'Pema Leka' New Telugu Story
Written By Sagi Varma Raju
రచన : సాగి వర్మరాజు
ఆరోజు శనివారం. ప్రార్థన అయిపోగానే అందరూ బిలబిలా బళ్ళోకి పరిగెత్తారు, మా బళ్ళో ఒక హాలు, ఓ వరండా.
అన్నిక్లాసుల వాళ్ళు ఆ హాలులోనే కూర్చోవాలి. మొదటి రెండు వరుసల్లో ఐదో తరగతి వాళ్ళు అంటే మేము, మా వెనకాలే నాలుగో తరగతి, ఆ తర్వాత మూడో తరగతి ఈక్రమంలో అందరూ కలిసి పాఠాలు చదువుతుంటే కలగాపులగంగా డ్రామా రిహార్సిల్ లా ఉండేది.
అయితే దీనివల్ల ఇంకో ప్రయోజనంకూడా ఉంది,మన తరగతి కాని వాడు కూడా మనకు మంచి ఫ్రెండ్ అవుతాడు, అలా నాలుగో తరగతి వేణు గాడితో స్నేహం ఏర్పడింది, వాడితోనే ఎందుకంటే మా ఊరి చెరువు,బాడవ, గుండ్లకమ్మ ఇదే ప్రపంచంగాఉన్న నాకు, కొత్త సినిమాలని పరిచయం చేశాడు.
ఏదైనా సినిమా చూడాలంటే మా ఊళ్ళో ఏపండగలకో రూపాయి టికెట్ మీద అదీ.. ‘రామాంజనేయ యుద్ధం’, ‘రాజకోట రహస్యం’ లాంటి పాత సినిమాలు వేసేవారు. ఒక్కోసారి ఆ రూపాయి కూడా దొరక్క ట్రైలర్తోనో, లేకపోతే మైకులో కథ వింటూనో నిద్రపోయేవాడిని. ఇక కొత్త సినిమా చూడాలంటే ఇరవై రెండు కిలోమీటర్లు వెళ్లి ఒంగోలులో చూడాల్సిందే, అప్పటి పరిస్థితులవల్ల అది కుదరని పని. ఈ నా సినిమా పిచ్చి నన్ను వేణు గాడితో స్నేహం వైపు మళ్ళించింది.
వేణుగాడు దాదాపు ప్రతి శనివారం సాయంత్రం స్కూలు వదలగానే గుళ్లకమ్మ అవతల వడ్డున ఉన్న వాళ్ళ అక్కోళ్ళ ఊరు అమ్మనమోలు వెళ్ళేవాడు. ఆ వుళ్ళో ఒక పాత సినిమాహాల్(తడికెలతో) ఉండేది. అందులో చిరంజీవి సెకండ్ రిలీజ్ సినిమాలు వచ్చేవి. వాటిని చూసొచ్చి. సోమవారం నుంచి శనివారం దాకా ఉన్నవి, లేనివి జోడించి మామీదికి వదిలేవాడు. మేము, ఏ కొద్దిగా టైం దొరికినా నోరు తెరుచుకుని వాడి చుట్టూ చేరి పోయే వాళ్ళం.వాడు రెచ్చిపోయి డిటిఎస్ ఇంకా రాని ఆ రోజుల్లో కూడా డిటిఎస్ సౌండ్ ఎఫెక్ట్స్ తో సినిమా రక్తికట్టించేవాడు.
ఆరోజు క్లాస్ లోకి రాగానే వేణు గాడు నా ఎనకమాల చేరి, ‘ఓవ్ అమ్మనమోల్లో కొత్త సినిమా వచ్చింది అంట, నేను వెళ్తున్నా’ అని చెప్పగానే ఎల్లుండి కొత్త సినిమా చూడబోతున్నాం అనే ఆనందం లో నేను ఉంటే ఒంటేల్ బెల్ కొట్టారు.
ఒంటేల్ బెల్లులో వేణు గాడు నా వెనకాలే వస్తూ, చేతిలో ఉన్న అరిసెని చూపించి,దీన్ని ‘భువనసుందరి’కి ఇయ్యవా.. అని అడిగాడు, ‘నేనెందుకు ఇవ్వాలి? నువ్వే ఇవ్వచ్చుగా’ అన్నా.. వాడు నా బలహీనత మీద దెబ్బ కొడుతూ, ‘రేపు నేను కొత్త సినిమా చూసి వచ్చి నీకు కథ చెప్తానా .. ప్లీజ్ అని చివర్లో నొక్కి నొక్కి అడిగేసరికి, పోన్లే మనంకుడా వీడితో బోల్డుసినిమా కథలు చెప్పించుకోవచ్చనే ఆశతో వాడిదగ్గర చేతిలో చేయి వేయించుకొని మాటతీసుకొని,తరవాత అరిసె తీసుకొని నేరుగా సుందరి దగ్గరికి వెళ్ళి తన చేతిలో పెట్టా.. సుందరి అరిసెని పరపరా నాగుల్తా బాగుంది అంది.
నేను వేణు గాడు ఇచ్చాడు అన్నా. అదోలా చూసింది.అప్పటిదాకా నన్ను ఓకంట కనిపెట్టే ఉన్నాడనుకుంటా, వేణు గాడు కంగారుగా ‘ఇచ్చావా? నేను ఇవ్వమన్నానని చెప్పావా?’ అన్నాడు, అరిసెకి కూడా వీడేన్దీ ఇంతలా ఆస్తిరాసిచ్చినట్టు మాట్లాడుతున్నాడు అనుకోని, విసుగ్గా ‘ఎహే చెప్పాలే’ అని ‘రేపు సినిమా కి వెళ్తున్నావా’ అన్నాను నాకిచ్చిన మాటని గుర్తు చేస్తూ.
ఆదివారం ఆటలతో, ఇంట్లో దెబ్బలతో గడిచిపోయింది. సోమవారం స్కూల్ కి ముందే వచ్చి వేణు గాడి కోసం చూస్తున్నా. చలికాలం మంచుతెరలు తెరలుగా పల్చబడుతూ ఉంది, కావిళ్లతో నీళ్ళు మోసుకొచ్చేవాళ్లు,కూరగాయలు అమ్మే ఆమె కేకలు,పొలాలకి వెళ్ళే ఎద్దులపట్టిళ్ళ సవ్వడులు అన్నీ చూస్తూ మద్యమద్యలో వేణుగాడు వస్తున్నాడేమో అని చూస్తూ ఉంటే అందరూ వస్తున్నారు... బెల్లు కొట్టారు... వీడు రాలా…. పాఠాలు చెప్తున్నారు... అయినా వాడు పత్తాలేడు…..
‘వేణు గాడు ఎందుకు రాలేదా’ అనుకుంటూ సాయంత్రం స్కూల్ అయిపోగానే సంచి ఇంటి దగ్గర పడేసి, కమ్మోళ్ళ బజారుకి వెళ్తుంటే, లైబ్రరీ దగ్గర లక్షింపతిబావ కనిపించి ‘ఏరా బడికి ఎల్లలా’ అని అడిగాడు.’ వెళ్లా.. వేణుగాడు బడికి రాకపోతే కనుక్కుందామని వెళ్తున్నా’ అంటే.. తను నవ్వుతూ ‘వాడు ఓనాలుగైదురోజులు రాళ్లే’ అన్నాడు. నేను ఆశ్చర్యంగా’ ఏ…’అన్నాను.
‘ఎందుకంటే వేణు గాడు ప్రేమ లేఖ రాశాడు’ అనగానే నాకు గుండెల్లో ‘దడ’ ... ఎలా రాసింది వర్ణించి చెప్పాడు లక్ష్మీపతిబావ.
పియాతిపియమైన ‘భువనసుందరికి’ నువ్వంటే నాకు చాలా ఇట్టం. ఒకవేళ నేనంటే నీకు ఇట్టం లేకపోతే ఈ కింది వారిలో ఎవర్నో ఒకరిని పెమించు
ఇట్లు
చుంచు.వేణు
నన్నపనేని. వెంకటేశ్వరరావు
ముప్పవరపు. వెంకట్రావు
చేబ్రోలు. వరప్రసాద్
ఇది చెప్పి లక్షింపతి బావ నవ్వుతూ ఉన్నాడు...
కానీ ఈ ‘ ప్రేమలేక’ తో...
‘వేణుగాడి’ చదువు నాలుగో తరగతిలో పులిస్టాప్ పడిపోయింది,
‘భువనసుందరికి’ అయిదోతరగతిలోనే పెళ్లి ఐపోయింది,
‘పేమ లేక’లో సంతకాలు చేసిన ‘పెద్దవాళ్ళకి’ ఇళ్లదగ్గర పెద్దాళ్ళు శక్తి కొలది చాకిరేవు పెట్టటం జరిగింది.
‘నాకు’ సినిమాల కోసం కొత్త మార్గం వెతుక్కోవాల్సిన అవసరం వచ్చింది.
***
Chaala bagundi. Manakosam time teesukovali evarina anipinchindi.🙏