top of page

పూజకు వేళాయెరా


'Pujaku Velayera' written by Muralidhara Sarma Pathi

రచన : పతి మురళీధర శర్మ

అది కార్తీకమాసం. శివపూజకు వేళాయెనంటూ భక్తులు తెల్లవారుజామునే శివాలయాలకు పరుగులు తీసే రోజులు. ముఖ్యంగా ఆదివారాల్లో పిక్నిక్ లతో సోమవారాల్లో శివుడికి అభిషేకాలతో ఊరంతా సందడిగా ఉండే సీజన్. అలాంటి సందడులతో నిమిత్తం లేకుండా దుప్పటి కప్పుకుని వెచ్చగా పడుకున్నాడు సుబ్బారావు తన ఇంట్లో. అప్పచెప్పిన పనిని నెరవేరుస్తున్న అలారం మ్రోత విని హడావిడిగా లేచింది అనూరాధ సుబ్బారావు శ్రీమతి.

" ఏమండీ " పిలిచింది భర్తని. ఊహు ఆ పిలుపు సుబ్బారావు చెవిన పడలేదు. ఈ సారి తట్టి పిలిచింది.

" ఊ " అంటూ అటు నుండి ఇటు వత్తిగిలేడు. కాని లేవలేదు. ఇంక లాభం లేదని కుదుపుతూ గట్టిగా అంది " ఏమండీ గుడికి వెళ్ళాలి లేవండీ " అని.

" ఇప్పుడేమి గుడికోయ్ సగం నిద్రలో " అన్నాడు సుబ్బారావు.

" శివాలయానికండీ. అప్పుడే 4 గం. అయింది. ఇప్పటినుండీ తయారయితే బయలుదేరి వెళ్లేసరికి 6 గం. అవుతుంది. కనీసం క్యూ మధ్యలోనైనా ఉంటాం."

" నువ్వెళ్ళి వచ్ఛేయవోయ్ " బధ్ధకంగా వళ్ళు విరుస్తూ అన్నాడు సుబ్బారావు.

బాగుంది వరస. జన్మానికో శివరాత్రి అన్నట్లు సంవత్సరానికో నెల " అంది అనూరాధ.

" ఆ నెలకో 4 వారాలు " అందించేడు సుబ్బారావు.

'అంటే తెలివి వచ్చిందన్నమాట' అనుకుంది అనూరాధ. " వారానికో రోజు అదీ సోమవారం శివదర్శనం చేసుకుంటే ఎంతో పుణ్యమండీ " నచ్చచెప్పింది భర్తకి.

" అర్ధాంగివి కదా నీకొచ్చిన పుణ్యంలో సగం నాది కాదంటావా? " బేరమాడేడు పతిదేవుడు.

" ఆ ఎక్కడైనా గాని పుణ్యపాపాలు మాత్రం ఎవరివి వారివే. " తేల్చి చెప్పేసింది భార్యామణి.

" అంతేనంటావా? " అన్నాడు సుబ్బారావు.

" అంతే. త్వరగా తయారవండి. " ఆర్డర్ వేసింది అనూరాధ.

" సరే పద. " అంటూ లేచేడు సుబ్బారావు. దంపతులిద్దరూ బయలుదేరి గుడిలో క్యూలో నిల్చున్నారు. మిగతా రోజుల్లో వెలవెలబోయే శివాలయం ఇప్పుడు విద్యుద్దీపాలతో కార్తీక దీపాలతో కళకళలాడుతుంది. గర్భగుడి భక్తులు మ్రోగించే గంటలతో, పఠించే స్త్రోత్రాలతో మారుమ్రోగిపోతుంది. వృధ్ధులు అనకపోయినా యవ్వనం దాటిన వాళ్లంతా శివనామ జపం చేస్తున్నారు బయటకు వినిపించేలా. ఇంతలో ఒక పెద్దమనిషి నేరుగా గర్భగుడిలోకి వెళ్లిపోతుండడం చూసిన సుబ్బారావు అతన్నిఆపి అక్కడున్నహోంగార్డ్ తో అన్నాడు " ఏంటండీ ఆయన క్యూలో రాకుండా అలా లోపలికి వెళ్లిపోతుంటే చూస్తూ ఊరుకుంటారేంటి? " అని.

" పైగా టిక్కెట్టు కూడా తీసుకోలేదు. " సుబ్బారావుకి సపోర్ట్ ఇచ్ఛేడు క్యూలో ఉన్న మరో ఆయన. " ఆయనకి టిక్కెట్టూ, క్యూనా? " అంటూ వేదాంతిలా ఓ నవ్వు నవ్వేడు ఆ హోమ్ గార్డ్.

" థాంక్యూ " అంటూ ఆ పెద్దమనిషి లోపలికి వెళ్ళిపోయేడు.

" ఏమండీ శివుడి దృష్టిలో అంతా సమానులే అంటారు మరి?" సందేహం వెలిబుచ్ఛేడు సుబ్బారావుకు సపోర్ట్ ఇఛ్చినాయన.

" అవునండీ. శివుడి దృష్టిలో సమానులే కాని వీళ్ళ దృష్టిలో మనకూ, ఆయనకూ తేడా " అనుమాన నివృత్తి చేసేడు సుబ్బారావు. క్యూ ముందుకు జరుగుతుంది. సుబ్బారావు ముందు నిల్చున్న ఆసామీ కదలలేదు.

" నడవండి. " వెనకనుండి ఒకరు అరుస్తున్నారు.

"ఆయన దృష్టి ఎటో ఉంటే క్యూ కదిలిన సంగతి ఆయనకు ఎలా తెలుస్తుంది చెప్పండి ? " ఎవరో సమర్థించేరు.

"క్యూలోనే ఉన్నాను. బయటకు వెళ్లి వచ్ఛే"నని దూరిపోయేవాళ్లొకరూ, "వీళ్లు మావాళ్లే" అని చోటిచ్చేవాళ్ళు ఇంకొకరూ ఇలా గొడవలతో క్యూ సాగుతుంది. ఎలాగైతేనేం సుబ్బారావు దంపతులు గర్భగుడిలో ప్రవేశించేరు. అక్కడ మరి క్యూ లేదు. ఆడా - మగా భేదం లేదు. సుబ్బారావుకు శివుడు కనబడడం లేదు. ముందున్నవాళ్ళ శిరస్సులు అడ్డొస్తున్నాయి. పోనీ నంది కొమ్ముల మధ్యనుండి శివుణ్ణి చూసినట్లు వాళ్ళ శిరస్సుల మధ్య నుండైనా శివుణ్ణి దర్శిద్దామని ప్రయత్నించేడు సుబ్బారావు. కాని తీర్థం ఇచ్ఛే పూజారి అడ్డు. ఆయన ఇచ్ఛే తీర్థం వెనుకనున్న భక్తుల చేతుల్లో కంటే ముందున్న వాళ్ళ నెత్తిన పడుతుంది. అంటే భక్తులు శివుడికి అభిషేకం చేయిస్తుంటే పూజారి భక్తులకు అభిషేకం చేస్తున్నట్టుంది. ఇంతలో మరో పూజారి శఠగోపం పట్టుకుని ఒక్కొక్కరినీ తొందర పెడుతున్నాడు. ఒకాయన దక్షిణ అక్కడున్న హుండీలో వేసేసేడు. పళ్లెంలో వేస్తాడనుకున్న పూజారి కోపంతో శఠగోపం ఆ ఆసామీ నెత్తిన మొట్టికాయ మొట్టినట్లు పెట్టేడు. అది చూసి సుబ్బారావు జేబులోనుండి చిల్లర తీసి దక్షిణ వేసేడు. అంతే. అది అందుకుని పూజారి వెళ్ళిపోయేడు. ఇంతలో అక్కడున్న హోమ్ గార్డ్ " పదండి పదండి. ఒక్కొక్కరూ ఇంతసేపు ఇక్కడ నిల్చుంటే అవతల క్యూ ఎలా కదుల్తుందనుకున్నారు? నడవండి." అంటూ త్రోసేస్తున్నాడు అందర్నీ. అందులో సుబ్బారావు ఒకడు. శివుడు కనబడకపోయినా శివుడికిచ్చిన హారతి కళ్ళకద్దుకుని బయటపడ్డాడు సుబ్బారావు. బయటకు వచ్ఛేక సుబ్బారావు శ్రీమతి అడిగింది " ఏమండీ దర్శనం బాగా అయిందా? " అని.

" ఓ శివదర్శనం కాలేదు కాని సత్యదర్శనం అయింది." అన్నాడు.

" అంటే? " అంది అనూరాధ.

" పద చెప్తాను." అంటూ బయటకు దారి తీసేడు సుబ్బారావు.

" ఆ గుడికి వచ్ఛేక కాస్సేపు కూచోకుండా వెళ్లకూడదట. మా బామ్మ చెప్పింది. " అంది అనూరాధ.

" మీ బామ్మగారు క్యూలో నిలబడి కాళ్ళు నొప్పి పెట్టి మరి నడవలేక అలా చెప్పి ఉంటారు. " రహస్యం బయట పెట్టినట్లు చెప్పేడు సుబ్బారావు.

" మీకన్నీ వేళాకోళాలే. " మూతి ముడిచింది ముద్దుగా. అది గుడి అని ఊరుకున్నాడు సుబ్బారావు. గుళ్లో కలిసిన కాస్సేపట్లోనే బాల్యమిత్రుల్లా కలిసిపోయిన ఓ ఇద్దరు ప్రౌఢ వనితలు సుబ్బారావు దంపతుల ప్రక్కనే కూచున్నారు.

అందులో ఒకావిడ రెండో ఆవిడ్ని అడుగుతుంది. " ఏమండీ మీరు ఈవేళ ఉపవాసమేనా? "

" ఆ కనీసం ఈ రోజన్నా ఉపవాసం లేకపోతె మన బ్రతుక్కి అర్థం ఏముందండీ? " బ్రతుకు విలువ తెలిసిన తత్వవేత్తలా అంది.

" అయితే కాఫీ, టీల లాంటివి కూడా త్రాగరా? " కుతూహలంగా అడిగిందావిడ.

" ఈ రోజుల్లో కాఫీ, టీ త్రాగకుండా ఉపవాసం ఎవరుంటున్నారు చెప్పండి?. దర్శనం ఎప్పటికవుతుందో అని కాస్త గొంతులో పోసుకునే వచ్చేను. ఇప్పుడీ దేవుడి ప్రసాదం ఉంది. సాయంకాలం ఎలాగూ భోజనం చేసేస్తాము కదా " ధీమాగా చెప్పింది.

" ఏమోయ్ శ్రీమతీ విన్నావా? తమరు కూడా ఈవేళ ఉపవాసమేనా? " అడిగేడు సుబ్బారావు.

" మరి? " ప్రశ్నించింది శ్రీమతి సీరియస్ గా

" అయితే రాత్రికి స్పెషల్ మీల్స్ అన్నమాట " అన్నాడు సంబరపడుతూ.

" అదేంటండీ అలా అంటారు? " అంది అనూరాధ.

" దాన్ని ఉపవాసం అనరు." నొక్కి చెప్పేడు సుబ్బారావు.

" మరేమంటారు? " అడిగింది తెలియనట్లుగా.

" ఉపాహారం అంటారు. అనూ నేనో సంగతి చెప్పనా? "

" చెప్పండి. శివాలయంలో కార్తీక పురాణం విన్న పుణ్యమైనా దక్కుతుంది." అంది.

" ఉపవాసం చేయడం వల్ల మన జీర్ణక్రియ చక్కబడుతుంది. ఆరోగ్యం కుదుటబడుతుంది. భగవంతుడి పేరుతొ మన చేసే ఉపవాసం భగవంతుడికి సేవ కాదు. మనకు ఆయన ప్రసాదించే ఆరోగ్యం."

ఉత్తమ శ్రోతలా శ్రధ్ధగా వింటుంది అనూరాధ.

" ఉపవాసం ఉండడంలో మరో ఉద్దేశం కూడా ఉంది. ఆకలి బాధ ఎలా ఉంటుందో అనుభవపూర్వకంగా తెలుస్తుంది. దేవుడి పేరు చెప్పి ఉపవాసం ఉండమంటే ఉండని వాళ్లు " ఉపవాసం ఆరోగ్యానికి మంచిది " అని ఏ శాస్త్రజ్ఞుడో లేక వైద్య నిపుణుడో స్టేట్ మెంట్ ఇఛ్చినట్లు పేపర్లో పడితే తప్పకుండా నమ్ముతారు. అలాగే శివరాత్రి నాడు జాగరణ చేయడం శివనామస్మరణ కోసం గాని నిద్ర రాకుండా ఉండడానికి వేరే మార్గాలు వెతుక్కోవడానికి కాదు. దప్పికతో ఉన్నవాడికి దాహం తీరిస్తే శివుడికి అభిషేకం చేసినట్లే. కడుపునిండా తిండి దొరికేవాడికి కాక ఆకలితో అలమటించేవాడికి పట్టెడన్నం పెడితే శివుడికి నైవేద్యం పెట్టినట్లే. నిజంగా శివుడే ఏ రూపంలోనో వఛ్చి మనం పెట్టిన నైవేద్యాన్ని తినేస్తే పెట్టేవాళ్ళు ఎంతమంది ఉంటారంటావ్? " సుబ్బారావు తన ధోరణిలో చెప్పుకుంటూ పోతున్నాడు. కాని చుట్టుప్రక్కలవాళ్ళు వింటున్నారన్న సంగతి గమనించలేదు. భార్య చేతిలో ఉన్న ప్రసాదంలో ఓ అరటిపండును అడుక్కునే ఓ ముసలమ్మ చేతిలోనూ, కొబ్బరి చెక్కను ఓ పిల్లాడి చేతిలోనూ పెట్టేడు. ఆ సమయంలో సుబ్బారావు అనూరాధకు గీతాచార్యుడిలా అనిపించేడు.

" ఏమండీ మీ గీతోపదేశం అయిందా? " అని అడిగింది.

" అయింది కానీ నువ్వు మాత్రం అర్జునిడిలా యుద్ధం ప్రారంభించకు " అన్నాడు.

" యుధ్ధానికి కాదు గాని ఇంట్లో పూజకు వేళయింది పదండి వెళదాం. " అంటూ లేచింది అనూరాధ.

( సమాప్తం )

( ఇది ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో " స్రవంతి " శీర్షికన తే. 24.12.1995 దీని ప్రసారితమైంది. "విశాలాక్షి" మాసపత్రిక సెప్టెంబర్ 2012 సంచికలోనూ, అమెరికా అంతర్జాల తెలుగు పత్రిక "వాస్తవం" లో తే.10.11.2016 దీని ప్రచురితమైంది. )

***శుభం***

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును. మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత పరిచయం : పేరు : పతి.మురళీధర శర్మ ఉద్యోగం : భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ లో సీనియర్ సబ్ డివిజనల్ ఇంజనీర్ గా 2008 లో పదవీ విరమణ స్వస్థలం/నివాసం : విశాఖపట్నం రచనావ్యాసంగం ప్రారంభం : టీ.వీ.కొందాం నాటికతో. అది తే.15.03.1987. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో ప్రసారితం. నా రచనలలోని వర్గాలు : కథలు, కథానికలు (చిన్న కథలు), బాలసాహిత్యం, కథలు, కవితలు, పద్యాలు, ఆధ్యాత్మిక విషయాలు, వ్యాసాలు , పదరంగం (పజిల్స్), హాస్యోక్తులు (జోకులు) నాటికలు (42), సూక్తిముక్తావళి, చింతన – ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో ప్రసారితం సమస్యాపూరణలు(126) : దూరదర్శన్ హైదరాబాద్, విజయవాడ కేంద్రాలలోనూ, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలోనూ ప్రసారితం “తప్పెవరిది” నాటిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ వారిచే చిత్రీకరించబడి సంచార రథంపై ప్రదర్శింపబడింది. నా రచనలు ప్రచురితమైన పత్రికలు దినపత్రికలు : ఆంధ్రభూమి,ఆంధ్రప్రభ,ఈనాడు వారపత్రికలు : ఉదయం,సుప్రభాతం,ఆబ్జెక్ట్ వన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లిమిటెడ్,హైదరాబాద్ పక్షపత్రికలు : అక్షర తపస్మాన్,జిల్లా సాక్షరతా సమితి,చిత్తూరు మాసపత్రికలు : బాలరంజని, చిత్ర, స్వప్న, విశాలాక్షి, సాహితీకిరణం, సాహిత్యప్రసూన, సృజన విశాఖ, ప్రజ-పద్యం, విశాఖ సంస్కృతి అంతర్జాలపత్రికలు : ప్రతిలిపి, వాస్తవం (అమెరికా), ఆఫ్ ప్రింట్, తెలుగువేదిక, ఆంధ్రసంఘం పూనా 75వ వార్షికోత్సవ సంచిక “మధురిమ” 2017 చిరు సన్మానాలు : 1. సాహితీ సమితి, తుని వారిచే 2.పరవస్తు పద్యపీఠం, విశాఖపట్నం వారిచే దూరదర్శన్ హైదరాబాదు కేంద్రంలో ప్రసారితమైన సమస్యాపూరణ, వర్ణనలకు ఉత్తమ పూరణ, ఉత్తమ వర్ణనలుగా ఎంపికై యువభారతి వారిచే పురస్కారాలు భావగీతి – భావగీతికల సుమవనం (ముఖపుస్తక సమూహం/ఫేస్ బుక్ గ్రూప్) వారిచే హేవళంబి నామ సంవత్సర ఉగాది సందర్భంగా నిర్వహించిన కవిత/పద్య/విశ్లేషణ పోటీలలో ఉత్తమ కవి/రచయితగా బహుమతులు, నగదు బహుమతి, ప్రశంసాపత్ర ప్రదానం “ధరిత్రి “ సాహితీ మిత్రుల సంగమం, మహబూబాబాద్ జిల్లా, తెలంగాణ వారిచే నిర్వహించబడిన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి కవితలు , కథల పోటీలలో ఒక కథకూ, ఒక కవితకూ ప్రశంసాపత్ర ప్రదానం 2015 లో సృజన విశాఖ,గరిమ సాహితీ సాంస్కృతిక సంస్థలు నిర్వహించిన శ్రీ మన్మధ ఉగాది కవి సమ్మేళనంలో జ్ఞాపిక బహూకరణ 2016 లో సృజన విశాఖ ఏడవ వార్షికోత్సవ ఆత్మీయ జ్ఞాపిక బహూకరణ తే.09.04.2017 దీని ప్రజ – పద్యం ( లోకాస్సమస్తా సుఖినోభవంతు ) ఫేస్ బుక్ సమూహం వారి సామాజిక పద్యాల పొటీలో ప్రత్యేక సంచికతో పాటు జ్ఞాపిక బహూకరణ వసుధ ఎన్విరో లేబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సౌజన్యంతో RGB Infotain ఉగాది 2017 సందర్భంగా నిర్వహించిన కథల పోటీలో “ ఒక్క క్షణం “ కథకు ద్వితీయ బహుమతి ( రు.8000/-) ప్రదానం

52 views0 comments
bottom of page