top of page

పుష్ప విలాపం

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.Youtube Video link

'Pushpa Vilapam' New Telugu Story(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)(కథ చదివి వినిపిస్తున్నది కే. లక్ష్మి శైలజ)

ఓ వేసవి సాయంత్రం.

కాస్త చల్లబడ్డాక రుక్మిణి గిన్నె పట్టుకుని మేడ మెట్లెక్కింది.

ఒక అంతస్తుని దాటి రెండో అంతస్తుకు దిగ్విజయంగా ఎగబాకిన ఆనందంలో మల్లెతీగ విరగ పూస్తోంది.


ఎన్నిపూలో..

ఇంతింత మొగ్గ..

విచ్చుకుంటే చిట్టి గులాబీ అంతుంటుంది.


రుక్మిణి ఒక్కొక్క కొమ్మా జాగ్రత్తగా ఒంచి మొగ్గల్ని తుంచి గిన్నెలో వేసింది.

గిన్నె సగానికి నిండింది. రుక్మిణి మనసులా సగం మాత్రమే.

మల్లె మొగ్గల్ని కోశాక ఆ వేళ్ళని వాసన చూసుకుంది రుక్మిణి.

'అబ్బ.. ఎంత మంచి సువాసన' అని తన్మయత్వంలో మునిగిపోయింది.


చెట్టు మొదట్లో మట్టిని కుళ్లగించి నీళ్లుపోసి, కూరగాయల పెచ్చులు, అరటిపండ్ల తొక్కలు వెయ్యడం వల్ల పూలు బలంగా పూశాయి.

గుబురుగా వచ్చిన చెట్టుని తృప్తిగా చూసుకుంది.

కిందకొచ్చి పూలన్నింటినీ పొదంగా మాల కట్టింది.


మూరకి కాస్త తక్కువ వచ్చినా దొడ్లో పూల విలువే వేరు. మాలవంక మురిపంగా చూస్తూ

"సౌమ్యా... "అని పిలిచింది.

సౌమ్య గది తలుపు మెల్లిగా తెరిచి

"ఉష్... "అని నోటిమీద వేలు పెట్టుకుని "ఏంటి?" అంది.


సారీ అన్నట్టు సైగచేసి పూలమాల చూపించింది కోడలు సౌమ్యకి.

"ఇప్పుడొద్దు.. తర్వాత. మీటింగ్ లో వున్నాను". అంది సౌమ్య.

"ఎంతసేపు?"

"పావుగంటలో అయిపోతుంది"


పావుగంట సేపు ఈ పూలు నీకోసం ఎదురుచూడాలా. పెట్టేసుకోవచ్చుగా.

జడ పాన్పుమీద హాయిగా సేదదీరుతాయి.

అవి ఊసులాడుకుని రాత్రికల్లా మనసు దాటని మాటల్ని సువాసనతో

తెలియజేస్తాయి.ఏం పిల్లల్లో ఏంటో. పూలు పెట్టుకోమంటే నీలుగుతారు. అని మెల్లిగా వెళ్లి బల్లమీద పెట్టి

"త్వరగా పెట్టుకో వాడిపోతాయ్. " అంది రుక్మిణి.

"సరే సరే, మీరు వెళ్ళండి" అంది. సాఫ్ట్వేర్ కోడలు సౌమ్య.


అరగంట గడిచాక రుక్మిణి గదిలోకి తొంగి చూసింది. మల్లెలు ఆ బల్లమీదే దుఃఖిస్తున్నట్టు కనబడ్డాయి.

కోడలు అర్జెంట్ ఆఫీస్ కాల్ లో ఉన్నట్టుంది.


కాసిని నీళ్లు తెచ్చి పూలమీద చిలకరించి మిగిలినవి కోడలికి ఇచ్చి తాగమని సైగచేసింది.

ఇప్పుడేం వద్దంది సౌమ్య.


నీళ్లు అక్కర్లేకపోతే సరే. ఆ పూలు ఎలా వాడి పోతున్నాయో చూడు.

అందామనుకుని ధైర్యం చాలక ఊరుకుంది రుక్మిణి.

ఏవిటో మనసు అశాంతిపాలైంది.

కోడలు పూలు పెట్టుకోకపోతే తనకేంటి?

ఏవిటీ అలజడి. అక్కర్లేని ఆలోచనలు.


రాత్రికి పెట్టుకుంటుందిలే. ఈ లోగా ఫ్రిజ్ లో పెడితే సరి. అనుకుని కోడలి గది తలుపులు మెల్లగా తోసింది.

"హేంటి" అంది సౌమ్య మెల్లగా.


"పూలు" అంది రుక్మిణి.

అదోలా చూసింది సౌమ్య.

పూలమాల తీసుకుని బయటకొచ్చి తలుపేసింది రుక్మిణి.


సువాసన ఇల్లంతా కమ్ముకుంది.

సొంతంగా పెంచుకున్న చెట్టు పూలు.

మరింతగా గుబాళిస్తున్నాయి.

ఏదో తెలియని మమకారం,ఆపేక్ష కలగలిసి

పూల మాలను గుండెకు హత్తుకుంది రుక్మిణి.

అసంకల్పితంగా కళ్లలోంచి నీళ్లొచ్చాయి.


'ఛీ ఇదేంటి పాడు, ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు'...

కళ్ళు తుడుచుకుని పూలమాలను డబ్బాలో పెట్టి ఫ్రిజ్ లో పెట్టింది.

హమ్మయ్య అవెక్కడ వాడిపోతాయో అని బెంగ.

అప్పటికి మనసు శాంతించింది.


కాసేపు మంచం మీద నడుం వాల్చింది.

ఆలోచిస్తుంటే తన జీవితం కలలా గడిచిపోయిందనిపించింది.

కళ్ళు మూసుకుంటే అసంతృప్తి తప్ప ఆనందం మచ్చుకైనా లేని తన గతం కనబడింది.


రుక్మిణికి చిన్నప్పటినుంచీ పూలంటే ప్రాణం.

చంద్రకాంత, ముళ్లగోరింట పూలతో సహా ఏదీ వదలకుండా తల్లో పెట్టుకునేది.

పున్నాగ పూల జడలు వేయించుకునేది.

మల్లె అంటు ఎక్కడో సంపాదించుకొచ్చింది రుక్మిణి.


పెరట్లో పాతింది అమ్మమ్మ.

రోజూ నీళ్లుపోస్తూ చెట్టుకి తాడుకట్టి సాగదీస్తూ వేసవికాలం పూసే మల్లెపూల

కోసం ఎదురుచూసింది రుక్మిణి.


ఆ ఏడు రుక్మిణి శ్రమ ఫలించి చెట్టంతా మొగ్గలు వేసింది.


"ఈ ఏడు మల్లెపూలు విరగ పూశాయి. రోజూ నువ్వు పెట్టుకుంటున్నావుగా.

ఇవాల్టి పూలు మోహన అత్తయ్య పెట్టుకుంటుంది. దానికి ఈరోజు పెళ్లి చూపులు కదా" అంది అమ్మమ్మ.


"లేదు నాక్కూడా కాసిని పూలివ్వు. నేనూ పెట్టుకుంటాను. "

అంది రుక్మిణి.


"ఇద్దరికీ సరిపోవు. ఇవాల్టివి వదిలేశావంటే రేపటి పూలతో నీకు పెద్ద పూలజడ వేస్తా.

రేపు సాయంత్రం పరికిణీ వేసుకో"అంది రుక్మిణి అమ్మమ్మ.


రేపటి పూలజడ కోసం నేటి పూలమాల త్యాగం చేయాలంటే బాధే.

కాదంటే అమ్మమ్మ కోప్పడుతుంది.


ఉసూరుమంటూ రాత్రంతా మల్లె పందిరి వంక చూస్తూ గడిపింది.

తెల్లారి సాయంత్రం ఎప్పుడవుతుందా అని ఎదురుచూస్తోంది.

ఎట్టకేలకు మధ్యాహ్నం అయింది.

ఎండ తగ్గిపోయింది.


"అమ్మమ్మా పూలు కోయనా?" అని అడిగింది గిన్నె పట్టుకుని గెంతుతూ.

అమ్మమ్మ పెరటివాకిలి కాస్త తెరిచి చూసి

"బయట ఎండ సూర్యకారంలా మిలమిల్లాడిపోతోంది. అప్పుడేకాదు. కాసేపు పడుకో. కాస్త చల్లబడనీ " అంది.


ఆలస్యం అమృతం విషం అంటే అమ్మమ్మ ఏమంటుందో అని ఊరుకుంది.

రుక్మిణి అనుకున్నంతా అయింది. ఓ దుర్వార్త.


రుక్మిణి తండ్రి పొలం పనికి వెళ్లినవాడు తిరిగిరాలేదు.

వడకొట్టి పడిపోయాడు. మనిషి ఇక మనకు లేడన్నారు వైద్యులు. ఇల్లంతా ఘొల్లుమన్నారు. ఊరికంతా పెద్ద మనిషి పోవడం వల్ల తండోపతండాలుగా పక్కఊళ్లనుంచి కూడా జనం చూడ్డానికి వచ్చారు. ఊరు మొత్తం విషాద ఛాయలు అలుముకున్నాయి. రుక్మిణి తల్లి ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయింది.


పదిరోజులూ ఒకే గదిలో దిగులుతో కుంగిపోయింది. మల్లె పందిరి నిండా మల్లెపూలు కోసేవారులేక రాలిపోతున్నాయని రుక్మిణి మనసు కొట్టుకుపోయింది.


అమ్మ పుట్టెడు దుఃఖంలో ఉంటే నీకు పూలు కావాల్సొచ్చాయా అని అమ్మమ్మ కేకలేసింది.


నాన్న పోయిన దుఃఖం తనకీ ఉంది. కానీ పూలు రాలి పోతున్నాయని జాలిగా ఉంది. ఓ పక్కన కూర్చుని ఏడుస్తుంటే పక్కింటి అరుంధతి వచ్చి పూలన్నీ కోసుకుపోతుంటే

రుక్మిణి మనసు బాధతో మూలిగింది.


ఆర్నెల్లదాకా రోజూ వచ్చి పరామర్శించే వాళ్లే.

తండ్రి పోయిన ఏడాదిలోపు ఆడపిల్ల పెళ్లి చేయాలని అందరూ పట్టుబట్టారు.

సంబంధం చూసారు. పక్కూరి త్రిమూర్తులుతో రుక్మిణికి పెళ్లి కుదిరింది.


రాత్రి ముహూర్తం

పగలు పెళ్లి కూతుర్ని చేశారు. ఆరు మూరల పూలమాల జడబారుగా చుట్టారు.

రుక్మిణి మనసు పూల పల్లకీ ఎక్కింది.

జడను సత్యభామలా తిప్పుకుంది.

పెళ్లికి పూలజడ వేశారు. తలపైన కిరీటంలా

కనకాంబరం పూల చెండ్లు పెట్టారు. అద్దంలో చూసుకుని ఆనందంతో మురిసిపోయింది.


మొదటిరాత్రిలో మంచానికి వేలాడదీసిన పూలని ఓ అద్భుతంలా చూసింది.


'పూలు ఒక పిచ్చి కాదు. ఒక అనుభూతి. ఒక అభిరుచి. ఆడపిల్లగా ఒక ఉనికి.

అందం తొణికిసలాడిన భావన.

సహజ లావణ్య ప్రకృతితో జతకట్టడం'

ఇలా ఎన్నో భావాలను భర్తతో పంచుకుంటూ పెళ్ళైన రెండు నెలలకే నెల తప్పింది రుక్మిణి.


ఆమెకి ఇష్టమైన మల్లెపూలు తెచ్చి రుక్మిణి చేతిలో పెట్టి బుగ్గలు పుణికి మురిపెంగా చూసాడు ఆమె భర్త.

"రోజూ ఇలాగే తెస్తాను. రోజుకో రకం పూలతో జడ వేయించుకో. అచ్చం నీలాగేవుండే ఆడపిల్లని కనివ్వాలి మరి. " అన్నాడు నవ్వుతూ.

సరేనంటూ పూలు అందుకోబోయింది.


"వాకిట్లోకి పట్టండి. గడ్డి తెచ్చి వేయండి, చాప తీసుకురండి, తులసినీళ్ళేవీ, త్వరగా" ఏవో మాటలు.

పూలు గదిలోనే వదిలేసి తలుపులు తీసుకుని బయటకు వచ్చారిద్దరూ.

రుక్మిణి మామగారు గతించారనే వార్త.పూలు నివ్వెరబోయి చూశాయి.

సంవత్సరీకాలలోపు రుక్మిణికి కొడుకుపుట్టాడు.

మరో నెలలో మామగారి సంవత్సరీకాలనగా

జరగరాని ఘోరం జరిగిపోయింది.

ట్రాక్టర్ బోల్తాపడి రుక్మిణి భర్త మరణించాడనే దుర్వార్త ఆమెను నిలువెల్లా కుదిపేసింది. ఆమె ఆశలను కాల్చేసింది.

*****

'ఏవండీ...' అని అరిచిన అరుపు రుక్మిణి గొంతు దాటి బయటకు రాలేదు.

తలగడ తడిసిపోయింది.

కొడుకుని చూసుకోకుండా వెళ్లిపోయిన భర్తని తలుచుకుని కుమిలిపోయింది.

ధైర్యంగా కొడుకుని పెంచి పెద్దచేసింది.

కొడుక్కి పెళ్లి చేసి కోడల్ని తెచ్చుకుందిగానీ

మనసులో తీరని వెలితి అట్లాగే ఉండిపోయింది.


రోజూ పూలు మాల కట్టి కోడలు సౌమ్య గదిలో పెట్టడం, అవి అలాగే వాడిపోవడం.

కోడలికి పూలంటే పెద్దగా ఆసక్తి లేదని తెలుసు.

కానీ పూలు కోయడం అవి మాల కట్టడం పెట్టుకుంటే ఎలా ఉంటుందో అని ఊహించుకోవడం రుక్మిణికి చాలా ఇష్టమైన అనుభూతి.


పోనీ ఎవరూ చూడకుండా ఒకసారి తనే తల్లో పెట్టేసుకుంటే..

ఆ ఊహే తప్పు కదా. దొంగతనంగా చేస్తే తనకేం నిండుతుంది. తనకన్నా చిన్నవాళ్ళకి తనేం చెప్పగలదు.


మొన్నటికి మొన్న గుళ్ళో ప్రవచనాలు వినేందుకు వెళ్లి కూర్చుంటే ఆవిడెవరో హఠాత్తుగా వచ్చి బొట్టు పెట్టి జాకీటుగుడ్డ పెట్టి వెళ్ళిపోయింది.

ముందు తత్తరపడినా వెంటనే బొట్టు చెరిపేసుకోలేదూ.

తనకేం పెద్ద ఆశలున్నాయని!


మహర్షిగారి భార్య నిండుగా పూలు పెట్టుకుని పెద్ద ముత్తైదువలా వచ్చినప్పుడు తన మనసు కాస్త కలవరపడ్డ మాట నిజం.

అది ఈర్ష్య కాదు గానీ ఏదో వెక్కిరింతగా అనిపించింది.


మహర్షిగారు మంచి మనిషి. పరిస్థితిని సరిగా అర్ధం చేసుకోగల వ్యక్తి. మంచి మాట తీరుతో ఎవరినైనా ఆకట్టుకోగలరు. తులశమ్మ అదృష్టవంతురాలు. పండు వయసులో ముత్తైదువలా తిరిగే అదృష్టం ఎంతమందికుంటుంది.


ఏవిటో అంతా విధి. అనుకుంటూ లేచి చూసేసరికి పొద్దుగూకిపోయింది.

సౌమ్య ఆ గది దాటి రాలేదు. పూల జోలికి పోలేదు.

ఒకరికి అక్కర్లేనివి ఇంకొకరికి ప్రత్యేకం ఏవిటో.

*********

"మహర్షి గారు వచ్చారు సౌమ్యా!ఇలా వచ్చి చూడు" అత్తగారి పిలుపుకు నెమ్మదిగా బయటకొచ్చింది సౌమ్య.

అప్పటికే రుక్మిణి ఇచ్చిన కాఫీ తాగుతున్న

మహర్షి కనిపించాడు.


షుగర్ వ్యాధి అసలెందుకొస్తుందో ఉపన్యాసం ఇస్తున్నాడు.

"మీది మంచి ఆరోగ్యం రుక్మిణి గారూ

పొద్దున్నే నానేసిన మెంతుల నీళ్లు తాగారంటేనా ఇక షుగర్ వ్యాధి ఆమడదూరం పారిపోతుంది"

ఆసక్తిగా వింటోంది రుక్మిణి.


"హలో అంకుల్" అనేసి లోపలికి వెళ్ళిపోయింది సౌమ్య.

కాసేపు మాట్లాడి వెళ్ళిపోయాడు మహర్షి.

"అయ్యో! మాటల్లో పడి వాళ్ళావిడని తీసుకురాలేదేమని అడగటం మర్చిపోయాను సౌమ్యా" అంది రుక్మిణి.

"మీ మధ్యలో ఆవిడెందుకు?" అని సౌమ్య చూసిన చూపుకు రుక్మిణి మనసు కలుక్కుమంది.


ఏమనాలో తెలీక తనగదిలోకి వెళ్ళిపోయింది.


యాభై ఏళ్ళ వయసులో నాకు దురుద్దేశ్యాలేం వుంటాయి. అవతలివాళ్ళు

హాయిగా మాట్లాడితే నేనూ మాట్లాడతాను. కానీ సౌమ్య ఎందుకలా చూసింది.

నాగురించి తప్పుగా అనుకుంటోందా? దేవుడా ఇదేం ఉపద్రవం వచ్చిపడింది.

ఈసారి మహర్షి గారు వస్తే మాట్లాడనే కూడదు.


"రుక్మిణిగారూ.. దొండకాయ పచ్చడి ఎలా చేయాలో చెబుతారా.. "అని వెనక్కి వచ్చాడు మహర్షి.


ఈ మహర్షి మళ్లీ వెనక్కి తిరిగొచ్చాడేంటి

గోరుచుట్టుమీద రోకలిపోటల్లే.. కోడలు తప్పు పట్టడానికి మరింత అవకాశం ఇచ్చినట్టవుతుంది

"నాకు తెలీదు మహర్షి గారూ. మీ ఆవిడని అడగండి. "

అంది తలుపు వెనకనుంచే.


మహర్షి ఏదో అనేలోపు తలుపులు మూసేసింది.

ఆయన వెళ్లిపోయినట్టున్నాడు. ఇప్పుడు కోడలి మొహం ఎలా చూసేది?

అయినా నేనేం తప్పు చెయ్యలేదు. నాకేం భయం.


"సౌమ్యా ఇవాళ ఏం వంట చేయను?" అంటూ కోడలి గదిలోకి వెళ్ళింది రుక్మిణి.

"వంట సంగతి సరే.. ఇలా వచ్చి కూర్చోండి" అంది సౌమ్య.

హమ్మ గాలి వాన రాదు కదా అని కూర్చుంది.

"మహర్షి గారిమీద మీ అభిప్రాయం?"

"ఇదేం గోల. ఆయనమీద నాకెందుకుంటుంది అభిప్రాయం?"

"ఊరికే చెప్పండి"


"మంచాయనే. వాళ్ళావిడ తులశమ్మ కూడా మంచిదే"

"మీకోవిషయం తెలుసా, తులశమ్మ గారు ఆయన భార్య కాదు. ఆయన చిన్ననాటి స్నేహితురాలు. వాళ్ళది తుని. అప్పుడప్పుడూ ఈయన్ని చూసిపోదామని

వస్తుంటుంది. "


"అవునా అయ్యోరామా.. మీ ఆవిడ అని అనేసానే. ఫీలయ్యారో ఏమో. నాకేం తెలుసు ఇద్దరూ కలిసొస్తేనూ" రుక్మిణి సమర్ధింపు పూర్తికాలేదు.

"ఆయనకి భార్యలేదు. ఒంటరివాడు. సహృదయులు. పదిమంది మేలు కోరేవారు.

మాట్లాడమంటే ఆయనతో మాట్లాడతాను"

"ఏమని?"


"మీ అబ్బాయితో కూడా అన్నాను. ఆయన అమ్మకి ఇష్టమైతేనాకభ్యంతరం లేదన్నారు"

"ఎందుకూ"

"మీ మనసులో ఏముందో చెప్పండి"


"ఏముంటుంది. ఈపూట ఏం వంట చేద్దామా అనుంటుంది"

"అదికాదు. మహర్షి గారంటే మీకిష్టమేనా?"

"నాకంటూ ఇష్టాలేం లేవు సౌమ్యా. ఈ జీవితంలో నాకున్న ఒకే ఒక ఆశ నీకు ఆడపిల్ల పుడితే దాన్ని అపురూపంగా పెంచాలని అంతే"


"ఇలా అంటున్నానని ఏమనుకోకండి.

మనసు చంపుకుని బతకడం మహాపాపం.

నిర్భయంగా చెప్పండి. మేం అర్ధం చేసుకుంటాం"


"నువ్వు నన్నర్ధం చేసుకుంది ఇదేనా సౌమ్యా" రుక్మిణి కళ్ళు తడిబారాయి.

"మరి మల్లెపూల కోసం ఆ ఆరాటం ఏమిటి

నేను గమనించలేదనుకున్నారా?"


రుక్మిణి లో దుఃఖం కట్ట తెగిన వాగైంది.

"నువ్వనుకునేది ఏదీ కాదు సౌమ్యా.

నాకు మల్లెపూలంటే ఇష్టం అంతే తప్ప ఏ వ్యామోహాలూ లేవు. " అనేసి

ఏడుస్తూ తన గదిలోకి వెళ్లిపోయిన అత్తగారివంక అయోమయంగా చూసింది సౌమ్య.


రాత్రి తన వర్క్ పూర్తయ్యాక అత్తగారి గదిలోకి వెళ్ళింది.

ఏడ్చి పడుకున్న రుక్మిణి మంచం మీద కూర్చుంది సౌమ్య.

కళ్ళు తెరిచి చూసింది రుక్మిణి.


"ఇతరుల మనసు అర్ధం చేసుకోవడం అంత తేలిక కాకపోవచ్చు. కానీ మనసు తేలిక చేసుకునే ఉపాయం మాత్రం చెప్పగలను. మనమధ్య ఈ టాపిక్ ఎందుకొచ్చిందో గానీ దీనికి పరిష్కారం వెతకాలనుకుంటున్నాను. అసలు మీ మనసులో ఉన్నదేమిటో స్పష్టంగా నాతో చెప్పండత్తయ్యా" సౌమ్య అనునయంగా ఆడిగేసరికి రుక్మిణి

మనసులో మాట బయటపెట్టింది.


చిన్నప్పటినుంచీ పూలమీద తనకున్న పిచ్చి గురించి, దానికి తనెలా దూరమైందో, అది తీరని కోరికగా ఎలా మిగిలిపోయిందో అంతా చెప్పుకొచ్చింది.


"అంతకుమించి నా మనసులో ఎలాంటి మలినం లేదు సౌమ్యా" అంది.


"మీది చిన్నపిల్లల మనసు అత్తయ్యా.

మీకు కావల్సినట్టు ఉంటేమాత్రం కాదనేవారెవరు చెప్పండి? మీరు రోజూ పూలు పెట్టుకోండి. నేనేమీ అనుకోను. అదేం తప్పుకాదు. చాలా మంది బొట్టు కాటుక గాజులు గొలుసులు అన్నీ ఉంచుకుంటున్నారు. కాలం మారింది.

అన్నీ మారిపోతున్నాయి. మీకెందుకు భయం"


"అరువు తెచ్చుకున్న తెగింపు ఎందుకూ కొరగాదు సౌమ్యా.

అవన్నీ ఒకెత్తు. కానీ పూలు అలా కాదు.

వాటిని వేరొకందుకు గుర్తుగా పరిగణిస్తారు.

నన్ననుమానిస్తారు. అంతెందుకు..

నేనూ వరాలు పిన్నీ కలిసి చెరువుకెళ్లి స్నానం చేస్తాం. నా తల్లో మల్లెపూలవాసన్ని అది కనిపెట్టేస్తుంది. దానివల్ల అవమానమే గానీ వొరిగేదేం లేదు. నువ్వెళ్ళి పడుకో సౌమ్యా. ఇది ఇక్కడితో వదిలై. "అంది.


సౌమ్య తన గదిలోకి వెళ్ళిపోయింది.

రెండ్రోజుల ముభావాల తర్వాత సౌమ్య వచ్చి

"బట్టలు సర్దుకోండి అత్తయ్యా" అంది.

"ఎందుకూ?"


"మీకు గోవాలో తెలిసిన ఎవరన్నా వున్నారా?"

"లేరు' ఏం?"

"గోవాకి టికెట్స్ బుక్ చేసాను. సరదాగా నాలుగురోజుల వెళ్ళొద్దాం. ఈ చికాకులన్నీ పోతాయి "అంది.


అదీ నిజమే. సమస్య నుంచి కాస్త దూరం జరిగితే అదీ చిన్నగా కనబడుతుంది.

మొన్న జరిగిన డిస్కషన్ ని పూర్తిగా మర్చిపోవాలంటే కొన్నాళ్ళు దూరంగా వెళ్లి తిరిగొస్తే కొత్త ఉత్సాహం వస్తుంది. అని సరే అంది రుక్మిణి.

టూ నైట్స్ త్రీ డేస్ ప్లైట్ లో ప్రయాణం. రుక్మిణిలో

ఉత్సాహం ఉరకలేసింది.


"మరీ ముసలి వయసు రాకముందే అన్నీ చూసేయ్యాలి సౌమ్యా. ఆ అర్వాత మోకాళ్ల సలుపులు, బీ పీలు సుగర్ల పీడ" అంది.

సౌమ్య నవ్వింది.

గెస్ట్ హౌస్ లో దిగాక బాత్ రూమ్ కి వెళ్లి స్నానం చేసొచ్చింది రుక్మిణి.

చీర తీసుకుందామని బ్యాగ్ కోసం చూస్తే అది కనపడలేదు.


" సౌమ్యా నా బ్యాగ్ చూశావా?

ఇక్కడే పెట్టాను"

అంది కంగారుగా

" బట్టలకోసమేగా ఈ బట్టలు వేసుకోండి. " అంది సౌమ్య తాపీగా.

"ఇవా? ఎవరిదో చూడిదార్ కదా. ఇది నాకెందుకు? నా చీరేది? "


"చీరలు మనింట్లో కూడా కట్టుకోవచ్చు.

ఈ డ్రెస్ వేసుకోండి. ఇక్కడ ఏం వేసుకున్నా మనల్ని ఆడిగేవాళ్ళు వుండరు కానీండి. మనం అన్నీ చూడాలి. "అంటూ తొందర చేసింది సౌమ్య.


మొహమాట పడుతూనే పంజాబీ డ్రెస్ వేసుకుంది రుక్మిణి.

"వావ్.. ! మీరు ఈ డ్రెస్ లో ఎంత బాగున్నారో.

సగానికి సగం వయసు తగ్గినట్టున్నారు. "అంది సౌమ్య మెచ్చుకుంటూ.


సిగ్గు పడుతూ చున్నీ సర్దుకుంది రుక్మిణి.

బ్యాగ్ లోంచి మల్లె పూలమాల తీసిచ్చింది సౌమ్య.

ఇవేంటి అని కంగారుగా అడిగింది రుక్మిణి.


"మనల్ని చూసి తీర్పులు చెప్పేవాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు. ఆడవాళ్ల ప్రతి చిన్న కోరుకనూ శృంగార వాంఛలకు ముడిపెట్టి చూసే సమాజం నుంచి చాలా దూరంగా వచ్చేశాం.


స్త్రీల మనసులోని భావం ఎవరికీ అర్థం కాదు. అర్ధం చేసుకోవాలంటే కనిపించే కళ్ళను కాకుండా ఎంతో లోతైన మనసుని చూడాల్సివుంటుంది. అంత తీరిక ఓపిక ఎవరికుంటాయి? అందుకే మన భావాలను గౌరవించుకునే సందర్భాన్ని మనమే సృష్టించుకోవాలి.


మీచిరకాల కోరిక తీర్చుకోండి. ఏం తప్పులేదు" అని పూలమాల రుక్మిణి జడలో తురిమింది సౌమ్య.


మల్లెపూల మాల. తెల్లగా నవ్వుతూ రుక్మిణి తలలోకి చేరింది.

అది ఎన్నాళ్ల తన నిరీక్షణ? కోరిక అతి చిన్నదే అయినా తీరే వరకూ తరుముతూవుండే వేదన.


ఆస్తులు కావు, అంతస్తులు కావు.

సొమ్ములు సోకులూ కాదు.

మెత్తని మల్లెపూలను మనసారా హత్తుకుని

తలలో తురుముకునే అతి సహజమైన స్త్రీ కోరిక. ఈజన్మలో శాశ్వతంగా దూరమైపోయింది మళ్లీ పొందేసరికి

కళ్ళు చెమరించాయి.


పుష్ప విలాపాన్ని అర్ధం చేసుకున్న కోడలు సౌమ్యని ఆనందంగా ఆలింగనం చేసుకుంది రుక్మిణి.

*** *** ***

గొర్తి వాణిశ్రీనివాస్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసంమాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం : గొర్తి వాణిశ్రీనివాస్(గృహిణి)

నా పేరు గొర్తివాణి

మావారు గొర్తి శ్రీనివాస్

మాది విశాఖపట్నం

నాకు ఇద్దరు పిల్లలు

కుమార్తె శ్రీలలిత ఇంగ్లండ్ లో మాస్టర్స్ చేస్తోంది

అబ్బాయి ఇంజనీరింగ్ చదువుతున్నాడు.

రచనల మీద ఎంతో మక్కువతో

కవితలు, కథలు రాస్తున్నాను.

విశాలాక్షి, సాహితీకిరణం, సాహో,సహరి,విశాఖ సంస్కృతి,సంచిక,

ప్రస్థానం, కథా మంజరి, హస్యానందం, నెచ్చెలి, ధర్మశాస్త్రం, ఈనాడు,షార్ వాణి తెలుగుతల్లి కెనడా, భిలాయి వాణి, రంజని కుందుర్తి  వంటి  ప్రముఖ   సంస్థలు నిర్వహించిన పలు పోటీలలో బహుమతి అందుకోవడం ఒకెత్తైతే మన తెలుగు కథలు. కామ్ వారి వారం వారం కథల పోటీలలో బహుమతులు అందుకోవడంతోపాటు

ఉత్తమ రచయిత్రి ఎంపిక కాబడి రవీంద్రభారతి వేదికగా పురస్కారం దక్కడం నా రచనా ప్రస్థానంలో ఒక మైలురాయిగా నిలిచింది.


మానవ సంబంధాల నేపథ్యంలో మరిన్ని మంచి రచనలు చేసి సామాజిక విలువలు చాటాలని నా ఈ చిన్ని ప్రయత్నం. మీ అందరి ఆశీర్వాదాలను కోరుకుంటూ

గొర్తివాణిశ్రీనివాస్

విశాఖపట్నం

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.
90 views3 comments

3 Comments


Ram Ravali Creations • 3 hours ago (edited)

కథ కథనం వాచకం అన్నీ బాగున్నాయి. అభినందనలిద్దరికీ...రామ్

Like

vani gorthy • 4 hours ago

కె లక్ష్మీ శైలజ గారి గళం ఈ కథకి చక్కగా సరిపోయింది. చాలా బాగా చదివారు.నా కథా పాత్రకు ప్రాణం పోశారు.. థాంక్యూ మేడం

Like


Srinivas Bhagavathula • 6 hours ago వాణీగారూ పూలగురించి.... సున్నితమైన ఆడవారిగురించి చాలా చక్కగా వ్రాసారు వాణీగారూ అభినందనలు అండీ.... భాగవతుల భారతి ఖమ్మం

Like
bottom of page