'Raithu Bidda' - New Telugu Story Written By Pitta Gopi
'రైతు బిడ్డ' తెలుగు కథ
రచన: పిట్ట గోపి
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
ఎప్పుడూ లేని విధంగా దేశం అంధకారం లో ఉంది.
ఎంతగా అంటే.. దాదాపుగా అన్ని రంగాలు మూసుకుపోయాయి.
తాగటానికి సమృద్ధిగా నీళ్ళు దొరుకుతున్నా.. వాతావరణం కొద్దో గొప్పో అనుకూలంగా ఉన్నా..
ఎక్కడ చూసినా ఆకలి కేకలు, ఆకలి చావులే..
ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వాలే కాదు.. నింగికి వెళ్ళి వచ్చేలా అభివృద్ధి సాధించిన మన సాంకేతిక పరిజ్ఞానం, గుండె తీసి గుండెను అమర్చ గలిగే మన మేథాతనము, 5జీ అంటూ పరిచయం అయిన కొత్త నెట్వర్క్ లు కూడా తలవంచాయి.
ఇంత అభివృద్ధి చెందిన మన దేశం ఈ సమస్య ను ఎదుర్కోలేకపోయిందంటే.. ప్రతి ఒక్కరు ఆలోచనలో పడాలి. కారణం తెలుసుకోవాలి.
ఆ కారణం ఎవరంటే..
ఒక రైతు బిడ్డ..
అతనికి మిగిలిన రైతులు తోడవటంతో ఈ పరిస్థితి వచ్చింది.
ఆ రైతు బిడ్డ విశ్వేశ్వర సూరన్న. సూరన్నకు వందేళ్ళు. కాస్త బక్కచిక్కిన వాడైనా.. తన పనులు తాను దర్జాగా చేసుకు తిరగగల శక్తి ఇంకా ఉంది ఆయనలో. దేశం దీనస్థితిలో ఉండటానికి కారణం ఆయనే అంటూ వార్తలు వస్తుండటంతో ఆయన పౌరుషంతో నోరు విప్పాల్సి వచ్చింది.
"ఎవడ్రా ఈ వార్తలు రాసింది.. రైతు బిడ్డలం.. వందేళ్ల నా జీవితంలో పొలంలో మా కష్టాలను ఎవడూ పట్టించుకుని వార్తలు రాయలేదు కానీ.. ఇప్పుడు ఎవరో.. వ్యవసాయం తెలియని వాళ్ళు, రైతు కష్టాలు తెలియని వాళ్ళు, మట్టి అంటే అసహ్యించుకునే వాళ్ళు ఆకలితో చస్తే.. తాటికాయంత అక్షరాలు రాస్తారా ".. అన్నాడు.
"సార్! ప్రజలంతా ఆకలితో చస్తుంటే.. మీరు ఇలా మాట్లాడ్డమూ.. " సంకోచిస్తు అడిగాడు ఒక రిపోర్టర్.
"హే ఆపరా.. ప్రజలంతా కాదు, పొలం ఉన్న ప్రతి ఒక్కరూ, పొలం లేని ప్రతి పేదోడు ఇప్పుడు బాగానే ఉన్నాడు. మిగిలిన చెత్తమంద మాత్రమే ఈ పరిస్థితి అనుభవిస్తున్నారు" అన్నాడు సూరన్న.
"ఇంతకీ.. ఎందుకు ఇలా చేస్తున్నారు " ప్రశ్నించాడు మరో రిపోర్టర్.
"నా తండ్రి గారి కి ఉన్న 20 ఎకరాలను నా చిన్నతనం నుంచే తండ్రి తో వ్యవసాయం చేయటం వలన, నేను వ్యవసాయంలో బాగా మెలుకువలు నేర్చుకున్నాను.
అప్పట్లో మేము పనికి వెళ్తే మా కూలి పదిరూపాయలు. ఏ మద్యం లేదు, ఏ పొగాకు వాడేవాళ్ళం కాదు. దీంతో మా కుటుంబానికి ఏ చింత లేదు. పంట ఎవరిదైనా ఊరంతా కష్టపడటము, వచ్చిన గింజలు అందరికీ ఏడాదికి సరిపోయేలా పండించటం.. ఇదే మా పని" అన్నాడు సూరన్న.
"మీకు ఎంత కావాలంటే అంత ఎలా పండించేవారు" అనడిగాడు మరో రిపోర్టర్.
"ఇప్పటిలా పురుగులు మందులు, పిచకారిలు లేవు. పశువులు, ఎరువులు, చెరువులో మట్టిపెళ్లలు పొలానికి వేస్తే మనకు ఎంత కావాలంటే అంతగా పండుతుంది పంట.
అంతేనా.. ఏ చీడ లేదు, ఏ తుఫాను రాదు.
చక్కగా పంట వేసే సమయానికి వానలు పడేవి.
అలా అలా నాకు పిల్లలు పుట్టేసరికి మా కూలి వంద వరకు పెరిగే రోజులు వచ్చాయి.
నాకు మనుమలు వచ్చే సరికి మా కూలి 500కి పెరిగింది.
"500 అయితే పెరిగింది కానీ.. ఇలా వచ్చిన కూలి అలా ఖర్చు అయిపోవటమే..
ఇక పంట గింజలంటావా.. యాపారస్తులు, మద్యవర్తులు, ప్రభుత్వం లు పోటి పడి మా గింజలకు తేమ అంటూ, పురుగుపోటు అంటూ బస్తాకి వెయ్యి ఇచ్చి పట్టుకు పోయేవాళ్ళు.
దీనికి తోడు సరైన సమయంలో వానలు లేక, గింజలు చేతికొచ్చే టైములో వానలు ముంచెత్తటంతో పొలంలో మా కష్టాలు పెరిగిపోగా మా కష్టానికి తగిన ఫలితం కూడా రాక ప్రభుత్వాన్ని వేడుకున్నాం, పర్యావరణానికి మేలు కల్గించండని. పట్టించుకోలేదు..
అభివృద్ధి అంటూ.. రేడియేషన్ టవర్లు, నెట్వర్క్ టవర్లు మా పొలాల్లో పెట్టారు.
సభలు, జాతరలు జరుపుతూ మా పొలాలను ప్లాస్టిక్ మయం చేశారు. నదులు, కాలువలు ఎక్కడ చూసినా ప్లాస్టిక్ తో నిండి, నీటిపారుదల సరిగ్గా ఉండదు.
వస్తువుల ధరలు పెరిగాయి కానీ మా కూలి పెరగలేదు. మా పంటకు ధర పెరగలేదు. 85 కిలోల బస్తా గింజలు వెయ్యి రూపాయలు కు అమ్ముతున్న మేము మార్కెట్ లో 25కిలోల బియ్యం 1300రూపాయలకు కొనుక్కునే పరిస్థితి..
దీనికి కారణం ఎవరూ.. మా రైతులం ఏమైపోయినా పర్వాలేదు కానీ.. వాళ్లకు ఎలాగోలా తిండి వస్తే చాలు అనుకునే మనుషులకే ప్రస్తుతం తిండిలేదు తప్ప మట్టిలో పనిచేసుకుని బతికే మాలాంటోళ్ళకి తినటానికి తిండి ఉంది. మా రైతు బిడ్డలందరిని ఎవరు ఆదుకోకపోతే ఎలాంటి పరిస్థితి వస్తుందో ఇప్పటికైనా కళ్ళు తెరవాలి.
ప్లాస్టిక్ వాడకం తగ్గించి పర్యావరణానికి మేలు చేసేలా చూడాలి. రైతులకు మంచి ధర కల్పించాలి. కనీసం కష్టానికి తగిన ఫలితం వచ్చేలా చూడకపోతే మా కుటుంబాలు ఎలా బతకాలి..
అందుకే అనుభవమున్న రైతు బిడ్డను అయిన నా మాట నా గ్రామ రైతుల నుండి అలా పాకుతూ.. దేశంలో ప్రతి రైతుకు నచ్చింది. ఒకప్పుడు రైతే రాజు గా చెలమణి లో ఉంటే నేడు రైతు అంటే ఈ సమాజానికి ఇంత చిన్న చూపా..
నాడు పంట పండించటానికి ఎంత ఆత్రతగా ఎదురు చూసే రైతు నేడు సీజన్ వస్తే చాలు బెంబేలెత్తిపోతున్నాడు. ఆ పాపం ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్న వారిదే..
ఇకనైనా రైతుకు సముచిత స్థానం ఇచ్చి ఆదుకోకపోతే పరిస్థితి మళ్ళీ మొదటికి తెస్తాం. అప్పటికి నేను చచ్చినా.. నా బిడ్డలందరు ఈ రైతు బిడ్డలే. వాళ్ళు నన్ను అనుసరిస్తారు. రైతులను మీరు ఆదుకోండి. రైతే మిమ్మల్ని ఆదుకుంటాడు. సృష్టిలో కల్తి చేయని వాడెవడైనా ఉన్నాడంటే అతడు రైతే అయి ఉండాలి"
అని తనకు జరిగిన అనుభవాలు వివరించాడు.
ప్రభుత్వాలు మేలుకొనగా సూరన్న సూచనలతో పంట విత్తు కు సిద్దమయ్యారు రైతులు.
***
పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం
Podcast Link:
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం :
సమాజం వేసే తప్పుడడుగులను సరిచేయాలంటే పదిమంది కి మంచి విషయాలు తెలపాలి. అలా జరగాలంటే మనం మంచి రచయిత గా మారి పాఠకులకు అందేలా చేయాలనేది నా అభిలాష. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం
Kommentarer