top of page

ఆర్.ఆర్.ఆర్(ముగ్గురు స్నేహితులు).



RRR(Mugguru Snehithulu) written by Kanuma Ellareddy

రచన : కనుమ ఎల్లారెడ్డి

రంగ,రాజు, రాము ముగ్గురూ మంచి మిత్రులు. ఒక్కొక్కరు ఒక్కో చోట స్థిరపడి పోయారు.బాల్యంలో ముగ్గురూ ప్రాథమిక విద్య నుండి, డిగ్రీ వరకు కలసి చదువుకున్నారు.రంగ,రాజులకు డిగ్రీ అయి పోగానే ప్రభుత్వ ఉద్యోగాలలో స్థిరపడ్డారు. రాము పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి ఓ ప్రైవేట్ కాలేజీ లో లెక్చరర్ గా పని చేస్తున్నాడు. రంగ నెల్లూరులోను,రాజు విశాఖపట్నం లోను ,రాము అనంతపురం లోను ఉన్నారు. ముగ్గురూ ప్రతిరోజు ఫోన్లో సంభాషించుకుంటూ, ఒకరి బాగోగులు మరొకరు చెప్పుకునేవారు. ముగ్గురి మధ్య ఎటువంటి కల్మషం ఉండేదికాదు. రంగ ఇల్లు కట్టుకుంటుంటే బ్యాంక్ లోన్ అలస్యమైనప్పుడు రాజు,రాము సహాయం చేశారు. అలాగే రాజు విషయంలో కూడా రంగ,రాము సహాయం చేశారు. రంగ,రాజు లకు సొంత గృహాలు చూడ చక్కగా ఉన్నాయి. ఇద్దరి గృహ ప్రవేశాలకు వెళ్ళాడు రాము. సొంత గృహంలేనిది రాముకొక్కనికే, అదే అన్నారు ఇద్దరు. "రేయ్ రాము నువ్వు త్వరలో ఓ సొంత ఇల్లు కట్టుకోరా"అన్నారు ఇద్దరు. దానికి రాము నిట్టూర్చి "మీకు ఉంటే నాకున్నట్లేరా! మీవి ప్రభుత్వ ఉద్యోగాలు, నాది ప్రైవేట్ ఉద్యోగం మీతో నేను ఎలా సరి తూగగలనురా!"అన్నాడు. ఆ మాటకు రంగ "అదే వద్దురా కష్ట కాలంలో ఇంటికి లక్ష రూపాయలు ఇచ్చావు",అంటే రాజు కూడా "నా క్కూడ సహాయం చేశాడు"అన్నాడు. రంగ ఆ మాట విని "చూడు రాజు నీది చిన్న ఉద్యోగం అయినా పొదుపుగా సంసారం చేస్తున్న మా చెల్లెమ్మ ను మెచ్చు కోవాలి"అన్నాడు. "నీకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు డబ్బు అడుగు ఇస్తాం"అన్నారు ఇద్దరు. ఆ మాటకు రాము కళ్ళు చెమర్చాయి. "నేను చేసిన సహాయం ఎంత లేరా!మీకు సొంత ఇళ్ళు ఉన్నాయి అదే చాలు నాకు” అన్నాడు. "మీకు కాదురా మనకు "అన్నాడు రాజు. ఆ మాటకు ముగ్గురూ నవ్వుకున్నారు.

*** *** ***

ఉదయాన్నే లేవడం రాముకు అలవాటు. లేవగానే స్నానం చేసి ,ప్రార్థన చేసుకుని పనులకు ఉపక్రమించేవాడు.అప్పుడే రాధ కాఫీ తీసుకుని వచ్చింది."ఏమండీ"అంది. "ఏమిటి చెప్పు"అన్నాడు. "ఈసారి ఉగాదికి మా అన్నయ్య ఊరు వెళ్దాం..." అంటుడగానే రాము సెల్ రింగయింది. "హలో రంగా "అన్నాడు రాము. "బాగున్నావా! చెల్లాయి ఎలా ఉంది, ఈసారి ఉగాదికి నేను రాజు మా ఫ్యామిలి తో మీ ఊరు వస్తున్నాం రా"అన్నాడు. ఆ మాటకు "అలాగే చాలా సంతోషం రా, ఎప్పుడు వస్తున్నారేమిటి" అన్నాడు. "రేపే"అన్నాడు రంగ. ఆ మాటకు ఆనంద పడిపోయాడు రాము. భార్య వైపు చూసి "ఉగాదికి నా సొంత ప్రాణ మిత్రులు వస్తున్నారోయ్" అన్నాడు కాఫీ తాగుతూ. ఆ మాటకు రాధ "నేను మా అన్నయ్య వాళ్ళ ఊరికి పోవాలనుకున్నా కానీ మా అన్నయ్య లే వస్తున్నారన్నమాట" అంది. రాము హడావుడిగా "మార్కెట్ వెళ్దాం పదవోయ్" అన్నాడు. ఇద్దరూ మార్కెట్ కు వెళ్ళి, అక్కడ నుంచి ఓ బట్టల దుకాణము కు వెళ్ళి, మిత్రులకు బట్టలు వారి భార్యలకు చీరెలు తెచ్చారు. "రాక రాక పండుగకు వస్తున్నారు నా ప్రాణమిత్రులు ఆ పాటి మర్యాద చేయాలిగా" అన్నాడు రాము ఇంటికి వస్తూనే.

"మీ మాట నేనెప్పుడు కాదన్నాను మీ ఆనందమే నా ఆనందం " అంది రాధ.

"అవునవును నా మాటకు ఆనందపడటం, అటువంటి భార్య నాకు దొరకడం నా అదృష్టం" అన్నాడు. "చాలు,చాలు మీ పొగడ్తలు" అంది రాధ. "వాళ్ళు వచ్చేటప్పటికి మధ్యాహ్నం అవుతుంది భోజనం సిద్ధం చేయి ఈ లోగా నేను కాలేజీ కి వెళ్ళి వస్తాను" అన్నాడు. రాము సివిక్స్ లెక్చరర్. కొన్ని ఏండ్ల నుంచి ఆ కళాశాలలో నిజాయితీగా, నమ్మకంగా పని చేస్తున్నాడు. ఆ కాలేజీ ఆ మాత్రం అభివృద్ధి చెందింది అంటే అది రాము చలువే. కాలేజీ కి వచ్చే పేరెంట్స్ తో చక్కగా మాట్లాడి ఫీజులు తగ్గించి ఎలాగో మేనేజ్ చేసేవాడు. మరీ బీద విద్యార్థులు అయితే యజమానికి చెప్పినా వినకుంటే తనకొచ్చే జీతం తో వారి ఫీజులు కూడా చెల్లించిన సందర్భాలున్నాయి. రాము వెళ్ళేసరికి ప్రిన్సిపాల్ ఇంకా రాలేదు. అటెండర్ వెంకటయ్య రాము ను చూసి "సర్ నమస్కారం, ప్రిన్సిపాల్ సర్ కొంచెంసేపటిలో వస్తారు కూర్చోండి" అన్నాడు. మంచి నీళ్ళు అందించాడు రాముకు. వెంకటయ్య కూడా రాము మాదిరే ఆ కాలేజీ లో ఎన్నో ఏళ్ళు నుంచి పనిచేస్తున్నారు. అయినా అర, కొర జీతమే . "ఏంటి వెంకటయ్య విశేషాలు" అడిగాడు రాము. "ఆ ఏముంది సర్ ఉగాదికి ఇంకా జీతాలు ఇవ్వలేదు . పండగ రేపే. ఏమి తినేది చెప్పండి. సరిగ్గా ఈ సమయానికే నా భార్య నిండు గర్భిణీ రేపో మాపో కాన్పు అవుతుంది "అన్నాడు. ఆ మాటకు రాము "సార్ ను డబ్బు అడగకపోయావా !"అన్నాడు. "మీకు తెలియనిది ఏముంది సార్ ఆయన ఉన్నా ఇవ్వడు. వాళ్ళ మనవడు పుట్టినరోజు ఉగాది నాడే. అందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. డబ్బు అడిగితే ఇవ్వలేదు. ఇస్తాను అంటూ కాలం వెలిబుచ్చుతున్నాడు. ఆ జూవాలజీ లెక్చరర్ అడిగి..అడిగి చాలించుకున్నాడు" అన్నాడు. "అదేమిటి నెల..నెల జీతాలు ఇచ్చే వాడు ఈ సారి ఏమయింది"అన్నాడు. "మనవడి పుట్టినరోజుకు భారీగా ఏర్పాట్లు చేశాను, అందుకు ఈ నెల జీతాలు ఆలస్యం అవుతాయని అంటూఉంటే విన్నా సార్" అన్నాడు వెంకటయ్య. రాము ఆలోచన లో పడ్డాడు.ఈ నెల జీతాలు రాకపోతే ఎలాగా అనుకుని వెంకటయ్య వైపు చూశాడు. పాపం ఇచ్చేది మూడు వేలు అదికూడా పెండింగ్ అనుకుని "వెంకటయ్య !ఇదిగో ఈ ఐదు వందలు ఉంచు" అన్నాడు. "సార్"అన్నాడు వెంకటయ్య. "తీసుకో వెంకటయ్య ఫర్వాలేదు లే" అన్నాడు. ఆ డబ్బు తీసుకుని జేబులో పెట్టుకున్నాడు వెంకటయ్య. అప్పుడే వచ్చాడు ప్రిన్సిపల్ భుజంగరావు. డోర్ తెరచి వినయంగా నిలుచున్నాడు వెంకటయ్య. "నమస్తే సార్"అన్నాడు రాము పైకి లేచి. "ఆ రాము సర్ మీతో ఓ విషయం మాట్లాడాలి రండి "అంటూ తన గదిలోకి ఆహ్వానించాడు ."వెంకటయ్య! టీ తీసుకురా"అని పంపించాడు. భుజంగరావు టై సారి చేసుకుని "మిస్టర్ రాజు ఈ నెలలో ఉగాది పండుగ ఉంది అందుకని......"ఆగాడు. "ఆ అందుకని చెప్పండి"అన్నాడు రాము. "ఈనెలలో ఎవరికీ జీతాలు లేవయ్యా"అన్నాడు. "సార్ మీరు ఇచ్చేది పది నెలలు, అదీగాక ఈనెలలో ఉగాది ఉంది. స్టాఫ్ అంతా జీతాల కోసం ఎదురు చూస్తున్నారు సార్ "అన్నాడు. "అది కాదయ్యా! ఈనెలలో ఉగాది ఉంది సరే, పైగా ఆరోజు మా మనవడి పుట్టిన రోజు ఉంది .లేక లేక పుట్టాడు. వాడి పుట్టినరోజు ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నా. అందుకని మన స్టాఫ్ అందరికీ నో శాలరీస్" అని చెబుతూ "అన్నట్లు రేపు ఫంక్షన్ హల్ లో పార్టీ , మన స్టాఫ్ అందరినీ రమ్మని చెప్పు. అందరిని తీసుకు వచ్చే బాధ్యత నీదే " అన్నాడు.

"సార్ ఓ విషయం, మనవడి పుట్టిన రోజు సందర్బంగా జీతాలు ఇవ్వండి సార్ స్టాఫ్ సంతోషిస్తుంది "అన్నాడు.


"లేదు రామూ, ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. నువ్వు అయితే అర్థం చేసుకుంటావని నీతో చెబుతున్నా" అన్నాడు భుజం మీద చేయి వేసి.

అప్పుడే వెంకటయ్య టీ తీసుకు వచ్చాడు. "వస్తాను సార్ "అన్నాడు రాము భారంగా. "టీ తాగి వెళ్ళు"అన్నాడు. "వద్దు సర్ "అని వెళ్ళాడు .


మధ్యాహ్నంకు రంగ,రాజు ఇద్దరూ కుటుంబాలతో రాము ఇంటికి వచ్చారు. గుప్పుమని ఘాటుగా, ఘుమ ఘుమ లతో ముక్కు పుటాలు అదిరాయి. నవ్వుతూ వారిని ఆహ్వానించింది రాధ. "ప్రయాణము బాగా సాగిందా. రండి ప్రయాణము బడలిక ఉంటుంది స్నానం చేద్దురుగాని" అంది. "వద్దమ్మా! అన్నారు రంగ, రాజు."మీరు చేయండి "అన్నారు వారి భార్యల వంక చూసి. రాధ నవ్వుతూ "రండి నీరజ, సావిత్రి మీరు చేద్దురుగాని "అంది.

"రాముకు ఫోన్ చేయమ్మా అనగానే , వాకిట్లో ఉన్నాడు రాము నవ్వుతూ.

"నూరేళ్లు రా నీకు. ఇప్పుడే చెల్లాయి తో చెబుతున్నా "అన్నాడు రంగ. 'ఎంత సేపు అయింది వచ్చి "అన్నాడు రాము. "జస్ట్ ఇప్పుడే రా" అన్నాడు రాజు. ఈలోగా స్నానం చేసి వచ్చారు నీరజ,సావిత్రి. "రండి అన్నయ్యా భోజనానికి "అంది రాధ. అందరూ కులాసాగా భోజనం చేస్తుండగా ,జోక్స్ వేస్తున్నారు రంగ,రాజు. దానికి నవ్వుతున్నాడు రాము. మరో ప్రక్క టీవీలో ఏవో సీరియల్స్ వస్తుంటే ముద్ద మింగుతూ చూస్తున్నారు రాధ,నీరజ,సావిత్రి. ఇంతలో ఓ బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. "కరోనాాా విదేశాలలో విజృంభణ, ముందు జాగ్రత్తగా భారత్ లో చర్యలు, రేపటి నుండి 14 రోజులవరకు లాక్ డౌన్ అనే వార్త అందరిని షాక్ గురిచేసింది. "పండుగ అంతేరా "అన్నాడు రాము నిట్టూర్చి. "14 రోజులు ఎలా రా !"అన్నారు రంగ, రాజు.

"ఏముంది రా మా ఇంటిలోనే ఉండటం ,ఇక మీరు ఇక్కడే బందీ"అన్నాడు రాము. "అది సరేరా!వీళ్లిద్దరూ ఇప్పుడు ...నీరజ,సావిత్రి వంక చూశాడు రంగ.

"ఏముందీ కాన్పు ఇక్కడే జరుగుతుంది, ఇక్కడ ఆసుపత్రులు లేవా ఏమిటి" అంది రాధ నవ్వుతూ. దానికి "నీకు శ్రమ రాధా "అన్నారు నీరజ,సావిత్రి. 'అదేంటి వదినా అలా అంటారు ఇటువంటి సమయంలో మనం ఒకరికొకరం సహకరించుకోవాలి" అంది రాధ. "14రోజులు"అనుకున్నారు రంగ,రాజు.

"మీరేమి చింత చేయకండి ఈ 14 రోజులు మనమందరం సంతోషంగా, హాయిగా గడిపేద్దాము"అన్నాడు రాము .అప్పుడే రాము సెల్ మోగింది. "చెప్పు వెంకటయ్య"అన్నాడు రాము.

" రేపు ప్రిన్సిపాల్ మనవడి బర్త్ డే పార్టీ రద్దయింది"అన్నాడు."ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఏర్పాట్లు చేసుకున్న, డబ్బంతా పోయింది అని నాతో చెప్పాడు సార్"అన్నాడు.

"అది సరే వెంకటయ్య జీతాల సంగతి ఏమైనా చెప్పాడా!"అన్నాడు ."మీకుతెలియనిది ఏముంది సార్ ,ఇంకెక్కడి జీతాలు ,ఈ కరోనాాా వలన ఇంకేం ఇస్తాడు, ఏమి తినేది "అన్నాడు.

"సరే వెంకటయ్యా రేపు ఉగాది కదా!నువ్వు నీ భార్య భోజనానికి రండి" ఆహ్వానించాడు రాము. "వద్దు సార్ "అన్నాడు.

"రావయ్యా ఉగాది రోజున పిలుస్తున్నా. ఆవిడ ఎక్కడ చేస్తుంది. పైగా గర్భిణీ కాదనక వచ్చేయి" అన్నాడు. 'సరే సార్" అని ఫోన్ పెట్టేశాడు .


కరోనాాా వలన ఉగాది అంతా చప్పగా ఉంది. ప్రక్క ఇల్లు మోహన్ మామిడి ఆకులు కడుతుంటే మిగిలినవి రాము కు ఇచ్చాడు. రంగ,రాజు మామిడి తోరణాలు కట్టారు.వంట పనిలో ఉంది రాధ. రాధకు సహాయపడుతున్నారు నీరజ, సావిత్రి. "మీరు విశ్రాంతి తీసుకోండి నేను చేస్తానుగా " అంది రాధ. ఆ మాటకు వాళ్ళిద్దరూ బెడ్ రూంలో కి వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నారు. అందరికి రాధ ఒక్కటే వంటలు సిద్ధం చేసింది. హాలులో సరదాగా పేకాట ఆడుకుంటున్నారు ముగ్గురు మిత్రులు."వంట సిద్ధమా!" కేక పెట్టాడు రాము. పని వత్తిడిలో ఆ మాట వినలేదు రాధ.

"మిమ్మలనే రాధా రాణి గారు" మళ్ళీ పిలిచాడు గట్టిగా. "ఆ..ఆ..సిద్ధమండి. ఒక్క పది నిముషాలు వడియాలు వేస్తున్నా"అంది. ఈ లోగా వెంకటయ్య కూడా వచ్చాడు. "నమస్తే సార్” అన్నాడు వెంకటయ్య. "రా వెంకటయ్య" అంటూ ఆహ్వానించాడు రాము. "అన్నయ్య గారు,నీరజ,సావిత్రి రండి భోజనానికి "అంది రాధ. వెంకటయ్య భార్య నిర్మలను చూసి "రా నిర్మల ,ఆరోగ్యం బాగుందా!"అంది. "బాగుంది అమ్మ" అంది నిర్మల. అందరూ హాలు లోకి వచ్చారు.


"చాలా బాగా చేశారు చెల్లాయి పప్పు"మెచ్చుకున్నాడు రంగ. అందరూ సుష్టుగా భోజనం చేశారు. రోజులు గడుస్తున్నాయి.వారికి ఏ లోటు రాకుండా చూసుకుంటున్నాడు రాము. పైగా వాళ్ళ భార్యలు గర్భవతులు. రాధ కూడా ఓపికగా ప్రతి రోజు ఒక్కో టిఫిన్ చేస్తూ ఏది తక్కువ కాకుండా చూసుకుంటూవుంది. టిఫిన్,భోజనపు ఖర్చు ఎక్కువయింది.పైగా రాముకు కాలేజీ లో జీతాలు లేవు. బ్యాంక్ లో దాచుకున్న డబ్బు రోజు.. రోజు డ్రా చేస్తున్నాడు. కరోనాాా వలన మిత్రులు కుటుంబాలతో తన ఇంటిలో ఉండటం వలన ఖర్చు అధికమైంది. పైగా లాక్ డౌన్ పొడిగింపు అనే వార్త వచ్చింది. ఆ వార్త వినగానే అదిరిపడ్డారు రంగ,రాజు. "ఇంకెన్నాళ్లు రా ఇది "అనుకున్నారు. అప్పుడే రాము వచ్చి "మీకు మా ఇల్లే శరణ్యం,ఏమి ఇబ్బంది లేదు,నీరజ, సావిత్రి గార్లకు కూడా ఇబ్బంది లేదు. ఇక్కడ నాకు తెలిసిన లేడీ డాక్టరమ్మ అనురాధ ఉన్నారు ఏమైనా సమస్య వస్తే వెళదాం"అన్నాడు రాము. కృతజ్ఞతగా అతనివైపు చూశారు ఇద్దరూ.

ఉదయం ఐదు గంటలకే రాము డాబా పై వాకింగ్ చేస్తున్నాడు.ప్రక్కన రాధ కూడా ఉంది."అన్నయ్యలు లేవ లేదా "అంది.

"నిద్రపోతున్నారు"అన్నాడు.

"ఏమండీ మీతో ఓ మాట "అంది రాధ.అప్పుడే ఉక్కపోతగా ఉందని రంగ,రాజు డాబా పై కి వస్తుంటే ఆ మాటలు వింటూ వెనక్కి తగ్గారు.

"మీకు జీతాలు లేవు.డబ్బు ఎలా చేస్తున్నారండి? రోజు కూరగాయలు వగైరా. దాచుకున్న రెండు లక్షలు వాళ్ళకే సహాయం చేశారు. నీరజ,సావిత్రి ఇక్కడే ప్రసవించేటట్లు ఉన్నారు. మన దగ్గరకు వచ్చారు కాబట్టి మనం వారికి ఏ లోటు చేయకూడదు. మీ దగ్గర ఏమున్నాయో ఏమో ఇందా ఈ పది వేలు మీ దగ్గర ఉంచండి"అంది.

"ఎక్కడిది రాధ ఈ డబ్బు"

"నేనప్పుడప్పుడు మీరు ఇచ్చినది దాచుకున్నదండి,వారు రాక రాక వచ్చారు పాపం కరోనాాా వల్ల ఇక్కడే ఆగిపోయారు.వారికి ఏ ఇబ్బంది లేకుండా చూసుకోండి.మీ మిత్రులు బాగుండాలి"అంది.ఆ మాటకు రాము కళ్ళు చెమర్చాయి."ఎంత మంచి మనసు రాధ నీది. నా పరిస్థితి అర్ధము చేసుకుని మా మిత్రులకు ఏ లోటు లేకుండా చూసుకోండి అని చెప్పటం నాకు ధైర్యాన్ని ఇస్తోంది.వారు ఇక్కడున్న రోజులు ఏ లోటు లేకుండా చేస్తాను " అన్నాడు.

వారి మాటలకు రంగ,రాజు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు.రాముకు కాలేజీ లో జీతాలు లేవా!అనుకుని ఆశ్చర్య పోయారు.ఇంతలో నీరజ,సావిత్రి "అబ్బా అంటుంటే కంగారుగా వచ్చారు ." ఏమైంది నీరు"అన్నాడు రంగ." కడుపులో నొప్పి వస్తుందండి"అంది బాధగా.

"అబ్బా "అని సావిత్రి అంటుంటే ,"సావిత్రి "అన్నాడు రాజు కంగారుగా."కడుపులో చాలా నొప్పిగా ఉందండీ " అంది బాధగా. "రేయ్ రాము !"కేక పెట్టారు ఇద్దరూ. అప్పుడే ఆ కేకలు విని వచ్చారు రాధ,రాము.డాక్టర్ కు ఫోన్ చేస్తే "తీసుకు రండి"అంది డాక్టర్ అను రాధ.అందరూ డాక్టర్ దగ్గరకు వెళ్లారు ఆటో లో. డాక్టర్ పరీక్ష చేసి "కంగారేమి వద్దు.నెలలు నిండాయి అడ్మిట్ కావాలి .నర్స్ ను పిలిచి వీరికి పైన రూమ్ నెంబర్ 2,3 ఇవ్వండి "అని చెప్పింది. "ఓకే డాక్టర్ "అంది నర్స్. నర్స్ వెంట నడిచారు అందరూ.

రాము డాక్టర్ తో మాట్లాడుతున్నాడు "మేడం ఆసుపత్రి బిల్లు ఎవరికి చెప్పకుండా నాకు పెర్సనల్ గా చెప్పండి "అన్నాడు. "సరే సార్ "అంది డాక్టర్.

.......... ........ ....... .....

కరోనాాా ఇంకా విజృంభిస్తుంటే ఉదయం పది వరకు మాత్రమే సడలింపు ఉంది.అప్పుడే బయటకు పోవడానికి అవకాశం.రాధ వంట పనిలో బిజీగా వుంది.నలుగురికి కారియర్ కట్టాలి.పనులు ఎక్కువగా ఉన్నాయి.డబ్బు కూడా అవసరం చాలా ఉంది. ఏమి చేయాలో తోచక వెంకటయ్య కు ఫోన్ చేసింది.

"అమ్మ నేను వెంకటయ్య ని "అన్నాడు.

"వెంకటయ్య ఓసారి ఇంటి దగ్గర కి వస్తావా!' అంది. "అలాగే అమ్మ ఇప్పుడే వస్తాను"అన్నాడు.

"అమ్మగారు " పిలిచాడు వెంకటయ్య.

" రా వెంకటయ్య ఈ క్యారియర్ ఆసుపత్రిలో ఇచ్చేయాలి"అంటూ "నీ భార్య ఆరోగ్యం ఎలావుంది"అడిగింది. " మగ పిల్లాడమ్మ " అన్నాడు వెంకటయ్య తల గీరు కుంటూ సిగ్గు పడ్డాడు."దేవుని దయ వల్ల ,మా సార్ రాము దయ వల్ల బాగున్నాం అమ్మ " అన్నాడు

" ఇదిగో వెంకటయ్య నీకో విషయం చెప్పాలి ఎవరికి చెప్పనని మాట ఇవ్వు"అంది.

" ఎవరికి చెప్పను అమ్మగారు"అన్నాడు.రాధ వెంకటయ్య చెవి లో చెబుతూ మెడలోని మంగళ సూత్రం ఇచ్చి "దీనికి ఎంత డబ్బు వస్తే అంత తీసుకురా" అంది.

"అమ్మగారు వద్దమ్మా!అంత త్యాగం వద్దమ్మా మిత్రుల కోసం అంత త్యాగం వద్దమ్మా"అన్నాడు.అతని కళ్ళలో నీళ్ళు తిరుగు తున్నాయి.

"నువ్వు ఏమి ఎదురుచెప్పకు ,ఇందా క్యారియర్ ఆసుపత్రి లో ఇచ్చి నీ భార్యకు ఈ బాక్స్ లో వేడి..వేడి వడలున్నాయి తీసుకెళ్లు.డబ్బు ఏమైనా అవసరం ఉంటే అడుగు " అంది.

"అమ్మగారు,మీరు దేవతమ్మ,మా సార్ దేవుడమ్మ"అన్నాడు నమస్కరిస్తూ.ఇదంతా గమనిస్తున్నాయి రెండు కళ్ళు. వాళ్ళు వచ్చే అలికిడి అయితే " అన్నయ్య మీకు క్యారియర్ పంపుతున్న వెంకటయ్య తో ఎందుకు వచ్చారు అన్నయ్య"అంది.

" రాము కూరగాయల కు వెళ్ళాడు .క్యారియర్ మేము తీసుకు వెళతాం"అన్నారు వెంకటయ్య చేతిలోని క్యారియర్ తీసుకుంటూ "వెంకటయ్య నువ్వు వెళ్ళు క్యారియర్ మేము తీసుకు పోతాం" అన్నారిద్దరూ.

.......... .......... ........

నీరజ,సావిత్రి ఇద్దరికి మగ పిల్లలు పుట్టారు.ఆ వేళ ఆసుపత్రి నుంచి డిచ్ఛార్జి అయ్యారు.వారు ఇంటికి చేరుకోగానే సంతోషం పట్టలేక పోయింది రాధ.ఇద్దరికి దిష్టి తీసి లోపలికి ఆహ్వానించింది. ఇద్దరికి పక్కలు చక్కగా అమర్చింది. వారు లోపలికి వస్తూ "మా కోసం ఎంతో శ్రమ పడ్డావు "అన్నారు నీరజ, సావిత్రి. వాళ్ళు అడుగు పెట్టిన వేళా విశేషం టీవీలో బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. "కరోనాాా అదృశ్యం, జనం లో ఆనందం. రేపటి నుంచి యధావిధిగా రైళ్లు, బస్సులు తిరుగు తాయని వార్త వస్తోంది.

రంగ,రాజు "యాహూ మన పిల్లలు ఇంటిలో అడుగు పెట్టిన వేళా విశేషం,మనం అడుగు పెట్టినప్పుడు అన్నీ బంద్,ఇప్పుడేమో అన్నీ రయ్.. రయ్ ఇక రేపే మన ప్రయాణం" అన్నారు రంగ,రాజు.

......... ....... ...... .......

ఆసుపత్రిలో బిల్లు తక్కువ వచ్చే సరికి "మేడం రేపులోగా కడతాను " అంటే , "సరే సర్ "అంది డాక్టర్.ఉన్న బిల్లు కౌంటర్ లో కడుతుంటే వెంకటయ్య వచ్చాడు. "సార్ ఇదిగో డబ్బులు అమ్మగారు ఇచ్చారు .ఆసుపత్రి బిల్లు కట్టమని "అన్నాడు.

నమ్మలేక పోయాడు రాము."అమ్మగారు ఇచ్చారా!'అన్నాడు ఆశ్చర్యముగా. " అవును సర్' అన్నాడు వెంకటయ్య. రాము ఆ డబ్బు తీసుకుని మొత్తం బిల్లు కట్టేసి డాక్టర్ కు కృతజ్ఞతలు చెప్పి బయటకు నడిచాడు.

" వెంకటయ్య!ఈ డబ్బు అమ్మగారు ఎక్కడ నుంచి తెచ్చారు "అని అడిగాడు.వెంకటయ్య నోరు పే గ ల్లేదు "సార్"అంటూ "అమ్మగారు... అమ్మగారు మంగళ సూత్రం అమ్మమని చెప్పారండి"అన్నాడు కళ్ళు తుడుచు కుంటూ.ఆ మాటకి అచేతనంగా నిలబడ్డాడు రాము. రాధ ఇంత త్యాగం చేసిందా!అనుకున్నాడు.కళ్ళలో నీళ్ళు తిరుగు తుంటే ఇంటి దారి పట్టాడు రాము.

........ ......... ...... .......

కరోనాాా మాయం కావటంతో తమ ఊళ్లకు ప్రయాణం అయ్యారు రంగ,రాజు.

" నీ ఋణం తీర్చుకోలేమురా,మా కోసం ఎంతో కష్ట పడ్డావు.,చెల్లెమ్మ మీ మేలు మారువలేం"అన్నారు రంగ,రాజు. నీరజ,సావిత్రి పొత్తిళ్ల లో పిల్లలను పెట్టుకొని

"మీ ప్రేమ, ఆప్యాయత,అనురాగం మమ్ములను కట్టి పడేశాయి రాధ ,ఈసారి వీలు చూసుకుని మా దగ్గరకు మీరు రావాలి "అంది నీరజ. " మా దగ్గరకు కూడా "అంది సావిత్రి. " నీ ఋణం తీర్చు కోలేము రా!" అన్నారు ఇద్దరూ.

"సరేరా మనకు మనకు ఈ ఋణాలేమిటి?" అన్నాడు రాము. " వస్తాం రా ఆటో ఎక్కారు .

ఆటో బస్టాండ్ కు చేరుకుంది.

....... ......... .......

రంగ,రాజు ఇద్దరికి ప్రమోషన్లు వచ్చి పెద్ద ఆఫీసర్లు అయ్యారు. రంగ ,రాజుకు ఫోన్ చేసి

" రేయ్ రాజా!రేపు మనం అనంతపురం లో కలవాలి"అన్నాడు. "ఎక్కడ రాము ఇంటి లో నేనా! " అన్నాడు. " కాదురా ఓ లాడ్జి లో అసలు మనం వచ్చినట్లు వాడికి తెలియకూడదు.నువ్వు రేపు రా ఓ విషయం చెబుతా,లాడ్జి అడ్రస్ చెప్పాడు " రంగ.

"ఓ.కే వస్తాను రా!"అన్నాడు.

లాడ్జి లో కలుసుకున్నారు ఇద్దరూ. " ఏమిటి రా విషయం,వాడికి వచ్చినట్లు ఫోన్ చేశావా! లేదా!"అన్నాడు. " వద్దురా నీ కో విషయం చెప్పాలి వింటావా"అన్నాడు.అప్పుడే వచ్చాడు మరో మనిషి. " రండి "అన్నాడు రంగ. " ఇతను నా మిత్రుడు రాజు "పరిచయం చేశాడు రంగ. "గ్లాడ్ టు మీట్ టు యు " షేక్ హ్యాండ్ తీసుకు న్నాడు రాజు. "ఈయన పెద్ద బిల్డర్ ఈ ఊళ్ళో ఒక అపార్ట్మెంట్ కట్టాడు.నాకు బాగా పరిచయం ఈయన అపార్ట్మెంట్ లోనే ఓ ఇల్లు రాము కు మనమిద్దరం తీసిద్దాం నువ్వు ఏమంటావు అందుకే నిన్ను రమ్మన్నా "అన్నాడు రంగ.

" అబ్బా మంచి ఐడియా రా!వాడి ఋణం ఈవిధముగా అయినా తీర్చుకుందాం,మన కోసం,మన భార్యల కోసం ,ప్రసవ సమయములో వారు చేసిన సపర్యలు ఎలా మరుస్తాం రా!,వాడికి మనం ఒక ఇల్లు బహుమతిగా ఇవ్వాలసిందే, చాలా బాగా ఆలోచించావురా" అన్నాడు రంగ వైపు చూసి.

" ఓ మిత్రునికి మీరు ఈ విధముగా సహాయం చేయటం చాలా గొప్ప విషయం సర్ మీ స్నేహం చాలా గొప్పది"అన్నాడు.

" డబ్బంతా ఇచ్చానురా నీ భాగానికి 15 లక్షలు ఓకేనా"! అన్నాడు రంగ.

" నువ్వు చెప్పిన మాట నేను కాదంటానా!మనం వాడి ఋణం ఈ విధంగా నైనా తీర్చు కుందాం ,వాడికి ఈ విషయం చెప్పావా" అన్నాడు.

"లేదురా!నీరజను,సావిత్రిని రేపు ఇక్కడికి రప్పించి ,వాడ్ని కూడా ఇక్కడకు పిలిపించి వాడి చేతితోనే రిబ్బన్ కటింగ్ చేయుద్దాము ఏమంటావు!"అన్నాడు రంగ.

" ఓ.కే రా మనకు సొంత ఇల్లులు ఉన్నాయి. వానికే లేదు పైగా ప్రైవేట్ ఉద్యోగం. వాడి భార్య మన భార్యలకు పురుడు పోసి ఎంతో సహాయం చేసిందిరా!ఆ సేవలు ఎలా మర్చి పొగలం,ఆ చెల్లెమ్మ నాకు కళ్ళల్లో మెదులు

""తోంది రా!సావిత్రి కూడా ఈ మాటే అందిరా!"అన్నాడు రాజు.

"అవునవును నీరజ కూడా ఆ మాటే అంది.మన స్నేహం ఎప్పుడూ ఇలా వికసించాలని" అన్నాడు రంగ.

........ ......... ..........

మరుసటి రోజు.

బృందావన్ అపార్టుమెంట్ దగ్గర రంగ,రాజు కుటుంబాలతో అక్కడ వున్నారు. చెప్పిన టైం కు ఆటో లో వచ్చారు రాము దంపతులు.

"రా... రా..నీ కోసమే ఎదురుచూస్తున్నాం"అన్నారు రంగ, రాజు ఎదురెళ్ళి.

" బాగున్నారా అన్నయ్య " అంటూ నీరజ,సావిత్రి పిల్లల బుగ్గలు గిల్లింది రాధ.

"పిల్లలు చాలా ముద్దు వస్తున్నారు"అంది నవ్వుతూ

"పద "అంటూ అందరూ లిఫ్ట్ ఎక్కారు. మూడవ అంతస్తులో ఉందా ఇల్లు.

"ఇది ఈ ఊళ్ళో ఎప్పుడు కొన్నావురా!" ఆశ్చర్యముగా అడుగాడు రాము.

"నాది కాదురా! అని రంగ అంటే ఓహో రాజు దా!"అన్నాడు.

"నాది కూడా కాదురా!"అన్నాడు రాజు.

"మరి నాదా!" అన్నాడు రాము.

ఆ మాటకు ముగ్గురు నవ్వారు. మూడవ అంతస్తుకు చేరుకున్నారు.రిబ్బన్ కట్టి ఉంది ఆ ఇంటికి. "ఇదిగో రిబ్బన్ కట్ చేయరా "అంటూ కత్తెర అందించాడు రాజు. రాము రిబ్బన్ కట్ చేశాక అందరూ తప్పట్లు కొట్టారు. " ముందు అడుగు మా చెల్లెలు రాధమ్మది అనగానే రాధ నవ్వుతూ కుడి కాలు పెట్టింది.మరోసారి గట్టిగా తప్పట్లు కొట్టారు. రాము అర్థముగాక అయోమయముగా చూస్తున్నాడు.ఎదురుగా గోడకు తను,రాధ ఉన్న ఫోటో అందముగా అలకరించబడింది.మరో ప్రక్కన డ్రాయింగ్ స్టాండ్ పై ఇలా ఉంది.

" మిత్రుడు రాముకు, ఈ ఇల్లు నీదిరా,నీకు మేము ఇస్తున్న ఓ చిన్న బహుమతి,మన స్నేహానికి గుర్తుగా ఈ ఇల్లు నేను రాజు మాట్లాడుకుని ఇది నీకు ఇస్తున్నాం".అది చదువు తుంటే రాము కళ్ళు చెమ్మగిల్లాయి.

"రంగ....రాజు "అంటూ ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు రాము.నీరజ,సావిత్రి రాధ వైపు చూసి "ఈ స్నేహం ఎప్పుడూ ఇలాగే ఉండాలి.మననందరం బాగుండాలి "అన్నారు.

ఆ మాటకు రాధ కళ్లనుండి ఆనంద బాష్పాలు రాలాయి."మీ రుణం ఎలా తీర్చుకోను " అంది వారి తో.

" ఛా.. అవేమి మాటలు రాధ,మా కోసం నీవు చేసిన సహాయం పోల్చుకుంటే ఇది ఏ పాటిది, ఇదిగో నీ మంగళ సూత్రం"అందించారు నీరజ,సావిత్రి. " రేయ్ రాము ఈ మంగళ సూత్రం రాధమ్మ మెడలో వేయి " అనగానే,

"రేయ్..రంగ...రాజు .."అన్నాడు రాము.

"మా కన్నీ తెలుసు లే రా!అంటూ సంజ్ఞలు చేశారు.

"రేయ్ రాము ఇక నీవు ఆ కాలేజీ వదిలేసి ఈ అపార్ట్మెంట్ కు మేనేజర్ గా ఉండు.అది కూడా మాట్లాడాను. మరో విషయం మీ అటెండర్ వెంకటయ్య కి ఇక్కడ సెక్యురిటి గార్డ్ గా ,ఉండటానికి ఓ ఇల్లు ఏర్పాటు చేశాను"అన్నాడు రంగ. ఆ మాటలు విని రాము చలించి పోయాడు.ఇద్దరిని గట్టిగా వాటేసుకుని "మీ మేలు ఈ జన్మకు మరువను రా!"అన్నాడు గద్గద స్వరంతో.

" మంచి వాళ్లకు ఎప్పుడూ మేలు జరుగుతుంది సార్" అన్నాడు వెంకటయ్య అప్పుడే వస్తూ.

"ఈ రోజు నుంచి ఈ అపోర్టుమెంట్ మేనేజర్ రాము,నువ్వు సెక్యురిటి ఓకే నా!"అన్నారు రంగ, రాజు.

"ఎస్ బాస్ " అన్నాడు వెంకటయ్య సెల్యూట్ చేస్తూ. " సర్ మిమ్మల్ని చూస్తుంటే ఒకటి గుర్తుకు వస్తోంది"అన్నాడు.

"ఏమిటి "అన్నారు అందరూ అతని వైపు చూసి.

"మీ ముగ్గురు ఆర్..ఆర్..ఆర్ " అనగానే,ఆ మాటకు అందరూ గట్టిగా కులసాగా నవ్వుకున్నారు. ఆ పసి పిల్లల బోసి నవ్వులు ఆ నవ్వులలో కలిసిపోయాయి.

(సమాప్తం)


గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.


రచయిత పరిచయం :

కనుమ ఎల్లారెడ్డి:ప్రైవేట్ కళాశాలలో పౌర శాస్త్ర అధ్యాపకుడిని, కథలు,కవితలు,వ్యాసాలు పత్రికలలో చోటు చేసుకున్నాయి.నీతివంతమైన జీవితం, విద్యార్థులను.మంచి మార్గంలో, వారి ఉన్నతి కోరుకోవడం ,జీవితంలో వారు స్థిరపడటం నాకు అమితమైన ఆనందం ఇస్తుంది.ప్రస్తుత నివాసం, తాడిపత్రి,అనంతపురం జిల్లా.







150 views0 comments

Commentaires


bottom of page