ప్రేమను చంపిన ప్రేమ
- Chaturveadula Chenchu Subbaiah Sarma
- Apr 26, 2023
- 1 min read

'Premanu Champina Prema' New Telugu Story
Written By Ch. C. S. Sarma
'ప్రేమను చంపిన ప్రేమ' తెలుగు కథ
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
రైల్వేస్టేషన్..
సమయం రాత్రి ఒకటిన్నర..
చెన్నై నుండి హౌరా వెళ్ళే హౌరా మెయిల్ నెల్లూరు స్టేషన్ లో ఆగింది.
చలికాలం.. కార్తీకమాసం..
ప్రయాణీకులు అధికంగా లేరు.
నలుగురు జనరల్ కంపార్టుమెంటు నుండి దిగారు. అదే బోగీలో ఒక ఆడ మగ ఎక్కారు.
గార్డ్ విజిల్ వేశాడు.. రైలు ఆవులిస్తూ ముందుకు సాగింది.
ఆ బోగీ నుండి నలుగురు దిగిన కారణంగా.. ఎక్కిన ఇరువురికి ఎడమవైపు సింగిల్ సీట్లు దొరికాయి.
చేతుల్లోవున్న బ్యాగ్స్ ను సీట్ల క్రింద పెట్టుకొన్నారు. ఇరువురూ ఒకరి ముఖాలు ఒకరు చూచుకొన్నారు. వారి వయస్సు పాతిక సంవత్సరాల లోపే.
యువకుని పేరు శంకర్. యువతి పేరు గంగ. వివాహితులు.. కానీ వారి ముఖాల్లో కొత్తగా వివాహం జరిగిన జంట ముఖాల్లో ఉండవలసిన కళాకాంతి లేదు.
గంగ నిట్టూర్చింది విచారంగా. ఆమె కళ్ళల్లో కన్నీరు. తలను దించుకొంది.
శంకర్ అమె ముఖంలోకి కొన్ని క్షణాలు పరీక్షగా చూచాడు. బోగీ నాలుగు వైపులా చూచాడు.
నడిరేయి. అందునా చలికాలం. ప్రయాణీకులు కునుకుపాట్లు పడుతున్నారు.
‘‘పడుకోవాలని వుంది!..’’ మెల్లగా చెప్పింది గంగ.
‘‘సరే.. లే!..’’ తాను సీటు నుంచి లేచాడు శంకర్
గంగకూడ లేచి ప్రక్కకు జరిగింది.
ఆనుకొనే రెండు చక్కలను క్రిందికి దించాడు శంకర్.
రెండు కలసిపోయాయి. క్రిందవున్న సంచిని దక్షిణపువైపు వుంచాడు.
“ఊఁ.. పడుకో!..” మెల్లగా చెప్పాడు శంకర్.
గంగ పడుకొంది.
వంగి సీట్ క్రిందవున్న మరో బ్యాగ్ లో నుంచి బెడ్ సీట్ తీసి గంగకు కప్పాడు శంకర్.
బెడ్ షీట్ ను చుట్టుకొని కాళ్ళు ముడుచుకొని.. గంగ కళ్ళు మూసుకొంది.
ఆమె తలవైపున బెంచీకి ఆనుకొని శంకర్ కూర్చున్నాడు. గంగవైపు ఒక సారి చూచాడు.
బెడ్ షీట్ ను తలకు చుట్టుకొని గంగ నిద్రపోసాగింది.
రైలు ముందుకు సాగిపోతూ వుంది.
శంకర్ మనస్సున ఆలోచనలు..
భూత కాలపు జ్ఞాపకాలు..
సాగర కెరటాల్లా మనోదర్పణం మీద ప్రతిబింబించసాగాయి.
* * *
కృష్ణమ్మతల్లి (నది) పుష్కరకాలం..
ఆ ప్రాంతీయ్యులేకాక.. దూర ప్రాంతీయ్యులు కృష్ణానది పుష్కరాలకు వచ్చారు.
ప్రభుత్వం ప్రజాశ్రేయస్సు కోసం.. బేరికేట్స్.. వాలెంటర్స్.. పోలీస్ బలగాలను పక్కా పకడబందీగా నియమించింది.
రాఘవరావు సతీమణి శ్యామల కూతురు గంగ చిన్న కొడుకు రంగలతో నెల్లూరు నుండి విజయవాడకు చేరారు.
నదీస్నానం ఆచరించి పిత్రుదేవతలకు తర్పణాదులను సమర్పించి వస్త్రాలు మార్చుకొని బెజవాడ కనకదుర్గమ్మ వారిని దర్శించి మెట్లపై క్రిందికి దిగివస్తున్నారు ఆ కుటుంబం.
ఒక చోట మెట్లపై పన్నిండు సంవత్సరాల బాలుడు.. తైల సంస్కరాం లేని తల, చిరిగిన బట్టలు, నీరసించిన కళ్ళు, ధర్మానికి మోకాళ్ళపై కూర్చొని చేతులు జాచిన ఆబాలును చూచాడు రాఘవరావు గారు.
వారి మనస్సున ఏదో జ్ఞాపకం.. ఆగిపోయారు.
* * *
‘‘రాఘవా! మేము చేయవలసినదంతా చేశాము రా!.. కానీ ప్రయోజనం సూన్యం!..’’ విచారంగా చెప్పాడు డాక్టర్ శ్యామ్.
శ్యామ్, డాక్టర్ రాఘవరావు స్నేహితుడు. బంధువు.
‘‘శ్యామ్!.. నా బిడ్డను బ్రతికించరా!.. నా బిడ్డను బ్రతికించరా!..’’ దీనంగా ఏడ్చాడు రాఘవరావు.
‘‘సారీ రాఘవా!.. అయాం సోసారీ!..’’ డాక్టర్ శ్యాంమ్ కన్నీటితో ఎంతో విచారంగా చెప్పాడు.
పచ్చకామెర్లు.. ముదిరిపోయి సకాలంలో తగిన చికిత్స జరగనందున రాఘవరావు పన్నెండు సంవత్సరాల పెద్దకొడుకు రాజా గతించాడు.
అది జరిగి దాదాపు ఒకటిన్నర సంవత్సరం అయింది.
యాచకుడుగా మెట్లపైన వున్న శంకర్ ను చూడగానే రాఘవరావుగారికి తన గతించిన కొడుకు రాజా.. శంకర్ అదే పోలికలతో వున్నందున గుర్తుకు వచ్చాడు.
వారి కళ్ళల్లో ఆ జ్ఞాపకాలతో కన్నీరు కొన్న క్షణాలు తర్వాత తన్ను తాను తమాయించుకొని..
‘‘బాబూ!..’’
‘‘సార్!..’’
‘‘నీపేరేమిటి?..’’
‘‘శంకర్ సార్!..’’
‘‘నీకు ఎవరూలేరా!..’’
శంకర్ లేరన్నట్లు కన్నీటితో విచారంగా తల ఆడించారు.
సతీమణి శ్యామల తొమ్మిది సంవత్సరాల గంగ ఐదు సంవత్సరాల రంగా రాఘవరావు గారిని సమీపించారు.
‘‘ఏమిటండీ!.. అక్కడే నిలబడిపోయారు?..’’ అడిగింది శ్యామల.
‘‘శ్యామలా!..’’
‘‘ఆఁ..’’
‘‘ఆ బాబును చూడు!..’’
శ్యామల గంగ.. రంగా.. శంకరును చూచారు.
‘‘అన్నయ్యలా వున్నాడు!..’’ అన్నాడు రంగా.
‘‘అవునుకదూ!..’’ రాఘవరావు గారి మాట.
‘‘అవును నాన్నా!..’’ అంది గంగ.
‘‘అవునండి వున్నాడు. మీ వుద్దేశ్యం ఏమిటీ?..’’ రాఘవరావు గారి ముఖంలోకి చూస్తూ అడిగింది శ్యామల.
‘‘శ్యామలా!..’’
‘‘చెప్పండి!..’’
‘‘ఈ బాబును మనం మనతో తీసుకొని వెళదాము. మనం పెంచుకొందాం!..’’ నవ్వుతూ చెప్పాడు రాఘవరావు.
‘‘అతను ఎవరో ఏందో!..’’ విరక్తిగా చెప్పింది శ్యామల.
‘‘అతనికి ఎవరూ లేరట. ఏకాకి!..’’
‘‘ఐతే!..’’
‘‘అందుకనే.. నేను అతన్ని పెంచి చదివించి మంచి జీవితాన్ని కల్పిస్తాను. నా పెద్ద కొడుకు నాతో వున్నట్టుగా భావిస్తాను. అనందిస్తాను.’’ నవ్వతూ సంతోషంగా చెప్పాడు రాఘవరావు..
‘‘సరే, మీ ఇష్టం!..’’ అంది శ్యామల.
‘‘బాబూ!..’’
‘‘సార్!..’’
‘‘పైకిలే!..’’
శంకర్ పైకి లేచాడు. దీనంగా రాఘవరావుగారి ముఖంలోకి చూచాడు.
‘‘భయపడకు. బాధపడకు. నేను నిన్ను నాతో మావూరికి తీసికొని వెళుతున్నాను. ఇకపై నీవు మా బిడ్డవు. మా ఇంట్లోనే మాతో వుంటూ ఈ గంగ రంగల తో కలసి చదువుకోవాలి. సరేనా!..’’
‘‘అలాగేసార్!..’’ శంకర్ ఆనందంగా తల ఆడించాడు..
‘‘రా!..’’
రాఘవరావు గారు ముందు నడవగా.. శంకర్ వారి కుటుంబ సభ్యులు వారిని అనుసరించారు. శంకర్ కు రాఘవరావు రెండు జతల బట్టలు కొని ఇచ్చాడు.
బస్టాండుకు చేరి లగేజీలతో స్టేషన్ కు వచ్చి నెల్లూరుకు రైలు ఎక్కారు.
* * *
శంకర్ జీవితం రాఘవరావుగారి గ్రామంలో మూడు పువ్వులు ఆరుకాయలుగా మారింది. పది వసంతాలు ఎంతో పసందుగా అందంగా ఆనందంగా గడిపోయాయి.
శంకర్ బియ్యే పాసైనాడు. రాఘవరావు గారికి ఇంటి ప్రతివిషయానికి ముఖ్యుడు జవాబుదారిగా మారిపోయాడు. ఇంటిల్ల పాదికి శంకర్ మాట వేదవాక్కు. అతనంటే అందరికీ ఎంతో అభిమానం దానికి కారణం.. అతని లోని నీతి.. నిజాయితీ.. న్యాయం.. ధర్మం.. ఆ ఇంటనే కాదు.. ఆ వూరి వారందరికీ శంకర్ అంటే గౌరవం ప్రేమ ప్రతి ఒక్కరికీ వారు తనను కోరిన సాయం.. శక్తి వంచన లేకుండా చేసేవాడు శంకర్. ఆ కారణం వూరి జనాలందరికీ శంకర్ అంటే అంతులేని ప్రేమానురాగాలు. అందరి నోటా మంచి పేరు..
గ్రామ ప్రజలందరికీ రాఘవరావుగారి మాట వేదవాక్యం.
ఆ గ్రామమే కాదు చుట్టూ.. పది గ్రామాలతో రాఘవయ్యగారికి మంచి పేరు గౌరవం.
దానికి కారణం.. వారిలో సద్గుణాలు.. తాతతండ్రుల నాటి పరంపరను గౌరవించి.. ధానం.. ధర్మం.. పరోపకారం.. దైవకార్యాలు సాగించడం.. వూరందరి శ్రేయస్సుకు పాటుపడడం ముఖ్య కారణాలు..
నాలుగెళ్ళ క్రిందట వరకూ ఆ మూడు వందల ఇళ్ళు వున్న గ్రామంలో ఆ పెద్దయ్యగారికి మాటకు తిరుగులేదు. వారికి పోటీలేదు. నేటికీ వారే గ్రామ సర్పంచ్.
కాలగతిలో గత తరానికి.. ప్రస్తుత నవతరానికి కొంత అంతరం.. నాడు పెద్దల మాటను గౌరవించేవారు. పాటించేవారు. ఆచరించేవారు. కొత్తతరం నేడు.. వారి మాటలపై విమర్శచేయడం.. అందులోని తప్పుఒప్పులను గురించి తర్కించడం.. అభిప్రాయ బేధాలు వ్యక్తిగత వితర్కాలు.. విబేధాలు.. ఏర్పడుతున్నాయి. యువత ఆడా, మగ.. టీవీలు, సినిమాలు, న్యూస్ ఛానల్లు, సెల్ ఫోన్స్ ఇత్యాది అదునాతన సాధనాల వాడుక మూలంగా.. వారిలో స్వతంత్ర్య అభిప్రాయాలు.. తమ భావిజీవితాలను గురించి తామే నిర్ణయించుకొనే స్వేచ్చా భూపాలు.. తెంపు తెగువలు.. పెద్దల మాటల మీద నిరసన.. ధిక్కారాలు.. స్వేచ్చా భావాలతో ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసికొనే వ్యవస్థ ప్రబలిపోయింది. ఆ సమాజంలో రాఘవరావు గారి ముద్దుల కూతురు గంగ సభ్యురాలు. బియస్.స్సీ ఫస్టు క్లాస్ లో పాసైయింది.
* * *
యుక్తవయస్కురాలైన గంగ శంకర్ ను ఎంతగానో ప్రేమించింది. అది వయస్సు రీత్యా ఏర్పడిన వ్యామోహం.. నేను నిన్ను ఆశించడంలేదని శంకర్ ఆమె అభిప్రాయాన్ని అనేకసార్లు ఏకాంతంలో ఖండించాడు.
శంకర్ నిరసన.. గంగలో పట్టుదలను పెంచింది. శంకర్ ను పిచ్చిగా ప్రేమించింది. భావిజీవితం అతనితోనే అనే నిర్ణయానికి వచ్చింది.
ఊరంతా శంకర్ రాఘవరావు గారి పెద్దకొడుకు. శ్రీరామచంద్రుడు అంతటి గొప్ప పేరు వూర్లో శంకర్ కు..
శంకర్ ను గురించి ఇతరులు చెప్పే మాటలను విని ఎంతగానో పులకించి పరవశించే వ్యక్తి రాఘవరావుగారు. అతని మదిలో శంకర్ తన పెద్ద కొడుకనే భావన.
శ్యామల సోదరుడు దివాకర్. ఇంజనీర్. గంగను దివాకరుకు ఇచ్చి వివాహం చేయాలని శ్యామల గారి నిర్ణయం.
గంగకు తన తల్లి నిర్ణయం తెలుసు. ఒకటి రెండు సార్లు దివాకర్ ప్రస్తావన శ్యామల రాఘవరావు గారితో చేయడం.. దానికి వారు నిరాకరించడం.. ఆ సంభాషణ గంగ వినడం జరిగింది.
ఎవ్వరికీ చెప్పకుండా రాఘవరావు తన స్నేహితుడు జగన్నాథరావు, అతని కొడుకు డాక్టర్ రాఘును ఇంటికి ఆహ్వానించాడు.
స్నేహితుని.. అతని కుమారుని భార్యకు కూతురుకు పరిచయం చేశాడు.
గంగకు.. శ్యామలకు రాఘవరావుగారి అభిప్రాయం అర్థం అయింది.
వెళ్ళేముందు జగన్నాథం..
‘‘ఒరేయ్!.. రాఘవా!.. అంతా నీ ఇష్టం రా!.. నీవు ఎలా చేయదలచుకొంటే అలాచెయ్యి!..’’ నవ్వుతూ కరచాలనం చేసి కొడుకుతో వెళ్ళిపోయాడు జగన్నాధం..
శ్యామలగారికి డాక్టర్ రఘు అందచందాలు ఆస్తిపాస్తులు బాగా నచ్చాయి. తమ్మడు దివాకర్ ను వూరికి వెళ్ళిపొమ్మంది. భార్యలోని మార్పుకు రాఘవరావు ఎంతగానో ఆనందించాడు.
రఘు విషయంలో తల్లితండ్రి ఒక మాట మీద నీలబడడంతో గంగ.. వారిని ఎదిరించి శంకర్ ను తనవాడిగా చేసికోవాలనే నిర్ణయానికి వచ్చింది.
అక్క విమర్శలకు దివాకర్ ఆగ్రహంతో తనవూరికి వెళ్ళి తన తల్లి తండ్రికి.. అక్క శ్యామల తత్వంలోని మార్పును గురించి చెప్పి వారిని పిలుచుకొని వచ్చి శ్యామల రాఘవరావుల మెడలు విరిచి గంగను తనదానిని చేసికోవాలనే నిర్ణయంతో తన వూరికి వెళ్ళిపోయాడు.
ప్రతి తల్లి తన కూతురుని యోగక్షేమాలను కలిగించే సంబంధాన్నే మెచ్చుతుంది. శ్యామలకు రఘు విషయంలో అలాంటి భావన కలిగి భర్తతో ఏకీభవించింది.
రాఘవయ్య పురోహితుని పిలిచి కుమార్తె వివాహ నిశ్చితార్థానికి ముహూర్తాన్ని నిర్ణయించాడు. వారం రోజుల్లో నిశ్చితార్థం, పెండ్లి కొడుకు వారికి వర్తమానం పంపారు. పై అన్ని విషయాల్లో శంకర్ రాఘవరావు చెప్పినట్లు శ్రద్ధగా పనిచేస్తూ సహాయకారిగా వున్నాడు. గంగకు దూరంగా వుండేవాడు.
* * *
మూడవ రోజు నిశ్చితార్థం.
ఏర్పాట్లను గురించి రాఘవరావు శ్యామల శంకర్ చర్చించుకొన్నారు. గంగ మౌనంగా వారి మాటలను విన్నది. శంకర్ చేతలనూ గమనిస్తూ వుండేది.
ఆ సాయంత్రం ఐదుగంటల ప్రాంతంలో..గాలివాన మొదలైంది. ఎనిమిదిగంటలకు భోజనాలు ముగించి అందరూ వారి వారి పడక గదుల్లోకి వెళ్ళి చలికి తలుపులు మూసుకొన్నారు.
వాతావరణం యింకా భయంకరంగా మారింది. చలిగాలి విపరీతం. రగ్గులు కప్పుకొని అందరూ నిద్రకు ఉపక్రమించారు.
సమయం రాత్రి పదిన్నర. అందరూ గాఢనిద్రలో వున్నారు. కానీ గంగ నిద్రపోలేదు.
అందరూ ప్రతిరోజూ తలుపులు గడియ బిగించి నిద్రపోతారు. శంకర్ తలుపు దగ్గరకు నెట్టి నిద్రపోతాడు. ఆ విషయం గంగకు బాగా తెలుసు.
మంచంపై నుంచి మెల్లగా లేచి తన గదికి మూడవ గది అయిన శంకర్ పడక గదిని చేరి మెల్లగా తలుపును వ్రేలితో నెట్టింది. అది తెరుచుకొంది. లోనికి వెళ్ళి తలుపును మూసి శంకర్ మంచాన్ని సమీపించింది.
శంకర్ దుప్పటి బిగించి నిద్రపోతున్నాడు. బయట గాలీవాన గంగకు అనుకూలంగా వున్నాయి. గోడకు బెడ్ లైటు వెలుగుతూ వుంది.
శంకర్ తలవైపుకు చేరింది. మెల్లగా తలపైన తట్టింది గంగ. రెండు సార్లకు శంకర్లో చలనంలేదు.
మూడవసారి.. చూపుడు వ్రేలితో చెవి మీద తట్టింది. బయట గాలీవాన హోరు.
శంకర్ భయంతో ఉలిక్కిపడి ముఖంపై దుప్పటి తొలగించి కళ్ళు తెరిచాడు.
గంగ తన చేతిని శంకర్ నోటికి అడ్డంగా పెట్టింది. భయంతో అరవ బోయిన శంకర్ గుడ్లు పెద్దవి చేసి గంగను చూచాడు.
వేగంగా లేచి మంచంపైన కూర్చున్నాడు.
అతని అవతారానికి గంగకు నవ్వు వచ్చింది. అతని ముఖాన్ని పరీక్షగా చూస్తూ అందంగా నవ్వింది గంగ.
‘‘భయపడకు. నేను నీ గంగను..’’
ఆశ్చర్యంతో మంచమ్మీద కూర్చొని గంగ ముఖంలోకి చూచాడు శంకర్.
‘‘ఎందుకొచ్చావ్ గంగా!.. ఎవరన్నా చూస్తే!..’’ భయంతో దీనంగా గంగ ముఖంలోకి చూచాడు.
‘‘ఎందుకంత భయం. నీవు మగాడివి కాదా!..’’
‘‘ఏదైనా వుంటే రేపు పగలు మాట్లాడుకొందాం గంగా!.. ప్లీజ్!.. నీవు నీ గదికి వెళ్ళిపో.’’
‘‘పోకపోతే ఏం చేస్తావ్?..’’
‘‘అలా మాట్లాడకు గంగా!.. అది నీకు న్యాయం కాదు!..’’
‘‘మరి నీవు నా విషయంలో న్యాయంగా ప్రవర్తిస్తున్నావా!.. ఎన్ని సార్లు ఎన్ని విధాల నీకు చెప్పాలి. నీవంటే నాకు ఇష్టం. నీ వంటే నాకు ఇష్టం అని!..’’ దీనంగా అతని కళ్ళల్లోకి చూస్తూ చెప్పింది గంగ.
‘‘అది తప్పు గంగా.. అది..’’
‘‘అది నా నిర్ణయం. నీవు నావాడివి. మనం ఈ ఊరు వదలి ఎక్కడికన్నా పారిపోయి పెండ్లి చేసికొందాం. మనం ఈ వూరి నుండి రేపు రాత్రికి టాక్సీలో నెల్లూరుకి వెళ్ళి రైలు ఎక్కి విశాఖపట్నం వైపు దూరంగా వెళ్ళిపోయి పెండ్లి చేసుకొందాం. ఇది నా నిర్ణయం. ఈ నా నిర్ణయానికి ఎలాంటి మార్పూవుండదు. నాన్నా అమ్మలు వారి నిర్ణయాలను మార్చకోరు. నీవు నాకు కావాలి. నేను నీ దాన్ని శంకర్!.. నీవు రేపు తొమ్మది గంటలకు నన్ను నెల్లూరు స్టేషన్ లో కలవాలి. కలవకపోతే.. మరుదినం ఉదయం నాశవం పెన్నానది నీటిలో తేలుతుంది. నీ ఇష్టం..’’ ఆవేశంగా చెప్పి కొన్ని క్షణాలు శంకర్ ముఖంలోకి చూచింది గంగ.
ఆక్షణంలో ఆమె నయనాలు అశ్రుభరితాలు
ఆ కన్నీటిని చూచిన శంకర్ కళ్ళలో కన్నీరు..
గంగ దుప్పట్టాతో కన్నీరు తుడుచుకొంటూ వేగంగా తన గదికి వెళ్ళిపోయింది.
శంకర్ తలపై పిడుగు పడినట్లయింది.
గంగ వెనకాలే ద్వారం వరకూ వెళ్ళాడు.
గంగ తన గదిలో ప్రవేశించి తలుపు మూసుకోవడం చూచాడు.
అతని మనస్సంతా కల్లోలం..
గదిలోనికి జరిగి తలుపు మూసి భయంతో మంచంపై వాలాడు.
మరుదినం.. ఉదయం ఐదు గంటలకు లేచింది గంగ. ఆ రోజు కార్తిక సోమవారం.
స్నానం చేసి తమ్మడు రంగనూ తయారు చేసి ఇరువురూ శివాలయానికి వెళ్ళి అభిషేకార్చనలను చేయించి జగత్ మాతా పితలను దర్శించి.. తీర్థ ప్రసాదాలతో ఇంటికి తిరిగి వచ్చారు.
అప్పుడు సమయం ఏడున్నర.
రాత్రి ప్రళయానికి గంగ విజృంభణకు శంకర్ మామూలుగా వేకువన ఐదుగంటలకు లేవలేకపోయాడు.
ఆలయాన్నించి వచ్చి అతని కోసం వెతికింది. కనుపించనందున తమ్మడు రంగను వెళ్ళి శంకర్ గదిలో చూడమంది. రంగ శంకర్ గదికి వెళ్ళాడు.
అప్పుడే లేచిన శంకర్ ను రంగ పలకరించాడు. అతని శరీరాన్ని తాకి చూచాడు. ఒళ్ళు వేడిగా తగిలింది.
రంగా గంగకు ఆ విషయం చెప్పాడు.
కషాయం తయారుచేయ వంటిట్లోకి వెళ్ళింది గంగ. కాచిన మిరియాల కషాయాన్ని చల్లార్చుతూ వుంది శ్యామల.
“శంకర్ కు జలుబు జ్వరం. ఈ కషాయాన్ని ఇచ్చి తాగించిరా!..” చెప్పింది శ్యామల.
గంగ ఆశ్చర్యపోయింది. మారు మాట్లాడకుండా తల్లి అందించిన గ్లాస్ ను తీసికొని శంకర్ గదిలో ప్రవేశించింది గంగ.
గంగను చూచి ఉలిక్కి పడి లేచి నిలుచున్నాడు శంకర్.
‘‘కూర్చొండి కషాయం అమ్మ మీకు ఇచ్చి రమ్మని పంపింది. నేను ఉదయాన్నే రంగాతో శివాలయానికి వెళ్ళి వచ్చాను. ఈ నాటి మన ప్రోగ్రామ్ ఎలాంటి అంతరాయం లేకుండా జరగాలని మాతాపితలను వేడుకొన్నాను. ఈ కషాయాన్ని తాగండి. అరగంటలో వేడి తగ్గిపోతుంది. మన ప్రోగ్రాములో ఎలాంటి మార్పు లేదుసార్. దీన్ని సాకుగా అబ్బా ఇక ఫరవాలేదునుకోకండి. నా స్నేహితురాలు వనజ బర్తడే. నేను పదిగంటలకు నెల్లూరు చేరుతాను. మన టిక్కెట్లు అవీ అది తీసివుంచి వుంటుంది. మీరు మాత్రం రాత్రి పదిగంటలకు స్టేషన్ కు రావాలి.
మన ప్రయాణంలో ఎలాంటి మార్పులేదు. కార్లో నేను తమ్ముడు తొమ్మదిన్నరకు నెల్లూరికి బయలుదేరుతున్నాము. మీ కోసం ఎదురు చూస్తూ వుంటాను.’’ గంగ శంకర్ జవాబుకు ఎదురు చూడకుండా గది నుండి బయటకి వెళ్ళిపోయింది.
తొమ్మది గంటలకు అమ్మనాన్నలకు చెప్పి తమ్మునితో కలసి కార్లో నెల్లూరికి వెళ్ళిపోయింది. శ్యామల కన్నీటితో వీడ్కోలు పలికింది.
మధ్యాహ్నం ప్రక్కవూర్లో కావలసిన వారి ఇంటి గృహప్రవేశానికి రాఘవరావుగారు వెళ్ళిపోయారు. ఆ రాత్రికి వారు అక్కడే వుంటారు.
శంకర్ భోజన సమయంలో తాను నెల్లూరు వెళుతున్నట్లు రాఘవరావుగారికి చెప్పాడు.
‘‘అమ్మాయి తో కలసి ఇరువురూ తిరిగి రండి!..’’ అది చిరునవ్వుతో రాఘవయ్యగారు ఇచ్చిన సమాధానం.
* * *
తాను తప్పు చేయబోతున్నట్లు తెలిసిన శంకర్ హృదయంలో రాత్రి వానాగాలి వలె అల్లకల్లోలం అప్రశాంతత. శ్యామలమ్మకు సమీపించాడు.
‘‘వెళ్ళొస్తా అమ్మా!..’’ మెల్లగా చెప్పాడు.
శ్యామల అతని ముంఖలోకి చూచింది.
‘‘నాకు అంతా తెలుసు శంకర్!..’’
‘‘అమ్మా!..’’ ఆశ్చర్యంగా అన్నాడు శంకర్.
‘‘నిన్నరాత్రి నీ గదిలో గంగ నీతో మాట్లాడిన మాటలన్నీ నేను విన్నానయ్యా!.. వారు మీ ఇరువురి వివాహం జరిపించబోరు. గంగతీసుకొన్న నిర్ణయం సరైనది. నీమీద వున్నో భ్రమతో ఆ పిచ్చిది కట్టు బట్టలతో ఇల్లు వదిలిపోయింది. ఈ సంచిని దానికి ఇచ్చి అమ్మ ఇచ్చిందని చెప్పు. నా బిడ్డను జాగ్రత్తగా చూచుకో బాబు. జాగ్రత్తగా చూచుకో..’’ ఆమె కళ్ళల్లో కన్నీళ్లు.. గొంతు రోదనతో బొంగురుపోయింది.
శంకర్ మౌనంగా ఆమె అందించిన సంచిని అందుకొన్నాడు. ఆమె పాదాలను తాకి తన కళ్ళకు అద్దుకొన్నాడు.. ‘‘ఇందులో నా నేరము ఏమీ లేదు. అంతా గంగ..’’ శంకర్ పూర్తి చేయకమునుపే..
‘‘అవును.. ఆ విషయం నాకు తెలుసు బాబు. జాగ్రత్త. కాలగతిలో కొంత కాలం తరువాత కలుస్తామేమో!..’’ విచారంగా కన్నీరు తుడుచుకొంటూ అంది శ్యామల.
శంకర్ చేతులు జోడించి నమస్కరించి సంచిని చేతికి తీసికొని బయలుదేరాడు.
* * *
గంగ లేచింది.. ‘‘రెస్టురూంమ్ కు వెళ్ళాలి!..’’ అంది.
శంకర్ మదిలోని భూతకాల స్మృతులు చెదిరిపోయాయి. తన ఎడమ చేతిని గంగ కుడిచేతికి అందించాడు నవ్వుతూ.
ఇదేనేమో.. ప్రేమను చంపిన ప్రేమంటే?.. అనుకొన్నాడు..
సమాప్తి.
|
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
రచనా వ్యాసంగం: తొలి రచన ‘లోభికి మూట నష్టి’ విద్యార్థి దశలోనే రాశాను, అప్పట్లో మా పాఠశాల బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ నుండి ఈ శ్రవ్య నాటిక అన్ని తరగతులకు ప్రసారం చేశారు.
అందులోని మూడు పాత్రలను నేనే గొంతు మార్చి పోషించాను.
మా నాయనమ్మ చెప్పిన భారత భాగవత రామాయణ కథలు నన్ను రచనలకు పురికొల్పాయి.
Comments