top of page

ప్రేమ మనసులు'Prema Manasulu' written by Lakshmi Madan

రచన : లక్ష్మి మదన్

సంధ్య టివి లో పాత సినిమా వస్తుంటే చూస్తుంది. బ్లాక్ అండ్ వైట్ సినిమా...ఆనాటి ప్రేమల గురించి ఆలోచించ సాగింది. ఇప్పుడు పిల్లల పెళ్లిళ్లు అయి కొంచెం తీరికగా ఉండి నచ్చిన సినిమాలు చూస్తుంది తీరిక వేళలో...

ఆ రోజుల్లో ఆడ పిల్లలు జట్లుగా పాఠశాల కు వెళ్లే వారు. కబుర్లు చెప్పుకుంటూ, నవ్వుకుంటూ పుస్తకాలను చేతిలో పట్టుకుని. ఇప్పటిలా కార్లు, బస్సులో కాదు.. ఎంత దూరమైనా నడిచి వెళ్లడమే. వెళ్ళాక తరగతి గదిలో ఆడ పిల్లలకు ఓ వైపు రెండు బెంచీలు మాత్రమే ఉండేవి అక్కడ కూర్చునే వాళ్ళు. పట్టుమని పది మంది కూడా ఉండే వాళ్ళు కాదు. మగ పిల్లలు నలభై వరకు ఉండే వాళ్ళు. అసలు ఒకరికి ఒకరు చూసుకోవడం కూడా ఉండేది కాదు. ఎంతో అవసరం అయితే ఒక మాట మాట్లాడు కోవడం. సంధ్యకు గతం గుర్తొచ్చింది. తను ఎంతో తెలివిగల అమ్మాయి. చదువులో చురుగ్గా ఉండేది. సార్ ఏది అడిగినా తానే ముందుగా చెప్పేది. ధైర్యంగా ఉండేది. ఆ చురుకు తనం చూసి అందరి తనంటే ఇష్టం ఉండేది. రోడ్డు మీద వెళుతుంటే ఎవరన్నా కామెంట్ చేస్తే వెంటనే గట్టిగా బుద్ధి చెప్పేది. చాలా భయ పడే వాళ్ళు ... ఎదురుగా చెప్పలేక ఎన్నో ప్రేమ లేఖలు ఆమె డెస్క్ లో పెట్టి వెళ్లే వారు. ఆ రోజుల్లో అది చాలా పెద్ద వింత. స్నేహితులు ఆశ్చర్యంగా చూసే వాళ్ళు. సంధ్య మాత్రం అలా చదివి చింపి పడేసేది. ఇంట్లో తెలిస్తే చదువు కు ఆటంకం ఏర్పడుతుంది అని భయం. అలాంటి అమ్మాయి ఒక రోజు సైన్స్ పాఠం వింటూ పక్కకి తిరిగి చూసింది.. ఒక అబ్బాయి తదేకంగా తననే చూస్తూ ఉన్నాడు.. వెంటనే కళ్ళు తిప్పేసుకుంది.... ఎందుకో మళ్లీ చూడాలనిపించి మెల్లిగా కళ్ళు మాత్రమే తిప్పి చూసింది... అలాగే చూస్తున్నాడు.. మనసులో చిన్న అలజడి రేగింది... చివరి గంట కొట్టడంతో ఇంటికి వెళ్ళ సాగింది ఎప్పటిలా ఫ్రెండ్స్ తో...


మెల్లిగా వెను తిరిగి చూస్తే అతనే తనని చూస్తూ వస్తున్నాడు.. ఇంచు మించు ఇల్లు వస్తుంది అనే సమయంలో పక్క సందులోకి తననే చూస్తూ వెళ్లి పోయాడు.


ఇంటికి వచ్చిన సంధ్య ఎప్పటిలా ఉత్సాహంగా లేదు.. ఏదో ఆలోచిస్తూ కొంచెం కలవర పడుతున్నట్లు ఉంది. ఆ వయసులో అది సహజమే. కాసేపయ్యాక తల్లి ఏదో సరుకులు తెమ్మని చెప్పింది. దుకాణం కొంచెం దూరంలో ఉండేది. సంచి పట్టుకుని వెళ్ళింది. తిరిగి వస్తుంటే ఆ అబ్బాయే మళ్లీ కనిపించాడు... అలా దూరంగా తన వెనకనే వచ్చాడు. మళ్లీ అదే తీరు.. అతనిది పక్క సందు.


అప్పటినుండి తరగతిలో కూర్చున్నా మాటి మాటికి అలా చూపులు కలుసుకోవడం.. పెదవులు మీద మాత్రం నవ్వు ఉండేది కాదు. స్కూల్ లేని నాడు ఏదో వెలితిగా ఉండేది.


వేసవి కాలంలో రామ నవమి ఉత్సవాలలో రోజు గుడికి వెళ్ళడం.. పురాణ కథలు వినడం జరిగేది. ఇంటిల్లి పాది గుడిలోనే రోజు.... ఆ అబ్బాయి కూడా సంధ్య ఉన్నంత సేపు గుళ్ళో ఉండే వాడు. అతను పురాణం వినే వాడు కాదు... సంధ్యను చూస్తూ ఉండే వాడు. తను ఇంటికి వెళితే అతను వెళ్లిపోయే వాడు. అలా ఒక సంవత్సరం గడిచింది. పదవ తరగతి కి వచ్చారు. సంధ్య పట్నం వెళ్ళి గాజులు.. కొత్త బట్టలు అన్నీ తెచ్చుకుంది. పాఠశాల తెరిచే మొదటి రోజు. చక్కగా తయారయి వెళ్ళింది. ఆ అబ్బాయి కోసం కళ్ళు వెతుకుతున్నాయి. కనిపించ లేదు. నిరాశగా అనిపించింది. అలాగే అన్యమనస్కంగా గడిపింది.


లంచ్ తర్వాత ఆ అబ్బాయి వచ్చాడు. ఒక్క సారి మొహం వెలిగి పోయింది. వచ్చి క్లాస్ టీచర్ నీ విష్ చేసి .. నేను పట్నం వెళుతున్నాను సార్.. టీసీ తీసుకున్నాను. మిమ్మల్ని కలిసి వెళదామని వచ్చాను అన్నాడు. సంధ్యకు కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అయినా తనకేమీ పట్టనట్లు కూర్చుంది. అతను ఒకసారి కళ్ళలోకి చూసి వెళ్లి పోయాడు.


చాలా రోజుల వరకు స్కూల్ కి వెళ్ళ బుద్ధి కాలేదు. క్రమేణా మరచి పోయి చదువు ధ్యాసలో పడి పోయింది.


తర్వాత కాలేజి కి వెళ్ళింది.. చదువు కొన సాగుతున్న సమయంలో ఇంటి ముందు కూర్చొని ఉండగా మళ్లీ ఆ అబ్బాయి కనిపించాడు అక్కడి నుండి వెళుతూ.. ఒక్కసారి ఉలిక్కి పడి చూసింది.. అతనే... మెల్లగ దగ్గరకు వచ్చి మొదటి సారిగా " ఈ ఊళ్ళో చదువుతున్నావా " అని అడిగాడు.. సంధ్య మొహమాటంగా " అవును " అని చెప్పింది.. అంతకు మించి ఇద్దరి మధ్య ఏ మాటలు లేవు.. అదే చూపుతో వెళ్లి పోయాడు.


చదువు అయ్యాక సొంత ఊరిలో మళ్లీ కలిసి ఒక ఉత్తరం ఇవ్వ బోయాడు.... అప్పుడు సంధ్య చిన్న స్వరంతో " ఇలాంటివి వద్దు " అని చెప్పి ఇంట్లోకి వెళ్లి పోయింది. అతను బాధ పడుతున్నట్లు గమనించినా కట్టుబాట్లు గుర్తొచ్చి మౌనంగా ఉండి పోయింది....


ఆ తర్వాత ఆమె పెళ్లి అయిన కొన్నేళ్ళకు పిల్లలతో బస్ లో వెళుతుంటే కనిపించి పలకరించి వెళ్ళాడు... అంతే....


తర్వాత సొంత ఊరికి వెళ్లిన సంధ్యకు ఒక నిజం తెలిసింది, అతను ఎంతో మంచివాడు అని. సంధ్యకి కూడా తెలుసు అతని మంచి తనం.. కానీ కులాలకు అతీతంగా నిర్ణయం తీసుకునే సాహసం చేయ లేదు.. అందులో ఇంటి సాంప్రదాయం తెలుసు కనక.. కన్న వారు గౌరవం కోల్పోవద్దు అని తన ప్రేమను మొగ్గలోనే త్రుంచి వేసింది. అతను చేసిన మంచి పని ఏమిటి అంటే... అతను ఒక అనాథ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆమెకు జీవితాన్ని ఇచ్చాడని... ఆ అమ్మాయికి అండగా నిలబడి చదివించి ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లడానికి తెలుసుకుని చాలా సంతోష పడింది. ఎప్పుడైనా ఒకసారి అతన్ని చూడాలని మనసులో అనుకున్నది.

ఒక్కసారి గతంలో నుండి బయటకు వచ్చి ఆలోచించింది సంధ్య. ఒక్క రోజు మాట్లాడుకోలేదు.. కలిసి తిరగ లేదు... చూపులతో మాత్రమే పలకరించు కున్నాము.... ఈ రోజుల్లో ప్రేమ ఇలా ఉంటుందా... ఇప్పటికీ గుర్తిస్తే ఒక చల్లని పిల్ల తెమ్మెర తాకినట్లు ఉంటుందే కానీ అంతకు మించి ఆలోచన ఉండదు.. అని అనుకుని చిన్న నవ్వు నవ్వుకుని వంటింట్లోకి వెళ్ళింది .

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత్రి పరిచయం ; పేరు లక్ష్మి

కలం పేరు : లక్ష్మీ మదన్

హైదరాబాద్ లో ఉంటాను.

500 కి పైగా కవితలు, 300 కి పైగా పద్యాలు, పాటలు, కథలు రాసాను.


72 views0 comments

Комментарии


bottom of page