారు కాదు. ఆకర్షణకి ప్రతిభే కానీ రూపం ముఖ్యం కాదనుకునేవారు.


ఇప్పుడు పరిస్థితులు మారాయి. మీడియా ప్రాబల్యం పెరిగింది. మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. తెర వెనుక కాకుండా తెరముందు కనిపించడం సాధారణమయింది. దాంతో రూపానికి ప్రాధాన్యం పెరగడం సహజం.


ఎప్పుడు ఎవర్ని ఏ టివి ఛానెల్‌ పిలుస్తుందో, ఏ ఇంటర్వ్యూ చేస్తుందో, ఏ ప్రదర్శన ఏర్పాటు చేస్తుందో తెలియదు. ఆ పిలుపులు సుప్రసిద్దులకే పరిమితం కాదు. సాధారణ గృహిణులు కూడా టివి షోలకు ఆహ్వానించబడుతున్నారు. అందుకని ఒకప్పుడు వంటింటి కుందేళ్లుగా నిరసించబడ్డ ఇల్లాళ్లు కూడా - ముఖానికి క్రీములు, పెదాలకు లిప్‌స్టిక్‌ పూసుకోనిదే బయటకు రావడం లేదు.


క్రమంగా ఆడవాళ్లకు ఓ కొత్త విషయం తెలిసింది - అందం అలంకరణతో మరింత రాణిస్తుందని! ఒకోసారి అలంకరణ - లేని అందాన్ని కూడా తెచ్చిపెట్టగలదనీ వాళ్ల్లు నమ్ముతున్నారు.


అలంకరణ అందాన్నిస్తుందా, ఆకర్షణని పెంచుతుందా అన్నది ఆలోచించరు. అందానికీ, ఆకర్షణకీ మధ్య తేడాని కూడా గుర్తించరు.


ఏదిఏమైనా - తమని తాము ఎలా ప్రెజంట్‌ చేసుకోవాలో గ్రహించడంవల్లనే, నేడు ప్రతి మహిళా ఆకర్షణీయంగా అగుపిస్తోంది. దానికే - మహిళల్లో అనాకారితనం అరుదైందని కొందరంటున్నారు.


అది నాన్నగారి అభిప్రాయం.

అమ్మ ఎక్కువ మేకప్‌ చేసుకోదు. అమ్మ కాబట్టి నాకు తనెప్పుడూ చాలా అందంగా అగుపిస్తుంది.


అమ్మ అందంమీద నాన్నగారి అభిప్రాయమేమిటని నేనెప్పుడూ ఆలోచించలేదు. వయసు పెరిగే కొద్దీ అందం తరుగుతుంది కాబట్టి - అమ్మని కూడా మేకప్‌ చేసుకోమని సూచిస్తున్నారా అనిపించేది.

అమ్మ మాత్రం ఇంకోలా స్పందించేది.


ఆయనకి మేకప్‌ అంటే నిరసనట. అమ్మ దృష్టి మేకప్‌వైపు మళ్లుతుందని ఆయన భయంట. అందుకని ఇలా వ్యంగ్యంగా మేకప్‌ చేసుకోవడాన్ని నిరసిస్తున్నారుట.


అమ్మ మాటలు నిజమో, నాన్నగారి మాటలు నిజమో తెలియదు. నాకు మాత్రం ప్రస్తుతం ఏ ఆడపిల్లయినా చాలా అందంగా కనిపిస్తోంది. ఉదాహరణకి పద్మ.


బంధువులమ్మాయి కాబట్టి మా ఇంటికి చాలాసార్లే వచ్చింది. ఒకోసారి రాత్రిళ్లు మా ఇంట్లోనే పడుకునేది.


అప్పుడే నిద్ర లేచినప్పుడు కూడా ఆమె మొహం నాకు అందంగానే కనిపించింది. అలంకరణతో ఆ అందం రెట్టింపయితే అది వేరే సంగతి!


పద్మ చురుకైనది. చొరవైనది. నేను చటుక్కున నలుగురితో కలవనని తెలిసి, తనే నాతో సాన్నిహిత్యం పెంచుకుంది.


ఆడపిల్ల. వయసులో ఉంది. ఆమె సాన్నిహిత్యం నాకు చాలా బాగుంది.

ఐతే ఇద్దరం వయసులో ఉన్నాం కాబట్టి - ఆ సాన్నిహిత్యం మంచిది కాదని కూడా నాకు అనిపించింది.


అనిపించిన మాట బయటకు చెప్పకపోతే హిపోక్రసీ ఔతుంది.

నాకు హిపోక్రసీ నచ్చదు. ఒకసారి ఆ విషయం ఆమెతో చెప్పేశాను.


‘‘ఈ మాట - అమ్మా, నాన్నా అనాలి. నువ్వంటావేంటీ?’’ అని ముందు మందలించింది.


‘‘ఈ వయసులో అబ్బాయిల ఆలోచనలు ఎలా ఉంటాయో నాకు తెలియాలి. అమ్మాయిల ఆలోచనలు ఎలా ఉంటాయో నీకు తెలియాలి. మన సాన్నిహిత్యాన్ని పెద్దలు ప్రశ్నించడం లేదు కదా, కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి’’ అని తర్వాత ఉపదేశించింది.


ఏ టాపిక్‌ వచ్చినా ఆమె నాతో నిస్సంకోచంగా, అరమరికలు లేకుండా మాట్లాడేది.

కొన్నాళ్లు గడిచేసరికి నాకామె సాన్నిహిత్యం అలవాటుగా మారింది.


ఆమె నా గదికి వచ్చేది. నేనామె ఇంటికి వెళ్లేవాణ్ణి. కానీ మేము ప్రేమికులం కాదు. స్నేహితులం.


ఓసారి ఆమె నా గదిలో ఉండగా - పెళ్లి టాపిక్‌ వచ్చింది.

‘‘ఎన్నికలప్పుడు రాజకీయనాయకులు వాగ్దానాలు చేస్తారు. జనం వింటారు. వాగ్దానాలు నెరవేర్చాలని నాయకులు అనుకోరు. నెరవేర్చ లేదేమని జనం అడగరు. అలా ఐదేళ్లు గడిచిపోతాయి. ప్రజాస్వామ్యంలో అదో అనుబంధం! పెళ్లి చూపులూ అంతే! అక్కడ నాయకులు, జనం. ఇక్కడ వధూవరులు. ఆ అనుబంధం ఐదేళ్లయితే, ఇది నూరేళ్ల అనుబంధం!’’ అంది పద్మ.


‘‘అంటే పెళ్లిచూపుల్లో కలిగే అవగాహన కృత్రిమం, తాత్కాలికం అని తేల్చేశావు. మరి అవగాహనకు పెళ్లి విషయంలో ఏంచెయ్యాలి?’’ అనడిగాను.

‘‘ప్రేమించాలి’’ అంది పద్మ.

‘‘ప్రేమా?’’ అన్నాను నీరసంగా.


‘‘అదేమిటీ - ప్రేమనగానే అంత నీరసపడిపోయావ్‌?’’ అంది పద్మ ఆశ్చర్యంగా.

‘‘ఎందుకంటే - దేవుడి లాగే ప్రేమ కూడా - ఉందో లేదో తెలియని ఓ విచిత్ర పదార్థం’’ అన్నాను.


‘‘దేవుడున్నాడో లేడో తెలియదను. ఒప్పుకుంటాను. ప్రేమని దేవుడితో పోల్చకు. ఈ భూమ్మీద సృష్టి స్థితి లయలకు ప్రేమే కారణం’’ అంది పద్మ.

‘‘నమ్మేవాళ్లు దేవుడి గురించీ అదే మాటంటారు’’ అన్నాను.


పద్మ నిట్టూర్చి, ‘‘అందుకు ఎవరి కారణాలు వాళ్లకుంటాయి. నేను ప్రేమని నమ్మడానికి నా కారణం నాకుంది’’ అంది.

‘‘అదేమిటో చెబుతావా?’’


‘‘అది చెబితే అర్థమవదు. నువ్వు కూడా ఒకసారి ఎవరినైనా ప్రేమించు. అప్పుడర్థమౌతుంది’’ అంది పద్మ.

‘‘అంటే నువ్వు ఎవరినో ప్రేమించావన్న మాట! ఎవరినో తెలుసుకోవచ్చా?’’ అన్నాను.

‘‘అది నీకు అనవసరం. ముందు అర్జంటుగా ఓ అమ్మాయిని వెతుక్కుని ప్రేమించు’’ అంది పద్మ.


‘‘నేను వెతుక్కోవడమెందుకూ, నాకోసం అమ్మాయిని వెదికే పని అమ్మానాన్నలకి అప్పగించాను’’ అన్నాను.

పద్మ అదోలా చూసి, ‘‘ఔనా! అప్పుడు నీ దాంపత్యజీవితం మన ప్రజాస్వామ్యంలాగే ఉంటుంది’’ అంది.


‘‘అంటే?’’

‘‘అమ్మా నాన్నా చూసిన అమ్మాయి ఇప్పుడు నువ్వేం చెప్పినా ఔనంటుంది. అసలు రంగు తర్వాత బయటపడుతుంది’’ అంది పద్మ.


‘‘ముందే అసలు రంగు తెలుసుకుందుకు ఏంచెయ్యాలి?’’

‘‘ప్రేమించి పెళ్లి చేసుకో’’


‘‘ప్రేమించడమా, అదెలా?’’ అన్నాను. అడుగుతున్నది ఆడపిల్లనని తెలిసినా ఎందుకో చిన్నతనంగా ఆనిపించలేదు.

‘‘అమ్మానాన్నల్ని పక్కన పెట్టేసేయ్‌. నీకు నువ్వుగా ఓ అమ్మాయిని వెతుక్కో. పరిచయం పెంచుకో. ఒకరికొకరు సరిపడితే ప్రేమ అదే పుడుతుంది’’


ఆశ్చర్యంగా పద్మ వంక చూశాను.

ఇప్పుడు ఆడపిల్లలు పెద్ద చదువులు చదివి తమ కాళ్లమీద తాము నిలబడుతున్నారు. దాంతో వాళ్ల ఆలోచనలు మారుతున్నాయి. స్వేచ్ఛాభావాలు వారికి సహజమౌతున్నాయి.

ఒకప్పుడు అబ్బాయిలు ఇలా మాట్లాడేవారు.


అప్పట్లో ఆడపిల్లలకి ఇప్పుడున్న రక్షణ లేదు. అభద్రతాభావం కారణంగానే - పెళ్లి వారికి జీవిత పరమావధి.

పెళ్లయిన ఆడపిల్లలకు అత్తింటి ఆదరణ అత్యవసరం. భర్తను మెప్పించడం ఇంకా అవసరం. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి.


వ్యవస్థ ఒడిలో గారాల బిడ్డలుగా పెరుగుతున్న అబ్బాయిలకి - స్వేఛ్ఛావాయువులు పీల్చే అమ్మాయిల్ని ఆకట్టుకోగల సామర్ధ్యం కొరవైంది.

దాంతో అభద్రతాభావం ఆమ్మాయిల్నించి తప్పుకుని అబ్బాయిల్న్లి ఆశ్రయించింది.

అమ్మాయిల్ని ముగ్గులోకి దించడానికి ఒకప్పుడు అబ్బాయిలు వాడిన చిట్కాల్ని - ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిల్నించి వినాల్సి వస్తోంది.


‘‘ప్రేమ పుట్టి, పెళ్లి దాకా వెళ్లేక - ఆ అమ్మాయి అసలు రంగు వేరే ఉండదని గ్యారంటీ ఉందా?’’ ఆన్నాను.


‘‘ప్రేమలో దాపరికాలుండవు. ఉన్నా - తర్వాత సద్దుబాటుకి అనుకూలంగా ఉంటాయి’’ దృఢంగా అంది పద్మ.

నాకంటే చిన్నది పద్మ. నాకు ప్రేమ పాఠాలు చెబుతోంది.


ఎలాగూ ఇంతవరకూ వచ్చాను కదా అని, ‘‘ఇన్ని చెప్పావ్‌! ప్రేమించడానికి అమ్మాయిని ఎలా వెతుక్కోవాలో చెప్పు’’ అన్నాను.

‘‘ఈ మాత్రం తెలియదా?’’ అన్నట్లు పద్మ నన్ను తిరస్కారంగా చూడలేదు. కెమిస్ట్రీలో డౌటొచ్చిన బోటనీ ప్రొఫెసరుకేసి కెమిస్ట్రీ ప్రొఫెసరు ఎంత గౌరవంగా చూస్తాడో - అంత గౌరవంగానూ చూసి చెప్పడం మొదలెట్టింది.


ముందు నాకు రూపం నచ్చాలిట. తర్వాత నెమ్మదిగా పరిచయం పెంచుకోవాలిట.

సంభాషణల్లో అక్కడక్కడ నా అభిప్రాయం, అభిరుచులు చెబుతూ - ఆమెకి తెలియకుండానే ఆమె అభిప్రాయాలు, అభిరుచులు తెలుసుకోవాలిట. అలా చనువు కొంత పెరిగేక, సూటిగా కళ్లలోకి చూసి మాట్లాడ్డం అలవాటు చేసుకోవాలిట.


ఆడవాళ్లు - అన్నివేళలా మనసులో మాట సూటిగా చెప్పలేరుట. అప్పుడు వాళ్ల మనసులో మాట - కళ్ల్లలో కనబడుతుందిట.

‘‘కనుల భాష అర్థమైతే చాలు - ఆడపిల్ల మనోభావాలు తెలిసినట్లే’’ అందామె.

అరటిపండు వలిచినట్లు చెప్పింది పద్మ.


నాకర్థమైంది - ఆడపిల్లలు మనోభావాల్ని సూటిగా చెప్పరని. ‘‘నీ దృష్టిలో నాకు తగిన మంచమ్మాయుంటే చెప్పు. నీ పాఠాలు ఫాలో ఔతాను’’ అన్నాను.

‘‘ఎవరో చెబితేనో, లేక నీకు నువ్వుగా వెతుక్కునో ప్రయత్నిస్తే - అది ప్రేమనిపించుకోదు. ప్రేమ స్వయంభువు’’ అంది పద్మ.


‘‘అదేమిటీ, ఇందాకనే కదా - నువ్వు ఓ అమ్మాయిని వెతుక్కుని ప్రేమించమని చెప్పావుగా’’ అన్నాను.


పద్మ తడబడలేదు. ‘‘చెప్పేవాళ్లకి వినేవాళ్లు లోకువ’’ అని నవ్వేసింది. ఏమనాలో తెలియలేదు కానీ నాకూ నవ్వొచ్చింది.


‘‘నేను నవ్వడానికి కారణముంది. నువ్వెందుకు నవ్వావ్‌?’’ పద్మ నవ్వాపి సీరియస్‌గా అడిగింది.

‘‘కాసేపు గురువు హోదా ఇచ్చాను. భలే రెచ్చిపోయావని నవ్వొచ్చింది. మరి నీ నవ్వుకి కారణమేమిటి?’’ అన్నాను.


‘‘ప్రేమించడానికి నీకు తగిన మంచమ్మాయుంటే చెప్పమన్నావ్‌! నీకు తగిన మంచమ్మాయిని గుర్తించడానికి - నాకంటే నీ అమ్మా నాన్నా బెటరు కదా!’’ అంది పద్మ.

ఛెళ్లుమంది.


పెళ్లి చేసుకుందుకు ప్రేమించాలనుకోవడం - అరేంజ్డ్‌ మారేజెస్‌తో సమానమని ఆమె ఉద్దేశ్యం.

‘ప్రేమా గీమా నాకెందుకు? పెద్దలు చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను’ అనుకున్నాను.


అప్పటికి నేనింకా ముక్తను చూడలేదు.

- - - - -

కమలాసనుడిగా వేదాలు వల్లించే దొకడు. శేషతల్పశాయిగా చిద్విలాసుడొకడు. మృగచర్మధారిగా శ్మశానవాసి ఒకడు.


దేవుడికి వివిధరూపాలు. ఆ రూపాలకు వివిధ కోణాలు.

వీణాపాణిగా విద్యలరాణి ఒకతె. సకలవైభవాలతో ధనరాణి ఒకతె. ఉగ్రరూపంతో శక్తి స్వరూపిణి ఒకతె.


దేవతలకు వివిధ రూపాలు. ఆ రూపాలకు వివిధ కోణాలు.

దేవుళ్లు, దేవతలు - ప్రేమకు ప్రతిరూపాలంటారు. అందుకే ప్రేమకు వివిధ రూపాలు. ఆ రూపాలకు వివిధ కోణాలు.


ఐతే - ప్రేమంటే గొప్ప అవగాహన ఉన్న పద్మ ప్రేమలో ఓ కొత్త రూపాన్నీ, కోణాన్నీ చూస్తానని నేననుకోలేదు.

ఆ రోజు....


‘‘నీతో పెర్సనల్‌గా మాట్లాడాలి. చాలా అర్జంట్‌. ఇప్పుడొస్తే గదిలో ఉంటావా?’’ పద్మ ఫోను.

తను కాస్త ఎమోషనల్‌ అని తెలుసు. ప్రతి చిన్న విషయానికీ ఓవర్‌గా రియాక్టవుతుందనీ తెలుసు. అందుకే, ‘‘ఏమిటి విశేషం?’’ అన్నాను మామూలుగా.

‘‘ఇప్పుడొస్తే రూంలో ఉంటావా? ముందది చెప్పు’’ అంది పద్మ కసురుతున్నట్లు.

నన్ను కసిరే చనువామెకి ఉంది. ఆ చనువుతో ఒకోసారి అవసరం లేకపోయినా కసురుకుంటుంది. ఇప్పటి గొంతులో మాత్రం అవసర మున్నట్లే అనిపించింది.


‘‘ప్రస్తుతం రూంలోనే ఉన్నాను. నువ్వొస్తానంటే ఎక్కడికీ వెళ్లను’’ అన్నాను వినయంగా.

‘‘ఓకే’’ పద్మ ఫోన్‌ పెట్టేసింది.


నేనుంటున్నది సింగిల్‌ బెడ్రూం అపార్ట్‌మెంట్‌.

బ్రహ్మచారిని. ముందు గది ఎప్పుడూ చిందరవందరగా ఉంటుంది.

తను వస్తోందని ఆదరాబాదరాగా సద్దేశాను.


రెండు మూడు రకాల జ్యూసులు ఫ్రిజ్‌లో ఉన్నాయి. లేస్ చిప్సు ప్యాకెట్టొకటీ, మినరల్‌ వాటర్‌ బాటిలూ - బల్లమీదుంచి ఆమెకోసం ఎదురు చూస్తున్నాను.

తను నా రూంకి ముందే బయల్దేరి, దారిలో ఫోన్‌ చేసినట్లుంది. పది నిముషాల్లో వచ్చేసింది.


కాలింగ్‌ బెల్‌ కొట్టగానే, తలుపు తీసి లోపలికి ఆహ్వానిస్తూనే ఓసారి తేరిపార చూశాను.

ఎప్పటిలాగే ఉందనిపించింది. ఇద్దరం ఎదురెదురుగా కుర్సీల్లో కూర్చున్నాం.

‘‘మంచినీళ్లు కావాలా?’’ అన్నాను.


ఊహించని బదులొచ్చింది, ‘‘నాకు చచ్చిపోవాలనుంది. కొంచెం విషం తెచ్చిస్తావా?’’ అంది పద్మ.


ఉలిక్కిపడి ఆమెని పరీక్షగా చూశాను. అప్పుడు గమనించాను మొహాన్ని కమ్ముకున్న విషాదఛాయలు. అవి కూడా ఆమె అందాన్ని ఏమాత్రం తగ్గించలేదు.

‘‘ఏమయింది?’’ అన్నాను ఆశ్చర్యాన్ని దాచుకోకుండా.

‘‘ప్రేమ ఫెయిల్యూర్‌’’ అంది పద్మ సూటిగా.


నా ఆశ్చర్యం పరిహాసంగా మారింది, ‘‘అంతేనా, ఇంకా ఏమో అనుకుని కంగారు పడ్డాను’’ అన్నాను.


‘‘ప్రేమంటే అంతేనా అంటున్నావా? నీకసలు ప్రేమంటే తెలుసా?’’ రోషంగా అంది పద్మ.

‘‘ప్రేమంటే నాకే కాదు, ఎవరికీ తెలియదు. నీకూ తెలియదు’’ అన్నాను.


‘‘నీ సంగతి అర్థమౌతోంది. నాకు తెలియదని ఎందుకంటావ్‌?’’

‘‘ఎందుకంటే - దేవుడి లాగే ప్రేమ కూడా - ఉందో లేదో తెలియని ఓ విచిత్ర పదార్థం కదా’’ అన్నాను.


ఇదివరలో ఇదే మాటంటే - ‘‘దేవుడున్నాడో లేడో తెలియదను. ఒప్పుకుంటాను. ప్రేమని దేవుడితో పోల్చకు. ఈ భూమ్మీద సృష్టి స్థితి లయలకు ప్రేమే కారణం’’ అంది పద్మ. మరి ఇప్పుడేమంటుందో...


‘‘ఇప్పుడీ చర్చ అవసరమా విచల్‌? ముందు నాకు విషం తెచ్చివ్వగలవో లేదో చెప్పు’’ అంది పద్మ.

ఊహించలేదు.


అంటే తను విషం విషయంలో పట్టుదలగానే ఉంది.

ఉన్నట్లుండి తనకి విషమెందుకు కావలసొచ్చింది?


అది తెలియదు కానీ, విషం నన్నే ఎందుకడిగిందో ఊహించగలను.

డ్రగ్‌ ఫ్యాక్టరీలో సీనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్ని. క్షణాలమీద ప్రాణాలు తీయగల భయంకర విషాలు కొన్ని నాకు అందుబాటులో ఉంటాయి. ఆ విషయం పద్మకి తెలుసు.


‘‘నా దగ్గరున్న విషాలు ప్రాణాలు నిలబెట్టే మందుల తయారీకోసం. ప్రాణాలు తియ్యడానికి కాదు’’ అన్నాను.


‘‘విషం ప్రాణం తీసుకుందుకేనని గ్రహించేశావన్న మాట!’’ నిట్టూర్చింది పద్మ.

అంటే తను ప్రాణం తీసుకోవాలనుకుంటోంది. ఎందుకో మరి!


‘‘గ్రహించాను కానీ - నీకు విషాన్నివ్వను’’ అన్నాను.

‘‘ఎందుకివ్వవు?’’ గద్దించింది పద్మ.


‘‘కారణం ఇందాకనే చెప్పాను. నా దగ్గరున్న విషాలు ప్రాణాలు నిలబెట్టడానికి. తియ్యడానికి కాదు’’


‘‘ఐతే గుర్తు చేసుకో - నువ్వే చెప్పావోసారి. కొన్ని మందులు రోగులకి ప్రాణాలు తాత్కాలికంగా నిలబెట్టినా, వాటి ప్రభావం శరీరంమీద పడి - మనిషికి బ్రతుకు దుర్భరమౌతుంది. రోగాల బాధతో తీసుకు తీసుకు చచ్చేకంటే, విషం మింగి క్షణాలమీద అనాయాసమరణం పొందడం మేలనీ - అలాంటి విషాలు నీ దగ్గరున్నాయనీ ఓసారి నువ్వే నాకు చెప్పావ్‌?’’ అంది పద్మ.


చెప్పిన మాట నిజం. ఆ మాట ఆమెలో ఇలాంటి ఆలోచన రేకెత్తిస్తుందని అప్పుడనుకోలేదు.


‘‘అంటే ప్రేమ నిన్ను రోగంలా పట్టిందంటావ్‌’’ అన్నాను.


‘‘అలాగని ఎందుకంటాను? ప్రేమ ఒక మధురానుభవం. అదెంత గొప్పగా ఉంటుందంటే - ప్రేమించినవాడు దక్కడని తెలిస్తే, జీవించడమే వ్యర్థం అనిపిస్తుంది. అలాంటప్పుడు - చావడానికి పెట్రోలు మీద పోసుకుని అంటించుకుంటే వళ్లంతా కాలి నానా బాధా పడాలి. ఏ కొండమీంచో దూకితే, ఎముకలన్నీ విరిగి యమబాధ పడాలి. నదిలోకి దూకితే నీళ్లు మింగేసి నానా అవస్థా పడాలి. ఉరేసుకుంటే మెడ బిగుసుకుంటున్న బాధతో గిలగిల కొట్టుకోవాలి. ఇలా ప్రతి పద్ధతిలోనూ నరకయాతన ఉంది. అందుకే నిన్ను విషమడిగాను’’ అంది పద్మ.


‘‘ప్రేమ ఫెయిల్యూర్‌కి పరిష్కారం చావొక్కటేనా?’’ అన్నాను కాస్త చిరాగ్గా.

‘‘నా ప్రేమ ఫెయిల్యూర్‌కి చావే మార్గం’’ అంది పద్మ దృఢంగా.


ఆమె గొంతుని బట్టి అర్థమైంది - ఆమె ఈ విషయంలో చాలా సీరియస్‌గా ఉందని.

‘‘అది నేను డిసైడ్‌ చేస్తాను. ముందు నీ ప్రేమ ఫెయిల్యూర్‌ గురించి కాస్త వివరంగా చెప్పు’’ అన్నాను.


‘‘చెబుతాను. మరి విషమిస్తావా?’’ అంది పద్మ.

‘‘చెప్పాక డిసైడ్‌ చేస్తాను’’ అన్నాను తాపీగా.

పద్మ గొంతు సవరించుకుంది.

- - - - -

కవన్‌కి చిన్నప్పుడే తలిదండ్రులు చనిపోయారు. మేనమామ చేరదీసి పెంచి పెద్ద చేశాడు. ఆ మేనమామ కూతురే పద్మ.


పద్మ, కవన్‌ కలిసి పెరిగారు. సన్నిహితంగా మసిలేవారు. కాస్త వయసొచ్చేసరికి పద్మకి అతడిపై ప్రేమ పుట్టింది.


ఆదిలో తనది ప్రేమ అని పద్మకి తెలియదు. కొన్నాళ్లకి ఆమెకా విషయం తెలిసింది కానీ కవన్‌కి తెలియలేదు.


మూడు నెల్లక్రితం పద్మ తన ప్రేమ గురించి ముందు తల్లికి చెప్పింది. తల్లి తండ్రికి చెప్పింది. ఇద్దరూ కవన్‌కి చెప్పారు.


అప్పుడు కవన్‌ పద్మను ఏకాంతంలో కలుసుకుని, ‘‘నీకూ నాకూ ప్రేమేమిటి పద్మా! నేనెప్పుడైనా అలా తప్పు అర్థం కలిగేలా ప్రవర్తించేనా?’’ అన్నాడు.


‘‘ప్రేమంటే ఓ గొప్ప అనుభూతి. దాన్ని తప్పు అర్థం అనకు’’ అంది పద్మ.

‘‘ఏమో - నిన్ను ప్రేమించడమంటే నాకు తప్పుగానే తోస్తుంది’’ అన్నాడు కవన్‌.

‘‘ఎందుకని?’’


‘‘కన్నవారే పిల్లల్ని పట్టించుకోని ఈ రోజుల్లో - మామయ్య, అత్తయ్య నన్ను చేరదీసి ఇంతవాణ్ణి చేశారు. వాళ్లని నేను బంధువుల్లా ఎన్నడూ అనుకోలేదు. వాళ్లు నాకు దేవుళ్లు. మీ ఇల్లు నాకొక దేవాలయం. నువ్వొక దేవతవి. మీలో ఎవరినైనా ఆరాధించగలను కానీ, ప్రేమించలేను’’ అన్నాడు కవన్‌.


‘‘రుక్మిణి కృష్ణుణ్ణి ఆరాధించింది. పెళ్లి చేసుకుంది. నీ ఆరాధన మన పెళ్లికి అడ్డు రాదు’’ అంది పద్మ.


‘‘పురాణాల్లో వ్యక్తులు దైవాంశ సంభూతులు. వారి కథలు మనకి వర్తించవు. మనది పవిత్రబంధం. దీన్ని ప్రేమబంధం చెయ్యకూడదు’’


‘‘అయ్యో కవన్‌! నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నా ప్రేమ పవిత్రమైనది. ఆ ప్రేమని మన్నించి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే మన బంధం పవిత్రబంధమే ఔతుంది’’ అంది పద్మ.


‘‘పెళ్లి అంటే భార్యాభర్తలు సరిసమానులు. కానీ నేనెప్పుడూ నీతో సమానం అనుకోలేదు. నువ్వు దేవతవి. నేను సామాన్యుణ్ణి. పెళ్లి చేసుకుంటే నా ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్సు నిన్ను బాధ పెడుతుంది. ప్లీజ్‌! అర్థం చేసుకో’’ అన్నాడు కవన్‌.


‘‘నీకు ఏ కాంప్లెక్సుంటే ఆ కాంప్లెక్సుని నేను ప్రేమిస్తున్నాను. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సు అందుకు మినహాయింపు కాదు. నీవల్ల నాకు బాధ కలిగితే, ఆ బాధ కూడా నాకు మధురం. నా ప్రేమని అర్థం చేసుకో’’ వేడుకుంది పద్మ.


‘‘నువ్వనే ఈ మాటలన్నీ నీమీద ఆరాధనాభావాన్ని మరింత పెంచుతున్నాయి. ఓ దేవతా! నేను నిన్నొక ఆడదానిగా చూడలేను. ఆది ఒప్పయితే నా మానాన నన్నొదిలేయ్‌. తప్పయితే నన్ను మన్నించి వదిలేయ్‌’’ అన్నాడు కవన్‌.


‘‘చూడు కవన్‌! నేను దేవతనే, ఒప్పుకుంటాను. నువ్వు భక్తుడివని కూడా ఒప్పుకుంటాను. ప్రేమించిన మనుషుల్ని పెళ్లాడ్డంకోసం తమ దివ్యశక్తుల్ని కూడా వదులుకున్న దేవతల కథలు చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని సినిమాలుగా వచ్చి అమితంగా ప్రేక్షకాదరణ పొందాయి. మన ప్రేమకథ కూడా వాటిలాగే - అటు కవులు, ఇటు జనం - అందరి మెప్పూ పొందుతుంది’’ అంది పద్మ.


‘‘ఎందరు మెచ్చినా నా మనసుకి నచ్చనిది - ఒప్పని మనసుకి సద్దిచెప్పుకోవడం నా వల్లకాదు పద్మా!’’ తేల్చేశాడు కవన్‌.


ఎంత చెప్పినా అతడు వినకపోయేసరికి - చివరికి, ‘‘నువ్వు వేరెవరినైనా ప్రేమిస్తే అది వేరే సంగతి. లేకపోతే దేవతగా నాకున్న సర్వశక్తుల్నీ ఉపయోగించి, నిన్ను బలవంతాన పెళ్లి చేసుకుంటాను’’ అందామె.


కవన్‌ బదులివ్వలేదు. నిట్టూర్చి వెళ్లిపోయాడు.

కొన్నాళ్లు అతడామెని తప్పించుకుని తిరిగాడు.

ఆమె కూడా అంతటితో అతడు తన దారికి వచ్చాడనుకుంది.


వారం రోజుల క్రితం అతడామెని కలుసుకుని, ‘‘నీతో ఎలా చెప్పాలో తెలియక ఇన్నాళ్లూ సతమత మౌతున్నాను. ఇక అసలు విషయం చెప్పక తప్పదు. నేనో అమ్మాయిని ప్రేమించాను. ఎంతలా ప్రేమించానంటే - ఆమెని కాదని వేరెవరినైనా పెళ్లి చేసుకోవాల్సి వస్తే - నాకిక మరణమే శరణ్యం’’ అన్నాడు.

పద్మకిది ఊహించని పరిణామం.


కవన్‌ నిజం చెబుతున్నాడా? లేక తనని తప్పించుకుందుకు అబద్ధం చెబుతున్నాడా?

‘‘నేను నమ్మను’’ అందామె.


‘‘ఎవరికైనా అబద్ధం చెప్పగలనేమో కానీ - నా దేవతకు అబద్ధం చెబుతానా?’’ అన్నాడు కవన్‌.

అతడి గొంతులో నిజాయితీని పసి కట్టిందామె.

‘‘ఎవరామె?’’ అనడిగింది.

‘‘ఆమె పేరు ముక్త’’ అన్నాడు కవన్‌.


పేరు కూడా చెబుతున్నాడంటే - కవన్‌ మాటలు పూర్తిగా నమ్మాల్సిందే అనుకుని, ‘‘ఆమె కూడా నిన్ను ప్రేమిస్తోందా?’’ అనడిగింది పద్మ.


‘‘అది నాకు తెలియదు. కానీ నేను పెళ్లి చేసుకుంటానంటే కాదనదు. అంతవరకూ చెప్పగలను’’ అన్నాడు కవన్‌.


పద్మ అతణ్ణి ఆమె వివరాలడిగింది.

ముక్త మామూలు మధ్యతరగతి అమ్మాయి. ఎలా చూసినా కవన్‌కంటే ఏ విషయంలోనూ అధికురాలు కాదు.

ఈ వివరాలు తెలిసేక - ఆమెకో విషయం ఆర్థమైంది.


అనాదిగా కొనసాగుతున్న పురుషాహంకారం - ఆధునిక యుగంలో ఇరవయ్యొకటో శతాబ్దంలో కూడా కొనసాగుతోంది.

నిస్సందేహంగా కవన్‌ ఓ పురుషాహంకారి.

అతడికి పద్మ పట్ల కృతజ్ఞత ఉంది. కానీ అహం దాన్ని కూడా జయించింది.

ఆలోచిస్తే - అతడిది అహమే ననిపించింది నాకు.

కవన్‌ పద్మా వాళ్లింట్లో ఉంటున్నట్లు చూచాయగా తెలుసు నాకు. కానీ అతణ్ణి చూసింది చాలా తక్కువ.


ఏ వేడుకకీ వచ్చేవాడు కాదు. ఎవరితోనూ కలిసేవాడు కాదు.

నాతో ఎంతో చనువుగా ఉండే పద్మ కూడా నా దగ్గర అతడి ప్రసక్తి తెచ్చిన సందర్భాలు తక్కువ. తానతణ్ణి ప్రేమిస్తున్న విషయమైతే మాటవరసకి కూడా అనలేదు.


ఆమె అనకపోతే ఆ విషయం స్ఫురించే వ్యక్తిత్వం అతడికి లేదు.

బిడియస్థుడయుండొచ్చని ఇంతకాలం సరిపెట్టుకున్నాను. కానీ - అతడో పురుషాహంకారి ఆని ఇప్పుడే అర్థమైంది.


‘‘అదృష్టవంతురాలివి. ఈ విషయం ముందే తెలుసుకోగలిగావ్‌. లేకుంటే జీవితాంతం అతడి అహంకారంతో సద్దుకుపోవాల్సి వచ్చేది’’ అన్నాను పద్మతో.

‘‘నచ్చినవాడు దక్కకపోవడం అదృష్టంలా అనిపించిందా నీకు?’’ అని నిట్టూర్చింది పద్మ.


గతుక్కుమన్నాను.

కవన్‌ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సుని కూడా ప్రేమించగలనంది పద్మ. అతడి పురుషాహంకారాన్ని ప్రేమించలేదా? ఈ మాత్రం స్ఫురించక, ఇంత తెలివితక్కువగా అలా అనేశానేమిటి?


‘‘నా అభిప్రాయమది కాదు. మనిషికి చావాలనిపిస్తే అందుకు ఒక్కటే కారణముంటుంది. బ్రతకాలనుకుంటే లక్ష కారణాలుంటాయి. నువ్వు బ్రతకాలన్న తాపత్రయంలో - ఆ లక్ష కారణాల్లో కొన్నింటినైనా వెదికే ప్రయత్నంలో ఆ మాటన్నానంతే!’’ అన్నాను సంజాయిషీగా.


‘‘థాంక్స్‌ ఫర్‌ యువర్‌ కన్సర్న్‌’’ అంది పద్మ.


నేను రెస్పాండయ్యేలోగానే, ‘‘చావాలనుకున్నాను. విషం కావాలని నిన్నడిగాను. నేను బ్రతకాలనుకుంటే - అందుకు కారణాలు నువ్వు వెదకనక్కర్లేదు. నేనే ఇవ్వగలను. కానీ అవి సాధించడం నీవల్ల మాత్రమే ఔతుంది’’ అంది పద్మ.


అదన్న మాట విషయం! పద్మ నిజంగా చావాలనుకోవడం లేదు. తనకోసం నేను ఏదో చెయ్యాలి. అందుకు నన్నొప్పించడానికి - అట్నించి నరుక్కొస్తూ - ముందు విషంతో మొదలెట్టింది.


‘‘నావల్లనయ్యే మాటైతే నీకోసం ఏమైనా చేస్తాను’’ అన్నాను వెంటనే.

‘‘నువ్వు ముక్త-కవన్‌ల పెళ్లి చెడగొట్టాలి’’ అంది పద్మ.


తెల్లబోయాను. ‘‘అది నా ఫీల్డు కాదు’’ అన్నాను అప్రయత్నంగా.

‘‘అది నీ ఫీల్డే కాదు, నువ్వు కోరుకుంటున్న ఫీల్డు కూడా’’ అంది పద్మ వెంటనే.


‘‘నా గురించి నాకు తెలియనివి చెబుతున్నావు’’ అన్నాను కాస్త విసుగ్గా.

‘‘నీకు తెలియకుండానే - ప్రేమించడానికో అమ్మాయిని చూసి పెట్టమని నాకు చెప్పావా, లేదా?’’ అంది పద్మ చురుగ్గా.


‘‘చెప్పాను. దానికి దీనికీ సంబంధమేమిటి?’’ అన్నాను.

‘‘నువ్వు ముక్తని ఇంప్రెస్‌ చెయ్యి. ఎంతలా అంటే ఆమె కవన్‌కి నో చెప్పాలి’’ అంది పద్మ.

‘‘మామూలుగా నాకూ ఆడవాళ్లకీ ఆమడ దూరమని నీకు తెలుసు. అలాంటిది నేనో అపరిచిత యువతిని పరిచయం చేసుకుని, ఇంప్రెస్‌ చెయ్యడం - సాధ్యమయ్యే పనేనా?’’ అన్నాను కొంచెం అనాసక్తంగా.


‘‘అలాగని నువ్వనుకుంటున్నావ్‌. నా సంగతే తీసుకో. నాకు చొరవెక్కువనీ, దూసుకుపోయే తత్వమనీ అంతా అంటారు. అలాంటి నాకు క్లోజెస్ట్‌ ఫ్రెండు ఎవరో తెలుసా - నువ్వే! నీలో ఏదో ఆకర్షణ ఉంది. అది నీకు తెలియదు. నాకు తెలుసు. ముక్త నీతో ఇంప్రెస్‌ ఔతుందని నాదీ గ్యారంటీ’’ అంది పద్మ.


పద్మలాంటి అందమైన యువతినుంచి అది చాలా గొప్ప కాంప్లిమెంటు. నా ఛాతీ ఒక్కసారిగా చప్పన్‌ ఇంచ్‌కి పెరిగింది.

‘‘సరే, నువ్వన్నట్లే నేను ముక్తని ఇంప్రెస్‌ చేసి, కవన్‌తో పెళ్లి చెడగొట్టాననుకో. అప్పుడు మాత్రం అతగాడు నిన్ను పెళ్లి చేసుకుంటాడని గ్యారంటీ ఏమిటి?’’ అన్నాను.

‘‘అది నేను చూసుకుంటాను’’ అంది పద్మ.


‘‘ఎలా?’’ అన్నాను.

‘‘ఇలా?’’ అని వివరించింది పద్మ.


కవన్‌లో అహముంది. ఆ అహం అతణ్ణి పద్మకి దూరంగా ఉంచుతోంది. ముక్త కాదంటే - కవన్‌ అహం దెబ్బ తింటుంది.


వంటికైనా, మనసుకైనా, అహానికైనా - దెబ్బ తగిలినప్పుడు బలహీనక్షణాలుంటాయి. ఆ బలహీన క్షణాల్ని సరిగ్గా ఉపయోగించుకుంటే -


నితీష్‌ లాలూతో కలవగలడు. మోదీ నితీష్‌తో కలువగలడు. కాంగ్రెస్‌, టిడిపి ఒకే కూటమి కాగలవు.


కవన్‌ తను ఆరాధించే దేవతని పెళ్లి చేసుకోగలడు.

ఆమె ఆశ ఆమెది. ఆ ఆశని ప్రేమ అంటుందామె.


‘‘ఈ భూమ్మీద రకరకాల జీవరాసులున్నాయి. అవి కావాలని పుట్టలేదు. మనకి తెలియని దైవబలంతో వాటి పుట్టుక జరిగిపోయింది. ఆ దైవబలమే వాటికి మనుగడనిస్తోంది. ప్రేమ కూడా అంతే! అది ఏ మనిషికి ఏ మనిషిపైన ఎందుకు ఎలా పుడుతుందో తెలియదు. దైవబలం లాగే, ఈ ప్రేమబలం కూడా ఆ ప్రేమ ఫలించి మనడానికి కారణమౌతుంది’’ అంది పద్మ.


బలమని ఆమె అంటోంది. జాలమని నాకు అనిపిస్తోంది.

తను కవన్‌ని ప్రేమిస్తే, కవన్‌ ముక్తని ప్రేమిస్తే - ఆ ముక్తని నేను ప్రేమించాలిట.

ఇంకా చెప్పాలంటే తను నన్ను ప్రేమించేలా చెయ్యాలిట - అదీ కవన్‌ని కాదని!

నిస్సందేహంగా ఇదేదో ప్రేమజాలమే!


అనుకున్నాను కానీ - ఈ ప్రేమజాలం ఓ పద్మవ్యూహమై నన్ను తనలోకి లాక్కుంటుందని అప్పటికింకా నాకు తెలియదు.


ఇలాంటి విషయాల్లో నేను అభిమన్యుణ్ణో, అర్జునుణ్ణో గ్రహించేటంత ఆనుభవమూ లేదు. ఎందుకంటే ముక్తని నేనింకా కలవలేదు.


‘‘ఈ విషయమై ఆలోచించుకునేందుకు నాకు కొంత వ్యవధి కావాలి’’ అన్నాను.

‘‘ఇస్తాను. వారం చాలా?’’ అంది పద్మ.


చాలుతుందో, చాలదో నాకేం తెలుసు? నేనింకా ఆలోచిస్తుండగానే - ‘‘వారం కంటే ఎక్కువ టైమివ్వలేను. ఈలోగా నువ్వు ముక్తను కలుసుకుని కవన్‌ని ఆమెకు దూరం చెయ్యగలిగితే సరేసరి. లేకుంటే విషం తెచ్చి నాకివ్వాల్సిందే’’ ఆర్డరు జారీ చేసింది పద్మ.


ప్రేమంటే ఆమడ దూరం పెట్టాలనుకుంటాను. అలాంటి నేనో అమ్మాయిని ప్రేమించి, ఆ అమ్మాయి నన్ను ప్రేమించేలా చేసుకోగలనా?


ఐనా పద్మ చెప్పిందని ఆ అమ్మాయిని ప్రేమించగలనా? ముందా అమ్మాయి నాకు నచ్చాలి కదా!


మరి ఆ విషయం పద్మకెందుకు చెప్పలేకపోతున్నాను?

నాకు వారమంటే వారం రోజులు టైముంది. అది ప్రేమజాలమా? పద్మవ్యూహమా?

జాలమైనా, వ్యూహమైనా - నా ఊహకందని సంఘటనలు ఎదురై - నన్ను ఉక్కిరిబిక్కిరి చెయ్యబోతున్నాయని అప్పుడు నాకు తెలియదు.


ఇంకా ఉంది...


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.


వసుంధర పరిచయం మేము- డాక్టర్‌ జొన్నలగడ్డ రాజగోపాలరావు (సైంటిస్టు), రామలక్ష్మి గృహిణి. రచనావ్యాసంగంలో సంయుక్తంగా ‘వసుంధర’ కలంపేరుతో తెలుగునాట సుపరిచితులం. వివిధ సాంఘిక పత్రికల్లో, చందమామ వంటి పిల్లల పత్రికల్లో, ‘అపరాధ పరిశోధన’ వంటి కైమ్ పత్రికల్లో, ఆకాశవాణి, టివి, సావనీర్లు వగైరాలలో - వేలాది కథలు, వందలాది నవలికలూ, నవలలు, అనేక వ్యాసాలు, కవితలు, నాటికలు, వినూత్నశీర్షికలు మావి వచ్చాయి. అన్ని ప్రక్రియల్లోనూ ప్రతిష్ఠాత్మకమైన బహుమతులు మాకు అదనపు ప్రోత్సాహాన్నిచ్చాయి. కొత్త రచయితలకు ఊపిరిపోస్తూ, సాహిత్యాభిమానులకు ప్రయోజనకరంగా ఉండేలా సాహితీవైద్యం అనే కొత్త తరహా శీర్షికను రచన మాసపత్రికలో నిర్వహించాం. ఆ శీర్షికకు అనుబంధంగా –వందలాది రచయితల కథలు, కథాసంపుటాల్ని పరిచయం చేశాం. మా రచనలు కొన్ని సినిమాలుగా రాణించాయి. తెలుగు కథకులందర్నీ అభిమానించే మా రచనని ఆదరించి, మమ్మల్ని పాఠకులకు పరిచయం చేసి ప్రోత్సహిస్తున్న మనతెలుగుకథలు.కామ్ కి ధన్యవాదాలు. పాఠకులకు మా శుభాకాంక్షలు.



109 views0 comments

Comentarios


bottom of page