top of page

ప్రేమ ఎంత మధురం!


'Prema Entha Madhuram' - New Telugu Story Written By D V D Prasad

'ప్రేమ ఎంత మధురం' తెలుగు కథ

రచన: డి వి డి ప్రసాద్

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

ఒకటో నంబర్ ప్లాట్ఫారం చాలా రద్దీగా ఉంది. అప్పుడే ట్రైన్ వచ్చి ఆగింది. ఆ ట్రైన్కోసమే వేచి ఉన్న హేమంత్ ఏసి బోగిలోకి ప్రవేశించి తన సీట్లో కూర్చున్నాడు. తన చేతిలో ఉన్న బ్యాగ్ సీట్ కింద ఉంచి చుట్టూ చూసాడు. ఎవరి సామాన్లు వాళ్ళు సర్దుకుంటూ చాలా సందడిగా ఉన్నారు తోటి ప్రయాణికులు. తన ఎదుటి సీటు వైపు దృష్టి సారించాడు. ఖాళీగానే ఉందది, ఇంకా ఎవరూ రాలేదు. టైం చూసాడు, ఇంకో పావుగంట ఉంది ట్రైన్ కదలడానికి. చేతిలో ఉన్న వీక్లీ తీసి అందులో మునిగిపోయాడు.


ట్రైన్ మరో నిమిషంలో బయలదేరబోతుందనగా తన ఎదుటి సీట్లో అలికిడి వినిపించి పుస్తకంలోంచి తల తిప్పి అటువైపు చూసాడు. ఒక మెరుపు మెరిసినట్లైంది, ఎదుటి సీట్లో కూర్చోబోతున్న అమ్మాయిని చూసి. తెల్లని పాలరాతి విగ్రహం ఆమెది. అందమైన మోము. మూర్తీభవించిన సౌందర్యం. పొడుగాటి జడ. ఆ జడలో మల్లెపూలు సువాసనలు వెదజల్లుతున్నాయి. ఆకుపచ్చని డ్రెస్లో సౌందర్య దేవతలా ఉంది. ఆమె సౌందర్యాన్ని తిలకించడానికి రెండుకళ్ళూ చాలవనిపించింది హేమంత్కి.


హఠాత్తుగా ఆమె కూడా హేమంత్ వైపు చూసేసరికి ఇద్దరి కళ్ళు ఓ క్షణం కలుసుకున్నాయి. అలా ఆమెని చూడటం సభ్యత కాదని గుర్తొచ్చి అతి కష్టం మీద తన చూపులు మరల్చుకున్నాడు. అతి కష్టం మీద చేతిలోని పుస్తకంపై తన చూపు నిలపడానికి ప్రయత్నించాడు హేమంత్. కానీ అతనివల్ల కాలేదా పని. అతని కళ్ళు అక్షరాలవైపు పరుగు పెడుతున్నామనసు మాత్రం అమెను మరో సారి చూడాలని తహతహలాడుతోంది. ఫలితంగా హేమంత్కి పుస్తకంపై మనసు లగ్నం కావడం లేదు. పుస్తకంపై నుండి ఆమె వైపు మళ్ళీ దొంగ చూపులు చూడనారంభించాడు.


'నెల రోజుల్లో తన పెళ్ళి పెట్టుకొని ఇప్పుడిలా ఆ అమ్మాయి వైపు చూడటం ఏమైనా సబబా!' అని అంతరాత్మ చేసే హితబోధని పట్టించుకోలేదు అతని మనసు. 'నెలరోజుల్లో పెళ్ళి ఉంటేనేం, నాకు మాత్రం సరదాలు, కోరికలు ఉండవా? అందరి మగవాడిలాంటి వాడ్ని కానా నేను? సౌందర్యాన్ని ఆరాధించడంలో తప్పేముంది! ప్రేమ ప్రేమే, పెళ్ళి పెళ్ళే!' అని మనసు అంతరాత్మ నోరు నొక్కేసింది.


ఆమెతో మాటలు కలపమని మనసు తెగ గోల చేస్తుంటే ఇంక ఆగలేకపోయాడు హేమంత్. "మీరు ఎక్కడివరకూ?" అని అడిగాడు ఆమె వైపు చూస్తూ.


"................"


ఆమె ఏమి జవాబిచ్చిందో కూడా వినే ప్రయత్నం చేయలేదు హేమంత్. కదిలీ కదలని గులాబి రేకులవంటి ఆమె పెదవులపైనే అతని దృష్టి నిలిచింది. ఆమె అధరామృతం గ్రోలకపోతే తన జీవితం వృధా అని అతనికి తోచింది ఆ క్షణంలో.


"అరే! నేను అక్కడికే!” అని, “మీ పేరు తెలుసుకోవచ్చా?" అడిగాడామెను హేమంత్ కావాలని ఆమెతో మాటలు కలపాలని.


"హర్షిత" జవాబిచ్చిందామె తీయగా, కాకపోతే కాస్త బెరుకుగా.


ఆమె కంఠంలోని మాధుర్యానికి పరవశించిపోయాడు హేమంత్. వీణ మీటినట్లుంది ఆమె స్వరం. 'చాలా అందమైన పేరు! ' అని మనసులో అనుకొని, "నా పేరు హేమంత్." అని తన గురించి వివరంగా చెప్పుకున్నాడు ఆమె అడగకపోయినా.


తన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి చెప్పినట్లు అనిపించిందామెకి. చిరునవ్వు నవ్వుతూ క్లుప్తంగా తన గురించి చెప్పుకుంది. అలా ఓ అరగంట సేపు మాట్లాడుకున్న తర్వాత ఆమెలో మునపటి బెరుకుతనం పోవడంతో హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు హేమంత్. తామిద్దరిదీ ఎన్నో ఏళ్ళ పరిచయమే కాదు, జన్మజన్మల బంధంలా తోచింది. ఈ లోపున టిటి రావడమూ, వాళ్ళ టిక్కట్లు చూడటంతో వాళ్ళ కబుర్లకి కొద్దిసేపు అంతరాయం కలిగింది. కాఫీ వస్తే రెండు కప్పులు తీసుకొని, ఆమెకో కప్పు అందించాడు.


హేమంత్ చేతిలోంచి కాఫీ కప్పు అందుకున్నప్పుడు సున్నితమైన ఆమె వేళ్ళు తగిలి అతని శరీరం జివ్వుమంది. కావాలని తన చేతిని తగిలించాడేమోనని అతనివైపు చురుగ్గా చూసిందామె. తన మొహంలోని భావాలేమీ కనపడకుండా జాగ్రత్తపడుతూ, "కాఫీ చాలా బాగుంది." అన్నాడు. అలా కవర్ చెయ్యడం గమనించిన ఆమె నవ్వింది.


మనసును మైమరపించే ఆ నవ్వు హేమంత్ని మరో లోకంలోకి తీసుకుపోయింది. ఆమె వైపు మళ్ళిమళ్ళీ చూడాలనిపిస్తూంటే, తన మనసుని బలవంతం మీద నిగ్రహించుకొని చేతిలో ఉన్న పుస్తకం వైపు దృష్టి సారించాడు. అయితే మధ్యమధ్య ఆమెవైపు దొంగ చూపులు చూస్తూనే ఉన్నాడు. మధ్యాహ్నం పన్నెండు గంటల్లయ్యేసరికి తను ఆన్లైన్లో ఆర్డర్ చేసిన భోజనం వచ్చింది. హర్షిత వైపు చూసాడు. అప్పటివరకూ సెల్ చూస్తూన్నఆమె విసుగొచ్చి సెల్ పక్కన పడేసింది.


"మీరు ఏం తెచ్చుకున్నట్లు లేదు. మీకు అభ్యంతరం లేక పోతే మనమిద్దరకూ షేర్ చేసుకుందాం!" అన్నాడు హేమంత్.


ఆమె మొహమ్మాటంగా, "నాకు పెద్దగా ఆకలిగా లేదు." అంది.


"మీరేమీ మొహమ్మాట పడకండి. నేను తెప్పించిన పదార్థాలు మనిద్దరికీ సరిపోతాయి! రండి! కలసి భోచేద్దాం!" అన్నాడు రెండు ప్లేట్లలో పరోటాలు, కూర్మా, పన్నీర్ మసాల కూర సర్దుతూ.


నిజానికి హేమంత్ ఇద్దరి కోసం భోజనం ఆర్డర్ చేసాడు. ఆ విషయం ఆమె కూడా గ్రహించినట్లుంది. మారు మాట్లాడక అందులోంచి ఓ ప్లేట్ తీసుకుంది.


"మీరేమీ అనుకోకపోతే మీరు ఎక్కడ, ఎవరింట్లో దిగబోతున్నారో చేప్తారా!" మామూలుగా అడిగినట్లు అన్నాడు.


తనతో పరిచయం పెంచుకోవాలని చూస్తున్న హేమంత్ వైపు చూస్తూ అందంగా నవ్విందామె. "మా పిన్ని గజపతినగర్లో ఉంటోంది. నన్ను రమ్మని చాలా రోజుల నుండి పోరుతోంది. సరే అని ఓ వారం రోజులు మా పిన్నింట్లో గడుపుదామని బయలు దేరాను." అంది హర్షిత.


"చిత్రం, వాటే కోయిన్సిడెన్స్, నేను కూడా ఆఫీసు పనిమీద వారం రోజుల కోసమే వెళ్తున్నాను. నా స్నేహితుడి రూములో గాంధీనగర్లో ఉంటాను." ఆమె అడక్కపోయినా కావాలని ఆమెకి చెప్పాడు. అలా మొదలైన వాళ్ళ కబుర్లు రాత్రి డిన్నర్ చేసేంతవరకూ తెగలేదు. ఈ లోపున వాళ్ళిద్దరూ ఎన్నెన్నో కబుర్లు చెప్పుకున్నారు. ఆమె మాట్లాడుతున్నప్పుడల్లా ఆమె అందమైన మొహం పైనే హేమంత్ చూపు ఉంది. ఆమె నవ్వుతూ ఉంటే సొట్టలు పడే ఆమె చెక్కిలిపైనుండి అతని దృష్టి మరలి రానంటోంది. మొత్తానికి హర్షిత ఆ వారం రోజులు ఉండబోయే ఇంటి విలాసం, ఆమె సెల్ నంబర్ కూడా సంపాదించగలిగాడు.


రాత్రి డిన్నర్ కూడా హేమంత్ తెప్పించినదే ఇద్దరూ షేర్ చేసుకున్నారు. కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ ముగించారు. తన ఫోన్ నంబర్ ఆమెకిచ్చి, ఆమె ఫోన్ నంబర్ తను పుచ్చుకున్నాడు హేమంత్. రాత్రి పదిగంటలు దాటిన తర్వాత, ఆమెకి 'గుడ్నైట్' చెప్పి నిద్రకి ఉపక్రమించాడు హేమంత్. అయితే చాలా సేపటి వరకూ అతన్ని నిద్రాదేవి కరుణించలేదు. అందమైన హర్షిత మొహమే అతని కళ్ళముందు కదులుతోంది. నిద్రపట్టేసరికి ఎంత సమయమైందో తెలియదుకానీ, అతని కలలోనీ హర్షితే! ఆమె తలపులే హేమంత్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి కలలో సైతం. మరుసటి రోజు ఉదయం ఎనిమిది గంటలకల్లా వాళ్ళిద్దరినీ గమ్య స్థానం చేర్చింది ఆ ట్రైన్.


ఆమెని ఆటో ఎక్కించి 'బై' చెప్తూ, "ఇవాళ సాయంకాలం బీచ్లో కలుసుకుందాం హర్షితా!" అన్నాడు హేమంత్ తను మరో ఆటో ఎక్కుతూ. అలాగేనని తలూపింది హర్షిత. ఆ సాయంకాలం బీచ్లో హర్షితని కలుసుకోవటం కోసం గంట ముందే బయలుదేరి వెళ్ళాడు హేమంత్. హర్షిత వచ్చేవరకూ ఓపిగ్గా కాచుకున్నాడు. ముందు ఆమె రాదేమోనని అనుమానపడ్డా, ఆమె ఆటో దిగడం చూసి తన మాట ఆమె ఉంచినందుకు చాలా ఆనందం కలిగింది. "నువ్వు రావేమో అనుకున్నాను." అన్నాడు హేమంత్ ఆమెకి ఎదురు వెళ్ళి.


తనని ఏకవచనంతో అతను సంబోధించినా ఆమె ఎదురు చెప్పలేదు. "మీరు పిలుస్తే రాకుండా ఉండగలనా!" మధురంగా నవ్వుతూ జవాబిచ్చిందామె.


ఆమె అందమైన నవ్వు, అ నవ్వుతో సొట్టలుపడే ఆమె చెక్కిలిని చూస్తూ ఉంటే మరి నోటమాట రాలేదు అతనికి. ఆమెతో మాట్లాడుతున్నంత సేపూ ఆమెనే మైమరచి చూస్తున్నాడు హేమంత్. వచ్చే నెలలోనే తన పెళ్ళన్న సంగతి పూర్తిగా మర్చిపోయాడు. సముద్రపు ఒడ్డులో, ఇసుకలో చాలా సేపు కబుర్లు చెప్పుకుంటూ కాలం గడిపిన తర్వాత, ఆ పక్కనే ఉన్న హోటల్లో డిన్నర్ ముగించారు. ఆమెని కాబ్లో దిగబెట్టి తను ఉండే చోటికి వెళ్ళాడు హేమంత్. అక్కడున్నన్ని రోజులూ ఇద్దరూ సినిమాలకి, షికార్లకి తిరుగుతూనే ఉన్నారు. చివరికి ఇద్దరికీ తిరుగు ప్రయాణం చేసే సమయం ఆసన్నమైంది.


సెండ్ఆఫ్ చెయ్యడానికి స్టేషన్కి వచ్చాడు హేమంత్ స్నేహితుడు ఆనంద్. అప్పటికే స్టేషన్ చేరుకున్న హర్షిత కూడా తన సీట్లో సర్దుకు కూర్చుంది. చిత్రంగా ఈ సారి కూడా ఆమెది హేమంత్ ఎదురు సీటే! హర్షితని ఆనంద్కి పరిచయం చేసాడు హేమంత్. హేమంత్ నవ్వుతూ, "ఇదేదో చాలా బాగుంది. కాబోయే శ్రీమతితో నీ ప్రేమాయణం. ప్రేమించి పెళ్ళి చేసుకోవాలన్న నీ కోరిక తీరనందుకు ఇలా ఏర్పాటు చేసుకున్నావన్న మాట!" అన్నాడు.


"నిజమే. ప్రేమించి పెళ్ళి చేసుకోవాలన్న నా కోరిక ఎలాగూ తీరలేదు అనే కన్నా అవకాశం రాలేదు అనడమే బాగుంటుంది. నా గురించి నీకు బాగా తెలుసు కదా! పెద్దలు కుదిర్చిన సంబంధమే చేసుకోవలసి వచ్చింది. మొదటి చూపులోనే, అంటే మొదటి పెళ్ళి చూపుల్లోనే హర్షిత నన్ను బాగా ఆకర్షించింది. అయితే మనసారా ప్రేమించాలన్న నా కోరిక తీరేదెలా? అందుకే ఈ ఏర్పాటు! పెళ్ళికి ముందు ఇలా సరదాగా కలిసి ప్రయాణం చెయ్యాలని, సినిమాలకి షికార్లకి తిరగాలని నేను హర్షితని కోరగా ఆమె అంగీకరించింది.


ఆమె తల్లి తండ్రులు, మా వాళ్ళు ఎలాంటి సంకోచం లేకుండా ఒప్పుకోవడంతో నా కోరిక తీరింది. ముఖ్యంగా హర్షిత ఒప్పుకుంది. ఇక్కడున్నన్ని రోజులూ హాయిగా ఎంజాయ్ చేసాం. ఈ అనుభవాలు కలకాలం మా మదిలో నిలిచిపోతాయి. ముఖ్యంగా ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకోగలిగాం. ఇద్దరి అభిప్రాయాలు చక్కగా కలిసిపోయాయి కూడా! ప్రేమించుకోవడం పూర్తైంది, ఇక పెళ్ళే తరువాయి! ఎంతైనా ప్రేమ ప్రేమే, పెళ్ళి పెళ్ళే! ఇప్పుడు ప్రేమ ఎంత మధురమో తెలిసివచ్చింది." అన్నాడు హేమంత్ హర్షిత వైపు నవ్వుతూ చూసి.


హర్షిత కూడా తలదించుకొని సిగ్గుపడుతూ నవ్వుతూనే ఉంది. వాళ్ళిద్దర్నీ అలా చూసిన ఆనంద్కి ఆ జంట చిలకా గోరింకల్లా అగుపించారు. “మా పెళ్ళికి నువ్వు తప్పకుండా రావాలి సుమా!” అని హేమంత్ ట్రైన్ కదలబోతూండగా ఆనంద్కి వీడ్కోలు చెప్పాడు.


హర్షిత కూడా అతనివైపు చూసి చెయ్యి ఊపింది.

***

దివాకర్ల వెంకట దుర్గా ప్రసాద్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

పూర్తిపేరు దివాకర్ల వెంకట దుర్గాప్రసాద్. పుట్టింది, పెరిగింది కోరాపుట్ (ఒడిశా) లో, ప్రస్తుతం నివాసం బరంపురం, ఒడిశాలో. 'డి వి డి ప్రసాద్ ' అన్నపేరుతో వందకుపైగా కథలు ప్రచురితమైనాయి. ఆంధ్రభూమి, హాస్యానందం, గోతెలుగు, కౌముది, సహరి అంతర్జాల పత్రికల్లోనా కథలు ప్రచురితమయ్యాయి. బాలల కథలు, కామెడీ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


72 views0 comments

Comments


bottom of page