top of page

ప్రేమ చేజారితే(భవిష్యత్ కాలంలో) - 12


'Prema Chejarithe 12' New Telugu Web Series

Written By Pendekanti Lavanya Kumari

ప్రేమ చేజారితే - ధారావాహిక పన్నెండవ భాగం

రచన, పఠనం: పెండేకంటి లావణ్య కుమారి

(ఉత్తమ యువ రచయిత్రి బిరుదు గ్రహీత)



గత భాగంలో జరిగినది : నితిన్ తనతో పాటుగా ప్రాజెక్టులో భాగం పంచుకోవాలనుకుంటున్న అసిస్టెంటు సైకియాట్రిస్టులకు ప్రాజెక్టు వివరాలను క్లుప్తంగా చెప్పి, నిధి వాళ్ళ టీం గురించి చెప్పి వారిని పరిచయం చేస్తాడు. కుమార్ను మిగిలిన విషయాలను మాట్లాడమని, తను కూర్చుంటాడు.

ప్రేమ చేజారితే - 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఇక ఈ భాగం చదవండి... కుమార్ వచ్చి ఎంతో భావోద్వేగంతో ఇలా మాట్లాడసాగాడు. "అందరికీ నమస్కారాలు... ఈ ప్రాజెక్టును మేము పదిమంది స్నేహితులము కలిసి చేసాము, ఇంకా కొనసాగుతూనే వుంది. మేము మొదట ఈ ప్రాజెక్టును మొదలు పెట్టాలనుకుంది మా వ్యక్తిగత ప్రయోజనం కొరకే అయినా, దాని వల్ల సమాజానికి ఏదైనా ప్రయోజనం వుంటేనే చేయాలనుకున్నది మాత్రం నిజం. నాకు దీని వల్ల మా నాన్నగారి లాంటి ముసలి వారు ఎంతగానో ఆనందంగా జీవించగలరనిపించింది. అలాగే కొందరి జీవితాలకు ఓ ఆలంబన ఏర్పడుతుందనిపించింది. అంతే కాక దీని ద్వారా అనాథలెందరికో తల్లిదండ్రుల్లాగా మంచి, చెడులను నిస్వార్థంగా నేర్పించి సంస్కారవంతులుగా, ప్రయోజకులుగా తీర్చిదిద్దే రోబోలను సృష్టించవచ్చనిపించింది. అదీకాక ఈ ప్రాజెక్టు కోసం పెడ్తున్న ఖర్చు మొత్తం మా స్నేహితులమంతా కలిసి సంపాదించినదే. కాబట్టి మేము దీని వల్ల ఏదైనా సమాజానికి చెడు జరుగుతుందనిపిస్తే వెంటనే ఏమాత్రం డబ్బు గురించి ఆలోచించకుండా దీన్ని నాశనం చేయాలనుకునే మొదలెట్టాము. ఈ ప్రాజెక్టు వల్ల నా స్నేహితులందరికీ కూడా కుటుంబాలు ఏర్పడి ఎంతో ఆనందాన్ని సొంతం చేస్కున్నారనే చెప్పాలి. పిల్లలకు తల్లులుగా వుండే రోబోల చేత అన్ని రకాల పనులు చేయించేది వారి తండ్రులే కాబట్టి, అన్నీ వారి ఇష్టానుసారంగా జరుగుతున్నాయి. వారి సంబంధీకులను కూడా రోబోలు ఎంతో బాగా చూస్కుంటున్నాయి, వారికి ఇంట్లో ఆడవారు చేసే పనులన్నీ చేసిపెట్తున్నాయి, అదీ వారెలా ఆర్డర్ చేసారో అలాగే విసుక్కోకుండా చేస్తున్నాయి. అందుకే వారంతా ఇంట్లో వాళ్ళ గురించిన చింత లేకుండా ఆనందంగా ప్రాజెక్టు పనులు చేస్కోగల్గుతున్నారు. పిల్లలు కూడా ఆనందంగా పెరుగుతున్నారు. ఒక కుటుంబం అనేది నిజంగా ఇలా వుంటే ఎంతో బాగుంటుంది. కానీ భార్యలనే వారు కూడా మనుషులే కాబట్టి, వారికి రాగద్వేషాలనేవి, విసుగు, కోపతాపాలనేవి వుంటాయి కాబట్టి, అందరిళ్ళలో అలా ఏ ఇబ్బందీ లేకుండా పనులు జరిగే అవకాశం లేదు. చదువుకుని ఏదో సాధించాలనుకునే ఆడవారికి ఎప్పుడూ ఇంటి పనే చేస్కుంటూ స్వాతంత్ర్యం లేకుండా, సాధికారత లేకుండా బ్రతకటం బాధాకరమే అనిపిస్తుంది. కాబట్టి, ప్రతిదినమూ చేసే ఇలాంటి కొన్ని పనులకు రోబోలను పెట్టుకుంటే ఇంటిల్లిపాదీ ఆనందంగా వుండొచ్చేమో. కానీ కూడా ఎవరి పనులు వాళ్ళు చేస్కుంటే కలిగే ఆనందమే వేరు. వీటిని నిజంగా అవసరమైన వారు మాత్రమే ఉపయోగించుకుంటే బాగుంటుంది. అంటే, ఇంట్లో ఎక్కువ మంది వుండి ఒక్కరే పనంతా చెయ్యడం కష్టమైన వారో, లేక దివ్యాంగుల్లాంటి వారో లేక పిల్లలున్న ఒంటరి వారో వీటిని వినియోగించుకోవాలనేది నా ఆలోచన, లేకపోతే మనుషుల మధ్య వుండే ప్రేమానురాగాలు తగ్గిపోవచ్చనేది నా అభిప్రాయం. పూర్వం రాముడు సైతం లోక కల్యాణం కోసం అనగా ప్రజల క్షేమం కోసం చేసే యఙ్ఞ, యాగాదులకు భార్య కచ్చితంగా వుండాలంటే, తన ఏకపత్నీవ్రతం చెడకుండా బంగారంతో చేసిన సీతబొమ్మను పెట్టి పూర్తి చేసాడు. అదే విధంగా నేను పెళ్ళి కాని వారికి, ప్రేమ చేజారిన వారికి కుటుంబాన్ని అందించాలనీ, ఎంతోమంది తల్లులులేని పిల్లలకు తల్లి ప్రేమ దక్కాలనీ,ఇలా అందరి ఆనందాన్ని కోరుకుని ఈ హ్యూమనాయిడ్ రోబోలను తయారు చేసాను. నిజానికి డిఫెన్స్ కు కానీ ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలను రక్షించటం కొరకు మనుషులు పోలేని ప్రదేశాలకు సైతం వెళ్ళగలిగే రోబోలను హ్యూమనాయిడ్ రోబోలుగా తయారు చేయాల్సిన అవసరం లేదు, అక్కడ యంత్రమని తెలుస్తున్నా పర్వాలేదు. కానీ తల్లి లేని పిల్లలు మనుషులలా అన్ని రకాల ఎమోషన్స్ మధ్య పెరగాలనుకుంటే మటుకు హ్యూమనాయిడ్ రోబో అయితే ఒక మంచి ఆప్షన్ అవుతుంది. డిఫెన్స్ రంగంలో గూఢాచారులలాగా వెళ్ళటానికి కూడా ఈ రోబోలు చాలా ఉపయోగపడవచ్చు. ఇక పోతే నేను ఈ ప్రాజెక్టు గురించి ఆలోచించి తప్పు చేసానేమో అనిపించింది మాత్రం ఫోబియా వచ్చిన అబ్బాయి గురించి తెలిసాకనే. అదేమంటే 45 ఏండ్లకు పైబడిన వయసప్పుడు పిల్లలను కంటే, వారి భవిష్యత్తు ఏమవుతుందనేది అప్పుడు ఆలోచించకపోవటమే నేను చేసిన తప్పని తర్వాత అర్థమయ్యింది. అందువల్ల తండ్రికి అరవై వచ్చేనాటికి కొడుకింకా పదిహేనేళ్ళ వాడే అయ్యుంటాడు. వాడు తండ్రి మీద ఆధారపడకుండా తన కుటుంబాన్ని తాను ఏర్పాటు చేస్కునే వయసు వచ్చే నాటికి తండ్రి కనీసమంటూ డెబ్బై ఏళ్ళ వాడయ్యుంటాడు. అంత వరకూ ఆరోగ్యంగా బ్రతికాల్సి వుండటమనేది కొంచెం ఆలోచించాల్సిన విషయమే కదా. మేము ఈ ప్రాజెక్టును పదిమందిమి కలిసి చేసాము, అలాగే మేమింకా ఆ రోబోల క్రింద పెరిగే పిల్లలను గమనిస్తూ, రోబోల ప్రోగ్రామ్ను ఇంకా అభివృద్ధి చేస్తూనే వున్నాము. మా పది మందిమి ఒక్కో విభాగంలో ఒక్కొక్కరం పని చేస్తున్నాము. మా అందరి దగ్గర వున్న కంటెంట్ అంతా కలిస్తేనే ఈ ప్రాజెక్టు పూర్తయ్యే విధంగా మేము ప్లాన్ చేస్కున్నాము. దాని వల్ల ఎవ్వరూ ఒక్కరుగా దీని లాంటి మరో ప్రాజెక్టును చేయలేరు. మేము సమాజ క్షేమం కోసమే ఈ విధంగా చేసాము. మాలో ఎవరైనా ఈ ప్రాజెక్టును వేరెవరికైనా ఇవ్వాలంటే అందరి అంగీకారం వుండాలనే ఆలోచనతోటే ఇలా చేసాము. అలాగే ఈ రోబోను మాకు తెలీకుండా ఎవరైనా ఎత్తుకెళ్ళి ఎలాంటి సమాచారాన్ని రాబట్టకుండా వుండేందుకు 'సెల్ఫ్ డెస్ట్రాయ్' ప్రోగ్రాం కూడా పెట్టాము ముందు జాగ్రత్తగా. మాకు తెలిసిన ఈ టెక్నాలజీనీ వేరే ఎవరంటే వారు నేర్చుకునేలా అందుబాటులో వుంచాలనుకోవటం లేదు. దానివల్ల అది చెడుకు ఉపయోగపడితే మానవుల వినాశనానికి దారి తీయవచ్చనే భయం మాకుంది. అందుకనే ఈ టెక్నాలజీ మేమున్నంత వరకు మాతోనే వుంటుంది. తర్వాత మేము సమాజ శ్రేయస్సు కోరుకునే ఒక్కొక్కరికి, ఒక్కొక్కరి టెక్నాలజీని నేర్పిస్తాము. అంతే కానీ ఇప్పటి వారి లాగా ప్రతి ఒక్క టెక్నాలజీనీ, ప్రతి ఒక్కరికీ తెలిసేలా మాత్రం వుంచము. చూసారుగా ఇప్పట్లో మామూలు మనిషి సైతం బాంబు లాంటి వాటిని కూడా తయారు చేయగలిగే టెక్నాలజీని ఇంటర్నెట్ ద్వారా నేర్చుకోగలుగుతున్నాడు. అది వినాశనానికి అవకాశం కలిగేలా చేసినట్టేనని మా అభిప్రాయం. ప్రాచీనకాలంలో ఎన్నో గొప్ప ఆవిష్కరణలు చేసినా, వాటి యొక్క తయారీ విధానం సగటు మనిషికి తెలిసేది కాదు. సమాజ శ్రేయస్సును కోరుకునే గొప్పవారైన అతి కొద్ది మందికి మాత్రమే తెలిసేది. దానికి కారణం అవి చెడ్డ వారి చేతిలో పడితే మంచి కన్నా నాశనమే ఎక్కువగా జరుగుతుందన్న ఉద్దేశ్యమే. అందుకే అలాంటి ఆవిష్కరణ వివరాలను ఎంతో అవసరమైతే మాత్రమే ఉపయోగించేందుకు గానూ చాలా కొద్ది మందికి, అదీ ఎంతో బాధ్యతాయుతమైన వారికి మాత్రమే తెలిసే విధంగా చాలా రహస్యంగా వుంచేవారు. కానీ నేటి సమాజం దాన్ని కూడా తప్పు పడుతూ, అప్పట్లో కొందరికి మాత్రమే దాన్ని అనువంశీకంగా అందిస్తూ మిగిలిన వారికి అన్యాయం చేసారనే వాళ్ళెందరో. ఏది ఏమైనా, ఎవరికి నచ్చినా నచ్చక పోయినా, ఇది మా స్వంత డబ్బుతో చేసిన స్వంత ఆవిష్కరణ, అందువల్ల దీని మీద సర్వాధికారాలు మావే కాబట్టి మేము ఈ టెక్నాలజీనీ తగిన వారికి మాత్రమే అందచేయాలనుకుంటున్నాము. అంతే కాక నేను యువతకు ప్రేమ, పెళ్ళి మాత్రమే జీవితం కాదనీ, అనుకుంటే ఎన్నో సాధించవచ్చన్నది తెలియచేయాలనుకున్నాను. దీన్ని మేమే నిరూపించాము కూడా. ప్రేమ కోసం ప్రాణాలు తీస్కోటం, తీయటం ఎంతటి విచారకరమో యువత గ్రహించాలనేది నా ఆకాంక్ష. మేము రోబోలను అచ్చం మనుషుల్లా ఎంత తయారు చేసినా అవి యంత్రాలే అన్నది గుర్తుంచుకోవాలి. అంతే కాక "ఎప్పుడైనా మనుషుల ఆధీనంలోనే యంత్రాలుండాలి కానీ యంత్రాల ఆధీనంలోకి మనుషులు వెళ్ళకూడదు." అందుకే చేయగల పనులన్నీ మనమే చేస్కుంటూ, మనకు అవసరముంటేనే యంత్రాలను ఉపయోగించమని మా ముఖ్య అభ్యర్తనగా అందరికీ తెలియపరుస్తాము. అలా మన పనులు మనం చేస్కోటమే మనకు ఆరోగ్యం కూడా. ఎప్పుడూ కదలకుండా కూర్చునే పనులే చేయటం వల్ల మనుషులు అనారోగ్యం పాలవుతారు. అలాగే మనుషులకూ, మనుషులకూ మధ్య సంభాషణా సమయం తగ్గి ప్రేమ తగ్గే అవకాశమూ వుంది. యంత్రాల మీద ప్రేమ కన్నా మనుషులకూ, మనుషులకూ మధ్య ప్రేమ వుండటమే ఎప్పటికైనా శ్రేయస్కరం, అందరూ ఆమోదించదగిన విషయం కూడా. అందుకే మా నాన్న చనిపోయినప్పుడు, నన్ను నా కొడుకు, 'మీరూ ఇలాగే నన్నొదిలి వెళ్ళిపోరు కదా' అన్నప్పుడు నేను నా కొడుకు దగ్గర శాశ్వతంగా వుండేలా నా ప్రతిరూపంలాంటి ఒక హ్యూమనాయిడ్ రోబోను తయారు చేసిద్దామా అని అనిపించినా సహజత్వానికి వ్యతిరేకంగా వెళ్ళటమంటే మన నాశనం మనం కొని తెచ్చుకోవటమే అని, దానికి బదులుగా నా కొడుకుకు వియోగాన్ని భరించే మనోనిబ్బరాన్ని సంపాదించుకునేలా శిక్షణ నివ్వాలని నిర్ణయించుకున్నాను. అందరూ దీన్ని అనుసరిస్తేనే ప్రకృతి మనుషులకు సహకరిస్తుందని నేను నమ్ముతున్నాను. తెలిసో, తెలియకో మనం ఆడవారి ఉనికినే నాశనం చేయాలనుకున్నాము. దాని వల్లనే ఈ ప్రాజెక్టు మొదలయ్యింది. ఈ కాలనీ పిల్లలు పెద్దయ్యేంత వరకు మాత్రమే ఇది కొనసాగుతుంది. తర్వాత ఈ రోబోలను, ఈ రోబోలకు సంబంధించిన సమాచారాన్ని సమూలంగా నాశనం చేద్దామని నిర్ణయించుకున్నాము. దానివల్ల ఎలక్ట్రానిక్ చెత్త నుండి మానవాళికి ప్రమాదం కలగకూడదనేదే మా కోరిక. ఏమైతే ఏమి, ప్రభుత్వపు ప్రమేయంతో ఇప్పుడు పుట్టే పిల్లలలో ఆడ, మగ నిష్పత్తి సమానంగా వుంటోంది కాబట్టి, ఇలాంటి ప్రాజెక్టుల అవసరం ఇక వుండబోదనే అనుకుంటున్నాను. దీన్ని బట్టి మనుషులు తమకు కావాల్సిన దేనినైనా సాధించగలరని మళ్ళీ ఒకసారి రుజువయ్యింది. అంతేకాక మళ్ళీ ఎలాంటి అవాంతరం వచ్చినా నాలాంటి వారు ఎందరో ఈ దేశంలో ఎప్పుడూ వుంటూనే వుంటారు. కాబట్టి దేనికీ మనం భయపడవలసిన పనిలేదు. అందరూ దీన్ని స్వాగతిస్తారనే అనుకుంటున్నాను," అని చెప్పి ముగించాడు కుమార్. అందరూ కరతాళ ధ్వనులతో కుమార్ను మెచ్చుకోలుగా చూసారు. ఆ తర్వాత జూనియర్ డాక్టర్లందరూ తమ వంతుగా పిల్లలకు ఇచ్చే కౌన్సిలింగ్ను అనుకున్నట్టుగానే ఇచ్చి ప్రాజెక్టును సద్భావంతో ముందుకు నడిపించి సఫలం చేస్తామని ప్రమాణపూర్వకంగా చెప్తున్నామని మాట ఇచ్చి సమావేశాన్ని ముగించారు. ****** అనుకున్నట్టుగానే అందరూ కలిసి పిల్లలకు కౌన్సెలింగ్ ద్వారా చక్కటి అవగాహన కలిగించటం మొదలెట్టారు. అలా కొంత కాలానికి... కౌన్సెలింగ్లోనే కుశాల్ను, "షాలిని మనిషి కాదు రోబోనే అనీ, నీ అనుమానం నిజమేననీ, కానీ నీ శ్రేయస్సు కోరే ఇలా చేసామనేది ఈ కౌన్సెలింగ్ ద్వారా నీవు గ్రహించావనుకుంటున్నాము," అని నితిన్ అడగగానే, కుశాల్ చాలా బాధపడి, " 'నేను మొదట నా మంచి కోసమే అలా చేసారన్నది తెలియక మా నాన్నకు చాలా బాధ కలిగించాను. అందుకు మా నాన్న నన్ను క్షమిస్తే చాలు. 'మై డాడ్ ఈజ్ ఏ గ్రేట్ సైంటిస్ట్', ఆయన వల్లే ఇప్పుడు మా లాంటి కుటుంబాలన్నీ ఆనందంగా వున్నాయి. ఎవరో చేసిన తప్పుకు వీళ్ళు బలయితే, వీళ్ళు మాత్రం వీళ్ళ ఆవిష్కరణలతో ఎందరినో రకరకాల ఇబ్బందులు, బాధల నుండి కాపాడారు,' అంటూ వాళ్ళ డాడీని ఎంతగానో మెచ్చుకున్నాడు కుశాల్. 'నేనూ మా నాన్న లాగే సైంటిస్టునై, ఎప్పటికీ మా నాన్న నా నుండి దూరంకాకుండా వుండే టెక్నాలజీని తయారు చేయాలనుకుంటున్నాను,' అన్నాడు ఉద్వేగంగా. 'ఇప్పటికీ రోబోషాలినియే నాకు అమ్మ, ఆమే లేకపోతే నేనుండేవాడిని కాదేమో, డాడీ చేసిన దాంట్లో తప్పేమీ లేదు,' అన్నాడు కుశాల్ మనస్పూర్తిగా. తర్వాత ఆ రోజు ఇంటికి వెళ్ళిన కుశాల్, కుమార్ దగ్గరకు వెళ్ళి, 'సారీ డాడీ! ఐ లవ్ యూ డాడీ, యూ ఆర్ మై బెస్ట్ డాడీ' " అంటూ గట్టిగా కౌగిలించుకున్నాడు. దానితో అన్ని రోజుల నుండి కుమార్ పడిన వ్యధ కళ్ళ నుండి ఆనంద భాష్పాలుగా రాలగా కుశాల్ను మరింత దగ్గరకు పొదువుకున్నాడు. ఇద్దరూ నవ్వుతూ ఒకరిని చూసి ఇంకొకరు కన్నుకొట్టగానే, అక్కడే వున్న షాలిని కూడా వచ్చి వారిరువురినీ దగ్గరకు తీస్కుంది. తల్లులుగా వున్న రోబోలన్నీ తమ పిల్లలను బాగా చూస్కుని ప్రయోజకులను చేయాలని రచయితగా నేనూ కోరుకుంటున్నాను, అలాగే చేస్తాయని మీకు భరోసా ఇస్తున్నాను కూడా. అలాగే ఈ ఆవిష్కరణ అందరి మంచికీ ఉపయోగపడాలనీ, ఇక మీదట ఇలాంటి ఆవిష్కరణల అవసరం లేకుండా వుండాలనే కోరుకుంటున్నాను. ప్రతి అవసరానికి మనుషుల దగ్గర తగిన ఆలోచన పుడ్తూనే వుంటుంది కాబట్టి అవసరానికి మాత్రమే ఇలాంటివి ఉపయోగిస్తూ, అనవసరమైన సౌకర్యాల కోసం వాడి ఆరోగ్యాన్ని పాడు చేస్కోకండి. ప్రతి మనిషికీ అంతో, ఇంతో శ్రమ అవసరం, అప్పుడే ఆరోగ్యంగా వుంటారు. ఇక మానవుల ప్రయాణం ఎటు పోతుందో వేచి చూడక తప్పదు. అలాగే కథలోని కొన్ని విషయాలను ఇక్కడ సందేహనివృత్తి చేస్తున్నాను.( మీకు ఈ సందేహాలు అసలు వచ్చాయా? అన్నది నా సందేహం.) 1) మొదట్లో కుశాల్ షాలినిని ఎందుకు ఎప్పుడు లేపినా నా కుడి చెంప మీదే ముద్దు పెట్టుకుంటావు అని అడిగిన దానికి షాలినీకి బదులుగా కుశాల్ ఆశ్చర్యపోయాడని వ్రాసాను, గుర్తుందా? దానికి కారణం హ్యూమనాయిడ్ రోబో అయిన షాలినీకి వ్రాసిన ప్రోగ్రాంలో అలా వుండటమే. అందుకే కుశాల్ అడిగిన ప్రశ్నకు షాలిని బదులు కుమార్ ఆశ్చర్యపోయాడు, ఇంత చిన్న పిల్లలు కూడా ఇంత గమనించగలరంటే, నేను నా ప్రోగ్రామ్ను ఇంకా సూక్ష్మమైన వాటిని కూడా గణనలోకి తీస్కోని తయారు చేయాలనుకున్నాడు... ఆ తర్వాత ఆ ప్రోగ్రాంను వాడడిగినట్టు ఒక్కోరోజు రాండమ్గా ఒక్కో బుగ్గ మీద ముద్దు పెట్టేట్టుగా మార్చాడు. 2) కుశాల్కు వాళ్ళమ్మ రోబో అన్న అనుమానం రావటానికి కారణం, షాలిని కాలు జారి గుంతలో పడినప్పుడు ఆమె తల పగలటం, కళ్ళారా చూసాడు. కానీ వాడు అన్నీ మర్చిపోయి బాగయ్యాక, కొంత కాలానికి ఆ ఙ్ఞాపకం లీలగా కనిపిస్తూ తలనొప్పి కలిగించటం మొదలయ్యాక, ఆమెను గమనిస్తే ఆమెకు ఏమాత్రం దెబ్బ తగలలేదన్నది అర్థమవటమే. ఇంకొక్క విషయం చెప్పలేదు కదా మీకు, ఈ రహస్యం మనకు మాత్రమే... కుమార్కు, కుశాల్ పుట్టటానికి అండం డొనేట్ చేసింది ఎవరో కాదు కుమార్ ప్రేమించిన షాలినీయే... కుమార్ స్నేహితులు, కుమార్ ప్రేమ గురించి తెలుసుకుని, టెక్నాలజీ సాయంతో షాలిని ఎక్కడుందో కనుక్కుని, తాము ఒక ప్రజోపకర ప్రాజెక్టు చేస్తున్నట్టుగా ఆమెకు చెప్పి, దాని కోసం ఆమెనే స్వచ్చందంగా అండం డొనేట్ చేసేలా చేసి స్నేహితుని రుణం తీర్చుకున్నారు. ఆమే కాదు ఇంకొందరు కూడా ఈ విధమైన సాయం అందించారు. కుశాల్కు షాలిని లాంటి కళ్ళే రావటం చూసి కుమార్ ఆశ్చర్యపోయినా, చాలా ఆనందపడిపోయాడు. మళ్ళీ ఎంతో కాలానికి స్నేహితుల ద్వారా ఈ విషయం తెలుసుకుని ఇంకా ఆనందపడ్డాడు. ఇది పూర్తిగా రహస్యం ఎవరికీ చెప్పకండేం🙂. ----సమాప్తం--- ఈ కథ పూర్తిగా కల్పితము. అలాగే ఇది పూర్తిగా నా స్వంత ఆలోచనలకు అక్షర రూపమని పాఠకులకు తెలియ చేసుకుంటున్నాను. రచయితగా నా మాట: ఈ తరంలో జరుగుతున్నమార్పులు, పెరుగుతున్న టెక్నాలజీ వాడకం చూసి, మనం ఎటు పోతున్నాము? అది మన నిర్ణయమేనా? అస్సలు ఇది మానవాళికి మేలు చేస్తుందా లేక మానవ ఉనికికే పెను ప్రమాదంగా మారబోతుందా? అని ఎంతో మంది విశ్లేషకులు మథన పడ్తుంటారు. ఆ ప్రశ్నలకు సమాధానంగానే ఈ కథ వ్రాసాను. ఏ టెక్నాలజీ అయినా అవసరానికి మొదలవుతుంది. దాన్ని ఆ అవసరం తీరేంతవరకు వాడుకుంటే అంతా మంచే జరుగుతుంది. కానీ అవసరం తీరాక లగ్జరీల కొరకో అసాంఘిక పనులకో వాడటం మొదలెడితే అది ఎప్పటికీ అనర్థమే. ఆ రెండింటికీ మధ్య వున్న చిన్న తేడాను మనుషులు అర్థం చేస్కుని మసలుకుంటే, ఎప్పటికీ ఇలాంటి ప్రశ్నలు తలెత్తవని నా అభిప్రాయం. ఈ ధారావాహికను చదివిన పాఠకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు🙏🙂. ఈ కథ ద్వారా మీరు ఏదో కొంతైనా కొత్తగా తెలుసుకున్నారనే ఆశిస్తున్నాను. బై. ఈ కథ నచ్చితే లైక్ చేయటం మర్చి పోకండి... షేర్ మరియు సబ్స్క్రైబ్ చేస్కుని 'మన తెలుగు కథలు.కామ్' ను ఆదరించండి. ధన్యవాదాలు.

=======================================================================

(సమాప్తం)


ఈ ధారావాహికను ఆదరించిన పాఠకులకు మనతెలుగుకథలు.కామ్ తరఫున, రచయిత్రి శ్రీమతి పెండేకంటి లావణ్య కుమారి గారి తరఫున మా అభివాదాలు తెలియజేసుకుంటున్నాం.


=======================================================================

పెండేకంటి లావణ్య కుమారి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

Podcast Link

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



రచయిత్రి పరిచయం:

నేను చదివింది ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కానీ గృహిణిగా స్థిరపడ్డాను. కవితలు, కథలు వ్రాయటం నా ప్రవృత్తి. పదవతరగతి ఆటోగ్రాఫ్లో వ్రాయటంతో మొదలయ్యింది. ఏదైనా శుభాకాంక్షల్లాంటివి చెప్పటానికి, ఎవరైనా అడిగితేనో వ్రాయటం చేసేదాన్ని. నేను అప్పుడప్పుడూ వ్రాసుకున్న కథలను చదివిన మా అమ్మాయి నన్ను కథలు బాగా వ్రాయగలవని ప్రతిలిపిలో వ్రాసేలా ప్రోత్సహించింది. కొన్ని నెలల నుండి కథలు, కవితలు ప్రతిలిపిలో వ్రాస్తున్నాను. నేను నా కథలు సమాజానికి ఉపయోగ పడేలా వుండాలి అనే ధోరణిలోనే చాలా మటుకు వ్రాసాను. ఇప్పటికి హాస్యం, హారర్, డిటెక్టివ్ లాంటి అన్ని రకాలలో కథలు వ్రాసాను. రకానికొక్క కథైనా వుండాలని అన్ని రకాల కథలను ప్రతిలిపిలో వ్రాసాను.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ యువ రచయిత్రి బిరుదు పొందారు.







56 views0 comments

Comments


bottom of page